స్టేబుల్-స్టాఫ్ రూమ్ టేబుల్

-డా. టి. హిమ బిందు

నిశ్శబ్దంగా వింటున్నాను

ఆశ్చర్యంగా చూస్తున్నాను

కళకళలాడే అందమైన అలంకారాల

అరుదైన అందాలు చూస్తున్నాను

అంతకన్నా మించిన సృజనా శైలిలు చూస్తున్నాను

ఆనంద క్షణాలలో

కంటి వెలుగులు చూసి సంతోషిస్తున్నాను

దుఃఖ సమయాన

కన్నీటి సాగరాల అలలకు

విలవిల లాడుతున్నాను

గుస గుసల చెవుల కోరుకుల్లు

మింగుడు బడక

ముసి ముసి నవ్వులతో

ముడుచుకు పోతున్నాను!

గల గల నవ్వుల జల్లులు,

ఏడిపించడాలు, ఓదార్పులు

తీపి కబుర్లు, మిఠాయిల తాయిలాలు,

ఎన్ని మాటలు,

ఎన్ని చేతలు,

ఎన్ని గాధలు

ఎన్ని వేదనలు

ఎన్ని వెతలు

ఎన్ని ఈర్షా ద్వేషాలు

నిశ్శబ్దంగా చూస్తున్నాను

ఆశ్చర్యంగా వింటున్నాను

నాకే మాటలొస్తే నేనే నోరు విప్పితే

ఎన్ని యుద్దాలో

ఎన్ని కల్లోలాలో

జుట్లే పడుదురో కట్లే కట్టుకుందురో

అయినా నేను స్థిరం

ఎన్ని ఉత్తర్వులు జారీ అయినా

ఎన్ని తరాలు మారినా

నేను స్థిరం

 

ఏ చెక్కను తెచ్చి ఏ చేయి చెక్కి మలిచేనో కదా

ఈ నా స్థిర దృఢ చెక్క బల్లను

ఈ చక్కని ఉద్యోగుల ఒక్కటిగా చేరదీయ

నిక్కమై నిలిచి ఉన్నాను

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.