సమానత్వం

-ఆదూరి హైమావతి 

          అనగా అనగా అమరగిరి రాజ్యాన్ని మహేంద్రవర్మ పాలించే రోజుల్లో తన రాజ్యంలో విద్యావ్యాప్తికి బాగా కృషి చేసాడు. విద్య వస్తే ప్రజలంతా ధర్మ మార్గాన ప్రవర్తిస్తారని ఆయన నమ్మిక.  అందుకోసం రాజ్యంలో నలుమూలల  విద్యావేత్తలైన  పండితుల చేత ఉచిత  గురుకులాలు నడిపించసాగాడు. అతని ఏకైక కుమారుడైన కుమారవర్మను  వేదవేద్యుడనే పండుతులవారు నిర్వహించే విద్యాలయంలో చేర్చాడు.  అక్కడ విద్యార్ధులంతా నేలమీద తుంగచాపల మీద పడుకోడం, నదీ స్నానం, అంతా కలసి  భుజించడం, ఆశ్రమంలో పనులు అంతా చేయడం  అందరికీ సమానమే.  

          ఆయన గురుకులంలో సర్వసమానత్వం అనేది నేర్వవలసిన ప్రధమగుణం.

          రాజాజ్ఞమేరకు అక్కడ కోయ, అడవిజాతి, గిరిజన, రైతు , సైనిక, రాజోద్యోగుల పిల్లలంతా కూడా కలసి చదువుకునేవారు. ఎవ్వరికీ ఏ ప్రత్యేకతలు లేవు.

          కుమారవర్మను రాజోద్యోగుల పిల్లలు ఎక్కువ గౌరవించడం , అన్నీ అమర్చడం, కోయపిల్లలను అతనికి దూరంగా ఉండ మనడం, గమనించాడు వేదవేద్యుడు. దాంతో కుమార వర్మ తన పక్కన పడుకునే కోయపిల్లవాడైన కొండమ దొరను దూరంగా జరగమనడం, అతని చోటును తాను కొంత కలుపు కుని వాడుకోడం, తాను స్నానం చేస్తుంటే అతడిని మరోచోట చేయమనడం, భోజనం చేసేప్పుడు తన పక్కన కూర్చోవద్దనడం, కూడా గమనించాడు  వేదవేద్యుడు. వేదవేద్యుడు పిల్లలందరికీ సాయంకాలం రెండు ఘడియల పాటు సేదతీరను బయటకు వదలేవాడు. ఆ సమయంలో చాలా మంది ఆశ్రమంచుట్టూ ఉన్న ఎత్తైన పెద్ద చెట్లను ఎక్కడం నేర్చుకునే వారు. ఆత్మరక్షణకు అదీ ఒకమార్గం. 

          ఒకరోజున పిల్లలంతా చెట్లపైకి ఎగబాకడం క్రిందకు జారడం చేస్తుండగా  కుమారవర్మ కాలుజారి క్రింద పడిపోడం చూసిన కొండమదొర, తానున్న మఱ్ఱి ఊడ పట్టుకుని ఊగి వచ్చి వెంటనే అతడిని క్రింద పడకుండా తన భుజం మీదకు మోపిపట్టుకుని,  మోస్తూ అతడిని గురువు వద్దకు  చేర్చాడు. మిగతా వారంతా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోయారు. స్పృహకోల్పోయి, చేతులు గీక్కుపోయిన కుమారవర్మకు వేదవేద్యుడు ఉపచారాలు చేసి ఆకుపసరులు రాసి గాయాలకు వైద్యం చేశాడు. 

          కొన్ని గంటల తర్వాత కుమారవర్మకు స్పృహవచ్చి కళ్ళు తెరిచి చూడగా , తన పాదాలు ఒత్తుతూ, అరికాళ్ళకు ఆకుపసరు రాస్తూ ఉన్న, కొండమదొర కనిపించాడు.

          వేదవేద్యుడు “కుమారా! ఈ రోజు నీ ప్రాణాలు కాచినది ఈ కొండమదొరే! నీవు అంత ఎత్తు నుండీ క్రిందపడి ఉంటే నీకు ఎంత ప్రమాదం జరిగేదో ఊహించలేను. తన ప్రాణాలకు తెగించి ఈ కొండమదొర నిన్నుకాపాడాడు. అతని ముఖమూ ,పాదాలూ బాగా గాయాలయ్యాయి. ” అని చెప్పాడు. కుమారవర్మ లేచికూర్చుని “ధన్యవాదాలు మిత్రమా!నన్ను కాపాడినందుకు ” అని చెప్పాడు. ఆ రోజు నుండీ  కుమారవర్మ కొండమదొరతో కాస్త మృధువుగా ఉండసాగాడు.

          ఎలా వచ్చిందో నీటి పైవాలు నుండీ ఒక మొసలి వచ్చి చేరినట్లు కోయజాతి పిల్లలు గమనించి చిన్నపాటి ఆయుధాలతో స్నానాలు కానిచ్చే వారు. ఒకరోజున కొద్దిగా లోతు కెళ్ళిస్నానం చేస్తున్న  రాజోద్యోగుల పిల్లలతో పాటుగా కుమారవర్మ కూడా లోతుకెళ్ళాడు. నీటి అడుగు భాగం  నుండీ మొసలి వచ్చి కుమారవర్మ పాదం పట్టుకోగా పెద్దగా అరిచాడు. మిగతావారంతా భయంతో బయటికి ఈదుకు వచ్చారు. కొండమదొర మాత్రం మొసలి వీపు మీదకు దూకి  తన చేతిలోని కఠారితో దాని మెడలోకి మోది మోది బాగా గాయం చేయసాగాడు. రక్తం కారుతుండగా ఆ బాధ తట్టుకోలేక అది కుమారవర్మను వదలి, తోకతో కొండమదొరమీద దాడి చేయసాగింది.  కొండమదొర దాని వీపుమీద నుండీ దూరంగా  ఒక్కదూకు నీటిలోకి దూకి రెండు ఈతల్లో   గట్టుకు వచ్చాడు. ఆ పాటికి కోయపిల్లలంతా కుమారవర్మను నదీతీరానికి చేర్చారు. వేదవేద్యుడు వచ్చి వైద్యం చేసి కుమారవర్మ  గాయాలకు కట్టుకట్టాడు. మొసలి మీదకు దూకటాన కొండమదొరకు బాగానే  గాయాలయ్యాయి. తానే పొదల్లో ఉన్న ఆకులు తెచ్చుకుని పసరు తీసి రాచుకున్నాడు.

          “చూసావా కుమారా! కొండమదొర  సాహసం. అపాయంలో ఉన్నపుడు ఆదుకునేవారే నిజమైన  స్నేహితులు. మన కోసం  ప్రాణాలిచ్చే వారే మన హితులు. నీకీపాటికి అర్థమై  ఉంటుంది”అన్నాడు

          ఆ రోజు నుండీ కొండమదొరతో స్నేహంగా ఉంటూ 15 సంవత్సరాలపాటు సకలవిద్యాపారంగతుడై, స్నాతకోత్సవం రోజున”గురుదేవా ! మీ సన్నిధిలో సకల మానవుల క్షేమమే రాజధర్మం. పేద, ధనిక,  రంగు, రూపం, కులం గోత్రం, ఇవన్నీ కాక రాజు జనులందరినీ సమానంగా గౌరవించి ఆదరించాలని,ఇతరుల రాజ్యభాగాలను ఆక్రమించరాదనీ  నేర్పిన మీకు నా వందనాలు. గురుదేవా! నాయువరాజ్య పట్టాభిషేక సమయంలో  రెండుమార్లు   నా ప్రాణంకాచిన నా ప్రియమిత్రుడు కొండమరాజును నా అంగరక్షకునిగా ప్రకటించుకుంటాను.” అనిమాట ఇచ్చాడు. ఆ తర్వాత కాలక్రమాన రాజై ప్రజలందరినీ ఒకే విధంగా చూసే ధర్మప్రభువుగా పేరుగాంచాడు కుమారవర్మ.

          నీతి- సకల జనరక్షణ, సర్వజన సమానత్వమే పాలకుని లక్ష్యం.  ప్రజాహితమే ప్రభువుహితం  .                  

***** 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.