ఇది ఏనాటి అనుబంధమో!

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-జానకీగిరిధర్

          బయట నుండి వస్తున్న తల్లిదండ్రులు భూమిక, శ్రీహరిలను చూడగానే, మూడేళ్ళ కార్తీక్ సంతోషంతో కేరింతలు కొడుతూ బుడి బుడి అడుగులు వేసుకుంటూ తల్లిని చేరుకున్నాడు.
 
          కార్తీక్ పరుగుని చూస్తూ ఎదురెళ్ళి ఎత్తుకుని ముద్దాడుతూ గుండెలకు హత్తుకుంది భూమిక.
         
          తల్లి ప్రేమ మాధుర్యాన్ని చవిచూస్తూ ఆనందంతో, భూమికని పెనవేసుకు పోయాడు కార్తీక్.
 
          అలా ఆ తల్లిబిడ్డల అనురాగం చూస్తూ… ఇంట్లో నుండి వీధి గుమ్మంలోకి  వస్తూ… 
          “ఆ…హా…! ఆ ప్రేమనంతా మీరే పంచేసుకోకండి. మాకు కొంచెం పంచండి అంది భూమిక అత్తగారు జానకమ్మ, 
 
          అత్తగారి మాటలలో, నడవడికలో ఏదో ఆంతర్యాన్ని గ్రహించిన భూమిక …..
కార్తీక్ ని ఎత్తుకుని ఆత్రంగా వీధి గుమ్మంలో నుండి ఇంట్లోకి పరుగులు తీసింది భూమిక.
 
          గదిలో….
అతిథి గా ఉన్న వసుంధరమ్మను చూడగానే భూమికకి ఆనందం, దుఃఖం ఒకే సమయంలో కలగలసి వచ్చేసాయి. 
         
          కార్తీక్ ని ఎత్తుకుని ఉన్న భూమికని చూసిన వసుంధర మనసు పరవశించి పోతోంది.
రెండేళ్ళ తర్వాత కలుసుకున్న భూమిక, వసుంధరమ్మలు ఒకరినొకరు చూపులుతోనే పలకరించుకున్నారు.
 
          ఒక్కోసారి మౌనమే ఎన్నో భావాలను పలికిస్తుంది.
“రా..రా…కన్నా! నీ కోసం ఎన్ని బొమ్మలు తెచ్చామో చూడు. మనం వెళ్ళి ఈ బొమ్మలతో ఆడుకుందామా” అంటూ, భూమిక భర్త  శ్రీహరి, భూమిక చేతుల్లో నుంచి కార్తీక్ ని బొమ్మలు చూపిస్తూ బయటకు తీసుకెళ్ళాడు.
 
          “మీరు మాట్లాడుతూ ఉండండి. భోజనానికి ఏర్పాట్లు నేను చూస్తాను” అంటూ… వంటగదిలోకి నడిచింది జానకమ్మ.
 
          “భూమిక!ఎలా ఉన్నావమ్మా!” అని వసుంధరమ్మ అడిగిన ప్రశ్నకు, భూమిక అమాంతంగా వసుంధరమ్మకు హత్తుకుపోయింది.
 
          “నాకు ఎంత మంచి జీవితాన్ని ఇచ్చావమ్మా!” కళ్ళలో నీళ్ళు చిప్పిల్లుతుండగా అంది భూమిక.
 
          భూమిక పరిష్వంగం ఆస్వాదిస్తూ  గతంలోకి జారుకుంది వసుంధరమ్మ.
 
***
          “భూమిక ! ఏమి చేస్తున్నావు? ఇంటి పని ఎప్పుడూ ఉండేదే కానీ, అబ్బాయి, నువ్వు కలసి సరదాగా బయటకు వెళ్ళిరండి” అంటూ, భూమిక చేస్తున్న పనిని ఆపించి, అక్కడ నుండి పంపించింది వసుంధరమ్మ.
 
          “నాన్నా!శివకుమార్!  సంవత్సరం పాటు అమెరికాలో ఉండి వచ్చావు. నువ్వు వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. నువ్వు ఈ కంప్యూటర్ తో, ఆ భూమిక వంటిట్లో…  ఇలా అయితే ఎలా ? కాసేపు ఇద్దరూ కలసి బయటకు వెళ్ళిరండి” అంటూ, కొడుకు శివకుమార్ కి చెప్పింది వసుంధరమ్మ.
 
          “అమ్మా! ఇక్కడ పనులు ఎంత త్వరగా ముగించుకుంటే, అంత త్వరగా నేను తిరిగి వెళ్ళడం అవుతుంది. ఇప్పుడు నాకు విసిగించకు. కావాలంటే మీ ఇద్దరూ కలిసి వెళ్ళిరండి”  అన్నాడు, శివకుమార్ అసహనంగా…
 
          “నువ్వు మళ్ళీ వెళ్ళడమేమిటిరా? అక్కడ కంపెనీలో నువ్వు చెయ్యాల్సిన పని ఒక సంవత్సరకాలమే కదా! ఇప్పుడు నువ్వు ఇక్కడ ఆఫీసులోనే కదా పని చెయ్యాల్సింది?” అని ఆరా తీసింది వసుంధరమ్మ.
 
          “లేదు, నే వెళ్ళిపోవాలి” అని ఖచ్చితంగా చెప్పాడు శివకుమార్.
 
          “ఏమంటున్నావురా? నీ మాటలు నాకేమీ అర్ధం కావటం లేదు” వసుంధరమ్మ  గొంతు తడబడింది.
 
          “అవును, నువ్వు విన్నది నిజం” నిదానంగా, తన పని చేసుకుంటూ చెప్పాడు శివ కుమార్.
 
          బయటకు వెళ్ళేందుకు సిద్ధపడి వచ్చిన భూమిక ఆ మాటలు విని “వద్దండీ! మమ్మల్ని వదిలి మీరెక్కడికీ వెళ్ళొద్దు. మీరు మాకు కావాలి. ఆ ఉద్యోగం కాకపోతే, ఇంకొకటి. ఏ చిన్న ఉద్యోగమైన చేసుకుని సంతోషంగా అందరం ఇక్కడే కలిసి ఉందాం. లేదంటే వేడినీళ్ళకు చన్నీళ్ళలా నేనూ ఓ చిన్న ఉద్యోగం చేస్తాను” అంది.
 
          “ఛీ… ఛీ… చిన్నాచితకా ఉద్యోగాలు చేసుకుంటూ గడిపేయడమేనా జీవితమంటే? పైకి ఎదగాలనే కోరికంటూ ఉండదా? చేతికందిన అవకాశాన్ని అందిపుచ్చుకుని, అభివృద్ధిలోకి రావాలి అది జీవితమంటే” మెరిసే కళ్ళతో అన్నాడు శివకుమార్.
 
          “మీ అమ్మ చేసిన ఆ చిన్న ఉద్యోగమే నిన్ను ఈ స్థాయికి తెచ్చిందిరా! ఇప్పుడు మనం సుఖంగానే ఉన్నాం కదా! కుటుంబానికి దూరంగా ఉంటూ ఎంత సంపాదిస్తే ఏమి లాభం? కాదూ కూడదూ అనుకుంటే, భూమికని కూడా నీతో తీసుకుని వెళ్ళు. వయసులో ఉన్న ఆలూమగలికి ముచ్చట్లు ఉండవా? ఇద్దరూ కలిసే ఉండండి” అంది శివకుమార్ తో వసుంధరమ్మ.
 
          “నేను భూమికని తీసుకుని వెళ్ళలేను” ఖచ్చితంగా  చెప్పాడు శివకుమార్.
 
          “అదే ఎందుకని?” ప్రశ్నించింది వసుంధరమ్మ.
 
          “నా ప్రతిభకు మెచ్చి, కొన్ని కంపెనీలకి యజమానిని చేస్తూ, ఆ ఇంటి అల్లుడుగా, కొన్ని కోట్ల ఆస్తులకి వారసున్ని చేసారు మా మామగారు” అంటూ, తను ఎంతో అభివృద్ధి సాధించిన వాడిగా విజయగర్వంతో తలెగరేసాడు.
 
          శివకుమార్ చెప్పిన విషయం విన్న భూమిక, వసుంధరమ్మలకి ఒక్కసారిగా కాళ్ళ క్రింద భూమి కంపించినట్లయ్యింది. సునామి వచ్చి, భూతలాన్ని చెల్లాచెదురు చేసి నట్టుగా… జీవితంలో ఆశలనే చెట్టుకొమ్మలు విరిగి, ఆనందాల చిగురుటాకులు నేలపాలు అయినట్లుగా మనసు విరిగి, గుండె పగిలి, కూలబడి పోయింది భూమిక.
 
          “సాటి ఆడదాని కష్టం, ఆడదానికే తెలుస్తుంది. భూమికకి అన్యాయం చెయ్యకు. భూమిక స్థానాన్ని మరొకరికి ఇచ్చి, నువ్వు ఎదగడం అది ఎదుగుదల కాదురా!  పరుల మేలు కోరుతూ, నువ్వు కష్టపడి ఎదిగిననాడే  నిజమైన అభివృద్ధి సాధించినట్లు. ‘తృప్తి కి మించిన సంతోషం లేదు’ రా!
 
          నిన్నే ఇష్టపడి, కన్నవారిని కాదనుకుని నీ ప్రేమకై వచ్చింది రా భూమిక. తనకి అన్యాయం చేయడం నీకు  తగదురా” అంటూ, ఆవేదనగా, ఎంతగానో నచ్చజెప్పే ప్రయత్నం  చేసింది వసుంధరమ్మ.
 
          ఎవరు ఎన్ని విధాలుగా ప్రయత్నించిన, డబ్బు పై వ్యామోహంతో బంధాలను  దూరం చేసుకుంటూ, మంచి లాయర్ ని పెట్టి త్వరగా విడాకులు పొంది భూమికతో సంబంధాన్ని తెగతెంపులు చేసుకుని వెళ్ళిపోయాడు శివకుమార్.
 
***
          శివకుమార్, భూమికలకు విడాకులు మంజూరైన రోజున…
 
          కొడుకు చేసిన గాయానికి, జీవశ్చవంలా మారిన భూమికను చూస్తూ…   “భగవంతుడు ఎంత నిర్దయుడు, నన్ను ఒక మూర్ఖుడుకి తల్లిని చేసాడు. నీ లాంటి ఒక ఉత్తమరాలుని నా కడుపున పుట్టించలేకపోయాడు” అంటూ, భూమికను ఓదార్చుతూ…. కన్నీరు మున్నీరైంది వసుంధరమ్మ.
 
          కొడుకు చేసిన అన్యాయానికి భూమికకి సరైన న్యాయం చెయ్యాలనే కసి, వసుంధరమ్మలో పెరిగింది. 
 
          “నా కడుపున పుట్టకపోతే నేమి? ఈనాటి నుండి నువ్వు నాకు కోడలివి కాదు. నాకు కూతురువి. ఏ బంధాలు జీవితానికి సుఖాన్ని ఇవ్వలేవన్నాడో? ఆ బంధాలు విలువలు చాలా గొప్పవని తెలిసేలా చేసి చూపిస్తాను. నా కూతురు జీవితానికి కొత్త వెలుగు తెస్తాను. నీకు కొత్తజీవితాన్ని ఇస్తాను” అంటూ, భూమికలో  ధైర్యాన్ని కలిగించి, తోడుగా నిలిచింది  వసుంధరమ్మ.
 
          “అమ్మా!” అని  పిలుస్తూ… వసుంధర గుండెలకు హత్తుకుపోయింది భూమిక.
 
***
          “ఏమిటి వసుంధరా! ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది. ఏడీ శివకుమార్? తీర్ధయాత్రలకి వెళ్లి ఈరోజే వచ్చాను. ఏమ్మా భూమికా! మీ ఆయన్ని ఎక్కడ దాచిపెట్టావు?” అని సరదాగా పలకరించింది  వసుంధరమ్మ స్నేహితురాలు,కస్తూరమ్మ. 
 
          కస్తూరమ్మ పలకరింపుతో భూమిక దుఃఖిస్తూ, తన గదిలోకి పరుగులు తీసింది
 
          “ఏమి జరిగింది వసూ? భూమిక అలా ఏడుస్తూ గదిలోకి వెళ్ళి పోయిందేమిటి? శివకుమార్ ఎక్కడా? చిన్నప్పుడు నా చేతుల్లోనే పెరిగాడు. ఎన్నాళ్లయిందో వాన్ని చూసి” అంది కస్తూరమ్మ. .
 
          “విదేశం వెళ్ళిపోయాడు” అంటూ, వస్తున్న కంటినీరుని ఆపుకుంటూ, చెప్పింది వసుంధరమ్మ.
 
          ఆశ్చర్యంగా, ఏమీ అర్థం కాని దానిలా వసుంధరమ్మ వైపు చూస్తుండి పోయింది కస్తూరమ్మ. 
 
          గుండెల్లో బాధ స్నేహితురాలకి  చెప్పుకుంటే తీరుతుందని, ఎంతో భావోద్వేగానికి గురై, కస్తూరమ్మకి మొత్తం జరిగిన విషయాన్ని వివరించింది వసుంధరమ్మ.
 
          అంతా విన్న కస్తూరమ్మ మనసు చలించిపోయింది. ప్రక్కగదిలో విమనస్కురాలై ఉన్న భూమిక దగ్గరకు వెళ్ళింది.
 
          “భూమికా !ఏమిటమ్మా ఇది! అందరిలోనూ ధైర్యాన్ని నింపే మా భూమేకేనా ఈ రోజు ఇలా దిగులుతో డీలా పడిపోయింది? సముద్రంలో అలలు ఎలాగో, జీవితంలో సమస్యలు అలాగే. ప్రతీ సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది. 
 
          ఆకులు రాలినంత మాత్రాన చెట్టు మోడుబారినట్లు కాదు కదా. కొత్త చిగుర్లు తొడగడానికని అర్థం. జీవితం కూడా అంతే. 
 
          ఎవరి వలనో ఏదో జరిగితే నీ కెందుకు శిక్ష పడాలి? నీ జీవితం వెన్నెల పంట  కావాలి. దాని కోసం పోరాటం చెయ్యి” అంటూ, ధైర్యాన్ని నూరిపోసింది.
 
          “కస్తూరి ఎక్కడ ఉన్న దాని పరిమళాన్ని పంచినట్లు, ఈ కస్తూరి తన స్నేహా పరిమళంతో  సంతోషాన్ని తెస్తుంది” అంది వసుంధరమ్మ.
 
          “పోవే నువ్వొకటీ నేనొకటీనా! సమయానికి తీర్ధయాత్రలలో ఉండిపోయాను, లేకపోతే శివని ఝాడించి వదిలి పెట్టేదాన్ని” అంది కస్తూరమ్మ.
 
          “మన చేతిలో ఏముందే? ఇది ఏ జన్మలో మేము చేసుకున్న పాపమో? అది సరేగానీ  జానకమ్మ ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది?” అని అడిగింది వసుంధరమ్మ.
 
          “ఏమి చెప్పమంటావు? అక్క జానకమ్మ ఆరోగ్యం ఏమీ బాగోలేదు. వయసు మీద పడింది. కోడలు లక్ష్మీ మగబిడ్డకు జన్మనిచ్చి, వీళ్ళ చేతులో పెట్టి కన్నుమూసింది. అది కొంత కృంగదీసింది. కొడుకు శ్రీహరి పై, మనవడు కార్తీక్ పై ఆ దిగులంతాను. ఆ వ్యధే అక్క గుండె నొప్పికి కారణమయ్యింది. 
 
          మన భూమికలాగే లక్ష్మీ లక్షణమైన పిల్ల. ఇంటిని చక్కగా సరిదిద్దుకునేది. లక్ష్మీ మరణంతో ఆ ఇంటికి ప్రశాంతత దూరమైంది” అంటూ విచారిస్తూ చెప్పింది కస్తూరమ్మ.
 
          భూమికని, లక్ష్మీతో పోలిక చేసిన మాటల్లో… వసుంధరకి ఓ ఆలోచన తట్టింది.
“భూమికని ఆ పసిబిడ్డకు అమ్మని చేస్తే! ఎలా ఉంటుంది?” అంది వసుంధరమ్మ
 
          వసుంధరమ్మ మాట, ఏదో మెరుపు, వేగంతో వచ్చి ముఖాన్ని తాకినట్టయ్యిన కస్తూరమ్మ, ఒక్కసారిగా ఉలిక్కిపడింది కస్తూరమ్మ.
 
          “ఏయ్ వసూ! ఏమంటున్నావు? భూమిక నీ కోడలు” అంటూ, అడిగింది కస్తూరమ్మ.
 
          “కస్తూరీ! ఇప్పుడు భూమిక నా కోడలు కాదు కూతురు. తనకో కొత్త జీవితాన్నిఇవ్వాలి” స్థిరంగా అంది వసుంధరమ్మ
 
***
          ఒక సుముహూర్తాన … పెద్దలందరి ఆశీస్సులతో భూమిక శ్రీహరిలు ఒకటయ్యారు.
 
          భూమిక తన ప్రేమతో కొత్త కుటుంబ సభ్యుల మనసు దోచుకుంది. భూమిక కార్తీక్ ల మధ్య బంధం బాగా బలపడిపోయింది.
 
          ఆ సంతోషం భూమికలో అలాగే నిలిచిపోవాలని తలచిన వసుంధరమ్మ ‘పాత జ్ఞాపకానికి తెరదించుతూ, భూమికని కలుసుకోవడం తగ్గించింది. 
 
          ఇదంతా… గమనించిన కస్తూరమ్మ “తల్లి దూరమైతే ఏ బిడ్డ ఆనందంగా ఉండ గలదు. నువ్వు ఇప్పుడు భూమిక తల్లివి. నీ కూతురికి నీ అండ ఎన్నటికీ అవసరమే” అంటూ, వసుంధరకు నచ్చజెప్పి, భూమిక దగ్గరకు తీసికెళ్ళెంది. 
 
***
          గతం నుండి తేరుకుని, భూమికని చూస్తూ మురిసిపోయింది వసుంధరమ్మ.
 
          “ఏమ్మా భూమికా! వైద్యులు దగ్గర నుండి వస్తున్నారు? ఏమన్నారు? ఏమైనా విశేషమా?” అని ఆతృతగా అడిగింది వసుంధరమ్మ.
 
          “కొద్దిపాటి నీరసానికి ఇంట్లో అంతా కంగారు పడి వైద్యులు దగ్గరకు తీసుకెళ్ళారు. అంతేనమ్మా!” అంటూ, చెప్పింది భూమిక.
 
          “……..” వసుంధరమ్మ.
 
          “అమ్మా! నా కంటూ సొంత సంతానం వద్దను కుంటున్నాను? మా కంటూ ఉన్న సంతానం కార్తీక్ మాత్రమే” అంటూ, వసుంధరమ్మ మౌనాన్ని గ్రహించిన భూమిక , తన మనసులోని మాటను తెలియజేసింది.
 
          “అదేమిటి భూమిక ! నీకు మాతృత్వం పొందాలనే ఆశలేదా? అని భూమికని ప్రశ్నించింది వసుంధరమ్మ.
 
          “అమ్మా! మోసే భారం, పురిటిబాధ లేకుండానే కార్తీక్ నన్ను అమ్మని చేసాడు.
కార్తీక్ కి జన్మనిచ్చింది ఆ తల్లైతే. వాడి ‘అమ్మా’ అనే పిలుపు నాకు సొంతమైంది. నా జీవితం కార్తీక్ రాకతో నిండుపున్నమిలా మారింది. నా ఈ సంతోషం వాడితోనే. రేపు నిజంగా నాకు సంతానం కలిగి, నా పర బేధబావం నాలో మొదలై, నేను స్వార్థపరురాలిగా మారితే… అమ్మో! అది నా ఊహల్లో కూడా రానివ్వలేను.
 
          నాకు నా సంతానంగా కార్తీక్ చాలు. కంటేనే అమ్మ కాదమ్మా! కడుపు తీపి ఉండాలి అంతే. అదే మీ నుండి నేను నేర్చుకున్నది” అంటూ సజల నేత్రాలతో ఆమె పాదాలు స్పృశించింది భూమిక.

*****

Please follow and like us:

One thought on “ఇది ఏనాటి అనుబంధమో! (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)”

Leave a Reply

Your email address will not be published.