డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’

-సుశీల నాగరాజ

 

సాధన—- అంటే ఏమిటి? 
దేన్ని మనం సాధన గా పరిగణించాలి!!?? 
ఉద్యోగం…?!
పదోన్నతి..?!
వివాహం…?!
 
          ప్రపంచం దృష్టి లో సాధనకి నిర్వచనం డబ్బుతో ముడివడి ఉండొచ్చు ! 
 
          కానీ, ప్రపంచం నిర్ణయించినదే ‘సాధన ‘ అని అనుకుంటే …వారి వారసులు ఒకటి, రెండు తరాలపాటు వారిని గుర్తు పెట్టుకుంటారు. ఆ తరువాత వారి ఉనికి కాలగర్భంలో కలిసిపోతుంది. 
 
          ఇక నిజమైన సాధకులు  , చరిత్రలో తమ స్థానాన్ని పదిలపరుచుకుని, 
చిరస్థాయిగా నిలిచిపోతారు.!!  అలా చిరస్థాయిగా చరిత్రపుటలలో నిలిచిపోయే వ్యక్తి ‘ డా.  అమృత లత’!   
 
          ఆమె జీవితం వడ్డించిన విస్తరి కాదు! ఆ విస్తరినీ  తనే తెచ్చుకున్నారు . తనకు నచ్చిన పదార్థాలను తనే స్వయంగా వండి , వాటిని తనే తినకుండా  తన చుట్టూ వున్నవారికి తన అమృత హస్తాలతో వడ్డించారు.
 
          అమృతలత గారు నడిచిన బాట పూలబాట కాదు .., రాళ్లూ , రప్పలతో కూడిన ముళ్లబాట ! అలా సాగే క్రమంలో ఆ పాదాలు ఎంత రక్తాన్ని చిందించాయో, ఆ కళ్ళు ఎన్ని కన్నీళ్ళను కార్చిందో, ఆ మనసుకూ, దేహానికీ ఎంత నిస్సత్తువ ఆవరించిందో ! ఎన్ని మాటల తూటాలు  ఆ హృదయాన్ని ఛిద్రం చేసాయో ! 
 
          అయినా దేనికీ వెరవక , తనను తానే ఓ శిల్పంలా చెక్కుకున్న శిల్పి, అమృతలత! 
      
          ఆమె పీహెచ్.డి  ప్రొఫెసర్ నిర్మల జ్యోతి గారి ఆదేశమే అమృతలతగారి  చేత  స్వీయ చరిత్ర ‘ నా ఏకాంత…. బృందగానాన్ని’  రాయించింది. 
        
          ‘గొప్పవాళ్ళే కాదు, గొప్పవాళ్ళ గురించే కాదు….. మీకు తటస్థ పడిన సామాన్యుల్లో కూడా గొప్పవాళ్ళుంటారు, వారి గురించి రాయండి’ అంటూ ఆమెను  ప్రోత్సహించారు. అలా అమృతలతగారి  ఆత్మచరిత్రకు ప్రొఫెసర్ నిర్మల జ్యోతి గారు బీజం వేసారు. 
 
          నిర్మల జ్యోతి మేడం గారికి శత కోటి నమస్కారాలు. ఆవిడ చెప్పకపోతే వేలాది మందికి ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ, స్ఫూర్తినీ ఇచ్చే ఆమె స్వీయ చరిత్ర వెలువడేదే కాదు! 
 
          అమృతలతగారు  రాసిన ‘నా ఏకాంత బృందగానం’ పుస్తకావిష్కరణ సందర్భంగా .. యూ ట్యూబ్ లో ఆ ఫంక్షన్ తాలూకు ఆన్లైన్ స్ట్రీమింగ్ వీడియో చూసాను . 
 
          అది చూసిన తరువాత ‘ నా ఏకాంత బృందగానం’ పుస్తకం చదవాలన్న ఆసక్తి , ఉత్సాహం తట్టుకోలేక , వెంటనే డబ్బు పంపించాను .. రెండు రోజుల్లోనే  అందమైన ఆమె ముఖ చిత్రంతో , నాణ్యమైన పేపరుతో , ఎంతో బరువున్న ఆ పుస్తకం నా చేతికి అందింది. 
 
          ఎంతో ఏకాగ్రతతో చదవాల్సిన 404  పేజీలున్న సచిత్ర స్వీయ చరిత్ర అది. 
 
          ఆమె ‘ నా ఏకాంత బృందగానం!’ చదివే క్రమంలో ఆమెతో పాటు నేనూ నడిచాను .. ఆమె నవ్వినప్పుడు నేనూ నవ్వాను. ఆమె కన్నీళ్లు మాత్రం పైకి కనిపించలేదు. రోధించిన ఆమె  మనసును మనసే చూడగలదు!!   ఎన్నో చోట్ల నా కళ్ళు కన్నీళ్ళతొ నిండి పోయాయి. 
 
          తన పాదాలు బొబ్బలెక్కినా ఆమె ఎక్కడా ఆగిపోలేదు , నిస్సత్తువుతో కూలబడ లేదు. వడగళ్ళ దెబ్బలకి , తన సహచరులకి కూడా తన చేతులనే అడ్డుపెట్టారు .. కిందపడిన ప్రతిసారీ పుటమెత్తిన  బంతిలా రెట్టించిన శక్తితొ పైకి లేచారు ! 
 
          ఆత్మ కథ రాసే ముందు ఆమె తీవ్ర అంతర్మథనానికి లోనయ్యారు. 
 
          ఈ పుస్తకంలో సమస్త ప్రపంచాన్ని దర్శిస్తాం … ఇందులో ఆమె లేమి, సవాళ్లు సమస్యలు, సంకెళ్లు, స్ఫూర్తి, ఆశయాలు , గెలుపు ఓటములు ఇలా ఎన్నో,  ఇంకా ఎన్నో!!
 
          తన జీవన యానంలో ఆమెతో పాటు అండగా నిలబడిన సహచరులు,ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, ఆ నడకలో ఆమె తూలి పడిపోకుండ చేయిపట్టుకుని నడిపించినవాళ్ళు, ఆసరా ఇచ్చినవాళ్లు , సామాన్యులు- అసామాన్యులు అందరూ కనిపిస్తారు . 
 
          ఇది ఆమె ఒక్కర్తి కథ కాదు– ఆమె చుట్టూఉన్నవారి కథ కూడా ! అందుకే ఇది బృందగానం!!!
 

***

          ‘Child is the Father of Man .’ 
 
          ‘When our commitment is deeper than the Sea and our ambition is higher than the Sky……then our future will be brighter  than the Sun.’ .. By APJ. Abdul Kalam .
 
          అలాంటిదె అమృతలతగారి ఆశయం!
         
          డా.అమృతలతగారి బాల్యం కలిగోట,‌ పడకల్, జక్రాన్ పల్లి గ్రామాల చుట్టూ పెన వేసుకుని వుంది .
 
          ఆమె బాల్యం చాలా ఆసక్తి దాయకం.  బాల్యంలో సహజంగా  పిల్లలందరూ అల్లరిగానే వుంటారు. అయితే అమృతలత మాత్రం మహా అల్లరి. అందుకుగాను ఆమె ఎన్నో శిక్షలు పొందారు ! చివరికి వాళ్ళ నాన్న గారి నుంచి  కూడా దెబ్బలు  ! 
 
          బహుశా   ఆమె  అల్లరికి కారణం .. బాల్యంలో కూడా ఆమె ఖాళీగా కూర్చోలేక పోవటమే.  ఎప్పుడూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండాలి .. లేదంటే లయబద్దమైన శబ్దాలకు హాయిగా నిద్రపోవాలి. 
 
          తను పుట్టి పెరిగిన ప్రదేశాలు, ఉపయోగించిన పాత్రలు , జరిగిన సంఘటనల తాలూకు ఫోటోలే కాదు , అవి లభ్యం కానపుడు వాటి తాలూకు చిత్రాలను కూడా సరసి గారితో గీయించి పుస్తకంలో పొందుపరిచారు .. అవన్నీ చూస్తూంటే … ప్రతి పేజీ విషయంలో ఆమె ఎంత శ్రమ, శ్రద్ద తీసుకున్నారో అర్థమవుతుంది . ఆ తరం వాళ్ళకి పాత జ్ఞాపకాలు కళ్ళముందు నిలుస్తాయి .. నేటి తరానికి  ఆ చిత్రాలు ఆశ్చర్యం, ఆహ్లాదం కలిగిస్తాయి.
 
          పంచటంలోని ఆనందం ఆమెకు  బాల్యంలోనే  తెలుసు.. ఎవరు ఏమి చెప్పినా నమ్మి ఆమె చాలా చిక్కుల్లో ఇరుక్కునేవారు…అలా ఎన్నో జీవిత పాఠాలను తన చిన్న నాటి నుండే నేర్చుకుంటూ పెరిగారు.
 
          ‘ఆడుతూ పాడుతూ నేర్చుకునే చదువు మాత్రమే ఆసక్తిదాయకం ‘అన్నది  చిన్నప్పుడే అనుభవైక్యమైంది . ఆ అనుభవమే ఆమె  భవిష్యత్తులో అనేక విద్యా సంస్థలను స్థాపించటానికి దోహదమైంది.
 
          పనివాళ్ళ పట్ల కరుణతో ఉండాలన్నదీ , పనుల విషయంలో ఆడా మగా తారతమ్యం లేదన్నది ఆమె  తన తండ్రి దగ్గరే  తెలుసుకున్నారు. 
 
          చిన్నప్పుడే తల్లిని పోగొట్టు కోవడం, టీనేజ్ లో తండ్రిని కోల్పోవడం వల్ల .. ఏ ఇంట్లో ఏ పెద్దవారిని చూసినా .. తను పోగొట్టుకున్న సంపద ఎంత విలువైనదో .. అర్థమై , 
తల్లిదండ్రులను ఎంత అపురూపంగా చూసుకోవాలో , పెద్దలపట్ల ఎంత మర్యాద గా వుండాలో ప్రస్తావిస్తారు 
 
          కరువు కారణంగా ఆకలిమంట ఏమిటనే విషయం ఆమెకి చిన్నప్పుడే అనుభవంలోకి వచ్చింది..  అందుకే అందరికీ …ముఖ్యంగా పనివాళ్ళకి కడుపునిండా  భోజనం పెట్టాలన్న విషయం తెలుసు కున్నారు. 
 
          చిన్పప్పుడు తనతోటి విద్యార్థులతో కలిగిన అనుభవం ద్వారా ఎవరు ఏది చెప్తే అది అమాయకంగా నమ్మకూడదన్న జీవిత పాఠం  నేర్చుకున్నారు.
 
          ఆడుకునే వస్తువొకటి తనే సొంతంగా తయారు చేయాలన్న సాహసం  చేయబోయి , అమూల్యమైన తనచేతి వేళ్ళను పోగొట్టుకున్నారు. అప్పట్లో వైద్యం అంతగా అభివృద్ధి చెందని కారణంగా ( నేడు గుండెను తీసి గుండెను పెడ్తున్నారు)  ఆమె తన వేళ్ళని శాశ్వతంగా పోగొట్టుకున్నారు.  ఆ కారణంగా ..వారి నాన్నగారి కోరికమేరకు ఆమె డాక్టర్ కాలేకపోయారు. (  చాలా బాధకలిగించిన విషయం. సమయానికి సరైన వైద్యం లభించకపోవటమా, ఏమి కారణం! సుధాచంద్రన్ ఆక్సిడెంట్ లొ కాలుపోగొట్టుకుని జైపూర్ లొ కృతక కాలు అమర్చుకుని  ఆమె నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.‌ ఆమె జీవిత చరిత్ర ఆధారంగా ‘మయూరి’ సినీమా కూడా వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఏదైన మార్గం ఉండదా!!! అన్న విషయం నన్ను తొలిచేస్తోంది !!) 
 
          ఆమె తండ్రి చనిపోయినపుడు ,రిక్షా తాతయ్య చేసిన సహాయం ద్వారా మనుషుల్లో దైవత్వం  చూశారు !
 
          తన చిన్నాన్న కూతురు గంగక్క బీడీలు చుట్టి ఆమె విద్యాభ్యాసానికి చేసిన సహాయమే …ఆమెని భవిష్యత్తులో తన సంపాదనలో సగభాగాన్ని తల్లిదండ్రుల్లేక చదువుకోవడానికి ఇబ్బంది పడేవారికో,పేద ఆడపిల్లలకో, కళాపోషణకో వినియోగించాలన్న నిర్ణయానికి రావటమే కాదు,  ఆచరిస్తున్నారు! మాటలకు చేతలకు పొంతనలేని నేటి సమాజంలో ఈమె ఆదర్శం!! ఈమెతొ సన్నిహితంగా ఉన్న ఆత్మీయులు చెప్తుంటారు ‘ హృదయానికి చేతికి నడుమ ఈమెకు  ఎముకలేదని!!’
 
          కాలేజీ విద్యార్థిగా యుక్తవయస్సులో ఆమె ఎన్నో పాఠాలను నేర్చుకున్నారు. ఆడపిల్లలు ధైర్యంగా ఉండటం ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు. 
 
          అన్ని కష్టాలనూ ఓర్చి చివరికి ఉద్యోగ పర్వంలొ అడుగుపెట్టారు. విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి దిశగా విద్య నందించాలని ..సర్వశక్తులా శ్రమించి తనకు అత్యంత ఇష్టమైన ఉపాధ్యాయవృత్తిని చేపట్టారు. A great teacher is not simply one who imparts knowledge to his students, but who awakens their interest in it and makes them eager to pursue it for themselves. అదే అమృతలతగారి లక్ష్యం!!
 
          ఏ పనినైనా దీక్షతో చేయాలన్నదీ, విద్యలో నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలనేదీ ఆమె అభిమతం !
 
          దుర్గాబాయి దేశ్ ముఖ్ , మాజీ పార్లమెంట్ సభ్యులు యం. నారాయణ రెడ్డి గారి లాంటి వారి నుంచి స్ఫూర్తి పొంది , ఆ దిశగా తనను తాను మలుచుకొంటూ-  సమాజానికి ‘Education is the movement from Darkness to light’ లా ఎన్నో విద్యాసంస్థల స్థాపనకు నాంది పలికారు.!!!!
 

***

 
          దృఢనిశ్చయంతో కూడిన కార్యాచరణ … లక్ష్యసాధన … వృధా చేయని కాలం…. పని పై ఏకాగ్రత , నియంత్రణ .. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో…..వారినే  సాధకులు అని కీర్తిస్తాం..  …వారు నిత్యనూతనం !!!
 
          దేవతలూ రాక్షసులూ అమృతం కోసం సముద్ర మథనం ప్రారంభించినపుడు  సముద్రంలో .. రత్నాలు కనిపించగానే సంతోషించి దేవతలు తమ మథనాన్ని నిలిపి వేయలేదు. విషం పుట్టినా  వెనుకడుగు  వేయలేదు. అమృతం లభించేదాకా వారి పంతం విడువలేదు.
 
          సాధకులు!  .. అంతే !
అనుకున్నది సాధించేవరకూ కదలరు, వదలరు,నిద్రపోరు. అలాంటివారే అమృతలత గారు!!
         
          ఆమెకు సాహిత్యం పట్ల అభిరుచి, అనురక్తి బాల్యం నుంచీనే!! తనకు పత్రికలు చదవటం వలన మనుషుల మనస్తత్వం అర్థం  చేసుకునే శక్తి అబ్బింది , పత్రికల ద్వారా మనసు వికసిస్తుంది’ అంటారామె 
 
          ఎనిమిదో  తరగతిలోనే ‘భార్య అగాధమైన లోయ, భర్త మహోన్నత శిఖరం ‘అంటూ భార్యా భర్తలిద్దరూ సమానులని చెప్పే ‘పర్వతాలు లోయలూ’ నవలా రచనకు ఆమె  శ్రీకారం చుట్టారు .
 
          కాలేజీ రోజుల్లో కవితలు, కథలు, నాటికలు రాసారు. తరువాత అయిదేళ్లకి , స్నేహానికి ప్రాధాన్యమిస్తూ రాసిన  ‘ సృష్టిలో తీయనిది ‘ నవల ఆంధ్ర జ్యోతిలో ప్రచురితమవడం, కొంత కాలం ‘అమృత కిరణ్’ పక్షపత్రికని నడపటం, ఆ పత్రికలోని ఎడిటోరియల్స్.. ‘అమృతవర్షిణి’ పేర పుస్తకరూపం దాల్చి అభిమానుల మన్ననలు పొందింది. 
 
          అమృతలత  జీవన పోరాటం , సాధనలన్నీ ఆమె ఆత్మకథ ‘నా ఏకాంత బృందగానం’ ఆమె ఏకాంగిగా ఆలపించిన రాగాలన్నీ చివరికి బృందగానమై , వేణు గానమై  పాఠకుల మనసును చూరగొంది. 
 
          ‘నా ఏకాంత బృందగానం’ పుస్తకం ఆమె జీవన చిత్రిక. చిన్నతనంలోనే తల్లినీ, యుక్తవయస్సులో తండ్రినీ కోల్పోవడంతో, అక్కా చెల్లెళ్ళ బాధ్యత అన్నావదినల పై పడటం వారే పెళ్ళిళ్ళ బాధ్యతలను నిర్వహించాల్సి వచ్చింది. 
 
          కానీ ఈ ఐహిక భవబంధాల్లో ఆమెను కట్టి పడవేయకూడదనో, ఆమెను కుటుంబానికే  పరిమితం కాకూడదనో, వటవృక్షం ఎంతో మందికి నీడ, ఆసరా ఇవ్వాలనో… విధి ఆడిన వింత నాటకంలో ఆమె  తన జీవితాన్ని సమాజానికే  అర్పించుకున్నారు !
 
          ఆమె కూతురు ‘హిమచందన్’ ముగ్గురమ్మల అనురాగం, ఆప్యాయత, ఆలనాపాలనలో, ఎందరో  స్నేహితులు, అధ్యాపకుల సంరక్షణలో పెరిగి , ‘జగమంత కుటుంబం నాది ‘ అన్నట్టు సంపూర్ణ వ్యక్తిత్వాన్ని రూపొందించుకున్నారు.
 
          అమృతలత అలుపు సొలుపు లేకుండ, ఒక్క క్షణం తీరికలేకుండ, తనను తాను విద్యాసంస్థల నిర్వహణలో, వాటి నిర్మాణాల్లో విశ్రాంతి లేకుండ శ్రమించారు, పిల్లల సర్వతో ముఖాభివృద్ధియే ధ్యేయంగా విజయ్ విద్యాసంస్థలను స్థాపించారు ,
 
          గత నలభై రెండేళ్ళ నుండి సుమారు ముప్పై అయిదు వేల మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. నాలుగు వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించారు. ఇంజనీరింగ్ కాలేజి ,  ఫార్మసీ కాలేజిలు  స్థాపించారు. 
 
          ఆమెతో ఎంపికై శిక్షణ పొందిన ఉపాధ్యాయ బృందానికి  ఆమె  చూపిన దారి, శిక్షణ,  వారిని ఎంతో గొప్పగా  తీర్చిదిద్దింది. విద్యార్థులకు కొలమానం మార్కులు కాదు. వారు సంపాదించుకునే  జ్ఞానం, నడవడిక, సంస్కారం అంతే కాదు, జీవితం వడ్డించిన విస్తరికాదు. జీవితంలొ వచ్చే సమస్యలను ఎంతో ధైర్యంగా ఎదిరించి నిలబడగలగాలి!  Lit the Candle.!!
 
          విజయ్  స్కూల్స్ విద్యార్థుల టాలెంటు షోలకు పెట్టింది పేరు. దాని కోసం ఉపాధ్యాయులందరూ వారం రోజుల పాటు ఎంతో శ్రమకు ఓర్చి, ప్రదర్శనలను ఎంతో పకడ్బందీగా జరుపుతారు.. వాటిని చూసి తరించాలి అంతే. (నేను వీడియోలను చూశాను కాబట్టి .)
 
          అమృతలత క్రమశిక్షణకి మారుపేరు. సహచరులను ఎంత ఆదరిస్తారో పని రాబట్టే విషయంలో  అంత నిక్కచ్చిగా ఉంటారు.
    
          ఆమె కరోనా సమయంలొ విద్యార్థులను అనేక విషయాలలొ తొడగించటం ,  మునుపే ఉన్న ఆత్మీయుల గ్రూపును సక్రియగా తొడగించి, ఆమె వారికిచ్చిన  సవాళ్ళు  అందుకు బహుమతులు చదువుతుంటె ఆమె సృజనాత్మకత  ఆశ్చర్యం కలిగిస్తుంది! 
 
          అమృతలత , అపురూప అవార్డులు ప్రారంభంచేసి గత పదమూడు సంవత్సరాల నుండి వివిధ రంగాలకు చెందిన 160  మంది స్త్రీ పురుషులకి అవార్డులిచ్చారు. 
 
          వర్తమాన సాహిత్యం గురించి ఆమె అభిప్రాయాలు , ఆమె చేసిన విశ్లేషణ ఎంతో హేతుబద్ధం !!
 
          ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలు వైవిధ్య భరితంగా ఎంతగానో ఆకట్టుకుంటాయి. ‘పుష్పగుచ్ఛాలు ఆశించేవాళ్ళు… రాళ్ళదెబ్బలనీ తట్టుకోవాలి’ అంటారు. ప్రతీదీ చాలా లోతుగా  విశ్లేషిస్తారు.  ఎలాంటి ప్రశ్ననైన, సమస్యనైన చలించక , ధీటుగా ఎదిరిస్తారు.  ఆమె తన లక్ష్యం పై, మాట పై నిలబడతారు.
 
          పూర్వ కాలంలో  రాజులు , మహారాజులు ప్రజల కల్యాణం కోసం దేవాలయాలను నిర్మించే వారని చదివాము. .’అపురూప వేంకటేశ్వర స్వామి దేవాలయ ‘నిర్మాణం  ఆమె చేతులపై జరగటం , అమృతలత  కారణజన్మురాలనిపిస్తుంది . 
 
          ఒకనాడు ఆమె ఒంటరిగా నాటిన విత్తనాలు మహావృక్షాలుగా పెరిగాయి. నీడను, పూలు, పండ్లను ఏపుగా ఇస్తున్నాయి. ఊహించడానికి ఇవన్నీ సాధ్యమా అనిపిస్తుంది …  అవన్నీ పుస్తకంలొ  చదువుతుంటె కళ్ళకు దృశ్యాలై కనిపిస్తాయి, వాటి కోసం ఆమె శ్రమ , కార్యదీక్ష అద్భుతం!
 
          అమృతలత ఆత్మకథ ఉపసంహారం చదవగానే గుండె బరువెక్కుతుంది .. కళ్ళు కన్నీళ్ళతో నిండి పోతాయి ..తల్లిదండ్రులు తనకిచ్చిన ఆస్తి తోబుట్టువులనీ , అది ‘రక్షణా కవచంలాంటి మినీ మానవహారం.’ అంటారు . తనకు తోడూ నీడగా నిలిచినా బంధువులను, స్నేహితులను పేరు పేరున తలుచుకుని వారి సహాయ సహకారాలను నెమరువేసుకున్నారు.
 
          ఆమె సాధనల రహస్యం అధికార వికేంద్రీకరణ. అందరినీ పై చదువులకు ప్రోత్సహించి, ఎన్నో డిగ్రీలూ, అర్హతలూ పొందేందుకు ఎంతో తోడ్పడ్డారు. ఎన్నో పదవులు ఇచ్చారు .. తనూ తన అరవై అయిదేళ్ల వయసులో  పీహెచ్. డీ చేయడం ఆమె కార్యదీక్షకీ, పట్టుదలకీ, చదువు పట్ల ఆమె ఆసక్తికీ నిదర్శనం ! 
 
          ఎలాంటి పరిస్థితుల్లోనూ తొణకని స్వభావం, అందర్నీ ఒక్కతాటిపై నడపడం, ఏ నిర్ణయమైనా  ఎంతో లోతుగా ఆలోచించి తీసుకోవటం ఆమె సాఫల్య మంత్రం. 
 
          ఏ గెలుపూ సులువుగా రాదు, విజయం వరించాలంటే ఎన్నో అవాంతరాలను అధిగమించాల్సి ఉంటుంది. Failures are the stepping stones! కేవలం పట్టుదల, ఉక్కు సంకల్పం మాత్రమే అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేస్తుందంటారు. 
 
          ఒక స్త్రీ ఆత్మకథ రాయటం అంత సులభసాధ్యం కాదు.!! అది ప్రసవ వేదనే. తన ప్రతిరూపమైన మరో జీవికి జన్మనిస్తూ ,  తను పునర్జన్మ పొందినట్లే.! అదే ‘నా ఏకాంత బృందగానం’!
 
          నిజానికి నాకు ఆ పుస్తకం గురించి , ఆమె గురించి ఎంత రాసినా , ఏం రాసినా మనస్సు తృప్తి చెందటంలేదు. అంతేకాదూ  న్యాయం చేయలేనని అనిపిస్తూంది. !! 
 
          కాకపొతే … …ఈ పుస్తకం నిడివి ఎక్కువ అనిపించింది. అందుకు కారణం, తన జీవితంలొ ప్రవేసించిన ప్రతి ఒక్కరి గురించి రాశారు, వారి ఫోటోలను సేకరించి వేశారు. తన హాస్టల్ జీవితం., కాలేజి జీవితం కొద్దిగా సంక్షిప్తం చేయటం, అంతే కాకుండ మరొక్క విషయం, ఆయా సంవత్సరాల్లొ జరిగిన ప్రముఖ ఘట్టాల్ని, రాజకీయ మార్పుల్ని దాఖలు చేశారు. ఆత్మకథ చదువుతూ మధ్యలొ ఆ విషయాలు మనసు దృష్టిని మరలుస్తుంది.  అవార్డులు ఇచ్చిన వారితోనె’ అమృతలత- అపురూప అవార్డ్స్’ ప్రత్యేక  అభినందన పుస్తకం ప్రకటించారు. కాబట్టి ఇందులో వాటిని పొందుపరచకపోతె పుస్తకం నిడివి తగ్గే అవకాశం ఉంది. మలి ముద్రణలో ఇలాంటి  విషయాల్లొ జాగ్రత్త వహిస్తె నిడివి తగ్గించ వచ్చనిపిస్తుంది..
 
          అందరూ తెరముందుకు రావాలి. ‘నాది’  అని ఆమె ఎప్పుడూ చెప్పరూ. ‘మనది’ అనే. IT’S A TEAM WORK’ 
 
          ఈ క్రింది విషయం ఆత్మచరిత్రకు సంబంధించిన విషయం కాదు. అయినా రాయలేక ఉండలేక పోతున్నాను.
 
          అమృతలతకు ఎంతో మంది ఆత్మీయులు, ఎంతో గొప్ప వారితో ఆమెకు పరిచయం, స్నేహం,  ఆమె అంటే వారందరికీ ఎంతో గౌరవం, అభిమానం ! ‘ఆమె……ఓ అద్భుతం!’ స్వర్ణోత్సవ సంచికను  చదివాను! నూర్ల సంఖ్యలొ ఆమెగురించి రాశారు.  ఆ వృత్తంలొ ఆమె కేంద్ర బిందువు. అందులో నుంచి 360 కోణాలు విరజిమ్మాయి!!! ఈ మాటలు, పొగడ్తలు ఆమె దరిదాపులకు రానివ్వరు.ఆమె వీటికి అతీతంగా ఉంటారు. 
 
          అమృతలత  ఆదర్శ మహిళ ! హెచ్చు తగ్గుల్లేని సమభావనా సమాజం ఆమె ఆశయం ! బతుకు విలువ మెతుకు విలువ తెలిసిన వ్యక్తి.!
 
          అమృతలతలో కావాలన్నా లేనిది గర్వం!!!ఉన్నది అందమైన డెందం!!  ఈ పుస్తకం చదవటం, ఆమె గురించి తెలుసుకోవటం, ఆమె పుస్తకం గురించి రాయటం నా సుకృతంగా భావిస్తున్నాను!!!!
 
          సార్థక నామధేయురాలు ‘అమృతలత’ గారు !! 
 
*****
Please follow and like us:

9 thoughts on “డా. అమృతలత ‘నా ఏకాంత బృందగానం’”

  1. థాంక్యూ సుశీలా నాగరాజ గారూ !

    మీరు ‘నా ఏకాంత బృందగానం ‘ సచిత్ర స్వీయ చరిత్ర పై సమగ్ర విశ్లేషణ చేసారు.

    బరువైన పుస్తకాన్ని ఆసాంతం సమగ్రంగా చదవడమే గాక … నచ్చిన అంశాలను ఉటంకిస్తూ చక్కని రివ్యూ రాసారు.

    నిజానికి కథలూ , నవలలు రాయడం చాలా సులభం, రివ్యూలు రాయడమే చాలా కష్టం.

    సమీక్షకులు రచయితల మనసుల్లోకి పరకాయ ప్రవేశం చేసి, వారి అంతర్గత భావాలను పట్టుకోగలగాలి…ఓ వైపు విశ్లేషణ చేస్తూ .. అదే సమయాన సంశ్లేషణ కూడా చేయగలగాలి … ఆ రెండూ మీలో దండిగా వున్నాయి ..

    ముఖ్యంగా ఏ రచయిత ఏం రాసినా ,
    ఆ రచనలో ఏ చిన్న అంశం నచ్చినా … వెంటనే ఆ రచనని మెచ్చుకునే మీ సంస్కారం నాకెప్పుడూ అబ్బురం కలిగిస్తుంది !

    తెలుగు రాష్ట్రాల్లో నాలా రాసే వాళ్లకు కొదువలేదు , కానీ ఆ రచనలోని బాగోగులు , మంచీ చెడు చెప్పగలిగే మీలాంటి సమీక్షకులే కరువయ్యారు !

    మీరు ఆ కొరతని తీరుస్తున్నారు … మీ చేతుల్లో నా పుస్తకం పడటం, దాన్ని మీరు సమీక్షించడం , కె. గీత గారు దాన్ని ప్రచురించడం నా అదృష్టం !

    మీ ఇద్దరికీ నా ధన్యవాదాలు !!

    1. అమృతలతగారు, నమస్కారం. మీ ఏకాంత బృందగానం నా చేతికి ఆలశ్యంగానే అందింది. మీ జీవితం గురించి, అందులోని ఎత్తుపల్లాలు, మీరు చేసిన సాధనలు, సృష్టించిన విద్యాసంస్థలు, వెనుక రాజమహారాజులు మాత్రమె చేపట్టే పనులు — ఆలయాల నిర్మాణం – మీరు ఆ మహత్కార్యాన్ని చేపట్టి , అపురూప వేంకటేశ్వర ఆలయం నిర్మించటం, దేనికి పోల్చాలి మీ పేరు!!! చరిత్రలొ మీపేరు చిరస్థాయిగా నిలిచిపోయింది. తర తరాలు మీ జ్ఞాపకాలు, మీపేరు. మీ గురించి నేను రాయగలగటం నా సుకృతంగా భావిస్తున్నాను 🙏.

      1. థాంక్యూ సుశీల గారూ !
        ఎలా వున్నారు ?
        మీ మూల్యమైన సమయాన్ని వెచ్చించి , ‘నా ఏకాంత బృందగానం ‘ చదివి , మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు !
        — డా.అమృతలత

  2. బాగుందండీ. ఒకసారి ఎఫ్బి లో చదివాను. మళ్ళీ మొత్తం గా చదవడం ..పుస్తకం చదివిన సంతృప్తిని ఇచ్చింది. శ్రీమతి అమృతలత గారి నిలువెత్తు వ్యక్తిత్వం కళ్లకు కట్టినట్లు చెప్పారు.
    అభినందనలు ఇరువురికీ.

  3. అమృత లత గారి “నా ఏకాంత బృందగానం” ఒక మహా అద్భుతమైన పుస్తకము దానికి ఏ మాత్రము తీసిపోకుండా మీస్పందన అక్షర రూపంలో విశ్లేషించారు! మీ ఇద్దరికి నా హృదయ పూర్వక అభినందనలు!

    1. భారతి, మీ అభిమానం ఆత్మీయతతొ కూడిన మాటలకు చాలా సంతోషం. మనఃపూర్వక ధన్యవాదాలు.

Leave a Reply to Dr.Amruthalatha amrutha.latha@gmail.com Cancel reply

Your email address will not be published.