మేరీ

-బండి అనూరాధ

          ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది. ఉదయం ఎనిమిది అయ్యింది. కాఫీ తాగుతూ పేపర్ చూస్తూ వరండాలో కూర్చున్నాను. గేట్ తీసుకుని ఒకమ్మాయి వస్తోంది. ఎవరన్నట్లు ఆరాగా చూస్తుంటే, నమస్కారమమ్మా నా పేరు మేరీ అంది. ఏమిటన్నట్లు చూసా. మీ దగ్గర పనిచేసే దుర్గ వాళ్ళ చెల్లెల్ని అమ్మా అంది. మరి నాతో ఏమయినా పని ఉందా అన్నాను. అక్క, సుందరి గారి ఇంట్లో పనిచేసి వచ్చేలోగా మీతో మాట్లాడమనింది అమ్మా. పోనీ తనొచ్చేదాకా కూచుంటానమ్మా అన్నది. పర్లేదులే చెప్పు అన్నాను. 
 
          వయసు, ఇరవై ఐదు. తనకి నేను విడాకులు ఇప్పించాలి. ఇదీ విషయం. నాకెందుకో దుర్గొస్తే ఇద్దరితో కలిపి మాట్లాడితే పోతుందనిపించింది. కోల ముఖం, చామనఛాయ, పెద్దకళ్ళూ, ముఖంలో అమాయకత్వముంది; కొంత ఉదాసీనత; మరికొంత నిర్లిప్తత; అయినా, మాటతీరులో స్పష్టత ఉంది;  తుంచి పడేసే మాటలు అన్నీ. బహుశా తన నుండీ కొంతను ఇలానే తుంచాలనుకుంటోందనుకుంటా. మరెప్పటికీ ఇక తనకి ఆ భాగం అతకవద్దు. తనిక ఆ కొంత జీవిత భాగాన్ని తనకి అంటించుకోదు. ఇది అర్ధమయ్యింది నాకు.
 
          సరే, ఆలోచిద్దాం. నువ్వు ఇలానే ధైర్యంగా ఉండు. అయితే ప్రశాంతంగా కూడా ఉండాలి మరి అన్నాను. తలూపింది. ఈలోపు దుర్గొచ్చింది. విమలమ్మా మీరే చూడాలి మా చెల్లి సంగతి. మీరున్నారనే భరోసాతోనే ఇక్కడికట్టుకొచ్చాను. లాయరమ్మున్నారు, మంచోరు; నీకు ఇడాకులిప్పిత్తారని చెప్పాను అని అంది. నేను ఊ కొడుతున్నాను. 
 
          ముందు అసలు కథ వినాలి కదా.  వీళ్ళు నలుగురు అక్కచెల్లెళ్ళు. ఇద్దరు అన్నదమ్ములు. ఒకతను చనిపోయాడు. తల్లి, మేరీ పుట్టిన ఆరు నెలలకి భర్తని పిల్లల్ని వదిలేసి పోయింది. ఇక మళ్ళీ అంతే వెనక్కిరాలేదు. 
 
          ఎనిమిదేళ్ళ పిల్లప్పుడు పట్నానికి పనికి వచ్చింది. పిల్లల్ని ఇళ్ళల్లో పనికి పెట్టే ఆయన చెబితే వాళ్ళ నాన్న ఒప్పుకున్నాడు. అతను, వాళ్ళనాన్న కలిసి పిల్లని తెచ్చి పనికి అప్పజెప్పి వెళ్ళారు. ఆ ఇంటాయన బిల్డర్. వాళ్ళకప్పటికి ఇద్దరు ఆడ పిల్లలు. పెద్దమ్మాయికి నాలుగేళ్ళు. స్కూల్లో జాయిన్ చేసారు. చిన్నపిల్లకి రెండేళ్ళు. అక్కడ, మేరీ పని, పిల్లల్ని చూసుకోవడం. ఆడించడం. ఇంకో ఇద్దరుంటారు,మేరీకి తోడు, పెద్ద పని వాళ్ళు; అంత పెద్ద ఇంటిని ఊడవడం, తుడవడం, ఇల్లు సర్దడం చేస్తారు. వంటామొచ్చి వంటచేసి వెళుతుంది. బట్టలుతికే ఆమె ఉంది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు. వచ్చేపోయే బంధువులు.. రెండు రోజులకే అలవాటు పడిపోయింది.. అక్కడ మనుషులకీ ఆ సందడికీ. నోరెత్తకుండా చెప్పిన ఆ చిన్నపనులు చేసుకుంటూ పిల్లలతో ఆడుకోవడం, చిన్న పిల్లని చూసుకోవడం, తినిపించడం… ఇవే పనులంటే. మేరీ వెళ్ళిన సంవత్సరంకి ఆ ఇంటి వాళ్ళకి అబ్బాయి పుట్టాడు. మేరీ వాళ్ళతో కలిసి పోయింది. వాళ్ళకి సొంత మనిషిలా అయిపోయింది. ఎక్కడికెళ్ళినా తీసుకెళ్ళేవాళ్ళు. టూర్లకి పుణ్యక్షేత్రాలకి…అన్నిటికీ.
 
          సంవత్సరానికి రెండు మూడుసార్లు వాళ్ళ నాన్నో, పెద్దక్కాబావో వచ్చి ఊరు తీసుకువెళ్ళేవాళ్ళు. ఇలానే ఒక రోజు అమ్మ చనిపోయిందని కబురొచ్చింది. పెద్దన్నొచ్చి తీసుకుపోయాడు. ఊహ తెలిసాక అదే మొదటిసారి అమ్మని చూడడం. ఊకపోసిన మంచుదిమ్మెపై అమ్మ నిర్జీవంగా పడిఉంది. ఏడవలేదు, చూడడమే సరిపోయింది. అమ్మ అన్న భావనకి అర్ధమెప్పుడూ తెలియలేదప్పటివరకూ. ఎలా స్పందించాలో అర్ధమూకాలేదు. బిక్కమొకమేసుకుని చూసి తెల్లారి పట్నానికొచ్చేసింది. 
 
          మధ్యన పని డబ్బులకి నానొకసారీ, ఆరోగ్యం బాగోని పెదబావొకసారీ వచ్చేవారు. పనిడబ్బులు వాళ్ళే వాడేసుకున్నారు. అప్పటికి ఇద్దరక్కల పెళ్ళయ్యింది. మూడో అక్క దుర్గ హైద్రాబాద్లో ఒకింట్లో పనిచేస్తోంది.  ఆ తరువాత దుర్గ పెళ్ళీ అయిపోయింది. చిన్న అన్న, ఏదో ప్రేమ వ్యవహారంలో మందు తాగి చచ్చిపోయాడు.  
 
          మేరీ విజయవాడలోనే ఉంది. వయసు పెరిగేకొద్దీ పనులూ నేర్చుకుంది. ఓర్పు, నేర్పు, నైపుణ్యం, మంచితనంతో ఆ ఇంట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. వాళ్ళు ఈ పిల్లకి పట్టీలు, ఉంగరాలు, చైను కూడా కొన్నారు. పెళ్ళికూడా వాళ్ళే చేద్దామని అనుకున్నారు. అన్నీ మంచిగా అయితే ఎలా. అంతా బావుంటే ఎలా. నాన్నని కుక్కకరిచి బాగోలేదని, జబ్బు చేసిందనీ చెబితే ఊరెళ్ళిన మేరీ ఇక తిరిగి విజయవాడ రానేలేదు. ఊరొచ్చాక కొద్ది రోజులకే తండ్రి చనిపోయాడు. మేరీని పెద్ద అక్క తనింటికి తీసుకు పోయింది. విజయవాడ వాళ్ళు కబురు పంపితే ఇక రాదు అని చెప్పింది. బహుశా వయసు స్వేచ్ఛని కోరుకుంటుందేమో. ఆకర్షణా రెక్కలతో సీతాకోక గెంతు లేయిస్తుందేమో. అసలే ఆంక్షలూ వద్దన్నట్లూ , ప్రపంచం కొత్తగా అర్ధవుతున్నట్లూ.. పద్దెనిమిదేళ్ళ పిల్లకి కంటికి రెప్పలా కాపాడి పెంచినవాళ్ళ విలువ ఒక్కసారిగా అర్ధం కాలేదు. అలా అని ప్రేమ లేక కాదు, నిందేసే ఏ కారణమూ కూడా తనవద్ద లేదు; పైగా మనసులో ఎంతో ఇష్టం. కానీ ఏదో ఖాళీ వాసన. 
 
          నాన్న అన్న ఒక్క బంధమూ లేడనుకున్న దిగులేదో కూడా. అవును, అదీ ఒక కారణం. ఇక అక్కోళ్లు చాలు. ఇప్పుడిక, నాకు వీళ్ళే.. మరెవరూ లేరన్న అభద్రతా భావమూ కావొచ్చు. చిన్న పిల్ల, పదేళ్ళు ఒకళ్ళింట్లో పని. అమ్మ అసలే తెలియదు. నాన్నిప్పుడు లేడు. అప్పటి మనఃస్థితి అది. అంతకుమించేం ఆలోచించే స్థితి కాదు. మంచి చెడులు బేరీజు వేసుకునే పరిపక్వతా లేదు. పద్దెనిమిదేళ్ళమ్మాయి ఇంతకు మించి ఏ మార్పుని కోరుకుంటుందీ?
 
          బావుండీ, చలాకీగా ఉండే పిల్ల కాస్తా డేవిడ్ దృష్టిలో పడింది. వాళ్ళింట్లో వాళ్ళొచ్చి అడిగితే వీళ్ళక్క చెయ్యమిప్పుడే అనిందంట. ఎందుకంటే వాళ్ళు తనకి నచ్చలేదు. వాళ్ళు వేరే ఊరువాళ్ళు. ఇక్కడ చేపల చెరువుపై పనికి ఉంటారు. . సొంతూరులో ఇల్లుంది. అయితే కుదురుగా ఒకచోట నిలిచి పనులు చేసుకునే రకాలు కాదు.  చుట్టరికముంది కదా అని, నిలకడలేనోళ్ళకి ఆడపిల్లని ఇవ్వరు కదా. ఇది పెద్దక్క ఉద్దేశ్యం. మిగిలిన కుటుంబం ఉద్దేశ్యమూనూ. కొద్దిరోజులాగి కాస్త మంచి సంబంధం చూసి పెళ్ళి చేద్దామనుకున్నారు. ఆరునెలలకని బైబిల్ కాలేజ్లో చేతి పనులు ట్రైనింగ్కి పంపిస్తున్నారు. అది అక్కడితో ఆగలేదు. పిల్లని కాపుకాసి మాట్లాడ్డం. బైబిల్ కాలేజ్లో,  కుట్లూ అల్లికలూ నేర్చుకోవడానికొచ్చేప్పుడు మాటామంతీ చేసి… మొత్తానికి , ఎర్రగా ఆకర్షణీయంగా ఉండే డేవిడ్ మేరీకి తెగ నచ్చేసాడు.  పెళ్ళి చేసుకుంటాను వచ్చేస్తావా అంటే వెళ్ళి పోయింది. కాదు .. వయసు జరిపించి తీసుకెళ్ళి పోయింది. ఇక్కడ నుండీ వాళ్ళ ఊరుకెళ్ళిపోయి క్రైస్తవ వివాహం జరిపించారు. ఒక సంవత్సరం బానే ఉంది. తొలినాళ్ళ మైకం లోపాల్ని దాచేసింది. అసలు లోపాలొకటుంటాయని తెలీని గమ్మత్తుకాలమది.
 
          నెలతప్పాక, కబురంది చూడ్డానికి వచ్చారు అక్కోళ్ళు, అన్నయ్యా. రాకపోకలు మొదలయ్యాయి. నిదానంగా అర్ధమవుతూవస్తున్న విషయం డేవిడ్కి బద్ధకం. ఎక్కడా ఎక్కువ రోజులు పనిచెయ్యడు. మరిది చిన్నోడు, చదువుకుంటున్నాడు. మామొక్కడు, పని దొరికినప్పుడు వెళ్తాడు. అత్తేమో దుబారా మనిషి. ఏ సలహా పడదు. పొరబాటునెవరైనా చెబితే నోరు తాటిచెట్టంత లెగుస్తది. ఇదీ ఆ ఇంటి వాతావరణం. ఉన్నరోజు తిండి. లేనిరోజు పస్తు. వాళ్ళంతే, అలానే ఉంటారు. మంచినీళ్ళు తాగి ముసుగు పెట్టి పడుకుంటారు. 
 
          ఆకలి నొప్పి ఇలా ఉంటదని, పేగులు అరవడం ఇల్లాగునని అర్ధమవుతోంది. ఇల్లుంది; మనుషులూ ఉన్నారు; వారు మనసుని కలిగున్నారో లేదో! ఇంగితం, కూసింత సిగ్గూ, పోనీ జాలీ,… నిజంగా వీటిలో ఏవి కొన్ని ఉన్నా, కడుపుతో ఉన్నమ్మాయి కడుపుకింత పెట్టేవారు. వారంలో రెండు పూట్లా అన్నం దొరుకుద్దో దొరకదో, ఆ ఇంటి పై కప్పుకీ మేరీ కడుపులోని బిడ్డకీ మాత్రమే తెలుసు. 
 
          తారీకులు మారేకొద్దీ నిజాల కఠికతనం అర్ధమవ్వసాగింది. ఎనిమిదో నెలొచ్చింది. ఆ పొద్దు, ఆయింటి ‘పొయ్యి’ సెలవులో ఉంది. అక్కడికీ రెండుసార్లు  పంచదార నీళ్ళు తాగింగి. కాసేపే ఉపశమనం. ఆ తర్వాత?  డొల్లిగింతలు పెట్టి ఏడ్చేంత ‘విలవిలే’ కానీ వోపికేదీ?.. నీరసంతో ఇక కళ్ళు తిరుగుతుండగా పక్కింట్లో ఉండే మామ చెల్లింటికి వెళ్ళి అన్నమడిగింది,  కళ్ళల్లో నీళ్ళూరుతూ అభిమానాన్నీ మోమాటాన్నీ వొదిలేసుకుని..
పాపం; వాళ్ళప్పటికే అన్నాలు తిని ఉన్నారు. కూరలేదు కానీ అన్నముంది. నిండుపళ్ళెమన్నంలో ఉప్పుగల్లేసుకుని నీళ్ళు పోసుకుని గబగబాతిని… అప్ప్పుడు, అప్పుడేడ్చింది. పని చేసిన ఇల్లు గుర్తొచ్చింది. పెద్దమనిషి అయినప్పుడు కూచోపెట్టి వేడుక చేసిన అమ్మలాంటి యజమానురాలు గుర్తొచ్చింది. అక్కోళ్ళ మాటయినా వినలేక పోవడం గుర్తొచ్చింది. లేని నాన్న గుర్తొచ్చాడు. మనసు వికలమై నిదానంగా ఇంటికి వెళ్ళింది. ఇష్టపడి చేసుకున్న పెళ్ళి. అక్కోళ్ళకి చెబితే చిన్నతనమవుద్దని దాచిపెట్టిన విషయాలు. అన్నీ ఆ ఇంటి చూరుకే వేల్లాడుతూ ఉన్నాయి.
 
          తొమ్మిదో నెలన కానుపుకి తీసుకెళ్ళింది పెద్దక్క. ఆ వెళ్ళటం మూడోనెలొచ్చేదాకా అక్కడే ఉంది. పిల్ల పుట్టినప్పుడొకసారీ చర్చిలో పేరుపెట్టేప్పుడొకసారీ వచ్చారు అత్తింటోళ్ళు. డేవిడ్ మరో రెండుసార్లదనంగా వచ్చుంటాడు, అంతే! అంతకుమించి పెద్ద మార్పులేమీ చోటుచేసుకోలేదు. అదే మనుషులు, అవే మనసులు, అలాంటే పరిస్థితులు. తిరిగొచ్చాక కూడా అంతా పాత కథే. 
 
          ప్రేమలిప్పుడెలా ఉన్నాయో. మనుషులిప్పుడెలా ఉన్నారో.  ఆర్ధిక పరిస్థితులు సహకరిస్తాయా లేదా.. ఇవన్నీ ఎవరిక్కావాలి.  ఇత్యాదివన్నీ మరోసారి నెల తప్పడానికి అవసరమా.. సృష్టిధర్మం; అంతే. ఈ సారికి ఉన్న బంగారం కాస్తా తాకట్టుకి పోయింది. ఆ తరువాత అది ఇంటికేసే రాలేదు. 
 
          ఎన్నో చెప్పి చూసింది. డేవిడ్ చెవికి ఏమీ ఎక్కలేదు. అతను ఏవీ ఎక్కించుకోలేదు. అంత మందంగా మనుషులెందుకుంటారో మేరీకి అర్ధం కాలేదు. బయట నీళ్ళ గాబు ఎట్లా అట్లా కదలకుండా ఉంటదో ఇతనూ అంతే నిండుకుండ తొణకనట్లు అట్లా ఉంటాడు పడి ఇంట్లో. అధిక తెలివితేటలు, అధిక వాస్తవాలు,.. అతిమూర్ఖత్వమదని లోకం దానికి పేరుపెట్టింది. కానీ ఈ తోలుమందపతనికి అదేంమర్ధమవ్వదు. వెనకా ఏ ఆధారమూ లేదు. పనికెళితే గానీ డొక్కాడదు. తెలివి గల అత్త వేరు పొమ్మంది. ఆ రెండు గదుల రెండునిట్టాళ్ళింట్లో ఇప్పుడు రెండు కాపురాలు.
 
          అప్పుడేమన్నా మారతాడనుకుంటే కూడా అంతే. నాలుగు మెతుకులు తినేవరకి చుక్కలు వాలి చుట్టూ తిరుగుతాయ్. పిల్ల అంగన్వాడీ బడికి పోతోంది. అన్నపేళ కూడా అక్కడే. పైగా చిరుతిండి కూడా. నెలకు ఒక కోడిగుడ్ల అట్ట ఇస్తారు. 
 
          రేషన్ వస్తుంది. ఒంటికి సహించినా సహించక పోయినా ఆ బియ్యాన్ని కొన్న బియ్యంతో కలిపి ఆ ఇల్లు గడిచే ఏర్పాట్లు కాబట్టి, కాస్త ఆ జరుగుబాటన్నా. జ్వరాలొచ్చినా ఏ ఆపద ఖర్చొచ్చినా అప్పులూ తప్పలా. అట్లాంటి ముతక రోజుల్లోనే తాగుడు రోగం పట్టుకుని ఆ చేపలపట్టుబడికి వెళ్ళినరోజొచ్చే ఐదొందల్లో రెండొందలు గొంతులోకి పోయేవి.
 
          పిల్లాడిని అత్తకప్పజెప్పి, పిల్ల మధ్యాహ్నమొస్తది కాస్త చూడమనీ.. తను కూడా పనికి పోతే చిల్లరమల్లర అప్పంతా తీరుతుంది. కొంచం ఇంటి ఖర్చులకి ఆసరా అవుతుంది అనుకుని తనుకూడా పనిలోకి పోవడం మొదలుపెట్టింది. అతన్ని బతిమాలింది, మనకి అప్పులొద్దు అని. కానీ అదే తను చేసిన అపరాధం. ఇక తన డబ్బులతోనే ఇల్లు గడవడం మొదలయ్యింది. అతను పనికెళ్ళిన డబ్బులు అతనికే సరిపోయేవి. ఈలోపు పెద్దచెరువు పై కాపలా ఉండాలి ఇల్లుకూడా రెండుగదులూ వరండా ఉంది మనమక్కడికి వెళదామని అత్త చెప్పింది. మారు మాట్లాడక వెళ్ళింది. 
 
          జీవితం బావుంటుందని నమ్మి ‘నా’ అనుకున్నవారి వెంట గుడ్డిగా అడుగులు వెయ్యడం స్త్రీకి అనాది నుండీ అలవాటై పోయింది. మంచిరోజుల కోసం సర్దుకుపోయిన సందర్భాలు లెక్కపెట్టడం మొదలుపెడితే… అనంతంలోకి పోవల్సి వస్తుంది. నా భర్త, నా పిల్లలు,  నా అత్తమామలు.. ఇదే చక్రంచుట్టూ తిరగడం తనకొక ఇష్టవ్యసనం. కానీ స్త్రీలోకి వెళ్ళి అదికూడా  సత్యంగా వెళ్ళి అర్ధం చేసుకునే మగపుంగవులు నిజానికి ఎంతమందుంటారూ?.. ఆస్తులు అంతస్తుల్లో తేడాలే గానీ. ఇంకా ఇప్పటికీ స్త్రీ విషయంలో పెద్ద పురోగతేం లేదు. స్త్రీ అగచాట్లు అలానే ఉన్నాయ్. 
 
          కాకపోతే, ధైర్యం చేసి, భ్రమల్ని వదిలించుకుని తనను తను నిజాంగీకారంలోకి  నడిపించుకోగల స్త్రీ మాత్రం తప్పక గెలుస్తుంది. తనకేం కావాలో స్పష్టత వచ్చిననాడు స్త్రీని ఆపే ఏ శక్తీ పనిజెయ్యదు.
 
          ఇక్కడ నేను మేరీ గురించే కాదు అటువంటి లక్షల మేరీల గురించి చెప్పదలుచు కున్నాను. మహిళలకి న్యాయ సహాయం అందించే స్వచ్ఛంద సంస్థలో సభ్యురాలిగా నేనీ మాట చెప్పడం లేదు. నిత్యదైనందితంలో చాలా మంది మహిళల్ని కలుస్తాం. మా టీంలో డాక్టర్స్ కూడా ఉన్నారు. ప్రాధమిక దశలో బాదితులకి కౌన్సిలింగ్ ఎంత అవసరమో, వారి మానసిక స్థితిని జాలితో ప్రేమతో అర్ధం చేసుకునే వారి కోసం ఎంత ముఖంవాచి ఉంటారో నాకు ఎరుకే.
 
          ఇకపోతే మేరీకి ఎందుకు విడాకులు కావాలంటే, అతను ఆమెని పట్టించుకోవడం లేదు. పిల్లని స్కూల్కేద్దామంటే వినడు. ఊరి చివర చేపల చెరువు నుండీ ఊళ్ళోకి పిల్లని సైకిల్మీద స్కూలుకి తీసుకు పోవడానికీ బద్ధకం. ప్రశ్నించడం మొదలు పెట్టిన మేరీ పాపాత్మురాలు. అప్పటి వరకూ వాళ్ళతో కష్టపడి ఇంటి అప్పుకి సహకరించడం మాత్రం కనపడదు. చూసి చూసి ఊళ్ళో ఉన్న పాక దగ్గరకు పిల్లను తీసుకుని వచ్చేసింది. స్కూల్లో వేసింది. మూడు నాలుగు పంచాయితీలు అయ్యాయి. ఒక్కటే అడిగింది మేరీ. ఊళ్ళో ఉందాం. చెరో పనికీ పోదాం. పిల్లలకి మంచి చదువు చెప్పిద్దాం. ఇవే. అతను రానన్నాడు. ఖర్చులకీ ఇవ్వనన్నాడు. ఇక తనే, వెసులుబాటుని బట్టీ పనికి పోవడం పిల్లని బడికి పంపడం చేస్తా మధ్యన పిల్లాడిని చూసుకోవడానికి వెళ్ళడం.. వెళితే అతను ముఖం తిప్పుకుంటాడు. మాట్లాడడు. ఇక ఈ కాపురం ఇలాగేననీ, వెంటపడి పెళ్ళి చేసుకున్న అతని మోజు అందాకేననీ అర్ధం కావడం మొదలయ్యాక తననితాను మెరుగుపర్చుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వడం మొదలు పెట్టింది. ఒక్కటి అర్ధమయ్యింది. అతను తనని దగ్గరకితియ్యడు. ఇల్లు విడవడం ఒక నేరం.  ఆ ఊరు నుండీ అక్క దగ్గరకి వచ్చేసింది. విడాకుల ప్రతిపాదన మేరీదే. ఎవరు ఎలా నోళ్ళునొక్కుకున్నా, ఎవరు ఏమనుకున్నా తనకి విడాకులే కావాలి.
 
          ఆలోచిద్దాం, ఇవన్నీ అప్పటికప్పుడు జరిగేవి కాదు. ముందుగా ఒకసారి వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడదాం. అన్నాను నేను. మరొక రోజు దుర్గ వాళ్ళ పెద్దక్కని వెంటబెట్టుకుని వచ్చింది. ఆమెకు మేరీ వాళ్ళ అత్తింటి వ్యవహారమంతా తెలుసు. వాళ్ళతో పొసగదని కూడా తెలుసు. కానీ మళ్ళీ నిందించుకుని ఏం లాభం. సయోద్య కుదిరితే కుదురుతుంది. లేకపోతే లేదు. కొంచం ప్రయత్నించి చూడండమ్మా అంది. ముందు ఒకసారి వాళ్ళని తీసుకుని రండి. వాళ్ళతో కూడా మాట్లాడి ఏదయితే మంచిదో అది చేద్దామని అన్నాను. 
 
          ఒకరోజు అందరూ వచ్చారు. ఎక్కడా అతను ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకునే దోరణిని కనబర్చలేదు. అత్త ఏం చెబుతుందీ?. మామేం చెబుతాడు?… మేరీ మొండిదని ముద్రతో ఉన్నారు. పోనీ మరో మార్గం చూసి కలిసి ఉండి చక్కబర్చుకుంటారంటే అత్తమామలకి అభ్యంతరం లేదు కానీ కలిసుండే ఉద్దేశ్యం కాపురం చేసే ఉద్దేశ్యం ఆ అబ్బాయికి లేవు. అట్టాంటి ఎదురు సమాధానాల ఆడది వద్దంట. ఇకప్పుడు మేరీ అందుకుని, అతనేంటమ్మా వద్దనేది.. నేను చెబుతున్నా ,.. నాకే అతను వద్దు. నా బతుకేదో నేను బతుకుతాను. నా పిల్లల్ని నేను బతికించుకుంటాను అనేసింది. 
 
          ఈ ధైర్యం లేకనే  ఎన్నో చావులు. ఈ మాత్రం ఆలోచన లేకనే కదా పావుజీవితంలోనే అన్నీ ముగించేసుకుంటున్నారు అనిపించింది. మేరీ చొరవకి ముచ్చటేసింది కూడా.
 
          వాళ్ళతో చెప్పాను. కొంత సమయం తీసుకుని ఆలోచించుకోమని. కాస్త సమస్యని పరిష్కరించుకుని కలిసుంటే మంచిదనీ. ఒకవేళ విడిపోవడమే పరిష్కారమయితే ఇరువురి అంగీకారంతో అయితే సులభంగా విడాకులొస్తాయనీ చెప్పాను. కానీ నాకు తెలుసు, నేను ఎన్నో చూసి ఉన్నాము, ఈ కాపురం నిలబడదు. ఇష్టం పోయాక, ప్రేమ పోయాక, విముఖత ఏర్పడ్డాక, ఒకరిపొడ ఒకరికి గిట్టకుండా పోయాక వాళ్ళు కలిసుండడం అసంభవం. నేననుకున్నదే నిజమయ్యింది.
 
          వాళ్ళు నిజానికి ఎప్పుడో విడిపోయినా, లీగల్గా మాత్రం ఇప్పుడు విడిపోయారు. పిల్లల బాధ్యత కూడా లేని మొగాడి ముఖం వెలిగి పోతోంది. ఎలా ఉంటారు ఇలాంటి తండ్రులు. పిల్లల్ని అలా తేలికగా వొదిలేసుకునే తండ్రులు. 
 
          బహుశా కొన్నిటికి సమాధానాలు ఎప్పటికీ లభించవు. సమస్యలు పరిష్కారాల్లో ఎన్నెన్ని వింత సమాధానాలో. మరెన్ని అపరిష్కృత కొనసాగింపులో…

*****

Please follow and like us:

2 thoughts on “మేరీ (కథ)”

  1. చాలా ప్రభావంతంగా రాసారు. కథ అనడం కంటే, చుట్టు ఉన్న జీవితాలకి ఒక రిఫ్లెక్షన్ అనడం కరక్ట్. మేరీ లాంటి వ్యక్తులు మనకి తారసపడుతూనే ఉంటారు, కానీ వారి పోరాటాన్ని, పరిస్థితుల్ని జడ్జ్ చెయ్యకుండా, నిజాయితీగా అక్షరాల్లో ఆవిష్కరించారు అనూరాధ గారు.
    🙏🙏

Leave a Reply to Anuradha Cancel reply

Your email address will not be published.