నిష్కల – 23

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న మొదటి భార్య ఎక్కడుంది ? అని సారాని ప్రశ్నిస్తుంది. మాటల్లో తన తల్లి గురించి చెబుతుంది నిష్కల.  

***

          సారా ముఖంలోకి చూస్తూ ” తండ్రిగా ఆయన ఆలన పాలనా ఎరుగను.  అమ్మైనా, నాన్నైనా అన్నీ మా అమ్మే. నా మట్టుకు నాకు ఆయన  నా జన్మకు కారకుడు మాత్రమే. మా నాన్నమ్మ సుధా అంటుంది… “

          సారా ముఖంలో రంగులు మారుతున్నాయి.  నిష్కల మొహంలోకి సూటిగా చూడ లేక తల దించుకుంది. తానే తప్పు చేసినట్టు కుంగిపోతున్నది. నిష్కలతో మొదటి పరిచయం అప్పుడు ఇద్దరి పేర్లలో ఉన్న జలాల చూసి ఆశ్చర్యపోవడం గుర్తొచ్చింది. 

          సందేహం లేదు నిష్కల తన తోబుట్టువు. 
          నిష్ తనను సోదరిగా అంగీకరిస్తుందా..  
          తన తండ్రి  ఆమె తల్లికి చేసిన ద్రోహాన్ని మనసులో పెట్టుకుని నన్ను ద్వేషిస్తుందేమో..!  ఉహు .. నిష్ అలా చేయదు. ఆమె స్వభావం అది కాదు అని మనసులో తలపోస్తూ తలెత్తి “ఐయామ్ వెరీ సారీ నిష్ ” అంటూ నిష్కలను గుండెకు హత్తుకుంది. 
 
          ఆ ఉద్వేగపూరితమైన వాతావరణంలో ఒకరి మొహం లో కలిగే భావాలు మరొకరు చదువుకోకుండా చీకటి తెర కమ్మేసింది. 
 
          అన్ని క్యాంపింగ్ సైట్లలో సోలార్ లాంప్ లో, పొయ్యిలో వెలుగుతూ కనిపిస్తున్నాయి. 
వీళ్ళ సైట్ లో చీకటి .. వాళ్ళ హృదయాల్లాగే .. ఆ చీకటి నుంచి వెలుగులోకి రావడానికి యాతన పడుతున్నాయి ఆ రెండు మనసులు. 
 
          తెలియకుండానే ఇద్దరి కళ్ళలోంచి మౌనంగా నీళ్లు కారి చెంపలను దాటుకుని ఎదుటివారి భుజాన్ని తడిపేస్తూ .. వెచ్చటి కన్నీటి స్పర్శతో ఇద్దరూ ఈ లోకం లోకి వచ్చారు.  ఒకరినొకరు చేత్తో తడుతూ ఓదార్చుకున్నారు. కానీ ఇద్దరిలో తెలియని సందిగ్ధత, సందేహాలు .. 
 
          మొదట తేరుకున్న నిష్కల “ఆయనెక్కడుంటారు ?”  ప్రశ్నించింది. 
 
          “పై లోకంలో .. ఆ నక్షత్ర మండలంలో .. అక్కడి నుంచి నన్ను చూస్తూ ఉండి ఉంటారు. ” తండ్రి పోయినప్పుడు అమ్మ చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటూ సారా, 
నెత్తి మీద పిడుగు పడ్డట్టు అదిరిపోయింది నిష్కల. 
 
          నిష్కల బుర్ర వేగంగా ఆలోచిస్తున్నది.  ప్రతి ఏడాది మదర్స్ డే కి నాన్నమ్మ నాన్న పంపిస్తున్న గిఫ్ట్ అందుకుంటున్నది. అంటే, తాను  అనుకుంటున్నట్లు సారా తండ్రి, నా తండ్రి ఒకరు కాదా .. అతను ఇండియన్ అవడం వలన తాను పొరబడిందా..  మరి, నాన్నమ్మ పోలికలు పుణికిపుచ్చుకున్న సారా ..?
 
          మనిషిని పోలిన మనుషులు ఉంటారని అంటుంటారుగా! అది నిజమేమో..అని సర్ది చెప్పుకుందామని ప్రయత్నించింది.  కానీ ఆమె మనసు ఒప్పుకోవడం లేదు.  సారా తన తండ్రి కూతురు అనే నమ్ముతున్నది. అప్పటికప్పుడు సారా తండ్రి ఫోటోచూడాలని నిష్కల మనసు తొందరపడుతున్నది.. 
 
          “రియల్లీ ఐ యామ్ వెరీ సారీ .. సారా .. 
నేను పాడే పాట మీ నాన్నకు ఇష్టం అంటున్నావు. ఆయన్ని ఒకసారి చూడాలని అనిపిస్తున్నది. నువ్వు ఏమీ అనుకోనంటే మీ ఫ్యామిలీ ఫోటో .. ఇండియన్ తండ్రి, చైనీస్ తల్లి అమెరికన్ బిడ్డ” అంటూ సారాని నవ్వించడానికి యత్నిస్తూ అన్నది.. 
 
          నిష్కల ఇంకా తనని గుర్తించ లేదు. ఎవరో తెలిస్తే ఎలా ప్రవర్తిస్తుందో నన్న సంకోచం వెన్నాడుతుండగా ఫోన్ లో ఉన్న తన ఫ్యామిలీ ఫోటో చూపించింది సారా.  
మొబైల్ ఫోన్ టార్చ్ వేసి మరీ ఫోటో చూసింది. సందేహం లేదు సారా తన చెల్లెలు అనుకున్నది నిష్కల.  
 
          “మీ ఫ్యామిలీ ఫోటో .. “అడిగింది సారా …
 
          “మా ఫ్యామిలీ ఫోటో..  అమ్మ, నేను. ఇప్పుడు నాన్నమ్మ అంతే సారా.  మా నాన్నతో నాకు ఒక్క ఫ్యామిలీ ఫోటో  కూడా లేదు. నువ్వు అదృష్టవంతురాలివి.  కొంతకాలమైనా నువ్వు  తండ్రి ప్రేమ చవి చూశావు.  నేను పుట్టినప్పటినుండి నా తండ్రికి పరాయిదాన్ని”. అంటున్న నిష్కల గొంతులో జీర. దాన్ని దాటేస్తూ గలగలా నవ్వేసింది. 
 
          నా జిరాక్స్ కాపీని మళ్ళి ఒకసారి చూపించు నిష్ అడిగింది సారా  
 
          నీ జిరాక్స్ కాపీనా .. ఆమె జిరాక్స్ కాపీ నువ్వా .. నవ్వుతూ నిష్కల..
 
          గలగలా నవ్వేసింది సారా .. 
 
          ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు ఏడుగురు ఉంటారట చిన్నప్పుడు పెద్దలు అనుకుంటుంటే విన్నాను.  నిజమేనేమో .. ” అంటూ సారా మొహంలోకి పరీక్షగా చూసింది నిష్కల. 
 
          “హే.. నిష్ నువ్వు నమ్ముతావా.. ” అంటూ సారా లేచి సోలార్ లాంప్ వేసి వచ్చి కూర్చున్నది. 
 
          అంతలో మొబైల్ లో ఫోటో గ్యాలరీ లో తన ఫ్యామిలీ ఫోటో వెతికి తీసింది.  నాన్నమ్మ తాతయ్యలతో ముగ్గురు కొడుకులు ఉన్న ఫోటో చూపుతున్నప్పుడు నిష్కల లో అలజడి. తమ ఇద్దరి తండ్రి ఒక్కరేనని తెలిస్తే  సారా ఎలా స్పందిస్తుందో నని ఊగిసలాడుతూనే ఆ ఫోటో చూపింది. 
 
          సారా ఊహించని ఫోటో అది. చాలా ఆసక్తిగా ఫోన్ చేతిలోకి తీసుకుని పరిశీలన గా చూసింది.  ఆ తర్వాత నిష్కల మొహం లోకి పరీక్షగా చూస్తూ ” వీళ్ళు .. “అర్థోక్తి తో ఆగింది. 
 
          ” నాన్న మొదటి సారి దేశం దాటి వెళ్ళినప్పుడు తీసిన ఫోటో. కుడివైపు మొదటి వ్యక్తి  నా జన్మకు కారకుడైన నా తండ్రి, బాబాయిలు, వాళ్ళ మధ్యలో మా నాయనమ్మ తా… ” వివరించబోతుండగా  
 
          “నా .. కాదు నిష్, మన… మన.. అవును, నాన్న, నానమ్మ తాతయ్య, బాబాయ్ లు .. ”  ఉక్కిరి బిక్కిరి అవుతూ నిష్కల చేతులు తన చేతిలోకి తీసుకుని నొక్కి చెబుతున్న సారాను కళ్లప్పగించి చూస్తున్నది నిష్కల. 
 
          “అంటే…  మనిద్దరం… ” అంటూ లేచి నిష్కలను ఉద్వేగంగా హత్తుకుంది సారా 
సారా పరిచయం అయిన దగ్గర నుండి ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నది నిష్కల.  తీవ్ర ఉద్విగ్న భరిత క్షణాల్లో  ఆ అక్కాచెల్లెళ్ల హృదయ స్పందన కి భాష లేదు. గాఢ ఆలింగనంలో ఆ రెండు హృదయాలకు మౌనమే భాష అయింది. 
 
          “కొన్ని క్షణాల తర్వాత ఇదెలా సాధ్యం?  నిజమా..!
నమ్మలేకపోతున్నాను. కానీ ఈ ఫోటోలు నిజమని స్పష్టం చేస్తున్నాయి” గాఢంగా శ్వాస తీసుకుంటూ అన్నది సారా 
 
          “నమ్మలేకపోయినా నమ్మవలసిన నిజం సారా .. 
నిన్ను చూసినప్పుడు మొదట ఆశ్చర్యపోయాను. ఆ తర్వాత నీ పేరులో ఉన్న జలాల గురించి తెలిసినప్పటి నుంచి నాలో చాలా తెలియని అలజడి.  నీ గురించి తెలుసు కోవాలన్న ఆత్రుత .  కానీ ఎలా అడగాలో తెలిసేది కాదు .  డైరెక్ట్ గా అడిగితే  నువ్వు ఎలా తీసుకుంటావోనని సంకోచం .. నువ్వు నా చెల్లివి సారా..  నా చెల్లివి.  మనిద్దరం అక్కాచెల్లెళ్ళం.  మనది స్నేహం మాత్రమే కాదు. రక్త సంబంధం. ”  నిష్కల ఉద్వేగంగా 
 
          “అవును .. నిష్ . ఈ రోజు ఎంతటి సుదినం.   నా జీవితంలో ఇటు వంటి గొప్ప రోజు ఒకటి వస్తుందని, ఉంటుందని ఎప్పుడు ఊహించలేదు.  నాకు ఒక్క తోబుట్టువు కూడా  లేరని చిన్నప్పటి నుంచి గునిసేదాన్ని.  ఇప్పుడు నాకు నువ్వున్నావ్ .. అంతులేని సంతోషాన్నిచ్చావ్ . మన ఈ ట్రిప్ ని జీవితంలో మరచిపోలేను.  అంత గొప్ప బహుమతి అందించింది … ” మనసును పంచుకుంటున్నది సారా. 
 
          ఆ మాటలు నిష్కల హృదయంలోకి చేరడం లేదు.  ఆమెలో తండ్రి గురించిన ప్రశ్నల సుడిగుండాలు రేగుతున్నాయి .  తెలుసుకోవాలన్న ఆరాటం ఆమెలో. 
“ఇప్పుడు నా సందేహం ఒక్కటే .. నాన్న ఎలా .. ” అంటున్న నిష్కలను అర్ధం చేసుకున్న సారా విషయం అంతా వివరించింది. 
 
          “మరి నాన్నమ్మకు ప్రతి ఏటా మదర్స్ డే కి వచ్చే గిఫ్ట్?”  నిష్కల 
అమ్మ పంపిస్తున్నది .   నాన్న పోయిన విషయం బాబాయిలకు కూడా తెలుసు. యూకే నుంచి బాబాయి వచ్చారు.  అప్పటికి తాతయ్య పోయి కొన్ని నెలలే అయింది.  నాన్న మరణ వార్త నాయనమ్మకు చెప్ప వద్దని బాబాయే చెప్పారు.  వీలు చూసుకుని తానే చెప్తానని చెప్పారు అని వివరించింది సారా .. 
 
          “ఇప్పటి వరకు ఈ విషయం నాన్నమ్మకి, అమ్మకి, నాకు తెలియదు.  అత్త వాళ్లకు తెలుసో లేదో… నాయనమ్మ ప్రతి రోజు పెద్ద కొడుకుని తలుస్తునే ఉంటుంది.  బాబాయిలు నెలకోసారైనా  నాన్నమ్మతో మాట్లాడుతూ ఉంటారు .  రెండేళ్లకో , మూడేళ్లకో వచ్చి పోతుంటారు. 
 
          తన పై కోపంతోనే పెద్ద కొడుకు రావడం లేదని  మాట్లాడటం లేదని బాధ పడుతున్నది నాన్నమ్మ” చెప్పింది నిష్కల . 
 
          “ఐ అయామ్ వెరీ సారీ నిష్ .. మా అమ్మ నాన్నని చేసుకోవడం వల్లనే కదా నువ్వు తండ్రి ప్రేమ తెలియకుండా పెరిగావ్ ” తప్పు జరిగినట్లు తల వంచుకుంది సారా. తెల్లటి మొహం లో మారిన రంగులు ఆ వెలుతురులో స్పష్టంగా తెలియడం లేదు కానీ చాలా బాధ పడుతున్నదని  అర్ధం చేసుకున్నది నిష్కల. 
 
          “సారా.. మై డియర్ సిస్ .. కూల్  యార్ , కూల్ .. ఏంటి చిన్న పిల్లలా ఏంటి నువ్వు? 
 
          అందుకు మనం ఎవరినీ తప్పు పట్టలేం. పట్టా కూడదు కూడా .. అలా తప్పు పడితే అది నాన్నమ్మను మాత్రమే తప్పు పట్టాలి ” అనునయంగా అన్నది నిష్కల .. 
 
          “నాన్నమ్మ .. అంటే నా కౌంటర్ పార్ట్ .. ” కళ్లెత్తిన అంటున్న సారా కళ్ళలో తడి 
“యెస్ , నీ  కౌంటర్ పార్ట్ ”  అంటూ నవ్వేసింది నిష్కల .  సారా హృదయం తేలికైంది . 
 
          ఇప్పుడు నువ్వు నా అక్కవి .. నాకు సిబ్లింగ్స్ లేరని ఎప్పుడూ బాధపడేదాన్ని. అమ్మ ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ అమ్మ అమ్మేగా .. కొన్ని విషయాలు పంచుకోలేం కదా .. 
ఇప్పుడు నువ్వున్నావ్ .  నా అక్కవి అంటూ నిష్కల బుగ్గమీద ముద్దు పెట్టింది సారా ..
 
          నిష్కల సారా ని దగ్గరకు  తల నిమురుతూ, “ఇద్దరి పేర్లలో ఉన్న జలాల,  నాన్నమ్మ లాగే ఉన్న నువ్వు , మన ఇష్టాలు కొన్ని తెలియ కుండానే కలవడం , కొన్ని మేనరిజం  కలవడం చూస్తుంటే నువ్వు నా చెల్లివి అనిపించేది. నా ఆత్మీయురాలిగా అనిపించేది . అందుకే నీతో స్నేహం పెంచుకున్నాను.
 
          నా క్లైంట్స్ , లేదా వారితో వచ్చిన వారి ఫ్రెండ్స్, రెలెటివ్స్ ఎవరు నాకు అంత దగ్గరగా రాలేదు. నేను నా మనసుకు దగ్గరగా తీసుకోలేదు నిన్ను తప్ప . నాకున్న సందేహాలు నీకు విషయాన్ని చెప్పనివ్వలేదు.  చెబితే నువ్వు ఎలా తీసుకుంటావో తెలియదు. ఎలా స్పందిస్తావో తెలియదు. అందునా నువ్వు ఇక్కడ పుట్టి పెరిగిన దానివి . సాంస్కృతికంగా ఇద్దరికీ నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా  .. ఒకవేళ నేను అనుకుంటున్నట్లు కాకపోతే .. అనే సందేహం..
 
          ఎనీ హౌ .. మనం కలిసాం.. మనదంతా ఒక ఫామిలీ .. ” అన్నది 
 
          “నాన్న వైపు ఎవ్వరు తెలియదు . భారత్ లో ఎక్కడ ఉంటారో తెలియదు. ఎలా ఉంటారో తెలియదు. నా తండ్రి మూలాలు తెలుసుకోవాలి. ఆయన బంధువుల్ని కలవాలి. ఆయన గురించి ఎంతో తెలుసుకోవాలి అని ఎన్నో సార్లు అనుకున్నా .. 
ఎలాగో తెలిసేది కాదు.  నాన్న వాళ్ళ తమ్ముడు ఒకరు ఢిల్లీలో ఉంటాడని తెలుసు.  మరొకరు యూరోప్ లో ఉంటారని తెలుసు. కానీ వాళ్ళతో కాంటాక్ట్ లేదు. అమ్మకు ఉందో లేదో తెలియదు. 
 
          చదువుకునే రోజుల్లో నాన్న తరపు బంధువుల గురించి తెలుసుకోవడం కోసం గూగుల్ లో ఫామిలీ నేమ్ తో వెతికాను.  చాలా పేర్లు వచ్చాయి. బాబాయిల పేర్లు నాన్న మాటల్లో ప్రభా, దివా అని విన్న గుర్తు.   ఆ పేర్లతో ఫేస్ బుక్ లో ట్రై చేశా . గూగుల్ చేశా . తెలియలేదు. 
 
          వాళ్ళ గురించి తెలిస్తే వాళ్ళనయినా కలసిరావాలని అనుకునేదాన్ని.  ఇండియన్స్ ఎవరు పరిచయం అయినా నా తండ్రి మాతృభూమి కూడా ఇండియా అని చెప్పేదాన్ని.  ఎక్కడ అంటే హైద్రాబాద్ మినహా ఏమీ తెలియదు. నాన్న మదర్ టంగ్ తెలుగు అని తెలుసు.  నాన్న కొన్ని పదాలు నేర్పాడు.  నాన్నా అని పిలిస్తే నాన్న చాలా సంతోష పడేవాడు.  
 
          నన్ను అమ్మా .. అని పిలిచేవాడు. మా అమ్మ అంటూ ఉండేవాడు అంటూ తండ్రి స్మృతిలోకి వెళ్ళింది సారా… 
 
          ఆ తర్వాత, అమ్మకి నేను ఇండియా అంటే భయ పడుతుంది. కానీ ఆమెకి కూడా నాన్న వైపు బంధువులని కలుసుకోవాలని ఒకప్పుడు ఉండేది. నాన్న పోయిన తర్వాత అది భయంగా మారింది. 
 
          అమ్మ చదువుకుంది కానీ చాలా సెంటి మెంటలిస్ట్ ..  ఇండియన్స్ లాగే చైనీస్ కూడా చాలా సెంటిమెంట్స్ . అమ్మ చైనాలో పుట్టి పెరగక పోయినా బాగానే వంట పట్టించుకుంది అంటూ నవ్వేసింది.  
 
          ఇద్దరూ కబుర్లు కలబోసుకుంటూ ఉండగా సారా ఫోన్ మోగింది. 
 
          క్యాంపింగ్ గ్రౌండ్ లో ఫోన్ కనెక్టివిటీ ఉంది కానీ మిగతా ప్రాంతాల్లో చాలా తక్కువ.  అమ్మ తో మాట్లాడాలి. అమ్మకి సారా విషయం చెబితే ఎలా ఫీలవుతుంది? నాన్న విషయం తెలిస్తే నాన్నమ్మ గుండె పగులుతుంది చెప్పాలా వద్దా .. పరిపరి విధాలా ఆలోచిస్తున్నది నిష్కల మనసు. 
 
          ఫోన్ మాట్లాడుతున్న సారా కళ్ళలోంచి ధారాపాతంగా కన్నీరు ఆమె చెంపలను తడిపేస్తూ.. 

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.