తల్లివేరు- నెల్లుట్ల రమాదేవి కథల పై సమీక్ష

-కె.వరలక్ష్మి

          ‘నాగరిక సమాజంలో మానవుల సంసారాన్ని పెంచడమే సాహిత్య ప్రయోజనమైతే అది రమాదేవి గారి కథల వల్ల తప్పక నెరవేరుతుంది’ అన్నారు ఓల్గా ఈపుస్తకం ముందు మాటలో. అది అక్షర సత్యం అనేమాట ఈపుస్తకంలోని కథలు చదివితే తెలుస్తుంది. తెలంగాణా పల్లె వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమాదేవి ఆంధ్రాబేంక్ లో బ్రాంచి మేనేజర్ గా, మార్కెటింగ్, కష్టమర్ రిలేషన్స్, ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ సీనియర్ మేనేజర్ గా పని చెయ్యడం వల్ల కలిగిన ఆర్థికపరమైన సమస్యల అవగాహన ఈ కథల రచనకు మార్గం సుగమం చేసింది.

          రమాదేవి ఏ వాదాల జోలికీ పోకుండా అలవోకగా రాసిన వేరువేరు కథాంశాలతో వైవిధ్య భరితమైన కథలివి.

          పాత కొత్త తరాల మధ్య ఆర్థిక సంబంధాల గురించి, భార్యలతో మొరటుగా ప్రవర్తించే భర్తల నైజం గురించి, ప్రేమించిన వ్యక్తినీ- తన భవిష్యత్ జీవితానికి తోడునీ వదులుకునేలా చేసే స్త్రీల మాతృత్వ భావనల బలహీనత గురించి, సంపాదిస్తున్నా, ఆర్థిక స్వేచ్ఛను పొందలేని స్త్రీల గురించీ, ప్రపంచీకరణ నేపథ్యంలో భూమి సంబంధాల మార్పుల గురించీ, అత్తగారిని అపురూపంగా చూసుకునేలా చేసిన ఆర్థిక అవసరం గురించీ, కరోనా కాలంలో బైటపడిన మనుషుల స్వభావాల గురించీ, పెళ్లి తర్వాత మారే ఆడపిల్లల ఇంటి పేరు గురించీ, స్త్రీల చీరల పిచ్చి గురించీ కథలు ఉన్నాయి ఈ పుస్తకంలో. రచనకు ముఖ్యమైనది చదివించే లక్షణం. అది పుష్కలంగా ఉన్నపుస్తకం తల్లివేరు.

          రచయిత్రి కథారచయితే కాకుండా గుర్తింపు పొందిన కవి, కార్టూనిస్ట్ కూడా కావడం వలన హాస్య, వ్యంగ్య కథలు కూడా చక్కగా పండేయి. బహుమతి పొందిన, వివిధ పత్రికలలో ప్రచురణ పొందిన కథల సమాహారమైన ఈ పుస్తకం తప్పక కొని చదవాల్సిన పుస్తకం.

వెల – 200/-

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.