మా కథ (దొమితిలా చుంగారా)- 36

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          బడి ప్రారంభోత్సవంనాడు మంత్రులొచ్చారు.’ పత్రికలవాళ్ళోచ్చారు. ప్రారంభోత్సవం అప్పుడు. మహా ఆడంబరంగా జరిగింది. “ప్రభుత్వ నిర్మాణాల సంఖ్యకు మరొకటి జత కూడింది” అంటూ మంత్రులు గప్పాలు కొట్టుకున్నారు. “ప్రభుత్వం ప్రజల పట్ల తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తోంది. బారియెంటోస్ ప్రభుత్వం మొట్టమొదట రైతు గురించే ఆలోచిస్తుంది. బొలీవియన్ రైతు ఇంకెంత మాత్రమూ గత కాలపు అజ్ఞాని కాగూడదు! ఇదిగో అందుకు రుజువు చూడండి. జనం కోసం పాఠశాల!” అని వాళ్లు ఉపన్యాసాలు దంచారు.

          పెద్ద మనుషులందరూ ఒకళ్ళనొకళ్ళు అతి గౌరవంగా ఆహ్వానించుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు, పరస్పరం మాట్లాడుకున్నారు. ఉపన్యాసాలోపిగ్గా విన్నారు. పనంతా చేసిందేమో మేం!

          ఐనా ప్రభుత్వం పంపిన కప్పు, మేకులు కూడ ప్రజలు తయారుచేసినవే కదూ? లాస్ యుంగస్ నుంచి బైటికి వెళ్లే ప్రతి వస్తువు మీద – ఓ బస్తాడు కాఫీ గింజల మీదా, ఓ డబ్బాడు కోకో మీదా, ఓ సంచీడు బొగ్గు మీదా కూడా పన్ను చెల్లించాల్సి ఉండేది. ఇలా వచ్చిన పన్నుల డబ్బులోంచే కాదూ, ప్రభుత్వం ప్రజల పనుల మీద ఖర్చు పెడుతోంది?

          వాళ్లు రైతాంగాన్ని మోసం చేసే మరో పద్ధతి నేను కళ్ళారా చూశాను. అది “ప్రజా రహదారుల బాండ్”ల విధానం. బొలీవియాలో రోడ్ల నిర్మాణానికయ్యే ఖర్చు కోసం ప్రతి ఒక్కరూ ఏటా కొంత డబ్బు ఇవ్వాల్సి ఉంటుందని ఒక శాసనం వచ్చింది. ఈ డబ్బుకు బదులుగా ప్రభుత్వం “ప్రజా రహదారుల బాండ్” అనే ఓ కాగితం చేతుల్లో పెట్టేది. రైతుల దగ్గర ఈ చెల్లింపునకు తగిన డబ్బు లేనప్పుడు పని చేయించుకొని బాండ్ చేతుల్లో పెట్టేవారు. కొన్నిసార్లు స్థానిక అధికారులు రైతుల్ని తమ పొలాల్లో పని చేయించు కోవడానికో, రోడ్లు వేయడానికి సామూహిక శ్రమదినాలనే పేరు మీద డబ్బులివ్వకుండా తీసుకెళ్ళేవారు. కొన్నిసార్లు పనయిపోయాక బాండ్ చేతిలో పెట్టేవాళ్ళు. కొన్నిసార్లు అదీ లేదు.

          రైతులు తాము పండించింది అమ్మడానికి పట్నానికి వెళ్ళినా ఇదే గొడవ. అక్కడి వాళ్ళు బాండ్లు తీసుకొమ్మని వీళ్ళ వెంటపడేవాళ్లు. ఒకవేళ ఎవరైనా బాండ్ తీసుకోనంటే వాళ్ళ వస్తువులు లాక్కుని బాండ్ తీసుకునే వరకు వస్తువులు ఇచ్చేవారు కాదు. ఇలా చేసిన వాళ్లు బాండ్ ఖరీదేకాక కొంత జరిమానా కూడ చెల్లించాల్సి ఉండేది. ఇలా రైతుల్ని మోసగించే పద్ధతులెన్నో ఉండేవి. నేను లాస్ యుంగాలో చూసిన ప్రతి ఒక్క విషయమూ నాకా తర్వాత ఎన్నెన్నో విషయాలు తెలుసుకోవడానికి పనికొచ్చింది. అవి నా ఆలోచనా పరిధిని పెంచాయి. బొలీవియన్ యదార్థ దృశ్యాన్ని స్పష్టంగా చూడడానికి అవి సాయపడ్డాయి. ఇప్పుడు ఒక సంగతి స్పష్టంగా అర్థమైంది; అదేమంటే, రాజకీయ కారణాలతో దేశం వదలి వెళ్లాల్సి వచ్చిన విప్లవకారులతో సహా చాల మందికి మా దేశ విముక్తిని కార్మిక వర్గం మాత్రమే సాధిస్తుందనే తప్పుడు అభిప్రాయం ఉండేది. వాళ్ళెన్నడూ పట్నాలు వదిలి పల్లెల్లో బతకలేదు.

          నేను లాస్ యుంగాలో ఉన్న రోజుల నుంచి నాకు రైతాంగ సమస్య ప్రధాన విషయం అయిపోయింది. గనుక తిరిగి వచ్చాక నేనీ విషయమై కొందరు కామ్రేడ్స్ తో ఘర్షణ పడాల్సి వచ్చింది కూడా. రైతుల పట్ల వాళ్ళకు సంఘీభావం ఉండేది కాదు. ఒక వైపు మా మీద జరిగే దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తూ మరోవైపు మేమే రైతులను దోపిడీ చెయ్యడం నాకు అన్యాయంగా కనబడేది. ఇది చూసి నాకు పిచ్చికోపం వచ్చేది. ఉదాహరణకు నేను కొందరు గని కార్మికుల ఇళ్ళలో చూసిన సంగతొకటి చెప్తాను. ఒక ఇండియన్ రైతు గనుక తన బంగాళాదుంపలు అమ్ముకోవడానికి పట్నానికొస్తే కార్మికులు అతణ్ని తమ ఇళ్ళల్లో పడుకోనివ్వరు. తమ పళ్లేల్లో తిండి పెట్టరు. తాము వండుకున్న తిండి పెట్టరు. ఎవరైనా రైతాంగ స్త్రీ వాళ్లింట్లో పని చేస్తున్నట్టయితే సరిగా డబ్బులివ్వరు. సరిగా ప్రవర్తించరు.

          అంతే కాదు, పంటకోతల సమయంలో తిండి గింజలు కొనుక్కొచ్చుకోవడానికి కార్మికులు పల్లెలకు వెళ్తారు. కాని ప్రతిసారీ ఈ కొనుగోలు చాల అన్యాయమైన, అక్రమమైన పద్ధతిలో జరుగుతుంది. ఎప్పుడూ రైతే మోసపోతూ ఉంటాడు. ‘మనం వాళ్ళ పట్ల ఈ రకంగా ప్రవర్తిస్తూ, వాళ్ళు మన మిత్ర వర్గంలోకి రావాలని ఎలా ఆశించగలం?’ అని నేనెన్నో సార్లు ఆలోచించాను. రైతాంగమే గనుక తమని తాము విముక్తి చేసుకోవాలని తలపోస్తే తప్పకుండా కార్మికులకి వ్యతిరేకంగా నిలబడతారు. అది సరే . కార్మికులందరమూ రైతాంగం నుంచి వచ్చిన వాళ్ళమే కాదూ?

          నాకింకా ఇతర విషయాలు తీరిగ్గా ఆలోచించడానికి కూడా లాస్ యుంగాలో సమయం దొరికింది. సైన్యం రక్కసి కోరల్లో నేననుభవించిన బాధలు, వాళ్ళు నన్ను కమ్యూనిస్టనీ, చెడిపోయిందాన్ననీ, గెరిల్లాలతో సంబంధముందనీ వగైరా అన్న మాటలన్నీ నేను పునరాలోచించుకో గలిగాను. ఈ ఆలోచనతో నాకోస్పష్టమైన అవగాహన ఏర్పడింది. కార్మిక వర్గం పట్ల అక్రమంగా ప్రవర్తించిన ఆయా ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మేం ఏవైనా చర్యలు తీసుకొని ఉండవలసింది. మొదట నేను ఆ దుర్మార్గులందరినీ దొరకబట్టి చంపెయ్యాలనుకున్నాను. కాని ఆ తర్వాత నిజంగా పోరాడడానికి, ప్రతీకారం తీర్చుకోవడానికి సరైన మార్గమేమిటో నాకర్థమైంది. సరిగ్గా సంఘటిత పడాలి. ప్రజానీకాన్ని రాజకీయంగా చైతన్యవంతం చేయాలి. దేశాన్ని సామ్రాజ్యవాదుల కాడి కింది నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలి. మా సమస్యలు తీర్చడానికి అదొక్కటే మార్గం. ఇలా క్రమక్రమంగా నా రాజకీయ చైతన్యం మొగ్గతొడిగింది.

          పార్టీ ద్వారా మాత్రమే వస్తుందని కొందరు చెప్పే సంసిద్ధత ఈ రకంగా నాకప్పటికే వచ్చేసింది. నాకు అది ప్రజల అనుభవాల ఫలితంగా, నా అనుభవాల ఫలితంగా, నేను చదవగలిగిన కొన్ని పుస్తకాల ద్వారా వచ్చింది. నేనీ విషయాన్ని మరో సారి చెప్పదలచుకున్నాను. ఎందుకంటే కొందరు నన్ను తమ పార్టీ తయారు చేసిందని ప్రచారం చేస్తున్నారు. నా చైతన్యమూ, సంసిద్ధతా ప్రజానీకపు ఆక్రందనల నుంచీ, బాధల నుంచీ, అనుభవాల నుంచి మాత్రమే వచ్చాయి తప్ప మరి దేని నుంచి వచ్చాయన్నా నేనంగీకరించను. పార్టీల నుంచి ఎవరైనా చాల నేర్చుకోవసి ఉంటుందని నాకు తెలుసు. కాని ప్రతి విషయాన్నీ వాటి నుంచే ఆశించలేం కూడా. మనం మన నైశిత్యం నుంచీ, మన చైతన్యం నుంచి అభివృద్ధి చెందాలి.

          నేను పార్టీలకు వ్యతిరేకమనీ, రాజకీయేతరమనీ కాదు. కాని నేనింత వరకూ ఒక ప్రత్యేకమైన పద్ధతిలో పనిచేయడానికి కారణాలున్నాయి. అయినా మేం వివిధ పార్టీల నాయకులకి ఎన్నోసార్లు తోడ్పడ్డాం.

          మొదట గృహిణుల సంఘం కూడా యూనియలాగానే ఏర్పాటు చేయబడింది. కార్మికులతో పాటు నడిచేట్టుగానే అది రూపొందించబడింది. కాని ఒక నాయకురాలిగా నాకది సరైన పద్ధతనిపించలేదు. గృహిణుల సంఘాన్ని పార్టీ నినాదాల కిందనే నడపడం నాకు నచ్చలేదు. ఎందుకంటే కార్మికుల విషయంలో కూడ ఇలాంటి అనుభవమే ఎదురైంది. ఎప్పుడో ఒకసారి పార్టీలు కార్మికులను తమ స్వప్రయోజనాలకి వాడుకున్నాయి. ఇది నా స్వభావానికి సరిపడదు.

          అంతేకాదు, బొలీవియాలో పార్టీల మధ్య ఉన్న చీలికలు కూడ మాకో పెద్ద సమస్య. అదొక గందరగోళం. బొలీవియాలో మొత్తం ఎన్ని పార్టీలున్నాయో తెలుసా?

          ఉన్న పార్టీలన్నిటినీ చాల సులభంగా వామపక్ష పార్టీలు, అభివృద్ధి నిరోధక పార్టీలు అని విడగొడదాం. అభివృద్ధి నిరోధక పార్టీల్లో ధనికులు, పరపతి గల వాళ్ళు, నిరు పేద జనాన్ని దోపిడీ చేసేవాళ్ళు, అమాయక ప్రజానీకం మీద హత్యాకాండలకు తలపడే వాళ్లు ఉంటారు. ప్రస్తుతం నివసిస్తున్న పెట్టుబడిదారీ విధానం నుంచి విముక్తి చెందాలనుకునే వాళ్ళందరమూ వామపక్ష పార్టీల్లో ఉంటాం. ఐతే రెండు వైపులా ఎన్నెన్నో చీలిక లున్నాయి.

          అభివృద్ధి నిరోధక పార్టీలలో మేం ఎస్ఎస్ బి అని పిలిచే ఫలాంగే సోషలిస్తా (బొలీవియన్ సోషలిస్ట్ పార్టీ) ఒకటి. తర్వాత ఎంఎస్ఆర్ అని పిలవబడే మువ్ మెంటో నేషనలిస్టారెవల్యూషనరిస్తా (రెవల్యూషనరీ నేషనలిస్ట్ మువ్ మెంట్) 1952 విప్లవానికి ద్రోహం చేసిన పార్టీ. తర్వాత క్రీస్తు పేరుమీద అనేక మందిని వధించిన బారియెంటోస్ ప్రభుత్వ సొంత పార్టీ మువ్మెంటో పాపులర్ క్రిస్టియానో (పాపులర్ క్రిస్టియన్ మువ్మెంట్) ఉంది. తర్వాత వామపక్షీయులూ, అభివృద్ధి నిరోధకులూ కలిపి ఉన్న డెమొక్రసియా క్రిస్టియానా (క్రిస్టియన్ డెమొక్రాట్స్) అనే పార్టీ ఒకటి ఉంది. తర్వాత ఎంఎస్ఆర్ నుంచి విడిపోయిన పిఆర్ఎ అని పిలవబడే పార్టీదో రెవల్యూషనరియో ఆతెంతికో (ఆథెంటిక్ రెవల్యూషనరీ పార్టీ) ఉంది. ఇలాంటివి మరికొన్ని చిన్న పార్టీలు కూడా ఉన్నాయి.

          వామ పక్షంలో ఎంఎస్ఆర్ ఆర్ నుంచి విడిపోయిన పిఆర్ఎఎన్ అని పిలవబడే పార్టిదో రెవల్యుషనరియో ద ఇజ్ క్విర్ ద నేషనలిస్తా (రెవల్యూషనరీ పార్టీ ఆఫ్ ది నేషనలిస్ట్ లెఫ్ట్); ఒకటి రష్యా మార్గాన్నీ, ఒకటి చైనా మార్గాన్ని అనుసరించే రెండు కమ్యూనిస్టు పార్టీలు; పిఓఆర్ పేరు మీద పనిచేసే ట్రాట్ స్కీయిస్టుల పార్టీ పార్టిడో ఒబ్రెరో రెవల్యూషనరియో (వర్కర్స్ రెవల్యూషనరీ పార్టీ); గెరిల్లాలతో వెళ్ళిపోయిన వాళ్ళ ఎజర్ సితో ద లిబరేషన్ నేషనల్ (ఇఎల్ఎన్ – నేషనల్ లిబరేషన్ ఆర్మీ); పి.ఎన్ అనబడే పార్టీ దో సోషలిస్తా (సోషలిస్ట్ పార్టీ) మొదలైన వెన్నో ఉన్నాయి. అంటే వామపక్షాలు నిజంగా ఎన్నెన్నో గ్రూపుల కింద చీలిపోయాయని మీరు గమనించి ఉంటారు. అంతకన్న దారుణమైన విషయమేమంటే వీళ్ళు అప్పుడప్పుడు ఒకళ్ళనొకళ్ళు దుమ్మెత్తి పోసు కుంటారు. దీని ద్వారా వాళ్ళు జనాన్ని చాల నొప్పిస్తారని నాకనిపిస్తుంది. శత్రువుకేమో ఈ పరిస్థితిని ఎలా వాడుకోవడమో తెలుసు. వాళ్ళందరూ ఏకమై ప్రధాన విషయమేమిటో దాని కోసం పోరాడితే ఎంత బాగుండును! పీడకులకు స్పష్టమైన ఉమ్మడి లక్ష్యా లున్నాయి. ఎక్కువ సంపాదించడం, ఎక్కువ దోపిడీ చెయ్యడం, ఇంకా ఎక్కువ సంపాదించడం, ఇంకా ఎక్కువ సంపాదించడానికీ, దోపిడీ చెయ్యడానికి అవసరమైన అణచివేత సైన్యాలని పెంచి పోషించడం వాళ్ళ లక్ష్యం. మరో వైపు ఒకరిపై ఒకరం ఆధార పడవలసిన స్థితిలో మనం విడిపోతున్నాం. వామపక్షం అధికారంలో లేక పోవడమే ఈ చీలికలకు కారణమని ఎవరైనా అనవచ్చు. ఔనా?

          నేను లాస్ యుంగా లో సంవత్సరంన్నర ఉన్నాను. 1969లో బారియెంటోస్ చనిపోయాక నేను ఒరురో తిరిగి వెళ్ళాను. లాస్ యుంగాస్ వాతావరణం నాకు సరిపడక పోవడమేగాక నేనప్పుడు గర్భంతో ఉండడంతో ఒరురోకొచ్చేశాను. నా కూతురు రీనా ఒరురోలోనే పుట్టింది. అది పుట్టాక నేను పనిచేయడం ప్రారంభించాను. వీథుల్లో అమ్మడానికి వంటలు వండాను. మొదట ఇలా అమ్మడం కష్టమయ్యేది. నేనెవరికీ తెలిసిందాన్ని కాదు గదా! క్రమంగా నాకు కొందరు స్నేహితులయ్యారు. కొన్ని నెలలకల్లా మేం బాగా గడపగలిగిన స్థితి వచ్చింది. నా భర్త పనికోసం మళ్ళీ లాస్ యుంగాస్ వెళ్ళిపోయాడు.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.