రాగో

భాగం-25

– సాధన 

          “లామడే! హల్లో! గాటోల్ విచార్ కీమ్ డా” (అన్నం సంగతి చూడు) అంటూ పటేల్ పని పురమాయించాడు.

          ఎదురు చెప్పడం ఏనాడో లామ్ (ఇల్లరికం) కుదిరిన్నాడే మరిచి పోయిన లామడే “ఇంగో” అంటూనే గుండెలు కోస్తున్న బాధతో వెళ్ళిపోయాడు.

          ఛాయ్ తాగి మళ్ళీ ఉపన్యాసంలోనికి పోబోతున్న జైనికి బూది అడ్డు తగిలింది.

          “అక్కా. ఒంది పొల్లు” (ఒక్కమాట)

          “వెహ (చెప్పు) – బాయి” అంది జైని.

          ఊరి జనాలు గుడ్లప్పగించి నిల్చున్న బూదివైపే చూస్తున్నారు. అమ్మలక్కలు బూదిని నిలువెల్లా చూస్తున్నారు. దడుల మీద కూచున్న పోరగాండ్లు నవ్వుతున్నారు. పటేల్ దిక్కులు చూస్తుంటే బూది తండ్రి మాత్రం ‘ఈ పోరికి ఏమైంది? అన్నట్లు చూస్తున్నాడు.

          “లామడేను మర్మి అమోన్” (ఇల్లరికం ఉన్న అల్లుడ్ని పెళ్ళి చేసుకోను) అంటూ బూది నేల చూపులు చూస్తూ చీర చివర వేళ్ళ సందున ఇరికించుకొని మునిపళ్ళతో చిన్నగా కొరుకుతుంది.

          నైటు స్కూలు గురూజి గొంతు సవరించుకొని లుంగి పైకి జరుపుకొని మునికాళ్ళ పై కూచున్నడు.

          “లామడె ఎవరక్కా” – అంది గిరిజ.

          అంతా నిశ్శబ్దం.

          నిముషం తర్వాత పటేల్ “ఇప్పుడు పోయినోడే” అన్నాడు.

          “ఏం సంగతి నువు చెప్పు దాదా” అంటూ పటేల్ ను కోరడంతో అసలు విషయం లోనికి పటేల్ దిగాడు.

          “ఆరేండ్లు లామ్ (ఇల్లరికం) ఉంటే బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని బూదుర్ తప్పె (బూది తండ్రి) రైనుగాన్ని తెచ్చిండు. ఇదే పెద్ద బిడ్డ. ఇంకోతి చిన్న పోరి, కొడుకులు లేరు. భీమారి పడ్డ పెండ్లాం ఎప్పుడు పూజారి దగ్గర నేనాయె. రెండేండ్లయింది లామడే పెట్టి. అంత మంచిదే గాని గీ పోరి గట్ల ఎందుకంటుందో నేను గిప్పుడే వింటున్న బాయి” – అని తెల్సిన కాడికి చెప్పి పటేల్ ఊరుకున్నాడు.

          “ఇంగో, అంతే బాయి. పని వెళ్ళక లామడే పెట్టుకున్న. పెద్దల ముందరనే ఆనాడు పోరిని అడిగితే ‘ఇంగో” అన్నది. ఇయ్యాల గిట్లయింది” అని బూదురు తప్పె పటేల్ చెప్పిందే మరోసారి నొక్కి చెప్పాడు. –

          కేసు అర్థంగాని గిరిజ జైనివైపు చూసింది. జైని నవ్వుతుంది.

          “గాటో అయ్యింది” లామడే పిలుపు.

          “తిన్నాంక చేయిండ్రక్క పంచాయితీ, ఆకలైతుండచ్చు” అంటూ పటేల్ తొందర చేస్తూ గోటుల్ వెనుకకు దారి తీశాడు.

          “ఇంగో” అంటూనే గిరిజ ‘కాసేపట్లో వస్తాం, ఉండమ’ని జనాలను కోరుతూ తన దళం వారితో పటేల్ వెనుక నడిచింది. బూది సెంట్రీ వైపు నడిచింది.

          వడ్డన చేస్తున్న లామడే ముఖం మీద నెత్తురు చుక్క లేదు. బూది దక్కుతుందన్న ఆశలేదు. అమాయకంగా అక్కల వంక చూస్తున్నాడు. తన బాధ అంతా చెప్పుకొని న్యాయంగా బూదిని తనకే ఉండేట్లు చేయమని అడగాలని నోరు దాక వచ్చినా పటేల్ అక్కడే ఉండడంతో ఆ మాట పెకలడం లేదు. కడుపులున్న బాధ వెళ్ళబోసుకోడానికై అవస్థ పడుతున్నాడు.

          “నీళ్ళివ్వు దాద” అన్న మెంతక్క పిలుపు విని బకెట్ లోకి చూసిన పటేల్ నీళ్ళు లేవని లామడేను నాలుగు తిడుతూ నీళ్ళకు గెదిమాడు.

          “ఏ లామడేకైనా ఇదంతా మామూలే” అన్న ధోరణిలో చెప్పిన ప్రతి పనిని చేస్తున్న రైనును చూసి గిరిజలో తెలియకుండానే సానుభూతి పెరుగుతోంది.

          సెంట్రీ చేస్తున్న మిన్కోను మెల్లగా కబుర్లలోకి దింపింది బూది. క్రమంగా తన విషయంలోనికి తెచ్చింది.

          “నేను అయ్య బెదిరిస్తే పెద్దల ముందు ఔనన్నమాట నిజమే. కానీ నాకు ఆ లామడే ఇష్టం లేదు. నేను మా ఊల్లె గురూజి పని చేస్తున్న పద్దా సైతుకే పోతా. సైతు కూడ వరుసైన వాడే” అంటూ ఈ విషయం మీటింగ్ చెప్పే అక్కలకు చేరవేయమన్నట్టు చెప్పి ముగించింది బూది.

          మీటింగ్ దగ్గరకి భోజనాలు ముగించుకొని అక్కలు చేరినారు. బూది తన స్థానంలో తను కూచుంది. మిగిలిన అన్నం తిని చేయి కడుక్కొని పటేల్, తిన్నాక గంజులు కడుగుమని లామడేకు డ్యూటీ అప్పచెప్పి వచ్చి తన స్థానంలో కూచున్నాడు.

          బావి దగ్గర మసి గంజులను మట్టి పెట్టి రాకుతున్నాడు లామడే రెను. అన్నం గంజు అడుగు మాడిపోయి కలెబడి గట్టిగ తోముతే గాని పోయేట్టు లేదు.

          బూదు బుద్ది తెలిసిన గురూజి ఏ చింత లేకుండా కూచున్నడు.

          “బూది లామడే ఎందుకొద్దు? ఇంకెవరైనా నచ్చినోళ్ళున్నరా” అంది జైని.

          నేల చూపులు చూస్తూ బూది గురూజి కూచున్న వైపు ఒక్కసారి తలెత్తి చూసే సరికి తోమిన గిన్నెలతో అటు వస్తున్న లామడే కంట పడ్డాడు.

          “నాకు ఈ లామడే వద్దు అక్కా! నేనూ మీతోనే పార్టీలోకి వస్తా”నంది బూది.

          బేఫికరుగా కూచున్న గురూజి గతుక్కుమన్నాడు.

          భోజనం ముగించి వస్తున్న మిన్కో జైని చెవిలో గుసగుసలాడుతుంటే జైని తల తిప్పకుండానే “ఇంగో, ఇంగో” అంది.

          “లామడే దాదా! నువు ఏమంటావు” అంది గిరిజ.

          “బూది కోసమే లామ్ (ఇల్లరికం) ఉన్న, గరీబోణ్ణి” అంటూ మరో మాట మాట్లాడకుండా ముగించాడు.

          “దాదా! నీ బిడ్డ కోసం లామడే ఉన్నడు. బూదేమో లామడేను వద్దంటుంది. రెండేండ్ల నుండి గొడ్డు చాకిరి చేస్తున్న లామడేకు పెండ్లి చేసి ఇస్తాననే మాటిచ్చినవు. దాన్ని అమ్మినంత పని చేసినవ్. వెల్లుమాను లేకనే లామడే ఉన్నడు. మరో పిల్లను తెచ్చుకునే శక్తి లేదు. ఏం చేస్తరో చెప్పు” అంది జైని బూదుర్ తప్పె వంక చూస్తూ.

          “బూదినిచ్చే పెళ్ళి చేస్త!” బూది తండ్రి.

          “నీ ఇష్టమా. ఆమె ఇష్టమా. కాపురం చేసేదెవరు దాద” అంది గిరిజ పౌరుషంగా.

          మరోమాట మాట్లాడక బూదురు తప్పె గుమ్మునుండగ, లామడే రైను “ఇంతటితో కథ ముగిసింది” అని ఆశ వదులుకోవాలనుకున్నా ఆశ చావడం లేదు.

          గురూజి ముఖంపై చిరునవ్వు తొంగి చూసింది.

          “లామడే దాద, నువ్వేమంటావు” – అంది గిరిజ.

          “పిల్లనిస్తామని లామ్ పెట్టుకున్నాడు. బూది గాకుంటే బూది చెల్లె అయినా మంచిదే” ఆడ దిక్కు అన్న ధోరణిలో మాట ముగించాడు రైను.

          “ఇంగో! హీకన్” (ఇస్తాను) అంటూ ధీమాగా పలికాడు బూదురు తప్పె.

          “అబ్బ గొప్ప పనే చేస్తవు దాద! మన మాడియా కులంలనే అంత దాద. బర్రెనా, గొడ్డా దాద ఆడది. నచ్చిన రేటుకు కుదిరినోనికి ఇచ్చినట్టు. ఇదే ఉండనో దేవా! అంటే ఇంకా పెద్దదే కాని ఆ పోరిని పట్టుకొని ఇమ్మని లామడె, ఇస్తానని నీవు. బాగుంది దాద, మీ వ్యవహారం” – అంది జైని.

          ‘అబ్బ ఎంత ఘోరం’ అన్నట్టుంది. గిరిజకి. ‘ఆడదాన్ని ఎర చూపి ఎంత ఆడుకుంటున్నరు. ఆడదాన్ని అమ్ముకుంటున్నరు. పిల్ల కడుపుల బుట్టిందంటేనే పెళ్ళి జంజాట్ మొదలైనట్టు. ఆడదానికో అభిప్రాయం ఉంటుందనీ, దానికో మనసు ఉంటుందనీ చూడనే చూడరు. వీళ్ళు కూడ ధైర్యంగా మాట్లాడి చావరు. ఇప్పుడన్న మాటే ఆనాడు అని ఉంటే ఇంత గలాటా జరిగేదా. జీవపారె ఇచ్చుకోలేని వాడు ఆరేండ్లు చాకిరి అంతా చేశాక పీటల మీద పెళ్ళి ఎత్తిపోయినట్టు అయితే ఆ దురదృష్టవంతుడి గతి ఏం గావాలి’ అని ఆలోచనల మధ్య మునిగిపోయిన గిరిజ ‘అక్కా’ అన్న జైని పిలుపుతో బయటపడింది.

          జైని, గిరిజలు పక్కకొచ్చిండ్రు.

* * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.