నిష్కల – 21

– శాంతి ప్రబోధ

జరిగిన కథ:కేఫ్ లో కలసిన తర్వాత సారా, నిష్కల క్యాంపింగ్ కి వెళ్లాలనుకుంటారు. గీత వాళ్లతో రానంటుంది.  మనిషిలో ఉండే ద్వంద వైఖరి గురించి ఆలోచిస్తుంది నిష్కల.  ముందుగా అనుకున్నట్లుగానే  లాంగ్ వీకెండ్ రోజు వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ లో క్యాంపింగ్ కి వెళతారు. 

***

          “నిజమా.. మా నాన్న కూడా ఈ పాట ఎప్పుడు హమ్ చేసేవాడు. నాకు బాగా గుర్తు.  నిజానికి మా నాన్న మంచి సింగర్ అంటుంది అమ్మ. మొత్తం పాట విన్నట్టు నాకు గుర్తులేదు. మా నాన్న కారులో ప్రయాణం చేసేటప్పుడు ఇండియన్ సాంగ్స్ చాలా ఇష్టంగా ప్లే చేసేవాడు. ప్లేయర్ లో వచ్చే పాటలతో తన గొంతు కలిపేవాడు. 
 
          పూలు గుసగుసలాడేనని.. జతగూడేనని.. గాలి ఈలలు వేసేనని.. సైగచేసేనని..  
అమ్మని చూస్తూ కొంటెగా పాడడం నేనెప్పుడూ మర్చిపోలేను. అమ్మకు ఏమి అర్ధమయ్యేదో ఓర చూపులు చూసుకుంటూ నవ్వుకొనేది.  తాను కూడా సన్నగా హమ్ చేసేది. బహుశా అమ్మకి ఆ పాట అర్థం తెలుసేమో.. నాన్న ఎప్పుడైనా చెప్పి ఉండొచ్చునేమో.. ఇద్దరు చాలా రొమాంటిక్ గా ఉండేవారు. ఇద్దరు కలిసి ఉన్న కాలం చిన్నదే కావచ్చు. కానీ గొప్ప ప్రేమికులు. ప్రతి క్షణాన్ని ఆస్వాదించేవారు. ఆనందించేవారు.  ప్రతి జ్ఞాపకాన్ని అమ్మ పదిలంగా దాచుకుంది. ఇప్పటికి ప్రతి రోజు నాన్న ఫోటో ముందు కూర్చుని నాన్నతో కబుర్లు చెప్పుకుంటుంది.  మంచి చెడు కలబోసుకుంటుంది.  గొంతు మూగబోతుండగా అన్నది సారా .. 
 
          ఏంటి.. సారా అమ్మ,నాన్న కలిసి ఉండడం లేదా.. గొప్ప ప్రేమికులు విడిపోయారా?  నిష్కలలో ఆశ్చర్యం. 
 
          అతను అమ్మను వదిలినట్టే సారా తల్లితో కూడా బంధాన్ని దూరం చేసుకున్నాడా? ఇష్టపడి చేసుకున్నాడు కదా .. వారిద్దరి బంధం చైనావాల్ లాగా దృఢంగా ఉంటుందని ఊహించాను. అది నిజం కాదా..  ఇష్టం పోయిందేమో.. 
 
          విశాల హృదయం, నిజాయితీ, సహనం ఉంటే భార్య భర్తల బంధం బలంగా ఉంటుందని అంటారు. సారా తండ్రి చాలా మంది మగవాళ్ళు లాంటి వాడేమో..  నిజాయితీ లోపించి ఉంటుంది .  
 
          నాన్న ఇంత బలహీన మనస్కుడా..  మనసు కలుక్కుమంది.రకరకాల ఆలోచనలు, ప్రశ్నలు నిష్కలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎవరి నోట విన్నా నాన్న వ్యక్తిత్వం గురించి, మనస్తత్వం గురించి గొప్పగా చెప్పుకోవడం విన్నది. అమ్మ కూడా ఏనాడు తద్భిన్నంగా చెప్పలేదు.  మరి ఎందుకు భార్యా బిడ్డలకు దూరమయ్యాడు? లోపం ఎక్కడుంది? 
 
          సారాని సూటిగా అడిగేస్తే..?  కామన్ సెన్స్ లేకుండా తన స్వ విషయం లోకి చొచ్చుకొచ్చానని నొచ్చుకుంటుందేమో.. అసహనం ప్రకటిస్తుందేమో .. వద్దు.. సారాతో ఉన్న పరిచయాన్ని, స్నేహాన్ని పెంచుకోవాలి కానీ తుంచుకోకూడదు స్థిరంగాఅనుకుంది నిష్కల. 
 
          ఎటువంటి సందేహం లేదు. సారా నా చెల్లెలు. ఆ విషయం పాట కూడా రూఢిగా చెప్పిందని ఓ వైపు ఆనందం మరో వైపు ఏదో తెలియని దిగులు అలుముకున్నాయి నిష్కలలో. 
 
          కొద్ది క్షణాల మౌనం తర్వాత “నాన్న మా మధ్య లేరు కానీ మా ఊహల్లో, మా మాటల్లో ఆయన మాతో పాటే ప్రయాణిస్తున్నారు ” బరువెక్కిన హృదయంతో అన్నది సారా.
 
          నిష్కలకు అంతా అయోమయంగా ఉన్నది.
 
          “నువ్వు ఏమనుకోనంటే … మీ నాన్న మీతో ఉండరా ..?”ఆత్రుత ఆపుకోలేక నెమ్మదిగా ప్రశ్నించి ఉత్కంఠగా సారా కేసి చూస్తూ ఉన్నది. 
 
          “చెప్పానుగా నిష్, మా నాన్న మాతోనే ఉన్నారు. మా ఊహల్లో.. మా మనస్సులో..మా ప్రపంచంలో”
 
          నిష్కలకు అంతా పజిల్ లా అనిపిస్తున్నది. విషయం స్పష్టంగా ఎలా తెలుసు కోవడం ఆలోచిస్తున్నది. 
 
          “అవును నిష్, మా నాన్న నాతో లేరు కానీ ఆయన అలవాట్లు చాలా నాతో ప్రయాణం చేస్తున్నాయి. చాలా విషయాల్లో మీ నాన్న లాగే అంటూ  పనుల్ని మా నాన్నతో పోలుస్తూ  ఉంటుంది మా అమ్మ.” తండ్రి తలపుల్లోకి వెళ్తూ చెప్పింది సారా. 
 
          ఆయనెక్కడ ఉంటారో, వారి దూరానికి కారణం ఏమిటో తెలుసుకోవాలన్న ఆతృతలో నిష్కల ను నిలువనీయడం లేదు.  అయితే అంతకు మించి స్వేచ్ఛ తీసుకుని సారా వ్యక్తిగత విషయాలు అడగడానికి ఆమె సంస్కారం అడ్డు వస్తున్నది. 
 
          బంగారు వర్ణంలో మెరిసిపోయే బుల్లి పిట్ట తల వంచి నేలపై ఏవో ఏరుకు తింటున్నది. ఆ పిట్ట నిష్కల దృష్టిని బాగా ఆకర్షించింది. తదేకంగా దాన్నే చూస్తూ
 “ఎంత అందంగా ఉందో కదా .. కాళ్ళు, తెలుపు నలుపు చారల తోక భాగం, నుదురు భాగంలో ఉన్న నలుపు రంగు దానికి మరింత  అందాన్ని ఇచ్చినట్లు ఉంది..” ఉత్సాహంగా చూస్తూ  అన్నది నిష్కల 
 
          “ఓ.. ఇది గోల్డ్ ఫించ్. ఇది కనిపిస్తే మంచిదని, సంతోషంగా ఉంటామని ఇక్కడి ప్రజల నమ్మకం” చెప్పింది సారా.
 
          “అంటే.. మనను మరింత దగ్గర చేస్తుందేమో.. ” అంటూ సారా ముఖంలోకి చూస్తూ నవ్వేసింది నిష్కల. 
 
          “వాట్ డు యు మీన్ ” సీరియస్ గా అన్నది సారా 
 
          ఆమె అంత సీరియస్ గా ఎందుకు మారిందో అర్థం కాలేదు నిష్కలకు.  ఒక్క క్షణం ఆగి మనని ఇంకా మంచి మిత్రులుగా మారుస్తుందేమో .. ” నవ్వింది  
 
          అప్పుడు, ప్రసన్నంగా మారుతున్న సారా మొహం చూస్తూ కొద్ది క్షణాల కిందటి ఆమె సీరియస్ నెస్ కు కారణం ఏమై ఉంటుందా అని  ఆలోచనలో పడింది నిష్కల . 
 
          సారా చేతిలో పుస్తకం ఉన్నది కానీ ఆమెకు ఏకాగ్రత కుదరడం లేదు. పేజీలు కదలడం లేదు.  పక్కన పెట్టేసింది. దూరంగా కొండల మీద నుండి దోబూచులాడుతున్న మేఘాలను వాటి వెనుక నుండి కనిపించే నీలాకాశాన్ని చూస్తూ  డలావెర్ నది పై పరుచుకున్న ఆకాశ చిత్రాల్ని మదిలో ముద్రించుకుంటూ కొన్ని క్షణాలు గడిపింది. 
 
          తండ్రితో  వెళ్లిన క్యాంపింగ్ జ్ఞాపకాలు సారాను చుట్టుముడుతున్నాయి.  
అమ్మ నాన్నల  చేయి పట్టుకుని చేసిన హైకింగ్ , కయాకింగ్ , ఫిషింగ్ దృశ్యాలు 
నాన్న చిన్నతనంలో వాళ్ళ ఊళ్ళో వాగులో చేపలు పట్టి కాల్చుకొని తినేవారట. ఆ తర్వాత ఇప్పుడే అంటూ చేపను కాలుస్తూ చెప్పిన ముచ్చట్లు నిన్న మొన్నటిలాగా ఉంది.  
 
          ఏదో అడగబోయి ప్రకృతి పరవశంలో ఉన్న నిష్కలను డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక ఆగిపోయింది సారా. 
 
          తండ్రి స్మృతులతో ఉన్న సారాని ఇబ్బంది పెట్టకుండా కొద్ది సేపు మౌనంగా ఉన్నది నిష్కల. 
 
          ఎక్కడి నుండో ఓ గండు చీమ వీళ్ళు కూర్చున్న చాప వైపు వస్తున్నది. అది చూసిన నిష్కల చెప్పుతో కొట్టబోయింది. అది చూసి సన్నగా నవ్వుతూ  “నిన్నేమీ మింగేయదులే. వదిలేయ్ ” అన్నది సారా. 
 
          “నీకు నవ్వులాటగా ఉందా .. గండు చీమ పట్టుకుని ఒకసారి నా కాలి వేలి నుండి రక్తం బొలబోలా  కారిపోయింది తెలుసా .. “ఉడికిపోతూ అన్నది నిష్కల. 
 
          “హే .. నిష్ .. అది చాలా చిన్న ఇన్సెక్ట్, దాని దారి దానికి ఇచ్చి మనం పక్కకు జరిగితే సరిపోయే.  వాటి ప్రపంచంలోకి మనం వచ్చామని మర్చిపోకు  ” అన్నది సారా. 
” నీకు భయం లేదా .. ” తన భయానికి తానే సిగ్గుపడుతూ అన్నది నిష్కల. 
 
          ” ఊహూ..  ఒకప్పుడు నేను నీలాగా భయపడేదాన్ని. కానీ ఇప్పుడు ఆ భయాలన్నీ హుష్ కాకి ” నవ్వింది 
 
          “ఓ.. ఎలా .. ” నిష్కల సందేహం 
 
          ” హ్మ్మ్ .. ఏమని చెప్పను? 
 
          నాన్న లేని తనాన్ని దూరం చేసుకోవడం కోసం అమ్మ తో పాటు అడవులు, కొండలు , లోయలు తిరిగాను.  ప్రకృతి మీద మోజు  ఉహు కాదు కాదు మోహం వచ్చింది.  ఆ మోహంలో  వ్యామోహంలో 13 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న అప్పలాచి పర్వత శిఖరాల శ్రేణి ని చుట్టి వచ్చా. అమెరికాలో ఉన్న చాలా పర్వతాలతో పాటు కిలిమంజారో కూడా ఎక్కాను.  చాలా పర్వత శిఖరాలకు చేరాను.”
  
          “ఓహ్ .. నిజమా .. ” అని కొత్తగా కనిపిస్తున్న సారా ముఖంలోకి చూస్తూ “ఎవరెస్ట్ కూడానా ” ఆత్రంగా అడిగింది నిష్కల. 
 
          “ఊహూ .. ఇంకా అంత లేదు” మా బకెట్ ఆఫ్ లిస్ట్ లో మొదటి ప్రాధాన్యత లో ఉంది ఎవరెస్ట్. అయితే, ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ గురించి విన్నది నాన్న నుంచే.  నాన్నకి ఎన్నో కోరికలు, ఆశలు ఉండేవట. చదువుకోవడానికే సహకరించని ఆర్థిక పరిస్థితిలో ఇతరులపై ఆధారపడి పట్టుదలతో చదువుకున్నాడు. ఆనాటి ఆయన పరిస్థితి ఆయన ఊహలకు, ఆశలకు రెక్కలు ఇవ్వలేక పోయాయి. నాకు అలా కాదు. నేను అనుకున్నది సమకూర్చుకోగల ఆర్థిక పరిస్థితి, స్వేచ్ఛ స్వతంత్రం ఉన్నాయని అనుకున్నా ఇన్నాళ్లు. ఆ ఊహలో ఎవరెస్టు ఎక్సపెడిషన్ వెళ్లాలని బాయ్ ఫ్రెండ్ తో కలిసి నిర్ణయం తీసుకున్నా.  అనుకున్నట్లుగా అన్నీ జరిగితే అది జీవితం కాదేమో..  కోవిడ్ రావడంతో అంతా తలకిందులైంది. 
 
          వచ్చే సీజన్ లో ఎవరెస్టు కి ప్రయాణ సన్నాహాలు చేసుకోవాలి. అయితే ఈ విషయం తెలిసిన దగ్గర నుంచి అమ్మ అతిగా స్పందిస్తున్నది. ఆమెను ఒప్పించుకుని ప్రయాణానికి సన్నాహాలు చేసుకోవాలని ఆలోచిస్తున్నా” అన్నది సారా.  నిజమా .. రియల్లీ గ్రేట్ . నువ్వు సాధిస్తావ్ సారా .. నువ్వు సాధించగలవ్.   మీ అమ్మగారు ఎందుకు అతిగా స్పందిస్తున్నారు? నీ మాటల బట్టి చూస్తే ఆవిడ చాలా సపోర్టివ్ అనుకున్నాను ” అన్నది నిష్కల.
 
          “అవును, నువ్వన్నట్లు మా అమ్మ చాలా ఫ్రెండ్లీ , సపోర్టివ్, ఆసియాన్ అమెరికన్ కదా .. పిల్లల పట్ల ఉండే పొసెసివ్ నెస్ వల్ల అయుండొచ్చు .. చూద్దాం ఏమవుతుందో .. ” అంటున్న సారాకి బాగ్ లోంచి స్నికర్స్ చాక్లెట్ అందించింది నిష్కల 
 
          “హహ్హా హహ్హా .. ఏంటీ ఎవరెస్ట్ సాధించేసానని నోరు తీపి చేస్తున్నావా ..” సరదాగా అన్నది సారా.
 
          “కాదు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ.. ” నిష్కల..
 
          పర్వతారోహణ గురించి మాట్లాడుకుంటూ చాలా సేపు గడిపారు ఇద్దరూ. మనం మాటల్లో పడి సమయం ఎంతయిందో మర్చిపోయాం నిష్ . క్యాంపు సైట్ లో టెంట్ వేసుకోవాలి తొందర చేసింది సారా.  
 
          డలావెర్ నదికి కుడివైపు ఉన్న తమ క్యాంపు సైట్ కి చేరుకున్నారు. నగరానికి దూరంగా రొటీన్ కి భిన్నంగా మనుషులు..  చేపలు పడుతూ , పుస్తకం చదువుతూ.. సైకిలింగ్ చేస్తూ.. కొండలు గుట్టలు ఎక్కుతూ దిగుతూ హైకింగ్ చేస్తూ ఎవరికి నచ్చిన విధంగా వారు..హాయిగా  సేద తీరుతూ .. వీల్ చైర్స్ వారు కూడా హాపీగా తిరుగుతూ .. ప్రకృతిని ఆస్వాదిస్తూ .. చిన్న పెద్ద , పిల్ల పాపలతో .. ముసలి ముతక వయసును మరచి .. ఆడామగ .. అన్ని రంగుల వాళ్ళు .. అన్ని వయసుల వాళ్ళు  ..కొందరు కాంప్ర్స్  పెట్స్ తో .. ట్రావెల్ ట్రైలర్స్ , మోటారు హోమ్స్ తో వస్తున్నారు . 
టెంట్ వేసుకునే క్యాంపు సైట్స్ ఒక వైపు ఉన్నాయి.  ట్రైలర్ , మోటార్ హోమ్స్ వేరే సైట్స్ లో  పెట్టుకోవడానికి అనువుగా ఉన్నాయి . 
 
          లాంగ్ వీకెండ్ కావడంతో  న్యూజెర్సీ , న్యూయార్క్, పెన్సిల్వేనియా రాష్ట్రాల జనం బాగానే చేరారు క్యాంపు సైట్స్ నిండుగానే ఉన్నట్లున్నాయి .  వారం మధ్యలో అయితే జనం పలుచగా ఉంటారు. దాదాపు రెండు కిలోమీటర్ల పొడవునా ఉన్న క్యాంపు సైట్స్ లో కొన్ని నదికి అభిముఖంగా ఉన్నాయి. ఆ వెనకే రోడ్డు.  మరి కొన్ని రోడ్డు కేసి ఉన్నాయి . 
 
          కొందరు టెంట్ వేసుకుంటే మరి కొందరు వేసుకుంటున్నారు . చీకటి పడితే కష్టం అని త్వరపడుతున్నారు. గుడారం వేసుకుని క్యాంపింగ్ చైర్స్ వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు ఓ వృద్ధ జంట. అయితే  ఒక గుడారం నుంచి మరో గుడారం వాళ్ళు కనిపించకుండా పెరిగిన పచ్చని పచ్చిక. ఎవరి ప్రైవసీ వారికి కాపాడుతూ కాంప్ సైట్స్ . 
క్యాంపు సైట్ 5 వద్ద సారా కారు ఆపింది.  ఇదే మన క్యాంపు సైట్ అని చెప్పింది. 
 
          “ఓ .. వండర్ఫుల్ ప్లేస్  సారా .. ” అంటూ సారాకి హాగ్ ఇచ్చింది. 
 
          మట్టి దారిలో నాలుగడుగులేస్తే నది. నది ఒడ్డున తమ క్యాంపు సైట్ ఉండడం నిష్కలకు చాలా నచ్చేసింది. 
  
          “థాంక్ యు నిష్. నీకు నచ్చింది.  చాలా సంతోషం.  నదికి అభిముఖంగా ఉన్న సైట్స్ నేను ఎప్పుడూ ప్రిఫర్ చేస్తాను.  నీకు నచ్చుతుందో లేదో అనుకున్నాను. నీకు నచ్చేసిందిగా గొప్ప రిలీఫ్” కారులోంచి సామాను దించుతూ  నవ్వేసింది సారా 
నిష్కల కూడా క్యాంపింగ్ సామాగ్రి దించడంలో సహాయం చేయబోయింది. నీకెందుకు శ్రమ నేను తీస్తాగా అంటూ వారించింది సారా . అయినా నిష్కల ఊరుకోలేదు.  నేను ఇవన్నీ తెలుసుకోవాలి అంటూ సారా చేస్తున్న ప్రతి పనిని అనుసరించడం మొదలు పెట్టింది . ఆహారం ఉన్న సరంజామా మాత్రం కారులో ఉండడం గమనించి బయటికి తీయబోయింది నిష్కల. 
 
          వద్దు నిష్. అవి తీయకు. లోపల ఉంచడం మంచిది”. 
 
          “ఏం ఎందుకు ?” నిష్కల ప్రశ్న 
 
          “ఎలుగుబంట్లు ఫుడ్ కోసం వస్తాయి. వాటికి మన ఫుడ్ మంచిది కాదు” చెప్పింది సారా.
 
          తమ సైట్ పక్కనే ఉన్న రెడ్ పైన్ వృక్షాల జంట చూస్తూ తమ కాంప్ సైట్  లో రెండు గుడారాలు వేసుకోవచ్చని అనుకుంది. సారా చకచకా టెంట్ వేస్తుంటే నిష్కల ఆశ్చర్యంగా చూస్తూ చిన్న చిన్న సహాయాలు చేసింది. నేలలో సుత్తితో పెద్ద పెద్ద మేకుల్లాంటివి దించి వాటికి టెంటుకు కట్టిన తాళ్లను కట్టింది. పెద్ద గాలి వచ్చినా టెంట్  ఎగిరిపోకుండా చాలా పకడ్బందీగా చేసింది. గుడారం గోపురం ఆకారంలో నిలబడింది.  
ఆపైన మరో నైలాన్ కవర్ వేసి సెట్ చేసింది.  నైలాన్ టెంట్స్ వర్షం నుంచి మెరుగైన రక్షణ అందిస్తాయి . తేలికగా ఉంటాయి కాబట్టి తీసుకువెళ్లడం సులభం. శాశ్వత నివాసం లేని సంస్కృతి నుంచి వచ్చిన మానవుడు ఇప్పుడు శాశ్వత నివాసాలు ఉన్నప్పటికీ ఆ జీవనశైలి నుంచి బయటికొచ్చి రెండు మూడు రోజులు ఆటవిడుపుగా క్యాంపింగ్ కి  వస్తున్నాడా…ఇప్పుడిది గ్లామరస్ గా  మారిపోయిందా .. వినోదంగా మారిపోయిందా . 
ఏదేమైనా మనిషిలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుతుంది. కొత్త జీవితాన్ని చూపుతుంది అనుకుంది నిష్కల. 
 
          నేల మీద ఉన్న రాళ్లు రప్పలు గుచ్చుకోకుండా ఒక చాప వంటిది పరిచింది. గాలి పరుపుల్లో గాలి కొట్టి పరిచింది. చెరొక స్లీపింగ్ బాగ్ ఆ పరుపుపై ఉంచింది . దానిపై తాను తెచ్చుకున్న బ్లాంకెట్ పెట్టింది నిష్కల. 
 
          సారా తనతో టెంట్ తో పాటు సోలార్ లాంతర్ , ఫ్లాష్ లైట్ ,  ఫైర్ స్టార్టర్ , మడత కుర్చీలు , గుడారం కట్టడానికి అవసరమైన తాళ్లు , , రెయిన్ కోట్ , హైకింగ్ షూ , ఫిషింగ్ పోల్, తేలికపాటి అల్యూమినియం వంటసామాను , పోర్టబుల్ స్టవ్, చెన్ వస్తువుల బాక్స్ , వ్యర్థాల నిర్వహణ కోసం చెత్త సంచులు , దోమల రేపాలెంట్ , సన్ స్క్రీన్ లోషన్ ,  వ్యక్తి గత అవసరమైనవి, పాడైపోయే పదార్థాలు నిల్వ చేయడానికి కూలింగ్ బాక్స్,  ఫ్రూట్స్, నట్స్ , వంటి  పాడైపోని ఆహారపదార్ధాలు, పోర్టబుల్ వాటర్ ఫిల్టర్ , కత్తి , అత్యవసర కిట్, సాల్ట్ , పెప్పర్ , వంటివన్నీ తెచ్చింది . 
 
          నిష్కల తనతో పాటు కాస్త పులిహోర, దద్దోజనం చేసుకొచ్చింది.  ఆ పూట అవి తిని తమ భోజనం ముగించుకున్నారు. 
 
          అక్కడక్కడ ఫైర్ పిట్స్ ఉన్నాయి. అక్కడ ఎండు కట్టెలతో నిప్పు రాజేసి ఆ మంటలో వంట చేసుకుంటున్నారు కొందరు. కొందరు ఇంటి నుంచి తెచ్చుకున్న వాటిలో ఆ పూట భోజనం  ముగించుకున్నారు. ఆ సాయం సంధ్య వేళలో పక్షులు చేసే గాన కచేరి వింటూ కాసేపు క్యాంపింగ్ చైర్ లో కూర్చున్నారిద్దరూ . దోమలకు నేనంటే ప్రేమ ఎక్కువ.  ఈరోజేంటో నామీద ప్రేమ తగ్గినట్టుంది.  ఒక్కటి కూడా నా వైపు చూడటం లేదు  అన్నది నిష్కల .  ఆమె మాటలకు నవ్వేసింది సారా. అదేం కాదు,  నువ్వు గుడ్ గర్ల్ కదా .. నేను చెప్పినట్టు లేత రంగుల దుస్తులు వేసుకోసుకున్నావ్,. ప్యాంటు సాక్స్ లోకి టక్ చేసుకున్నావ్, మస్కిటో రిపేలెంట్ స్ప్రే చేసుకున్నావ్. అందుకే ఒక్క దోమ కూడా నీ దరి చేరలేదు మై డియర్ నిష్.. ” అన్నది సారా 
 
          “సో స్వీట్ సారా ..” అంటూ సారా వైపు ఫ్లయింగ్ కిస్ చేత్తో విసిరింది నిష్కల .
 
          రాత్రంతా ఎలా గడపడం .. ఫోన్లో నెట్ వర్క్ చూస్తే పూర్ .. సోలార్ లాంతరు వెలుగులో పుస్తకం చదవడం కష్టం .  ఎలా గడపడం ముచ్చట్లతోనేనా .. అంటున్న నిష్కలవైపు చూస్తూ “ఒక్కసారి పైకి చూడు .. చుట్టూ చూడు” అన్నది సారా . 
ఆకాశంలో ఎక్కడ మబ్బు తునక మచ్చుకైనా కన్పించడం లేదు. వెండి  వెన్నెల విరిసింది.  ఆ వెన్నెల వెలుగులో నిర్మలమైన నది కొత్త అందాలు అద్దుకుంది.  స్వర్గం అంటే ఇదేనేమో.. తదేకంగా చూస్తూ అనుకుంది నిష్కల. 
 
          అలా చూస్తున్న కొద్దీ.. వెండి వర్ణంలో మెరిసిపోతున్న నీటిని తాకాలని, ఆ నీటిపై తేలియాడుతూ నదిలో విహరించాలని కోరిక బలంగా బయలుదేరింది ఆమెలో.  
ఆ మాటే సారా తో పంచుకుంది. 
 
          నిష్కల పైకి చాలా గంభీరంగా కనిపిస్తుంది. చాలా స్ట్రాంగ్ అనిపిస్తుంది కానీ చాలా సున్నిత మనస్కురాలు.  ప్రకృతి ప్రేమికురాలు.  ఇక నుండి చాలా క్యాంప్స్ చేస్తుంది. నేను పర్వతాలపై మోజు పడ్డట్టు , నిష్ నీటిపై మోజుపడుతున్నట్లుంది అనుకున్న సారా .. “మనం బోట్ తెచ్చుకోలేదు కదా .. రేపు ఉదయం పార్క్ ఆఫీస్ లో తెలుసుకుందాం . వాళ్ళు అద్దెకు ఏమైనా ఏర్పాటు చేయగలరేమోనని . అయితే రాత్రిపూట అనుమతించక పోవచ్చు. పగలు నదిలో విహరిద్దాం”  అని చెప్పింది. 
 
          నది మీదుగా మొదలైన పిల్లగాలులు వేగం పెంచడంతో గుడారంలోకి చేరారు ఇద్దరూ.  తను చూసిన అనేక ప్రకృతి వింతలు, విడ్డూరాల గురించి ఎదుర్కొన్న సవాళ్ల గురించి ముచ్చటించింది సారా. ఆ తర్వాత తను తెచ్చుకున్న నవల “ది కలర్ పర్పుల్ ” చేతిలోకి తీసుకుంది. 
 
          నిష్కల టెంటు కంతల్లోంచి ఆకాశాన్ని చూస్తున్నది. రోజంతా క్లయింట్స్ ..వాళ్ళు చెప్పేది వినడం. నోట్స్ రాసుకోవడం,. కౌన్సిలింగ్ ఇవ్వడం,  కేసు షీట్ ప్రిపేర్ చేసుకోవడం, వారి సమస్యలకు పరిష్కారం ఆలోచించడం లతో బిజీ బిజీగా ఉండే నేను మరొకరి గురించి ఆలోచనే రాకుండా .. చివరికి అమ్మ , అంకిత్ లను కూడా మరిపించే ప్రకృతి .. ఏంటో మనకు చాలా తెలుసనుకుంటాం కానీ ఏమీ తెలియదని అర్ధం అవుతున్నది. ఈ ప్రకృతి చేసే వింతల ముందు మనిషి తెలివితేటలు ఎంత? సముద్రంలో నీటి బొట్టంత. అనుకున్న ఆమె తనలో సౌందర్య అనుభవం పెరుగు తున్నట్టు ఫీలయింది. 
 
          టెంట్ క్యాంపింగ్ సైట్స్ పూర్తి సౌకర్యాలు ఉన్న వాటికంటే తక్కువ ధర,  హాయిగా నక్షత్రాల కింద ఆకాశ పందిరిలో  సేద తీరవచ్చు… అవతల ఎక్కువ ఖరీదైన సౌకర్యాలతో ఉన్న క్యాంపింగ్ సైట్స్ కూడా ఉన్నాయి. వాటిని కాకుండా ఈ గుడారాన్ని ఎంపిక చేసుకున్నందుకు, నదీతీరంలో సైట్ బుక్ చేసినందుకు మనసులోనే మరో మారు ధన్యవాదాలు చెప్పుకుంది నిష్కల. 
 
          ఆకాశంలో చుక్కల్ని చూస్తుంటే అత్తవాళ్ళ ఊరు వెళ్లినప్పటి చిన్ననాటి  వేసవి జ్ఞాపకాలు ముసురుకున్నాయి. ఆరుబయట నులకమంచాలు వేసుకుని వాటికీ రకరకాల పేర్లు పెట్టడం, చుక్కల్ని లెక్కపెట్టడం..  కొంత లెక్కపెట్టి ఆ లెక్క మరచిపోయి మళ్ళీ మొదటికి రావడం .. అలా లెక్కబెడుతూనే నిద్రలోకి జారిపోవడం .. 
 
          ఇండియాలో కూడా అద్భుతమైన ప్రకృతి , సుందరమైన ప్రదేశాలకు కొదువ లేదు. ఇటువంటి క్యాంపు సైట్స్ ఉన్నట్లు తెలియదు . ఉంటే హిమాలయ పర్వత సానువుల్లో ఉండి  ఉంటాయి . అవసరమైన సదుపాయాలతో .. ప్రాంతీయ ప్రభుత్వాలు సంస్థలు, ప్రయివేటు సంస్థలు  చొరవ చూపి అభివృద్ధి చేయాలి . ఏంతో రాబడి పొందొచ్చు కదా మనసులో అనుకుంది. 
 
          అయితే తన మాతృభూమిలో ఆమెకు ఇటువంటి అనుభవం లేకపోవడం వలన, ఆమె ప్రపంచంలో ప్రకృతితో సహజీవనం అంటే పల్లెటూళ్లలో ఉండడం అని మాత్రం అనుకునేది.  ఏంటో చిన్నప్పటి నుంచి అమ్మ, చదువు తో పాటు కొద్దిగా సాహిత్యం , సామజిక అంశాలు దృష్టిలోకి వచ్చినట్టు పర్యటనలపై ఎప్పుడు దృష్టి పెట్టలేదు. 
అక్కడుండగా క్యాంపింగ్ , ట్రెక్కింగ్ వంటివి పరిచయమైతే తాను కూడా సారా లాగే చేసేదేమో..  
 
          ఒకవేళ నేను వెళ్లాలన్నా అమ్మ మనస్ఫూర్తిగా పంపగలదా .. ఒక్కదాన్ని అడవులు , కొండలు గుట్టలు పట్టుకు తిరుగుతానంటే ఆమె ప్రశాంతంగా ఉండగలదా .. అసలు అక్కడ పరిస్థితులు ఆడపిల్లను చూసే మగవాడి దృష్టి అందుకు అనుకూలంగా ఉంటుందా .. అది సాధ్యం అయ్యే పని కాదేమో .. అనుకుంది నిష్కల   . 
 
          ఆమె ఆలోచనలకు భంగం కలిగిస్తూ మంద్రంగా వినిపిస్తున్న సంగీతం.  ఎక్కడో దూరం నుండి గాలి మోసుకొస్తున్నది. బహుశా గ్రూప్ క్యాంపు సైట్ నుండి  అనుకుంట. 
అర్ధరాత్రి వరకు ..రకరకాల వాయిద్యాలు చేస్తున్న చప్పుడు పచ్చిక బయళ్లు , గుడారాలు, వృక్షాలు దాటుకుంటూ.. నిశ్ఛలంగా నిర్మలంగా ఉన్న నది హృదయాన్ని మీటుతూ..  ఆ నది ప్రవాహంతో కలిసి చెట్టాపట్టాలేసుకుని  ప్రవహిస్తూ ..  ఏదో అద్భుత లోకం రూపుదిద్దు కుంటుంది ఆమె మదిలో.. 
 
          ఎప్పటికో నిద్ర పోయింది.  
 
          పక్షుల పలకరింతలతో మెలుకువ వచ్చి లేచి కూర్చుంది.  ఒక అద్భుతమైన అనుభూతి. గతంలో ఎన్నడూ పరిచయంకాని అనుభవం.  పక్కకు చూసింది సారా మెలుకువగా లేదు. నిద్రపోయిన సమయం తక్కువే. కానీ ఆ అలసట లేదు. బద్ధకం లేదు.  చాలా హాయిగా ఉంది. ఉత్సహంగా ఉల్లాసంగా మనసంతా.. బహుశా ఆ సంగీతం నన్ను నిద్రపుచ్చిందా .. ఆ వాతావరణం నిద్రపుచ్చిందా .. అలసిన శరీరమా .. లేక సారా తన చెల్లెలు అని రూఢి కావడమా .. ఏదేమైనా ఎటువంటి ఒత్తిడి లేకుండా అన్ని మరచి పోయి ఆదమరచి నిద్రపోయింది.  
 
          ప్రతిరోజు నిద్రపోతుంది. ఎన్నడూ లేని నిద్రానుభవం. ఎన్నాళ్ళయింది ఇంత గాఢ నిద్ర లోకి వెళ్లి.  ఇన్నాళ్లు తనకు పరిచయంలేని మరో ప్రపంచాన్ని పరిచయం చేసిన సారాకి మనస్ఫూర్తిగా మరో మారు ధన్యవాదాలు చెప్పుకుంది మనసులో. 
 
          బయటి నుండి వచ్చే ఉదయరాగాలు ఆమెను గుడారంలో నుంచి బయటకు రప్పించాయి. చీకటి రేకలు మాయమైపోతూ తూర్పున వెలుతురు రేకలు విచ్చు కుంటున్నాయి.  ఆ వెలుతురులో నదిని పరామర్శిస్తూ సాగుతున్న పక్షుల జంట .. అడవి పూల పరిమళాలు మత్తెక్కిస్తూ .. ఎదుట ఉన్న నదిలో కదలికలు తెస్తూ వరుసగా సాగిపోతున్నాయి కొన్ని పడవలు. 
 
          వావ్ అద్భుత దృశ్యం . 
 
          ఎవరో .. నాకంటే ముందే లేచి నదీమ తల్లి ఒడిలోకి వెళ్లారు అనుకుంటూ నెమ్మదిగా టెంటు లోకి వెళ్లి మొబైల్ అందుకుంది. తెల్లని పక్షులు ఒడ్డున ఉన్న చెట్టుపై చేరి ముచ్చట్ల గలగలలు.  నది కొంత దూరం నడిచి రెండు పాయలుగా చీలింది ఆ మధ్యలో చిన్న ఐలాండ్.  ఆ ఐలాండ్ లో చిన్న కొండ. పచ్చని చెట్లతో .. 
మబ్బుల్లోంచి మసక మసకగా కనిపించే కొండల వరుసలు.. 
 
          వావ్ .. ఏమా ప్రకృతి సోయగం .. 
 
          భానుడి రాకతో కొత్త అందాలు పులుముకుంటున్న నింగి , నేల , నీరు .. ఉత్కంఠగా చూస్తూ, వాటిని ఆస్వాదిస్తూ ఫోటోలు తీసుకుంది . నదిలాగే మనిషి కూడా .. నిత్యం మనిషి ప్రవహిస్తూనే ఉంటాడు. ఉండాలి కూడా.. కానీ కొందరు కులం, మతం, జాతి అంటూ  వెనక్కు ప్రవహిస్తున్నారు నదులు అలా వెనక్కి నడుస్తాయా..?! మనిషేందుకు అలా నడుస్తున్నాడు? నది ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని, కొత్తనీరు ను తనలో కలుపు కుంటూ పాతను వదిలేస్తూ తన పరివాహక ప్రాంతాన్ని సారవంతం చేస్తూ ముందుకు సాగుతుంది. మనిషికూడా ముందు తరాల వేసిన బాటల నుండి కొత్త బాటలు వేసుకుంటూ తనకు తాను మరింత సారవంతం అవుతూ పోవాలి కదా.. వెనక్కి నడిచే మనిషి మాత్రం వేలయేళ్ళుగా తన తెలివితేటలతో సంపాదించుకున్న అనుభవసారం అంతా బూడిదలో కలిపేస్తూ, పనికిరావని వదిలేసిన, వదిలేయాల్సిన వాటి వెంట పరుగులు పెడుతూ, తనకు తాను బందీ అవుతూ దేశ భవిష్యత్తును అగాధంలో తోసేస్తున్నాడు. ఒకసారి అగాధంలో పడిన తర్వాత దాంట్లో నుంచి బయటపడడం సాధ్యమా.. మాతృదేశంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తున్న నిష్కల ఆవేదన పడింది. 
 
          వెనక్కి నడిచే వ్యక్తుల వల్ల ఎదురవుతున్న కొత్త అణచి వేతలను అమ్మ బాగా అర్ధం చేసుకుంది.  సమాజంలో వేగవంతమైన మార్పుల్ని అందుకుంది. ఇప్పుడు ఈ నది అమ్మ మాటలకు అర్థం చెప్పింది. అమ్మలాగా నిరంతరం క్రియాశీలంగా కనిపిస్తున్న డలావెర్ నదిలో నీటిని దోసిట్లోకి  ఆత్మీయంగా తీసుకున్నది. అందులో తల్లి స్పర్శ చూసుకున్నది నిష్కల.  
 
          తన అనుభవాలన్నీ అమ్మకు పూసగుచ్చినట్లు చెప్పాలని ఆ బిడ్డ మనసు తహతహలాడింది. అమ్మకు ఈ ఫోటోలు పంపించాలి. అమ్మ కోరికలు ఏమిటో.. 
బహుశా అమ్మకి కూడా నాన్నలాగే ఎటైనా వెళ్లి రావాలని కోరికలు ఉన్నాయేమో.. 
ఛ ఛా .. తనకెప్పుడు అటువంటి ఆలోచనే రాలేదు .. తప్పు చేసిన దానిలా ఫీలయింది. 
అడగాలి. అమ్మను అడిగి తెలుసుకోవాలి. ఈ సారి ఇండియా వెళ్ళినప్పుడు అమ్మను తీసుకుని ఆమెకు ఇష్టమైన ప్రదేశాలకు తీసుకొని వెళ్ళాలి. అమ్మకు కొత్త అనుభవాలు పరిచయం చేయాలి అనుకుంటున్న ఆమె ముందుకు అకస్మాత్తుగా అంకిత్ ప్రత్యక్షం అయ్యాడు. 
 
          నీవు ఔనంటే, మనిద్దరం అమెరికా అంతా  ఒక చుట్టు చుట్టేద్దాం అంటూ తనని చుట్టేసినట్లనిపించి సన్నగా నవ్వుకుంది.  సారా తండ్రి ఎప్పుడు తనతోనే ఉంటాడని చెప్పినట్లే అంకిత్ కూడా ఎప్పుడు తనతో ఉంటున్నాడు.  అని అతని గురించి ఆలోచిస్తూ నది నుంచి వెనక్కి వచ్చింది.  
 
          స్నానాదులు ముగించుకుందామని వాష్ రూమ్స్ కేసి నడిచింది. వాష్ రూమ్స్ గ్లామరస్ గా లేవు కనీస సౌకర్యాలు బాగానే ఉన్నాయి. కాకపోతే షేరింగ్ కావడం వల్ల వేచి ఉండాల్సి వచ్చింది . వేడినీటి షవర్స్ ఉండడం వల్ల స్నానానికి ఇబ్బంది కాలేదు. 
 
          అంతలో సారా వచ్చి రాత్రి బాగా నిద్ర పట్టిందా అడిగింది .  సూపర్ సింప్లీ సూపర్బ్ అనడం తప్పేమో . తక్కువేమో.. సారా. చాలా చాలా బాగా నిద్ర పోయాను. ఈ మధ్య కాలంలో ఇంత హాయిగా ఎప్పుడు లేనేమో .. అన్నది నిష్కల. 
 
          ప్రశాంతంగా ఉన్న నిర్మల మొఖంలోకి చూస్తూ “నిజమా .. అది ప్రకృతి మహత్యం తల్లీ.. కాంప్ ప్రదేశం నిశ్శబ్దంగా ఉండాలని , వినయంగా ప్రవర్తించాలని నిర్వాహకులు చెబుతూనే ఉన్నారు. అయినా రాత్రి ఆ గ్రూప్ క్యాంపర్స్ నియమ నిబంధనలు మరచి ప్రవర్తించారు. ఎంత మంది తిట్టుకున్నారో ..” అంటూ తెచ్చిన క్యాంపింగ్ స్టవ్ పైన కోడిగుడ్డు ఉడకేసింది సారా.  
 
          డలావెర్ నది ఒడ్డున ఉదయపు కాఫీ తీసుకుంటూ తమ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఈ రోజు కొన్ని ట్రైల్స్ లో, వాటర్ ఫాల్స్ కి వెళ్లి  వద్దాం .  అట్లాగే క్యాంపు ఆఫీస్ లో కయాకింగ్ కి , బోటింగ్ కి ఏమైనా వీలవుతుందేమో చూద్దాం అన్నది సారా .. 
 
          ఉదయం ఎంత త్వరగా ట్రైల్స్ వెంట వెళ్తే తక్కువ జనం ఉంటారని రేపు త్వరగా బయలుదేరి మౌంట్ తమ్మనీ ట్రైల్ , గర్వే స్ప్రింగ్స్ ట్రైల్  నుంచి పైకి సన్ ఫిష్ పాండ్ చేరాలని నిర్ణయించుకున్నారు . 
 
          సారా ఫ్రెష్ అయి బ్రేక్ఫాస్ట్  సిద్ధం చేసే వరకు నిష్కల నదిలో చేప పిల్లలతో ఆడు కుంటూ ఉన్నది. పక్క టెంటు లోంచి నాలుగేళ్ళ పిల్లవాడు నీటికేసి పరిగెత్తుకువస్తుంటే ఆ పేరెంట్స్ అతన్ని కాచుకుంటూ ఇబ్బంది పడిపోతున్నారు. చాలా చాలా చలాకీగా ఉన్న ఆ బుడ్డోడు అయితే రోడ్డు వైపుకు , లేదంటే నది కేసి పరుగులు తీస్తూ .. ఒక ఆట ఆడుకుంటున్నాడు. చంటి పిల్లవాడిని స్ట్రాలర్ లోనో టెంటులోనో ఉంచి పెద్దవాడి వెనుక పరిగెత్తి అలసిపోయారు ఆ తల్లిదండ్రులు . 
 
          కుడివేపు నుంచి ఓ వృద్ధ జంట కర్ర సహాయంతో నెమ్మదిగా నది ఒడ్డున ఉదయపు నడక సాగిస్తూ ఎదురు పడిన నిష్కలను హాయ్ అంటూ పలుకరించారు. తాను కూడా వాళ్లకు ప్రతి నమస్కారం చేసి తమ టెంటు కు చేరింది నిష్కల. 
 
          అప్పటికి సారా సిద్ధమై పోయింది. ఉడకబెట్టిన గుడ్డు ,  బ్రెడ్ తో శాండ్విచ్  చేసింది. ఆ తర్వాత ఆపిల్  తో వారి బ్రేక్ఫాస్ట్ ముగిసింది. 
 
          క్యాంపింగ్ఆ ఫీస్ కి వెళ్ళారు . ఆ స్టేట్ పార్క్ కి సంబంధించి, జంతు జీవజాలం కు సంబంధించిన సమాచారంతో కూడిన పాంప్లెట్స్ ఉన్నాయి . పార్క్ ట్రయల్స్ లో తికమక పడకుండా ఉండటం కోసం మ్యాప్స్ తో కూడిన బ్రాచర్ తీసుకున్నారు.  
తక్కువ ధరలో మంచి ఫైర్ వుడ్ అమ్మకానికి ఉంది . అది కొంత కొనుక్కున్నారు.
అయితే బోటింగ్ చేయడానికి బోట్స్ అందుబాటులో లేకపోవడంతో ఉసూరుమంది సారా. 
 
          ఫర్వాలేదులే ఈ సారి వచ్చినప్పుడు మనమే బోట్ తెచ్చుకుందాం అని చెప్పింది నిష్కల. మొదటి సారి క్యాంపింగ్ కి వచ్చిన అక్కడికి వచ్చిన వారిని పలుకరిస్తూ వారి కాంపింగ్ అనుభవాలు తెలుసుకుంటున్నది.  
 
          అక్కడ పరిచయమైన ఒక క్యాంపర్ తన చిన్నతనం నుండి వస్తున్నానని చెప్పాడు. అప్పటికీ ఇప్పటికి క్యాంపు సైట్ ఏమి మారలేదని , క్యాంపర్స్ మాత్రం బాగా పెరిగారని చెప్పాడు . తనకు వర్తింగ్టన్ స్టేట్ పార్క్ లో క్యాంపింగ్ రావడం అంటే చాలా ఇష్టమైన దని,  తనకు ఈ క్యాంపు సైట్స్  ఎన్నో సంతోషాల్ని పంచాయని, తన మనసెప్పుడు బాగోక పోయినా ఇక్కడికి వచ్చేస్తానని చాలా ఉద్వేగంతో చెప్పాడు. 
 
          అక్కడే కనిపించిన మరొక వ్యక్తి  తన క్యాంపు సైట్ అస్సలు బాగుండలేదన్నాడు.  టాయిలెట్స్ లో రన్నింగ్ వాటర్ లేవు.  కరెంట్ లేదు.  షవర్స్ లేవు.  గిన్నెలు కడిగే సింక్ లోనే తల కడుక్కోవాలి.  లోపలి రోడ్లు అక్కడక్కడా గుంతలతో విసుగ్గా ఉంది.  
ప్రశాంత కూడా కొరవడింది. అందుకే వెళ్లిపోవాలను కుంటున్నాను.  మూడు రోజులకు కట్టిన సొమ్ములో ఒకే రోజు వాడుకున్నాడు కాబట్టి మిగతా రెండు రోజుల సొమ్ము వాపస్ ఇవ్వమని మేనేజర్ తో వాదన చేస్తున్నాడు.  
 
          మోటార్ హోమ్స్ నిష్కలకి చాలా నచ్చేశాయి. దాదాపు డెబ్భై దాటినమహిళ పెన్సిల్వెనియా నుంచి  ఒక్కటే  మోటార్ హోమ్ వేసుకు వచ్చింది. ఆమె ఎప్పుడు అంతేనట. ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి తన మోటార్ హోమ్ లో తిరిగేస్తుందట.
ఆ మోటారు హోమ్ లోకి వెళ్లి చూడాలని అనిపించింది నిష్కలకు.  అడిగితే ఏమనుకుంటుందో అని సందేహిస్తూ అడిగింది. అందుకామె చాలా సంతోషిస్తూ తన మోటార్ హోమ్ కి తీసుకుపోయింది. 
 
          ఒక ఇంట్లో ఉన్న సదుపాయాలన్నీ ఉన్న మోటారు హోమ్ తో ప్రయాణం భలే ఉంటుంది కదా అన్నప్పుడు ఆ మహిళ తన ట్రావెలింగ్ విషయాలు చాలా సేపు ముచ్చట పెట్టింది నిష్కలతో .  ఆ తర్వాత స్టార్ లో తనకు కావాల్సిన వస్తువులు తీసుకుని వెళ్ళిపోయింది. 
 
          క్యాంపు సైట్ వైపు నడుస్తూ ఇక్కడ పొగతాగరాదని బోర్డు చూసి “యిది కూడా నాకు చాలా నచ్చేసింది ” అన్నది  నిష్కల 
 
          “ఏది “
 
          “ఇంత మంచి పరిశుభ్రమైన వాతావరణాన్ని సిగరెట్ పొగతో కాలుష్యం చేయక పోవడం చాలా మంచిది. అయితే నాకో సందేహం సారా .. 
 
          ” ఏమిటో .. “
 
          “సిగరెట్ ప్రియులు అది లేకుండా ఉండలేరంటారు కదా .. ఇలా వచ్చినప్పుడు ఇబ్బందే కదా ..” 
 
          ” వాళ్ళకి ఇబ్బంది అనుకుంటే పెద్ద ఇబ్బందులు వచ్చేస్తాయి . 
 
          ఎవడో సిగరెట్ కాల్చి ఆర్పకుండా పడేశాడనుకో .. ఏమవుతుంది .. మైళ్లకొద్దీ ఉన్న ఈ హరితారణ్యం కాలి బుగ్గి అవుతుంది .  అట్లా చేయక పోయినా ఇక్కడి వాతావరణం కాలుష్యం కోరల్లో చిక్కుకుంటుంది .  ఇక మనం ఇక్కడిదాకా వచ్చి లాభం ఏమిటి ? “
 
          “అవుననుకో ..” 
 
          “నువ్వన్నట్లు సిగరెట్ పొగ పీల్చకుండా ఉండలేని వాళ్ళు ఎలక్ట్రానిక్ స్మోకింగ్ డివైజ్ వాడుకోవచ్చు .
 
          ఇక్కడ మద్యం కూడా నిషేధమే.  కాబట్టి మద్యం సేవించి అబ్యూజ్ చేసేవాళ్ళు కనిపించరు. అందువల్ల మనలాంటి వాళ్ళు ఒక్కరు అయినా ఎటువంటి భయాలు లేకుండా రావచ్చు. ప్రకృతిని వీలైనంత వరకు సహజంగా ఉండేలా కాపాడుతున్నారు నిర్వాహకులు ”  వివరించింది సారా. 
 
          “ఇందాక ఒకావిడతో మాట్లాడాను చూడు.  ఆ పెద్దావిడ సోలో క్యాంపర్. వయసుతో సంబంధం లేకుండా ఆవిడ మోటార్ హోమ్ లో సోలో ట్రిప్స్ చేయడం , క్యాంప్స్ కి వెళ్లడం నాకయితే భలే నచ్చేసింది. ఎప్పటికయినా నేను కూడా అలా తిరగాలని.. ” అడ్మయిరింగ్ గా అన్నది నిష్కల 
 
          ఒక క్యాంపు సైట్ దగ్గరలో పెట్ డాగ్ చేసిన షిట్ ని ప్లాస్టిక్ బ్యాగ్ లోకి తీస్తూ కనిపించింది ఓ యువతి. అది చూస్తూ మొహం ఎలాగో పెట్టింది నిష్కల. అసలే ఆమెకు కుక్కలు, పిల్లులు అంటే ఎలర్జీ. 
 
          అది చూసి నవ్వుకుంటూ “పెట్స్ పెంచు కోవడం, ఆనందపడడం మాత్రమే కాదోయ్ ఈ పని కూడా చేయాలి మరి. క్యాంపు సైట్స్ మాత్రమే కాదు ఈ ప్రాంతంలో ఎక్కడైనా ఇంతే. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత మనదే.  ఎటు వంటి వ్యర్ధాలనైనా మన వ్యర్ధాలను మనం ఇక్కడ వదల కూడదు.  అందుకే రెండు రకాల చెత్త బాగ్స్ ప్రతివాళ్ళు తెచ్చుకుంటారు. ఒకవేళ తెచ్చుకోకపోతే ఇక్కడి స్టోర్ లో కొనుక్కుంటారు ” వివరించింది సారా. 
 
          బాగ్ లో స్నాక్ బార్ లు, వాటర్ బోటిల్ వంటి కొన్ని అవసరమైన వస్తువులు తమ బ్యాక్ ప్యాక్ లో పెట్టుకుని ట్రైల్స్ వైపు బయలుదేరారు. కొద్ది దూరం కారులో వెళ్లి పార్కింగ్ ఏరియాలో పార్కు చేసుకున్నారు.  ఆ తర్వాత కాళ్లకు పనిచెప్పారు ఇద్దరూ . 
 
          నిలువెత్తు పెరిగిన పైన్ వృక్షాలు , రెడ్ మాపిల్ , సిల్వర్ మాపిల్ , షుగర్ మాపిల్ ఆష్ ట్రీ బ్లాక్ గం వంటి అనేక రకాల వృక్షాల మధ్య నుంచి  సన్నని నడక దారుల్లో నడక.  ఒకప్పుడు చాలా దట్టంగా ఉండే అడవి ఇప్పుడు పలుచబడింది అని చెప్పింది సారా. 
పచ్చని పచ్చికపై గెంతే జింకలు, దుప్పులు .. గడ్డి దుబ్బుల్లోకి పరిగెత్తే కుందేళ్లు .. కొత్తగా ఏమీ అనిపించలేదు నిష్కలకు. తన ఇంటి దగ్గర కూడా అవి ఎప్పుడు కనిపిస్తూనే ఉంటాయి కాబట్టి. 
 
          దూరంగా ఆవలి వైపు కనిపించే పర్వతాల వరుస ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. వాటిని చూపిస్తూ అప్పాచియాన్ పర్వతశ్రేణి అంటూ చూపింది సారా. 
 
          “అంటే, నువ్వు వెళ్ళినవే కదూ.. అలా పర్వతాల్లో హైకింగ్ చేయడం అది నెలల తరబడి .. నీ అవసరాలన్నీ తీర్చుకోవడం ఎలా ? కావలసిన వస్తువులన్నీ మోసుకెళ్ళావా? ఆ బరువుతో నడవడం, హైకింగ్ చేయడం ఎంత కష్టం .. వామ్మో .. నావల్ల అస్సలు కాదు” అన్నది నిష్కల. 
 
          “ఎప్పుడు కొద్దిగా ఆహారపదార్ధాలు, ఇతర నిత్యావసరాలు, తేలికగా ఉండే దుస్తులు, ఫ్లాష్ లైట్, అత్యవసరంగా వాడే మందులు వంటివి కొన్ని మనతో ఉంచుకుంటే సరిపోతుంది. ఎంత ఎక్కువ బరువు మనతో ఉంటె అంత కష్టం.  మన బ్యాక్ ప్యాక్ ఎంత తేలికగా ఉంటే అంత సులభం.  మనకి కావలసిన వస్తువులు సమీపంలోని పట్టణాల్లో ఎప్పటికప్పుడు కొనుక్కోవచ్చు.  ఇట్లా క్యాంపింగ్ సైట్స్ లలో ఉండే స్టోర్స్ లో కొనుక్కోవచ్చు. 
 
          అమెరికాలో ఎక్కడికి వెళ్లినా గొప్ప క్యాంపింగ్ సైట్స్ ఉన్నాయి .  ప్రతి రాష్ట్రము తన ప్రత్యేకమైన విధి విధానాలతో పర్యాటకులను క్యాంపింగ్ కి అనుమతిస్తుంది” అంటూ చాలా విషయాలు నిష్కలతో సారా పంచుకున్నది.  . 
 
          ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యాలు కళ్ళలో పదిల పరుచుకుంటూ, మొబైల్ కెమెరా లో సహజ అద్భుతాలు బందిస్తూ సాగింది నిష్కల. సారా దగ్గర కానన్ లేటెస్ట్ మోడల్ కెమెరా ఉంది. దానితో అప్పుడప్పుడు ఫోటోలు తీస్తున్నది సారా .   
 
          రాళ్ల మీదుగా బ్లూ ట్రయిల్  కొండ ఎక్కి కిందికి  చూస్తే అద్భుతమైన దృశ్యం..
ఆ సోయగాన్ని అనుభవించి తీరాల్సిందే.. మాటల్లో ఎంత చెప్పినా తక్కువే  ఆకుపచ్చని దట్టమైన అడవి . మధ్యలోంచి కొండ చుట్టూ సాగిపోతున్న వంపులు తిరుగుతూ సోయగాలు ఒలకపోస్తున్న  నీటి పాయ. ఆ పాయ ఒక చోట చీలి మళ్ళీ కల్సింది . ఆమధ్యలో ఏర్పడ్డ చిన్న దీవి పచ్చని చెట్లతో . బహుశా అది ఉదయం నది ఒడ్డునుండి చూసినదే కావచ్చు అనుకుంటూ చిన్నపిల్లయి పోయింది నిష్కల.  ఓ అంటూ రెండు చేతులు పైకెత్తి  గట్టిగా అరిచింది. ఆ కొండ కోనల్లో ఆమె గొంతు ప్రతిధ్వనించింది. 
నిష్కల ఉత్సాహాన్ని, ఆనందాన్ని, ఉద్వేగాన్ని అప్పటికప్పుడు భంగపరచడం ఇష్టం లేని సారా చిన్నగా నవ్వుకుంది. అలా అరవడం వల్ల వన్యప్రాణులు భయ భ్రాంతులకు లోనవు తాయని ఆ తర్వాత నెమ్మదిగా చెప్పింది. సిల్లీగా ప్రవర్తించాను అని సిగ్గుపడింది నిష్కల. 
 
          డలావెర్ వాటర్ గాప్ లో ఉన్న జలపాతాలు దగ్గరకు వెళ్లేసరికి  వర్షం మొదలయింది. కాసేపు ఓ పెద్ద చెట్టు మొదట్లో ఆగారు.. వర్షం పడుతూనే ఉంది.
ఇక ఆగదలుచుకో లేదు.  జనం పెద్దగా కనిపించలేదు. లారెల్ ఫాల్స్ , లోయర్ వాటర్ ఫాల్. రోడ్ కి పావు మైలుదూరంలో పై వాటర్ ఫాల్ .. ఇంకాస్త ముందుకు పోతే బిగ్ టాక్స్ క్రీక్ ఫాల్స్ . కొండ రాళ్లపై నుండి జాలు వారుతున్న జలపాతం .. ఆ జలపాతం కిందకు చేరారు . తడిసి ముద్దయ్యారు. కొందరు పిల్లలు , పెద్దలు ఆ నీటి లో జలకాలాడుతూ .. 
రాతిపై కూర్చుని కిందకు వంగి చేపల్ని పట్టే యత్నం చేస్తూ .. కొందరు తమ పెట్స్ తో .. 
 
          సారా తన బాయ్ ఫ్రెండ్ తో వచ్చినప్పటి విశేషాలు చెబుతున్నది . ఆ వాటర్ ఫాల్స్ కు సంబంధించిన అనేక విషయాలు చెబుతున్నది కానీ అవేమీ నిష్కల చెవిన పడడం లేదు. జలపాతపు హోరు ఆమె గుండెలో సవ్వడి చేస్తున్నది.  అంకిత్ పదే పదే  కళ్ళ ముందుకు వచ్చి అల్లరిచేస్తున్నాడు.
 
          అక్కడి నుండి మరో చోటుకు బయలుదేరారు. 
 
          వానకు తడిసిన ఎండు ఆకులపై కనిపించిన పెద్ద కప్ప.. గోండ్రు కప్ప.. గాజు పురుగులు , సెంటిపెడ్స్  ఏవేవో ..  వాటిని చూస్తే నిష్కల ఒళ్ళు జలదరించింది.  
ఆ చెట్టు కింద ఆగినప్పుడు చెట్లకి ఉండే చీమలు లాంటి సన్న క్రిమి కీటకాలు  కుట్టి దద్దుర్లు రావడంతో వాటిని తడుముకుంటున్నది.  క్రీం రాసినప్పటికీ ఆమె చేతులు అక్కడికే వెళ్తున్నాయి.  నడుస్తున్నదల్లా ఆగి, “వేసిన బాటలో కాకుండా కొత్త బాటలు వేసుకుంటూ వెళదామా” అడిగింది సారా 
 
          “తప్పిపోతే ” నిష్కల .. 
 
          “చూద్దాం” అంటూ కొత్త బాటలో వెళ్లడం మొదలు పెట్టింది సారా.  ఆ వెనుకే, ఆమెను మౌనంగా అనుకరిస్తూ  నిష్కల.  మౌనాన్ని ఛేదిస్తూ “”నాకు నేను ఛాలెంజ్ చేసుకోవడం సవాళ్లు విసురుకోవడం నాకిష్టం” అన్నది సారా. తనకి కూడా కొత్తదారుల్లో నడవడం ఇష్టం. మరి, ఇద్దరమూ అక్కచెల్లెళ్ళమే కదా ..అని మనసులోనే అనుకున్నది నిష్కల. 
 
          తిరిగి వచ్చేటప్పుడు మోకాళ్ళ నొప్పి .. చేతిలో కర్ర సాయంతో వర్షం రావడం వల్ల జారుడుగా  మారిన ఎత్తుపల్లాల నేల, రాళ్ళూ..  జాగ్రత్తగా నడుస్తూ.. కారు పార్క్ చేసిన చోటుకు చేరుకున్నారు. 
 
          ఆ తర్వాత సూర్యాస్తమయాన్ని ప్రవహిస్తున్న నదిని ఆస్వాదిస్తూ క్యాంపింగ్ ఏరియా కి  ప్రయాణమయ్యారు. సారా తండ్రి గురించి ఉన్న తన సందిగ్దాలు తీర్చుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నది నిష్కల. 

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.