వెనుతిరగని వెన్నెల(భాగం-41)

డా||కె.గీత

(*“కౌముది” లో ధారావాహిక నవలగా 2015 నుంచి 2020 వరకు ప్రచురించబడిన  “వెనుతిరగని వెన్నెల” ఇప్పటివరకు చదవని వారి కోసం కౌముది సౌజన్యంతో నెల నెలా ఆడియోతో బాటూ ఇక్కడ ఇస్తున్నాం.) 

***

జరిగిన కథ: అమెరికాలో తన తల్లికి స్నేహితురాలు, స్త్రీలకు సహాయం చేసే సంస్థ “సహాయ”ను నడిపే ఉదయినిని కలవడానికి వస్తుంది సమీర. నాలుగు నెలల గర్భవతైన సమీర, తనకు విడాకులు తీసుకోవాలని ఉందని, అందుకు దోహదమైన పరిస్థితుల్ని చెపుతుంది. ఉదయిని “తన్మయి” కథ చెపుతాను, విన్నాక ఆలోచించుకోమని చెప్తుంది సమీరతో. చుట్టాల పెళ్లి లో కలుసుకున్న తన్మయి, శేఖర్ లకు  పెద్దవాళ్ల అనుమతితో పెళ్లి జరుగుతుంది. పెళ్లయిన మరుక్షణం నించే శేఖర్ అసలు స్వరూపం బయట పడుతుంది. మొదటి సంవత్సరంలోనే అబ్బాయి పుడతాడు. శేఖర్ తో ఒక పక్క కష్టాలు పడుతూనే తన్మయి యూనివర్శిటీ లో ఎమ్మే పాసయ్యి, జే.ఆర్.ఎఫ్ సాధిస్తుంది. తన్మయి ఆశయాల్ని భరించలేని శేఖర్ గొడవ చేసి ఇంట్లో నుంచి వెళ్లిపోయి విడాకుల నోటీసు పంపుతాడు.  ఎన్నో రోజులు పోరాడి, తన్మయి చివరికి శేఖర్ కు తనే విడాకులు ఇస్తుంది.  హైదరాబాదు కు దగ్గర్లో తన్మయికి లెక్చరర్ గా ఉద్యోగం వస్తుంది.

 ***

          “ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల”  బోర్డు చూస్తూ లోపలికి అడుగుపెడ్తూన్న తన్మయికి బోర్డు కనబడనంతగా కన్నీటిపొర అలుముకుంది.

          ఇవేళ్టి నించి కాలేజీలో లెక్చరర్ తను. ప్రభుత్వ ఉద్యోగం. ఆలోచనే గొప్ప ఆనందాన్నిస్తూంది

          ఎక్కడి నించి ఎక్కడికి వచ్చిపడింది తన జీవితం! ఎలా మొదలయింది! ఎక్కడికి చేరింది!! 

          అపజయాల మీద నుంచి పడుతూ, లేస్తూ  నడిచొచ్చిన విజయాలు. అడుగడుగునా అవరోధాలు

          తన కన్నీళ్లు తనే తుడుచుకుని, తన గాయాలకు తనే చికిత్స చేసుకుని, ముందుకు నడిచిన సైనికురాలు. తనే తన సైన్యం, ధైర్యం

          ఒక్క సారి గట్టిగా ఊపిరి పీల్చి వదిలింది

          తన జీవితంలో కష్టాలు లేకపోతే తనకి ఇంత  పట్టుదల కలిగేదా? విజయాలు కలిగేవా? అందరికీ ఇంత దూరంలో ఉద్యోగం వచ్చినందుకు అసలు సంతోషించేదా? … అర్థంపర్థం లేని తన ఆలోచనలకి అంతలోనే నవ్వొచ్చింది

          ఈ కాలేజీ తమ ఊళ్లో తను ఇంటర్మీడియేట్ చదువుకున్న కాలేజీ కంటే మెరుగ్గానే ఉంది

          అడుగు పెట్టగానే ఇంకా తను నిన్నో, మొన్నో ఇంటర్మీడియేట్ చదివినట్టు జ్ఞాపకాలు చుట్టూ ముసిరాయి

          లెక్చరర్లందరూ గుర్తొచ్చారు. సరదా అల్లర్ల మధ్య  ఆడుతూ పాడుతూ పూర్తి చేసిన చదువది. లెక్చరర్ కావాలన్న ఆకాంక్ష మొదలయిన రోజులవి.

          ఆ కోరిక ఇప్పుడు అనుకోకుండా నెరవేరింది. ఒక్క క్షణం తన లెక్చరర్లు తనని ఇలా చూస్తే బావుణ్ణని అనిపించింది. తను వాళ్ల కొలీగ్ అయి ఉంటే! బహుశా: అదే జిల్లాలో పోస్టింగ్ వచ్చి ఉంటే తను చదివినప్పటికి యువకులయిన ఒకరిద్దరు లెక్చరర్లతో కలిసి పనిచేసే అవకాశం వచ్చేదేమో! కానీ ఇంత దూరంలో అసాధ్యం

          తనకి ఇంటర్వ్యూకి సలహాలనిచ్చిన సిద్దార్థ జ్ఞాపకం వచ్చేడు. వచ్చే ముందు తనకి ఉద్యోగం వచ్చిన సంగతి చెప్పడానికి వెళ్లినా అప్పటికే అతనికి ట్రాన్స్ఫర్ అయిపోయి నందు వల్ల కలుసుకోలేక పోయింది. బహుశా: ఇక ఎప్పటికీ కనిపించక పోవచ్చు. ఆలోచన రాగానే నిట్టూర్చింది. జీవితంలో ఎన్నో పరిచయాలు ఇలా అర్థాంతరంగా ముగిసిపోతూ ఉంటాయి

          ఆవరణలో గేటు దాటి నడుస్తూండగా తనని దాటి వెళ్తూ వెనక్కి చూస్తూ, తన వైపే పట్టి పట్టి చూస్తూకొత్త మేడంఅని పిల్లలు గుసగుసగా మాట్లాడుకోవడం గమనించింది.

          తమలో తాము తోసుకుంటూ, గట్టిగా నవ్వుకుంటూ తన వైపు క్లాసురూము కిటికీ ల్లోంచి చూస్తున్న పిల్లల వైపు చూస్తూ చెయ్యి ఊపింది.

          ఆవరణ మధ్య జెండా కర్ర, చుట్టూ మూడు వైపులా పెద్ద వరండాలతో గదులు.

          ఆఫీసు రూములో అడుగు పెడ్తూనే ఒక పక్కగా టైపు మిషను ముందు కూచున్న టైపిస్టునమస్తే మేడంఅన్నాడు. పక్కనే నిలబడ్డ అటెండరు అమ్మాయిలు ఇద్దరూ నవ్వుతూనమస్తే మేడంఅన్నారు వంత పాడుతున్నట్టు.

          “ప్రిన్సిపాల్అని రాసి ఉన్న టేబుల్ ముందున్న కుర్చీలో సందేహంగా కూచుంది తన్మయి.

          సూట్ కేసుతో బాటూ వచ్చిన తనని అంతా కొత్తగా, వింతగా చూస్తూండడం గమనించి, చిన్నగా నవ్వి, “నేను విశాఖపట్నం నించి వస్తున్నాఅంది.

          అంతా, “..” అని నోళ్లు తెరిచేరు. “అంత దూరానికెల్లి వచ్చిన్రాఅంటూ.

          అప్పుడే గదిలోకి అడుగుపెట్టిన ప్రిన్సిపాల్ యాదగిరి గారు తనని చూస్తూనే, “అరే, ఎప్పుడొచ్చిన్రు  మేడం, కాఫీ తీసుకుంటరా?” అంటూ ఆదరంగా పలకరించేరు.

          జాయినింగు రిపోర్ట్ అంటూ ఫార్మాలిటీసు కాగానేరండి, తరగతి గదులు చూపిస్తాను. అంటూ దారి తీసేరాయన

          వెనకగా మరో వరస బిల్డింగు కూడా కట్టేరు. దాదాపు నాలుగైదు వందల మంది పిల్లలు ఉన్న పెద్ద కాలేజీ అది.

          ప్రిన్సిపాల్ రూం పక్కన ఉన్న కంప్యూటరు లాబ్ చూపించేరు ముందుగా. ” మధ్యనే కొత్తగా ఎం పీ ఫండు తో శాంక్షను అయినదమ్మా, కానీ ఇన్ స్ట్రక్ టర్లు దొరుకత లేదు, మాకెవరికీ చాతగాదుఅన్నారు చిన్నగా విచారిస్తూ.

          తన్మయికి వివేకానందా పాఠశాలలో తను చేసిన కంప్యూటరు బేసిక్ కోర్సు జ్ఞాపకం వచ్చింది.

          “నేను ప్రయత్నిస్తానండి, నాక్కొంచెం తెలుసుఅంది వెంటనే. ఎందుకో అప్రయత్నంగా  ప్రభు జ్ఞాపకం వచ్చేడు. తనకి తెలిసిన ఒకే ఒక్క కంప్యూటరు నిపుణుడు అతనే కావడం వల్లనేమో

          “అతన్నే ఇన్ స్ట్రక్ టర్ గా చేస్తాడేమో అడిగితేనో?” ఆలోచనొచ్చిందే తడవుగానా స్నేహితుడొకతను ఎం. సీ. చేసేడు. కనుక్కోమంటారా?” అంది

          “మంచిది. అడుగమ్మాఅన్నారాయన.

          మరో పక్క గదిలో పిల్లలు శ్రావ్యంగా పాడుతూండడం వినిపించింది.

          “ముందు అటుగా వెళ్లొద్దామాండీ?” అంది

          ఒక్క నిమిషం అర్థం కానట్టు మొహం పెట్టేరాయన

          తన భాషకి, ఇక్కడి భాషకి ఉన్న వ్యత్యాసం వల్ల ఆయనకి అర్థం కాలేదని అని ఇట్టే గ్రహించి, “పాట చాలా బావుందండి, అందుకే ఒకసారి చూసొద్దామని..” అంది.

          “అదేమంత విషయం, పొయ్యి వద్దాం.” అని దారి తీసేరు.

          అప్పటివరకూ పాడుతున్న పిల్లలు చప్పున ఆపేసి, గుసగుసగా నవ్వడం ప్రారంభించేరు.

          ప్రిన్సిపాల్ గారుఈవిడ మీ కొత్త తెలుగు మేడంఅని పరిచయం చేసేసరికిఅయ్యా! ఇంగ్లీషు మేడం లెక్క కొడుతూంది సార్అని నవ్వేరు.

          “తను వాళ్ల ఇంగ్లీషు మేడం లాగా ఉన్నానని అంటున్నారో, లేక తన సబ్జెక్టు ఇంగ్లీషని అనుకుంటున్నారోఅర్థం కాలేదు తన్మయికి.

          మాండలికాలు తెలిసినా, అచ్చమైన గ్రామీణ మాండలికం తనకి ఎప్పుడూ పరిచయం కాలేదు. తను నేర్చుకోవలసినది చాలా ఉందని మాత్రం అర్థం అయ్యింది.

          వాళ్లని చూసి తనూ పరిచయంగా నవ్వి, “నాకు పాటలంటే చాలా ఇష్టం, ఎక్కడ నేర్చుకున్నారీపాట?” అడిగింది తన్మయి.

          ఒకమ్మాయి వెనక నించి,”అన్నలు నేర్పిరి మేడం”  అంది. అంతా మళ్లీ పక్కున నవ్వేరు.

          పదో తరగతి అప్పుడప్పుడే పాసై ఇంటర్మీడియేట్ కు వచ్చిన చిన్న పిల్లల గొంతుల్లో గొప్పగా పలుకుతూన్న సామాజిక చైతన్య గీతం వెనక్కు తిరిగి వస్తున్నా  తనని వెంటాడసాగింది.

          పంటసేనులారా మీకు పాద పాదా నొందనాలు

          సేను సిలకలారా మీకు సెమటసుక్కల వొందనాలు

          ఎక్కడివీ పువ్వులు గాయలు

          ఎక్కడివీ పంటా రాశులు

          నింగి నుండి తీసుకొచ్చారా

          నేలనుండి దూసుకొచ్చేరా ||పంట||

 

          పచ్చపచ్చని ఆకులల్ల

          సుక్కలోల కాతా రాసీ

          వెచ్చని బట్టా నిచ్చీ

          ఆదుకున్న పత్తీ నీకు ||పంట||

 

          సంకలోన బిడ్డా నుంచి

          ఒంటికాలు మీదా నిల్చి

          సక్కనైన కంకుల గన్న

          మొక్కజొన్న సేనులాకూ ||పంట||

 

          నెత్తినిండా పూలూ ముడిసీ

          నేలపొరలో కాయా గాసి

          కన్నతల్లీ ప్రేమను చాటిన

          వేరుశెనగా సేనులకూ ||పంట||

 

          ఎండల్లలొ వాడిపోతే

          ఎండిపోవును పిల్లానాని

          పొద్దుతోని ఆటలాడె

          పొద్దుతిరుగుడు సేనులకు||పంట||

 

          మట్టిలోన కలిసినగానీ 

          మరణమన్నది నీకూ లేదు

          ఇత్తనాలై ఒరుగుతు ఉన్న

          పుట్ల కొద్దీ పంటాలైనా ||పంట||

          అంత వరకూ తను విన్న  ఎన్నో భావగీతాల కన్నాజయరాజురాసిన బతుకు గీతం చాలా గొప్పదనిపించింది. కళ్లు చెమర్చాయి

          వ్యక్తిగత జీవితం, కుటుంబం వంటివి  సమాజం తో పోలిస్తే ఎంత చిన్నవి!

          రైతు తనకి అన్నం పెట్టిన పంటకి వందనాలు సమర్పించడం ఎంత గొప్ప విషయం!!

          ఆ రోజు కాలేజీ అంతా తిరిగి చూసేక అక్కడున్న పిల్లల్లో చాలా మందికి సరైన బట్టలు, చెప్పులు కూడా లేకపోవడాన్ని గమనించింది తన్మయి.

          తమ ప్రాంతంలో అంతగా కనబడని కటిక పేదరికం ఇక్కడ కనబడసాగింది

          “వీళ్లంతా తన పిల్లలే ఇక మీదట. వీళ్ళకి తన వంతుగా ఏదైనా చెయ్యాలి.” దృఢంగా తనలో తను అనుకుంది తన్మయి.

          స్టాఫ్ రూమ్ లో అడుగు పెడుతూనే అంతా చక్కగా పలకరించేరు. “వెల్ కమ్ మేడంఅంటూ.

          తనలాగే కొత్తగా వచ్చిన బోటనీ, కామర్సు సబ్జెక్ట్ అమ్మాయిలు తప్ప అంతా పెద్ద వయసులో ఉన్న మగ వాళ్ళే.

          ఇంగ్లీషు పోస్టు ఖాళీ గా ఉందట చాలా కాలం నించి. పార్టు  టైము లెక్చరర్ ఎవరో ఒకావిడ ఉన్నారని, మెటర్నిటీ లీవులో వెళ్ళేరని చెప్పేరు.

          ప్రస్తుతానికి ప్రిన్సిపాల్ గారే ఇంగ్లీషు పాఠాలు చెప్తున్నారక్కడ.

          పరిచయాలు కాగానేసార్ ఏం చేస్తారు మేడం?” అనడిగేడు అందులో ఒకాయన

          “అయామ్ డైవర్సీ. నాకు అతని డీటెయిల్స్ చెప్పడం ఇష్టం లేదుఅని నిక్కచ్చిగా, సూటిగా సమాధానం చెప్పింది తన్మయి

          అప్పటిదాకా ఆసక్తిగా వింటున్న అంతా ఒక్క సారిగా ఖంగు తిన్నట్లయ్యి అంతలోనే సర్దుకున్నారు

          సాయంత్రానికి ఒకే కుటుంబంలా చక్కగా కలిసిపోయి, కబుర్లు చెప్పుకున్నారంతా

          అంతా మంచి వాళ్లే అయినందుకు తన్మయికి చాలా సంతోషంగా అనిపించింది.

          సాయంత్రం కాలేజీ కాగానే అటెండరు తాయిబా కూడా వాళ్ల ఇంటికి బయలు దేరింది తన్మయి.

          వీధులన్నీ పరిశుభ్రంగా ఉన్నాయి. రోడ్ల మీద ఎక్కడా మురికి కాలువలు లేవు

          అదే అడిగింది పక్కనే నడుస్తున్న తాయిబాని

          “మురుగు కాలువలు భూమి లోపలి నుంచి ప్రవహించడం వల్ల, వీధులు పలక రాళ్లతో తాపీ చేసి ఉండడం వల్ల, చెత్త చెదారం ఇష్టం  వచ్చినట్లు రోడ్ల మీద పడెయ్య కుండా చెత్త బళ్ళలో వెయ్యడం వల్ల పరిశుభ్రత సాధ్యమన్న మాట.” అంది తన్మయి తాయిబా మాటలని తన యాసలోకి అనువదించుకుంటూ

          అటూ, ఇటూ మురుగు కాలువలతో  దోమలతో, ఈగలతో అపరిశుభ్రమైన తమ ప్రాంతపు వీధులు జ్ఞాపకం వచ్చేయి తన్మయికి

          “అట్నే అనుకో మేడంఅని తలూపింది తాయిబా

          “కాలేజీలో స్టాఫ్ అంతా చాలా మంచివాళ్ళు కదూఅంది తన్మయి మాట మారుస్తూ.  

          “అంతా మీ మనసులోనే ఉన్నది మేడం. మీ మనసు మంచిదైతే అన్నీ మంచిగనే కనిపిస్తయిఅంది తాయిబా నవ్వుతూ

          తన్మయి ఆశ్చర్యంగా చూసింది అమ్మాయి వైపు. ఎంత గొప్ప జీవిత సత్యం చెప్పింది

          పొద్దుటే అద్దెకి గది ఎక్కడైనా దొరుకుతుందా అనడగగానేఏణ్ణో ఎంతుకు మేడం, మా ఇంటి కాడ ఉండండి, మా ఆయన ఎట్లనూ దుబాయి పొయ్యిండు.” అంది తాయిబా

          ఆ అమ్మాయి కలివిడితనానికి ముచ్చటేసింది తన్మయికి. తన వయసే ఉంటుందేమో తాయిబాకి. రెండు ముక్కులకూ నత్తులతో, చక్కని నవ్వు ముఖంతో కళ గా ఉందికాలేజీ నుంచి బయటకు వచ్చే ముందు బురఖా వేసుకుంది

          నాలుగైదు వీధులకావలగా ఉంది ఇల్లు. మహా అయితే పదిహేను నిమిషాల నడక

          దారిలో ఎస్. టీ. డీ  బూత్ దగ్గిర ఆగింది తన్మయి.

          తల్లికి కొత్త ఊరి విశేషాలు చెప్పింది. బాబుతో మాట్లాడింది.

          “వారాంతంలో ఇంటికి వెళ్లి బాబుని తీసుకొచ్చుకోవాలి. రెండు రోజులు సెలవులు ఆదివారంతో కలిపి పెట్టాలిఅనుకుంటూ  తర్వాత ఫోను ప్రభుకి చేసింది.

          “కాలేజీలో పోస్టు ….” అని వినగానే పెద్దగా నవ్వేడు అటునించి ప్రభు.

          అతనికి ఎందుకంత నవ్వొచ్చిందో తన్మయికి అర్థం కాలేదు.

          అదే అడిగింది.

          “మీ కాలేజీ చూడడానికి పిలిస్తే తప్పకుండా వస్తాను. అంతే గానీ  నేనిక్కడ పనిచేస్తున్న కార్పొరేట్ ఆఫీసు ఉద్యోగాన్ని వదిలి అలాంటి చిన్న ఊళ్లో చిన్న ఉద్యోగాలు చెయ్యడం నా వల్ల కాదు.” అన్నాడు.

          తన్మయి చప్పున నాలుక్కరుచుకుంది.”ఏమీ అనుకోవద్దు ప్రభూ, ఇంత క్రితం మనం కలిసినప్పుడు మీరు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నారని విన్నట్టు గుర్తుఅంది.

          అన్న మాటలో తప్పు అర్థమయినట్లుఅయ్యో, అయామ్ సారీ తన్మయీ, నాకు ఉద్యోగం వచ్చిన సంగతి మీకు చెప్పలేదు కదూ. మీ కంప్యూటరు లాబ్ ని చూడడానికి, మీకు నేర్పించడానికి శనివారాలు వస్తాను. సరేనా?” అన్నాడు.

          తనేదో గొప్ప సాయం చేస్తున్నట్టు ఫోను చేస్తే అతనికి అది తగని ఉద్యోగమయింది

          ఫోను పెట్టేసేక గట్టిగా నిట్టూర్చింది

          “ఎవరు మేడం, సారా?” అంది తాయిబా.

          తాయిబాతో కరుకుగా సమాధానం చెప్పడానికి ఇష్టం లేక, తల అటూ ఇటూకాదు, అవునన్నట్టు ఊపింది

          మరో మలుపు తిరగగానే వీధి మొదట్లోనే ఇల్లు కనబడింది

          నేల మీద పలక రాళ్లు పరిచి ఉన్న మూడు గదుల చిన్న ఇల్లు. ఇంటి చుట్టూ పెద్దగా స్థలం లేనందువల్ల అక్కడా పలకలు పూర్తిగా పరిచి ఉన్నాయి. మొక్కలు లేకపోయినా వాకిలి పరిశుభ్రంగా, ఉన్నంతలో అందంగా ఉంది.

          ప్రతీ గదీ అద్దెకిచ్చేటందుకు వీలుగా విడి విడిగా పక్కపక్కన కట్టిన గదులు

          అందులో ఒక వైపు ఉన్న గది తాళం తీసింది. గదిలో ఒక పక్కగా చిన్న గోడ కట్టి ఉంది. గోడకవతల వంట కోసం చిన్న స్టవ్వు గట్టు. గది వెనక వైపు విడిగా చిన్న బాత్రూము

          తన్మయికి గది నచ్చింది. విశాఖపట్నంతో పోలిస్తే అద్దె కూడా చాలా తక్కువ

          చిరునవ్వుతో అమ్మాయి అడిగిన దానికంటే మరొక యాభై ఎక్కువ వేసి, ఒక నెల అద్దె అడ్వాన్సు గా చేతిలో పెట్టింది తన్మయి.

          “చాలా సంతోషం మేడం. మీరు సామాన్లు తెచ్చుకునే వరకి నా కాడనే తినండిఅంది ఆనందంగా

          పడుకునేందుకు ఒక మడత మంచం తెచ్చి ఇచ్చింది

          మంచమ్మీద తల వాల్చగానే నిస్సత్తువగా అనిపించింది తన్మయికి.

          ఆలోచనలు చీకట్లో మిణుగురుల్లా మెదలసాగేయి

          కొత్త ప్రాంతం! కొత్త జీవితం!!

          జీవితంలో ఒక్కోసారి ఎదురు చూసినవి ఎప్పటికీ ఫలవంతమవవు. ఒక్కోసారి అనుకోని కొత్త మలుపులు ఎదురయ్యి ఆనందాశ్చర్యాలకు గురి చేస్తాయి. అలాంటిదే ఉద్యోగం, ఊరు.

          ఒక పక్క ఉత్సాహపూరితంగా అనిపిస్తున్నా తల్లి దండ్రులు, తను పుట్టి పెరిగిన వాతావరణానికి ఎంతో దూరంలో జీవించాల్సి రావడంతో మెల్లగా దిగులు మొదలయింది.

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.