శ్రీరాగాలు-5

ముక్త

-కుప్పిలి పద్మ

ఎన్నో పద్ధతులు…
పద్ధతుల పేరిట పడే సంకెళ్లు…
సంకెళ్లు అని తెలుసుకోలేక, తెలుసుకున్నా వాటిని తెంచుకోలేక,
మధ్యలోనే విరిగిన అలల్లాంటి జీవితాలు…
ఇవి చెలియలి కట్టని దాటే రోజు వస్తుందా?

***

          అరేబియా అలల్ని బంధించేసిన మెరైన్ డ్రైవ్ మీద వెళ్తున్న వాహనాలని చూస్తోంది ముక్త.

          చేతిలో మెనూ కార్డ్. బృంద పరిచయం చేసిన ఆ రెస్టారెంట్‌లో కార్డ్ చూడకుండానే తనకి కావలసినవి ముక్త ఆర్డర్ చేయగలదు. కదుల్తున్నట్టు తెలియనంత మెల్లగా తిరుగుతూన్న యీ రొటేటింగ్ రెస్టారెంట్‌కి యెప్పుడొచ్చినా జిన్ తాగటం బృందకి భలే యిష్టం. తనకి వో సారి బృంద జిన్ ఆర్డర్ చేసింది. మొదటిసారి తటపటాయిస్తూనే తాగింది. ఘాటైన లిమ్కా తాగుతున్నట్టుంది. తర్వాత్తర్వాత యెప్పుడొచ్చినా ముక్తాకి జిన్ తాగటం అలవాటైపోయింది.

          గ్లాస్ ఖాళీ అయ్యేలోగా వున్నచోటు నుంచి యీ రెస్టారెంట్ యే దరికి తనని తీసుకువెళుతుందో చూడటం ముక్తకి సరదా! వొక్కోసారి సముద్రానికి దగ్గరగా, మరోసారి కొబ్బరిచెట్లకి చేరువగా, కొన్నిసార్లు గోడలవేపుగా.

          స్టీవర్డ్ ట్రేతో వచ్చి ఆమె ముందు స్వీట్ లైమ్ సోడా, క్రిస్టల్ మగ్‌లో జిన్ వుంచారు. గ్లాసులోని స్టిక్‌కివో వేపు చెర్రీ ఫ్రూట్, కింద పల్చగా నిమ్మకాయ చెక్క, లైమ్ సోడాలో జిన్ పోసి స్టిక్‌తో కలయబెట్టి సిప్ చేసింది – వగరు తక్కువనిపించి మరికాస్త జిన్ గ్లాసులో పోసింది. తిరిగి సిప్ చేస్తుంటే – ‘చుప్. అల్లరి చేయకండి. తనతో గొడవెందుకు. ఆ సీటు చెల్లికి యిచ్చేసెయ్’ రెస్టారెంట్ నిశ్శబ్దంలో యెంత చిన్నగా అన్నా స్పష్టంగా వినిపిస్తున్న మాటలు.

          ముక్త కొంచెం తలెత్తి తన యెదురుగా వున్న టేబుల్ వేపు చూసింది. భార్య, భర్త,యిద్దరు పాపలు. విండోసీట్ కోసం చిన్నపాప పెద్దపాపతో పోట్లాడుతోంది. పెద్దపాప లేచి ఆ సీట్ చెల్లాయికి యిచ్చేసింది.

          ఆదేశాలు. పసితనం నుంచే జీవితాలని కత్తిరించి క్రోటన్ మొక్కల్లా పెంచాలనే ఆంక్షలు. వీటిని మరచిపోవాలని ముక్త యెంతగా ప్రయత్నించినా యెంత దూరానికి వెళ్ళిపోయినా అవే దృశ్యాలు వెంటాడుతున్నాయి.

          స్టీవర్డ్ వచ్చి ముక్త ముందు వినయంగా నిల్చునున్నాడు. అతనికి ఫుడ్ ఆర్డర్ చేయాల్సి వుంది. అంటే తనకిష్టమైన ఆహారాన్ని ఆర్డర్ చేసి తన టేబుల్ దగ్గరకి రప్పించుకోగల స్థానంలో వుంది. అయినా ముక్త అతనికి ఫుడ్ ఆర్డర్ చేయలేదు.
“బఫే” అని స్టీవర్డ్ ని పంపించేసింది.

          ముక్త తన టేబుల్ దగ్గర నుంచి లేచి బఫే అరేంజ్ చేసిన ప్రదేశానికి వెళ్ళింది.
ఓ  ప్లేట్ తీసుకొని అక్కడ అమర్చిన పదార్థాల్ని ఓసారి చూసింది.
– రంగురంగుల పళ్ళు, అనేక వర్ణాలతో మెరిసిపోతున్న సలాడ్స్, తళతళలాడే వెజ్, నాన్‌వెజ్ డిషెస్, ప్రతి పాత్ర ముందూ ఆయా వంటకాల పేర్లను తెలిపే లేబిల్స్, ప్లేన్ రైస్, జీరా రైస్, ఫ్రైడ్ రైస్.

          ప్లేట్ పట్టుకొని, వేటిని ముందు వడ్డించుకోవాలా అని ఆలోచిస్తూ నిలబడిపోయింది. యెన్నిసార్లు చూసినా యెప్పుడూ తనకేం తినాలనుందో తెలీని స్థితి. అలా అని తనకేది యిష్టమో తెలీని పరిస్థితేం కాదు. ఆమెకు చేపల కూరంటే ఇష్టం. కానీ యే ముల్లన్నా గుచ్చుకుంటుందేమోనని భయం. బోన్‌లెస్ ఫిష్ అన్నా ఆమెకి భయమే.
యెక్కడన్నా ఓ ముల్లు వుంటుందేమోనని.

          ఆమె ప్లేట్‌లో కొన్ని సలాడ్ ముక్కలు వేసుకుంది. కొద్దిగా జీరా రైస్ తీసుకొని చేప ముక్కలు యెన్ని వేసుకోవాలా అని ఆలోచిస్తూ నిలబడింది. రెండు ముక్కలు వేసుకొని మరో ముక్క వేసుకోవాలనిపించినా ‘యెవరైనా చూస్తారేమో!’ అనుకుంటూ వెళ్లి తన టేబుల్ దగ్గర కూర్చొంది. చుట్టూ చూసింది. యెవరూ ఆమె వైపు చూడటం లేదు. అసలు యెవరూ మరొకర్ని పట్టించుకోవడం లేదు. అంతా వాళ్ళ వాళ్ళ ఛాయిస్ తోనే తమ కోసం తాము అన్నట్టే వున్నారు. యెవరి హడావిడి వాళ్లది. ‘తనే అందర్నీ అనవసరంగా పట్టించుకుంటోందా’ – ముక్తకి అనుమానం వేసింది.
నిజంగా యిది వొట్టి అనుమానమేనా?
ఆమె చూపుని యెంత వొద్దనుకున్నా పదేపదే ఆ పాపలిద్దరి వైపు మరల్చకుండా వుండలేకపోతోంది. యే ఆలోచనల నుంచి పారిపోవాలని బృంద దగ్గరకి వచ్చిందో అవే ఆలోచనలు వొదలటం లేదు. పైగా మరింత బలంగా గుర్తొస్తున్నాయి.

          కూర్చున్నచోటనే వెనక్కి వాలింది ముక్త.

          – చిన్నతనం. స్కూల్లో చదువుకునే రోజులు. మనసంతా ఆటల మీదా, ఆటబొమ్మల మీదా లగ్నమయ్యే వయస్సు. స్కూల్లో పిల్లలు కబాడీ ఆడుతున్నారు. ఒక జట్టులో తనూ వుంది. తను కూతకి వెళ్ళింది – అవతలి జట్టు మీదకి –“కబాడీ… కబాడీ… కబాడీ” – ఆలోచనలు మాత్రం యింటినీ, తండ్రినీ గుర్తుచేస్తున్నాయి. తననెవరో “యిల్లూ… యిల్లూ… యిల్లూ…” అంటూ తరుముతున్నారు. ఆట సాధ్యం కావడం లేదు. తను అర్ధాంతరంగా కూత ఆపేసి కబాడీ కోర్టు నుంచి పుస్తకాల సంచివేపు పరిగెత్తింది.
“నువ్వెప్పుడూ అంతే! ఆట మధ్యలో వెళ్ళిపోతావ్. యిలా అయితే రేపట్నుంచీ మాతో ఆడొద్దు” – నీరజ యెత్తిపొడుస్తోంది. అయినా వెళ్లక తప్పదు. తను త్వరత్వరగా యిల్లు చేరింది.

          యింటికి వెళ్లేసరికి అక్క పుస్తకాల ముందు కూర్చొని వుంది. తనూ యూనిఫాం మార్చుకొని పుస్తకాలని ముందేసుకొని కూర్చొంది.

          “ఆ ఆటలు ఆడకపోతేనేం? మీ నాన్నగారు వచ్చే టైముకి యింటికి వస్తావో లేదోనని తెగ కంగారుపడ్డాననుకో. మీ నాన్నగారి సంగతి తెలుసుగా. త్వరగా రావొచ్చుగా” తను రావడం చూసి ఆత్రుత తగ్గిన గొంతుతో అన్నది తల్లి.

          తను పుస్తకాల ముందైతే కూర్చోగలిగింది కానీ మనసు చదువుమీద లేదు.
“ఆటలూ, బొమ్మలూ తిండి పెట్టవ్. బాగా చదువుకోవాలి. మంచి మార్కులు రావాలి” తండ్రి మాటలు లీలగా గుర్తొస్తున్నాయి.

          యిలాంటి మాటల మధ్యే తన చిన్నతనం గడిచింది. ఆ మాటల వల్ల తను యేo సాధించిందో తెలీదు. కానీ కోల్పోయింది మాత్రం చాలానే ఉంది. గెలవగలనని నమ్మిన పోటీల నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడం యెంత బాధాకరం!

          తను వాలీబాల్ ప్లేయర్.

          సర్వీస్ చేయడంలోనూ, ప్రత్యర్థులకు అందకుండా లిఫ్ట్ ఇవ్వడంలోనూ, రెప్పపాటులో కట్ కొట్టడంలోనూ – టీములో తనదే పై చేయి. ‘ముక్త టీమ్ కి గెలవడం తప్ప ఓటమి తెలీదు’. టీచర్లంతా ప్రశంసించేవారు. అయినా తనేం సాధించగలిగిందీ?
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలకు టీమ్‌ని యెంపిక చేస్తున్నారు. జిల్లాలోని అన్ని పాఠశాలల నుంచీ విద్యార్థులు వొచ్చారు. ఉదయం నుంచీ సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఆడిన ప్రతీ ఆటలోనూ తను గెలుపుని సొంతం చేసుకుంది. యిక టీమ్ ఫైనల్స్ సెలక్షన్ మాత్రమే మిగిలింది. అప్పటికే తను యింటికి వెళ్ళాల్సిన సమయం మించిపోయింది.
అమ్మ మాటలు, నాన్నగారి మందలింపులు చెవుల్లో మారుమోగుతున్నాయి. వెళ్ళాలా, ఆడాలా? తన నడక యెటు?యింటికా, కోర్టుకా? “వెళ్ళిపోతాన”ని డ్రిల్ టీచర్‌కి చెప్పా లంటే సిగ్గుగా అనిపించింది. టీమ్ సెలక్షన్ ఆలస్యమయ్యేకొద్దీ మనసులో ఆందోళన. తట్టుకోవడం కష్టంగా వుంది. తల పగిలిపోతోంది.

          ఆఖరి నిముషం – సరిగ్గా ఆఖరి నిముషంలో మిగతా ప్లేయర్స్ ఉత్సాహంగా ఆటకి సిద్ధమవుతుండగా తను ఒకర్తీ యెవరికీ చెప్పకుండా పుస్తకాల సంచీ తీసుకుని యింటికి పరిగెత్తింది. పరిగెత్తుతుంటే చెంపల మీంచి కన్నీళ్లు ధారలు కట్టేయి.

          ఆ సంఘటన గుర్తురాగానే ముక్త కళ్ళు చెమ్మగిల్లాయి – మళ్ళీ.

          “యేమైనా ఆర్డర్ చేస్తారా? యెనీ డిజర్ట్, తీసుకురానా” స్టీవర్డ్ అడుగుతుంటే అతని వేపు బ్లాంక్‌గా చూసింది ముక్త.

          ఐస్‌క్రీమ్, ఫ్రూట్ సలాడ్ – యెన్ని తిన్నా లోపలి మంట ఆరుతుందా?

          బిల్ చెల్లించి ముక్త కిటికీలోంచి బయటకి చూసింది. కొద్దిగా కనిపిస్తున్న అరేబియా అలలు.

          రెస్టారెంట్ లోంచి బయటికొచ్చింది. యె.సి. లోంచి బయటకి రావడంతో బయట యెండ తీవ్రత వున్నదానికన్నా యెక్కువనిపించింది. టాక్సీ డ్రైవర్ కి అడ్రస్ చెప్పింది. మెరైన్ డ్రైవ్ మీద టాక్సీ స్పీడ్ లిమిట్లో వెళ్ళుతోంది.

          హైదరాబాద్ లో ఆటో లెక్కువ. యిక్కడ ఆటోలే కనిపించవ్. యెటు చూసినా టాక్సీలే!

          డింపుల్ అపార్ట్‌మెంట్స్ ముందు టాక్సీ ఆగింది. లిఫ్ట్ దగ్గర పెద్ద క్యూ. ఆరో అంతస్తులో వున్న బృంద ఫ్లాట్ ముందు నిలబడి తన దగ్గరున్న కీతో తాళం తీసింది ముక్త. లోపలికొచ్చి హేండ్ బ్యాగ్‌ని దివాన్ పక్కన పడేసి దివాన్ మీద వాలిపోయింది. చెయ్యి చాపి ఫేన్ స్విచ్ వేసింది. బృంద ఆఫీసు నుంచి యెప్పుడొస్తుందో తెలీదు. అప్పటి వరకూ ముక్తకి కావలసినంత ఏకాంతం. యీ ఏకాంతం కోసమే యీ మధ్య తరచుగా బృంద దగ్గరకి వచ్చేస్తోంది.

          రిమోట్ చేతిలోకి తీసుకొని టీవీ ఆన్ చేసింది. ఛానల్ వెంట ఛానల్ – బుల్లి తెరపై మారుతున్న దృశ్యాలు – పార్లమెంట్ న్యూస్. ‘బాబ్డ్ హెయిర్ ఆడవాళ్ళు, ఆడవాళ్ళు కాద’ని ఓ నాయకుడు ఆవేశంగా మాట్లాడుతున్నాడు.

          బాబ్డ్ హెయిర్ ఆడవాళ్ళంటే జుట్టు కత్తిరించుకున్నవాళ్ళు అనేకాదు అతని వుద్దేశం. డబ్బుండో, ఉద్యోగాలు చేస్తూనో ఉద్యమాలు చేస్తూనో స్వేచ్ఛగా, స్వతంత్రంగా కనిపించే స్త్రీల చుట్టూ కూడా యెన్ని కంచెలున్నాయో, వేషభాషలకే గుండెలు బాదుకునే వాళ్లకేం తెలుస్తుంది?

          దృశ్యాలు చూపులని ఆకట్టుకోవడం లేదు. యే శబ్దమూ వినసొంపుగా లేదు. అయినా ముక్త టీవీని కట్టేయలేదు. దృశ్యం వెంట దృశ్యం – రకరకాల ఫ్రీక్వెన్సీలలో శబ్దాలు చుట్టుకొంటున్నాయి.

          ముక్త తన చేతిలోని రిమోట్ వేపు చూసింది. చిన్న బటన్ నొక్కితే చాలు టీవీ ఆగిపోతుంది. ‘అయినా నేనెందుకు నొక్కడం లేదూ! యిష్టం లేకున్నా ఆ దృశ్యాలనీ, శబ్దాలనీ యెందుకు భరిస్తున్నాను’ అనుకుంది ముక్త.

          టీవీనే కాదు. తను చాలా భరించింది. భరిస్తోంది.

          బాధా సందర్భాలు యిప్పుడిప్పుడే గుర్తొస్తున్నాయి. యెన్నెన్నో గుర్తొస్తున్నాయి. అన్నయ్యలానే తనూ కాంపిటీటివ్ యెగ్జామ్ పాసయింది. యింటర్వ్యూ బాగా చేసింది. కొద్ది నెలల తేడాతో యిద్దరికీ వుద్యోగాలు వచ్చాయి.

          మొదటి నెల జీతం వొచ్చింది.

          ఆ రోజు యెంత సంబరం. అన్నయ్య తన తొలి జీతాన్ని అమ్మ చేతుల్లో పెట్టినట్లే తనూ ఆమె చేతుల్లో జీతం వుంచింది. అమ్మ కళ్ళల్లో యెంత వెలుగు. నెల తర్వాత నెల. తర్వాత నెలా, యిలా యెన్నో నెలలు గడిచాయి. కానీ యేo జరిగింది.

          అన్న జీతం గురించి యెప్పుడూ యే లెక్కా లేదు. వాడు యెంత పాకెట్‌మనీగా తీసుకుంటే అంత, యెంత యింట్లో యిస్తే అంత! తను అణాపైసల్తో సహా యివ్వాలి. అవసరానికి మాత్రం అడిగి తీసుకోవాలి. లెక్కలు చెప్పాలి. యేo కొనుక్కోవాలన్నా పర్మిషన్లు తీసుకోవాలి. బస్‌పాస్‌లు, ఆటో ఛార్జీలు, కేంటీన్ ఖర్చులు – యింతే. వీటికీ లెక్కా పత్రం వుండాలి. ‘యింట్లో తెలీని ఖర్చులు ఆడపిల్లలకేం వుంటాయి’ అమ్మానాన్నల సవరింపులు.

          “సిన్మాకెళ్తారా? యెక్కువమందిని తీసుకెళ్ళకు. యెవరి టిక్కెట్లు వాళ్ళే తీసుకోండి.”
“పిక్నిక్ యెందుకులేమ్మా! బోల్డంత ఖర్చు” యివే మాటలు యేo అడిగినా. యెప్పుడైనా డబ్బుల గురించి అడిగితే –“నీ సంపాదన మాకెందుకూ? నీ పెళ్లి ఖర్చులకనే అకౌంట్‌లో వేస్తున్నాం” అని దబాయింపు.

          యేమనగలదు తనూ? తల వొంచుకుంది. నోటిలో మాటని నోటిలోనే దాచుకొంది. గుండెలో బాధని గుండెలోనే దాచుకొంది. బాధని మాత్రమే దాచుకో గలిగింది. కానీ వొక్క పైసాని కూడా దాచుకోలేక పోయింది.

          అన్నయ్యకి ఓ యిల్లు. బ్యాంక్ యెకౌంట్. మోటర్ సైకిల్. కారు కూడా త్వరలో లోన్ తీసుకొని కొనుక్కోబోతున్నాడంట.

          ముక్త గోడకి చేరగిలబడి బృంద యింటిని పరిశీలనగా చూసింది. పొడవైన హాలు. స్టాండింగ్ కిచన్. హాలుకి ఆనుకొని ఓ బాల్కనీ.

          ఆ హాల్లో గోడవారగా ఓ పరుపు పరిచి వుంది. పరుపు పై మహారాష్ట్ర చేనేత దుప్పటి పరిచి వుంది. రెండు దిళ్ళు. దిళ్ళ పక్కనే కప్పుకోటానికి దుప్పటి. మరో వారగా దివాను పరుపు, దిళ్ళు వేసున్నాయి. నేల మీదే కూర్చుని చూడటానికి వీలుగా పోర్టబుల్ కలర్ టి.వి. వో వైపు ఫ్రిజ్,యిస్త్రీ పెట్టె, గ్యాస్ స్టవ్, కుక్కర్, క్యారమ్ బోర్డ్. అనవసరంగా ఆ యింట్లో వొక్క స్పూన్ కూడా లేదు. కావలసినంత సామాను. సింపుల్‌గా క్యూట్‌గావున్న ఆ యింటిలో ముక్తని యెప్పుడూ ఆకర్షించేవి గోడల మీద పెయింటింగ్స్. యెంతో నచ్చిన లక్ష్మణ్ ఏలే పెయింటింగ్‌ని కాసేపు చూస్తుండి పోయింది.

          దాహం చేస్తుంటే లేచి వెళ్లి మంచినీళ్ళు తాగింది. కిచెన్ లోకి వెళ్లి టీ కలుపుకొని తిరిగి హాల్లోకి వచ్చింది. బృంద అల్లుతూ మధ్యలో వున్న స్వెటర్ తీసుకొని అల్లటం మొదలుపెట్టింది.

***

          సాయంత్రం యేడవుతుంటే బృంద వచ్చింది. బృంద ముఖం కడుక్కుని వచ్చేలోగా టీ చేసింది ముక్త.

          “థ్యాంక్ యూ. మధ్యాహ్నం యేమైనా తిన్నావా” అడిగింది బృంద.

          “నీ ఫేవరెట్ రెస్టారెంట్‌కి వెళ్లాను”.

          “అంబాసిడర్?”

          “ఆ”

          “రేపు ఆదివారం కదా,యెక్కడికైనా వెళదామా?” అడిగింది బృంద.

          “వూ”

          “ఎలిఫెంటా కేవ్స్‌కి పోదామా?”

          “మనిద్దరమే?”

          “మనిద్దరమే యేoటి? నేనొక్కదాన్ని కూడా వెళతాను తెలుసా?యేo చేసుకుందాం డిన్నర్‌కి?” అడిగింది బృంద.

          తను వొక్కర్తీ వున్నప్పుడు కూడా యింట్రస్టింగ్‌గా వంట చేసుకుంటుంది బృంద.
“వెజిటబుల్ బిర్యాని చేద్దామా?” అడిగింది బృంద.

          “వూ”

          కూరలు, చాకు, పీలర్ తీసుకొని బాల్కనీలోకి వెళ్ళారు. బంగాళాదుంపలు చెక్కు తీస్తూ “మీ యింటికి నువ్వెప్పుడైనా వెళతావా?” అడిగింది ముక్త.

          “వూ”

          “మీ పేరెంట్స్, అక్కలు అన్నలు చాలామంది యీ సిటీలోనే వున్నారు కదా. అయినా వాళ్ళతో కలిసి లేకుండా యిలా వొంటరిగా వుండటానికి మీ వాళ్ళు వొప్పుకున్నారా?” అడిగింది ముక్త.

          “మొదట్లో వొప్పుకోలేదు. రెండేళ్ళు వాళ్ళతోనే వున్నాను. నా వల్ల కాలేదు” అంది బృంద.

          “అంటే?” ఆత్రుతగా అడిగింది ముక్త.

          “మొదట్లో నా ఆఫీసుకి అన్నయ్యావాళ్ళ యిల్లు దగ్గరని వాళ్లింట్లో వుండమన్నారు. వుదయం లేచి వదినకి వంటలో సాయం చేయటం, వాళ్ళ పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేయటం, హడావుడిగా ఆఫీసుకు పరిగెత్తడం, వాళ్ళిద్దరూ పిల్లల్ని నాకు అప్పజెప్పేసి సినిమాలకి, పార్టీలకి, పిక్నిక్స్‌కి, ఫ్రెండ్స్ యిళ్ళకి వెళ్ళిపోయేవారు. నేయెక్కడికైనా వెళ్ళాలన్నాననుకో, ‘అరే, మేం సినిమాకి వెళ్లాలనుకున్నాం, మిసెస్ జోషి ఫ్యామిలీకి చెప్పాం’ అనో మరోటో అనేవారు. యేడాదిపాటు వాళ్ళ పిల్లల్ని పెంచాను. యెప్పుడైనా అయితే పర్లేదు. రోజూ పిల్లల్ని చూడాలంటే భలే కష్టం. వాళ్లింట్లో వుంటున్నందుకు ప్రత్యేకంగా డబ్బులు తీసుకునేవారు కాదు. కాని నా జీతమంతా ఆ యింట్లో పిల్లల బట్టలకూ, స్కూల్ ఫీజులకూ, పుట్టిన రోజుల సంబరాలకూ, పండుగలకూ ఖర్చు అయిపోతుండేది. ‘నువ్వీ ఖర్చు భరించు’ అని స్పష్టంగా చెప్పరు. కానీ డబ్బులు యిచ్చేట్టు ప్రవర్తించేవారు.

          నా కోసం టైమ్ మిగిలేది కాదు.

          పిల్లల కోసం ఖర్చు చేసినందుకో, మరిన్ని ఖర్చులతో నాకంటూ అస్సలు మనీ వుండటం లేదనో, నా టైం, నా స్పేస్, నా మనీ నాకూ కావాలని యెప్పుడైనా బాధపడటం చూసియింట్లో వాళ్ళు ‘అదేంటి వాళ్ళేమైనా పరాయి పిల్లలా, అన్న పిల్లలే కదా!’ అనేవారు. యిప్పటికీ ‘అన్నలని, పిల్లల్ని కూడా కాదనుకొనే మీరేం మనుష్యులూ’ అంటూనే వుంటారు. యేo చెయ్యాలని ఆలోచించేసరికి మరో యేడాది గడిచిపోయింది. చివరికి నాకంటూ నేనొక స్పేస్‌ని క్రియేట్ చేసుకోటానికే నిర్ణయించుకున్నాను. వర్కింగ్ విమెన్ హాస్టల్‌కి వెళ్ళాను. అక్కడ నుంచి వో గది అద్దెకి తీసుకొన్నాను. యిదిగో, చివరికి యీ సొంత యింటిని యేర్పాటు చేసుకున్నాను. నయాపైసా సాయం చేయనని, పిసినారిని అక్కలు, అన్నలు, బంధువులు అంటుంటారు. అలా అని వాళ్ళందరి ముఖాలు చూడనని కాదు. యివ్వాలనిపించినప్పుడు నాకు వీలుగా వుంటే వాళ్లకి గిఫ్ట్స్ యిస్తాను. పుట్టిన రోజులప్పుడూ, పండుగలప్పుడూ గ్రీట్ చేస్తాను. పిల్లలకి హాలిడేస్ యిచ్చినప్పుడు వాళ్ళని తీసుకొని బయటకి వెళతాను. అక్కలకి అన్నయ్యలకి వుద్యోగాలున్నాయి. వాళ్ళ సంపాదనకంటే యెక్కువ ఖర్చులు చేస్తూ వాటిని నన్ను భరించమంటే భరించను. మా నాన్నమ్మకి మాత్రం ప్రతి నెలా కొంత డబ్బు పంపిస్తాను. తాతగారికి వచ్చే పెన్షనే ఆమెకి ఆదాయం” అంది బృంద.

          “వాళ్ళంతా నిన్ను అలాంటి మాటలు అంటుంటే నీకు బాధగా వుండదా?”
“వుండేది. రాను రాను వాళ్ళంతే, నేనింతే అనుకొని వూరుకొంటున్నాను. అందరి మాటలకీ రియాక్ట్ అవ్వటం మొదలుపెడితే చివరికి మనకి మనమే మిగలం. యెనీ ప్రాబ్లమ్? యెప్పుడూ లేనిది యిలాంటి ప్రశ్నలు వేస్తున్నావ్” అడిగింది బృంద.
ముక్త ముఖమంతా అవ్యక్తమైన బాధ.

          “అక్కావాళ్ళు యిల్లు కట్టుకొంటారట. నన్ను ఆఫీస్‌ నుంచి లోన్ తీసి యిమ్మని బావగారు అడిగారంట. మా యింట్లో అమ్మాయిలా చూసుకుంటున్నాం. ఆ మాత్రం యివ్వలేవా? యీ యిల్లు నీది కాదా యేoటి? యెప్పటికైనా మేమే కదా నీకు? నా పిల్లలే కదా యెప్పటికైనా నిన్ను చూసుకునేది నువ్వు పెద్దదానివయ్యాక అంటున్నారు.
వుద్యోగంలో చేరినప్పట్నుంచి వొకే వూరిలో వుంటూ నువ్వు బయట వేరే వుంటే బాగుండదని వాళ్ళింట్లోనే వుండమన్నారు. అలా గత కొన్నేళ్లుగా ఆ యింట్లోనే వున్నాను. నాకంటూ వో పైసా మిగల్లేదు. నాకంటూ ఆ బట్టలు తప్ప మరో వస్తువు సమకూర్చుకో లేదు. పైగా వాళ్లింట్లోని ఫ్రిజ్, వాషింగ్ మిషన్, వాక్యూమ్ క్లీనర్లాంటివి యిన్స్టాల్‌మెంట్స్‌ లో తీసుకున్నారు. ఆ కార్డ్స్ అన్నింటిపై నాతో సంతకాలు చేయించారు. అవి ప్రతి నెలా పే చెయ్యాలి. యేమైనా అంటే యీ పిల్లలు నీ పిల్లలు కారా అంటారు. నాకు వూపిరాడడం లేదు. పైగా నాకంటూ యీ రోజు వరకు స్నేహితులు లేరు తెలుసా? కాలేజీ రోజులతోనే స్నేహాలు ఆగిపోయాయి. వో సారి మా ఆఫీసులో అమ్మాయి నాకు కాస్త దగ్గరకి వచ్చింది. అప్పుడప్పుడూ యింటికి వచ్చేది. మేం యిద్దరమే మాట్లాడుకోవడానికి వీలయ్యేదే కాదు. ఆఫీసు నుంచి యింటికి ఆలస్యంగా వస్తే బోల్డన్ని యెక్స్‌ప్లనేషన్లు యివ్వాలి. సినిమాలకైనా, యెక్కడికి వెళ్ళినా యింట్లో వాళ్ళతోనే వెళ్ళాలి. అలా యింటికొచ్చే అమ్మాయితో యింట్లోవాళ్లు తగాదా పెట్టుకున్నారు. అప్పట్నుంచి నిజానికి యిక్కడికి నీ దగ్గరకి వచ్చినప్పుడు కూడా ఆఫీసు పని అని చెప్పాల్సి వస్తోంది. మొదటిసారి నీ దగ్గరకనే వచ్చాను. అప్పుడు యింట్లో పెద్ద గొడవ జరిగింది. నువ్వు తాగుతావన్నారు. అందర్నీ వదిలి వేరే యింట్లో వుంటావన్నారు. నీ చెడ్డతనాన్ని హితబోధ చేశారులే. నువ్వు నాకు రాసిన వుత్తరాలు వీళ్ళు చదువుతున్నారని అర్థమయింది. అప్పట్నుంచి వాటిని ఆఫీసులో టేబుల్ డ్రాలో పెట్టి లాక్ చేస్తున్నాను” అంది ముక్త.

          కట్ చేసిన కూరగాయముక్కలని వంటింట్లోకి తీసుకువెళుతూ “నువ్వు పెళ్లి చేసుకోకూడదనుకున్నావా? లేక కాలేదా?” అడిగింది బృంద.

          “అంటే?”

          “నేనయితే పెళ్లి చేసుకోకూడదనుకున్నాను. నువ్వేం అనుకున్నావ్?” అని అడిగింది బృంద.

          “చదువుకునే రోజుల్లో,వుద్యోగంలో జాయిన్ అయిన మొదట్లో పెళ్లి చేసుకోకూడదని నేనేం అనుకోలేదు. ‘నీ కట్నం కోసం జీతం దాస్తున్నాం’ అనేవారు. వాళ్ళే యేదో వొక సంబంధం చూసి పెళ్లి చేస్తారేమో అనుకున్నాను” అంది ముక్త.

          “నీకు చేసుకోవాలని వుంటే యిప్పుడు నువ్వే నీకు నచ్చినవాళ్ళెవరినైనా చేసుకోవచ్చుగా.”

          “పెళ్ళా?! వద్దు. యిప్పుడు పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు బృందా”.

          “యేo ?”

          “యింతమందిని చూస్తున్నానుగా. అందులోని యిరుకు బానే అర్థం అయింది. పెళ్లి చేసుకునే ధైర్యం లేదు. ఆ జంజాటం లోకి వెళ్ళాలని లేదు” అంది ముక్త.

          “నువ్విప్పుడా జంజాటంలో లేవా” కుక్కర్ స్టవ్ మీద పెడుతూ అడిగింది బృంద చిన్నగా నవ్వుతూ.

          ముక్త, బృంద వేపు వో క్షణం చూసి “నువ్వు నిజంగానే పెళ్లి చేసుకోమనే అంటున్నావా” అడిగింది.

          “పెళ్లి చేసుకోవటమో లేదో నీ యిష్టం. పెళ్లి వద్దు అనుకుంటే యెందుకొద్దను కొంటున్నామో మనకి తెలియాలి కదా. యెలాంటి జీవితాన్ని కావాలనుకుని పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకొన్నామో అలాంటి జీవితాన్ని నిర్మించుకోవడానికి ప్రయత్నించాలి కదా” – అంది బృంద.

          “బాప్‌రే! పెళ్ళా?! వద్దు. కోరి కష్టాలు తెచ్చుకోవటమే అవుతుంది” అంది ముక్త.

          కుక్కర్ మూతపై వెయిట్ పెట్టి బాల్కనీలోకి వచ్చి గోడకి ఆనుకొని నిలబడుతూ మాట్లాడసాగింది బృంద. “పెళ్లి అనేది మనకి కాస్త వయసొచ్చాక, జ్ఞానం వచ్చాక జరుగుతుంది. సో మనం అందులోకి వెళ్ళాలో అక్కర్లేదో నిర్ణయించుకునే అవకాశం వుంది. ఆ వొక్క బంధుత్వాన్ని వద్దనుకున్నంత మాత్రాన మనం కుటుంబానికి దూరంగానో, వెలుపలో వున్నట్టేనా? మనకి యిష్టం వున్నా లేకపోయినా అందులోనే పెరుగుతాం. ఆ కుటుంబం నుంచి మనం దూరంగా యెలా వెళతాం? కుటుంబం అంటే భార్యాభర్త సంబంధాలే కాదు కదా. అమ్మ, నాన్న, అన్న, అక్క, తమ్ముడు, వదిన సంబంధాలుంటాయి కదా. యీ బంధుత్వాలని మోర్ డెమోక్రటిక్‌గా, మరింత స్నేహపూరితంగా యెలా మలచుకోవాలి? న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చినప్పటికీ మనిషికీ మనిషికీ మధ్య సంబంధాలలో బాధ పోలేదుగా. సింగిల్ వుమెన్‌గా జీవితం సాగించాలని మనం అనుకున్నప్పుడు యింట్లోని యెవరైతే మనల్ని బలంగా వ్యతిరేకిస్తారో వాళ్ళే కొంత కాలం గడిచేటప్పటికి మనం తిరిగి యే కొత్త స్నేహాల్లోకీ వెళ్ళకుండా చూస్తారు. మనం అలా వొంటరిగానే వుండి పోవాలనుకుంటారు. వాళ్ళకది లాభం. వాళ్ళ పిల్లల్ని, ఖర్చుల్ని, కోరికల్ని, ఆశల్ని కన్వీనియెంట్‌గా మనపైకి తోసేస్తారు. వీటి నుంచి బయటపడడం యెలా? ‘భర్త’ అనే మగవాని పెత్తనాన్ని వద్దనుకుంటే యెలాగోలా వదిలించుకోవచ్చు. మరి యీ యింట్లోవాళ్ల అధికారాన్ని, పెత్తనాన్ని, నిరంకుశత్వాన్ని యెలా వదిలించుకోవాలి?వూహరాని కాలం నుంచి వాళ్ళందరితో మన జీవితం పెనవేసుకు పోతుంది కదా. అనుబంధముంటుంది. ప్రేమ వుంటుంది. బోల్డంత సెంటిమెంట్ ముడిపడి వుంటుంది కదా. వీళ్ళతో పోరాట్టం కష్టం. అందులోంచి బయటపడే రోజుల్లో యెంతలా బాధపడ్డానో? రోజూ యేడవటమే. పెళ్లి వద్దన్నామంటే సర్వసంగపరిత్యాగం చేస్తున్నామనో, సొంత జీవితం వుండదనో అనుకుంటారు. ‘సంపాదనని, శ్రమని, సమయాన్ని అందరికీ పంచిపెట్టేస్తూ బ్రతికేస్తాం’ అనుకుంటారు. పెళ్లి లేకుండా కూడా జీవితం వుంటుందని, జీవితాన్ని నిర్మించుకునే కలలుకంటామని వాళ్లకి అర్థం కాదు” ముక్త ప్లేట్‌లో బిరియానీ వేస్తూ అంది బృంద.

          “యిందులోంచి యెలా బయటపడాలి?” అని అడిగింది ముక్త.

          ‘యేమో’ అన్నట్లు బృంద భుజాలు యెగరవేసింది.

          “ముక్త పరధ్యానంగా తినడం చూసి బృంద “యెలా వుంది?” అడిగింది.

          “వూ… బాగుంది”

          స్టార్ న్యూస్ వస్తోంది.

          బృందకి ప్రణయ్‌రాయ్ న్యూస్‌ని ప్రెజెంట్ చేసే తీరు చాలా యిష్టం. యాడ్ రాగానే కిచెన్‌లోకి వెళ్లి యింకాస్త బిర్యాని వేసుకొచ్చి “వేయనా” అని ముక్తని అడిగింది.

          అనురాధ వెదర్ ఫోర్‌కాస్ట్ చెపుతోంది.

          “భలే చెపుతుంది కదా. రహస్యాలు చెప్తున్నట్టు” అంటూ ప్రణయ్‌రాయ్ కంటే ముందే “థ్యాంక్ యూ అనురాధా” అతన్ని యిమిటేట్ చేస్తూ అంది బృంద.

          “భలే యిమిటేట్ చేస్తున్నావే” అంది ముక్త నవ్వుతూ.

          యెక్కడ గిన్నెలు అక్కడ సర్దేశారు.

          “నిద్రొస్తోందా?” అడిగింది బృంద.

          “లేదు”

          “క్యారమ్స్ ఆడదామా?” అడిగింది బృంద.

          “వూ”

          క్యారమ్స్ ఆడుతున్నారు. ముక్తకి అక్క ముఖం గుర్తొస్తూంది. స్కూల్‌కి యిద్దరూ కలిసి వెళ్ళటం. తన టిఫిన్ బాక్స్ మోసే అక్క. లంచ్ పీరియడ్లో తన బాక్స్‌లోని టిఫినో, అన్నమూ పూర్తిగా తినేట్టు చూసే అక్క. తన బుగ్గలని ముద్దంటూ తోటి పిల్లలో పెద్దలో గిల్లుతుంటే పోట్లాడే అక్క. తనకి నచ్చని బట్టలు యిచ్చేసే అక్క. పెద్దయ్యాక కూడా తనకి కుంకుడు రసంతోనే తలంటే అక్క. ఆఫీసు నుంచి రాగానే కాఫీ అందించి టిఫిన్ పెట్టే అక్క. జ్వరమొచ్చినా, తలనొప్పి వచ్చినా తల్లడిల్లిపోయే అక్క. అలాంటి అక్కతో “యింటికి లోన్ తీసుకొని యివ్వలే”నని యెలా చెప్పటం? తన చుట్టూ అప్పులు. తనకంటూ లేని జీవితం. బంధుత్వాల కంచె. పెళ్లి, పిల్లలు లేనంత మాత్రాన నాకంటూ వో యిల్లు యేర్పరచుకోకూడదా? వద్దంటూ యెందుకిలా వీళ్ళంతా నన్ను వాళ్ళ వాళ్ళ యిళ్ళల్లో వుండమని వొత్తిడి చేసేవారు? కుటుంబ సంబంధాల్లో నిజంగా ప్రేమ,యిష్టమే అయితే యెవరి యిళ్ళల్లో వాళ్ళు వున్నప్పటికీ అవి అలానే వుండాలి కదా! యెందుకిన్ని ఆలోచనలు అనుకుంటూ “యీ సిటీలో మన ఆఫీస్ బ్రాంచ్ వుంది కదా. యిక్కడికి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుంటాను” క్రిస్టల్ క్లియర్ వాయిస్‌తో అంది ముక్త.

          “కంగ్రాట్స్. విముక్తమవుతోన్న ముక్త” అంటూ నవ్వింది బృంద.

          “విముక్తా!? అప్పుడే యెక్కడా?” అంటూ నవ్వింది ముక్త.

(ఆదివారం ఆంధ్రజ్యోతి, జూన్ 1997)

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.