బ్రేకింగ్ న్యూస్- పుస్తక సమీక్ష

   -డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి

“It’s not Magic that takes us to another world. It’s story telling”. అంటారు స్కాట్లాండ్కి చెందిన ప్రఖ్యాత రచయిత్రి ‘Val McDermid’. మానవ సమాజ చరిత్రలో కథ ప్రక్రియకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మానవ జీవితంలో కథ ఒక భాగమైంది, వర్తమాన కాలంలోని ఎంతో మంది తెలుగు కథా రచయితల సరసన దేశరాజు “బ్రేకింగ్ న్యూస్” కథల సంపుటి నిలువబడుతుంది.

                “బ్రేకింగ్ న్యూస్” కథా రచయిత అయిన దేశరాజు గురించి చాలా మంది వినే ఉంటారు, కవిగా, తన ముద్రను పాఠకుల హృదయాల్లో “ఒకే ఒక్క సామూహిక స్వప్నం” రచన ద్వారానూ, “దుర్గాపురం” రోడ్డు కవిత్వం ద్వారావేసి, జర్నలిస్టుగా తన సేవలు అందిస్తూనే పది కాలాలపాటు నిలిచే అద్భుతమైన కథలను “బ్రేకింగ్ న్యూస్” ద్వారా అందించి జనులకు దగ్గరై తెలుగు కథా సాహిత్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానం పొందాడని చెప్పవచ్చు. ఈ కథల సంపుటిలోని కథలు వాస్తవిక జీవితానికి చాలా దగ్గరగా ఉండి మనిషి వ్యక్తిత్వాని కి అద్దం పడతాయి.

                కథకుడు తన 18 కథలద్వారా సమాజంలోని ప్రామాణికతను రాబట్టి, తార్కికంగా వివేచించి, వాస్తవికంగా విశ్లేషించినాడని చెప్పవచ్చు. సమాజానికి మంచి చేయాలన్న కోణం నుంచి చూసి, మంచి వైపు మనల్ని నడిపించే కథలు రచించినాడు దేశరాజు. కథ లకు పేర్లు పెట్టే విషయం నుంచి కథకు తగ్గ చిత్రములు నిర్ణయించే వరకు, కథను ప్రారంభించడంలోనూ….  ముగించడంలోనూ తన మార్కును చూపించాడు. తన భావాలను వివిధ పాత్రల ద్వారా వ్యక్తీకరించి తన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని విశ్లేషిస్తూనే దాని లోని లోపాలను సవరించుకొని మార్చుకోవాలనే వినమ్రతతో కూడిన ప్రయత్నంలోని భాగమే ఈ కథలు.

                కథకుడు తన తొలి కథ “వాన ముద్దు” 22 నవంబర్ 1991లో ఆంధ్రజ్యోతి వార పత్రికలో ప్రచురింపబడినది. ఈ కథలో మాత్రమే గాంధీ, భారతి పాత్రల పేర్లను చూస్తాము, మిగతా కథలన్నింటిలో ఆమె, ఆయన, స్నేహితుడు, స్నేహితుడి భార్య, వారు, వీరు…….. అంటూ పాత్రనే పాత్రకు పేరుగా పెట్టి కథ చెప్పడం దేశరాజు ప్రత్యేక ప్రక్రియ అని చెప్పవచ్చు.

                ఈనాడు చవిటి నేలల్లోకి ఇంకిపోతున్న తెలుగు జీవన స్రవంతిని మాగాణంలోకి మళ్లించదలచే దిశగా ఆకాంక్ష కలిగి ఆగ్రహంతో, ఆవేశంతో, ఆలోచనతో తన కథల రచన ద్వారా జనులను జాగృతి పరచి జనహితం గావించిన రచయిత దేశరాజు. ఈనాడు సమాజంలోనూ, విద్యారంగంలోనూ, సాహిత్య సాంస్కృతిక రంగాల్లోనూ, దిగజారుతున్న ప్రమాణాలనూ, నేటి యువత పై స్వారీచేస్తున్న వాణిజ్య విలువలను అరికట్టడం బాధ్యతగా స్వీకరించి, సాహిత్య కర్తవ్యాన్ని విజ్ఞతతో నిర్వర్తిస్తూ నైతిక వికాసానికి నిర్వచనమే “బ్రేకింగ్ న్యూస్” కథల సంకలనం.

                రచయిత తన చుట్టూ జరిగే ప్రతి సంఘటనను తన జర్నలిస్టు చూపుతో ఎక్స్రే తీసి దానికి కొంత హాస్యాన్ని, మరికొంత శృంగారాన్ని, ఇంకొంత వాస్తవికతను జోడించి చెప్పిన కథలు పాఠకులను ఆకర్షిస్తాయి డిమానిటైజేషన్ జరిగిన సందర్భంలో సమాజం లో ఏర్పడిన అనేక విషయాల క్రోడీకరణ క్లుప్త రూపమే “డీహ్యూమనైజేషన్” కథ. ఈ కథ  చదివితే ఏటీఎం లైన్ లో నిలబడి ప్రాణాలు కోల్పోయిన తల్లి…. ఇది కట్టు కథ కాదు గాని కన్నీటిని పెట్టించే వ్యధ అని చెప్పవచ్చు.

                “ఫారమ్ కోడిపిల్ల” కథలో నేటి స్కూల్ పిల్లల స్థితి గతులను తెలుపుతూ తెలుగు మీడియం విద్యార్థి నాటి ఇంగ్లీష్ మీడియం వాడిని చూసి చిన్న బొచ్చుకున్నట్లు, నేటి ఇంగ్లీష్ మీడియం విద్యార్థి తెలుగు చదవలేక బిక్కుబిక్కు మనడం, ఆ విద్యార్థి ఎదుర్కొన్న సమస్యను వివరిస్తూ… చదువు విషయంలో వాడు పది ర్యాంకుల్లోనే ఉంటాడు, ఆన్లైన్ గేమ్లు ఆడడం, సినిమా టికెట్లు బుక్ చేసుకోవడం తప్ప లోకజ్ఞానం,  వ్యవహారిక జ్ఞానం బొత్తిగా లేక ఏ బస్సు ఎక్కాలో తెలియక, ఎక్కడికి వెళ్లాలో తెలియక, ఎక్కడ దిగాలో తెలియక కష్టపడే విద్యార్థి పాత్రను చిత్రీకరిస్తూ…, నేటి చదువులు ర్యాంకులకు ప్రాధాన్యత ఇస్తూ పిల్లలను అంధకారంలో ఉంచుతున్నారని తల్లిదండ్రు లకు, పాఠకులను ఆలోచన రేకెత్తే విధముగా ఈ కథలో వ్యక్తీకరిస్తాడు రచయిత.

                “బ్రేకింగ్ న్యూస్” కథలో భార్యాభర్తల మధ్య ఉన్న సంబంధాన్ని, వారి మధ్య ఉన్న అనురాగాన్ని తెలుపుతూ…”యముడి నుండి భర్త ప్రాణాలు కాపాడుకున్న సావిత్రిదే సాహసం అనుకుంటాం, కానీ ఎన్నో సాహసాలు చేస్తూ కాపురాలు నిలబెట్టుకుంటూ ఇంటింటా ఉన్న సావిత్రులను గుర్తించలేక పోతున్నాం” అన్న ఆవేదన వ్యక్తీకరిస్తాడు రచయిత.

                “ఆశల రెక్కలు” కథలో దేశాన్ని రక్షించే సైనికుడు, యుద్ధంలో కాలు కోల్పోయి ‘ప్రాణాలు పోయినా బాగుండేదనే’ నిస్సహాయక స్థితిలో ఒంటికాలితో ఎలా బతకాలనే ఆలోచనలను బద్దలు కొడుతూ…, బతకడానికి స్ఫూర్తినినింపి… ” బతుకు బతకడంలోనే ఉంది లేని వాటిని సాకుగా చూడడంలో దుఃఖమే ఉంది” అంటూ ఆశల రెక్కలు, ఆ సైనికునికి విప్పేలా చేసి, నిరాశలో ఉన్న వారికి కూడా ప్రాణం మీద ఆశ రెపరెపలాడించి కోర్కెల రెక్కలు తొడుగుతాడు రచయిత.

                “డబుల్ రోస్ట్” కథలో పురుషుల స్వభావాన్ని తెలుపుతూ…, నేటి మహిళలు చాకచక్యంగా వ్యవహరించే తీరును మహిళా పాత్ర ద్వారా తెలుపుతాడు.

” ఏం మీరు చెప్పకపోతే మాకు గుడ్ మార్నింగ్ కాదా?
మీరు గుడ్ నైట్ చెప్పకపోతే పడుకోమా?
కాస్తంత స్వేచ్ఛగా ఉంటే మా క్యారెక్టర్ ‘ అని అర్థమా?
మీ పెళ్ళాలు ఎలాంటి వాల్లో, మేం అలాంటోళ్లం కాదా?
అంటూ ఒకే దెబ్బకు రెండు పిట్టలు పాత మాట, ఒకే పిట్టకు రెండు దెబ్బలు తగలడంతో పురుష పాత్ర విలవిల్లాడిపోతాడు…,డబుల్ ట్విస్టులతో డబుల్ రోస్ట్ చేస్తుంది ఆస్త్రీమూర్తి.

                ‘టపటపలాడుతున్న రెక్కలు’ కథలో కూతుర్ని హాస్టల్లో చేర్పించి తండ్రి పడుతున్న ఆవేదన కనబడుతుంది. ‘అనేక అనేక బల్లులు, ఒకే ఒక్క ఫ్లాష్ బ్యాక్ ‘ కథలో మానవుని బల్లితో పోల్చి నేటి సమాజపు వాస్తవికతకు అద్దం పడుతుంది ఈ కథ. ‘దెయ్యాల పండుగ’ ఈ కథలో భార్యను చులకనగా చూసిన భర్తకు బుద్ధి చెప్తుంది భార్య పాత్రధారి. ‘చివరి నిర్ణయం’ కథలో వృద్ధాశ్రమాల గురించి, నేటి పరిస్థితుల్లో వాటిలో చేరడం తప్పు కాదని ఈ కథ ద్వారా తెలుపుతాడు రచయిత., :ఏది దారి?’ కథలో విద్యార్థుల ఒత్తిడి, తల్లిదండ్రుల ప్రయాస, ఒకవైపు చదువులు మరోవైపు నైపుణ్యాలు, తమ పిల్లలు సచిన్, ధోని, కోహ్లీ, సింధు, సానియా, విశ్వనాథ్ ఆనంద్….,  కావాలని ప్రయత్నించే తల్లి దండ్రుల స్థితి వివరిస్తాడు. ప్రతి కథ ఆణిముత్యమే వాటిలో ‘గృహమేగా స్వర్గసీమ’, ‘జ్ఞాన గుళికలు’, ‘అన్నయ్య రావాలి’, ‘నీకోసం నేను లేనూ’ … ఈ కథలన్నీ ఆ కోవకే చెందుతాయి.

                ఈ కథ సంకలనంలోని కథలు ముఖ్యంగా సాహసం, ఔదార్యం, నీతి, ధర్మం, శృంగారం, హాస్యం, రౌద్రం వంటి విషయాలు ప్రధాన వస్తువులుగా భావోద్వేగాలను వ్యక్తీకరిస్తూ కొత్త ఓరవడిని సృష్టించిన కథలు. బ్రేకింగ్ న్యూస్” కధలు. రచయిత కలం నుంచి మరిన్ని రచనలు రావాలని ఆకాంక్షిస్తూ…. , “బ్రేకింగ్ న్యూస్” రచయిత అయిన దేశరాజుకు డాక్టర్ చింతపల్లి ఉదయ జానకి లక్ష్మి అభినందనలు.

*****
Please follow and like us:

One thought on “బ్రేకింగ్ న్యూస్- పుస్తక సమీక్ష”

  1. దేశ రాజుగారు కథల గురించి విశ్లేషణ సమీక్షలు చాలా వివరంగా తెలియజేశారు డా. ఉదయ జానకి గారు. కృతజ్ఞతలు

Leave a Reply

Your email address will not be published.