నిష్కల – 25

– శాంతి ప్రబోధ

జరిగిన కథ: సారా గురించిన వివరాలు తెలుసుకుని తన సందేహం నివృత్తి చేసుకునే నిమిత్తం సారాతో కలసి కాంపింగ్ కి వెళ్ళింది నిష్కల.  సారా తండ్రి ఆమెతో ఉండడని తెలుసుకుని ఆశ్చర్యపోతుంది. మీ నాన్న మొదటి భార్య ఎక్కడుంది ? అని సారాని ప్రశ్నిస్తుంది. మాటల్లో తన తల్లి గురించి చెబుతుంది నిష్కల.  

***

          సుగుణమ్మకు నిద్ర పట్టడం లేదు. పెద్ద కొడుకు కళ్ళ ముందు కదలాడుతున్నాడు.  కళ్ళు మూసినా తెరిచినా పెద్ద కొడుకే .. ఈ రోజు అతని పుట్టినరోజు. లేచి కూర్చుంది. మంచం పక్కనే ఉన్న టేబుల్ పై ఉన్న ఆల్బమ్ చేతిలోకి తీసుకుంది. ఇప్పటికి ఎన్ని సార్లు చూసిందో .. కళ్ళ ముందులేని కొడుకుని భద్రపరచుకున్న ఫొటోల్లో చూసుకుంటూ తృప్తి పడడానికి ప్రయత్నిస్తున్నది. 
 
          తొలిచూరి సంతానం. కాన్పు కష్టం అయింది. పండంటి బిడ్డ పుట్టాడు. ఆ కష్టం, బాధంతా మరచిపోయింది. పుట్టినప్పటి నుంచి పెద్ద కొడుకు ఫోటోలు అన్నీ ఒక క్రమపద్ధతిలో అమరుస్తూ కొంతసేపు గడిపింది. సమయం పన్నెండు కావస్తున్నది. మెత్తటి పరుపు మీద వాలింది. అయినా నిద్ర రావడం లేదు. పరుపు మీద కాసేపు  అటు ఇటు పొర్లింది .. ఎంత ఖరీదైన పరుపులైతే ఏం లాభం నిద్రపట్టనప్పుడు. వెనుకటి దూదిపరుపులే నయం .. అసలు నులక మంచం మీద పడుకున్నా పక్క ఉన్న లేకున్నా నిద్ర పరిగెత్తుకు వచ్చేది. ఎంత సుఖంగా నిద్రపోయేది.
 
          ఆలోచిస్తుంటే పరుపులు కుడతాం, బాగు చేస్తాం అంటూ పొరుగూరు నుంచి వచ్చే  దూదేకుల ఖాసిం గుర్తొచ్చాడు. పత్తి ఏకి చెత్త చెదారం లేకుండా చేసేవాడు. చేత్తో కుట్టిన పరుపు గుడ్డలో పత్తి కుక్కి సమానంగా పరిచేవాడు. దాన్ని దబ్బనంతో అరచేయంత దూరంలో కుట్టి ముడేసేవాడు. పరుపులో దూది కదలకుండా ఉండేది. ఇప్పుడు ఈ పరుపులు వచ్చాక అందరిళ్ళలో ఇవే కన్పిస్తున్నాయి. దూది పరుపులు లేవు. దూదేకుల వాళ్ళు లేరు. పాపం ఆ దూదేకుల వాళ్లేమయిపోయారో … ఎట్లా బతుకుతున్నారో…
 
          దూదేకుల ఖాసీం కొడుకు కూడా సుధాతో పది వరకు చదివాడు.. తర్వాత సైకిల్ రిపేరింగ్ షాపులో చేరి పంచర్ వేసే పని నేర్చుకున్నాడు. నెమ్మదిగా తను ఒక సైకిల్ రిపేరింగ్ షాపు పెట్టుకున్నాడు. సైకిళ్ల వాడకం తగ్గి మోటారుసైకిళ్లు, స్కూటర్లు పెరిగాక వాటిని బాగుచేయటం నేర్చుకున్నాడు. తప్పదుగా..మారుతున్న కాలమాన పరిస్థితులను బట్టి వాటికి అనుగుణంగా బతుకు మలుచుకున్నాడు. కానీ ఎప్పుడు తల్లిదండ్రుల చేయి వదల్లేదు. వాళ్ల కనుసన్నలలో వారికి అందుబాటులోనే ఉండేవాడు. 
 
          తెలివిగల కొడుకుని చదివించలేక పోయానని బాధపడిన ఖాసీం తనతోనే ఉంటున్న కొడుకు చేతుల్లోనే తృప్తిగా కన్నుమూశాడు. ఎంత అదృష్టవంతుడు!
 
          తన ముగ్గురు కొడుకులు మేలిమి ముత్యాలు అని మురిసిపోయేది. ఉన్నత చదువులు చదివి పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారని గర్వపడేది. తనను తొలిగా అమ్మా అని పిలిచిన పెద్ద కొడుకంటే ముగ్గుర్లోకి పిసరంత ఎక్కువ ప్రేమ ..అమ్మా అంటూ కాళ్లకు చుట్టుకు పోయేవాడు. అమ్మ లేకుండా ఉండలేకపోయేవాడు. ఎటైనా వెళ్లినా రాగానే అమ్మ పక్కన కూర్చుని బెంగ తీర్చుకునేవాడు. ఎదిగిన తర్వాత, విదేశాలకు వెళ్లి వచ్చినప్పుడు కూడా అమ్మ పై అదే ప్రేమ. అమ్మమాటను తీసేయలేక మనసు  చంపు కున్నాడు. జీవితంలో రాజీపడడానికి సిద్దమైనవాడు. 
 
          ఇప్పుడేమైంది.. ఎందుకింత మారిపోయాడు. ఇంతగా మారపోతాడని,తల్లి శత్రువుగా మారిపోతుందని ఈ తల్లి ఊహించలేదురా బేటా.. కన్నపేగుకు ఎన్నాళ్లీ గోస..
 
          ఒక్క పలుకు లేదు, ఉలుకు లేదు. మాట లేదు. చూపు లేదు. అమ్మ పిలుపుకు, చూపుకు అందనంత దూరంలో..
 
          ఈ అమ్మ అంత పెద్ద ద్రోహం, నేరం ఏం చేసిందని, కాని దానిలా చూస్తున్నావురా..
ఏం చేసినా నీ మీద ప్రేమతోనే కదా.. నీ మంచికోసమే కదా.. కన్నయ్యా అది నీకు అర్ధం కాలేదా.. ? కొడుకు ఫొటో చూస్తూ ప్రశ్నిస్తున్నది సుగుణమ్మ.
 
          అమ్మంటే ఆకాశమంత ప్రేమ అని చెప్పిన ఐదేళ్ల కొడుకు ఇప్పుడు యాభై ఏళ్ల వాడయ్యాడు. వాళ్ళ నాన్న వెళ్ళిపోయాడు. ఉంటె కొడుకు పై ఎంత దిగులుపడేవాడో..  
కొడిగట్టిన దీపంలా ఉంది ప్రాణం. కొడుకు చూపు కోసం కొట్టుకుంటున్నది. బొందిలో ప్రాణం ఉండగా చూడగలనో లేదో..  దిగులుపడుతున్నది కళ్ళల్లో వత్తులేసుకుని పెద్ద కొడుకు కోసం ఎదురు చూస్తున్న ఆ తల్లి.  
 
          ఆలోచనలు మళ్ళీ కొడుకుల పై మళ్లడంతో బలవంతంగా తన దృష్టి మళ్లించే ప్రయత్నం మొదలు పెట్టింది. తలగడ తీసి నిలబెట్టింది. వీపు దానికి ఆనించి కాళ్ళు చాపుకుని కొద్ది సేపు కూర్చుంది. కొత్త పరుపు పాత పరుపు కంటే కొంచెం ఎత్తుగా దిట్టంగా ఉంది. తలగడలు కూడా ఎత్తుగానే ఉన్నాయి. 
 
          నడుము నొప్పి అంటున్నానని కొబ్బరి పీచు, స్పాంజ్ తో చేసిన పరుపు నాలుగేళ్లు కాకుండానే తీసేసి కొత్త పరుపు తెప్పించి కోడలు. మెడిసినల్ పరుపు అట. పడుకున్న దగ్గర పూర్వపు పరుపులాగా అణిగిపోకుండా వెన్ను నొప్పి రాకుండా ఉంటుందని చెప్పింది. చాలా ఖర్చు చేసి తెప్పించింది. ఏమిచ్చి ఈ పిచ్చిదాని ఋణం తీర్చుకోగలను? 
 
          లేచి వెళ్లి  హల్ లో టీవీ పెట్టుకోవడం ఇబ్బందిగా ఉందని గమనించి  తన గది గోడకే చిన్న టీవీ  అమర్చిన కోడల్ని మనసులోనే కృతజ్ఞతలు తెలుపుకుంది. చేతిలోని ఆల్బమ్ పక్కన పెట్టి రిమోట్ చేతిలోకి తీసుకున్నది సుగుణమ్మ. 
 
          మునుగోడు ఎన్నికల వార్తలు .. ఒక్క ఎన్నికకు 500 కోట్లు .. ఒక్క ఎన్నికకు అంత సొమ్మా .. అసలు అవి డబ్బులా చిల్ల పెంకులా అనుకుంది. సర్పంచ్ ఏ కారణంతోనైనా దిగిపోతే ఆ స్థానంలో ఉపసర్పంచ్ ని సర్పంచ్ చేస్తారు. మరి ఎమ్మెల్యే రాజీనామా  చేస్తే మళ్ళీ ఎన్నిక పెట్టడం ఎందుకు? ఆ తర్వాత ఓడిపోయిన వాళ్లలో ఎవరికి ఎక్కువ ఓట్లు ఉంటే వాళ్ళకి ఆ పదవి ఇస్తే సరిపోతుందిగా .. ఎందుకింత ఖర్చు చేస్తున్నారు ఎందుకింత శ్రమ పడుతున్నారు. ఓటుకు వేలు నొక్కి  .. ముక్క మెక్కి , చుక్క తాగి చివరికి వారికి ఇష్టం వచ్చినట్టు చేసిన బాసలు మరచి, ఒట్టు తీసి గట్టు మీద పెట్టేసి ఎక్కువ ఎవరి నుంచి ముడితే వాళ్ళకి ఓటు గుద్దేశారట .. ప్చ్.. జనం మటుకు ఏం చేస్తారు.. సొమ్ములిచ్చిన ప్రతివాడికి ఓటేయడం కుదరదుగా .. ఎవరికో ఒక్కరికే ఓటేయాలి. ప్రతి ఏడాది ఇట్లా ఓట్లు వస్తే బాగుండు అనుకుంటున్నారేమో మునుగోడు జనం అని జనం తరపున ఆలోచించింది.
 
          నిన్నటి వరకు ఎవ్వరు మునుగోడు గోడు వినని నాయకులు, పార్టీలు ..మధ్యంతరం వస్తుందనగానే అధికార పార్టీ గెలుపు కోసం ఆగమేఘాల మీద రోడ్లు వేసింది, బిల్డింగ్లు కట్టింది, పింఛన్లు ఇచ్చింది, ఎన్నో సంక్షేమ పథకాలు వచ్చి ముంగిట వాలాయంటున్నారు. ఎన్నెన్నో తాయిలాలు ఇస్తామని నమ్మబలికారంటున్నారు.
 
          ఇవన్నీ ఓట్లు వస్తే తప్ప చేయరా.. ఓటుకోసమేనా .. ప్రజల కోసం కాదా..? ఆ బాధ్యత లేదా.. సందేహం ఆమెలో..
 
          తనకు తెలిసినంత వరకు మరీ ఇంత దిగజారిపోయిన ఎన్నికలు ఎప్పుడు చూడలేదు అనుకుంటూ టీవీ చూస్తున్నది సుగుణమ్మ. 
 
          ఒక పార్టీ వాళ్ళు ఓటుకు మూడువేలు ఇచ్చారు. ఇంకో పార్టీ వాళ్ళు నాలుగు వేలు ఇచ్చారు. ఎలక్షన్ ముందు రోజు రాత్రి మొదటి పార్టీ వాళ్ళు ఇంకో రెండు వేలు ఇచ్చారు.  ఒక్క ఓటుకు తొమ్మిది వేలు ముట్టినయ్ అని చెబుతున్నది ఒక శ్రామిక మహిళ. తన ఇంట్లో ఐదు ఓట్లున్నాయి. మొత్తం నలబై ఐదు వేలు వచ్చాయని గొప్పగా చెప్పింది ఆమె. 
 
          ఓటుకు విలువ లేకుండా చేస్తున్న నాయకుల్ని, ఎన్నికల్ని తిట్టుకుంటూ మరో ఛానెల్ మార్చింది సుగుణమ్మ. అదే రోజు ఎన్నిక అవడం వల్లనేమో అన్ని చానళ్ళు అవే వార్తలు చూపుతున్నాయి. విసుగ్గా టీవీ కట్టేసి బెడ్ సైడ్ టేబుల్ పై రిమోట్ పెట్టి పడక పై వాలింది.
 
***
 
          రాష్ట్రంలో జరుగుతున్న  భారత్ జోడో యాత్రలో ప్రజాసంఘాలు, సంఘీభావం ప్రకటించాయి. పౌర సమాజ సంఘాలు, సంస్థలు, ఇతర రాజకీయ పార్టీలు గ్రామీణ ఆదివాసీ ప్రాంతాల కుటుంబాల హక్కులు, సంక్షేమం కోసం కొన్ని ముఖ్యమైన సమస్యలు, పరిష్కారాలను చర్చకు పెట్టింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పై వత్తిడి తేవడానికి ఈ చర్చ ఉపయోగపడాలని ఉద్దేశంతో రాహుల్ గాంధీని కలిశారనేది ఆ వీడియో సారాంశం. ఆ తర్వాత రైతు మహిళలతో రాహుల్ ముచ్చటిస్తున్న వీడియో చూసింది శోభ.
 
          మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ వార్తలను కవర్ చేయడం లేదేంటి..? కొన్ని చానళ్ళు ఏదో మొక్కుబడిగా చూపుతున్నాయి కానీ, ఆ పాద యాత్రకి ప్రాధాన్యత ఇవ్వడం లేదని స్పష్టంగా తెలిసిపోతున్నది. ఏంటో సమాజంలో జరుగుతన్న విషయాల్ని ప్రజల ముందుకు తేవాల్సిన మీడియా రంగులు వేసుకున్నది. ఒక్కో మీడియా హౌస్ ఒక్కో రంగుకి వత్తాసు పలుకుతున్నది. అసలు ఏ వార్త సరైనదో అర్ధం కాక సామాన్య జనం తికమక పడుతున్నారు.  దుడ్డు ఉన్నవాడిదే బర్రె అన్న చందంగా మారాయి మీడియా హౌస్ లు.  
 
          చేతిలో ఉన్న ఫోన్ లో వాట్సాప్ లో వచ్చిన వీడియో మరో సారి చూసింది శోభ. 
అది చూస్తుంటే శోభలో కొత్త ఆలోచనలు రూపుదిద్దుకుంటున్నాయి. కాల్ మనీయాప్ ల ఆగడాలకు అంతులేకుండా పోతున్నది. ఛిద్రమైపోతున్న జీవితాలు చూసింది. 
కాల్  మనీ యాప్, లోన్ యాప్ లు సామాన్య జనాన్ని ప్రలోభ పెట్టి మోసం చేస్తున్నాయని, వారి జీవితాలను కాటేస్తున్నాయని అందుకే వాటిని నిషేధించాలని కోరాలని ఆమె మనసు ఆరాటపడింది, తాను కూడా ఆ యాత్రలో ఒక్క రోజైనా నడవాలనుకుంది.  కలవాలనిపించింది. ఆ యాత్రలో దేశం నలుమూలల నుంచి భాగమవుతున్న జనాన్ని చూస్తుంటే శోభలో కొత్త ఉత్సాహం తన్నుకొస్తున్నది. 
 
          ఆ యాత్ర చూస్తుంటే శరీరంలోకి కొత్త సత్తువ చేరుతున్న భావన ఆమెలో. యాత్ర చేస్తున్న వ్యక్తి దేశంలో అధికారంలో లేడు. ఎప్పడైనా అధికారంలోకి వస్తాడో లేదో తెలియదు. ఒక వేళ వచ్చినా ప్రజల పక్షాన నిలుస్తారో లేదో తెలియదు.
 
          అయినప్పటికీ సమకాలీన రాజకీయాలకు దూరంగా ఉండే తనలో ఎప్పుడూ లేనంత స్పందన. కారణం ఏమై ఉంటుందీ..ఆలోచనల సుడులు, బహుశా ప్రస్తుతం ఉన్న సామాజిక, రాజకీయ పరిస్థితి తనను ఆ విధంగా తీసుకుపోతున్నదా.. లేక ప్రజలతో మమేకం అవుతున్న రాహుల్ తీరు భవిష్యత్ పట్ల ఆశలు కల్పిస్తున్నదా.. ఏమో మరి! 
 
          ఏది ఏమైనా భారత్ జోడో యాత్ర రాష్ట్ర సరిహద్దులు దాటక ముందే ఆ యాత్రలో పాలుపంచుకోవాలను కుంది శోభ.
 
          ఇంట్లో వయసుమళ్ళిన  అత్తగారు ఉండడం వలన ఒక్కరోజు కంటే ఎక్కువ సమయం కేటాయించడం కష్టం కాబట్టి ఉదయాన్నే బయలు దేరి సాయంత్రానికి వచ్చే విధంగా కార్యక్రమం రూపొందించుకోవాలని నిర్ణయించుకుంది శోభ.  
 
***
          అప్పటికింకా చీకటి ముసుగు పూర్తిగా తీయలేదు. చెట్ల పై పిట్టలు వేకువ పాటలు మొదలు పెట్టలేదు. 
 
          కావేరి లేచి వాకిలి ఊడ్చి కళ్ళాపి చల్లింది. ఒక బఱ్ఱె పాలు తీసి రామవ్వకు ఇచ్చింది. పాలు పట్టే కాశీరాం రావడంతో మరో బఱ్ఱె పాలు తీయడానికి వాకిట్లోకి నడుస్తున్నది. 
 
          అంతలో లాండ్ లైన్ ఫోన్ మోగుతున్నది.  
 
          ఈ సమయంలో ఫోన్ ఎవరై ఉంటారబ్బా అనుకుంటూ లోపలికి అడుగులేసింది కావేరి. వంట గదిలో టీ కోసం పొయ్యి మీద నీళ్లు పెట్టిన రామవ్వ నువ్వు పో బిడ్డా దూడను  వదిలి వచ్చాను. అనడంతో మళ్ళీ బయటికి నడిచింది కావేరి. కానీ ఇంత పొద్దున్నే ఫోన్ అంటే ఆమె మనసు ఏదో కీడు శంకిస్తుండడంతో దూడను లాగి కట్టేసి ఫోన్ ఎవరా అని ఆలకిస్తున్నది.
 
          అంతలో ” హా ..” అంటూ రామవ్వ గొంతు ఒక్క ఉదుటున లోనికి పరిగెత్తింది కావేరి.  ఎదుట కుప్పకూలిపోయిన రామవ్వ. వెంటనే నీళ్లు చల్లి స్పృహలోకి తెచ్చింది కావేరి.   
పాల కాశీరాం వాకిట్లో ఉన్న ప్లాస్టిక్ నులక మంచం వాల్చాడు. ఇద్దరూ కలసి రామవ్వను మంచం పై కూర్చోబెట్టారు. 
 
          నిన్న వార్తల్లో గుజరాత్ కాడ ఏదో తీగల వంతెన  కుప్పకూలింది  చూసినం గద. 141 మంది చనిపోయారని చెప్పినరు గదా ఆ సమయంలో నా మనవరాలు కూడా ఆ సస్పెన్షన్  బ్రిడ్జి పైనే ఉందట. అంటూ కళ్ళల్లో నీళ్లు నింపుకున్న ఆమె నోట మాట రాక చెంగు నోటి దగ్గర పెట్టుకుని దుఃఖాన్ని దిగమింగడానికి ప్రయత్నిస్తున్నది. 
 
          ఆ నది పై  బోలెడన్ని సెల్ఫీలు తీసుకుని అమ్మానాన్నలకు, తమ్మునికి, దోస్తులకు పంపిందట. అమ్మతో ఫోన్ మాట్లాడుతూనే బయటికి వస్తున్నదట. అంతలోనే ఘోరం జరిగిపోయింది.
 
          భోరుమన్నది రామవ్వ. ఆమెను సముదాయించడం కావేరికి కష్టంగా ఉన్నది. అంతలో కావేరి కూతురు పాక్కుంటూ వచ్చింది. బిడ్డను చంకనేసుకుని రామవ్వని ఓదార్చడానికి ప్రయత్నిస్తున్నది కావేరి. 
 
          రామవ్వ మనుమరాలి మిత్రురాలు నీత మోర్బీకి చెందినది. బ్రిటిష్ కాలంనాటి ఆ వంతెన ఆమెకు కొత్తకాదు. గత ఏడునెలలుగా మూసేసిన వంతెన అక్టోబర్ 26 గుజరాత్ కొత్త సంవత్సరం సందర్బంగా ఆ కేబుల్ బ్రిడ్జి పునఃప్రారంభించారు. నీత తన ఆహ్వానం మేరకు పండుగకు వచ్చిన మిత్రులను తీసుకుని సరదాగా ఆ ఆదివారం అక్కడకు 
వెళ్ళింది. 
 
          వందమంది ఉండాల్సిన చోట నాలుగు వందల మంది ఉండడంతో అది కుప్ప కూలిపోయింది. రామవ్వ మనుమరాలు రవళి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నది. దెబ్బలు బాగా తగిలాయి. ఈత రాని ఆమె మిత్రుల ప్రాణం పోయింది. పడిన దగ్గర రాళ్లు ఎక్కువగా ఉండడంతో తలకి తగిలి ప్రాణం కోల్పోయారు కొందరు.
 
          ఫోన్ మాట్లాడుతుండగా దుర్ఘటన జరగడం ఫోన్ కట్ అవడంతో ఏమైందో తెలియని  రామవ్వ కోడలు సిగ్నల్స్ సమస్య కావచ్చు అనుకున్నది. కొద్ది సేపట్లోనే టీవీ లో వార్తలు చూస్తూ విషయం అర్ధమై వెంటనే బయటకు వెళ్లిన భర్తకు ఫోన్ చేసింది. హుటాహుటిన ఇద్దరూ గుజరాత్ ప్రయాణమయ్యారు. వెళ్తూ వెళ్తూ విషయం అన్నకు చెప్పడంతో రవళి ఆచూకీ తెలియని రామవ్వ పెద్ద కొడుకు ఆ విషయం రామవ్వకి చెప్పాడు. మనవరాలి ఆచూకీ గురించి కంగారు పడుతున్న రామవ్వను ఓదారుస్తూనే టీ తయారుచేసి రామవ్వకి అందించింది కావేరి. 
 
          కాశీరాం మళ్ళీ వస్తానని వెళ్ళిపోయాడు. 
 
          రామవ్వ చిన్న కొడుకుకు ఫోన్ చేసి రవళి విషయం ఎప్పటికప్పుడు వాకబు చేసింది కావేరి. రవళి విషయంలో భయపడాల్సిన పనిలేదని, తీవ్ర గాయాల పాలై చికిత్స పొందుతున్నదని, త్వరలో ఇంటికి వచ్చేస్తామని తెలుసుకుని శాంతపడింది రామవ్వ. 
వాడి మొదలార, వందమంది ఉండాల్సిన చోట నాలుగొందల మందిని పంపి ఉసురు పోసుకున్న కాంట్రాక్టర్ కాసుల కక్కుర్తిని తిట్టి పోసింది. 
 
          ఒంటరి నడక నడిచే వారికి ఆపద సమయంలో ఆత్మీయంగా భుజం తట్టే మనిషి తోడు ఎంత భరోసా ఇస్తుందో, స్థైర్యాన్ని నింపుతుందో అనుభవపూర్వకంగా అర్ధం చేసుకుంది రామవ్వ. 
 
          ఒక వయసు వచ్చాక ఎవరో ఒకరు తోడు ఉండాలి. అన్ని రోజులు ఒక్కలాగే ఉండవు. కనీసం మంచినీళ్లు ఇచ్చేవాళ్లయినా ఉండాలి. నలుగురు పిల్లలున్నారు. వెళ్లి వాళ్లతో ఉండలేదు. వాళ్ళు వచ్చి తన దగ్గర ఉండలేరు. ఎవరి జీవితం వారిది. అయిన వాళ్లందరినీ ఒదిలి ఇక్కడ ఒక్కదానివే ఎందుకు అని పిల్లలు నిష్ఠురమాడతారు. ఇక్కడ శారీరకంగా ఒక్కదాన్నే అని వాళ్ళ భావన. కానీ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్లంతా చుట్టూ ఉన్నప్పటికీ మానసికంగా ఒంటరిని అని అనిపిస్తుంది. ఇక్కడ ఉంటే, నా ఇంట్లో నే నుంటే ఆ దారే వేరు. 
 
          కావేరికి నేను ఆసరా, నాకు ఆమె ఆసరా. ఇద్దరి ఒంటరి తనం పోగొడుతూ పసిదాని ముద్దు మురిపాలు .. అనుకుంది రామవ్వ. ఈ ప్రాణం ఉన్నంత వరకు నలుగురికీ చేతనైన సహాయం చేస్తాను. అవసరంలో ఆ నలుగురిలో ఒకరైనా నాకు సాయం అవుతారు అని నమ్మే తన నమ్మకం వమ్ము పోలేదు అని కావేరి నిరూపించింది, అని అప్పటికి చాలా సార్లు  తలపోసింది రామవ్వ. 
 
***
 
          పాతికేళ్ళు పెంచి పెద్దచేసిన కన్నవాళ్ళ ప్రేమను ఎడంకాలితో తన్నేసి ప్రేమించిన వ్యక్తితో సహజీవనం చేస్తున్న యువతిని నమ్మివచ్చిన మగవాడు 35 ముక్కలు చేసి కాకులకు గద్దలకు ఆహారంగా వేశాడన్న వార్త చూసి వణికిపోయింది శోభ. ఏ ఛానల్ మార్చినా అదే వార్తను ఎవరికిష్టం వచ్చినట్లు వాళ్లు వండి వారుస్తున్నారు. అది మరింత భయంగొల్పుతూండగా టీవీ కట్టేసింది. అవసరమైన వార్తలు అసలు చూపరు. చూపినా మొక్కుబడిగా చూపుతారు. ఇలాంటి వార్తలకు మాత్రం మసాలా దట్టించి మళ్లీ మళ్లీ చూపుతారు ఇదేం ఆనందమో విసుక్కుంది.
 
          సహజీవనం చేయడం వల్లనే అటు వంటి పరిస్థితి దాపురించిందని ఒక మంత్రి అనడం, నేరస్థుడి మతాన్ని బట్టి నేరాన్ని చూడడం శోభకు అస్సలు నచ్చలేదు. బాధించింది. బాధితురాలిదే నేరం అన్నట్లు మాట్లాడడాన్ని ఆమె మనసు చాలా నొచ్చు కుంది.  
 
          ఏమిటీ.. ఈ సమాజం..
 
          మనిషిని మనిషిగా ఎందుకు చూడదు? కులం, మతం, జెండర్ కళ్లద్దాలలోంచే ఎందుకు చూస్తున్నది? 
 
          సహజీవనంలో ఉన్న కూతురు ఏ పరిస్థితిలో ఉన్నదో .. ఆమె మనసు పరిపరివిధాల ఆలోచిస్తున్నది. ఒక్కోసారి ఆందోళన, దిగులు .. మళ్ళీ అంతలోనే ధైర్యం .. తన కూతురు తెలివిగలది. పరిస్థితులు అంచనా వేయగలదు. ఎదుటివారిని తొంగి చూడగలదు. ఆమెకెప్పుడు అటువంటి పరిస్థితి రాదు. ఆమె అటార్నీ ..  అని ధైర్యం చెప్పుకుంది. కానీ, మనసు కూతురిని చూడాలని, మాట్లాడాలని తహ తహలాడింది.  ఫోన్ చేయనా అని ఊగిసలాట.. చేస్తే ఏంటమ్మా.. ఇందాకే కదా మాట్లాడుకున్నాం. నువ్వు మరీ చిన్నపిల్లలా మారిపోతున్నావ్. మరయితే వచ్చేయనా అంటుందని అప్పటికి మనసును అదిమి పెట్టుకుంది. 
 
          రేపు ఉదయం ఫోన్ చేస్తుందిగా అప్పుడు జంటగా రమ్మని చెప్పాలని నిర్ణయించుకుంది.

* * * * *

(మళ్ళీ కలుద్దాం )

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.