విజయవాటిక-16

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

అమరావతి

          ఆ నాడు కృష్ఞా నది ప్రవాహంలో మాములుగా ఉండే ఒరవడి లేదు. వానలు తగ్గినందున నెమ్మదించింది కాబోలు ప్రశాంతంగా ప్రవహిస్తోంది.  ఆ సూర్యోదయవేళ ఆకాశములో ఎఱ్ఱటి కాంతి విచ్చుకుంటూ పృధ్వికి కాంతులు పంచుతోంది. నది ఒడ్డున ప్రజలు వారి వారి వ్యాపారాలు మొదలపెట్టబోతున్నారు.  హడావిడి ఇంకా పూర్తిగా మొదలవలేదు.

          ఆ సమయములో నది మీద నావలో ఉన్నారు మల్లికా, శ్రీకరులు. మల్లిక విశాలమైన నేత్రాలు ఎందుకో చిన్నబోయాయి. మందారములా వికసించి ఉండే ఆమె మోము నేడు ముడుచుకొని ఉంది. పెదవులు బిగపట్టింది. ముక్కున బులాకీ మెరుపులు తగ్గినవి. ఆమె అలంకారం పై శ్రద్ధ పెట్టిన చ్ఛాయలు లేవు. ఎరుపు మంగళగిరి చీర కట్టి తెల్ల రవిక తొడిగింది. మెడలో ఎప్పుడూ ఉండే వరుస హారాలు లేవు. కేవలం గుళ్ళ హారం మాత్రమే తొడిగింది. చేతులకు కంకణాల గల గలలు లేవు, కేవలము మట్టి గాజులు తొడిగింది. తలపై నాగారము, చెవులకు రత్న కుండలాలు కూడా తొడగలేదు. మాములు పల్లె పడచులా ఉన్నదామె. ఆమె ఆహార్యములో మార్పు ఉన్నా ఆమె సౌందర్యం ఒప్పారుతూనే ఉంది. పల్లె పడచు వేషము ధరించిన గంధర్వ వనితలా, మారు వేషము వేసుకున్న రాచకన్యలా ఉన్నదామె. 

          శ్రీకరుడు ఆమెను బ్రతిమిలాడుతూ “చెలీ ఎందుకలా ఉన్నావు? నీకు వచ్చిన కష్టమేమి? శ్రీ పర్వత స్వామి కృపన ఆ కష్టము తీరుస్తాను తెలుపు…” అంటూ బ్రతిమిలాడుతున్నాడు.

          ఆమె మౌనంగా ఉంది. 

          “సఖీ నీ మౌనముతో నన్ను గాయపరుచకు. నీ సేవకు నేను, నీ దాసుని, సదా నిలిచి ఉన్నాను. చెప్పు… నీకొచ్చిన కష్టమేమిటి?” తిరిగి తిరిగి బ్రతిమిలాడుకున్నాడు శ్రీకరుడు. 

          విశాలమైన నేత్రాలను పైకెత్తి, నీరు నిండిన జలాశయము వంటి కళ్ళను తుడుచుకొని, “ప్రభూ! మీకు మా అమ్మ తెలుసు కదా…” అన్నది దుఃఖము నిండిన కంఠముతో.

          “తెలుసు…” అన్నాడు శ్రీకరుడు. 

          “ఆమె పట్టుదల, దీక్షా, భక్తి తమరెరుగరు ప్రభూ…” అన్నది. 

          “నాకు తెలుసు సఖీ…” చెప్పాడు శ్రీకరుడు. 

          మల్లికావల్లి తల్లి నాగవల్లి. నాగవల్లి చాలా సౌందర్యరాశి. నాట్యంలో ఆమెను మించినవారు లేరని పేరు ఉండేది. ఆమె రాజనర్తకి కావాలని బహు కోరిక కలిగి ఉండేది. ఆ నాడు కళావంతుల స్త్రీలు స్వతంత్రులు. విద్యావంతులు. నాట్యము, సంగీతము వంటి ఎన్నో కళలలో నేర్పరులు. సరస సంభాషణలో వారిని ఎవ్వరూ మించలేరు. వారికి సంఘంలో ఎంతో గౌరవం కలిగి ఉండేవారు. 

          వారు రాజుల కొలువులోనో, ధనవంతుల వద్దనో ఉండేవారు. కొందరు దేవుని సేవ చేసుకుంటూ జీవితాన్ని పండించుకునేవారు. దేవుని సేవకు తమను తాము సమర్పించు కున్నవారు దేవుని దాసీలు. వారికి దేవాలయాలలో ఎంతో గౌరవము. వారిని ప్రజలు భక్తితో గౌరవించేవారు. వారు వెలియాండ్లు కారు. భాగవతోత్తములు. వారిని దేవదాసిలనేవారు. 

          నాగవల్లి రాజనర్తకిగా రాజస్థానానికి వెళ్ళాలని ప్రయత్నించింది. ఎందువల్లనో ఆమెకు ఆ అవకాశము దక్కలేదు. ఆమె ఆ కష్టము మరుచుటకు అమరలింగేశ్వరునికి తనను తాను అర్పించుకున్నది. ఆమె దేవాలయములో అన్ని సేవలతో సంగీత నృత్య సేవ సమర్పిస్తున్న భక్తురాలు నేడు. ఆమె అపూర్వమైన అందము, భక్తి వల్ల కూడిన దైవత్వముతో, మెరుగులు దిద్దుకు ఉంటుంది. అమె తన కుమార్తెను కూడా అమరలింగేశ్వర స్వామికి అంకితమివ్వాలనుకున్నది. 

          మల్లిక మాత్రం శ్రీకరునితో వివాహం వాంఛిస్తున్నది. తల్లికీ, బిడ్డకు ఈ విషయమై కొంత ఘర్షణ జరుగుతోంది. నాగవల్లి ఈ విషయంలో పట్టుదలగా ఉంది.  మల్లిక కూడా తగ్గటం లేదు. 

          ఈ విషయమై మల్లిక ఆందోళన పెరగటానికి కారణం, ఈ వచ్చే శివరాత్రికి తన కూతురును దేవాలయానికి అంకితమివ్వాలని నాగవల్లి నిశ్చయించుకుంది. 

          మల్లిక ఈ విషయము శ్రీకరునికి తెలియపరచాలని ప్రయత్నించినా, శ్రీకరుడు రాజకార్యాలతో నిమగ్నుడై ఉన్నందు వలన ఆమెకు అందుబాటులో లేడు. దాదాపు ఒక నెల తరువాత ఆమె అతనిని కలవగలిగింది.

          ఆమెను చూడగానే ఆమె ఎదో విషయమై దిగులు పడుతున్నదని అతనికి అర్థమయింది. ఎంత అడుగుతున్నా మల్లిక మాట్లాడలేకపోతున్నది. దుఃఖాతిశయంతో ఉంది. 

          “మీ తల్లిగారి గురించి నాకు తెలుసు సఖీ…” గట్టిగా చెప్పాడు శ్రీకరుడు. 

          “ఆమె నన్ను అమరలింగేశ్వరునికి అంకితమివ్వాలని తలుస్తున్నది. నేను కాదని ఎంత చెప్పినా వినటము లేదు…” ఈ మాట చెప్పిన తరువాత ఆమె దుఃఖము ఆపుకోలేక పోయింది. కళ్ళ నుంచి కన్నీరు ప్రవహిస్తుండగా మాట్లాడలేకపోయింది. 

          దేవాలయాలకు అంకితమైన వారు ఇక వివాహము చేసుకోరు. దేవుని సేవలో జీవితాన్ని గడుపుతారు. 

          మల్లికావల్లి, శ్రీకరుణ్ణి వివాహము చేసుకొని, జీవితాంతం అతని తోడుగా జీవించాలని కలలు కన్నది. ఆమెకు దేవలయానికి అంకితం కావాలన్న కోరిక లేదు నేడు. అంత భక్తి కూడా లేదు. తల్లికి చెబితే వినిపించుకోవటం లేదు. జీవితానికి ఆశలేదు. చివరిగా శ్రీకరునితో చెప్పి జీవితం చాలించాలని నిశ్చయించుకున్నది మల్లిక. 

          శ్రీకరుడు ఆమెను అలా చూసి తట్టుకోలేక పోయాడు. అతని హృదయం తల్లడిల్లి పోయింది. 

          ఆమెను ఊరడించాడు. 

          “చెలీ! నీవు ఊరడిల్లు. నేను మీ గృహానికి వచ్చి మీ అమ్మకు మన వివాహ విషయము తెలుపుతాను. మనము ఈ శివరాత్రి తదనంతరము వివాహం చేసుకుందాం…” ఓదారుస్తూ చెప్పాడు శ్రీకరుడు. 

          ఆమెను కొంత సేవు ఊరడింపచేసి మరసటి రోజు వారింటికి తప్పక రాగలమని చెప్పి ఆమెను పంపివేశాడు. 

          అటు పై  మహాదేవవర్మకు కబురు పంపాడు ఏకాంతముగా కలవాలని. 

***

          ఆ నాటి సాయంత్రం మహాదేవుడు, శ్రీకరుడు వ్యాహాళికి బయలుదేరారు. వారు ఒంటరిగా గుర్రాల మీద బయలుదేరారు మారు వేషాలలో . 

          నగరంలో తిరుగుతూ ఇద్దరూ కృష్ణా నది తీరాన ఎగువకు సాగారు. అమరావతి దాటి పల్లెలు వస్తున్నాయి. మరికొంత దూరమెళ్ళి నది ఒడ్డున ఆగారు. నదిలో ప్రవాహం మీద నీరెండ మెరుస్తున్నది. ఒడ్డున ఉన్న రాళ్ళ మీద కూర్చున్నారు ఇద్దరూ. 

          “ఏ విషయము ఈ అఖండ విశాల తెలుగు సామ్రాజ్య దండనాయకుని కలవర పెడుతున్నది?” అన్నారు చిరునవ్వుతో మహాదేవుడు. 

          “కలవరము కాదు మహాదేవా… నాకు నీ సహాయము కావాలి…”

          “అదేమి మిత్రమా! నీవు నా బహిర్‌ప్రాణము. నీకు ఏమి కావాలన్నా క్షణముల మీద అమర్చగలను…”

          “నాకు మీ అభిమానము తెలుసు. నా ప్రేయసి గురించి…”

          “చెప్పు…చెప్పు… ఆ చిన్నదాని గురించి నీకు కలిగిన సందేహమేమి?”

          “ఆమె కళావంతుల ఇంటి పిల్ల. నాయనగారు ఈ విషయములో అభ్యంతర పెట్టకుండా చూడాలి. వారింటికి మనము రేపు వెడదాము. నాయనగారి తరపున మీరు వారికి మాటివ్వాలి…”

          “దానికేమి భాగ్యం. నీకు నచ్చినదంటే ఆ చిన్నది ఉత్తమురాలై ఉంటుంది. నాయనగారితో నేను ఈ రోజే మాట్లాడుతాను. నీ వివాహము వెంటనే చేసేద్దాము…”

          “ముందు మీ వివాహము. తరువాతనే నాది…”

          “నాది చూద్దాములే. రాజకీయాలలో వివాహము కూడా ఒక ఎత్తు. అందుకే హృదయానికి నచ్చిన చిన్నదాన్నితో జీవించే నీ వంటి వారి జీవితము ఉత్తమం…” అన్నాడు ఆలోచనగా.

          వారు కొంత సేపు కళింగుల వద్ద నుంచి రాని సందేశం గురించి, రాజమాత అమరావతిలో మండల దీక్ష గురించి మాట్లాడుకున్నారు. పెరుగుతున్న యుద్ధ సూచనలు, నగరములో పెరిగిన గూఢచర్యము ఇత్యాదివి వారి సంభాషణలో దొర్లాయి.

          తదనంతరం తిరిగి అమరావతికి వచ్చేశారు వేగంగా.

          అమరావతి చేరగానే ఆ మరుసటినాడు మహాదేవవర్మ విచ్చేస్తున్నారని నాగవల్లి ఇంటికి కబురు వెళ్ళింది.

          శ్రీకరుడి వివాహము నిశ్చయమైనదని మహారాజుకు కబురు కూడా పంపాడు మహాదేవవర్మ ఆ రాత్రి.

***

          కళావంతుల స్త్రీలు ఎంతో చతురులు. వారి సంభాషణా చాతుర్యము ఎంతో పేరెన్నిక గలది. వారి వద్ద కోరి నృత్యము, సంగీతము నేర్చుకుంటారు, విద్య మీద ఆసక్తి ఉన్నవారు. సంగీతములో కాని, నృత్యములో కాని, వారిని మించిన వారుండరు దేశములో.

          ఆ వీధిలో కళావంతుల భవనాలు వరసగా ఉన్నాయి. విశాలమైన ఆ వీధి రసికులుతోనూ, కళాపోషకులతోనూ, కళకళలాడుతూ ఉంటుంది. ఆ వీధిలో ఉన్న ఒక అందమైన పువ్వులతో, లతలతో కూడి చూపరులను ఆకర్షించే  భవనమే నాగవల్లి నివాసం. పచ్చ రంగు భవనం ముందర రాజపరివారం మేళతాళాల మధ్య వచ్చి ఆగింది.

          పరివారం, సేవకలు మేళాలు మంగళవాయిద్యాల నడుమ రథం నుంచి మహాదేవ వర్మ, గుర్రం మీద నుంచి శ్రీకరుడు దిగారు.

          లోపల నుంచి నాగవల్లి కొందరు సేవకులతో వచ్చింది. వారిని మంగళవాయిద్యాల నడుమ లోపలికి తీసుకుపోయింది. ఆమెకు రాజకుమారుడు తన ఇంటికి ఎందుకొస్తున్నారో తెలియదు. ప్రభువులు వస్తామన్నారు. ఎందుకు, ఏమిటి అని అడగగలవారెవరుంటారు?

          దేవుని సేవకు అంకితమైన తన గృహాన్ని వీరు ఎందుకు పావనం చేస్తున్నారో ఆమెకు అర్థం కాలేదు. ‘మల్లికావల్లిని రాజ సేవకు నియమించమనా?’ అన్న ఆలోచన వచ్చి వణికి పోయింది. ఆమెకు అది ఇష్టము లేదు. ‘ఆ మహాదేవునికి తన కూతురినిస్తుంది తప్ప, రాజాస్థానాలకు పంపదు కాక పంపనను కున్నది’.

          మనస్సులో ఆలోచనలు దాచి బయటకు నవ్వుతూ వారిని స్వాగతించింది.

          లోనికి తీసుకుపోయి, వారిని ఉన్నతాసనాల పై కూర్చుండ బెట్టింది. వారికి పాద ప్రక్షాళనము కావించి, ఫలహారాలు, మధిరను ఇచ్చారు సేవకులు.

          మహాదేవుడు నవ్వి తనతో వచ్చిన పరిచారికలకు సైగ చేశాడు. వారు తమతో తెచ్చిన ఫలహారాలు, పసుపు కుంకుమలు, పళ్ళు, పువ్వులు, వివిధ ఆభరణాలు, వస్త్రాలు అన్నీ తెచ్చి పెట్టారు.

          మహాదేవుడు నాగవల్లితో “ అమ్మా! వినండి. ఇతను శ్రీకరుడు, నా సోదర సమానుడు. మా బలము ఇతను. వివేకవంతుడు, ధర్మపరుడు, నీతివంతుడు. నేను, ఇతను ఒక్కచోటనే పెరిగాము. మా ఇద్దరికీ తేడాలేదు. మీరు సందేహపడక మీ కుమార్తెను మా సోదరునికి ఇచ్చి వివాహానికి ఒప్పుకోండి. ఇతను మీ కుమార్తె మల్లికను ప్రేమించాడు…” అని గంభీరంగా చెబుతూ ఆమెను చూసాడు.

          నాగవల్లికి నోట మాట రాలేదు. ఆమె ఆశ్చర్యపోయి నిశ్చేష్టగా నిలబడిపోయింది. కొంత సేపటికి స్ఫృహలోనికొచ్చి ఆనందంలో మాటలు కూడగట్టుకొని “ప్రభూ! ఆ పరాత్పరుని సేవించిన పుణ్య ఫలము, నా కుమార్తెకు ఇంత చక్కటి వరుడు లభ్యమయ్యాడు. శ్రీకరుల వారి గురించి వినని వారు మన రాజ్యములో కలరా? మా మల్లిక అదృష్టముల పంట, ఆ చిన్నారి నోము ఫలించింది. అమరేశ్వర స్వామి కృపన నేటికి మా ఇంట ఆనందము వెల్లవిరియనున్నది. మీ ఆజ్ఞను కాదనగలమా? ఇది మాకు వరము. కానీ మల్లికను నేను దేవాలయముకు ఇచ్చివేయ సంకల్పిచినాను…” అన్నది.

          మహాదేవవర్మ భృకుటి ముడిపడింది. అయినా వెంటనే సర్దుకొని “మీరు దేవదేవుని సేవకు ఈ జంటను నియమించండి. ఇద్దరూ కలిసే చెయ్యగలరు, ఆ సేవ…” అన్నాడు నవ్వుతూ.

          ఆమెకు రాజాజ్ఞకు ఎదురులేదని తెలుసు. ఇక తప్పదని తలచింది. ముఖమున ఆనందాతిశయము చూపుతూ, పరిచారికను పిలచి చెవిలో ఎదో గొణిగింది.

          పరిచారిక లోనికి పరుగెత్తినది. ఈ విషయము మల్లికావల్లికి తెలిసి ఆమె ఆనందాతిశయంతో ఉప్పొంగి పోయింది.

          బంగారు రంగు చీరలో, మెడలో పలు వరసల హారాలు ధరించి, మువ్వల వడ్డాణముతో, కాలి చిరు మువ్వలు నెమ్మదిగా ధ్వనిస్తూ ఉండగా, మేలి ముసుగున మల్లికావల్లి పరిచారికల నడుమ ఆ మందిరం లోనికి ప్రవేశించి రాజకుమారునికి నమస్కరించి, తదనంతరం శ్రీకరునికి నమస్కరించింది.

          శ్రీకరుడు ఆమెను చూసి, పెదవుల మీద చిరునవ్వు వెలియగా మహాదేవుని వైపు చూశాడు.

          మహాదేవుడు ఆమెను ప్రశంసగా చూసి, తరువాత శ్రీకరుని సంతోషంగా చూస్తూ తల ఊపాడు.

          నాగవల్లితో “అమ్మా! మీకు అభ్యంతరము లేదన్నారు కాబట్టి నేడు ఈ క్షణమున గాంధర్వ రీతిన వివాహము జరిపించెదము.…” అంటూ సేవకులకు సైగ చేశాడు.

          వారు మాలలు తెచ్చి ఇచ్చారు. మహాదేవుడు రెండు మాలలు ఇద్దరికీ ఇచ్చి, ఒకరికొకరికి అలంకరింప చేశాడు.

          అలా గాంధర్వ రీతిన వివాహం జరిపించి, ఒక బంగారు పళ్ళెములో వస్త్రాలు, ఆభరణాలు తాంబూలము పెట్టి నాగవల్లికి ఇచ్చాడు. తాంబూలమివ్వటం గౌరవ సూచకం. ఆమె భక్తితో అది గ్రహించి, ఆయనకూ  చిన్నపళ్ళెములో  తాంబూలముంచి చేతికిచ్చింది.

          అలా శ్రీకరుని వివాహము జరిగింది. అది శ్రీకరుడు కానీ, మల్లిక కానీ ఊహించలేదు.

          మహాదేవుడు శ్రీకరుడిని కౌగలించుకున్నాడు. దంపతులిరువురూ మహాదేవునికీ, తరువాత నాగవల్లికీ నమస్కరించారు.

          అప్పటికప్పుడు మల్లికావల్లిని మేనాలో ఊరేగింపుగా తీసుకొని రాజమందిరం బయలుదేరారు.

 * * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.