మిట్ట మధ్యాహ్నపు మరణం- 16

– గౌరీ కృపానందన్

          దివ్య మాధవరావు వైపు చూస్తూ అన్నది. “చెప్పినట్లే వచ్చేసాను చూశారా?”

          డి.ఎస్.పి. దివ్యతో వచ్చిన రామకృష్ణను పరిశీలనగా చూశారు. మాధవరావు అన్నారు.

          “సార్! ఇతను మిస్టర్ రామకృష్ణ. దివ్య యొక్క… ఏంటమ్మా? కజిన్ బ్రదరా? బాయ్ ఫ్రెండా? ఎలా పరిచయం చెయ్యాలి ఇతన్ని?”

          “ఫ్రెండ్ సార్.” భయంగా చూస్తూ నవ్వింది.

          “సార్! నేను మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడగాలి” అన్నాడు రామకృష్ణ.

          “ప్రశ్న అడిగే ముందు  కూర్చోండి” అన్నారు డి.ఎస్.పి.

          కుర్చీ అంచులో కూర్చున్నట్లు కూర్చున్నాడు. తొందరలో ఉన్నాడా? లేకపోతే చంచల చిత్తుడా?

          “సార్! మూడు రోజులుగా నేనూ, దివ్య ఈ విషయం గురించి మాట్లాడి మాట్లాడి చాల కన్ఫ్యూస్ అయ్యాము. ఆఖరున నేను అన్నాను. పోలీసులు అరెస్ట్ చేస్తే చేసుకోనీ. మనం ఎందుకు భయపడాలి? మనం నేరం చేస్తేగా అన్నాను. ఏమంటారు సార్?”

          “నూటికి నూరు పాళ్ళు సరి. నేరం చేయని వాళ్ళు భయ పడాల్సిన అవసరం లేదు.”

          “మా మీద అనుమానం ఉందా మీకు?”

          “పోలీసు వాళ్ళకి అనుమానాలు అందరి మీదా ఉంటాయి.”

          “అంటే మమ్మల్ని సందేహిస్తున్నారా? ముఖ్యంగా నా మీద మీకు అనుమానం ఉందా?”

          “సరిగ్గా చెప్పలేం.”

          “సార్! అన్ని సార్లు చెప్పినా మీకు నమ్మకం లేదా?” అడిగింది దివ్య.

          “చూడమ్మా. జరిగినదంతా ఉన్నది ఉన్నట్లు చెబితే పోలీసులకి మేలు చేసిన వారవుతారు. సగం చెప్పి, సగం దాచిపెట్టడం వల్ల పరిస్థితులు దారుణంగా మారుతాయి. కేసు మిస్ లీడ్ అవుతుంది.”

          “సార్! నేను ఇంత వరకూ ఏదీ దాచలేదు.”

          “చూశారా. ఇది కూడా అబద్దమే. మిస్టర్ మీ పేరు ఏమిటి?”

          “రామకృష్ణ సార్.”

          “మిస్టర్ రామకృష్ణా! మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను.  మీరిద్దరూ ఇక్కడికి వచ్చింది ఒక అన్ అఫిషియల్ హనీమూన్ కోసం. అవునా?”

          దివ్య వెంటనే, “లేదు” అంది.

          రామకృష్ణ అన్నాడు. “నువ్వు ఉండు దివ్యా! సార్! మీరన్నది నిజమే. దాని కోసమే వచ్చాము.”

          “అలాగైతే మూర్తి, ఉమ స్టే చేసిన అదే హోటల్లో దిగడానికి కారణం?”

          ఇద్దరూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు.

          “ఇద్దరూ కలిసే ప్లాన్ చేశారా?”

          “దేనికి?”

          “మూర్తిని చంపడానికి.”

          “అయ్యయ్యో! లేదు సార్.”

          “మరి ఆ హోటల్లో దిగడానికి అసలు కారణం ఏమిటో చెప్పండి.”

          “చెప్పనా దివ్యా?”

          “వద్దు వద్దు” అంది దివ్య కలవర పడుతూ.

          “చూడు దివ్యా! మనం చెప్పక పోతే పరిస్థితులు తలక్రిందులవుతాయి. పోలీసులు మిస్ లీడ్ అవుతున్నారు.”

          “రామ్! మీరు చెప్పకండి. నేనే చెబుతాను.”

          మధ్యలో కల్పించు కున్నారు డి.ఎస్.పి. “ ఎవరైనా ఒకరు త్వరగా చెబితే మాకు ఉపయోగంగా ఉంటుంది.”

          “చెప్పేది పూర్తిగా నిజమై ఉండాలి.” అన్నారు మాధవరావు.

          దివ్య నేల చూపులు చూస్తూ, “సార్! నేనూ రామకృష్ణ పెళ్లి చేసుకోబోతున్నాము” అన్నది.

          “చేసుకోండి. మాకెటు వంటి అభ్యంతరం లేదు.”

          “దాని కోసం.. దానికోసం…” సగంలో ఆపేసి రామకృష్ణని చూసి సిగ్గుతో తల దించుకుంది.

          రామకృష్ణ కొనసాగించాడు. “సార్! మేమ్మిద్దరం ఆ హోటల్ గదిలో బస చేశాం.”

          “ఓ.కే. ఈ వివరాలు మాకు ముందే తెలుసు. మూర్తి చనిపోయినా ఆ రోజు ఉదయం మీరిద్దరూ ఏం చేశారు?”

           “వి వర్ హావింగ్ సెక్స్” అన్నాడు.

          ఇంగ్లీషులో చెబితే మన సభ్యత, సంస్కారం నశించి పోవు కాబోలు అనుకున్నారు మాధవరావు.

          మాధవరావు కళ్ళను నేరుగా చూసే ధైర్యం లేక ఇద్దరూ తల దించుకునే కూర్చున్నారు.

          “సార్! దానికి కారణం చెబితే మీరు ఆశ్చర్యపోవచ్చు.”

          “ఈ రోజుల్లో ఆడా మగా పెళ్లి కాక ముందే ఒకే గదిలో గడపడంలో ఆశ్చర్యం ఏముంది?” అన్నారు డి.ఎస్.పి.

          “దివ్యకి ఒక రకంగా కోపం! అందుకే అలా ప్రవర్తించింది.”

          “కోపం ఎవరి మీద?”

          “నన్ను కాదన్న ఆ మూర్తి మీద. పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి, ఆ తరువాత జాతకాలు కుదరలేదన్న కుంటి సాకులు చెప్పి… మై గాడ్! నాకు అప్పుడు వచ్చిన కోపానికి, ద్వేషానికి సంధర్బం దొరికితే అతన్ని చీల్చి చెండాడి ఉండేదాన్ని. అంతకు ముందే ఎవరో అతన్ని చంపేశారు.”

          “అందుకని?”

          “నాకూ పెళ్ళవుతుంది. భర్త దొరుకుతాడు. అతనిలాగే అదే హోటల్లో ఆ రోజే హనీమూన్ జరుపు కోవాలని పట్టుదల, ప్రతీకారం…”

          మాధవరావు డి.ఎస్.పి. వైపు చూసి నవ్వాడు. “అలాగా. కొంచం అడ్వాన్స్ గా జరుపుకున్నారు. అంతేనా?”

          “రామ్ నన్ను తప్పకుండా పెళ్లి చేసుకుంటాడు. చేసుకుంటావు కదూ రామ్?”

          “ష్యూర్ డార్లింగ్. సార్! ఇదీ జరిగింది. ముందే ఈ విషయం చెప్పి ఉండాల్సింది. అలా చెప్పక పోవడానికి కారణం మీకు తెలిసే ఉంటుంది. సిగ్గు పడ్డాము. ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఏర్పడింది. మూర్తి చనిపోయిన రోజు మేము రూమ్ లోనే ఉన్నాము.”

          “ఎప్పుడు రూమ్ నుంచి బైటికి వచ్చారు?”

          “సాయంత్రంగా.”

          “భోజనం?”

          “రూమ్ సర్వీస్ ద్వారా ఆర్డర్ చేసాము. మీరు కావాలంటే వెరిఫై చేసుకోవచ్చు. సాయంత్రంగా మాకు ఈ సంగతి తెలిసి, హాస్పిటల్ కి వెళ్లి చూసాను. ఈ హత్యకి మాకూ ఎటువంటి సంబంధమూ లేదు సార్.”

          మాధవరావు డి.ఎస్.పి. వైపు చూశారు.

          “పెళ్లి ఎప్పుడు?” అడిగారు డి.ఎస్.పి.

          “వచ్చే నెలలో.”

          “త్వరగా చేసుకోండి. లేకపోతే పదినెలలు ఆగాల్సి వస్తుంది.”

          “వి టుక్ కేర్.”

          “అవన్నీ మాకు తెలియాల్సిన అవసరం లేదు. మీరు చెప్పిన కారణం చాలా వింతగా ఉంది. కాని ఒక్కొక్క సారి నిజం కూడా  వినోదంగానే ఉంటుంది.”

          “ఇక మేము వెళ్ళవచ్చా సార్?”

          “చెన్నైలో మీ ఇంటి అడ్రస్ ఇచ్చారు  కదా. ఓ.కె. దివ్యా! మిమల్ని ఒక ప్రశ్న అడగనా?”

          “అడగండి సార్.”

          “మూర్తిని ఎవరు హత్య చేసి ఉంటారని అనుకుంటున్నారు?”

          “నాకు తెలియదు సార్” అంది దివ్య.

          వాళ్ళు వెళ్లి పోయాక డి.ఎస్.పి. అన్నారు. “విచిత్రమైన మనుషులు. బట్ వన్ థింగ్. మళ్ళీ మొదటికి వచ్చాము.”

          “అంతే సార్! ఆ హోటల్ సర్వర్ అయి ఉండొచ్చు.”

          “ఉండొచ్చు. అతని కాళ్ళను చూస్తే షూస్ రెగ్యులర్ గా వాడే మనిషిలా లేడు. అయినా అతనికి మోటివ్ ఏముంది?”

          “మోటివ్ దొరికితే హంతకుడిని పట్టుకోవచ్చు.”

          “అతని గదిలోని వస్తువులను సోదా చెయ్యండి. ఏదైనా దాచి పెట్టి ఉండొచ్చు.”

          “నాకు ఈ రామకృష్ణ మీద అనుమానం పూర్తిగా పోలేదు సార్.” అన్నాడు మాధవరావు.

          “కన్ఫ్యూస్ కాకండి. ఒక విధమైన కోపంతో ఈర్ష్యతో ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండుతో అదే హోటల్ గదిలో గడపడానికి వచ్చింది. అంతే. మణిని, ఆ అమ్మాయిని విచారణ జరిపారా?”

          “ఏ అమ్మాయి?”

          “మూర్తి భార్య.” డి.ఎస్. పి. అన్నారు.

          “ఛ… ఛ..”

          “మాధవ్!  ఆ అమ్మాయి ఉమ కూడా అనుమానితుల లిస్టు లో ఉంది. ఆ అమ్మాయే తన భర్తను హత్య చేసి, తరువాత రిపోర్ట్ చేసి ఉండకూడదా? ఆమె ఎలాంటి అమ్మాయి? ఏదైనా సైకిక్ కేస్ అయి ఉండొచ్చు. ఎంక్వయిరీ చేశారా మీరు?”

          “లేదు సార్.”

          “తెలుసుకోండి.”

          మాధవరావుకి ఉన్నట్టుండి విరక్తి కలిగింది. “ఎస్ సర్!” అని సల్యూట్ చేసి భారమైన మనసుతో జీప్ ఎక్కారు. కాస్త చిరాకుగా కూడా అనిపించింది. మళ్ళీ మొదటికి వచ్చింది కేసు. ఎక్కడో అసలు క్లూని వదిలేస్తున్నట్లు తోచింది. ఈ కేసులో మొత్తం ఎంత మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు?

          ఆఫీసుకు రాగానే టేబిల్ మీద ఆ రోజు పోస్టులో వచ్చిన ఉత్తరాలను చూశారు. గవర్నమెంట్ ముద్ర లేకుండా వచ్చిన ఆ కవర్ ప్రత్యేకంగా ఆకర్షించింది. వెంటనే విప్పి చూశారు.

          ఇనస్పెక్టర్ మాధవరావు గారికి,

          చనిపోయిన మా అన్నయ్య భార్య ఉమకి వచ్చిన  ఈ ఉత్తరాన్ని జతపరుస్తున్నాను. మీకు ఈ కేసులో కొంచమైనా ఉపయోగపడుతుందని పంపిస్తున్నాను. ఆచూకి ఏమైనా తెలిసిందా?

మీ విధేయుడు

ఆనంద్

          జత పరిచిన ఉత్తరాన్ని చదివారు.

          ‘జరిగిన దాన్ని మరిచి పొ. భగవంతుడు నిన్ను కాపాడుతాడు.” వెనకాల, “వస్తున్నాను” అని ఉంది.

          మాధవరావుకి కాస్త ఉత్సాహం ఏర్పడింది. టెలిఫోన్ తీసి డయల్ చేసి, “ఇనాం  దార్ ఉన్నారా?” అడిగాడు.

          ఆ ఉత్తరాన్ని పరిశీలనగా చూశారు. ఆకుపచ్చ సిరా! మాయా అన్నది ఒక వ్యక్తి పేరేనా? వస్తున్నాను! ఎవరి కోసం? ఆ అమ్మాయి కోసమా? చెన్నై పోలీసులకి ఈ అమ్మాయి గురించి హెచ్చరించాలి. ఒక వేళ ఈ ఉత్తరాన్ని ఆ అమ్మాయే తయారు చేసి ఉంటుందా? ఛ.. ఛ… విపరీతమైన ఊహ ఇది. కాని డి.ఎస్.పి. అన్నట్లు అందరినీ అనుమానించాలి, చనిపోయిన మూర్తిని  తప్ప.

          “ఇనాం దార్! నేను మాధవరావును. ఒక ఉత్తరం దొరికింది. హోటల్ మర్డర్ గుర్తుందా. ఉత్తరాన్ని మీకు పంపిస్తున్నాను. కాస్త అర్జంట్ గా ఎనాలిసిస్ చేసి రిపోర్ట్ ఇవ్వండి. ఇంతవరకూ ఏ క్లూ దొరకలేదు. ఒక నెగటివ్ ఉంది. దాన్ని కూడా పంపిస్తున్నాను. ఎన్లార్జ్ చేసి ఇవ్వండి. ఉండనా.”

***

          ఉమ టెలిఫోన్ రిసీవర్ ను యధాస్థానంలో ఉంచి బూత్ నుంచి బైటికి వచ్చింది.  మూర్తి యొక్క మేనేజర్ని కలుసుకోవాలనుకుంది. ఫోన్ చేసి సాయంత్రం నాలుగున్నరకి వస్తానని తెలియ చేసింది. ఆయన రమ్మని చెప్పిన తరువాత సాయంత్రం దాకా ఎలాగైనా టైం గడపాలని అనుకుంది. మౌంట్ రోడ్ లో ఉన్న హిగిన్ బాదమ్స్ కి వెళ్ళింది. పుస్తకాలను తిరగేస్తూ నిలబడింది. అప్పుడే అతన్ని చూసింది.

          రాకేష్! అతను ఉమను చూడలేదు. దగ్గిరికి వెళ్లి పలకరిద్దామా వద్దా అన్న సందిగ్ధతలో కొట్టు మిట్టాడుతూ ఉండగానే ఆమె కాళ్ళు అతని వైపు నడిచాయి. అప్పుడు అతను చేతిలో ఉన్న పుస్తకంలో మునిగిపోయి ఉన్నాడు. ఇంకా ఉమ వైపు చూడలేదు.

          దారికి అడ్డంగా వచ్చిన వ్యక్తిని చూసి, “ఎక్స్ క్యూజ్ మీ” అన్నది ఉమ. అప్పుడు తలెత్తి చూశాడు రాకేష్.

          “హలో! మీరా? వాట్ అ సర్ ప్రయిజ్! మీ కోసమే ఈ పుస్తకాన్ని చూస్తున్నాను.”

          అతను పుస్తకం అట్టను తిప్పి చూపించాడు. పుస్తకం పేరు “మాయా”

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.