మా వైష్ణుదేవి యాత్రా విశేషాలు – 4

-చెంగల్వల కామేశ్వరి

          నిన్న మనాలీ మంచుకొండలు విషయం చెప్పాను కదా! ఈ రోజు రాక్షస స్త్రీ తాను ప్రేమించిన ధీరుడు వీరుడు అయిన భీముడిని వివాహమాడిన హిడింబి  ఆలయం ఆవిడ కొడుకు ఘటోత్కచుని ఆలయం దర్శించాము కదా! ఆ వివరాలు కొన్ని మీకు తెలియ చేస్తాను.

          రాక్షసిని దేవతగా పూజించే ఆలయం మన భారతదేశంలో ఒకటి ఉంది. ఈ ఆలయంలోని దేవతను దర్శించుకుంటే ప్రేమించిన వారితో వివాహం జరుగుతుందని నమ్ముతారు. ఇంతకీ ఆ ఆలయం ఎక్కడుందో తెలుసా.

          భారతదేశంలో ఎన్నో హిందూ దేవాలయాలు ఉన్నాయి. లెక్క లేనంత మంది దేవుళ్లను అనేక ప్రదేశాల్లో ప్రజలు పూజిస్తుంటారు. కొన్ని చోట్ల మానవ మాత్రులను కూడా దైవ స్వరూపంగా భావించి దేవాలయాలు నిర్మించడం మీరు చూసే ఉంటారు. అయితే ఓ రాక్షసి జాతికి చెందిన స్త్రీను దేవతగా పూజించే దేవాలయం గురించి మాత్రం మీరు ఎప్పుడూ విని ఉండరు. దట్టమైన అడవుల మధ్య హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మనాలీలో ఈ ప్రాచీన ఆలయం ఉంది. ఇక్కడ పూజలందుకునే దైవం పేరు హిడింబ దేవి. ఈ ఆలయం చుట్టూరా విస్తారమైన, దట్టమైన అడవి ఉంటుంది. ఇక్కడ చాలా ప్రదేశాల్లో సూర్యుడి వెలుగు కూడా పడదంటే ఆ వాతావరణం ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవచ్చు. అందుకే ఈ హిడింబ దేవిని వనదేవత, ప్రకృతి దేవత అని కూడా పిలుస్తారు. వేసవిలో కూడా ఈ ఆలయ సముదాయం చుట్టూ భక్తుల క్యూను మీరు చూడవచ్చు. ఇక్కడికి దేశ నలుమూలల నుంచి ప్రతి నిత్యం భక్తులు సందర్శనకు వస్తుంటారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు స్థానికులు ఈ దేవతకు ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తుంటారు.

హిడింబా దేవి ఆలయం

          ఈ ఆలయాన్ని 1553లో మహరాజా బహదూర్ సింగ్ నిర్మించారు. 4 అంతస్తుల్లో చెక్కలతో నిర్మించిన ఈ ఆలయ నిర్మాణం అడవుల మధ్య ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆలయం లోపలికి వెళ్లి చూస్తే మేకలు, దున్నలు, జింకలు సహా అనేక జంతువుల అవశేషాలు కనిపిస్తాయి. జంతువుల బలి ఇక్కడ సాధారణంగా జరిగే ఆచారం. ముఖ్యంగా కొత్త పాలకులు వచ్చినప్పుడు దీనిని ఎక్కువగా అనుసరిస్తుంటారు. ఇలాంటి ఆచారాలు హిందూ సంస్కృతిలో భాగమనే విషయం మీకు తెలుసు కదా. అయితే నెమ్మదిగా కొన్ని ప్రాంతాల్లో ఈ పద్ధతిలోనూ మార్పు వస్తుంది.

          ఈ ప్రదేశంలో హిందూ దేవత అయిన హిడింబ ధ్యానం చేసినట్లు భక్తులు నమ్ముతారు. హిందూ మత గ్రంధాల్లో ప్రముఖమైన మహాభారతంతో ఈ ఆలయానికి ప్రత్యేక సంబంధం ఉంది. అరణ్యవాసంలో భాగంగా పాండవులు ఈ ప్రదేశంలో కొద్ది రోజులు ఉన్నారట. ఆ సమయంలో ఈ ప్రాంతంలో ఉండే రాక్షసుడు హిడింబాసురుడు వాళ్ల వివరాలు కనుక్కోమని తన చెల్లి హిడింబను పంపుతాడు. అయితే రాత్రి వేళ అక్కడ కాపలాగా ఉన్న భీమున్ని చూసి హిడింబ ప్రేమలో పడుతుంది. తన అన్న వలన మీకు అపాయం పొంచి ఉందని భీమున్ని హెచ్చరిస్తుంది. అయితే తరువాత జరిగిన యుద్ధంలో భీముడు హిడింబాసురున్ని అంతమొందిస్తాడు. దీంతో హిడింబ తన ప్రేమను భీమునికి వ్యక్తపరిచి తనను వివాహం చేసుకోవాలని కోరుతుంది. అయితే ఇక్కడ తాము కొంత కాలమే ఉంటామని, కాబట్టి ఇక్కడ ఉన్నంత కాలం మాత్రమే నీతో ఉండగలనని భీముడు షరతు విధించడంతో హిడింబ దానికి అంగీకరించి తన ప్రేమను సఫలం చేసుకుంటుంది. భీముని కారణంగానే హిడింబకు ఘటోత్కచుడు జన్మిస్తాడు. మహాభారత యుద్ధంలో తండ్రి భీముడి ఆదేశం మేరకు యుద్ధానికి దిగి తన ప్రాణాలనే అర్పించిన ఘటోత్కచుడి గురించి మీకు తెలిసే ఉంటుంది. హిడింబ, ఘటోత్కచుడు రాక్షస జాతికి చెందిన వారు అయినా ఎప్పుడూ ఎవ్వరికీ హాని తలపెట్టకుండా, ధర్మం వైపు నిలబడడంతో వారు కూడా దేవతలుగానే కొలవబడుతున్నారు.

          మనాలీ పర్యటనకు వెళ్లే టూరిస్టులకు హిడింబ ఆలయం ఓ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. మనాలీ యొక్క హృదయంగా ఈ ఆలయాన్ని పిలుస్తారు. ప్రతి ఏటా ఇక్కడికి వచ్చే పర్యాటకుల సంఖ్య పెరుగుతూనే ఉంటుంది. ప్రేమించిన వ్యక్తితో పెళ్లి కావాలని మీరు కోరుకుంటే అది నిజమయ్యేలా ఈ దేవత అనుగ్రహిస్తుందని భక్తులు నమ్ముతారు. ప్రకృతి అందాల మధ్య ఈ ఆలయాన్ని సందర్శించడం మీరు ఎప్పటికీ మర్చిపోలేరు. సెప్టెంబర్ నుంచి ఏప్రిల్ మధ్య ఈ ప్రదేశం పర్యాటకుల తాకిడితో కిటకిటలాడుతుంది. ఈ సీజన్ లో మనాలీలో మంచు కురుస్తూ ఉంటుంది. ఈ వాతావరణం మిమ్మల్ని ఖచ్చితంగా మైమరపిస్తుంది.

          మిగతావి చూసే ఓపిక లేక స్కిప్ చేసాము కొందరం..

          ఆ మర్నాడు కులూ బయల్దేరాము. ఎప్పటిలా దారిపొడవునా ప్రకృతి సౌందర్యాలు చూసి పరవశిస్తూ రావు గారి పాటల మధురిమ ఆస్వాదిస్తూ ప్రయాణం సాగింది. 

          నాకు పాత మోడల్ కాశ్మీరీ సిల్క్ చీరలు పైన ప్లెయిన్ పెద్ద బోర్డర్ లాంటిదే బ్లౌజ్ ఉన్న శారీస్ లోగడ కట్టాను కాని కొన్ని ఆల్ టైమ్ ఫేవరెట్స్ కదా! అవి కొనాలి  అంటే మా డ్రైవర్ కులూ లో షాపింగ్ చేసుకోండి అక్కడ దొరుకుతాయి అన్నాడు. నేను మా అమ్మాయికి మరదలికి చెల్లికి  కొనేయాలని ఆరాటపడ్డాను కాని స్వెటర్స్ షాల్స్ స్ట్రోల్స్ ఏవో ఒకట్రెండు వెరైటీస్ శారీస్ తప్ప దొరకలేదు. అందరం అవే ఏవో కొన్నాము. అసలు ఎవరికయినా గిఫ్ట్ ఐటమ్స్ కొందామన్నా ఈ ట్రిప్ లో కంటికి నదరుగా ఏదీ కనిపించ లేదు. అదొక్కటే అసంతృప్తి! 

          ఆ తర్వాత పరవళ్లు  తొక్కుతున్మ  బియాస్ నదిలో బోట్ రాప్టింగ్ దానికి టికెట్ 500Rs. సగం మంది వద్దనేసారు. 

          మిగతా వారిని కూడా వద్దంటే వినేట్టు లేరు.

          నాకు రేసుగుర్రం శృతీ హాసన్ లా   భయమూ కోపం అన్నీ లోలోనే గా! మేకపోతు గాంభీర్యంగా కెప్టెన్ లేకపోతే ఎలా అంటున్న వారిని అనుసరించాను కాని లోలోపల బితుకూ బితుకూమంటోంది  లైఫ్ జాకెట్స్ వేసుకుని యుధ్దరంగానికి వెళ్లినట్లు తయారయ్యాము. ఒక బోట్ లో ఏడుగురు మధ్యలో కూర్చున్నాను. అటూ ఇటూ కూర్చున్న వారు మధ్యలో తాడు సైడ్ న ఉన్న తాడు పట్టుకుని  కూర్చోవాలి. బోట్ ఎక్కేముందు ఆ బోట్ నడిపేవాడు మాకు క్లాస్, బోట్ ములిగి పోతే ఏం చేయాలి? ఈత రాకుంటే ఏం చేయాలి, అలలు వచ్చేప్పుడు వాడు సిట్ డౌన్ అంటే బోట్లో కింద కూర్చోవాలి.. అప్ అనగానే మామూలుగా కూర్చోవాలి . గుండె పీచు పీచుమంటున్నా దేముడా  కాపాడు తండ్రీ అనుకుంటూ  సాయిరామ్ సాయిరామ్ అనుకుంటూ ఎక్కేసాము. 

          అలల తాకిడికి మాపైకి చిందుతున్న నీటిలో నిలువెల్లా తడిసిపోతో ఉత్సాహంతో కేకలు పెట్టుకుంటూ ఎత్తుపల్లాల నదిలో  కొట్టుకుపోతో నదుల పాటలు జలకాలాటల పాటలు మాత్రం మానకుండా ఎంజాయ్ చేసాము. మాతో బయల్దేరిన మరో రెండు బోట్ల లో ఉన్న మా వాళ్లని చూసి కాస్త భయం తగ్గి బాగానే ఎంజాయ్ చేసాము బోట్ వాడే వాడి హెల్మెట్ కి ఉన్న కెమెరాతో వీడియో ఫొటోలు తీసాడు. వెయ్యి రూపాయలు తీసుకున్నాడు.

          బోట్ దిగి బట్టలు  ఎండకి నిల్చుని ఆరపెట్టుకుని బస్ ఎక్కాము దారిలో లంచ్ చేసుకుని సిమ్లా దారి పట్టాము. మిగతా విషయాలు రేపు చెప్తాను.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.