జ్ఞాపకాల సందడి-42

-డి.కామేశ్వరి 

 కావమ్మ కబుర్లు -16

          చిన్నపుడు బాగా పెరిగాం  అంటే ఇన్ని బట్టలు, ఇంతంత బంగారాలు పెట్టుకుని సిరిసంపదల మధ్య పెరిగాం అని కాదు. మామూలు మధ్య తరగతి వాళ్ళమే. ప్రతీ పండక్కీ బట్టలు, ఆడపిల్లలందరికి తలో గొలుసు, రెండు జతల బంగారు గాజులు, చెవులకి దుద్దులు, వేలికి ఉంగరం ఉండేవి అంతే. అలా చిన్నప్పటి నుంచీ అలవాటయి పోయి ఇప్పుడున్నా పెట్టుకో బుద్ధి వేయదు. అత్తవారు పెట్టిన చంద్రహారాలు, పలకసర్లు,  దావురుగల్లేలు ముప్పయి తులాల బంగారం ఉన్నా ఏనాడూ పెట్టుకోలేదు. ఏ పెళ్ళికో తగిలించుకున్నా తీసేవరకూ తోచదు. నా ఒంటిని  చిన్నప్పటి అలవాటున్నవే ఉంటాయి. మా అత్తగారు పెళ్లయిన కొత్తలో పెట్టుకోనని కేకలు వేసేవారు. ఆవిడ ఒంటిని ఎంత బంగారం పెట్టుకుని ఎలా మోసేవారో! అలాగే విడివిడిగా పడుకోడానికి ఎవరి మంచాలు వారికి ఉండి, చచ్చినా ఇంకోరితో షేర్ చేసుకోలేను మొగుడితో అయినా సరే. ఒక్కోసారి అనిపించేది ఈ అలవాటు లేకుండా ఉంటే బాగుండేదని. కొందరు భార్యా భర్తలు చక్కగా కౌగలించుకున్నట్టు పడుకుంటారు. అలాటి వాళ్ళు పగలు దెబ్బలాడు కుని, రాత్రయ్యేసరికి వంటరిగా పడుకోలేక దగ్గర చేరుతారు. నవ్వకండి, ఆలోచించండి. నేనన్నది నిజం అన్నది ఒప్పుకోండి. దర్జా అంటే శుభ్రంగా తినడం. అమ్మ చేతి వంట అందరూ తింటారు, కానీ డబ్బాలు డబ్బాలు చిరుతిళ్ళు తినేవాళ్ళం. ఏ సీజన్ లో దొరికే పళ్ళు ఎలా తినేవాళ్ళమో. ఇంట్లోనే పెద్దసపోటా చెట్టు ఏటికేడాది కాసేది. అరటి గెల అయితే ఒకటి చెల్లేసరికి ఇంకోటి తయారు. నారింజ, జామ చెట్టుమీద కోతుల్లా దోర కాయలు అక్కడ కూర్చునే నమలడం… పనసపండ్ల చెట్టు ఉండేది. మామిడి పండ్లు బజారులో నించి డజన్లకొద్దీ వచ్చేవి. అపుడు పరక అంటే పదమూడు లెక్క. బుట్టలు బుట్టలు సీతాఫలాలు… కాంట్రాక్టర్లు మా తోటలోవని పంపించేవారు. చెరుకుగడలు పీక్కు తినే ఈనాటికీ మా పళ్ళు గట్టిగా ఉన్నాయి. తాటిముంజలు తాటి ఆకుల్లో చుట్టి అమ్మే వారు. డజను అణా. 

          అలా తిన్నవాళ్ళం ఇపుడు జామకాయ పాతిక ముప్ఫయి పెట్టి  కొనే గతి. ఇప్పుడు  ముంజలు డజను ఏభయి. పనస పండు తొనలేదా ఎంతో అడిగి, గుండె గుభేలుమని కొనడం మానేశా. నీవు అన్నీ పాతధరలతో కంపేర్  చేస్తావు కానీ, నీకిపుడు పెన్షన్ ఎంత వస్తుందో, అమ్మమ్మకి ఎంతవచ్చేదో ఆలోచించు అని కేకలు వేస్తాడు మా అబ్బాయి.  నిజమే, జీతాలెంత పెరిగాయో ఆలోచింంచం. ‘అమ్మో’ అంటాం  పాతరేట్లతో పోల్చుకుని.  శుభ్రంగా ఆరోగ్యంగా ఉండేవారం. ఒక బంట్రోతు, చాకలి ఉండేవారు. ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతికి, ముఖ్యమైనవి ఇస్త్రీ చేసేవాడు. ఇప్పుడే కాదు, ఈనాటికీ  విడిచిన బట్ట కట్టలేదు. మా అమ్మ ఎంత పనున్నా సరే, ప్రతి ఆదివారము నలుగులు పెట్టి ఆరుగురికీ తలకు పోయాల్సిందే. పనిమనిషి తలరుద్దుతూ ఉంటే, కుంకుడు కాయ రసం పోసేది. నలుగు పెట్టి పోసుకున్న రోజు ఒళ్ళంతా కేజీ మట్టి వదిలిపోయినట్టు తేలికగా ఉండేది. సాయంత్రమయితే, ఇంట్లో ఉన్న సన్నజాజి పందిరి మీదకి నిచ్చెన వేసుకుని,మొగ్గలన్నీ కోసి, అమ్మకిస్తే దండ  కట్టి, తల్లో పెడితే, ఆ సువాసన మళ్ళీ వారం వరకూ ఉండేది. ఈ కాలం పిల్లలు షాంపూలతో రుద్దుకునే వారికి, కుంకుడు కాయతో రుద్దుకుంటే ఎంత బాగుంటుందో ఎలా తెలుస్తుంది? తల్లులకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది? సరే, మా అమ్మ పిల్లలకే కాదు, మంచాలకి కూడా రెండు మూడు నెలలకోసారి తలంటేది తెలుసా? ఎందుకంటే ఆ రోజుల్లో నవారు, నులక మంచాలకి నల్లులు పట్టేవి. ఇపుడు నల్లి అనే ప్రాణి  ఉందో లేదో నాకు తెలీదు. ఆ నవారు మంచాల సందుల్లో కిరసనాయిలు పోసి, కాసేపుంచి మరిగే నీళ్లు పోస్తే  అవన్నీ చచ్చేవి. ఆ రోజుల్లో కిందనించి నల్లులు, పై నుంచి దోమలు కుట్టి చంపేసేవి. దోమలకి కాస్త కర్పూరం నూనెలో వేసి పెట్టేది చలికాలం, వానాకాలం దోమతెరలు వేసుకునేవారు. మా నాన్న పక్క వేసి దోమలు లేకుండా పరుపులో దోపి వేసి వెళ్లడం దర్జా కదా! డబ్బుతోనే సుఖాలు దర్జాలు ఉండవని మా కథలు చెప్పడం లేదూ?

కావమ్మ కబుర్లు -17

          మా నాన్నకి  కోపంతో పాటు అహంకారము ఎక్కువే. ‘అన్నీ తనకే తెలుసు, ఇతరులకేం తెలియదు!’  అనుకుని అథారిటీ చేయడం అలవాటు. దానికి తోడు చిన్న ఊళ్లలో వుండి గవర్నెమెంట్  జాబ్ చేయడం, వంగి సలాములు చేసేవారు ఎక్కడికెళ్లినా ఉండడం, బంట్రోతులతో అట్టహాసంగా ఉండడం, ఆఙ్ఞాపించడం తప్ప మంచిగా పని చేయించుకునే తెలివి ఉండేది కాదు. మా అమ్మకా తెలివి ఉంది, అంచేత ఇల్లు సంబాళించుకునే నేర్పుతో, పనివాళ్లతో మంచిగా పనులు చేయించుకునేది. ఆయనకు ఎంత దర్జా అంటే, ఎదురుగానే ఉన్నా, నీళ్లు తీసుకుని తాగేవారు కాదు. ఎదురుగా ఎవరుంటే వాళ్ళు అందించాలి. మా నాన్న ఊతపదం ‘గాడిద’. ప్రతీ వాడినీ గాడిద అనేవారు. బహుశా చిన్నతనానే తల్లీ, తండ్రి పోవడం వలన పెత్తనం, ఇంట్లో అధికారం ఆయనదే అవడం, పెంచిన అక్క చిన్నదే అవడం ఇవన్నీ ఆయన మాటకి ఎదురు లేకపోవడం కారణమై ఉంటుంది. ఏది ఎలా ఉన్నా, అంత చిన్నవాళ్లు – ఏ దిక్కూ లేకుండా పెరిగి, పెద్దయి స్వయంకృషితో ఆ రోజుల్లో మద్రాస్ లో గిండీలో సీట్ సంపాయించుకుని ఇంజినీరింగ్ చదివేవారంటే మెచ్చుకోదగ్గదే. ఈ రోజుల్లో అన్నీ చేసిపెట్టే తల్లీతండ్రి ఉంటే ఎంత బాధ్యతారహితంగా ఉంటున్నారో అందరికీ తెలుసు. స్వంత ఇల్లు సగభాగం అద్దెకిచ్చి, తండ్రికి వచ్చే డిపెడెంట్ పెన్షన్లతో చదువుకుని పైకి వచ్చారు. ఆ రోజుల్లో ఇంజనీర్ అల్లుడంటే మాటలా? మా తాతగారు ఈ అల్లుడంటే ఈయన ధూమ్  దాంలకి భయపడేవారుట. మా అమ్మకి పెద్దమనిషి కాకుండా పదమూడో ఏట నాన్న నాలుగో సంవత్సరం చదువుతుంటే పెళ్ళయిందట. పెళ్ళిలో ఆ రోజుల్లో మిఠాయిలు నేతితో  చేయలేదని సారె తిప్పి పంపించేసేరుట. అప్పటికపుడు నేతితో అన్ని మిఠాయిలూ చేసి పంపారుట. ఆయన బతికినన్నాళ్లు  ఇంట్లో ఆయన కోసం అన్ని నేతితోనే చేసేవారు. పూరీల దగ్గర నుంచి గారెలు, బూరెలు, పెసరట్టు ఉప్మా అన్నీ నేతితో చేసేవారు ఆయనకి. ఆ రోజుల్లో ఈ కొలస్ట్రాల్ అవీ తెలియవు. శుభ్రంగా అన్నీ తినడమే. ఈయన వారానికోసారి మంగలిని పిలిపించుకుని ఒళ్ళంతా నూనెలు మర్దనాలు చేయించుకుని, నలుగులు పెట్టించుకుని తలస్నానం చేసేవారు. ఇదంతా గంట తతంగం. అర్థరూపాయ ఇచ్చే వారు. ఆ రోజుల్లో బతుకు తెరువు నిమిత్తం ఒరిస్సా దేశం నుంచి కొందరు మంగలివారు వచ్చి ఈ పనులు చేసేవారు. నా పెళ్ళి కుదిరాక అమ్మ, దానికి నాలుగు ఒరియా ముక్కలు నేర్పు పనివాళ్ళతో పనులు చేయిపించు కోవాలిగా… అలాగే కూరలు పేర్లూ అవీ నేర్పు – అని పురమాయించింది. మా నాన్న సంగతులు ఎన్ని చెప్పినా తరగవు. ఆయనకి ఎప్పుడో అరు నెలలకో ఏడాాదికో బుద్ధి పుడితే పిల్లల చదువులు పర్యవేక్షించడానికి మా స్కూలుకి డవాలా బంట్రోతుని వెంటేసుకుని జీప్ లో వచ్చేవారు. ఆ జీపు, ఆయన కాకీడ్రెస్, హాట్ అవిచూసి మాస్టారు హడిలిపోయి, ఏ దొరగారో! అని దండాలు పెట్టేవారు. పిల్లల పేర్లు చెప్పగానే ఊపిరి పీల్చుకుని, “వాళ్ళకేమండీ, బ్రహ్మాండంగా  చదువుతారు!” అని పొగిడేవారు. నాన్న సంతృప్తిపడి వెళ్ళిపోయేవారు. అపుడు చూడాలి, మా మొహాలు గర్వంగా గొప్పగా అందరి పిల్లలు మా వైపు చూస్తుంటే ఫోజ్ పెట్టేవారం. అక్క, అన్నయ్య ఫస్ట్ మార్కులొచ్చినా, చదువులో నేనెప్పుడూ వెనకబడే ఉండేదాన్ని. లెక్కల్లో ముప్ఫయి మార్కులు వస్తే గొప్ప మార్కులు. అలాటి నన్ను బ్రహ్మాండం అంటే పదమూడేళ్ల పిల్ల పొంగిపోదూ? బాబోయి ఇవాళ ఏమొచ్చిందో తెలుగులోకి ట్రాన్సలేట్  అవకుండా ఇబ్బంది పెట్టేస్తుంది ఐపాడ్. ఇంకా రాయడం నా వల్ల  కాదు రేపు చూద్దాం మిగతాది.       

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.