తెలుగు రచయిత— శ్రీమతి గంటి సుజల రచనా వైధుష్యం.

-అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము

          సుజల గారు  రచనా వ్యాసాంగం 2011 నుంచి చేపట్టారు. ఇప్పటి వరకూ ఆరు నవలలు ప్రచురితమైనాయి. స్వాతీ పత్రిక వారి అనిల్‌ అవార్డ్‌, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర
భూమి, జాగృతి, మరియు వివిధ వెబ్‌ మ్యాగజైన్‌లు వీరి రచనలు ప్రచురితమైనాయి.
వీరి నవల “అమ్మ బంగారు కల” కు మూడు పురస్కారాలు లభించాయి. తానా వారు కూడా వీరి రచనలను చిన్న పిల్లల విభాగంలో ప్రచురించారు.

వీరి రచనల గురించి సోదాహరణంగా తెలుసుకుందాము.

          కథలు చాలా మంది రాస్తారు. కానీ రాసేటప్పుడు రచయిత్రిగా కూడా కొంత సామాజిక బాధ్యత వుందని తెలుసుకుని రాయడం కొంత మంది రచయిత్రులకే సాధ్యం.
అటువంటి రచయిత్రులలో ఒకరు ఈ సుజల గంటి. సమస్య ఎదురైతే పరిష్కారం
సూచించే దిశగా ఆవిడ కథలుంటాయి. సహజంగా స్నేహశీలి. నలుగురితో కలిసి
పోయే స్వభావం గల సుజలగారు రాసిన కథలు కూడా అలాగే ఆదర్శవంతంగా
వుంటాయి.

          అనూరాధ అనే కలం పేరుతో కాస్త ఆలస్యంగా సాహిత్యరంగ ప్రవేశము చేసినా
మంచి కథలు రాసి నలుగురి మన్ననలు పొందారు. కోట్లమంది వున్న ప్రజానీకంలో యే ఒక్కశాతం ఆచరించినా అక్రమసంబంధాల గురించి కానీ, ప్రతి మనిషీ మరో మనిషిని అణగద్రొక్కాలనే వ్యతిరేక భావన కలిగించే కథలు కానీ రాసి, సమాజమంతా అలానే చెడి పోతోందన్న వ్యతిరేక ఆలోచన కలిగించలేదావిడ. మగవాళ్ళు, ఆడవాళ్ళూ అందరూ మనషులే , ఆనందం , దఃఖం అందరికీ సమానమే. ఒకవేళ ఎవరైనా చెడుగా ప్రవర్తించినా అది పరిస్థితుల ప్రభావం వల్లే కానీ ఆ మనుషులనే తప్పు పట్టేదిగా రచయిత రాయలేదు.

          సంస్కారవంతమైన కుటుబంలోంచి వచ్చిన రచయిత కుటుంబంలో మనషుల
మధ్య సంబంధ బాంధవ్యాలెలా వుండాలో , మారుతున్న కాలంలో ఎలా వుంటే కుటుంబమన్నది సవ్యంగా సాగుతుందో  చెప్పారు.

          ” ఒక పువ్వు పూచింది” , కథలో సమాజ సేవ వలన పొందిన ఆనందానుభూతిని వర్ణించారు.’ ఎల్లలులేని మమత’ లో కాశ్మీర్‌ ఉగ్రవాద దాడులలో ఒకఅబ్బాయి ముకుంద్‍ పడిన మానసిక వ్యథ, దానిని అర్థం చేసుకుని ఆ అబ్బాయిని దత్తత చేసుకుని, ఒక మనిషిగా నిలబెట్టిన కరుణ గొప్పమనుసు చదువుతుంటే మనకు తెలియని అనుభూతి కి లోనవుతాం.

          సాధారణ కుటుంబాలలో జననం, మరణం కూడా ఖరీదైనవే.’ అమ్మ వీలునామా’ కథలో సంప్రదాయ కుటుంబంలో నుంచి వచ్చిన సుందరమ్మ తన మరణానంత
రము జరిగే కర్మకాండ పిల్లలకు చర్చనీయాంశము కాకూడదని ఎంతో అభ్యుదయంగా ఆలోచించి తన శవాన్ని ఆస్పత్రికి అప్పగించమని కోరడం చూస్తుంటే చదువుతున్న వారు  కంటతడి పెట్టకమానరు.

          ఉద్యోగస్తులయిన తల్లితండ్రుల పిల్లల మనోభావాలు వారి నోటి నుంచే పలికించడం ‘ గుండుగాడు’ కథ లోని విశిష్టత.

          భార్యాభర్తల మధ్య వుండాల్సిన అనురాగం, ఆప్యాయతలే కానీ పెద్దపెద్ద బహు
మతులు ఇచ్చి పుచ్చుకోవడం కాదని చక్కని ఆహ్లాదకర సంభాషణలకో నడిపించిన
కథే , ‘ ప్రియేచారుశీలే..’.

          ఒక తల్లికి చిన్నారి కూతురు ఇచ్చిన ‘ దారాలడబ్బా’ ని మించిన బహుమతి లేదని
చెప్పడం లో రచయిత్రి తల్లి మనసు తేటతెల్లమవుతుంది.

          ఇల్లు ఇరుకుగా వున్నా మనసులు ఇరుకుగా వుండకూడదని , పంచుకోవడంలో వున్న ఆనందాన్ని విప్పి చెప్పిన కథ ‘ ఇరుకు’ . కి జాగృతి కథల పోటీలో బహుమతి
వచ్చిందంటే అది  ఆ రచయిత్రి రచనలో విశేషమే.

          పిసినారి అన్న మాటకి ప్రత్యేక అర్థాన్ని వివరించారు రచయిత ‘ కరదీపిక’ కథలో…
ఆధునిక విజ్ఞానశాస్త్రం లోనే కాదు మన ప్రాచీన గ్రంథాలలో కూడా వున్న తల్లి గర్భం
లో ప్రాణం పోసుకుంటున్న శిశువు గ్రహణశక్తిని చూపించారు’ అమ్మా , నన్ను ఈ
ప్రపంచంలోకి తీసుకు రాకమ్మా…’ కథలో.

          సంప్రదాయకమైన కుటుంబ కథలే మాత్రమే కాకుండా, ఆధునికంగా, సాంకేతికంగా
మారుతున్న సమాజంలో ఫేసుబుక్‌ వంటి సామాజిక మాధ్యమాన్ని కూడా కథావస్తు
వుగా తీసుకుని రచయిత్రి తమ సామర్థ్యాన్ని నిరూపించుకున్నారు.ఫేస్‌బుక్‌ వలన
అందరూ చెప్పే దుష్పరిణామాలే కాదు. ఒకరికొకరున్న సామూహిక భావం కూడా వుంటుందని చెప్పిన ‘ ఫేస్‌బుక్‌’ కథలో రచయిత్రి యొక్క ఆశావహ దృక్పథం  కని
పించింది.

          ఈ మధ్యన భార్యభర్తలు వారి మధ్యగల చిన్నచిన్న అభిప్రాయభేదాలే పెద్దవిగా చేసుకుని విడాకుల దాకా వెడుతున్నారు. అటువంటి తల్లిదండ్రుల ముద్దుల కొడుకు బబ్లూ. అమ్మా నాన్నా విడిపోతారేమోననే భయంతో పడే ఆరాటమే ‘బబ్లూ అనబడే
శ్రేయాన్‌… ‘ కథ. ఈ కథలో బబ్లూ పడే బాధ తపన, అదేమిటో కూడా తెలియని , చెప్పలేని పసి తనం లాంటి వన్నీ రచయిత కథలో బాగా చూపించారు. చదువుతున్నంత సేపూ బిక్కమొహం పెట్టుకున్న బబ్లూ మన కళ్ళ ముందుంటాడు.

          ఒక ఇంటిలోని స్త్రీని అందరూ తమకు అవసరమైనంత వరకూ ఆమెని నిద్రపోనీ
కుండా ఆమె చేత పని చేయించుకుని ఆఖరికి ఆమెకి శాశ్వత నిద్రలోనే సుఖముం
దున్నట్టు చెప్పిన కథే ‘ నిద్ర’.. ఆ విషయాన్ని మనసుని కుదిపేటట్టు రాయడం రచయిత్రిలోని  ప్రత్యేకత.

          రచయిత్రి కి మనోవిజ్ఞానశాస్త్రం మీద కూడా అధికారం వుందని చెప్పడానికి ‘ సహజ’ కథ ఒక మచ్చు తునక. తండ్రే లోకంగా పెరుగుతున్న చిన్నారి సహజకు ఆ తండ్రి హఠాన్మరణం. ఆ పై బంధువుల చిన్నచూపు ఆమెను లోలోపల ముడుచుకుపోయే
లా చేస్తాయి. దానిని ఒక మానసిక సమస్యగా గుర్తించి సైక్రియాట్రిస్ట్‌ దగ్గరకు తల్లీ ,
కూతుళ్ళని తీసుకెళ్ళడం ప్రభ ఒక బాధ్యతగా తీసుకోవడం చూస్తే అందులో రచయిత్రి యిచ్చే చక్కని సందేశం కనిపిస్తుంది.

          రచయిత్రిలో సామాజిక స్పృహ మెండుగా వుందనడానికి ఉదాహరణ ‘ మార్గదర్శి
…కథ’ ఒక తల్లి మారుతున్న పరిస్థితులని అర్థం చేసుకుని , ఎయిడ్స్‌ పాలబడిన
సుదర్శన్‌ ను పనిలో పెట్టుకోవడమే కాకుండా ఆ వ్యాధి బారిన పడకుండా ఎటు
వంటి జాగ్రత్రలు తీసుకోవాలో అందరిలో అవగాహన కలిగించడం, ఒకవేళ అది
సోకినా కూడా ధైర్యంగా దానిని మందులతో నయం చేసుకోవచ్చని అందరికీ చెప్పడం లాంటివి చూస్తే రచయిత్రికి ఒక తల్లిని అందరికీ మార్గదర్శిగా యెలా చూపించిందో
తెలుస్తుంది. అందుకే మార్గదర్శి అనే కథ ఆంధ్రప్రదేశ్‌ వారి ” ఆశాదీపం” లో చోటు చేసుకుంది.

          ఆలోచింపజేసే కథలే కాదు ఆహ్లాదపరచే కథలని కూడా రచయిత్రి రాయగలరని
నిరూపించారు.’ అత్తయ్యపెళ్ళిచూపులు” ‘ శ్రీనివాసకళ్యాణం’ మంగళసూత్రధారణ’ కథలలో రచయిత్రి. వాటిని చదువుతున్నంత సేపూ మనకి తెలియకుండానే మన పెదవులపై చిరునవ్వు మొలకెత్తుతుంది.

          రచయిత్రి తమ రచనలలో మానవ సంబంధాలని, ముఖ్యంగా కుటుంబ సభ్యుల
మధ్య అనుబంధాలని లోతుగా పరిశీలించారు. వాటి గురించి స్పస్టత ఏర్పరచుకున్నారు. మంచి చెడులని ఎంచి చూశారు. దేనిని ప్రేమించాలో, దేనిని నిరసించాలో , వేటిని ఏ యే మోతాదులలో చెప్పాలో కచ్ఛితంగా నిర్ణయించుకున్నారు. అలా దిశానిర్దేశం చేసుకున్న తరువాత ఎలాంటి గజిబిజికీ తావు లేకుండా తన అభిప్రాయాలని, అవగాహనను సంఘటనల రూపంలో పాత్రల రూపంలో కథలు
చట్రాలు రూపంలో చక్కగా బిగించారు.

          రచయిత్రి అనుసరించిన ప్రక్రియలో ఆర్భాటం కనిపించదు. అనవసరమైన ఉత్కంఠల ఉక్కపోతలుండవు. నిరాడంబరమైన శైలి. కథలనిపించవు. పాత్రలు కనిపిం
చవు. జీవిత చక్రభ్రమణంలో గిర్రున తిరిగే ఆకుల్లాంటి మనుషులు మాత్రమే కనిపి
స్తారు. ఒక్కోసారి ‘ ఈ పాత్ర నాకు తెలిసిందే’! ‘ ఈ సన్నివేశం నేను చూసిందే’! అని
పిస్తుంది. అంతేకాదు- ‘ ఆ అవ్వే మరణిస్తే ఆ పాపం ఎవ్వరిదని!” మహాకవి శ్రీశ్రీ గారి
వెర్రిగా ప్రశ్నించినట్లుగా -‘ నేను కూడా ఇంతేనేమో, ఇందులో నా వాటా కూడా
ఉందేమో?” అని కొన్ని సందర్భాలలో చదువరి ఆగి , ఆలోచించుకోవాలిసిన పరి
స్థితి కూడా ఏర్పడుతుంది. ఊరికే నిలదీసి వదిలేయడం కాకుండా సరి చేసుకునే
తోవ కూడా కనిపిస్తుంది.

          ‘ఒకపువ్వు పూసింది’ లో పూనం మిసెస్‌మాథుర్‌ గా మారిన వైనం. ఒక దీపంఅనేక దీపాలని వెలిగిస్తున్నదన్న సత్యాన్ని హృద్యంగా వివరించారు. ఆదర్శం కోసం అవరోధాలనని ఎదురించే వ్యక్తులు ‘ ఎల్లలు లేని మమత’ ‘ ప్రేమైక కులంలాంటి కథలలో కనిపిస్తారు.’ అనుబంధాలు’, ‘సంధ్యాసమయం’, ‘నిద్ర’ ‘మనసు గెలిచింది’ , ‘ ఆది’ లాంటి కథలలో కన్నవారి పట్ల పిల్లల స్వార్థపూరిత వైఖరులు బాధిస్తాయి. కనుమరుగవుతున్న కుటుంబసంబంధాలలోని చీకటి కోణాలు భయపెడతాయి. పిల్లల అభిరుచులని బలాబలాలని గుర్తించి ప్రోత్సహిస్తే ‘ నవ్విన నాపచేను’, పండుతుందని అలాగే వారిలోని భయాలని విశ్లేషించి, తగన చికిత్స చేయిస్తే ‘ సహజమైన వ్యక్తిత్వం రూపుదిద్దుకుంటుందని రచయిత్రి తెలియజెప్పారు.

          బతుకుభయం కోసం కూతుళ్ళకి పెళ్ళి కాకుండా అడ్డుకునే తండ్రిని’ ఓ ఇంటికథ’
లో చూస్తాం. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలను మనకు కథల రూపంలో ఒక చట్రంలో బిగించి చదివింపజేస్తారు రచయిత్రి.

          ‘ ఒక ఇంటి కథ’ లో రచయిత్రి చక్కటి విశ్లేషణ చేశారు. ప్రకృతి సహజమైన ఒక వాస్తవం. మగ జంతువులకు తమ పిల్లల మీద ప్రేమ ఉండదు సరికదా…! వాటికి ఏవి తన పిల్లలో కూడా తెలియదు. పిల్లలు వాటి ఆహారం అవి సంపాదించుకునే వరకూ వాటి
ఆకలి తీర్చవలసిన బాధ్యత తల్లిది. పాలు తాగడం అయిపోయి , తమ తిండి తాము వెతుక్కునే స్థితి వచ్చేసరికి తల్లికి కూడా తన పిల్లలు గుర్తుండవు. అది జంతున్యాయం.
అదే జంతున్యాయాన్ని మనుషులు పాటిస్తే…వారినే మనాలి? జంతువులు కనీసం
వాటి మానాన బతకమని పిల్లలని వదిలేస్తాయి. జంతువులని మించిన మనుష్యులు
కొందరు తమ సుఖసంతోషాల కోసం, తమ మగపిల్లల సౌఖ్యాల కోసం అమాయకు
లైన ఆడపిల్లలని బలి చేస్తారు. జంతువులకి లేని ఆలోచించ గల మెదడు ఉంది
కదా మరి! అమ్మాయిలు తండ్రి మీదున్న ప్రేమతో , నమ్మకంతో బలిపశువులవుతారు.
అటు వంటి బలిపశువులే ఆనంద, అమృతలు. ఆడపిల్లలని తండ్రి చిన్నచూపు
చూసినా స్వశక్తి తో చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించుకుంటారు. వచ్చిన
సంబంధాలన్నీ తప్పిపోతుంటాయి ఆనందకి. ఉద్యోగంలో మంచి స్థానం సంపాదించుకుని, బాగా సంపాదిస్తూంటారు అక్కా చెల్లెలు. మంచి ఇల్లు, దేనికీ లోటు
లేకుండా గడిచిపోయే జీవితం. తండ్రికి పిల్లల పెళ్ళి దృష్టే లేదు. మగపిల్లవాడికి మాత్రం ఉన్న డబ్బంతా ఇచ్చి వ్యాపారం పెట్టిస్తే, వాడు పెళ్ళి చేసుకుని పిల్లలని కంటాడు. ఇంకా అడపాదడపా సాయం కూడా అందుతుంటుంది తండ్రి నుంచి. అదీ కూతురు సంపాదనలోదే. తండ్రి దురుద్ధేశం తెలుసుకునేసరికి పెళ్ళి వయసు దాటి పోయి, పెళ్ళి మీద ఆసక్తి తగ్గిపోతుంది పెద్ద అమ్మాయికి. కనీసం చెల్లెలి తానై పెళ్ళి చేసి ఆమె జీవితాన్ని సరిదిద్దాలనుకుంటుంది అక్క.

          ‘ మమత’ పాత్ర ద్వారా ఈ కథని చెబుతారు రచయిత్రి. చదువుతున్నంతసేపూ కూతుళ్ళకి అన్యాయం చేసే తండ్రి మీద కోపం, అసహ్యం కలుగుతాయి పాఠకులకి.
అమ్మాయిలు అంత అమాయకంగా ఉండక్కరలేదనిపిస్తుంది.

          వీరు అనేక ప్రదేశాలు చూసి, ఎందరివో మనస్తత్వాలు పరికించిన అనుభవం ,
పుస్తక పఠనం ద్వారా అందుకున్న విజ్ఞానం వీరి రచనలలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
అమృతవాహిని నవలలో అద్భతంగా చిత్రీకరించారు స్త్రీల మనోధైర్యాన్ని రచయిత్రి.
కొండలమీద ఎక్కడో ఓ నది సన్నని ధీరలాగీ మొదలై ప్రవహిస్తూ ఇంకా ఇంకా విశా
లమై సముద్రాన్ని తలపించినట్టు -‘ ఈ ” అమృతవాహిని” అనే నవల’ ఓ చిన్న
కుటుంబంతో మొదలై , అమెరికా చుట్టబెట్టి విశ్వవ్యాప్తమవుతుంది.

          ఆ సన్నని ధార పేరు మంజరి. ఓ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి , పరిస్థితులను
ఆకళింపు చేసుకుని తల్లికి తోడై తండ్రికి ‘ నమ్మకమై’ అత్యాశకు పోయే అక్కకు చక్కని జీవితాన్ని ప్రసాదించి , పుట్టినింటా, మెట్టినింటా తలలో నాలుకై……పయనిస్తూ… పయనిస్తూ… మారే పరిస్థితులకు అనుగుణంగా తనని తాను మలచుకుంటూ నిండు గోదావరిలా ప్రవహించిన ‘ మంజరి’ కథ ఖచ్చితంగా పాఠకుల మనసుకు హత్తుకోవడమే గాక, కలకాలం నిలిచిపోతుంది.

‘ నిన్ను నేను చదవిస్తా….నువ్వు మరొకరిని చదివించాలి’ అనే మాట కొంచెం ‘ఠాకూర్‌’ కథని ఓ క్షణం జ్ఞప్తికి తెచ్చినా , మరుక్షణమే మరో మలుపు మనని కథలోకి లాక్కు పోతుంది. ఇందులో ఏమి ఉన్నాయి? అంటే బోలెడు చెప్పొచ్చు. భగవద్గీతనీ, మహాభారతాన్నీ, ఉపనిషత్సారాన్నీ ఎక్కడ వాడాలో అక్కడ వాడారు. తద్వారా మనదైన సంప్రదాయం మీదా, విజ్ఞానం మీదా ఉన్న ‘ పట్టు’ ని చెప్పకనే చెప్పారు రచయిత్రి.

          ఒక పురుషుడి దృష్టిలో లోకం వేరు. స్త్రీ దృష్టిలో ని లోకం ఎలా ఉంటుందో యీ
‘ అమృతవాహిని’ నవల మనకి కళ్ళకి కట్టినట్టు చెబుతుంది. ఇందులో పచ్చి స్వార్థపరుల విన్యాసాలున్నాయి.స్నేహహస్తం జాచే స్వచ్ఛమానవుల అడుగుజాడలున్నాయి. ఊరు గాని ఊళ్ళో, దేశం గాని దేశంలో ‘ నేనున్నాను’ అని ధైర్యం చెప్పే అమృతహస్తాలు ఉన్నాయి.

          ‘ ఇండియా’ లో జరిగిన కథ మన ఇంటి వాతావరణాన్ని కళ్ళకు కట్టిస్తే, అమెరికాలో
జరిగిన కథ మనని అమెరికా తిప్పి చూపిస్తుంది. 

          అంతేకాదు….అక్కడి మన తెలుగువారి కష్టాలు , కన్నీళ్ళు, స్వార్థాలు,స్నేహాలు,అహంకారాలు, మమకారాలు అన్నీ చిరుగాలుల తెరల్లా మన మనసుని తాకుతూ మరో
లోకానికి తీసుకుపోతాయి. నాకొకటి అనిపించింది…రచయిత్రి యొక్క సంస్కారము
పుట్టి పెరిగిన విధానము పాత్రలను మలుస్తుందని , ‘ అమృతవాహిని’ లో ఈ విషయము స్పష్టంగా కనిపిస్తుంది.

          వ్యక్తుల కోపాన్నీ, ద్వేషాన్నీ కూడా ఓ పరిధి లోనే ఉంచారు గానీ, ‘ రాత’ లో అసహనాన్నీ ఎక్కడా చూపలేదు. ఒక చక్కని మాట ఓ క్షణం వచ్చి వెళ్ళిపోయే పాత్రద్వారా చెప్పించారు రచయిత్రి. ఇలా …” రెక్కలు వచ్చాక పక్షులు ఎగిరి పోతాయి. అది ప్రకృతి ధర్మం. తల్లిదండ్రులు ముసలివాళ్ళయ్యాక వారి దగ్గరో, అవసరమైనప్పుడు అందుబాటులో ఉండటం మానవధర్మం( లేక) మనిషి ధర్మం. కృంగిపోవాల్సిన చోట మంజరి కృంగిపోలేదు.” ఉహూ…పరాజితులై వెనుతిరగ కూడదు”. అని నిర్ణయించుకుని, ముక్కుకు సూటిమార్గంలోనే , ఎవరినీ పరుషంగా నిందించకుండానే , అందనంత ఎత్తుకు ఎదుగుతుంది. యాభై ఏళ్ళ వయసులో డ్రైవింగ్‌ నేర్చుకుంటుంది. కుట్లూ,అల్లికలూ వంటలూ ఏవీ ‘ శక్తి’ కి కావు అనర్హం. అన్నీ బతుకుబండిని నడిపే శక్తిని ఇవ్వగలిగినవే అని నిరూపిస్తూ -మంజరిని హిమాలయపు ఎత్తున నిలబెట్టారు రచయిత్రి. అలా అని నేల విడిచి సాము చెయ్యలేదు. తమ వ్యక్తిత్వాన్ని సిన్సియర్‌గా  మలుచుకొనే వారికి  వీరి రచనలు ఖచ్చితంగా ఒక స్ఫూర్తిగా నిలుస్తుందని మాత్రం నిర్ద్వంద్వంగా చెప్పగలను. ఎందుకంటే జీవితంలోని చాలా కోణాలని అతి సున్నితంగా స్పృశించారు గనుక.

*****

Please follow and like us:

14 thoughts on “గంటి సుజల గారి రచనా వైదుష్యం”

  1. ఎంతో గొప్పవైన గంటి సుజల గారి కథలను అంతే గొప్పగా విశ్లేషించారండీ సుబ్రహ్మణ్యం గారూ. ఇరువురికీ అభినందనలు. 🙏

  2. సుజలగారు వ్యక్తిగా కూడా చాలా గ్రేట్. ఆవిడ ఆత్మవిశ్వాసం చెప్పుకోతగ్గది

  3. శ్రీమతి గంటి సుజల(అనూరాధ) గారి గురించి శ్రీ అయ్యల సోమయాజుల గారి ఒరిచయం చాలా బాగుంది. గృహిణిగా తన బాధ్యతల బరువు తగ్గగానే రచయిత్రిగా తన కలం బలం నిరూపించిన గొప్ప రచయిత్రి వారు. తక్కువ కాలంలొ నాణ్యమైన రచనలు చేసి పాఠకుల మనసులను, రచనలకు బహుమతులనూ గెలుచుకున్నారు. వారి పరిచయం అభినందనీయం……..సుసర్ల సర్వేశ్వర శాస్త్రి,విశాఖపట్నం

    1. మీ యొక్క ఆత్మీయకు సదా కృతజ్ఞుడను.

Leave a Reply

Your email address will not be published.