గట్టి పునాది

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-ఉగాది వసంత

          సుముహుర్త ఘడియలు సమీపించగానే, “గట్టిమేళం !! గట్టిమేళం !!” సిద్ధాంతిగారు గట్టిగా గావుకేక పెట్టేరు, ఓ పక్క మంత్రోచ్చారణ గావిస్తునే.

          పెళ్లికుమారుడు నిద్రలో ఉన్నట్టుగా, తలవాల్చుకుని ఉండిపోవడం చూసి, “ఏంటి బాబు అమ్మాయితో జీవితాన్నితెగ ఊహించేసుకుంటూ, అసలు నిద్రపోకుండా, కలల్లోనే కాపురం వెలగబెట్టేవా ఏంటి ఇన్నాళ్లు ?? పీటలమీదే నిద్దరోతున్నావు ” అని ఛలోక్తి విసిరారు సిద్ధాంతిగారు. అదివిన్న వెంటనే, పెళ్లికుమారుడి బాబాయ్, పెళ్లికుమారుడు రాంబాబు చేయి పట్టుకుని, సహకరించి, ఎదో ఆ కార్యక్రమం కానిచ్చేశాడు.

          పెళ్ళిలో జీలకర్రా బెల్లం పెట్టడానికి, మూడుముళ్ళు వేయడానికి, తలంబ్రాలు పోయడానికి, ఇలా ప్రతిపనికి, పెళ్లికొడుక్కి, అతని తరపు వారు సహకరించడం పెళ్లికొచ్చిన ప్రతి వారికి అబ్బురంగా అనిపించింది.

          మొత్తానికి అప్పగింతలు కార్యక్రమం వరకూ అన్నీ రాంబాబుచేత సజావుగా జరిపించేసారు అందరు తలోచెయ్యి వేసి.

          సరస్వతికి మూర్ఛవచ్చినట్టైంది. ఏమైనా జబ్బు ఉందా ? లేదా నరాల బలహీనత ఉందా ? ఎందుకు చిన్నచిన్న పనులకి కూడా వేరేవారి సహకారం అవసరం ఏర్పడుతోంది ఈయనకి అని లోపల్లోపల తెగ బాధపడుతోంది. అమ్మ, నాన్నల మొహాల్లో కూడా గందరగోళం తప్ప మరేమి కనబడ్డం లేదు.

          ఇదంతా చూసి పందిరంతా ఒకటే గుసగుసలు. సరస్వతి, ఆమె కుటుంబీకులు విస్తుపోయారు. వివాహ తంతు అంతా అయిపోయేక, ఇరువైపు పెద్దలూ, పందిట్లో ఓ మూలచేరి చర్చించు కుంటున్నారు.

          అప్పటికే నిద్రావస్థలో ఉన్న రాంబాబుని, కల్యాణమండపంలో మగపెళ్ళి వారికి కేటాయించిన గదిలో పడుకోబెట్టారు. ఇంకా బ్రహముడి కూడా విప్పని కారణంగా, ఆ మంచంపక్కనే ఓకుర్చీలో కూర్చుంది సరస్వతి, నేలచూపులు చూస్తూ.  ‘ఏమి జరుగుతోంది? తన భవిష్యత్తు ఎలా ఉండబోతోంది ?’ తల్లి తండ్రి చాటున పెరిగిన పిల్ల అంతకన్నా ఏమి ఆలోచించ గలుగుతుంది .

          అసలైతే, నూతనదంపతులు కలిసి భోంచేయాలి, కానీ రాంబాబు తినేస్థితిలో లేడు కనక. ఓ ప్లేట్లో కాస్త భోజనంపెట్టి సరస్వతికి ఇచ్చారు కాస్త తినమని. ఇంత అయోమయ పరిస్థితిలో, పిచ్చిపిల్ల ఏమి తినగలదు పాపం? భర్తకి ఏమైందో అని భయపడిపోతోంది.

          సరస్వతివాళ్ళది దిగువ మధ్య తరగతి కుటుంబం. తండ్రి సుబ్రహ్మణ్యం తాలూకా ఆఫీస్‌లో గుమస్తాగా పనిచేస్తూ, సంసారచక్రాన్నినెమ్మదిగా కదిలిస్తున్నాడు. ముగ్గురాడ పిల్లలు !అందరిలో పెద్దది సరస్వతి. ఇప్పటికి తొమ్మిది పెళ్ళిచూపులయ్యాయి. ప్రతిదీ కట్న, కానుకుల దగ్గరే విఫలమయ్యాయి. అమ్మాయి, అబ్బాయిల అందచందాల గురించి కానీ, ఒకరికి ఒకరు నచ్చడం గురుంచికానీ పెళ్ళిచూపుల అజెండాలో లేనేలేదు . అబ్బాయి తరపువారు కట్నం ఇంత అని చెపితే, అది తమ తాహతుకి సరితూగక పోతే , ఆ సంబంధం విఫలమైనట్టే.

          సరస్వతి మస్తిష్కం గతాన్ని ఓసారి తట్టింది….

          ఆ రోజు ఆదివారం కావడంచేత సుబ్రహ్మణ్యం ఇంట్లోనే ఉన్నాడు. ఇంతలో తన స్నేహితురాలు ప్రమీల వచ్చింది .  తాను వరండాలో కూర్చుని పెరట్లో పూసిన సన్నజాజులు మాల కడుతోంది. ప్రమీల కూడా మాలకట్టడానికి సహకరిస్తూ అడిగింది “నిన్నపెళ్లిచూపులు కదా, ఎలా ఉన్నాడే పెళ్ళికొడుకు ? నచ్చాడా?” అని

          ఓ పెద్ద నిట్టూర్పు విడిచింది సరస్వతి. “అబ్బాయి ఎలా ఉన్నాడో చూడ్డం ఏనాడో మానేశానే, ఎందుకంటే అదేమంత ముఖ్యమైంది కాదు , రేట్  ఎంత పలుకుతాడు, దానికి మనం తూగగలమా లేదా అనేది, నాన్నవాళ్ళూ చూసుకునేక దాని ర్ణయిస్తారు. మళ్ళీ కొన్నాళ్ళకి పెళ్ళిచూపులున్నాయి అని అమ్మ చెపితే, అప్పుడు తెలుస్తుంది , ఓహో క్రితంసారి చూసిన సంబంధం రేట్కుదరలేదన్నమాట అని!! ”  నిస్తేజం, నిర్లిప్తత నిండి ఉన్నాయి ఆ మాటల్లో.

          ఇంతలో ఇంటి ముందు రిక్షా ఆగింది, అందులోంచి పెళ్లిళ్లపేరయ్య దిగారు, ఏమి కబురు మోసుకొచ్చాడో ? కాఫీలుగట్రా అయ్యాకా, నసుగుతూ చెప్పారు పేరయ్యగారు..”ఉభయ ఖర్చులు పెట్టుకుని పెళ్లి చేస్తేచాలన్నారు మగ పెళ్లివారు. ఇహ, ఎలాంటి కట్నాలు అక్ఖర్లేదన్నారు. మీ కుటుంబం మంచి, మర్యాద , సంప్రదాయాల పట్ల మీకున్న శ్రద్ధ మీవియ్యంకుల వారికి తెగ నచ్చేశాయిట” అప్పుడే వరసలు కలిపేశారు పేరయ్యగారు.

          “అబ్బాయి కలెక్టర్ ఆఫీస్‌లో ఉద్యోగం వెలగబెడుతున్నాడంటే, జీతంకన్నా, “గీతం “బాగానే ఉంటుంది అని చూపుడువేలు, బొటనవేలు కలిపి సౌంజ్ఞ చేస్తూ కళ్ళెగరేసాడు. అమ్మాయికి మూడుపూటలా ఐదువేళ్మూ నోటికి వెళతాయి, రోజూ మూరమల్లెపూలకి గానీ, నెలలో ఓ రెండు సినిమాలకి గానీ ఇహ పండగలకి పబ్బాలకి కొత్తచీరకి గానీ ఎలాంటి కొరత ఉండదు ” సుబ్రహ్మణ్యంగారికి ప్రత్యేక ఆకర్షణలు చూపిస్తున్నారు పేరయ్యగారు.

          ఇంత వరకు వచ్చిన సంబంధాలన్నీఫెయిల్ అయిపోతుంటే, ఇహతాను కూతుర్లకి పెళ్లి చేయలేడెమో అని బెంగ పెట్టేసుకున్నాడు సుబ్రహ్మణ్యం. పేరయ్యగారి మాటలు వినగానే, అతనికి చెవుల్లో అమృతం పోసినంత ఆనందం కలిగింది. మరొక్క క్షణం ఆలస్యం చేయకుండా, తన తాహతుకి ఇంతకన్నా మంచి సంబంధం తాను తేలేడని రూడిపరుచుకుని, ‘శుభస్యశీఘ్రం’ అని పచ్చజెండా ఊపేసాడు సుబ్రహ్మణ్యం.

          ఆనక తాంబూలాలప్పుడు , చావుకబురు చల్లగా చెప్పినట్టు, తమ అత్తమామలు ఓ విషయం చెప్పి అందరిని అవాక్కయేటట్టు చేసేరు. అదేమంటే,  “మా రాంబాబు ముఖ్యమైన బిల్లులు పాస్‌చేసే సెక్షన్లో చేస్తాడు.  ఇంతకు ముందు ఆ సీట్లో కూర్చున్న వారు అడిగేవారో, అలవాటు చేసేరోగానీ, ప్రతి కాంట్రాక్టర్లు తమ ప్రతిబిల్తో పాటు, ఓ మందు బాటిల్‌కూడా సప్లై చేయడం. అంచేత, అలా వచ్చిన దాన్నికొద్దిగా తీసుకోడం తప్ప, మా రాంబాబు తాగుబోతేమి కాదు. అంతే తప్పిస్తే,  మరెలాంటి దురలవాట్లు లేవంటే నమ్మండి.”  సరస్వతి బుర్ర మొద్దుబారి పోయింది. 

          అదివిన్న సుబ్రహ్మణ్యం గారు, “ఆ మాత్రం సోషల్డ్రింకింగ్ , ఇవాళ రేపు కుర్రాళ్లందరికి ఉంటోంది” అని తేలిగ్గా తీసుకున్నారు.

          “అమ్మాయి అదేంటి ఏమి తినకపోతే ఎలా ? కాస్త ఎంగిలిపడు ” అని ప్రేమతో అత్తగారు గట్టిగా పెట్టిన గావుకేకకి ఇహంలోకొచ్చిపడింది సరస్వతి.

          ‘కిమ్కర్తవ్యం ?” ఏంటి చేయడం?? ఏముంది బుద్ధిగా భర్తతోపాటు కాపురానికి వెళ్లిపోవడం, జీవితం ఎటు తీసికెళ్తే అటు పయనించడమే. ఎందుకంటే, తన పెళ్లిద్వారా, అమ్మనాన్నలకి దినవారీ ఖర్చులు కొన్నితగ్గుతాయి, పైగా ఓ పిల్లకి పెళ్లిచేసి, ఓ బాధ్యత తీర్చుకున్నాము అనే ఆనందంలో ఉంటారు తల్లితండ్రులు. ఆ ఆనందాన్నిఆవిరి చేయాలని ఏ కోశానా తాను అనుకోడం లేదు. తనకన్నా దురదృష్టవంతులు బోల్డు మంది ఉండి ఉంటారు ఈ లోకంలో, తనకి దక్కిన దాంతో తృప్తి పడడమే మేలనుకుని, ఓ పెద్ద నిట్టూర్పు విడిచింది సరస్వతి. 

          ఓ భగవంతుడా !! నాకు ఇంకాస్త సహనం, శక్తిని ప్రసాదించు తండ్రీ! ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోడానికి వీలుగా !!

***

          కొత్తకాపురం ఎలా ఉంటుందో కథల్లో, నవలల్లో మాత్రమే చదివింది. అవి రచయితలు అందంగా పేర్చిన అక్షరాలు కనుక, అందంగానే అనిపిస్తుంది చదివేవారికి. ఇంటి పరిస్థితుల వలన, సరస్వతిని పదవక్లాస్ వరకే చదివించారు. ఇంటి పనిలో తల్లికి సహకరిస్తూనే, ఖాళీ సమయాల్లో, పక్కింటి వారిని అడిగి, వారపత్రికలు, నవలలు చదివేది.

          అయితే తనకి తెలిసిన కొత్తకాపురపు ఆనందాలేవి తన కొత్తకాపురంలో చూడలేదు. పాతికేళ్లుగా తల్లితండ్రులతోను, అక్కచెల్లెళ్లతోను ఒకరకమైన కుటుంబ ప్రేమలని చవిచూసింది. కొత్త ఇల్లు, కొత్త మనుషులు, కొత్త బంధాలు, ముఖ్యంగా తన జీవితంతో అనుక్షణం ముడిపడే ఓ కొత్తవ్యక్తి!! ఎన్నో కలలతో, ఆశలతో, ఊహలతో అత్తారింట్లో అడుగు పెడుతుంది ప్రతి ఆడపిల్ల. అలాగే ఎన్నో భయాలు, భ్రాంతులు కూడా వెన్నంటే ఉంటాయి. తనతో జీవితం పంచుకున్న వ్యక్తి, తన భర్త, తనతో ప్రేమగా ఉంటూ, కొత్త జీవితపు మధురిమలు రుచి చూపిస్తూ, కొత్త బంధాలను పాతవాటిగా మార్చగలడు. ఆ భర్తే తనని పట్టించుకోకపోతే, ఆ కొత్తిల్లు , ఆడపిల్లకి ఓ జైలుగా కనిపిస్తుంది. సాధారణంగా అత్తామామలూ, ఆడపడుచులు ఇంటి కోడలిని ఓ శత్రువులా చూస్తారు, ఎందుకంటే, ఈ అమ్మాయి, తమ అబ్బాయిని తన వలలో వేసుకుని, తమనించి దూరం చేస్తుందేమో అనే భయం, అభద్రతా భావం కలిగి ఉంటారు కనుక.

          తన అమ్మమ్మ, తాతయ్యలు నుంచి జీవిత పాఠాలు బాగా వంటపట్టించు కుంది. వాళ్లెప్పుడూ ఒకటే చెప్పేవారు, ఎవరిదైనా, ఒకటే జీవితం, దాన్ని సుసంపన్నం చేసుకోడం అనేది మన చేతుల్లోనూ, మనచేతల్లోనే ఉంటుంది అని. మన ఆనందాన్ని మనమే కొనుక్కోవాలి. మన జీవితాన్నిమనమే రచించుకోవాలి, అస్తవ్యస్తంగా ఉన్న ఇంటిని, పరిస్థితులని చక్కబెట్టుకున్నట్టు. మనకై మనం ఓ చిన్న పిల్లాడిలోనే మార్పు తీసుకురాలేము. ఇక కొన్ని సంవత్సారాలుగా జీర్ణించుకున్న మనస్తత్వాలని ఎలా మార్చగలం? అందుకే ఎదుటివారికి అనుగుణంగా మనల్ని మనం మార్చుకోడమే సులువు. ఎదుటివాళ్ళ జీవితాన్ని జీవించడం మానేసి, మన జీవితాన్ని మాత్రమే మనం జీవిస్తే, ఆనందం మన స్వంతం అవుతుంది.

          మనుషులు బాధలో ఉన్నారా, దుఃఖంలో ఉన్నారా, సుఖంగా ఉన్నారా అనే వాటితో సంబంధం లేకుండా , కాలచక్రం పరిభ్రమిస్తూనే ఉంటుంది.                                   

          సరస్వతి ఆలోచనలకి అంతుండడం లేదు.

***

          ఓ రోజు సరస్వతి స్నేహితురాలు ప్రమీల, హైదరాబాద్‌లో బ్యాంకుజాబ్కి పరీక్ష రాయడానికి వస్తున్నానని ఫోన్‌చేసి చెప్పింది. హైదరాబాద్‌లో తనకెవరూ లేరని, ఓ రెండ్రోజులు సరస్వతి ఇంట్లో ఉండనివ్వమని అడిగింది. అత్తమామలతో మాట్లాడి, వారి సమ్మతితో ప్రమీలని తమ ఇంట్లో ఉండొచ్చని ఫోన్‌చేసి చెప్పింది.

          సరస్వతి, ప్రమీల, ఒకటవక్లాస్నుంచి పదవక్లాస్ వరకు, సరస్వతి విద్యామందిర్‌లో కలిసి చదువుకున్నారు. చాల మంచి స్నేహితులు.

          పరీక్ష అయినరోజు రాత్రి, భోజనాలు అయ్యాక, సరస్వతి, ప్రమీల హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అప్పుడు రాంబాబు పెళ్ళిలో ఎందుకలా అచేతనుడిలా ప్రవర్తించాడు, అంతా ఓకేనా అని ఆరాతీసింది ప్రమీల.  మధ్యలో సరస్వతి చెల్లెల్లు బజారులో కలిస్తే అడిగినట్టు, వాళ్ళు సరైన సమాధానం చెప్పలేదని చెప్పింది.  స్నేహితురాలి దగ్గర నిజం దాచకుండా అంతా చెప్పుకుని బాధపడింది సరస్వతి. ప్రమీల కూడా, తన స్నేహితురాలి జీవితం గురించి తెల్సుకుని చాలా బాధపడింది.

          “ఇంకా ఎందుకే ఇక్కడ జీవచ్ఛవంలా ఉండడం, విడాకులు తీసుకుని, భరణం డిమాండ్‌చేసి, అది తీసుకుంటూ, హాయిగా నీకిష్టమైన డిగ్రీకి ప్రైవేట్ గా చదువుకుని , మంచి ఉద్యోగం చేసుకుంటూ, దర్జాగా ఉండొచ్చుగా ” సలహా ఇచ్చింది ప్రమీల..

          “ఇదంతా నువ్వు చెప్పినంత సులువు కాదే ! ముందు తల్లితండ్రులకి తన పోషణ, లాయర్ఫీజులు భారం అయి కూర్చుంటాయి. ఆ పైన చెల్లెళ్లకి సంబంధాలు తేవడం కష్టమైపోతుంది. ముఖ్యంగా అందరికి మనశాంతి కరువవుతుంది. అమ్మా, నాన్నలు మానిసికంగా బాగా కృంగిపోతారు. కోర్ట్‌లో ఇది సివిల్‌కేసు అవుతుంది, కొన్ని సంవత్సరాలు పడుతుంది తీర్పు వచ్చేసరికి. అప్పటి వరకు, వాయిదాలకు కోర్టుల చుట్టూ తిరగడం అంత ఆషామాషీ విషయం కాదు.”భారంగా నిట్టూర్చింది సరస్వతి.

          “మరైతే నీ జీవితం ఇలా అడవికాచిన వెన్నెల కావాల్సిందేనా ”  పూడుకు పోయిన గొంతులోంచి ఆవేదన పెల్లుబికింది.

          ఓసారి గట్టిగా హత్తుకుని, తనుసేద తీరుతూ, ప్రమీలని ఓదార్చింది సరస్వతి.

          “ఎంత కష్టం అయినా తానొక్కతే భరిస్తానని, ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మానాన్నలకి తను భారం, బరువు కాకూడదు” నిశ్చితమైన గొంతుతో చెప్పింది సరస్వతి.

          “దాదాపుగా, నూటికి 90 వైవాహిక జీవితాలు ఇలాగె ఉంటున్నాయి ప్రమీలా . అది ప్రేమపెళ్లి అయినా, పెద్దలు కుదిర్చినదైనా, పేద యువతులైన, ప్రముఖ మహిళలైనా, సమాజంలో పేరున్న మహిళలైనా, అందరు ఒకలాగే, బాధ పడుతున్నారు. “భర్త” అనే టైటిల్ గెలుచుకోగానే, 80 %   మగవారు తన భార్య తను చెప్పినట్టే వినాలని అనుకుంటారు. ఆమెకి కొన్ని స్వతంత్ర భావాలు ఉంటాయని, వాటిని గౌరవించాలని అనుకోరు. ఎక్కడో చాలా అరుదుగా చూస్తాము అలా స్త్రీలని, వారి ఇష్టాలని గౌరవించే పురుషులని. ప్రముఖ మహిళా సెలెబ్రెటీల యొక్క వైవాహిక జీవితాల గురించి సామజిక మాధ్యమాల ద్వారా తెలుసుకుంటూనే ఉంటాము కదా!”

          “రాంబాబు తాగొచ్చి నిన్ను బాగా వేధిస్తాడా ” బెరుకుగానే అడిగింది ప్రమీల.

          “అయ్యో అలాంటిదేమి లేదు. తనమటుకు తను ఉంటాడు. ఎవరిని ఏమీ బాధించడు. కొత్తగా పెళ్లయింది, భార్య వచ్చింది, తనతో మాట్లాడాలి అనే ధ్యాస కూడా ఎక్కడా కనబడదు.

          పెళ్లయ్యాక తన జీవితం గురించి చెప్పింది సరస్వతి తన స్నేహితురాలికి.

          తనకి పెళ్లయింది అని మెళ్ళో మంగళసూత్రాలు, మెట్టెలు, నల్లపూసలు ఇంకా తను అమ్మవాళ్లని వదిలి అత్తింటికి రావడం, ఎప్పుడో తను నిద్రలో ఉండగా , రాంబాబు మత్తులో ఉండగా జరిగిపోయిన శోభనం, వీటివల్ల మాత్రమే తెలుస్తోంది.

          భర్త ప్రతిరోజూ ఉదయాన్నేలేవడం, తన పనులు తాను చేసుకోడం, మొక్కలకి నీళ్లు పోయడం, తన స్కూటర్ తుడుచుకోడం, స్నానం పూజచేసి, టిఫిన్ తిని, లంచ్ బాక్స్ కట్టుకుని ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. అయితే తిరిగి ఆఫీస్నుంచి వచ్చేటప్పుడు మాత్రం, కాస్త తూలుతూ వచ్చి, కంచంలో ఏది పెడితే అది, మారు మాట్లాడకుండా,  తినేసి వెళ్లి పడు కుంటాడు. రచ్చ, గోల లాంటివి ఏవి చేయడు. ఇహ ఆదివారాలు, సెలవులు వస్తే, లేట్ గా లేచి, కాసేపు న్యూస్‌పేపర్లు చూసి, కాసేవు టీ.వీ. చూసి, అన్నంతినేసి, పడుకుంటాడు. సాయంత్రం లేచి, టీ, స్నాక్స్ తినేసి, ఎవరో స్నేహితులు వస్తే, వారితో వెళ్ళిపోతాడు. రాత్రి మళ్ళీ షరా మామూలే.

          అయితే, ఒకటే బోధపడడం లేదు, రాత్రికాగానే తాగుతాడు, మత్తులో వచ్చి, మాటమంతి లేకుండా పడుకుంటాడు, కానీ ఉదయం లేచాక, తనతో మామూలుగా ఉండొచ్చుగా? తన జీవితంలోకి ఓ కొత్తవ్యక్తి వచ్చిందని, తను ఎలా ఉందొ, తిన్నాదో లేదో అడగాలని కూడా అనుకోడా?  దీన్నెలా అర్ధం చేసుకోవాలి ? బహుశా, తను తప్పు చేస్తున్నాడని, మొహం చెల్లక అలా ఉంటున్నాడా? లేదా తనతో క్లోజ్గాఉంటె, తన తాగుడు గురించి నిలదీస్తానని భయపడుతున్నాడా?  ఏది ఏమైనా, జరిగిపోయిన రోజులు మళ్ళీ రావుగా ? ఈ కొత్త జీవితాన్ని తను అనుభవించడం లేదు, తనని అనుభవించనీయడం లేదు ?  దీనికి పరిష్కారం ఏంటి ? తన విధిరాత ఇంతే అని సరిపెట్టుకుని ఊరుకోడం తప్ప ఏమి చేయగలదు ఓ సగటు ఆడపిల్ల.

          ఇన్నాళ్లు అతని సపర్యలన్ని తల్లిచేస్తే, ఇప్పుడు తను చేస్తోంది. ఇంట్లో వంటపని, ఇంటిపనిలో ఇన్నాళ్లు తల్లికి సహాయపడేది, ఇప్పుడు అత్తగారికి సహాయపడుతుంది. అత్తమామలు తమ పుట్టింటి వారికన్నా కాస్త మంచి పొజిషన్లో ఉండడం వలన, ఫ్రిడ్జ్, గ్రైండర్, ఒవేన్, టీ.వీ., వాషింగ్‌మెషిన్, రెండు బెడ్రూంలలో ఏ.సి. లు మొదలైన ఆధునిక గృహోపకరణాలు ఉన్నాయి. అందుచేత పుట్టింట్లో ఉన్నంత పని కూడా అత్తింట్లో లేదు.

          ఇప్పుడు చెప్పు నా జీవితం బావున్నట్టా ? బాగులేనట్టా ?

          కొన్నినెలలుగా గుండెలో గూడు కట్టుకుని ఉన్న ఆవేదనంతా, కరిగి కన్నీరై కను దోయిని దాటి చెంపలతొ చెలిమి చేసింది.

          ప్రమీలకి మాటలు కరువయ్యాయి.

          లోపలికెళ్ళి మొహం కడుక్కుని వస్తూ వస్తూ, రెండు కప్పుల్లో ఐస్‌క్రీం తెచ్చింది సరస్వతి.

***

          “ప్రమీలా, నీకు మా ఆడపడుచు లావణ్య గురించి చెప్పాలి..”

          “మా పెళ్ళైన కొన్నాళ్ళకి, ఓ రోజు ఉదయాన్నే, లావణ్య, తన ఒక్కగానొక్క కూతురుతో సహా పుట్టింటికి వచ్చింది. వాళ్ళాయనకి ఆఫీస్పనులు బిజీ వలన రాలేకపోయారని పొడిగా చెప్పి వదిలేసింది. వచ్చి 15 రోజులైంది, ముభావంగా ఉంటోంది లావణ్య, ఎవరికీ ఏమీ చెప్పడం లేదు. భర్తతో ఫోన్లులేవు ఏమిలేవు, భర్త ఊసే ఎత్తడం లేదు. 

          ఓ రోజు తనంతటతానె నా దగ్గరికి వచ్చి, “వదినా, నిన్నొకటి అడగనా? ఏమి అనుకోవు కదా ? అన్నయ్యకి తాగుడు అలవాటుంది కదా వదినా, ఓ తాగుబోతు భర్తతో నువ్వెలా నెగ్గుకు రాగలుగుతున్నావు?  నువ్వెప్పుడైనా ఈ తాగుడు మాన్పించే ప్రయత్నం చేసేవా ? ” అని కాస్త నసుగుతూనే అడిగింది.

          “ఎదుటివారి బలహీనతల్ని మనం ఎత్తి చూపించనంత వరకు, మనకి ఎలాంటి సమస్య ఉండదు లావణ్యా!  పైగా ఇలాంటి బలహీనతలున్న వ్యక్తులకి, “ఇగో”  చాలా ఎక్కువగా ఉంటుంది అంటారు కదా. మీ అన్నయ్యకి, మంచేదో,  చెడేదో తెలియవని నేను అనుకోడం లేదు. మరి అలాంటి వ్యక్తికి ఎప్పటి నుంచో ఉన్న అలవాటుని,  నిన్నకాక మొన్న వచ్చిన నేనెలా ఆపగలను ? ఒకరు చెపితే మారతారు అనుకుంటే, కని,పెంచి, పెద్దచేసిన తల్లితండ్రుల కన్నా కొత్తగా వచ్చిన నేనేమి ఎక్కువ కాదు కదా!  వారే ఎప్పుడో చెప్పి మార్చేసి ఉండేవారు కదా లావణ్యా? నా వరకు నేను, ఓ భార్యగా, ఓ కోడలిగా నా బాధ్యతలు నేను సక్రమంగా నెరవేరుస్తూ పోతున్నాను.

          “మా అమ్మానాన్నల మాటలు బాగా వంట పట్టించుకున్న దాన్ని, రానున్నది రాక మానదు, కానున్నది కాక మానదు కదా ! మనకి ఏది దక్కిందో అంతే మన నుదిటిన దేవుడు రాసాడు అని అనుకొని ఊరుకోడమే.. ఎంతైనా వయసులో ఉన్న ఆడపిల్లని కదా లావణ్యా, నాక్కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది. మిగతా భార్యభర్తల్లా, నేను మీ అన్నయ్య కూడా, సినిమాలకని, షికార్లకని వెళ్లే అదృష్టం ఈ జన్మలో ఉందా? అని. ” నాకు మరి మాటలు రాలేదు, దుఃఖం తప్ప.

          అంతావిన్న లావణ్య కూడా నన్ను పట్టుకుని ఏడ్చేసింది.  తనని గట్టిగా గుండెలకి హత్తుకుని ఓదార్చాను. ఎందుకేడ్చిందో తెలియదు కానీ, గుండె లోతుల్లోంచి దుఃఖం పొంగిపొర్లి వచ్చిందని గ్రహించాను.

          కాసేపటికి తేరుకుని, “వదినా! నా కాపురం కలహాలమయంగా ఉంది. విడాకులు తీసేసుకోవాలని గాఢంగా నిర్ణయించుకున్నాను. “

          “అయ్యో ఏమైనా చెడు అలవాట్లు, చెడు తిరుగుళ్ళు ఉన్నాయా ?” అని అడిగాను.

          ” సిగరెట్టూ, తాగుడు, పేకాటా, ఇంకా వేరే రకమైన చెడుతిరుగుళ్ళేమి లేవు మీ అన్నయ్యకి. కానీ, విపరీతమైన అనుమానం, ఎదుటివారిని అస్సలు నమ్మక పోవడం, మన మాటలకి పెడర్ధాలు తీసుకుని, పేచీకి దిగడం , తాను పట్టిన కుందేటికి మూడేకాళ్ళు అనేంత మొండితనం, తనది రైట్ అని నిరూపించుకోడానికి, కుందేలుకి ఉన్న నాలుగు కాళ్లలో ఒకదాన్ని విరిచేస్తాడు కూడాను. అంత మూర్ఖుడు.”

          “దీంతో, తెల్లారిలేస్తే, ఏమి మాట్లాడితే, ఏమి పేచీ వస్తుందో అనే భయంతో చస్తూ బ్రతకడమే. జీవితంలో ప్రశాంతత పూర్తిగా కొరవడింది. ఈయనతో పడలేక, మా అత్త మామలు, తమ స్వంత ఊరికి వెళ్ళిపోయి, అక్కడ అద్దెకొంపలో ఉంటున్నారు.  గంజి మాత్రమే తాగిఉన్నా, ప్రశాంతంగా ఉండొచ్చని వెళ్లిపోయారు పాపం. ” లావణ్య వస్తున్న కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయలేదు.

          లావణ్య చేయిని తన చేతిలోకి తీసుకుని, సుతారంగా పట్టుకుని, “పోనీ అతని మటుకు అతను ఎదో అంటే అన్నాడులే అని, నువ్వు ఏమి బదులివ్వకుండా, మౌనం వహిస్తే, పరిస్థితి కాస్త చక్కబడేదేమో కదా !” సూచనగా అడిగాను.

          “అయ్యో అదేమడుగుతావు వదినా ! అన్నిఅయ్యాయి. అలా మౌనంగా ఉంటె, మన మౌనంలోంచి కూడా, బోల్డుడైలాగులు ఊహించేసుకుని, నువ్విలా అనుకుంటున్నావు కదూ మనసులో, అని పెద్దగొడవ పెట్టుకుంటాడు. ఏమి చూసుకుని నీకా పొగరు ? ఏంటా నిర్లక్ష్యం అని నానా యాగీచేసేస్తాడు.”

          ” తామే అన్నింటా పర్ఫెక్ట్ అని అనుకుని, ఎదుటి వారిని అస్సలు నమ్మని ఇలాంటి వారు, తమలో పుష్కలంగా ఉన్న ఇగో తృప్తిపడే వరకు శాంతించరు వదినా ! ఆ “ఇగో ” తగ్గడంమాట దేవుడెరుగు, ఈలోగా ఆ అహంభావి చేతుల్లో చావు వచ్చినా ఆశ్చర్యపడక్కర్లేదు “

          “వండుకున్నది తినే వరకు నమ్మకం లేదు, ఏ క్షణం ఏమి గొడవ అవుతుందో ముందుగా ఊహించలేము కూడా. ప్రకృతిలో జరిగే మార్పుల గురించి, వారు చదువు కున్న సిద్ధాంతాలను క్రోడీకరించి చెప్పడానికి వాతావరణ శాస్త్రగ్నులు ఉన్నారేమో గానీ, ఇలాంటి శాడిస్టుల మూడ్ ఎప్పుడు ఏ తీరుగా మారుతుందో చెప్పేవారు మాత్రం ఎవరు లేరేమో అనిపిస్తోంది.”

          “ఆరేళ్ళ పసిపాప ముందే, వీరంగం సృష్టిస్తుంటే, అది ఝడుసుకోదూ పాపం. దాని ఎదురుగానే, కొట్టడం, ఎదురుగా ఏ వస్తువు కనిపిస్తే దాంతో తల పగలగొట్టేస్తానని ఊరువాడా వినిపించేలా, గొంతు చించుకునిపెద్దపెద్ద కేకలు వేయడం. ఈ మధ్యనే, రెండుసార్లు ఆయన చేతిలో చావు తప్పించుకున్నాను కూడా.  నన్ను చంపేసి జైలుకెళ్ళి పోతానని బెదిరించడం, లేదంటే తను కూడా కత్తితో పొడుచుకుని చస్తానని బెదిరించడం. ఇక తట్టుకో లేక, ఓ ఉత్తరం రాసిపెట్టి ఇలా వచ్చేసాను. ‘ఇగో’తో కాపురం చేస్తున్నాడు కదా, అంచేత, అయన దగ్గరనించి ఎలాంటి కబురు కాకరకాయ ఉండదు, ఉండబోదు! “

          “వదినా, నేను ఇక ఆయనతో కాపురం చేయను. చేయలేను. ఆ మనిషి మరి మారడు, మారినా సరే నాకొద్దు. ఇంకా నరకయాతన పడే ఓపిక నాకులేదు.    ఈ మాట అమ్మా, నాన్నలకి తెలిస్తే, తట్టుకోలేరు, పైగా ఎదో ఒక రకంగా, నాకు నచ్చచెప్పేసి , ఆయన దగ్గరికె పంపించేస్తారు. ఆడదే సర్దుకు పోవాలి అనే పాతచింతకాయ పచ్చడి సిద్ధాంతం నా నెత్తిన రుద్దే ప్రయత్నం చేస్తారు. అలా అని ఇక్కడే కూర్చుని, మీకు భారం కాదలుచుకోలేదు కూడాను.అందుకే అత్త మామలకు ఉత్తరం రాసి అంతా వివరించాను.” అని చాలా నిశ్చయంగా తన మనసులోని మాట చెప్పింది.

          లావణ్య రాసిన ఉత్తరం చదివి, ఓ రెండ్రోజుల్లో తన అత్తమామలు వచ్చారు. వారి అబ్బాయి భాగోతం అంతా కధలు కధలుగా మా అత్తమామలకు చెప్పి, తనువట్టి మూర్ఖుడని, అలాంటి వాడితో, తల్లి తండ్రులమే ఉండలేక పోయాము, ఇక ఈ అమాయకురాలు ఏముంటుంది.  అందుకే వాళ్ళ ఊరిలో తన స్నేహితుడొకడు ఓ పెద్ద లాయర్అని, అతనితో అన్ని మాట్లాడారని, విడాకులు ఇప్పించి, భరణం కూడా ఇప్పిస్తానని చెప్పారని చెప్పేరు. తన కోడలు, మనవరాలు తమతోనే ఉంటారని, మా అత్తమామల్ని నిశ్చింతగా ఉండమని భరోసా ఇచ్చి, లావణ్యని, మనవరాలిని తీసుకుని వెళ్లిపోయారు.

          స్వంత తల్లితండ్రులు, కన్న కూతురు,  లావణ్య భర్త మనస్తత్వం గురించి సాక్ష్యం చెప్పడం వలన, త్వరలోనే,  విడాకులు మంజూరు చేస్తారని , భరణం కూడా చెల్లించే విధంగా తీర్పు వెలువడబోతోందని తెల్సింది. లావణ్య కూడా నా లాగే పెద్దగా చదువుకో లేదు. ప్రైవేట్‌గా డిగ్రీ చదువుతానని అంది.

          “చూసావా ప్రమీలా ! ఒక మనిషి మూర్ఖ స్వభావం వలన, రెండు నిండు జీవితాలు ఎలా బలైపోయాయో. ఏంటో ఈ పోయేకాలం నాకర్ధం కావడం లేదు “

          తాగుబోతు, తిరుగుబోతు, జూదగాడు, అనుమానస్తుడు, అహంభావి ఇలా ఏ లక్షణం చూసుకున్నా, వేటికవే ప్రమాద భరితమైనవి, జీవితాలని ఛిద్రం చేసేవి. ఒకరిలో ఉన్న లోపం, రెండు జీవితాలని నాశనం చేస్తోంది, రెండు కుటుంబాల్లో వారికి మనశాంతి లేకుండా చేస్తోంది.

          ఒక పెళ్లి చేయడానికి ఎంత ఖర్చు, కష్టం ఉంటాయో, అది పెడాకులు అయితే కూడా అంతకు మించి ఖర్చు, కష్టం, ఎదురవుతాయి,  ఎందరినో వేదనకి కూడా గురిచేస్తుంది. 

          పైగా ఇంకో విషయం, మన స్నేహితురాలు, కుమారి గుర్తుందా, ఓ డాక్టర్ని ప్రేమించి, ఏరికోరి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళైన మరుక్షణం కుమారికి కఠిన నిబంధనలు విధించాట్ట, తన తల్లితండ్రుల్నికానీ, అక్కచెల్లెళ్లని కానీ, అన్నదమ్ములను గానీ, స్నేహితులని గానీ కలవ కూడదు, ఉత్తరాలు కూడా రాయకూడదు, ఫోన్లుకూడా మాట్లాడకూడదు అని. ఓ సారి వాళ్ళన్నయ్య డేవిడ్ గుర్తున్నాడుగా, రోడ్డు మీద కనబడితే అడిగాను, కుమారి ఎలా ఉందని, ఇదంతా చెప్పి చాలా బాధపడ్డాడు. కుమారి “నన్” గా మారిపోయిందని, గోవాలో ఉందని చెప్పాడు. ఇలాంటి శాడిస్టులు ఏమి బావుకుంటారో అర్ధం కావడం లేదంటే నమ్ము.

          ఇవన్నీచూసాక నాకు ఏమనిపించిందో తెలుసా ప్రమీలా, రాంబాబు తాగి వచ్చి ఎవరిని ఇబ్బంది పెట్టడం లేదు. పైగా ఆయన తాగుడుకి ఆయనే లోపల్లోపల దహించుకు పోతున్నారు. రానురాను అది దాని ప్రతాపం చూపిస్తుంది.  ఒక బలహీనతకి లొంగిపోయి, దాన్నించి బయట పడలేక పోతున్నారు ! మంచి రోజుల కోసం, మార్పు కోసం ఎదురు చూడడం మినహా ఏమి చేయలేని నిస్సహాయ స్థితి. 

          నేను నా మనసుకు కళ్ళాలు వేసుకుని, భర్త నాతో ఇలా ఉండాలి, అలా ఉండాలి అని ఎలాంటి ఆశలు పెట్టుకోకుండా ఉంటె, ఎంతో నిశ్చింతగా ఉంది. మనశాంతి దొరుకుతుంది కూడాను. “ఆశలు పెంచుకుంటే, ఆనందం ఆవిరయి పోతుంది “

          దేవుడు ఓ చేత్తో తీసుకున్న దాన్ని, మరో చేత్తో ఇస్తాడంటారు. అలాగే, నాకు మంచి అత్త,  మామలను ఇచ్చాడు, అది నా అదృష్టంకాక మరేంటి ?  విధిని నమ్ముకొని జీవితాన్ని వెళ్లదీయడమే.

          హాల్ పక్కగదిలో ఉన్న, సరస్వతి మామగారు బయటికొచ్చి, వీరికెదురుగా ఉన్న సోఫాలో కూర్చుని, “మీ మాటలన్నీ విన్నానమ్మా. అమ్మా ! సరస్వతి, జీవితం పట్ల నీకున్న ఆలోచనలు చాలా గొప్పవమ్మా ! అయితే , నీ కన్నాపెద్దవాడిగా, అనుభవజ్ఞుడిగా ఓ సంగతి చెపుతాను. వివాహం అనేది రెండు వేర్వేరు కుటుంబ నేపథ్యంలోంచి వచ్చి, వేర్వేరు మనస్తత్వాలతో ఉన్న ఇద్దరు వ్యక్తులకి జరిగేది. ఈ ఇద్దరి మధ్య అవగాహన కుదిరి, సయోధ్య కుదిరేసరికి చాలా సమయం పడుతుంది. కొందరి మధ్య అది ఎప్పటికి జరగకపోనూ వచ్చు. అసలు గొడవలే లేని భార్య భర్తలుంటారంటే, అది అబద్ధమే నా దృష్టిలో. ఈ తరం వారు వాటికీ “గొడవలు ” అని టాగ్లైన్ఇస్తున్నారు కానీ, అవి గొడవలు కావు, “అభిప్రాయబేధాలు”  అలాగే, కొట్టుకుంటూ, తిట్టుకుంటూ , సంప్రదాయాలకు కట్టుబడి, వివాహ వ్యవస్థని గౌరవించి, కలిసి జీవిస్తుంటారు. ఇది మా తరం కథ. మా తరంలో అన్ని ఉమ్మడి కుటుంబాలే.  మాకు పెద్దలంటే భయ భక్తులుండేవి. అంచేత చెడు అలవాట్లకు చాలా దూరంగా వుండేవాళ్ళం. పెద్దలని చూసి సత్ప్రవర్తనని అలవర్చుకునే వాళ్ళం. ఇక్కడే సగానికి సగం సమస్యలు సమసిపోతాయి కదా.

          ఇక మనస్తత్వాలు కలవడం, ఒకరి అలవాట్లు ఒకరు తెల్సుకుని, తదనుగుణంగా మసలుకోడం మిగిలి ఉంటుంది. పెద్దవారిని చూసి, అవి చాలా వరకు సులభమయ్యేది మాకు. అంచేత భార్యభర్తల మధ్య ఏవన్నా మనస్పర్ధలొచ్చినా, అవి విపరీత స్థాయికి వెళ్లకుండా, నిశ్శబ్ద యుద్ధంతో సమసి పోయేవి. భార్యాభర్తల మధ్య కోపతాపాలొచ్చినా, అవి గుట్టుగానే ఉండేవి. అంచేత, నేటి తరం వారిలా, వారి ఇష్టానుసారం భార్యలతో గొడవ పడటం, కొట్టు కోడం, లాంటివి చేసే వాళ్ళం కాము.

          అసలు గొడవంతా ఎక్కడొస్తుందో తెలుసా తల్లి ? వాగ్వివాదాలు ద్వారా అసలు పాయింట్ పక్కకి వెళ్ళిపోయి , మాటల యుద్ధంలో దొర్లిన పదజాలం వలన,  సమస్య మరింత బిగుసుకు పోతుంటుంది . ప్రతిభార్య, భర్తచేసే మరో అతిపెద్ద తప్పు ఏంటో తెలుసా ? ఏ సమస్య మీద మనస్పర్ధలొచ్చినా, గతంలో విషయాలని ప్రస్తావిస్తూ ఒకరినొకరు ఎత్తిపొడుచుకోడం. ఇది సమస్యని మరింత జటిలతరం చేసి, ఇగోలతో బిగుసుకుపోయేలా చేస్తోంది. 

          ఇప్పుడు తల్లితండ్రి ఇద్దరు ఉద్యోగాలకి వెళ్ళిపోడం, ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, పిల్లలు ఆయాల సంరక్షణలో పెరగడం మొదలైన చాలా సామజిక మార్పుల వలన, పిల్లల్లో మంచి చెడుల విశ్లేషణ తెలిపే పెద్దలు లేక, వారికి తెలుసుకునే అవకాశం లేకపోవడంచేత, చెడు అలవాట్లు, చెడు స్నేహాలు, పట్ల ఆకర్షితులై పోతున్నారు, మంచి ప్రవర్తనా సరళిని కూడా అలవర్చుకునే పరిస్థితులు కూడా చాలా తక్కువగా ఉంటున్నకారణంగా, వారికి కుటుంబ విలువలు, అనుబంధాల పట్ల అవగాహన కొరవడుతోంది. ఇవన్నీ,  వివాహం అయి ఓ కొత్తవ్యక్తి తమ జీవితంలోకి వచ్చినప్పుడు బయటపడతాయి. వారి వైవాహిక జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తున్నాయి. ఎవరికి వారు ‘తగ్గేదేలే’ అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. ఇప్పుడు నీ కాపురమే తీసుకో, మేము మీతో లేకుండా, నువ్వు, రాంబాబు మాత్రమే ఇంట్లో ఉన్నట్టయితే, ఇలా ఉండేదా? పెద్దవాళ్ళం మేము కూడా మీతో ఉన్నాము కనుక, మా నీడలో, మా ప్రేమలో మీరు కాస్తసేద తీరుతున్నారు. కొంతలో కొంత సర్దుకు పోడానికి నువ్వు బాగా ప్రయత్నించడానికి ఇది చాలా పెద్ద కారణమే కదా ?

          లావణ్యని చదివించక చేసిన తప్పుని, నిన్ను డిగ్రీ చదివించడం ద్వారా దిద్దుకోవాలని అనుకున్నాము. అబ్బాయితో ఓ మాట చెప్పెను, తనుకూడా ‘సరే ‘ అన్నాడు. సో, సరస్వతీ! వీణని శృతి చేసుకోమ్మా !

          మంచి కాపురం అంటే, మనస్పర్థలు తక్కువగా వచ్చే కాపురం. అది ఆలయగోపురమంత పటిష్టంగా ఉంటుంది.

          పునాది గట్టిగా లేనప్పుడు, గోడలకి ఎంత గట్టి కాంక్రీటు వేసినా, అది నిష్ప్రయోజనమే కదా.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.