ఓసారి ఆలోచిస్తే-4

వివేకం

-డి.వి.రమణి

          “నిజమేనా నువ్వు చెప్తున్నది? అలా అమ్మ చెప్పారా??? నేను నమ్మలేక పోతున్నా ”
ఆశ్చర్యం నించి తేరుకుని అడిగింది సుధ…

          అంతకన్నా అమ్మ గురించి చెప్పలేకపోయాను … అంత మంది పిల్లలు పుట్టి చనిపోతే, నన్నెంత గారంగా పెంచిందో నాకు తెలుసు! అందరిలో తప్పు చేసింది అనేలా… చెప్పటం కూడా ఇష్టం లేదు.

          అమ్మకి, దూరపు బంధువు, ఏ మాత్రం ఇష్టం లేకుండా దూరపు బంధువుకి వయసులో 12 ఏళ్ళు పెద్ద, అయినా చేసుకుంది … చిన్న పిల్లని చూసి నట్టు నాన్న చూసే వారు, ఎప్పుడు దేనికి అడ్డు చెప్పలేదు వరసగా పుట్టిన బిడ్డలు పోవటం, వల్ల అమ్మకి చాలా డిప్రెషన్ వచ్చేసింది…

          అప్పుడు వాళ్ళ పెళ్లి అయినా 15 ఏళ్ళకి నేను పుట్టాను, అమ్మమ్మ వాళ్ళే నా ఆలనా
పాలనా చూసుకునే వారు. ఆ డెలివరీలో అమ్మ ఆరోగ్యం దెబ్బతింది, అమ్మకి వచ్చే
అప్పుడప్పుడు పానిక్ అట్టాక్స్ వల్ల, సరిగా తిండి తిని తినక 4 ఏళ్ళు చాలానే బాధ
పడింది.

          అమ్మమ్మ నాకు 10 ఏళ్ళు వచ్చే వరకు ఉన్నారు. సరైన వైద్యం అందక ఆసుపత్రికి
వెళ్ళేలోపు చనిపోయింది, ఆ దృశ్యం నా మీద చెరగని ముద్ర వేసింది …. ఆ దుఃఖం నన్ను చాలానే బాధ పెట్టింది … అలా ఎవరు చనిపోకూడదు అనిపించింది, ఏమైనా ఎంత కష్టపడి అయినా మెడిసిన్ చదవాలి అని గట్టిగ నిర్ణయించుకున్నాను. అమ్మమ్మ చనిపోయాక అమ్మ తనని తాను సర్దుకుని కొంచెం కోలుకుంది. అప్పటికి బి .ఎస్ . సి ., బీఎడ్ చదివింది కాస్త మార్పుంటుంది అని స్కూల్ లో సైన్స్ టీచర్ గా చేరింది …అది ఏకాగ్రతతో చెయ్యలేక పోయింది. ..

          ఇంకా తనకి నేనొక బొమ్మలా దొరికాను … అప్పటినించి నా కష్టాలు మొదలయ్యాయి
అన్నింటిలో నేను ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ ఏ కారణంతోనైనా రాకపోతే బెల్ట్ తో తనని తాను
కొట్టేసుకునేది, అన్నంలో నీళ్లు పోసేసుకుని తినేది కళ్ళలోంచి నీళ్లు జారిపోతుంటే ….
అవన్నీ చూసి భయపడి నాకు జ్వరం వచ్చేసింది.

          …. నాన్న క్యాంపు లకి వెళ్లేవారు, నాన్నరాగానే జరిగిందంతా చెప్పి నేనుచదువుకోను అని చెప్పేసాను. .

          నాన్న కొంచెం లాజికల్ గా ఉంటారు… అర్ధం చేసుకుని నన్ను హైదరాబాద్ లో ఉన్న మా ఇందిరత్తయ్య దగ్గర దింపి రోసెరీ కాన్వెంట్ లో వేశారు. స్కూల్ వాతావరణం చాలా బాగుంది నాకు.

          మామయ్య అత్తయ్య చాల బాగా చూసుకునేవారు నేను 7 చదువుతున్నాను …
అమ్మ ని హాస్పిటల్ లో జాయిన్ చేసారని వింది … అమ్మ కోపంతో బాటు ప్రేమ కూడా
గుర్తొచ్చేది పాపం నేను లేక ఏమి బాధ పడుతోందో అని ! ఒకఏడాది మాత్రమే హైదరాబాద్ లో ఉన్నాను …. తర్వాత నాన్న వచ్చి నన్ను తీసుకుని వెళ్లిపోయారు. అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న ఆ ఇయర్ లో చాల క్రమశిక్షణ నేర్చుకున్నాను.

          మేము హైదరాబాద్ నించి వైజాగ్ వెళ్ళిపోయాము, అక్కడ మంచి స్కూల్లో జాయిన్
చేశారు … నేను స్పోర్ట్స్ లో మ్యూజిక్ లో కూడా పార్టిసిపేట్ చెయ్యాలి, ప్రైజెస్ తెచ్చు కోవాలి లేకపోతే మా అమ్మ చేసే రాద్ధాంతం ఇంత అంత కాదు … మర్చిపోదామన్న మర్చిపోలేను…

          ఇంక ఒక రోజు కూచుని అమ్మ తో చెప్పాను ,” అమ్మ చదువో స్పోర్ట్స్ ఒకటే రాణించ గలరు, చెప్పుఏ ఫీల్డ్ లో వెళ్ళను ? నీకేమి కావాలో నేను అదే చేస్తాను, నువ్వు పానిక్ అవ్వకు “ అని చెప్పాక రెండురోజులు ఆలోచించింది.

          “సరే నువ్వు మెడిసిన్ చదువు “ అని చెప్పింది. అయినా సంగీతం కూడా చేరుఅని., స్వరాలు పాడుకుంటూ ఉండటంలో చాలా సేదతీరేది మనసు, అలా సంగీతం నా నేస్తం అయింది …

          అప్పటినించి 5 సంవత్సరాలు అమ్మ నన్ను వదల్లేదు, టి.వి. కొనలేదు, ఫ్రెండ్స్ లేరు, ఏవరింటికి వెళ్ళదు, ఏవరిని రానివ్వదు … ఇంట్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఎప్పుడు
చదువుకోవాలి. నా పక్కనే కూచుని అన్ని చదివించి ఎగ్జామ్స్ పెట్టి రాయించి, దిద్ది, తప్పుపోయినవి మళ్ళి రాయించి, చదివించింది …. అటువంటి అమ్మ కి విరుద్ధంగా వెళ్ళాలి అంటే మనస్కరించటల్లేదు …ఆమెకి నేను పక్కనే ఉండాలి, పక్కకి జరగొద్దు … అందుకే నాకు ఫ్రెండ్స్ లేరు … ఏవరిని నాతో కలవనివ్వలేదు, నన్ను వెళ్ళనివ్వలేదు … 
అలాగే కూచుని ఉన్నాను …. సుధ వచ్చి బుజం కుదిపి , “శ్రీకాంత్ వచ్చాడు మాట్లాడతాడుట, డ్యూటీ అయిపోయిందికదా వెళ్లిపోయిందా?” అని అడుగుతున్నాడు.

          “ఏమని చెప్పావ్ “ కళ్ళలోంచి నీళ్లు చెంపలమీదనించి జారిపోతుంటే అడిగాను.
కళ్ళు తుడిచి , “పిచ్చిదానివా? అమ్మ వద్దు అంటే సంసారం వొదులుకుని వెళ్ళిపోతావా?”
“ఎం చేయమంటావ్?”, “ముందు వెళ్లి శ్రీకాంత్ తో మాట్లాడు పద “ అని చేయిపట్టుకుని
గెస్ట్స్ ఉండే రూమ్ కి తీసుకువెళ్ళింది.

          “కావ్యా …” ప్రపంచం లో ఉన్నా ప్రేమంతా నింపి పిలిచాడు, నిలబడి …ఒక్క పరుగున వెళ్లి హాత్తుకుపోయాను, “ఏమిటిది కావ్యా? నువ్వొక డాక్టర్ వి మీ అమ్మగారికి ట్రీట్మెంట్ నడుస్తోంది, ఆమెకేమి కాదు ఆమెని జాగ్రత్తగా చూసుకోవాలి నేనొప్పుకుంటాను. ఇంక రాను అమ్మదగ్గరే ఉండిపోతాను, అని డైవర్స్ పేపర్స్ పంపడమేమిటి?, అది కరెక్ట్ గా ఉందా నీకు, అలా అంటావేంటి?” అనునయంగా తల నిమురుతూ అన్నాడు.

          నా దగ్గర జవాబు లేదు … ఎంత కావాలని మేము పెళ్లి చేసుకున్నామో!!! “చెప్పు కావ్యా, నేను లేకుండా నువ్వు ఉండగలవా? నేనుండలేను ఇంత చేసి మన పెళ్లి జరిగి 4 ఏళ్ళు, ఒకరినొకరం ఇంకా అర్ధం చేసుకోలేదు … అలవాటు కాలేదు, మీ అమ్మగారి కోసం నువ్వు వెళ్ళచ్చు, మరి మా అమ్మగార్ని విడిచిరాను అని పట్టుపట్టడం ఎంత వరకు న్యాయం చెప్పు? అన్నీ పక్కకి నెట్టి అమ్మ నన్ను పంపింది తెలుసా?”

          “అరేయ్ శ్రీ నేను కోపంగా మాట్లాడాను కొన్ని సందర్భాల్లో … కావ్య చాలా మంచి పిల్ల,
నువ్వంటే వల్లమాలిన ప్రేమ, వాళ్ళ అమ్మవల్ల తేలీక దూరమవుతోంది … వెళ్లి బుజ్జగించి
తీసుకురా “ అంది.

          “నేను 10th స్కూల్ ఫస్ట్ రావటానికి ఇంటర్ స్టేట్ ఫస్ట్ రావటానికి అమ్మే కారణం … మెడిసిన్ చదివేటప్పుడు కూడా నా పక్కనే ఉండి చదివించింది గోల్డ్ మెడల్ రావటానికి కూడా అమ్మే శ్రీకాంత్, అమ్మ ని అలా గాలికొదిలేసి రాలేను …”

          “ఎస్ ఐ అగ్రీ …. నీ జీవితం ఏంటి? నీ ఫ్యూచర్ ఏమిటి?”

          నా దగ్గర జవాబు లేదు …ఇంతలో శ్రీకాంత్ సెల్ మోగింది ..ఏవరా అని చూస్తే. శ్రీకాంత కామ్ గా అటు చేప్పేది వింటున్నాడు … “అలాగే మామయ్య చెప్తాను “ అన్నాడు. అప్పుడర్ధం అయింది నాన్న ఫోన్ అని …

          “కావ్య మామయ్య నీతో మాట్లాడుతారుట “ అని ఫోన్ నాకిచ్చాడు, అందుకుని, “హలో నాన్న “అన్నాను..

          “తల్లి ఏమి ఆలోచించకు … నేను వి.ఆర్.స్., తీసుకున్నాను …అమ్మని నేను చూసు కుంటాను … దాని తిక్కలు, కోపాలు, అలకలుతో నీ జీవితాన్ని పాడు చేసుకోకు. నువ్వు పిల్ల పాపలతో సుఖంగా ఉన్న రోజు తనే మాట్లాడుతుంది, తానేమి చేస్తోందో తెలియని స్థితి అది “నాన్న మాటలకి కళ్ళలో నీళ్ళొచ్చాయి … శ్రీకాంత్ వైపు చూసాను …

          “మీ అమ్మ గారి గురించి నాకే ఎక్కువ తెలుసు … నీకు గుర్తుందా… మన రూమ్
ఎదురుగా కూచుని ఉండేవారు, రాత్రిపూట, ఎప్పుడు తెల్లవారుతుందా…ఎప్పుడు నువ్వు ఆమెదగ్గరకి వస్తావా అని !” నాకు నిద్ర రావటల్లేదు కొంచెంసేపు పడుకుంటాను నీ దగ్గర “అని, నీ చెయ్యి పట్టుకుని నిద్రపోతే, నేను హల్లో పడుకున్న రోజులున్నాయి కదా …” అన్నాడు నిష్టురంగా …

          తల దించుకున్నాను, అమ్మ నెలా సమర్ధించను?? అది తెలీక చేస్తున్న తప్పు, ఏ భార్య భర్త అయినా గదిలో ఉంటె ఆ ఛాయలకి వెళ్లరు … కాస్త ఇంగితం ఉన్న ఎవరన్నా.!
అవన్నీ అమ్మకి పట్టవు, తాను అనుకుంది అలా కావాలి అంతే !…

          “పద ఇంటికి వెళ్లి మీ అమ్మ కి చెప్పి నీ బట్టలు సర్దుకుని రా, మన ఇంటికెల్దాము”
అన్నాడు శ్రీకాంత్ …

          అభిమానంగా చూసుకునే అత్త య్య, సరదాగా ఆట పట్టించే మరిది శరత్, ఎప్పుడు నా పక్షం మాట్లాడే మామగారు …. అందర్నీ వొదులుకోవటం ముర్ఖత్వం కాదా ?…అని
వివేకం మొదటిసారి హెచ్చరించింది. అంతవరకు అమ్మ చుట్టూనే తిరుగుతున్న,
ఆలోచనలకి ఒక మార్పు వచ్చింది.

          మెడిసిన్ చదివే రోజుల్లో ఫైనల్ ఇయర్ లో పరిచయం శ్రీకాంత్ …. రెసిడెన్సీ పూర్తి అయి ఎం .బి . బి . యస్ …అయ్యాక మా ఇంటికొచ్చి అడిగి మరి చేసుకున్నారు ….
నాన్న అమ్మ ఇద్దరికీ శ్రీకాంత్ నచ్చటమేకాదు వాళ్ళ ఫామిలీ కూడా నచ్చటం మరో
కారణం.

          పెళ్లి అయి ఒకఇయర్ లో పి జి లో చేరి సెలవులకి అప్పుడప్పుడు రావటం కలిసి ఉన్నదే లేదు … మధ్యలో ఒకసారి మా అత్తగారు అమ్మ బాగానే గొడవ పడ్డారు. ఇంకా
పంతమొచ్చేసి అమ్మ నన్ను వెళ్ళద్దని కూచుంది. ఇంకా అదే మాట మీద …ఉండి,
సత్యాగ్రహం చేసి మరి విడాకులకు నోటీసు పంపే వరకు ఊరుకోలేదు, నెల రోజులైంది, ఇదిగో ఇప్పుడు శ్రీకాంత్ ఇలా వచ్చి రమ్మంటున్నాడు . .

          “ఇవాళే రాలేను శ్రీకాంత్ నాకు కొంచెం టైం ఇవ్వు … నువ్వు చెప్పినవన్నీ నిజమే… నాన్న వచ్చాక వస్తాను. ఏమి అనుకోకు, నిన్ను విడిచి నేను ఉండలేను … మనం దూరం గానే ఉన్నాము పి . జి కోసం చంఢీఘర్ యూనివర్సిటీ లో రెండేళ్లు ఉన్నాము, నువ్వు చెప్పింది మీ అమ్మ విన్నారు కానీ మా అమ్మవినే టైపు కాదు కదా! అర్ధం చేసుకో, పెద్ద వాళ్ళని నొప్పించి మనం సుఖ పడలేము… “ బతిమాలుతూ చెప్పాను.

          “సరే రా, నిన్ను ఇంటిదగ్గర దింపి వెళ్తాను …దారిలో మాట్లాడుకుందాము “ అని ఎంతో రిక్వెస్టింగ్ గా అడిగాడు …

          “ఉండు ఇప్పుడే బాగ్ తీసుకుని వస్తాను “ అని లోపలికి వెళ్లి సుధకి యాక్టి వా కీస్ ఇచ్చి, మా ఇంటికి రేపు ఉదయం తీసుకురా ఇద్దరం హాస్పిటల్ కి వద్దాము “ అన్నాను
“చూడు నీ మొహం ఎలా వెలిగిపోతోందో ? ప్రేమించి పెళ్లి చేసుకుని ఆనందంగా ఉండ కుండా ఎందుకు బాధ పడతావు? పిచ్చిదానా “ అంది అభిమానంగా చూస్తూ ఒక నవ్వు నవ్వి బయలుదేరాను మనసుకి ఎదో కొత్త ఆశ చిగురులేసినట్టు వసంతమాసపు తొలి ఉషస్సులో లా చల్లగా మనసుని తాకే ఈ హాయి ఎదో! ఇలా ఉంటె బాగుణ్ణు అని అనిపించింది.

***

          తలుపు తీసి అమ్మ నన్ను శ్రీకాంత్ ని చూసి భృకుటి ముడేసి లోపలికి వెళ్ళి పోయింది ఎదో గొణుక్కుంటూ … వంటగదిలో ఏడుస్తూ ఉందని అర్ధం అయింది … ఇలాంటిదేదో ముందే ఉహించి ఇద్దరం బయట కాఫీ తాగి వచ్చేసాము …

          “ఒకే కావ్యా, డియర్, వెళ్తాను ఫోన్ చెయ్యి ఎప్పుడు చేస్తే అప్పుడు తీసుకువెళ్ళటానికి
వస్తాను …ఇంకా నేనేం ఫేస్ చెయ్యలేను …” అని సున్నితంగా దగ్గరకి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుని “ఐ లవ్ యు కావ్య, నాకు దూరం అవ్వకు “ అని వదిలేసి తలుపు
తీసుకుని వెళ్ళిపోయాడు.

          తాను కనిపించే వరకు అక్కడే గుమ్మంలో నిలబడి చూసి, లోపలికి వెళ్ళాను.. రాబోయే తుఫాన్ ని ఎదుర్కోవటానికి నన్ను నేను అయత్త పరుచుకుంటూ…

          అమ్మ అలిగి నాతో మాట్లాడటం మానేసింది ఇది నేనూహించినదే !… నాన్న ఒక వారం తర్వాత వచ్చారు … అంతవరకు అమ్మ నాతో మాట్లాడలేదు, కలిసి భోజనం చెయ్యలేదు . .నాన్న వచ్చారు, ఆ రోజు ఇంట్లోనే ఉన్నాను, నాన్న సెలవు పెట్టు బేబీ అని చెప్తే …

          అమ్మ మంచం దిగలేదు నాన్న వంట చేసి టేబుల్ సిద్ధం చేసే వరకు, నన్నుకూడా వంటగదిలోకి రానీ లేదు …

          “భోజనానికి రా శారదా …” కొంచెం కోపంగా అన్నారు ,..వచ్చి కూచుంది, కానీ తిన కుండా అన్నం కలుపుతోంది …

          “శారదా, నీకేమి కావాలి? నీతో ఒకరుండాలి అందుకని బేబీ లైఫ్ పాడుచేస్తావా? నేను
రిటైర్ అయ్యాను “ఆశ్చర్యంగా చూసింది,”అవును వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాను నీ హెల్త్ గురించి ..

          నిన్ను నేను చూసుకుంటాను …పాపం చిన్న పిల్ల దాని జీవితాన్ని పణంగా పెట్టకు, అర్ధం అవుతోందా??? ఇంక ఈ కోపతాపాలు మానేసి మంచిగా దాన్ని వాళ్ళ ఇంటికి పంపు,
ఏమి చేస్తావో ఏ నగలిస్తావో నీ ఇష్టం. నేను మన ఇల్లు వనస్థలిపురంలోది రాసి ఇచ్చేసాను దాన్ని హాస్పిటల్ గా మార్చుకుంటారో అలాగే అట్టే ఉంచుకుంటారో వాళ్ళ ఇష్టం, ఇంక ఏమి ఆలోచించకు …కావ్యా నీకేమి కావాలి చెప్పు అన్నీ ఇచ్చి పంపుతాను “అన్నారు అయన దృఢంగా. ఆయన మొహం లో కనిపిస్తున్న సిరియస్ నెస్ చూసి అమ్మ ఏమి అనలేదు అంత మౌనం గా ఉంటె …నాకు భయం ,” అమ్మా “ అని నేనేదో చెప్పబోతుంటే నాన్న వారించారు. “వివేకంగా ఆలోచించాలి, వితరణ ఉండాలి సరైన నిర్ణయంతో ముందుకెళ్లాలి …సరేనా “ అన్నారు.

          “నాన్న నాకేమి వద్దు శ్రీకాంత్ వాళ్ళకి ఎక్కువ ఆస్తే ఉంది, మనం ఇచ్చేదానికి ఆశ పడరు, సింపుల్ గా వెళ్తాను. సరేనా అమ్మ “అన్నాను. అమ్మ తల ఊపింది ఇంకా నన్ను చూడలేదు … దాన్ని ఇగ్నోర్ చేసి శ్రీకాంత్ కి డయల్ చేశాను…. ఫోన్ చేసి చెప్పాడు సాయంత్రం 7 గంటల తర్వాత వస్తాను అని …

          “అమ్మ నన్ను మనస్ఫూర్తిగా పంపమ్మ లేకపోతే నేను మనశాంతిగా ఉండలేను “
బతిమాలుతూ అన్నాను …

          ఏమనలేదు, దగ్గరకి తీసుకుంది, కళ్ళు తుడుచుకుని … నాన్నవైపు చూసాను నాన్న
కళ్ళలో కురుస్తున్న అభిమానం వైపు మురిపంగా చూస్తూ …..!

          అమ్మ తెలుసుకుంటుంది అనే నమ్మకం వచ్చింది. నాన్న వల్ల…

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.