ఈజిప్టు పర్యటన – 3

-సుశీల నాగరాజ

         మూడవరోజు బస్సులో 225 కిలో మీటర్ల దూరంలో ఉన్న అలెగ్సాండ్రియాకు  బయలుదేరాము.

         అలెక్సాండర్ , ది గ్రేట్ 331 BC లో స్థాపించిన నగరం! ఈజిప్టులో అలెక్సాండ్రియాను ‘మెడిటరేనియన్ ముత్యం’ అనికూడా అంటారు. చారిత్రకంగా ముఖ్యమైన పర్యాటక ప్రదేశం! ! 

         ఇక్కడ మెడిటరేనియన్ సముద్రం చూడగానే మనసు పొంగిపోతుంది. ఎంత చరిత్ర! ప్రాచీనకాలంలో చరిత్ర ఎక్కువగా ఈ సముద్రం చుట్టూ తిరుగుతుంది. అట్లాంటిక్ సాగరంతో జిబ్రాల్టరు జల సంధి కలుపుతుంది. ప్రాచీనకాలంలో వ్యాపారానికి , ప్రయాణికులకు ఇదే  ప్రముఖమైన మార్గం. అనేక ప్రాచీన నాగరికతలు దీని చుట్టూ ఉద్భవించాయి. ఇప్పటికీ ఈ సముద్రం ప్రాముఖ్యతను సంతరించుకొనే ఉంది. యూరోపు, ఆఫ్రికా, ఆసియా దేశాల సరహద్దులు కలిగి ఉంది ఈ సముద్రం మెడిటరేనియన్ సముద్రం! 

         అలెక్సాండ్రియా నగరం గ్రీకు పాలనకు, ప్రతిష్ఠకు తార్కాణంగా నిలిచిఉంది.   విద్యకు, సాంస్కృతికి ఈ నగరం కేంద్రం! ఇక్కడి గ్రంథాలయం ‘ The Great Library of Alexandria’ జ్ఞానానికి , అభ్యసించటానికి రాజధాని. పరిశోధనలకు ఎనలేని ప్రోత్సాహం!  ఎంతో ఆధునికమైన పద్ధతిలో పనులు నిర్వహిస్తున్న గ్రంధాలయం!

         పాపైరస్ చెట్ల నుంచి కాగితం తయారీకి వీరు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

         విరివిగా పెరిగే ఈ మొక్క రాయడానికి పనికొచ్చే కాగితం తయారీకి మాత్రమే కాకుండా, తాళ్ళు అల్లడానికి, పడవల తయారీలకి కూడా ఉపయోగిస్తారు. ఆ పేపరు తయారుచేసే కర్మాగారానికి వెళ్ళి చూశాము.

         నాలుగవ రోజు తెల్లవారుజాము 4 గంటలకు హోటలు నుంచి బయలుదేరి విమానంలో అస్వానుకు వచ్చాము. విమానాశ్రయం నుంచీనే AC బస్సులో అస్వానులో హై డామ్, ఫిలే టెంపల్ , అసంపూర్తిగా ఉన్న స్థంబాలను (unfinished obelisque )  చూశాము.

         అస్వాన్‌ సిటీలోని ఆనకట్టను ‘హై డ్యామ్‌’ అని పిలుస్తారు. ఇది ఈజిప్టులో  నైలునది పై నిర్మించిన ఆనకట్ట. చేయూతనిచ్చిన  యు ఎస్ ఎస్ ఆర్ అరబ్బు రాష్ట్రాల స్నేహానికి చిహ్నంగా తామరపూవు ఆకారంలో స్థూపం నిలువెత్తుగా నిలిచిఉంది.  ఈ హై డ్యామును 1960 మరియు 1970 మధ్య నిర్మించారు. ఈ డ్యాము ఈజిప్ట్ యొక్క ఆర్థిక వ్యవస్థ , సంస్కృతి పై  చాలా ప్రభావం కలిగి ఉంది.

         ఫిలే దేవాలయం ద్వీపంలో ఉంది. ప్రవాహం వలన చాలా వరకు నాశనమై పోయింది. మిగిలిన అవశేషాలను యునెస్కో సంరక్షించింది. ప్రముఖ దేవాలయం ఐసిరిస్ కు , మిగిలినవి చిన్న దేవాలయాలు ఇతర విగ్రహాలకు ప్రత్యేకించి నిర్మించారు. ఇవన్నీ చూసుకొని భోజనం చేసుకొని ‘నైలు నౌక కు’ ( Nile  Cruise) వెళ్ళాము. అందులో మూడురోజులు ఉన్నాము.

         ఐదవరోజు తెలవారుజామున 4 గంటలకు బయలుదేరి ‘అబు సింబల్ ‘కు చేరాము. అస్వాన్ నుండి ఎండ ప్రారంభమైంది. త్వరగా అలసిపోయేవాళ్ళము.

         అస్వాన్ కు 240 కి.మి.దూరంలో సూడాన్ కు సరిహద్దులో అబు సింబల్ దేవాలయం. యునెస్కో ‘నుబియన్ స్మారక కట్టడాలుగా ‘ ప్రకటించింది. కొండల్లో చెక్కిన జంట దేవాలయాలు ఇవి. 13 బి.సి శతమానంలో ఫరోవా రెండవ రాంసేస్ కాలంలో కట్టబడింది. ఖాదేష్ యుద్దంలో పొందిన విజయానికి చిహ్నంగా రాజు రాణీలకు కట్టిన  స్మారకం!  

         అబూ సింబెల్  దేవాలయాన్ని ( Temple of Abu Simbel)  TVలో  National Geographic Channel లో చాలా సార్లు చూశాను. ఆ వైభవం , ఆ భవ్యత  ఆ నిలువు  చూసి అబ్బురం , ఆశ్చర్యం ,ఆనందం !  

         ఇప్పుడు ఆ బృహదాకారపు విగ్రహాల ముందు కళ్ళప్పగించి నిలబడిపోయాను. వెలుపల ఉన్న ఆ  విగ్రహాలు దిగ్గజాలు.

         వరదలు, భూకంపాల కారణంగా ఇవన్నీ నాశనమయ్యాయని. వాటిని స్థానపల్లటం చేయటం పురాతన వస్తు సంగ్రహాలయం వారికి ఒక పెద్ద సవాలు. నదికి దూరంగా ఎత్తైన ప్రదేశానికి సాగించి పునఃప్రతిష్టించారు. ప్రవేశ ద్వారంలో కూర్చొన్న నాలుగు విగ్రహాలు మనసును అలాగే కట్టి పడేస్తాయి. అక్టోబరు 22  పిబ్రవరి 22 మొదటి  సూర్యునికిరణాలు ఆ విగ్రహాల పై పడటం ఖగోళ శాస్త్రం పై వారికున్న జ్ఞానం. ఆ రెండు రోజులు లక్షల సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తుంది. 21 వ తేదీ రాత్రే పర్యాటకులు అక్కడ చేరి  ఆ క్షణం కోసం కాచుకొని ఉంటారు. ఈ రెండూ రోజులు ఒకటి పుట్టినరోజు, రెండవది  కిరీటధారణ. 3 విగ్రహాల పై మాత్రం సూర్యకిరణాలు పడ్తుంది., నాలుగవ విగ్రహం భూగత ప్రపంచానికి సంబందించినది. ఎప్పుడూ చీకటిలోనే ఉంటుందట. ఆ విగ్రహం పై కిరణాలు పడవు .

         లోపలి ప్రదేశం త్రికోణాకారంలో అనేక గదులు , అనేక విగ్రహాలు, పెద్ద స్థంబాల ఆధారంతో నిలిచి ఉన్నాయి. గోడల పై యుద్దానికి సంబంధించినవి, సైనిక ప్రచారానికి సంబంధించిన దృశ్యాలు, ప్రముఖమైన దృశ్యం రాజు తన రథంలో నుంచి శత్రు సైన్యం పై బాణాలు వదులుతున్నది, దేవునికి అర్పిస్తున్న పూజలు.

         చిన్నదేవాలయం రాణికి అర్పించినది. ఇలాంటిది ఇక్కడే చూడగలం.

         కాటాకోంబు, రోమను థియేటరు , పాంపే పిల్లర్లు చూశాము. కాటాకోంబో రోమన్ల సమాధులు ఉన్న భూగర్భ ప్రదేశం. చాలా మెట్లుదిగి చూడాలి. అనేక సమాధులు, విగ్రహాలు, పురాతన వస్తు శాస్త్రానికి సంబంధించిన వస్తువులు చూడవచ్చు. చాలా కళాత్మకంగా కట్టారు. ఇందులో రాజుల గుర్రాల ఎముకలూ ఉన్నాయి. పెద్ద బండరాయిని తొలచి మూడు అంతస్తులతో కూడి ఉంది.. అంత్యక్రియల విందుహాలు ఉంది. రెండు పెద్ద శవపేటికలు.

         రోమన్ల ఆంఫి థియేటర్  ( Amphitheatre)  బయలు రంగమంటపం. అర్ధ చంద్రాకృతిలో ఉన్నది. ప్రముఖ కూడలిలో ఉన్నది. ఎన్నో గదులు, పాలరాతి ఆసనాలు. అన్నీ చాలా శిధిలావస్థలో ఉన్నాయి..

         పాంపే పిల్లరు రోమన్ల విజయోత్సవ స్తంభం! ఏకశిలా స్తంభం ! ప్రాచీన శిధిలాలలో ఇదీ ఒక్కటి. దీని ఎత్తు 20.46 మీటర్లు..బరువు 285 టన్నులు. ఇవన్నీ చూసి మళ్ళీ బస్సులో బయలుదేరాము.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.