క ‘వన’ కోకిలలు – 14 : 

ఆధునిక బెంగాల్ కవయిత్రులు ఓ నలుగురు 

   – నాగరాజు రామస్వామి

          “అజ్ఞాత అప్సర నా ఆత్మను అపహరించిన ఆ మంచు మంటల వేళ, నాకు దేహంలేదు, అశ్రువులు లేవు; ఓకవితల మూట తప్ప.” – ఎలీనా శ్వార్ట్స్.

          నాడు ఆ మూటలను బుజాల మీద మోసే వారు కవులు;కొంత ఆలస్యంగా నైతేనేమి, ఈ నాడు నెత్తిన పెట్టుకుంటున్నారు కవయిత్రులు. 

          కళలకు, కవిత్వానికి కాణాచి బెంగాల్. సాహిత్య క్షేత్రంలో మౌళికమైన మార్పులు 19వ శతాబ్దం చివర నుండి 20వ శతాబ్దపు తొలి దశకాలలో వచ్చిన పునర్వికాస (Renaissance) దశలో చోటుచేసుకున్నవి. ఆ కాలంలోనే బెంగాల్ కవయిత్రులలో సాహిత్య నవచైతన్యం అంకురించిందనాలి. వంటింటి వసారాను వదలకుడానే,  తమ అంతరంగపు లోగిలిలోని సృజనాత్మకతను నవనవంగా ఆవిష్కరిచసాగారు.  నవీన భావ ప్రకటనతో పాటు, నవ్య ప్రక్రియా అభివ్యక్తిని ఆవిష్కరించే పనిలో పడ్డారు. క్లాసికల్  శైలీ రచనలకు ఒకింత పక్కకు జరిగి, అందుకుభిన్నమైన అధునక  శైలీ శిల్పాలను ఆశ్రయించారు. నేడు, స్వేచ్ఛాకవిత్వం భావ పరంగానూ, ప్రక్రియా పరంగానూ కొత్త పుంతలు తొక్కుతున్నది.  మోడరన్ కవిత్వం నుండి పోస్ట్ మాడరన్ కవిత్వం దాకా సాగుతున్న సాహిత్య ప్రస్థానంలో మహిళలు తమ వంతు పాత్రను పోషిస్తున్నారు.  లలితమైన కవిత్వంతో పాటు సామాజిక చైతన్యం, స్త్రీవాద కవిత్వం, విప్లవ కవిత్వం లాంటి నవీన భావ ధోరిణి బెంగాల్ రచయిత్రులలో పరిణత స్థాయికి చేరిదనడంలో సందేహం లేదు. ఈనాడు, సంఖ్యా పరంగానూ బెంగాలీ కవయత్రుల ఉపస్థితి తక్కువేమీ కాదు. నిజానికి, కవయిత్రుల దీర్ఘజాబితాలో శ్రేష్ఠులను ఎంచు కోవడం కష్టమైన పని. అందుకే మచ్చుకు ఓ నలుగురిని (వారి కవనాలను) రాండమ్ గా  ఎన్నుకోవడం జరిగింది. ఇదిగో వారే వీరు: 

  1. విజయ ముఖోపాధ్యాయ్: 

          బొంగ్లాదేశ్ లోని బిక్రంపూర్ లో 1939 లో జన్మించింది. కలకత్తాలో చదువు కుంటున్న నాటి నుండి కవిత్వం రాస్తున్నది. ఆమె రచనలలో స్మృతి కవిత్వంతో  పాటు సామాజిక చైతన్యం ప్రతిఫలిస్తుంది. సంస్కృత ఉపాధ్యాయినిగా ఆమె రాసిన  ‘మృచ్ఛకటిక సమాజ్ చరిత్ర’ సనాతన సమాజ జీవన విధానానికి అద్దం పట్టిన రచన. ఆమె రచించిన రెండు కవన సంపుటులు సహా పలు కవితలు విస్తృతంగా అనువదింప బడ్డాయి. 2004 లో ఆమెను జాతీయ కవిగా ప్రసార భారతి ప్రకటించింది. ఆమె ఒక  కవితకు నా అనువాదం: 

       : నీవు వచ్చినప్పుడు :

        (When You Come)      

నీవు వచ్చినప్పుడు

నా హృదయంలో వర్షం కురుస్తుంది.

గడ్డి పరక లాంటి నాజూకు వేళ్ళకు

ఎన్నాళ్ళ నుండో మూసుకున్న తలుపులు

ప్రగాఢ విశ్వాసంలోకి తెరచు కుంటవి.

నీవు వచ్చినప్పుడు

నా హృదయంలో వర్షం కురుస్తుంది.

                     – విజయ ముఖోపాధ్యాయ్.

  1. దేబరతి మిత్ర:

          1946 లో జన్మించింది. జాదవపూర్ యూనివర్సిటీలో చదివింది. ఆమె రాసే  ఆధునికానంతర నవ్య కవిత్వం వ్యంగ్యార్థ సూక్ష్మాలతో, అధివాస్థవిక భావచిత్రాలతో, రూపకాలతో ధ్వన్యనుకరణ గాయన బాణీలో ఉంటుంది. ఆమెకు వాదాలు (isms) నచ్చవు. 1995 లో ఆమె ప్రతిష్ఠాత్మకమైన ‘ఆనంద పురస్కార్’తో సన్మానింపబడిది. ఆమె ఓ కవితకు నా అనువాదం.

           : జ్ఞాపకం ఒక శూన్యం :

       ( Memory, an emptiness )

 జ్ఞాపకం ఒక శూన్యం,

ఆకు పచ్చ – నీవు మెల్లమెల్లగా పచ్చనౌతుంటావు

రేయి రెప్పల హిమ బిందువులతో నీ గుండె నిండుతుంది.

ఉప్పొంగిన తరంగాలు 

చంద్రున్ని మతిలతో నింపేస్తవి,

ప్రేమ పొంగు –

నేను కింది లోకాల లోలోతుల్లోకి కూరుకు పోతాను;

మళ్ళీ కొత్త ఆట మొదలౌతుంది,

శిథిలాలకేసి తెరుచుకుంటున్న 

కుంగి పోతున్న తలుపు వద్ద నన్ను నిలబెడుతుంది,

రోజు రోజంతా నీటి సవ్వడి;

జ్ఞాపకం ఒక శూన్యం

వట్టి తడి శబ్దం. 

  1. నమితా చౌదరి: 

          నమితా చౌదరి (1949) బెంగాల్ లోని జాదవపూర్ యూనివర్సిటీ విద్యార్థి. ప్రస్తుతం కోల్ కత్తాలో స్కూల్ టీచర్. ఆమె కవిత్వం చాలా వరకు ఆత్మాశ్రయ భావగీతాలతో నిండి ఉంటుంది. సామాజిక ప్రయోజనాదృక్పథం కలిగి ఉంటుంది. 

          భర్త సహకారంతో, ఆమె ‘నందిముఖ్ సంసద్’ అనే కవిత్వ, కళారూపాల సంస్థను నడిపిస్తుంటుంది. పాకిస్థాన్-ఇండియా పీపుల్స్ ఫోరమ్ లో పాల్గొంటుంది. ఆమె కోల్ కత్తా ఇంటర్ నేషనల్ ఫౌండేషన్ సభ్యురాలు. ఆమె కవితలు రెండు.

        పద శకలాలు – l 

    (Fragmented Words – l)

రెక్క విరిగిన పదాలు

మెట్ల మీద రోదిస్తుంటవి,

నా వేలి స్పర్శకు  

ముడుచుకు పోతూ ముక్కలౌతుంటవి, 

మెట్ల దిగువన పడిఉన్న వాటి చుబుకాల్ని 

ప్రేమతో లేవనెత్తుతానా 

అవి మరింత శోకిస్తుంటవి.

ఇదేం గొడవ అనుకుంటూ నేను 

నా తలుపులను మూసేస్తాను;

అవి తిరిగి తిరిగి 

సాహస కథలై, పత్రికల తాజా కథనాలై

తలుపు సందుల్లోంచి కారి పోతుంటవి;

వాటి సిరా కారి 

నా చీరను తడుపుతుంటుంది. 

నా పదాలలో నేనే ఖైదీని.

          పద శకలాలు – ll 

    (Fragmented Words – ll)

ప్రతి పూర్ణ పదం తనలో

పదాల శకలాలను దాచుకుంటుంది,

విరిగిన పదాలు నాని మెత్తగా ముద్దకట్టి, పల్చనై

పేరాల సందుల్లోంచి కారి పోతుంటవి,

నీ నా చర్మాలను చీల్చుకొని 

తిరిగొచ్చిన పదాలు 

లుప్తమైన అర్థాలను వెదకుతుంటవి,

నా మెదడు లోంచి పదాలు ఎగిరి పోయి

తెంపరి గాలిలో తేలుతుంటవి.

అంతిమ సదేశం ఒకటే:

నెగడు చుట్టూ సాగే నృత్య కేళిలో 

మనం కునికిపాట్లు పడుతున్న కోడి పెట్టలం. 

  1. మందాక్రాంత సేన్:

          మందాక్రాంత సేన్ (1972) బెంగాల్ యువ కవయిత్రి. గీత రచయిత్రి, సంగీత స్వరకర్త, ఫిక్షన్ రైటర్, నాటక కర్త, పుస్తక శిల్పి. బంగ్లా భాషలో రాస్తుంది. ఆమెను ఎన్నో పురస్కారాలు వరించాయి. ఆమె తొలి కవితా సంపుటి “ఆనంద పురస్కార్”, గెలుచు కుంది. 2004 లో ఆమెకు సాహిత్య అకాడెమీ గోల్ డెన్ జూబిలీ అవార్డ్ లభించింది. ప్రతిష్ఠాత్మకమైన క్రిత్ తిబాస్, ఆకాష్ బంగ్లా బర్ష్ సమ్మాన్ లాంటి పురస్కారాలను స్వంతం చేసుకుంది. M.B.B.S చదువును అర్ధంతరంగా ఆపేసి సాహిత్యాన్ని ఎంచుకుంది. నిరంకుశ నిర్భయ స్త్రీవాద రచయిత్రి. 

*****                  

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.