విజయవాటిక-17

చారిత్రాత్మక నవల

– సంధ్య యల్లాప్రగడ

అమరావతి – రాజమాత మందిరం

          ఇరువురూ ముందుగా రాజమందిరంలోని రాజమాతను దర్శించి ఆమె ఆశీస్సులు గ్రహించటానికి వెళ్ళారు.

          రాజమాత వారిని చూసి ఆశ్చర్యపోయింది. “ఇంత హడావిడిగా వివాహమేమిటి కారా?”  అడిగిందామె.

          “మల్లిక తొందర పడింది మాతా! అందుకే” అన్నాడు శ్రీకరుడు నవ్వుతూ.

          మహాదేవుడు కూడా నవ్వుతూ “మన కారుడు అదృష్టవంతుడు మాతా!” అన్నాడు.

          “బలే వారిరువురూ! సరే కానిమ్ము…” అంటూ, ఆమె వారిరువురి కోసమూ విందు ఏర్పాట్లు చెయ్యమని పురమాయించి, వారిని పరమేశ్వర సమక్షానికి తీసుకుపోయింది. 
అక్కడ అగ్నిహోత్రం జ్వలింపమని పురోహితులకు పురమాయించింది. వారు అగ్ని సాక్షిగా శ్రీకరునికీ, మల్లికావల్లికి శాస్త్రోక్తంగా మంగళసూత్రం కట్టించారు . అలా వేద పండితుల మంత్రాల మధ్య, మహదేవుని మందిరములో, రాజమాత సమక్షములో, శ్రీకరుడు వివాహం చేసుకున్నాడు. 

          ఆమె మల్లికకు ఒక హారము, రెండు కడియాలు కానుకగా ఇచ్చి, “మల్లికా! ఇవి నా పుట్టింటి నుంచి నాతో వచ్చిన వస్తువులలోనివి. ఇవి నా వంశములో వారికే ఇవ్వాలని ఉంచాను. కారుడు మా వంశములో ఉన్న వీరులలో ఉత్తముడు. అతని భార్యగా నీకు ఈ అర్హత ఉన్నదమ్మా!” అని చెప్పింది. 

          మల్లిక భక్తిగా వాటిని కళ్ళకద్దుకొని ధరించింది. తదనంతరం ఆనాటి సాయంత్రం విందు ఏర్పాటులో హరిక నృత్య ప్రదర్శన ఏర్పాటు చేశాడు మహాదేవవర్మ. 

          హరిక బృందం భువనమోహనంగా పార్వతీ- పరమశివుల కూమార సంభవము నాటకము ప్రదర్శించి రాజమాత అనుగ్రహం సంపాదించారు. విందు వేడుకల మధ్య ఆ రోజు రాజభవనంలో వారు సంతోషంలో మునిగారు. తదనంతరం శ్రీకరుని గృహానికి వచ్చిన మల్లికను పూలతో, హారతులతో స్వాగతించారు పరివారం. 

***

          శ్రీకరుడు వివాహవేడుకల తదనంతరం మల్లికతో తన భవనంలో స్థిరపడ్డాడు. 
ఆ నాడు ఆమెను అడిగాడు “మల్లికా! నీ మనస్సు నేడు నెమ్మదించినదా…”

          “ప్రభూ! ఆ అమరేశ్వరుని కృపన నా హృదయము ఆనందడోలికలాడుతున్నది. నా మనసు నెమ్మదించినది. మీరు ఇంతటి వారు కాబట్టి నాకు ఇంత ఆనందము లభ్యమైంది…” చెప్పిందామె. 

          “సఖీ! నీవిక అంత దుఃఖించకు. ఆనాటి నీ దుఃఖము నా హృదయాన్ని నలిపేసింది. నీవు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి…” చెప్పాడతను ప్రేమగా.
“మీ సమక్షంలో నాకు ఆనందము తప్ప మరో చింత లేదు…” అన్నదామె హాయిగా నవ్వుతూ. 


***

          విజయవాటికలో మహారాజు మాధవవర్మ దీర్ఘమైన ఆలోచనలో ఉన్నాడు.ఆ ముందు రోజే కళింగ నుంచి వారి మంత్రులు, దండనాయకుల బృందం వచ్చింది. వారు కలసి విందు చేసుకున్న తదనంతరం కళింగ రాజు సందేశం విన్నపించారు.

          “శ్రీ పర్వత స్వామి పాదకమలాసక్తుడు,

          త్రికూటమలయాధిపతి, 

          ఆంధ్రదేశ ముద్దుబిడ్డడు, భుజ బలోత్సాహి,

          పరాక్రమవంతుడు, విష్ణుకుండినుల వంశ మేలి వజ్రము…

మీకు జయము! జయము!!

          మీ విజయమును కోరుతూ, మీతో స్నేహమును వాంఛిస్తూ, మా కళింగాధీశుడు, ధీశాలి పరాక్రమవంతుడైన అనంతవర్మ మహారాజు మీకు పంపుతున్న సందేశము. 

          మీరు పంపిన సందేశము విని మా మహారాజు మిగుల సంతోషించినాడు. ఆయన తన ఆనందమును మా అందరితో పంచుకొని వేడుకలు జరిపారు. మీరు పంపిన రాజపుత్రుని చిత్రపటము మా రాజకుమారికి పంపి, జాతకము రాజగురువులకు పంపినారు. మా రాజగురువులు మీ కుమారుని జాతకము చూసి ఎంతో సంతోషించినారు. మా రాజకుమార్తె జాతకముతో జత కలిపి చూడగా, వివాహమునకు కనీసము ఒక సంవత్సర కాలము ఆగవలెనని రాజగురువుల సలహా. ఇద్దరి జాతకము బట్టి ఒక్క సంవత్సర కాలమాగిన వివాహము జరిపించ వచ్చని చెప్పినారు. ఇది విని వారు ఎంతో ఖేదపడి మీకా విషయము స్వయంగా తెలుపమని వారి ప్రియమిత్రుడును, ప్రధాన మంత్రి అయిన నన్ను పంపినారు. మీరు ఈ సందేశమును వారే స్వయంగా చెప్పినట్లుగా భావించి, ఒక్క సంవత్సరకాలము ఆగవలసినదిగా ప్రార్థన!” అని చెప్పి మంత్రి మిన్నకున్నాడు. 

          “రాజగురువులు మన క్షేమము ఆలోచించువారు తప్ప అన్యులు కారు.” మరొక మంత్రి అన్నాడు. 

          మాధవవర్మ తల ఊపాడు. ఆలోచనగా చూస్తూ, వారిని తమ ఆతిథ్యము స్వీకరించి వెళ్ళమని కోరి తన ఆంతరంగిక మంటపానికి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కళింగరాజు ఎత్తులేమిటాయని ఆలోచనలో ఉండిపోయాడు. కళింగ మంత్రుల బృందం అనాటి సాయంత్రం బయలుదేరి కళింగకు వెళ్ళిపోయింది. 

***

          రాజకుమారుడు మహాదేవవర్మ విలాసమందిరంలో ఉన్నాడు. అతను ఈ మధ్య ఎక్కువగా విలాస మందిరానికే పరిమితమవుతున్నాడు. 

హరికా సుందరి అందమైన పట్టు చీర కట్టి, సురలోక భామినిలా అలంకరించుకొని ఉంది. ఆమె ఆ మందిరంలో మధ్యన నిలచి తన కాలి మువ్వలు  సవరించు కుంటున్నది. అది మధ్యాహ్నమైనా, మధిర త్రాగి మత్తెక్కిన కళ్ళతో ఉన్నాడు మహాదేవుడు.

          ఆమెను మత్తుగా చూస్తూ “ఇంకెంత సేపు హరికా? మొదలుపెట్టు నీ సుందర నాట్య కౌశలము. సురభామినీ! నీ వయ్యారము ముందు ఏ దేవీదేవతలూ నిలువలేరు… నిజం చెప్పు శాపవశమున నీవు మా భూలోకమొచ్చావా?  లేక నన్ను అనుగ్రహించ వచ్చావా?” అన్నాడు మైకంగా.

          ఆమె కిలకిలా నవ్వింది. 

          కొంత దూరంలో కూర్చున్న తన సంగీతకారుల వైపు చూసి సైగ చేసింది. వారు వాయిద్యాలు మొదలు పెట్టారు. ఆమె నాట్యం మొదలయింది. 

          ఈ మధ్య కాలములో మహాదేవునికి హరిక తప్ప మరో ధ్యాస లేకుండా పోయింది. రాచకార్యాలకు కబురు వస్తే అతను మంత్రులనే చూడమంటాడు. కాదంటే శ్రీకరునికి చెబుతాడు తప్ప పట్టించుకోవటం లేదు. 

          హరిక మీద ఉంచిన నిఘా మాత్రం శ్రీకరుడు తియ్యలేదు. 

          ఆ నాట్యము అలా కొనసాగుతూనే ఉంది. మహాదేవుడు మత్తులో పూర్తిగా మునిగాక ఆమె చేస్తున్న నృత్యమాపి నెమ్మదిగా బయటకు నడిచింది. ఆ మందిరం బయట ఉన్న తోటలో ఒక చోట కూర్చొని ఆలోచిస్తున్నది. ఆమె ప్రక్కకు సరయు వచ్చి చేరింది. 

          “మనమిలా బంధీలమైయినామేమి?” అన్నది దిగులుగా.

          “చూద్దాం. శివరాత్రి తరువాత మనలని మన దేశము పోవచ్చునన్నారు కదా!”

          “నిన్ను మహారాజు ఎంతగానో ప్రేమిస్తున్నారుగా?”

          “ అయితే నేమి సరయు! మనలని వాడుకోవటము తప్ప అర్ధాంగిగా చేసుకోరుగా…”

          “ఏమో… ఈ దేశములో వేరేనేమోలే…”

          “ఎక్కడైనా ఒక్కటే, పిచ్చి సరయు!”

          “కాదే. ఆ శ్రీకర ప్రభువులు పెళ్ళాడినది కళావంతుల పిల్లని చెప్పినారు కదే!”

          “ఎవరే? ఆ మల్లికావల్లినా…” 

          “అవును!”

          “ఆనాడు మనము శివపార్వత లీలలను నాట్యమాడాము. రాజమాత కూడా ఉన్నది కదా…”

          “అవును. అప్పటి ఆ పెండ్లికూతురు ఈ దేశములోనే కళావంతుల పిల్లట.  శ్రీకర ప్రభువు ప్రేమించి పెళ్ళి చేసుకున్నారట. వారి వివాహము మహారాజులు కూడా సమ్మతించారట…”

          “అదృష్టవంతురాలు…”

          “అవును. ఆమె సౌందర్యము చూశావా. దేవకన్యలా ఉన్నది. నేను ఏ దేశ రాజకుమారినో అనుకున్నా…”

          “అవునవును. అయినా శ్రీకర ప్రభువు ధర్మవంతుడు. అందములో మాత్రము తక్కువా? మన్మథుని మించిన అందగాడు కదటే…”

          “నిన్ను మహాదేవ ప్రభువులు వివాహమాడుతాడేమో చూద్దాం…”

          “అనవసరపు ఆశ. అయినా మనమొచ్చిన పని ఏమిటి? మనము చేస్తున్నదేమిటే?” కొద్దిగా కోపం నటిస్తూ అన్నది హరిక.

          మాట అన్నది కాని ఆమె హృదయంలో అటు వంటి ఆశలేకపోలేదు. 

          ‘మహారాజులు నిజమైన ప్రేమనే చూపుతున్నారు అనుకోవాలో… లేక కాలక్షేప వ్యవహారమో తెలియటము లేదు… అడగాలి వారినే…’ అనుకున్నదామె.

          మహాదేవువర్మ ఆమెను ఎంతగానో ప్రేమించటం అందరూ గమనిస్తూనే ఉన్నారు. వీరి మాటలు పొదల చాటున వింటున్న వ్యక్తి మాయమయినాడు. 

***

          శ్రీకరునికి అందిన ఆ సమాచారంలో ఉన్న విషయం చూస్తున్నాడు…

          ‘ఈ నాట్యబృందం వచ్చిన పని ఏమి? మహాదేవుని పనుల నుంచి తప్పించటమా?’ ఆలోచనగా అనుకున్నాడు. పొంచి ఉన్న ప్రమాదం తెలియరాలేదు… అనుకుంటూ ఉండగా అతనికి రాజమాత వద్ద నుంచి కబురు వచ్చింది, వచ్చి కలవమని.

          శ్రీకరుడు ఆమెను కలవటానికి రాజమందిరం వైపు బయలుదేరాడు.

 * * * * *

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.