మా కథ (దొమితిలా చుంగారా)- 40

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

          1973 నుంచి మా సంఘం స్త్రీలం రైతాంగ స్త్రీలతో మమేకం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టాం. కాని మాకు అసలైన సమస్య ఇంకా దృఢమైన కార్మిక కర్షక మైత్రి ఏర్పడకపోవడంలో ఉన్నదని త్వరలోనే అర్థమైంది. ఒక విప్లవ శక్తిగా ఒకే వర్గంగా పనిచేసేటంత గాఢమైన మైత్రి వాళ్ళ మధ్య ఇంకా ఏర్పడలేదు. అంతేకాదు, కార్మిక-కర్షక ఒడంబడిక మీద పురుషులే సంతకాలు చేశారు గాని, స్త్రీలకు దాని సంగతే ఏమీ తెలియదు. కనుక మేం కొన్ని కార్యక్రమాలు చేపట్టాం. ప్రతిదాని మీదా అణచివేత సాగుతుండింది గనుక వాళ్ళ సంఘాన్ని ఏర్పాటుచేయలేకపోయాం. కాని మేం అప్పుడు ఆ చర్యలు చేసి ఉండకపోతే ప్రస్తుతం రైతు సంఘాన్ని అణచివెయ్యడానికి ప్రభుత్వం ఇంత కష్టపడే పరిస్థితి వచ్చేది కాదు. ప్రభుత్వం తప్పకుండా రైతాంగాన్ని తనవైపు ఆకర్షించుకుని తన ప్రయోజనాలు కాపాడడానికి పావుగా ఉపయోగించుకునేదే!

          ప్రభుత్వం రైతాంగం మీద కొన్నిసార్లు మహా భయంకరంగా విరుచుకుపడింది. 1974 జనవరిలో కొచబాంబా లోయలోని తొలాతాలో సైన్యం వందలాది రైతుల్ని ఊచకోత కోసింది. అప్పుడక్కడ ప్రభుత్వ ఆర్థిక చర్యలకు, ముఖ్యంగా తమను దెబ్బతీస్తున్న ఆర్థిక సంస్కరణలకు వ్యతిరేకంగా రైతాంగం ఆందోళన చేస్తూండింది. రోడ్లను మూసెయ్యడం సాగించింది. తిండి పదార్థాల పెరుగుదలను ఇంకెంతమాత్రమూ సహించలేమనీ, ప్రభుత్వం వెంటనే జవాబివ్వాలనీ రైతులు కోరారు. ప్రభుత్వం నిర్బంధంతో జవాబిచ్చింది. రైతుల మీదికి సైన్యాన్ని తోలింది. ఆ దారుణ మారణకాండలో వందలాది రైతులు ప్రాణాలు పోగొట్టుకున్నారు.

          బొలీవియన్ రైతాంగం ఇంకా కార్మికవర్గమంత శక్తిగా ఎదగలేదు. ఐతే ప్రభుత్వం కొమ్ముకాసే జాతీయ రైతాంగ సమాఖ్యకాక మరెన్నో రైతు సంఘాలున్నాయి. రెండు ఫ్రంట్ సంఘాలు – ఒక స్వతంత్ర రైతు సమాఖ్య. వలస సమాఖ్య అనబడే సంఘాలు కూడా ఉన్నాయి. ఈ వలస వచ్చిన వాళ్ళలో, లేదా ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ స్థిరపడిన వాళ్ళలో ఎక్కువమంది మాజీ గనిపనివాళ్ళే. వాళ్ళు జనాభా తక్కువగా ఉండే శాంతాక్రజ్, పోడో, బెని మొదలైన ప్రాంతాల్లో అడవులు సాగుచేస్తున్నారు.

          స్వతంత్ర రైతు సమాఖ్య దేశంలోని రైతులందరినీ ఏకం చేసింది. పొటొసికి ఉత్తరాన ఉన్న ఐదు రాష్ట్రాల్లోని రైతాంగం ఈ సమాఖ్యలోనే సంఘటితమయ్యారు. వాళ్ళే 1970లో సైగ్లో-20లో జరిగిన గని కార్మిక సమావేశంలో కార్మిక – కర్షక ఒడంబడిక పై మాతో కలిసి సంతకం చేశారు. వాళ్ళ నాయకులు కూడ ఎంతో మంది ఇతరులతో పాటు హింసించబడ్డారు.

          వాటి మధ్యన ఘర్షణల వల్లా, పోరాటాల వల్లా, నిర్బంధం వల్లా, హత్యాకాండల వల్లా బొలీవియన్ ప్రభుత్వమూ, కార్మికవర్గమూ కూడ చాల ప్రసిద్ధమయ్యాయి. కనుక ప్రస్తుత ప్రభుత్వం ఈ పేరును కొన్ని ఎత్తుగడల ద్వారా మార్చుకోదలచింది. నిజంగానే, కనీసం అధికారంలోకొచ్చిన మొదటి రోజుల్లోనైనా జనరల్ బన్ జెర్ గని కార్మికులతో గత ప్రభుత్వాల మాదిరిగా ప్రవర్తించలేదు, దానికి బదులుగా ఆయన మాకు ఆశలు చూపి, అవకాశాలు కలిపించి కొనెయ్యదలిచాడు.

          నా భర్తకు అప్పుడు నెలకు 1500 పిసోల జీతం వస్తుండేది. వాళ్ళు నాతో “నీ వర్గానికి నువు అంకితమయ్యే తీరు చూసి నీ మీద మాకు అపారమైన గౌరవం కలుగుతోంది. మేం, మిలిటరీ వాళ్ళం కూడ మీ పక్షం వహించదలుచుకున్నాం. నీ పట్ల గౌరవంతో, నువ్వింకా అభివృద్ధి కావాలనే కోర్కెతో మేం నీకు సాయపడదలచుకున్నాం. నీకు ఏ అడ్డంకులూ లేకుండా చేయదలచుకున్నాం” అన్నారు. ఇందుకు వాళ్ళు ప్రతిపాదించిందేమంటే లాపాలోని కొమిబొల్ గిడ్డంగుల్లో రెనెకు నెలకు 3000 పిళల జీతంతో ఉద్యోగం ఇస్తారు. నా పిల్లల చదువులకు స్కాలర్ షిప్ లు ఇస్తారు. నేను ఎదిగేందుకు వీలుగా చదువుకోదలచు కుంటే స్కాలర్షిప్ ఇస్తారు. వాళ్లు ఇలాంటి ప్రతిపాదనలు చాలా మంది మా వాళ్ళతో చేశారు.

          నేనివన్నీ తిరస్కరించాను. నా భర్త కొంచెం విచారంగా “ఇలా మోకాలడ్డం పెడితే ఎలా? నన్ను ప్రేమిస్తున్నానంటావు గాని ఎన్నడూ నా గురించి ఆలోచించనే ఆలోచించవు. నువ్వు తలచుకుంటే నన్నా ఘోరమైన గనిపని నుంచి బయటపడేయ గలవు. నువ్వు చేసిన పనులేవీ మనసులో పెట్టుకోకుండా వాళ్ళు నీకింత సాయం చేస్తామంటున్నారు గదా! ఎందుకొప్పుకోవు?” అన్నాడు.

          “నేను విశ్వాసాలకి కట్టుబడి ఉంటాను. నేనెవరినీ సంతోషపెట్టను. నామీదెవరూ జాలి చూపనవసరం లేదు. నేను చేసే పనిలో నాకు నమ్మకం ఉంది. నాకో ఆశయం ఉంది. నేను నా దారినెప్పుడో నిర్ణయించుకున్నాను. నేను నా చిన్నతనం నుంచీ ఏదైనా ఒక విషయాన్ని అంగీకరించి అదే సర్వస్వంగా బతకడం ఎంత అద్భుతమైన ఆనందాన్నిస్తుందో చవిచూశాను. ప్రజల విముక్తి కోసం పోరాడడం అవసరమని నేనొప్పుకున్నాను. ఇక అది చేసే క్రమంలో కొన్ని కష్టనష్టాలకి గురికాక తప్పదు. ఇప్పుడు వెళ్ళి మన జనాన్ని మూకుమ్మడిగా హత్యచేసిన వాళ్ళతో, మన వీథుల్లో నెత్తురు పారించిన వాళ్ళతో, నా కొడుకుని ‘పొట్టన పెట్టుకున్న వాళ్ళతో కలిసి పొమ్మంటావా? ఇప్పుడు పవిత్రులైనట్టు నీకేదో ఉద్యోగం ఇస్తామన్నంత మాత్రాన వాళ్ళతో కలిసి పోవలసిందేనా? నేనాపని చేయను. నేను నా విశ్వాసాలకు ద్రోహం చెయ్యను. నేను ఎన్నటికీ వాళ్ళ మిత్రబృందంలో చేరలేను. అడవి గుర్రాలు నన్ను తమతో జతకలుపుకో లేవు. నేనూ, నా కుటుంబమూ చావవలసి వచ్చినా సరే, వాళ్ళు కోరింది చెయ్యలేం. మనం అమ్ముడుపోలేం ….” అన్నాను.

          మనం మన కాళ్ళమీద నిలబడొద్దూ? అందుకే మనకో ఆదర్శం ఉంది. ఇప్పుడు నా బాగు చూసుకొని నా ప్రజాజీవితాన్నంతా శాశ్వతంగా నాశనం చేయలేను. నాయకురాలిగా నాకు కొన్ని బాధ్యతలున్నాయి. ప్రజావ్యతిరేకులతో కుమ్మక్కు కావడం క్షమించరాని నేరం. నా విషయంలో అది అనూహ్యం . నేనది చేయలేదు. ఎలాంటి స్థితిలోనైనా, తినడానికి తిండి లేనప్పుడూ, పిల్లలు రోగాన పడినప్పుడూ, ఎప్పుడైనా నేనందుకొప్పుకో లేదు. ప్రజలు మున్ముందుకు పోవడం కోసం ఎంతో మంది ప్రాణాలు కూడా బలి పెట్టవలసి వస్తుంది. అంతకంటే దగ్గరిదారి పరిష్కారాలేవీ నాకు నచ్చవు. ఇంకనేను ఈ దగ్గరిదారి పరిష్కారాలతో, అతుకులతో, సంస్కరణలతో విసుగెత్తిపోయాను. అట్లాగే, నేనూ నా బిడ్డలూ ‘ఏలినవారి దయ’ వల్ల సుఖంగా గడపడం నేను ఊహించలేను. అదే సమయంలో చుట్టూరా అశేష ప్రజానీకం ఎన్నెన్ని కడగండ్లు భరిస్తూ ఉంటుంది …!

          నేను చెప్పినవన్నీ నా భర్త కూడా నిజమేనన్నాడు.

          నేను ఆంతరంగిక మంత్రిత్వ శాఖలో పనిచేయడానికి ఒప్పుకున్నట్టయితే ప్రభుత్వ చట్టాలు ఇంకా బాగా తెలుసుకోవడానికీ, వాటిని మార్చడానికి వీలుండేదని కొందరన్నారు. అది ప్రస్తుత ప్రభుత్వంలో సాధ్యమని నేననుకోను. నా విషయంలో మరొక సమస్య కూడా ఉంది. జనం అందరికీ నేనేమిటో తెలుసు. వాళ్ళెంతో మందికి నా పై విశ్వాసం ఉంది, వాళ్ళు నన్ను ఆంతరంగిక మంత్రిత్వ శాఖలో చూస్తే ఎంత దెబ్బతినేవారు? ఏదేమైనా నేనిప్పటికే ఒక పాత్ర వహించాను. మళ్ళీ మరొక పాత్ర తీసుకోవడం సరైంది కాదు. మీకు జనం గురించి తెలుసా? వాళ్లు ఒక నాయకుడి మీదనో, నాయకురాలిమీదనో పూర్తిగా విశ్వాసం ఉంచుతారు. ఆ నాయకులు తప్పటడుగు వేసిన మరుక్షణం నుంచి జనం వాళ్ళను నమ్మడం మానేస్తారు. అప్పుడిక వాళ్ళు నామీద మాత్రమే అపనమ్మకం ప్రకటించరు. మిగిలిన మహిళా మిత్రుల్నీ, అసలు గృహిణుల సంఘాన్ని అనుమానంగా చూస్తారు. “ఆ సంఘం ప్రజల పక్షం వహించేదనుకున్నాం. ఎంత ద్రోహం చేసింది! అసలు ఆడవాళ్ళ నెన్నడూ నమ్మగూడదు” అంటారు. “ఆవిడను ఎన్నడూ నమ్మకండి” అన్నా ఫరవాలేదుగాని వాళ్ళిక “స్త్రీలను నమ్మకండి, సంఘాన్ని నమ్మకండి, అన్ని కష్టాలనుభవించినా దొమితిలా కూడా ద్రోహం చేశాక మరెవరిని నమ్ముతాం? అందుకే సంఘంలో చేరకండి” అని ప్రచారం చేస్తారు.

          సరే – 1974 చాల నాటకీయంగా ముగిసింది. నవంబర్ 9న నియంత బన్ జెర్ ఒక చట్టం ప్రకటించాడు. దాని ప్రకారం అన్ని రాజకీయ పార్టీలనూ, అన్ని సంఘాలనూ, అన్ని కార్మిక సంస్థలనూ చట్టవ్యతిరేకమైనవిగా ప్రకటించాడు. 1980 వరకు దేశంలో ఎన్నికల ప్రసక్తి లేదని కూడా అన్నాడు. ఒక్క కలంపోటుతో జాతీయ శాసనాన్నే రద్దుచేశాడన్నమాట. అలాగే పౌరులందరూ విధిగా పాటించవలసిన పౌర సర్వీసుల చట్టం అనేదాన్ని కూడా ప్రవేశపెట్టాడు.

          ఈ నియంతృత్వ చర్యలకు కార్మికులు నిరసన తెలిపారు. సైగ్లో-20లో ఒక ప్రదర్శన జరిగింది. సైగ్లో-20లోనూ, హువానునిలోనూ పని ఆపేయబడింది. మా నాయకులు హువానుని వెళ్ళి తిరిగి రాగానే గని కార్మిక సమాఖ్య నాయకుడు కోకాను, యూనియన్ నాయకుడు బెర్నాలను పోలీసులు అరెస్టు చేశారు. బెర్నాలను జైలుకు పంపారు. కోకాను పెరాగ్వేలోని ఒక అనారోగ్యకరమైన ఒంటరి ప్రదేశానికి ప్రవాసం పంపారు. ఆయన కుటుంబం సైగ్లో-20లో దుర్భర దారిద్య్రంలో బతకాల్సి వచ్చింది. మరి వాళ్ళింట్లో ఇక సంపాదనాపరులెవరూ లేరు.

          ఖైదీలందరి పరిస్థితీ అదే. మా కుటుంబాలలో ఒకే ఒక్క సంపాదనాపరుడుంటే అతణ్ణి సర్కారు అరెస్టు చేస్తుంది. వాళ్ళు అరెస్టయిపోయాక ఇక తిండికి తెచ్చే వాళ్ళెవరూ లేక కుటుంబం ఆకలికి మాడిపోతుంది. చిన్నాభిన్నమై పోతుంది. పేదరికంలో మగ్గిపోతుంది. మరో మాటల్లో చెప్పాలంటే బొలీవియన్ ప్రభుత్వం పురుషుల మీద అమలు చేసే నిర్బంధం కుటుంబాన్నంతటినీ ఆర్థిక, ఆరోగ్య, తదితర సమస్య లెన్నింటికో గురిచేస్తుంది. గని కార్మికుడు అరెస్టయ్యాడంటే అతని ఉద్యోగం పోయినట్టే. అంటే అతని కుటుంబానికి వైద్య సౌకర్యాలు దొరకవు. మరే హక్కులూ ఉండవు. కనుకనే ప్రభుత్వ నిర్బంధం అతని ఒక్కనితోనే ఆగిపోదు. కుటుంబాన్నంతటినీ చుట్టుముడు తుంది.

          మరొక ముఖ్యమైన సమస్య పిల్లలది. వాళ్ళు తండ్రికో, తల్లికో మాలిమి అయి ఉంటారు. అకస్మాత్తుగా ఓరోజు నుంచి తల్లో, తండ్రో కనబడకపోవడమంటే …? ఇది వాళ్ళలో ఒక రకమైన మనస్తాపాన్ని కలిగించి, ఒక ప్రత్యేకమైన మనోవైకల్యాన్ని పెంచి మొండివాళ్ళుగా తయారుచేస్తుంది…… ఎంత అమానుషమైన నిర్బంధం ఇది!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.