పేషంట్ చెప్పే కథలు – 5

శాపం

ఆలూరి విజయలక్ష్మి

          చెదిరిన జుట్టు, చెరిగిన కాటుక, కందిన చెక్కిళ్ళు, కోపంతో అదురుతున్న పెదాలు, దుఃఖంతో పూడుకుపోయిన కంఠం – ఇందిరా తనను తానూ సంబాళించుకుని శృతితో అసలు విషయం చెప్పటానికి ప్రయత్నిస్తూంది. ఆమె వెనుక ఉరిశిక్షకు సిద్ధమౌతున్న ముద్దాయిలా తలవంచుకుని నిలబడింది రంగ. 

          “ఏమిటి దంపతులిద్దరూ చెరోసారి వచ్చారు? ఇంతకు ముందే మీ వారు ‘అర్చన’ను తీసుకొచ్చి చూపించి వెళ్ళారు. ఏమిటిలా చిక్కిపోయింది అర్చన?… నువ్వేమిటిలా వున్నావు? నైట్ డ్యూటీ చేశావా?” ఇందిరవంక పరిశీలనగా చూస్తూ ప్రశ్నలు కురిపించింది శృతి. ఇందిర టెలిఫోన్ ఆపరేటర్ గా చేస్తూంది. ఆమె పిల్లలిద్దరూ శృతి నర్సింగ్ హోమ్ లోనే పుట్టారు. ఆమె శృతిని డాక్టర్ గా కాక, స్నేహితురాలిగా, శ్రేయోభిలాషిగా భావిస్తుంది. తనకే సమస్య వచ్చినా శృతి సలహా తీసుకుని దాన్ని పరిష్కరించు కోవడానికి ప్రయత్నిస్తుంది. 

          “నువ్వంతగా దిగులు పడాల్సిందేమీ లేదు. ఇందాక మీ వారు అర్చన బ్లడ్ కొంచం తీసుకుంటే తెగ బాధపడి పోయారు. కూతురంటే ఆయనకెంత ప్రాణమో ఈరోజు చూశాను” ఇందిరను ఓదార్చడానికి ప్రయత్నించింది శృతి. 

          “అది కాదు మేడమ్!” రంగ రెక్క పుచ్చుకుని ముందుకు లాగింది ఇందిర. 

          “ఇది తెలుసుగా మీకు?!” అప్పుడు గమనించింది శృతి రంగను. ఇందిరా మొదటి కాన్పుకు వచ్చినప్పుడు ఆరేళ్ళ పిల్ల రంగ. ఇందిరా దూరపు బంధువుల పిల్ల. కళ్ళు విప్పిన కొద్ది నెలలకే తల్లిదండ్రులను కోల్పోయిన దురదృష్టవంతురాలు. అమ్మమ్మ రెక్కల క్రింద ఒదిగి ఆరేళ్ళు వచ్చే వరకు పల్లెటూళ్ళో వున్నా రంగ, ఇందిర తల్లి వెంట ఇందిర బిడ్డనెత్తుకోవడానికి వచ్చింది. కడుపునిండా తిండైనా తింటుందని కొండంత సంబరంతో మనమరాలిని పంపడానికి ఒప్పుకుంది రంగ అమ్మమ్మ… ఇందిరా తల్లి రంగ గురించి చెప్పింది. అప్పటి నుంచి ఇందిరా వెంట ఈ అమ్మాయి తరచూ వస్తూనే వుంది. ఈ పిల్ల తెలియకపోవడమేం తనకు?

          “నీ ఇంట్లో ఇన్నాల్నించి ఉంటున్నా, ఈ పిల్ల బిత్తర చూపులూ, అమాయకత్వం పోలేదేమిటి ఇందిరా?” 

          “అదే, ఆ అమాయకత్వమే యిప్పుడు కొంప ముంచింది” ఉలిక్కిపడి రంగ శరీరంలో వికసిస్తున్న యవ్వనాన్ని గమనించింది శృతి. 

          “ఇప్పుడు అమ్మ మొఖమెలా చూడాలో తెలియటం లేదు. వీళ్ళ అమ్మమ్మకేం సమాధానం చెప్పుకోవాలి?… మేడమ్! ఒకసారి దీన్ని పరీక్ష చెయ్యండి ముందు. ఏమడిగినా, తిట్టినా, కొట్టినా, కోసినా సరిగ్గా సమాధానం చెప్పడం లేదు… ఇది నా పిల్లల్తో పాటు పెరిగింది. వాళ్లతోపాటు తిండి పెట్టాను. వాళ్ళకు కొన్నప్పుడల్లా బట్టలు కొన్నాను. నా మనిషిలా పెరిగింది. మేట్యూర్ అయి సంవత్సరమైంది. అసలు అమ్మ అప్పుడే వాళ్ళ అమ్మమ్మ దగ్గరకు పంపేయమంది. ఇన్నాళ్లు దానితో చేయిందుకున్నదంతా మరచి పోయి దిక్కూమొక్కూ లేనిదానిగా పంపేసి చేతులు దులుపుకోటానికి మనసొప్పింది కాదు. రెండు మూడేళ్ళు పోయాక పెళ్ళి చేసి పంపిద్దామనుకున్నాను. ఇంత ఘోరం యిలా జరిగిపోతుందని కలలో కూడా అనుకోలేదు.” కడుపులో ఇముడ్చుకోలేని బాధతో ఆపకుండా చెప్పుకు పోతూంది ఇందిర. ఇందిర చెప్పేది వింటూనే ఎక్సామినేషన్ రూంలోకి తీసుకెళ్ళి రంగని పరీక్ష చేసింది శృతి. గర్భం ఐదవమాసం నిండుతూంది. శృతి హృదయం కలిచి వేసినట్లైంది. అనునిత్యం ఇలాంటి అవివాహిత గర్భవతుల్నేన్తో మందిని చూస్తున్న, ఇంత ముక్కుపచ్చలారని పిల్లల్ని ఈ పరిస్థితిలో చూస్తే కడుపు దేవేసినట్లుగా ఉంటుంది. అమాయకత్వం, మూర్ఖత్వం, అతి తెలివి, పరిస్థితులు, ధ్రిల్ కోసం, ఎడ్వెంచర్ కోసం ఎంతకైనా తెగించే మనస్తత్వం ఆడపిల్లనీ స్థితిలో నిల బెడుతున్నాయని తెలుస్తూనే వుంది. కానీ ఇలాంటి పసితనం పోని అమ్మాయిల్ని దారుణమైన స్థితికి లాకొచ్చే పరమ కిరాతకులు… ఏ న్యాయస్థానంలో వీరిని దోషులుగా నిలవెట్టి నిరూపించ గలుగుతారు? ఏ న్యాయమూర్తి వీళ్ళకు సరైన శిక్ష విధిస్తాడు?

          “మీరే ఎలాగో ఈ ఆపదనించి గట్టెక్కించాలి” ప్రాధేయ పూర్వకంగా చూసింది ఇందిర. 

          “ఇన్నాళ్ళూ ఎలా గుర్తించలేదు ఇందిర? ఇప్పుడేం చేయాలన్నా చాలా రిస్క్” విచారంగా అంది శృతి. 

          “ఇదంతా నా ఖర్మ. ఈ ఉద్యోగం వల్ల ఎప్పుడూ ఉరుకులు, పరుగులు. దీనికి కాపలా కాస్తూ కూర్చునే సావకాశమే ఉంటే ఇంకెందుకు?… ఆ వెధవెవరో చెప్పేడవ్వే అని చచ్చేట్టు బాదాను. కొట్టి, కొట్టి నా చేతులు నొప్పెట్టాయి గాని అది నోరు విప్పలేదు… దొంగ రాస్కెల్! ఇంత ఘాతుకానికి ఒడిగట్టిన వాడెవడో? వాడి చెల్లెలికో, కూతురికో యిలా జరగాలి. నా శాపానికి ఆ శక్తీ ఉంటే వాడికా శాస్తి జరుగుతుంది. అప్పటికి గాని నా కసి తీరదు” ఆవేశంగా అంటున్న ఇందిర గుండెల్లో బడబాగ్ని ప్రజ్వరిల్లుతూంది. 

          “తప్పు, అలా అనకు. తప్పు చేసింది ఓక దుష్టుడు అయితే, శిక్ష మరో అమాయకురాలికెందుకు?”

          ప్రమాదంతో కూడినదైనప్పటికీ తప్పదని ఇందిర చెప్పక, విధిలేక నర్సుని పిలిచి ఎబార్షన్ చెయ్యడానికన్నీ రెడీ చెయ్యమని చెప్పింది శృతి. 

          “పిన్నీ!” అప్పటి వరకూ శిలా విగ్రహంలా నించున్న రంగ, ఆపరేషన్ ధియేటర్ లోకి రమ్మనగానే విహ్వలంగా చూస్తూ ఇందిరను కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడ్చింది. మృత్యు భయంతో గజగజ వణికిపోతూందా పిల్ల. నచ్చ చెప్పి, కసిరి, బుజ్జగించి లోపలకు తీసుకు వెళ్ళింది శృతి. రంగని బల్లమీద పడుకోబెట్టి, వాష్ చేసుకుని, గ్లవ్స్ వేసు కుంటున్న శృతికో ఆలోచనొచ్చింది. భయంతో వధ్యశిల నెక్కబోతున్న మేకపిల్లలా వున్న ఆ అమ్మాయినిప్పుడు ఒత్తిడి చేసి అడిగితే తాను గర్భవతి అవడానికి కారకులెవరో చెప్పదా? చెప్తే, ఎలాగయినా సరే ఆ అమ్మాయికి జరిగిన అన్యాయాన్ని సరిచేయడానికి ప్రయత్నించవచ్చు. 

          “రంగా! ఇప్పుడయినా చెప్పు. ఎవరతను?” అనునయంగా అడిగింది శృతి. 

          “డాక్టరమ్మగారూ! నన్నేం చెయ్యొద్దు. నాకు ఆపరేషన్ వద్దు” ఏడుస్తూ బ్రతిమాలింది రంగ. హృదయ విదారకంగా ఉన్న ఆమె ఏడుపు చూస్తే జాలి వేసింది శృతికి. ఈ అర్భకపు పిల్లేనా ఇందిరా కొట్టిన దెబ్బలకు ఒళ్ళప్పగించింది అనిపించింది. 

          “చెప్పుమరి” ఇన్స్ట్రుమెంట్స్ తీసుకుంటూ అడిగింది శృతి. 

          “చెప్తాను. మా బాబాయ్… మా పిన్ని నైట్ ద్యూటీకి వెళ్ళినప్పుడు…” బెక్కుతూ చెపుతూంది  రంగ. రాయిలా నిలబడి పోయింది శృతి. ఇందిర అన్యోన్య దాంపత్యం, ఇందిరంటేనూ, పిల్లలంటేనూ ప్రాణం పెట్టే ఆమె భర్తా కళ్ళ ముందు నిలిచారు… ఈ పిల్ల చెపుతూంది నిజమేనా? ఇంత దారుణం, ఇంత అన్యాయం ఇందిర భర్త చేశాడా?… ఎలా ఈ అన్యాయాన్ని సరిచేయాలో తోచక, ఎంట్రీకంగా పిండం బయటపడటానికి చెయ్యవలసింది చేసింది శృతి. 

          రంగని తీసుకొచ్చి రూంలో పడుకోబెట్టారు. మతి చలించిన దానిలా అందరివంకా చూస్తూంది రంగ. ఆమె మెదడులోని ఏ సున్నితమైన నరాలు దెబ్బతిన్నాయో, ఆమె హృదయంలోని ఏ మృదువైన పొరలు చిరిగిపోయాయో – ఒక్కసారి అకస్మాత్తుగా, బిగ్గరగా అరవసాగింది. “మా బాబాయే న్నన్నిలా చేశాడు. మా బాబాయే నా కడుపుకు కారణం.”

          వెర్రిదాన్లా చూస్తూ గబుక్కుని శృతి చెయ్యి పట్టుకుంది ఇందిర. ‘వాడి చెల్లెలికో, కూతురికో యిలా జరగాలి. నా శాపానికే ఆ శక్తి ఉంటే వాడికా శాస్తి జరుగుతుంది’ ఇందిర శాపం వెయ్యి కంఠాలతో మార్మోగుతున్నట్లుగా అనిపించింది. 

*****     

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.