ఒక్కొక్క పువ్వేసి-19

యిద్దరమొస్తే … యిల్లెట్ల!

-జూపాక సుభద్ర

          ఈ నెల (జనవరి) మూడో తేదీన ఆధునిక భారత మొదటి టీచర్, బాలికలు, అంటరాని వాళ్ళ కోసం మొట్టమొదటిగా పాఠశాలలు ఏర్పాటు చేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని చాలా రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు (ఎస్సీసెల్స్, బీసీసెల్స్) కమ్యునిస్టు పార్టీ ప్రజాసంఘాలు, మహిళా సంఘాలు, బహుజన సంఘాలు, టీచర్ సంఘాలు, ఎస్సీ సంఘాలు, బీసీ సంఘాలు, బహుజన సంఘాలు యిట్లా అనేక సంఘాలు, సంస్థలు జరుపుతున్నారు. వీళ్ళళ్లో కొన్ని బహుజన మహిళా సంఘాలు తప్ప మిగతా సంఘాల్లో మహిళలే కనిపించరు. సావిత్రిబాయి సంస్కరణ దృష్టి, ఆచరణ ఆమె జయంతులు జరిపే మగ సంఘాలకు కనిపించదు. కొన్ని సంఘాలు సరస్వతి ఫొటో, సావిత్రిబాయి ఫొటో పక్క పక్కన బెట్టి సావిత్రి బాయి పూలే జయంతిని చేస్తున్న వాళ్ళు కూడా బైల్దేరినారు. సరస్వతి అంటే చదువులకు తల్లి అని ప్రచారం చేసే వాళ్ళు ఆమె ఎవరికి చదువులు చెప్పింది, నా కూతురు అడిగినట్లు ఆమె ఏ పుస్తకాలు రాసి చదువుల తల్లయిందని చెప్పరు. అసలు చదువుకు సరస్వతికి వున్న సంబంధం కూడా మాట్లాడరు. యిదో పుక్కిడి పురాణ విశ్వాసం. కానీ సావిత్రిబాయికి ఆధునిక భారతదేశంలో ఒక ఘణనీయమైన చరిత్ర వుంది. ఆమె నెలకొల్పిన పాఠశాలలున్నాయి, ఆమె సంస్కరణలున్నాయి. ఆమె రాసిన గ్రంధాలున్నాయి. భక్తి వుంటే సరస్వతిని కొల్చు కోండి గానీ చదువుల తల్లి అని సావిత్రి బాయి ఫూలే పక్కన బెట్టి పూజ చేయడం సరికాదు.

          నేను సావిత్రి బాయి జయంతి సందర్భంగా మహిళా సంఘాలు బెట్టిన రెండు విూటింగులకు వెళ్లి ‘బహుజన (మగ) సంఘామ్ పెద్ద ఎత్తున పెట్టిన సావిత్రి బాయి పూలే జయంతి మీటింగుకి పోలేక పొయిన. తర్వాత ఆ విూటింగ్ పెట్టిన అనేక నాయకుల్లో ఒక నాయకున్నడిగిన ఫోన్ చేసి ‘ మీటింగ్ ఎట్లా జరిగిందనీ, మహిళలు ఎంత మందొచ్చిండ్రని అడిగిన. ‘మీటింగ్ దూమ్ దామ్ గా సక్సెస్ అయింది, హాలు కిక్కిరిసి పొయిందన్నడు’ మహిళలెంత మందోచ్చిండ్రని మల్లా అడిగిన’, వచ్చిండ్రు అయిదారు గురు’ అన్నాడు. అదేంది మహిళలు లేకుండానే, రాకుండనే జరిగిన మీటింగు అందులో ఒక గొప్ప మహిళా సంస్కర్త మీటింగుకు మహిళలు పెద్ద ఎత్తున వస్తేనే గదా సక్సెస్ అనేది. మహిళలు రాని, లేని మీటింగ్ సక్సెస్ అని ఎట్లంటావు ? కిక్కిరిసి పోయిన హాలులో మహిళలు అయిదారుగురంటే ఆ మీటింగ్ సక్సెస్ అందామా! ఆడవాల్లనెందుకు తీస్కరారు, వచ్చేటట్లు మీ లాంటి లీడర్లు గూడ ప్రయత్నించకుంటే ఎట్లా!

          అదేంది ఇంట్ల నుంచి భార్య భర్తలొస్తే, యింటి సంసార మేంగావాలె. భార్య యింట్ల వుండి యిల్లు, పిల్లలు సంసారాన్ని చూస్కోవాలి” అన్నడు.

          “అదేంటి మీ లాంటి లీడర్లు గూడ యింత దారుణంగా ఆలోచిస్తే ఎట్లా!” మహిళల సామాజిక జీవితం, సామాజిక సర్వీసు సంస్కరణల భావాలు ఏం గావాలె! జ్యోతి రావ్ పూలే గూడ నీలాగ ఆలోచిస్తే– సావిత్రిబాయి బైటకొచ్చి మొదటి టీచర్ అయ్యేదా, పాఠశాలలు నెలకొల్పేదా! సామాజిక సంస్కర్త అయివుండేదా! దాదాపు 200 సం॥ల కిందనే జ్యోతి రావు పూలే అంత అద్భుతమైన జెండర్ సమన్యాయం, కోరుకుంటే- — ఈ నాటికి కూడా మీలాంటి వాల్లు యింత దారుణంగా మాట్లాడ్తుం డడము క్షమించరాని నేరం.” అన్నాను.

          ‘యివన్ని చెప్పనీకి బాగుంటయమ్మా చేయనీకి రాదు. నేం బైటికి చెప్పిన వేరే వాల్లు చెప్పరు గంతే తేడా.’ అన్నాడు.

          ‘ప్రతి భర్త తన భార్య రమాబాయి అంబేద్కర్ లాగుండాలని కోరుకుంటాడు గానీ సావిత్రి బాయి పూలే లాగ వుండాలని కోరుకోడు.’ అంటడు ఆ లీడరు. యిది పెద్ద ఎత్తున చర్చ జరగాల్సిన అంశమ్.

          రమాబాయి చిన్నప్పుడే బాల్యవివాహంతో అత్తవారింట అడుగుబెట్టింది. చదువు లేని పేద అంటరాని కులానికి చెందిన మహిళ. భర్త అంబేద్కర్ ఉన్నత చదువుల కోసం, ఆ చదువుల్ని భారతదేశ బాదిత సమూహాల జెండర్ సమాజాల విముక్తి కోసం పరిష్కార అన్వేషణలో భూగోళమంతా తిరుగుతున్నపుడు కుటుంబ భారాన్ని కూలి పనులు చేసి, పెండ తట్టలు మోసి తలకెత్తుకున్నది. కేవలం తన పిల్లల్నే కాక ఉమ్మడికుటుంబాన్ని పోషించింది. భర్త అంబేద్కర్ తన ఆర్థిక సామాజిక సవాళ్లను, సామాజిక ఉద్యమాల్లో తల మునకలై కుటుంబానికి దూరంగా వున్నా… అతని సామాజిక జీవితాన్ని రమాబాయి ఆటంకపర్చలేదు. పేదరికం ఉచ్చులో కుటుంబ వుచ్చులో చిక్కుకోని ఒక ఆధునిక భారత సామాజిక తత్వవేత్త కావడానికి కుటుంబాన్ని మోసిన త్యాగజీవి. ఆమె దుక్కాల పట్ల అసహాయతల పట్ల వ్యతిరేకతలో వున్నా ఏమి చేయలేని, ఏ సహకారం లేని దళితమహిళ. కటిక దారిద్య్రము అవిద్య, అంటరానితనాలు, ఆకలి అవమానాలు ఎదుర్కున్న దళిత మహిళ.

          ‘రమాబాయి కూలినాలి చేసి ఉమ్మడి కుటుంబాన్ని మోయడం వల్లనే నేను విదేశాలకు వెళ్లి చదువుకోవడానికి, సామాజికంగా ఎదగడానికి, ఉద్యమించడానికి భారత దేశ కుల సమాజమ్మీద పోరాడడానికి సాధ్యమైందని’ అంబేద్కర్ కూడా రమా బాయి చేసిన కుటుంబ సేవను, త్యాగాన్ని కొనియాడిండు, దుక్కపడిండు.మహిళలు చదువుకుంటే.. ఉద్యోగాలు చేస్తే, రాజకీయాల్లో వుంటే, లీడర్లుగా ఎదిగితే తమ చేయి ఎక్కడ దాటి పోతారోననే ఆధిపత్య మగ భావజాలంతో రమాబాయిని ఆదర్శంగా చూయించడం కొనియాడడం చేస్తున్నారు. అంటే.. మహిళలు పేదరికంతో, అంటరాని తనంతో చదువు లేకుండా కూలినాలి చేస్తూ — బతకాలని కోరుకోవడం దుర్మార్గం కదా!

          దళిత కులాల్లో యింటి పట్టునే వుండి కుటుంబాన్ని సమాళించే సంపదలుండవు. బైట కూలి నాలీ చేసి ఇంటికి పెద్దదిక్కుగా ఉండేది దళిత మహిళనే. భర్త బైటకుపొయి సంపాదించి తెస్తే.. యింట్లో వండి వార్చే జీవితాలు దళిత మహిళలకు లేవు. యీ దేశంలో దళిత మహిళ బతుకు చిత్రాలన్నీ యిట్లానే వున్నాయి.

          భారత రాజ్యాంగ నిర్మాత డా॥ బాబాసాహెబ్ అంబేద్కర్ భార్య రమాబాయి కూడా మినహాయింపు కాకపోవడం యీ భారతదేశ దళిత మహిళ విషాదం. అయితే రమాబాయి జీవితం పూలే జీవితానికి భిన్నమైంది. అన్ని సామాజిక మహిళలందరికి అవసరం, ఆదర్శం సావిత్రి బాయి పూలేనే.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.