విజయవాటిక-12

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

ఇంద్రపురి బౌద్ధ విహారము

          ఆచార్య దశబలబలి మౌనంగా కూర్చొని ఉన్నాడు. ఆయన ముఖము పాలిపోయి ఉంది. ఆయనకు కొద్ది దూరములో మహానాగ, మహానంది తదితర మిగిలిన పెద్దలున్నారు. వారంతా ఎదో గంభీరమైన విషయం గురించే చర్చిస్తున్నట్లుగా ఉన్నదక్కడ. కొద్ది దూరంలో విహారంలోని భిక్షుకులందరూ కొందరు కూర్చొని, కొందరు నిలబడి ఉన్నారు. అందరి ముఖాలలో దుఃఖం కనపడుతోంది. మహాచార్యులు పూజించే ధర్మపాదుకలు రత్నాలు పొదిగినవి. వాటితో పాటూ తథాగతుని బంగారు ప్రతిమ, ఆ రెండూ మాయమయ్యాయి.

          ఆనాటి ఉదయం ధ్యానమందిరం నుంచి విహారానికి వచ్చిన ఆచార్యులు ఆ రెండు కనపడటం లేదని గ్రహించారు. వాటి గురించి ఆచార్యులు ఆ సమీపంలో శుభ్రం చేస్తున్న భిక్షుకును పిలిచి అడిగారు…

          “అమ్మా నీవు ఇక్కడ ధర్మ పాదుకలను, తథాగతులను చూసినావా?” అని… 

          ఆమె కన్నీరవుతూ “లేదు మహాచార్యా…దాని విషయము నాకు తెలియదు…” అన్నది. అయినా అక్కడ అంతా ఆమె మళ్ళీ చూసింది, కనపడ లేదు. 
ఆమె బయటకు వెళ్ళి, తోటి భిక్షుకులకు, సన్యాసినులకు చెప్పింది. ఘడియలో ఆ ప్రాంగణమంతా మహాచార్యుని విహారం ముందు సమావేశమయ్యారు. 

          మహాచార్యులైన దశబలబలి మాట్లాడక అలాగే ఉన్నారు. ఆయన ధ్యానంలో ఉన్నారో, లేక దుఃఖపడుతున్నారో తెలియటం లేదు. “ఇటు వంటివి ఊపేక్షించ కూడదు. మనము వెంటనే మహారాణికి కబురు పంపుదాము. మనకే రక్షణ కరువయ్యింది. నేడు మీరు పూజించే ధర్మపాదుకలే మాయమయినాయి. రేపటి రోజున ఏదైనా జరగవచ్చు…”  తీవ్ర స్వరంతో అన్నాడు మహానాగ.

          “ముందు రక్షక భటులను పిలుద్దాము…” చెప్పాడు మహానంద. 

          ఇలా అందరు తలోమాట చెబుతున్నారు. అక్కడ అంతా గందరగోళంగా ఉంది.
ఇంతలో వారిలో ఒక చిన్న పిల్ల, ఇంకా సన్యసించని బాలిక వచ్చి “ఆచార్యా! మనము రత్నకరుని వద్దకు వెళ్ళినా, లేక ఆయనను ఇక్కడకు రప్పించినా మన వస్తువు మనకు దక్కుతుంది…” అని పలికింది. 

          అంత నిర్భయంగా ఆమె పలికిన పలుకులకు అక్కడంతా సూది పడినా వినిపించే నిశ్శబ్ధం అలుముకున్నది. ఆమె ధైర్యానికి అందరూ అబ్బురపడ్డారు. రత్నకరుని సంప్రదించటం మన మతం కాదని, సమ్మతం కాదని ఆమెకు చెప్పటానికి కూడా ఎవ్వరికీ నోరు మెదలలేదు. 

          ఆచార్యులు కళ్ళ నీళ్ళతో కూర్చున్నారు.

          అందరూ పోయిన వస్తువు కోసం ఆయన బాధపడుతున్నారని తలచారు. 
ఆయన గొంతు సవరించుకొని “బాలికా! నీవు వెళ్ళమ్మా…” అన్నారు.  ఆ తదనంతరం ఆయన అందరినీ ఉద్దేశించి పలుకుతూ “నాకు ధర్మపాదుకలు, తథాగతుడు పవిత్రమైన చిహ్నాలైనా, ఎంతో ప్రీతి పాత్రములైనా… అవే ప్రాణాలు కావు.  కేవలం వస్తువులు. వస్తులంపటం వదిలెయ్యమని నాకు పరమ గురువుల బోధ కావచ్చునిది. దీని కోసమెవ్వరూ దిగులు పడకండి. నా దుఃఖము ఆ తాంత్రికము మన ప్రాంగణములోనికి కూడా ప్రవేశించినదని. మీ హృదయాలలో కూడా ఆ ఆలోచన రావటం ఇది విచారకరం. ఇక మీరు మీ పనులను చూసుకోండి. ఈ విషయము ఇక్కడితో వదిలెయ్యమని నా మనవి…” అంటూ అందరిని పంపించి వేసాడు.

          ఒక ముఖ్య అనుచర భిక్షుకును పిలిచి “మహారాణి దర్శనానికి అనుమతి కోరుతున్నాడు  దశబలబలి!” రాసి ఆ లేఖను పంపాడు. ‘ఇంక ఆలశ్యము కూడదు!’ అనుకున్నాడాయన బలంగా మనస్సులో. 

*** 

          అది మహారాణి, రాజమాత వాకాటక మహాదేవి మందిరం వెలుపల ఉన్న వరండా. విశాలమైన ఆ వరండాలో వేసిన ఘనమైన ఆసనాల మీద దశబలబలి, మహానాగ, మహానందా మరికొందరు బౌద్ధ భిక్షుకులు కూర్చొని ఉన్నారు. కొందరు వెనుకగా నిలబడి ఉన్నారు. వారంతా రాజమాత కోసం ఎదురుచూస్తున్నారు. 

          ఆ భవనం ఎతైన శిలలతోనూ, చిత్రాలతోనూ అలంకరించి ఉన్నది. మహాదేవుడు పార్వతీదేవితో కలిసి ఉన్న ఆ శిల్పాలు అద్భుతమైన భావాలను ప్రకటిస్తున్నాయి. ఆ మందిరలోని  దైవత్వము ఆ వరండా నిండా పరుచుకున్నట్లుగా ఆ వరండాలో సూర్యరశ్మి ఏటవాలుగా పడుతున్నది.

          ఇంతలో గణగణ గంటల సవ్వడి. రాజమాత పూజ ముగిసిందన్న గుర్తు. ఆమె చాలా సమయం పూజలోను, ధ్యానంలోనే గడుపుతున్నది. మునిలా మారిందని…ఆమెకు తెలియనిది లేదని ప్రజలనుకుంటూన్నారు.

          “జయము జయము విష్ణుకుండిన సామ్రాజ్య జయకేత!

          ధర్మ వైదిక పరిరక్షణ దురంధరి!

          సనాతన ధర్మ సంస్థాపనాధీశాలి!

          వాకాటాకా మహారాణి రాజమాతకు జయం జయం!!” వంధి మాగదుల జయకేతాలతో

 రాజమాత వస్తున్నారని ప్రకటించారు.

          పూజా మందిరం నుంచి వస్తున్నది ఆమె. బంగారు రంగు అంచు ఉన్న తెల్లని నేత చీర కట్టింది రాజమాత. మెడలో రుద్రాక్షలు, చేతులకు కంకణములు, ముఖాన చందన రేఖల మధ్య వెలుగుతున్న భస్మతిలకముతో ఉందామె. ఆమె నుంచి అగరు చందనము సువాసన వెదజల్లుతూ, ఆమె రాకతో ఆ ప్రదేశమంతా సువాసన నిండింది. ఆమె రూపము దైవీరూపములా కనిపించింది. దబ్బ పండు శరీరచ్ఛాయ, ఆమె తపస్సు వల్ల కలిగిన కాంతులతో బంగారు రంగు సంతరించుకొని సాక్షాత్తూ మహేశ్వరునిలా వెలుగుతోంది. ఆమె రాకతో అందరూ గౌరవంగా నిలబడి నమస్కరిస్తూ ఆమెను స్వాగతించారు. ఆమె దశబలబలికి వందనాలు సమర్పించింది. 

          అందరూ కూర్చున్నారు. తనకు సాయంగా ఉన్న సేవకురాలికి వారికి కావలసినవి ఇవ్వమని పురమాయించింది రాజమాత. 

          ఆచార్య దశబలబలి, తథాగతుని తనలో నింపుకున్న పూర్ణ సాధువు. 

          ఆయన ముందుగా రాజమాత వంశాన్ని, తదనంతరం రాజ్యాన్ని దీవించాడు. 

          “ఆచార్యా దశబలబలి! మీరందరూ క్షేమమే కదా? మీ విహారములు క్షేమమా? మీ చైత్రములలో గొడవలు లేవు కదా? మీ శిష్యులు ధర్మంతో మెలుగుతున్నారా? మా పాలనలో మీకు సమస్యలు రావటం లేదని తలుస్తాము…” అన్నది రాజమాత

          “రాజమాతా! మీ విష్ణుకుండినుల వంశం శతాబ్ధాలు వర్ధిల్లుగాక! మహారాజులకు జయం కలుగుగాక! విష్ణుకుండినుల ధర్మ పాలనలో సర్వమత సమానత్వం వెల్లివిరియు చున్నది. తథాగతుని కరుణ వలన సర్వము క్షేమమే తల్లీ!  సత్యపాలకులైన మీ పాలనలో మేము క్షేమముగా ఉన్నాము. ..” అన్నాడు ఆచార్యులు.

          “ఆచార్యా! మేము మహాదేవుని నమ్మిన భక్తులము. విష్ణుకుండినుల రాజ్యము త్రిలింగ రాజ్యమని, ఆ త్రైలింగేశ్వరుడు రక్ష యని నమ్మినవారము. అయినా మానవత్వము మా మతముగా, సర్వమతముల సారము పరమేశ్వరుని చేరుటేనని మా పరమ నమ్మకము. మీకు ఎటు వంటి ఇబ్బంది కలిగినా, ఉపేక్ష లేక తెలుపగలరు. మీరు శ్రమతో మా వద్దకు రావటములో కారణము తెలిపిన, చెయ్యగలిగినది చెయ్యగలము…” అన్నది రాజమాత.

          “అమ్మా! మీరు మహాదేవుని స్వరూపము. కాకున్న ఇంత బలమైన విష్ణుకుండినుల రాజ్యము క్షేమముగ మనగలదా? నేడు మేము మీ వద్దకు ఒక కోరికతో వచ్చాము. మీరు కాదనక నాకా వరమివ్వ వలెను…” అన్నాడు ఆచార్యుడు.

          చల్లని వెన్నల వలె నవ్వింది రాజమాత.

          “చెప్పండి ఆచార్యా!”

          “అమ్మా, రాజమాతా! మా విహారాలన్నీ భిక్షుకులతో నిండినవి. కొత్తగా వచ్చేవారికీ, మమ్ముల దర్శించు వారికీ, మేము సౌకర్యవంతమైన వసతి కల్పించలేక పోతున్నాము. మాకు మీరో మహాచైత్రము నిర్మించి ఇవ్వాలి. అమరావతిలో ఉన్నదంత కాకపోయినా, కొద్దిగా చిన్నదైనా, ఒక చైత్రము మాకు అనుగ్రహించండి! మేము దేశాటన చేసి వద్దామను కుంటున్నాము. మీరు అనుమతి ఇవ్వ వలసినదిగా కూడా మా ప్రార్థన…” చెప్పారు దశబలబలి.

          రాజమాత కొంత సేపు మౌనం వహించింది. తదనంతరం ఆమె ఆచార్యునితో “మా పూర్వుల పేర మీకు ఒక మహాచైత్రము నిర్మించి ఇచ్చెదము… మీ దేశ సంచారమునకిది సమయముకాదు. మీరు బ్రట్టిప్రోలు చైత్రానికి తరలి పొండి. అక్కడ కొంత కాలమున్న తరువాత మీ యాత్రకు మేము ఏర్పాటు చేస్తాము. ఇక్కడ విహారం నిర్మాణమవటము కూడా అప్పటికి పూర్తి అవుతుంది…” అన్నదామె ఆదరణగా.

          చిన్నగా చప్పట్లు కొట్టింది రాజమాత.

          ఒక పరిచారిక వచ్చింది. ఆమె తల ఊపగా ఆ పరిచారిక ఒక పేటిక తెచ్చి ఆచార్య దశబలబలికి ఇచ్చింది.

          ఆ పేటికలో సువర్ణ తథాగతుడు, ధర్మ పాదుకలు ఉన్నవి. కొత్తవి కాబోలు, బంగారు మెరుపులతో శోభాయమానంగా ఉన్నవవి.

          రాజమాత ఆచార్యులతో “మీ విహారంలో జరిగిన దొంగతనం గురించి విన్నాము. మా హృదయానికి కష్టమైనది. మీరు పూజించే పరమాత్మ రూపాలను దొంగలు ఎత్తుకు పోవటము శోచనీయం. మాకు కలిగిన ఖేధానికి అంతు లేదు. మీకు మేము ఇవ్వగల చిరుకానుక ఇది. మీ ప్రార్థనలకు అంతరాయం కలుగకుండా జాగ్రత్త పడుదాము ఇక ముందు…” అన్నది. 

          దశబలబలికి అర్థమైనది మరింత స్పష్టంగా. రాజమాతకు రాజ్యంలో తెలియనిదేమీ ఉండదు.

          మరి దొంగలు ఎవరో తెలియదా?

          ఆయన మనస్సు చదివినట్లుగా ఆమె…

          “ఆచార్యా! మా వేగులు దొంగల కోసము వెతుకుతున్నారు. ఆ విషయము మీరు మనస్సు నుంచి తీసివెయ్యండి…” అన్నది. 

          ఆచార్యులు మాట్లాడలేదు. ఆ పేటికను ఒక బిక్షువు చేతిలో పెట్టి పరిచారిక లోనికి వెళ్ళిపోయింది.

          ఆచార్య దశబలబలి ఆమెను ఆశీర్వదించాడు.

          భిక్షుకులందరూ ఆమెను ముక్తకంఠంతో దీవించారు. రాజమాత నెమ్మదిగా లేచి వారందరికీ నమస్కరించి లోనికి నడిచింది, పరిచారిక తోడుగా. 

          బౌద్ధభిక్షుకులు, ఆచార్యులు వారి విహారాలకు తిరిగి వచ్చారు.  

***

          ముఖ్యమైన ఆచార్యులు ప్రత్యేక సమావేశం చేసుకున్నారు.  వారి ఆలోచననలను పంచుకున్నారు.

          “రాజమాతను బౌద్ధం వైపుకు మార్చాటము కష్టము. ఆమె పద్ధతి చూస్తే అది సుస్పష్టం. కాకపోతే మనకు అనుకూలంగా మారే అవకాశము ఉన్నదన వచ్చా? అన్నది ప్రశ్న…” అన్నాడు నందుడు. 

          “అవును. ఆమె తన ఆలోచనలు ఏమీ మనకు తెలియ పరచలేదు…“ అన్నాడు మహానాగ.

          “మనలను తృప్తి పర్చవలననే కదా ఆమె ప్రయత్నించింది. అందుకే మనకు మహా విహారము నిర్మించి ఇస్తామని మాట ఇచ్చారు కదా…”

          “అవును, మన ఆచార్యుల ఆరాధన కోసము తథాగతుని ప్రతిమను కూడా ఇచ్చారామె…”

          “ఆమె మనలను భ్రట్టిప్రోలు వెళ్ళమని ఎందుకు ఆజ్ఞ ఇచ్చినది?” ఆలోచనగా అన్నాడు దశబలబలి.

          “మీరు ఈ పరిస్థితులలో దేశాటన చెయ్యలేరు. మనము త్రికూట తిరునాళ్ళ తరువాత మీ యాత్ర గురించి ఆలోచిస్తే మంచిది. అప్పటికి మహారాజు చేసే యాగము కూడా పూర్తి అవుతుంది…” అన్నాడు మహానాగ

          “అవును. బహుశా ఆ యాగము తరువాత ఇక్కడ మార్పు ఏదో జరగనున్నది. అందుకే మహారాణి మన క్షేమము కోరి భ్రట్టిప్రోలు వెళ్ళమన్నది. అక్కడ మహా విహారానికి రక్షణ ఎక్కువ…” అన్నాడు మహానందుడు.

          అవునన్నట్లుగా తల ఊపాడు ఆచార్యుడు. ఆయనకు కొంత అస్పష్టముగా తెలుస్తున్నా, విషయము మాత్రము స్పష్టమయ్యింది. 

          మనసులో ఒక ప్రణాళిక రూపు దిద్దుకుంది.  

          ఆయన వెంటనే మహానాగతో “నీవు కొందరు భిక్షుకులను తీసుకు నాగార్జున కొండ వెళ్ళి పోవలెను. నేను చెప్పే వరకూ అక్కడే ఉండ గలరు. మీరు వచ్చే పౌర్ణమి నాటికి అక్కడకు వెళ్ళే ఏర్పాటు చూడవలెను..” అన్నారు.

          మహానందతో “మహానందా! నీవు కొద్ది పాటి భిక్షవులతో ఇక్కడనే నివసించుము. సమయానుకూలముగా పరిస్థితులను చూసుకుంటూ ఎప్పటికప్పుడు క్షేమ సమాచారం అందచేయి. నేను, మహానాగ ఇక్కడ లేకపోతే మన విహారానికి సమస్యలు తగ్గుతాయి. నేను భ్రట్టిప్రోలు వెళ్ళి అక్కడ ఆరు నెలలు ఉంటాను. మనము తదనంతరము కలుద్దాము. ఇక్కడ అప్పటికి మనము అనుకునే మహాచైత్రము వస్తుంది…” అన్నారు.

          మహానాగ తల ఊపాడు.

          పది రోజులలో మహానాగ తనతో వంద మంది భిక్షువులను తీసుకు నాగార్జున కొండకు తరలిపోయాడు.

          ఆచార్య దశబలబలి మరో వంద మంది భిక్షువులతో, రాజ సైనికుల సహాయంతో భ్రట్టిప్రోలు తరలివెళ్ళారు.

          మహారాణి రాజమాత  ఇంద్రపురిలో బౌద్ధాన్ని తగ్గించటంలో కృతకృత్యురాలైనది.

 * * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.