నిష్కల – 24

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న మొదటి భార్య ఎక్కడుంది ? అని సారాని ప్రశ్నిస్తుంది. మాటల్లో తన తల్లి గురించి చెబుతుంది నిష్కల.  

***

          కాలం చేసిన గాయాన్ని మాన్పుకుంటూ అదే కాలం ఇచ్చిన కొత్త అనుబంధం చూసి ఉప్పొంగుతున్న క్షణాలలో నీళ్లు చల్లి ఆ పొంగు ఆర్పేసింది మిత్రురాలు మరియా  మరణ వార్త. తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. చివరి చూపు కూడా చూడలేని విధంగా అన్ని కార్యక్రమాలు జరిగిపోయాయని దుఃఖపడింది సారా.   
 
          అది గమనించిన నిష్కల సారా తల నిమురుతూ ఓదార్చుతుంటే సారాలో దుఃఖం పెల్లుబికింది.  కాసేపు అలా తన ఒడిలో సారా తల పెట్టుకుని ఓదార్చుతున్నది. 
 
          మరియాది సహజ మరణం కాదు నిష్. రోగంతో నో రొష్టు తోనో చనిపోలేదు నిష్.  
ఆమెది హత్య.  ముమ్మాటికీ హత్యే. ఆ మాట అంటుంటే ఆమెలో దుఃఖం పెల్లుబికింది. 
“ఆ! ఏమంటున్నావ్ ” కంగారుగా అన్నది నిష్కల. 
 
          అవును నిష్,  
 
          కొత్తగా కొన్ని మార్పులకు గురైన గర్భస్రావ చట్టం చంపేసింది. వినడానికి నమ్మశక్యంగా లేకపోయినా అది వాస్తవం. అమెరికా దేశ వ్యాప్తంగా 50 ఏళ్ల క్రితం వచ్చిన తీర్పును ఇప్పుడు అత్యున్నత న్యాయస్థానం కొట్టేసింది. రో వర్సెస్ వేడ్ జడ్జిమెంట్ గా పేరొందిన చారిత్రాత్మక తీర్పు.  గర్భస్రావ చట్టానికి వ్యతిరేకంగా వచ్చిన తీర్పు. మహిళల కున్న ప్రాథమిక, రాజ్యాంగ రక్షణ హరించే తీర్పు. అభివృద్ధి చెందిన దేశంలో సంప్రదాయవాదులైన  న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు.  మహిళను ద్వితీయ శ్రేణి పౌరురాలిగా మార్చిన తీర్పు.  విచారకరమైన తీర్పు. రిపబ్లికన్ల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కును లాగేసుకున్న చీకటి  తీర్పు. 
దేశమంతా ఆ తీర్పును వ్యతిరేకిస్తూ నిరసన వ్యక్తం చేశారు. కోట్లాది మంది అమెరికన్ల స్వేచ్ఛపై దాడి అని ధ్వజమెత్తుతున్నారు. పునరుత్పత్తి ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడానికి మహిళలకు ఉన్న హక్కును తొలగించడాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. నిరసిస్తూనే ఉన్నారు. ఈ విషయాలన్నీ అటార్నీ వైన నీకు తెలియనివి కావు నిష్. 
 
          అదంతా నాణేనికి ఒకవైపు. 
 
          మరోవైపు  మరియా లాంటి ఎందరికో మరణశాసనం రాస్తున్నది అని చెప్పడానికి మరియా సంఘటన ఒక ఉదాహరణ. 
 
          మిసిసిపి లో ఉండే మరియా 17 వారాల గర్భిణీ.  ఆ గర్భం టెర్మినేట్ చేయాల్సిన వైద్య  పరిస్థితి . అక్కడి చట్టం ప్రకారం 15 వారాలు దాటితే గర్భస్రావము కుదరదన్నారు వైద్యులు. ప్రత్యేక పరిస్థితుల్లో గర్భస్రావం చేయాలంటే న్యాయస్థానం నుంచి అనుమతి తప్పనిసరి అని ఉద్ఘాటించారు. ఆ తీర్పును ఉపేక్షిస్తే ఆ వైద్యులకు శిక్ష తప్పదు.  అందుకే మరియాని న్యాయస్థానం నుంచి అనుమతి పత్రం తీసుకువస్తే గర్భస్రావం చేయగలం అని నిర్ద్వందంగా చెప్పారు వైద్యులు. 
 
          వైద్యుల పర్యవేక్షణలో ఉన్న మరియా న్యాయస్థానం అనుమతి కోసం వెళ్ళింది.
ఆ సమయంలో యూరప్ లో ఉన్న ఆమె పార్ట్నర్ పరిస్థితి తెలిసి తన పనులన్నీ వాయిదా వేసుకుని వచ్చాడు.  కానీ వీకెండ్ రావడంతో న్యాయస్థానం అనుమతి ఆలస్యమైంది. 
ఈ లోగా మరియా ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి” లేచి కూర్చొని ఉద్వేగంగా విషయం వివరించింది సారా. 
 
          జీవితం ఎంత విచిత్రమైనది. ఓ వైపు ఆనందం, మరో వైపు దుఃఖం. రెండూ ఒకేసారి మనిషిని కమ్మేస్తే .. ఆ హృదయం తట్టుకోవడం ఎంత కష్టం. చిగురుటాకులా కంపించిపోతున్న సారాను చూస్తున్న నిష్కల అనుకుంది. 
 
          అమెరికాలో వ్యక్తిగత స్వేచ్ఛ ఎక్కువ.  ఇండియాలో లాగా కాదు. పిల్లలు యుక్త వయసు వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో దాదాపు దూరంగా ఉంటారు. విద్య, ఉద్యోగం, వైవాహిక జీవితం అంతా వాళ్ళ చేతిలో ఉంటాయి. 
 
          పెళ్లి కాకుండానే గర్భం దాల్చడం అక్కడ సర్వ సాధారణ విషయం.  అవాంఛిత  గర్భాన్ని తొలగించుకోవడం కూడా నిన్నటి వరకు సర్వ సాధారణ విషయం కొన్ని రాష్ట్రాలు మినహా. ఇప్పుడు గర్భస్రావానికి రాజ్యాంగం కల్పించిన హక్కుని న్యాయస్థానం రద్దు చేసింది. గర్భస్రావాన్ని నిర్ణయించే  అధికారం రాజ్యం చేతిలోకి తీసుకుంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకుంటాయి. దాంతో అనేక మిలియన్ల అమెరికన్ మహిళలు తమ ప్రాథమిక రాజ్యాంగ రక్షణ కోల్పోయారు. ఈ నిర్ణయం ఫలితంగా మహిళలు హక్కుని, వారి స్వేచ్ఛ సమానత్వాల స్థాయిని తగ్గించేసింది. ఎంతో అభివృద్ధి చెందిన దేశం అని ప్రపంచాధిపత్యం చేసే దేశం ఇలా తయారయ్యిందేంటి?  మన దేశంలో సంప్రదాయవాదుల కంటే ఇంకా ఎక్కువ మూర్ఖంగా ప్రవర్తిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే ఈ దేశంలో స్వేచ్ఛ అంతా నీటి బుడగలాంటిదే అని తోచింది నిష్కలకు.. 
మరియా న్యాయంగా బతికే హక్కు, ఆమె అందరిలా ఉండే హక్కును కాలరాసింది సంప్రదాయవాదం. 
 
          చట్టం తెచ్చిన మార్పుల వల్ల ఇటువంటి మరియాలు ఎందరు పోయారో .. ఇంకెందరు తమ జీవించే హక్కును కోల్పోతారో .. దేశం ఏదైనా సంప్రదాయవాదుల  చేతిలో  హత్యలు జరుగుతున్నాయి.. పెళ్లి కాకుండా జరుగుతున్న గర్భస్రావాలు ఆపడానికే ఇటువంటి చట్టం రావాల్సి వచ్చిందని సంప్రదాయవాదుల వాదన. 
ఇక్కడితో ఇది ఆగుతుందా.? ఏళ్ల తరబడి పోరాడి సాధించుకున్న మహిళల హక్కుల విషయంలో ఒక్క కలం పోటుతో ఇంకెన్ని మార్పులు తేనున్నారో.. ఎన్ని హక్కులను కాలరాసే ప్రమాదం ఉన్నదో.. కోర్టు చట్ట బద్దతను దెబ్బతీస్తుందో .. కాలమే చెప్పాలి అనుకున్నది నిష్కల. 
 
          “నిష్ మన వ్యవస్థ ఈ సమాజాన్ని ముందుకు నడిపిస్తున్నారా .. వెనక్కి నడిపిస్తున్నారా అన్న సందేహం వస్తున్నది”.  వర్షిస్తున్న కళ్ళు తుడుచుకుంటూ అన్నది సారా.. 
 
          “భారతీయ సమాజంలో కుల, మత, వర్గ, జెండర్ అంతరాలు వాటి మూలంగా వచ్చే సమస్యలు ఎక్కువ అనుకునే దాన్ని. ఇక్కడికి వచ్చాక, అందునా న్యాయ వ్యవస్థలో అడుగు పెట్టాక ఇక్కడ పరిస్థితి అందుకు భిన్నంగా లేదని అర్ధం అవుతున్నది.  
 
          పైకి ఎంతో అడ్వాన్స్డ్ దేశం.  కానీ చాలా కన్సర్వేటివ్.  ముఖ్యంగా స్త్రీ విషయంలో. 
బిడ్డకు జన్మ ఇవ్వాలా వద్దో నిర్ణయించుకోవాల్సిన హక్కు ఆమెకు లేకపోవడం ఏంటి ? ఆమె శరీరం పై ఆమెకు హక్కు లేకపోవడం ఏంటి? డిస్గస్టింగ్” అన్నది నిష్కల 
 
          “ఆమె శారీరకంగా మానసికంగా బిడ్డకు జన్మ ఇవ్వగలిగే స్థితిలో ఉన్నదో లేదో, ఆమె ఆర్థిక, సామాజిక పరిస్థితులు ఏమిటో, ఆమె వైద్య అవసరాలు ఏమిటో తెలుసుకోకుండా ఆమె శరీరంపై రాజ్యం హక్కు ఏంటి ?  ఆమెను నియంత్రించడం ఏంటి?  గర్భం దాల్చడం స్త్రీకి ప్రకృతి ఇచ్చిన ఒక వరం అంటారు.. అవునో కాదో కానీ, అవాంఛితమైతే విచ్చిత్తి చేసుకోవడం ఆమె హక్కు.
 
          స్త్రీ పురుష కలయికలో వచ్చిన గర్భానికి ఆమె మాత్రమే బాధ్యత వహించవలసి రావడం, ఆమె మాత్రమే నష్టపోవడం..  ఎంత శోచనీయం?! ఆ హక్కు ఆమెకు లేదని ఎందుకంటున్నారో .. పునరుత్పత్తి, లైంగికత, వివాహం అన్ని పురుషస్వామ్యంలో ఉండడం వల్లనే కదా .. చట్టాలు .. భావజాలాలు ఆమె శరీరం పై, మనసు పై హక్కుని పురుషుడికి కట్టబెట్టేశాయి . ఇది పితృస్వామ్య వ్యవస్థలో ఆధునిక నీతి కావచ్చు” అన్నది సారా. ఆమె గర్భం పై చట్టం ఉక్కుపాదం మోపడం వింటుంటేనే చాలా కష్టంగా ఉంది. పాపం మరియా.. ఎంత వేదన అనుభవించిందో .. అనుకుంది నిష్కల. 
 
          ఆ తర్వాత కూడా అమెరికా చట్టాలను, భారతీయ చట్టాలను, ప్రజల జీవితాలను ముచ్చటించుకుంటూ సమయం గడిపేశారు. ఆ తర్వాత స్లీపింగ్ బాగ్ లో దూరి నిద్రకుపక్రమిస్తూ “తోబుట్టువు లుండడం, అదీ  పక్కనే ఉండడం ఎంత ధైర్యాన్ని ఇస్తుందో అనుభవమైంది నిష్. నీ స్పర్శ, కౌగిలింత నాకెంతో బలాన్నిచ్చింది. బంధానికి, రక్త సంబంధానికి ఉన్న గొప్ప బలమేంటో అర్థమైంది నిష్. ఈ సమయంలో నువ్వు లేకపోతే ఎంత కుమిలిపోయేదాన్నో .. ” బేలగా అంటున్న సారాని చూస్తూ “ఛా.. నా చెల్లి చాలా ధైర్యవంతురాలు. నిబ్బరం ఎక్కువ. అనుకున్నా” అన్నది నిష్కల 
 
          “ఎంతో ధైర్యంగా ఉన్నట్టు కనబడతా గానీ ఉట్టి పిరికిదాన్ని. కష్టంలో ఉన్నప్పుడు  ఒక్కసారిగా పిరికితనం ఆవహిస్తుంది. నన్ను బలహీనం చేస్తుంది. నాన్నదూరమైనప్పటి నుంచి ఇంతే. ఇక దిగులు లేదులే.  అక్కచెల్లెళ్ళం ఇద్దరం కలిసాం కదా.. నాకు అమ్మ తో పాటు నువ్వు కూడా ఉన్నావన్న భరోసా వచ్చేసింది ” అంటూ నవ్వేసింది, సారా నవ్వుతో నిష్కల మనసు తేలిక పడింది. 
 
          నిశ్శబ్ద నిశి రాత్రి సాగిపోతున్న చిరుగాలి సవ్వడి, ఎక్కడో కీచురాళ్ళ శబ్దం తప్ప మరేమీ వినిపించడం లేదు. 
 
          అక్కాచెల్లెళ్ల మనసులు వారి వారి అమ్మతో మాట్లాడాలని ఆత్రుత పడుతున్నాయి. 
ఎడతెగని ఆలోచనలు కమ్మేస్తుండగా ఎప్పటికో రెండు గంటలు దాటాక నిద్రలోకి ఒదిగిపోయారు. 
 
          ఉదయం పక్షుల పలకరింతలతో మెలుకువ వచ్చేసింది. అయినా అలసట లేదు. నిద్ర మబ్బు లేదు. ఉదయం త్వరగా తయారై అనుకున్న ప్రకారం సన్ ఫిష్ వాటర్ పాండ్ కి బయలు దేరారు. వారి జీవితం కొత్త అధ్యాయంలోకి వెళుతున్నట్టు తోచింది.
 
          ప్రకృతి కఠినంగా మారితే ఎలా ? అకస్మాత్తుగా వరదలు ముంచెత్తితే ఎలా ? తమని తాము ఎలా రక్షించుకోగలం? ట్రీ టెంట్స్ లేదా ఊయల టెంట్స్ వేసుకున్నా అవి రక్షిస్తాయా ?  అని మొదటి రోజు ఆలోచించిన నిష్కల ఆ విషయమే మరిచిపోయింది. 
ఉన్న ప్రదేశాన్ని, ప్రకృతిని, ప్రకృతి నియమాల్ని ఉన్నది ఉన్నట్లుగా  ఆస్వాదించడం మొదలు పెట్టింది. తనకి గొప్ప బహుమతి ఇచ్చిన వర్తింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ అంటే ప్రేమ రెట్టింపు అయింది. 
 
          న్యూ జెర్సీలో ఉన్న ప్రకృతి సిద్ధమైన ఏడు అద్భుతమైన ప్రదేశాల్లో ఒకటి సన్ ఫిష్ పాండ్. తమ్మనీ పర్వతంపై న ఉంది. 360 డిగ్రీ వ్యూ .. అద్భుతం ..అత్యద్భుతం    
ఆరంజ్ ట్రయిల్ లో సన్ ఫిష్ పాండ్ కి వెళ్లడం కాస్త కష్టమే . వర్థింగ్టన్ స్టేట్ ఫారెస్ట్ లో మోస్ట్ పాపులర్ స్పాట్ నలభై ఎకరాల్లో ఉన్న సరస్సు ఇది. కిట్టతిన్నీ రిడ్జ్ సమీపంలో ఉంది.  న్యూ జెర్సీ లో ఉన్న ఏడు అద్భుతాల్లో ఇదొకటి అని  న్యూజెర్సీ ప్రభుత్వం 1978 లో ప్రకటించింది మంచు యుగంలో గ్లాసియర్స్ వత్తిడి వల్ల రాళ్లమధ్య లక్షలాది ఏళ్ల క్రితం ఈ సరస్సు ఏర్పడిందని తెలిసి ఆశ్చర్యపోయింది నిష్కల. కిట్టతిన్నీ రిడ్జ్ తోక వైపు డలావెర్ నదీ జలాల గాప్స్ లో పద్నాలుగు సరస్సులున్నాయిట. భూగర్భ రసాయన సమ్మేళనం వలన ఈ సరస్సులో ఆమ్లగుణం ఎక్కువ. అందువల్ల కొన్ని జాతుల చేపలు మాత్రమే పెరుగుతాయి. అద్భుతమైన అందాలను,  మనసును కట్టి పడేసే సుందర దృశ్యాలు చూసిన తర్వాత అక్కడిదాకా రావడానికి పడిన కష్టం, శ్రమ, అలసట మర్చిపోయారు. 
 
          ఆలిప్పైన్ పర్వతాలు, సరస్సులు, మైదానాలు .. సాహసోపేత హైకర్లు .. హిమానీ నదాలూ చెక్కబడిన లోయలు అంతా అత్యద్భుతంగా.. ఇదంతా ఈ ప్రపంచంలోనే..  తనకు పరిచయం లేని ప్రపంచాన్ని చూస్తూ అబ్భుర పడింది నిష్కల. 
 
          బైకింగ్, బోటింగ్, ఫిషింగ్, హైకింగ్, అధిరోహణ హార్స్ రైడింగ్, పాడెలింగ్, క్లైమ్బింగ్ , స్నో స్పోట్స్, స్విమ్మింగ్,  వైల్డ్ లైఫ్ వాచింగ్  వంటి అవకాశాలు అనేకం గొప్ప సాహసాలు చేయొచ్చు  అంటూ తనకు తెలిసిన  అనేక విషయాలు పంచుతున్నది సారా. 
 
          ఇద్దరూ కలిసి ఫిషింగ్ చేసారు. హైకింగ్ చేశారు, సౌందర్యంతో అలరారే జలపాతాల చెంత చేరారు. నదిలో విహరించారు. రకరకాల పక్షులు, ఇక్కడ నివసించే బాల్డ్ ఈగల్ జంట.. లెక్కలేనన్ని ఫోటోలు తీసుకున్నారు. 
  
          డెలావేర్ నదిలో తేలుతూ సాగే పడవల వరుస .. ఎనిమిది వందల మైళ్ళ అప్ప లాచియన్ పర్వతాలు , సరస్సులు, నీటి ప్రవాహాలు, అడవి పూలు, అడవులు.. జీవ వైవిధ్యం, రాతి నిర్మాణాల సోయగాలు  .. చూస్తూ ప్రయాణిస్తున్నారు అక్కాచెల్లెళ్లు. 
గత రాత్రి కలిగిన వేదన, దిగులు పోయి మామూలు గా ఉండడానికి ప్రయత్నిస్తున్నది సారా.  చేసేదేమీ లేదు. జీవితాన్ని కాలగతిని ప్రేమించడం. ఇంకా ఇంకా ఎక్కువగా ప్రేమించడం తప్ప. కాల ప్రవాహంలో కొన్ని బంధాలు దూరమైపోతాయి. కొన్ని కావాలని వదులుకుంటాం.  కొన్ని బంధాలు తెలియకుండానే వచ్చి వాటేసుకుంటాయి. కొత్త దారులను సృష్టిస్తూ.. దారిమళ్లిస్తూ..  భలే గమ్మత్తుగా ఉంటుంది కదా.. అంటూ నిష్కల అన్న మాటలు సారాపై బాగానే ప్రభావం చూపాయి. 
 
          ఆకురాలే కాలంలో  అద్భుతంగా రంగులు మారే ఆకుల్లా వారి  జీవితంలో… కొత్త రంగులు హంగులు..  అందులోంచి పొంగి పొర్లుతున్న కబుర్లు .. ఎన్నెన్ని ముచ్చట్లు .. వారి మధ్య.  కట్టలు దిగిన నదిలా దొర్లిపోతూ అంతలో కారు బ్యాటరీ డౌన్ అయింది. ఏమి చేయాలో అర్ధం కాలేదు. పనికిరాని వాళ్ళుగా  చూడకుండా ఇడియట్స్  అని తిట్టకుండా పార్క్ పోలీస్ లు సహాయం చేశారు. 
 
***
          ఇక్కడ సరైన పార్కింగ్ లేదు. అయితే అక్కడ ఆగి కొన్ని ఫోటోలు తీసుకోవచ్చు .  అప్పలాచియాన్ ట్రైల్ తో పాటు ఇంకా కొన్ని ట్రైల్స్ ఉన్నాయి సన్నగా చీలిపోయిన కాలిబాటలు .. ఒక్కో బాట ఒక్కో వైపుకి దారితీస్తూ… వాటిని చూస్తూ మనం ఎంచుకున్న బాట ఎటు తీసుకుపోతుందో..  ఏ దారిని ఎంచుకోవాలో తికమక పరుస్తూ..  ఒకే గమ్యం. కానీ బాటలు అనేకం. ఏది ఎంచుకుంటావో నీ ఇష్టం అని బతుకు బాట గురించి ఆలోచిస్తూ  తమ గమ్యానికి చేరుకున్నారు.   
 
***
 
          గత ఏడాదికి ఈ ఏడాదికి ఎంత తేడా .. గత ఏడాది భర్త ఆయురారోగ్యాలు కోరుతూ బోనం ఎత్తింది. గౌరీ పూజ చేసి బతుకమ్మ ఆడింది. కానీ ఏం జరిగింది. తన సంతోషం, ఆనందం ఎగిరిపోయింది.  కలత పడుతున్న మనసు ఊరట కోసం వచ్చి అవ్వ దగ్గర చేరింది కావేరి. 
 
          ఆమె టీవీలో వార్తలు చూస్తున్నది. కాల్ మనీ ఆప్ ల కోరలకు బలైన మహిళ అంటూ అనాధ అయిన ఆమె బిడ్డను చూపుతున్న వార్తలు చూస్తున్న కావేరి కళ్ళ నుంచి ధారాపాతంగా కన్నీరు. అది గమనించిన రామవ్వ  టీవీ ఛానెల్ మార్చింది.  దీవెల పండుగ దగ్గర పడుతున్నది బిడ్డా .. నా కొడుకులను, బిడ్డలను అందరికి ఈడికే రమ్మందామని అనుకుంటున్నా అని చెప్పింది.  
 
          కావేరి చాలా సంతోషపడింది.  కాస్త పని ఎక్కువవుతుందేమో కానీ ఇల్లంతా కళకళలాడుతుంటుంది. చాలా ఉత్సాహంగా ఉంటుంది అని మనసులో అనుకుని ఇంకెందుకు ఆలస్యం అవ్వా .. మరి అందరికీ ఫోన్ చేసి పిలువు అన్నది కావేరి. 
 
          మునుగోడు బై ఎలక్షన్ వల్ల మీ అల్లుడికి సెలవు లేదమ్మా.. మేము రాలేము అని చెప్పింది  రామవ్వ పెద్ద కూతురు. అన్నలు, అక్క కుటుంబాలన్నీ వస్తే మేమూ వస్తాం అని చెప్పింది చిన్న కూతురు. చిన్న కొడుకు కూతురు ఆఫీసు పనిమీద ముంబై వెళ్లిందని, అటు నుంచి ఆటే గుజరాత్ లో ఉన్న స్నేహితురాలి ఇంటికి వెళ్తున్నదని,  కొడుకు ఎట్లాగూ లేడు అమెరికాలో ఉన్నాడు, ఇక మేమిద్దరం ఏమొస్తాము అంటూ రావడానికి ఆసక్తి చూపలేదు. వీలైతే అందరం సంక్రాంతి పండుగకు కలుద్దాం అన్నాడు చిన్న కొడుకు. పెద్ద కొడుకు వాళ్ళు కూడా కుదరదు. మా ఇంటికి మా పిల్లలు వస్తున్నారు అని చెప్పారు. 
 
          రామవ్వ కి కొడుకులు కూతుళ్లు ఎవ్వరూ రావడం లేదని కొద్దిగా నిరుత్సాహం కలిగింది. అమ్మా ఎవ్వరు రావట్లేదుగా.. ఎప్పుడు మేము రావడమేనా నువ్వే మా ఇంటికి రా ఈ పండక్కి అని రామవ్వ పెద్ద కూతురు ఆహ్వానించింది. 
 
          కావేరిని ఒక్కదాన్ని వదిలి వెళ్ళడానికి  రామవ్వకి మనసు రాలేదు. రాలేను, శరీరం సహకరించదు  అని చెప్పింది. కావేరి కోసం పండుగ జరుపుకోవాలి.  ఆ పిల్లకి జీవితం పట్ల ఆసక్తి పెంచాలి, దీపావళి వెలుగులు పూయించాలి అనుకున్నది. 
 
          టీవీలో మునుగోడుకు సంబంధిందిన వార్తలు.. ఏ ఛానల్ మార్చినా అవే వార్తలు. 
జనం ఓటేసి గెలిపిస్తే గెలిచాక పక్క పార్టీ దిక్కు చూడ్డం ఏంటో  .. పార్టీలు మారిపోవడం ఏంటో ..మళ్ళీ ఎన్నికలు రావడం ఏంటో.. జనాల్ని పిచ్చోళ్లను చేస్తున్నారు అనుకుంటూ టివి కట్టేసింది రామవ్వ. 
 
          చాప మీద పడుకోబెట్టిన పాపాయి చపాతి చేస్తున్న తల్లిదగ్గరకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నది.  అటుగా వచ్చిన  రామవ్వను చూసి ఎత్తుకొమ్మని గోల చేస్తున్నది.  పసిదాని అల్లరి, చిలిపి నవ్వు  చూసి రామవ్వ మైమరచి పోతుంది. దగ్గరకు తీసుకుని ముద్దాడుతుంది. పసిబిడ్డ కేరింతలతో, బోసినవ్వులతో తన ఇంటికి కొత్త చైతన్యం వచ్చిందని అనుకుంటుంది ఆమె.  

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.