ఓసారి ఆలోచిస్తే-6

పరిష్కారం

-డి.వి.రమణి

         మొబైల్ మోగుతూ ఉంది కాసేపటి తర్వాత మళ్ళీ అలా తీసే వరకు, చేతిలో పని పక్కకి నెట్టి … “హలో  “ అన్నాను
“…..”అటునించి ఎవరో సన్నగా ఏడుస్తున్నట్టు ఉంది..

         “ఎవరు” అన్నాను

         “నేనక్క హేమని”

         “ఏమైంది హేమా? ఇంటికి రా ముందు” గట్టిగా అన్నాను

         “అవటానికి ఏమి మిగల్లేదక్క నా తల రాత” వెక్కుతూ అంది

         “నువ్వు ఏమి కంగారు పడకు ముందు ఏడుపాపేయ్ …నువ్వు బయలుదేరు ఎలా ఉన్నదానివి అలా బయలుదేరు
…నేనేమి వినను ఫోన్ లో కాదు ” అన్నాను వస్తున్న కోపం ఆపుకుని.

         “అక్కా ,,,మరేమో” అంది చెప్పలేకపోతోంది

         “ ఫోన్లలో కాదు హేమ, వచ్చాక అలోచించి చూద్దాము ఏమి చెయ్యాలో” అన్నాను సాధ్యమైనంత సౌమ్యంగా. ఫోన్ పెట్టేసాను .లేకపోతే ఆపదు

         ఉదయం 10 గంటలంటే హేమ వచ్చేసరికి 11 అవుతుంది … ఈ లోపు ప్లే స్కూల్ నించి నా కొడుకు సూర్య వస్తాడు, వాడొస్తే ఓక్కపని కాదు, గబా గబా పని చేసేసుకున్నాను, రాత్రికి కూడా సరిపడా అన్ని రెడీ చేసి మరి, నాకు తెలుసు హేమ వస్తే తనకోసం టైం కేటాయించాలి కూడా …

         హేమ మాకు దూరపు బంధువులమ్మాయి తల్లిలేదు పినతల్లి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏది లేదు కానీ ఎదో దూరం, తండ్రి మెడికల్ రెప్రెసెంట్ జాబ్, సో కాంప్ లో ఉంటారు, హేమ తెలివైన అమ్మాయి చిన్నప్పటినించి నాకు చేరిక. సొంత అక్క లా చూసుకునే దాన్ని, అదివరకు మా ఇంటికి దగ్గరలో ఉండేవారు ఈ మధ్యలో పట్టాభిపురంలో ఇల్లు
కట్టుకుని వెళ్లిపోయారు హేమ వాళ్ళు. హేమ ఇంటర్ వరకు ఇక్కడే ఉన్నారు. లెక్కలు, సైన్స్, ఇంగ్లీష్ నేనే చెప్పేదాన్ని ఇంట్లో తిరుగుతుంటే బాగుండేది, మా ఇంట్లో అమ్మాయే అనుకునేవారు . మా వారు కూడా చాల అభిమానం గా చూసే వారు …

         ఇప్పుడు సమస్య ఏమిటి అదెంత తీవ్రమైనది తెలిస్తే గాని పరిష్కారం తెలీదు …
ఇంతలో కాలింగ్ బెల్ మోగింది … చాలారోజులైంది హేమని చూసి ఆనందంగా తలుపుతీసాను … బాగా చిక్కిపోయింది హేమ, చూస్తూనే హగ్ చేసుకుని,”ఏంట్రా తల్లి ఇలా చిక్కిపోయావ్?” అన్నాను.

         ఆ చల్లని పలకరింతకీ ఏడ్చేసింది …నేనే నడిపించుకుంటూ లోపలి తీసుకొచ్చి సోఫాలో కూచోబెట్టి మంచి నీళ్లు ఇచ్చి వీపురాస్తు ఉండిపోయాను. సంథింగ్ ఎదో జరిగింది అని, అర్ధం అవుతోంది, కానీ హేమని అలా చూళ్లేకపోతున్నాను .

         కాసేపటికీ ఆ తీవ్రత తగ్గింది … “ఉ …ఇప్పుడు చెప్పు ఏమైంది”  అన్నాను అనునయంగా.

         “అక్క .. నాకు చాలా బాధగా ఉంది ఏమి చెయ్యాలో తెలియట్లేదు ….టీచర్ ట్రైనింగ్ పూర్తి అయిపొయింది స్కూల్ లో చేరాను కూడా బాగానే ఉంది … నీకు తెలుసు కదా మధు తో ఇప్పటికి మూడేళ్ళ పరిచయం … మొదట బస్సులో, ఆ తర్వాత అప్పుడప్పుడు కలిసి మాట్లాడుకునేవాళ్ళం ఎంత ప్రేమగా ఉండేవాడో అక్క నీకు చెప్పాను కదా. మీ ఇంటికి కూడా తీసుకు వచ్చాను… త్వరలో పెళ్లి చేసుకుంటాము అని కానీ, మధుని నిన్న …. నిన్న …” .

అంటుంటేమళ్ళీ ఏడుపొచ్చేసింది హేమ కి…

         చాలా జాలి కలిగింది , చిన్న పిల్ల 22 ఏళ్ళు ఉంటాయి చదువు కొంచెం లేట్ అయింది ఇంట్లో చాలా వంటరిగాఉంటుంది …. వాళ్ళ పిన్నికి పిల్లలు లేరు ఆమెకి వాళ్ళ పుట్టింటివాళ్ల మీద తగని ప్రేమ. అన్నీ వాళ్ళ వాళ్లకి ఇస్తూ ఉంటుంది. అందరికి పేరుకు సాయం చేస్తూ ఉంటుంది. తన గురించి అంతా మంచిగా చెప్పుకోవాలి “ఏ గుడ్ హ్యూమన్ ఫోబియా ” అంటారు అది. ఆటోడ్రైవర్ అయినా పాలతనైనా, పచారీ షాప్ అతనైనా ,,, ఎవరు చూస్తున్న అంతా ఆమె ఎంత గొప్ప అనుకోవాలి! అంతే, దాన్లో పడిపోయి అసలు హేమని పట్టించుకోదు ఇంట్లో అన్నీ ఉంటాయి కానీ, పక్కనుండి వడ్డించటం ఆప్యాయంగా పలకరించడం ఉండదు. ఎవెర్నో ఇంటర్ లో ఉండగా ప్రేమించింది నేను చూసాను అతన్ని, సుమారుగా కూడా ఉండడు …ఆ పిల్లి కళ్ళతో ఏ కాంతి అనిపించక పోయిన, వదిలేసాను నవ్వొచ్చేదేమిటి అంటే హేమకి ఆ కళ్ళే ఇష్టం !!!! అట్ట్రాక్ట్ అయింది ఆ కళ్ళు చూసే …

         “చెప్పు హేమ నిన్న ఏమైంది”

         “నేను పిన్ని నాన్న సినిమాకెళ్ళాము … అక్కడకి … మధు ఇంకొకామె ఒక పాపా 4 ఏళ్ళ వయసుంటుంది వచ్చారు. పిన్ని నాన్న పక్కనున్నటం వల్ల వెళ్లి అడగలేక పోయాను, మేము వెనక వరసలో ఉన్నాము …

         అతనికి ఆల్రెడీ పెళ్లి అయిందా ? ఏమో ???? ఇదే సందేహం నిన్నటినించి. నాకెన్నో ఆశలు కల్పించి తన చుట్టూ తిప్పుకుని ఇంత మోసం ఎలా చేశాడా? అని..

         “అనే డౌట్ తో ఏడుస్తూ కూచున్నావా? ఎం ఎవరన్నా బంధువులతో రాకూడదా? ఎక్కడన్నావ్ వాళ్ళ ఇల్లు ?”

         “రైల్వే ట్రాక్స్ దగ్గర దిగిదాటి అటు ఫస్ట్ లైన్ లోకి వెళ్ళేవాడు … ఇంటికి ఎదురుగా అన్నపూర్ణ హోటల్ ఉందిట”

         “సరే పద కంఫర్మ్ చేసుకుందాము … లంచ్ చేసేసి, కాళ్ళు కడుక్కునిరా… టేబుల్ మీద అన్ని ఉన్నాయి …” అన్నాను

         ముందు కొంచెం తటపటాయించినా… లేచి భోజనానికి వచ్చింది , “ ఏమి తినాలని లేదు … ఆకలి లేదు రాధక్క”  అంది.

         “ఫర్లేదులే ఎంత ఆకలుంటే అంతే తిను బలవంతం చెయ్యనులే” అన్నా నవ్వుతూ.

         మేము తింటుంటే సూర్య వచ్చాడు “హేమ అత్త ఎప్పులోచ్చావ్ ,” నవ్వుతూ దగ్గర కొచ్చేసాడు

         “ముందు డ్రెస్ మార్చుకుని కాళ్ళు కడుక్కుని రా” గట్టిగ గదమాయించాను .

         వెంటనే బుద్దిగా చెప్పింది చేసి వచ్చి కూచుని కబుర్లు మొదలు పెట్టాడు. హేమ మూడ్ కొంచెం మారిందని గ్రహించాను., మా మేడ పోర్షన్ లో మా ఆడబొడుచు వాళ్ళుంటారు. సూర్య భోజనం కాగానే పైకి తీసుకువెళ్లి సాయంత్రానికి వస్తామని చెప్పి, ఓచ్చాను

         “మనం ఇలా వెళ్తే బాగుంటుందా ?” హేమ అడిగింది

         “భేషుగ్గా ఉంటుంది నిజాలు తెల్సుకోవాలి వాటంతట అవి తెలియవు పద” అని ,
… నేను హేమ ఆటో లో బయలుదేరాము దారంతా ధైర్యం చెప్తూనే ఉన్నాను.
మధ్యాహ్నం ఎండ చాలానే వేడిగా ఉంది హేమ చున్నీతో మొహం కవర్ చేసుకుంది చూసిన గుర్తు పట్టకుండా. నేనొక ఫైల్, ఒక సంచి జనాభా లెక్కలసేకరణ ఉద్యోగుల్లా బయలుదేరాము.

         వాళ్ళిల్లు తేలిగ్గానే గుర్తు పట్టాము, అతని పేరుంది బయట గేట్ దగ్గర, తలుపు తట్టకుండా అన్నపూర్ణ హోటల్లో కూచుని వెయిట్చేస్తున్నాము “హేమ వస్తాడా?” అని అడిగాను ,

         “ఆ రాధక్క అతను లంచ్ కి ఇంటికి వస్తాను అని చెప్పాడు” అంది.

         ఓపిగ్గా వెయిట్ చేస్తున్నాము. అతను స్కూటర్ మీద వచ్చాడు. లోపలికి వెళ్లి ఒక అరగంట తర్వాత బయటకి వచ్చాడు, అతని వెనకే ఒక యువతీ వచ్చి అతను వెళ్ళేదాకా ఉండి బై చెప్పి లోపలికి వెళ్ళింది, వాళ్ళిద్దర్నీ చూస్తే భార్య భర్త లాగానే ఉన్నారు .

         అతను వెళ్ళిపోయాక మేమిద్దరం నెమ్మదిగా వెళ్లి కాల్లింగ్ బెల్ కొట్టాము, ఆమె వచ్చి “ఎం కావాలి?” అంది.

         “జనాభా లెక్కలసేకరణ కోసం వచ్చాము బాగ ఎండగా ఉంది, లోపలికి వచ్చి మాట్లాడచ్చా” అనడిగాను. మర్యాదగా.

         “తప్పకుండా రండి” అని దారిచ్చింది … సౌమ్యంగా, అమాయకంగా ఉంది, జాలేసింది ఆ అమ్మాయిని చూస్తే, ఎలా మోసం చెయ్యాలనిపించింది అతనికి? హేమ అయితే ఫ్రిజ్ మీదున్న ఫోటో చూస్తోంది వాళ్ళ ఫామిలీ ఫోటో అది, భార్య భుజం చుట్టూ చెయ్యి వేసుకుని కూచుని ఉన్నాడు ఒళ్ళో పాపా చిన్నప్పటిదిలా ఉంది.

         “మీ పేరు వివరాలు చెప్పండి” నోట్ చేసుకుంటూ అడిగాను, అన్నీ ఓపిగ్గా చెప్తోంది …నా పేరు సుశీల , మా వారి పేరు మధుసూదన్ …ఎల్ .ఐ .సి. లో పని చేస్తారు …మేము విజయనగరం నించి వచ్చాము ……” అని చెప్పింది

         రాసుకున్న గాని వెళ్ళటల్లేదేమిటి? అని ఆశ్చర్యంగా చూస్తుంటే…

         చున్నీ తీసి పక్కన పడేసి …,”మీ ఆయనే కదు? నిన్నెంత మోసం చేస్తున్నాడో తెలుసా?” అని అరిచింది.

         “ఏంటి మీరనేది?” ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసుకుంటూ అడిగింది ఆమె.”మా ఆయన మోసం చెయ్యటమేమిటి?”

         నేను తన చేయిపట్టుకుని కూచోబెట్టి ,”చూడు సుశీల ….. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని 3 ఏళ్ళుగా వెంటపడుతున్నారు … అతని నిజం మనం బయట పెట్టాలి, నేను చెప్పేది అర్ధం చేసుకుని నాతో సహకరించు, ఆయనేమి చెప్పిన నమ్మకు అసలు అడగకు మేము మల్లి వస్తాము అతను ఇచ్చిన గ్రీటింగ్స్ ఇలా ఉన్నవన్నీ తీసుకుని ప్లీజ్ సాటి ఆడపిల్ల జీవితం ఇది ఇలా ఇంకొకరికి జరగ కూడదు…..” అంటూ మొదలు పెట్టి ఆ అమ్మాయికి అర్ధమయ్యే పరిభాషలో చెప్పాను నా తెలివంతా ఉపయోగించి … మర్నాడొస్తామని ఎట్టి పరిస్థితిలోను తెలిసినట్టు ఉండద్దని ఒట్టు వేయించుకుని …
ఏడుస్తున్న సుశీలని ఓదార్చి బయట పడ్డాము .

***

         ఈ రోజు శనివారం అయింది …. ఆదివారం వెళదామని మర్నాటికి పోస్టుపోన్చేసాము. ఇంటికెళ్తే ఉండలేదని, బాధ పడుతూ ఉంటుందని, నేనే ఆపేసాను “బాహుబలి -2” కి టిక్కెట్లు తెచ్చారు రవీంద్ర.

         రవీంద్రకి చెప్పాలి అనిపించలేదు, సో వాళ్ళ ఈ విషయం తాత్కలికంగా పక్కకి జరిగింది … శనివారం అయిపొయింది, ఆదివారం పొద్దున్నే రవీంద్ర ఫ్రెండ్స్ తో” అమరావతి” లో వాళ్ళ న్యూ ఆఫీస్ ఇన్స్పెక్షన్ కి వెళ్ళిపోయాడు.

         నేను, హేమ పది గంటలకల్లా వాళ్ళ ఇంటికి నేరుగా వెళ్ళిపోయాము … తలుపు తీసింది మధునే!!!

         ఏమాత్రం తొట్రుపాటు లేకుండా ,”సుశీ నీ కోసమెవరో వచ్చారు చూడు, చందాల కోసమేమో !” అంటూ లోపలికి దారిస్తే నేను స్టన్ అయిపోయాను. ఇంకా హేమ!!!! అలా చూస్తూ ఉండిపోయింది. నమ్మలేక.

         లోపలినించి వచ్చి వాళ్ళ అయన పక్కన కూచుంది కాలు మీద కాలేసుకుని,” ఏంటి నిన్నేదో చెప్పారు 8 ఏళ్ళుగా మేము కలిసి ఉన్నాము నా భర్త ఎలాంటి వాడో నాకు తెలీదా?? ఎవరో వచ్చి చెప్తే నమ్మేసేటంత మూర్ఖురాలిని కాదు … లక్షలు కట్నం ఇచ్చారు 30 ఎకరాల మాగాణి ఇల్లు ఫర్నిచర్ ఇంత కట్నకానుకలతో వచ్చాను మేము ఎప్పుడూ ఆనందంగానే ఉన్నాము. మీకు డబ్బు కావాలంటే అడుక్కోండి అంతే
గాని… ఇలా సంసారాల్లో చిచ్చు పెట్టకండి “ కోపంగా అంటోంది, దర్పంగా …గర్వంగా
అవేవి వినిపించటల్లేదు అతని వైపే చూస్తున్నాను, చూపు కలపకుండా పక్కలకి చూస్తున్న అతని స్వార్ధం మీద అసహ్యం వేసింది.

         హేమ షాక్ లో ఉండి పోయింది నేను లేచి చప్పట్లు కొట్టి ,” శెభాష్ మిస్టర్ మధు …ఇంతబాగా ఎలా నమ్మించావో భార్యని!!!! రియల్లీ గ్రేట్ … ఇలాంటి భార్యలున్నారు కాబట్టే మీ నిర్వాకాలు చెల్లుతున్నాయి.

         నిజమే మా స్త్రీ జాతిని అనాలి, ఎన్ని తరాలు మారినా అదే తప్పు అదే గుడ్డి నమ్మకం! నాలుగు కల్లబొల్లి మాటలు వినగానే ప్రేమ ముంచుకొస్తుంది సాటి ఆడదాని కష్టం కనపడదు …. 

         “మా పాప స్నిగ్ధ మీద ఒట్టేసి” అబద్ధం చెప్పరు, మా బావ అలాంటివాడు కాదు” అంది

         “మరి మేము అడగొద్దు అని మీకు చెప్పి మీకు నిజం నిరూపిద్దామని అడిగాము ఓట్టేశారు మరి మీరెందుకడిగారు” హేమ అడిగింది.

         “ఈ అమ్మాయి అతనికి తెలీదని మీ అమ్మాయి మీద ఒట్టు వేసి నిజం చెప్పమనండి” అన్నాను కోపంతో మనసు రగిలి పోతోంది అన్యాయాన్ని అపటమెలాగో తెలిటల్లేదు.

         పక్కనే కూచున్న పాప తల మీద చెయ్యి పెట్టించి, చూస్తున్నాను తీక్షణంగా …. హేమ వైపు చూస్తున్నాడు, ఏమనకుండా

         వెంటనే సుశీల ఆ చెయ్యి తీసేసి నెట్టేసి ,“ఏమిటి న్యూసెన్స్ పోలీస్ లని పిలుస్తాను నిజం తెలిసిపోతుంది”  అంది పెద్ద గో0తుకతో., “పిలవండి నేను రెడీ మీకు నెంబర్ కావాలా ఇదిగో నేనే కలిపి ఇస్తాను …” అన్నాను అతని చాతుర్యం అర్ధం అయి పోయింది “రాత్ గయి బాత్ గయి” అంటారు నేనేదో చెప్పబోతుంటే వారించి నా చెయ్యి పట్టుకుని బయటకి తీసుకు వచ్చేసింది ,”

         వొద్దు రాధక్క. వాళ్ళకి సిగ్గులేదు మర్యాద లేదు మానవత్వం లేదు… మనం ఆలా కాదుకదా? పద వెళ్లిపోదాము

         “గుమ్మదాకా వెళ్లి వెనక్కి చూస్తే అతని భుజం మీద తలవాల్చి నిలబడి ఉంది సుశీల …” ఆమె కళ్ళలో భావం నాకు అర్ధం కాలేదు అప్పుడు దానికి జవాబుకూడా ఒక 4 రోజుల్లో తెలుస్తుంది అని ఆ క్షణంలో నాకు తెలీదు .. .

         ఎదో ఉద్ధరిద్దామని …హేమని తీసుకు వెళ్ళాను … ఇలా జరుగుతుంది అనుకోలేదు…. బాధగా వెనక్కి వచ్చాము

         …. ఇంట్లో మా అన్న శంకరం వచ్చి ఉన్నాడు …, “హలో ఏంటి ఎక్కడికెళ్లారు?ఆదివారం కదా”  …ఇన్ .. ట్లో …..ఉం……టా రని …” మాట ఆగిపోయింది.

         హేమని నడిపించి లోపలి తీసుకొచ్చి, ఆగమని అన్నకి చెప్పి, మంచం మీద పడుక్కోబెట్టాను కుమిలి కుమిలి ఏడుస్తోంది …. “ ఎదో ఒకటి ఆలోచిద్దాము నువ్వు బాధ పడకు కాసేపు రెస్ట్ తీసుకో ఏడవకు ప్లీజ్ హేమా మేమంతా నీకున్నాము” అని బయటకొచ్చేసాను.

         “ఏమైంది రాధా , మన హేమ కదా అలా చిక్కి పోయింది …” అనడిగితే అంతా జరిగింది చెప్పి ఏమైనా సాయం చెయ్యాలి అనడిగాను.

         “ఇక్కడుంచొద్దు నేను తినుకునే వెళ్తాను, అలా వంటరిగా వదిలేయకూడదు ప్రమాదం. ఆ అమ్మాయి సర్టిఫికెట్స్ తీసుకుని రా రాత్రికె వెళ్ళిపోతాము. నేను చూసుకుంటాను. నాకు ఇద్దరూ మగ పిల్లలే. ఉమా కూడా ఏమీ అనదు, సాయం చేస్తుంది కూడా. మనవాళ్ళ స్కూల్ ఉంది. వనస్థలిపురంలో … ” అన్నాడు. నా చెయ్యి చేతిలోకి తీసుకుని …చాలా ఆనందం కలిగింది. హేమ కోసం నాలా అలోచించి సాయం చేసే అన్న
ఉన్నందుకు .

***

         ఎంత పక్కకి నెట్టినా ఆ అమ్మాయి అతని చూపులు అన్యాయంగా ఒక చిన్న పిల్లనెలా బాధ పెట్టాడా అని బాధ తొలుస్తూనే ఉంది.

         శంకరం అన్న హేమ వాళ్ళ ఇంటికెళ్లి, వాళ్ళ పిన్నిని ఒప్పించి ,హైదరాబాద్ తీసుకు వెళ్ళాడు రెండు రోజులైంది …

         పొద్దున్నే పని చేసుకుని సోఫాలో కూచుని రెండో కాఫీ తాగుతుంటే ఫోన్ మోగింది … అన్నోన్ నెంబర్ నించి … మధు ఏమో కాల్ తియ్యొద్దు అనుకున్నాను, అయినా ఏమి చెప్తాడోనని ఆన్ చేసి ‘హేల్లో” అన్నాను.

         “ రాధక్క దయచేసి ఫోన్ పెట్టేయకండి …నేను సుశీలని మీకు అసహ్యంగా ఉండి ఉంటుంది ఓపిగ్గా నేను చెప్పేది వినండి …. నాకు మీరు చెప్పిన దాని మీద, చెప్పినప్పుడే నమ్మకం కలిగింది … పాపం నాకన్నా 10 ఏళ్ళు చిన్నపిల్ల, ఆ అమ్మాయి మొహం చూస్తే చాలా బాధేసింది …. ” కొంచెం ఆగింది.

“… ” సీరియస్ గా వింటున్నాను …

         “మీ టైం ఎక్కువ తీసుకోను అక్క , ప్లీజ్ ఇది వినండి నేను కావాలనే అతన్ని సేవ్ చేసాను. నేను నిజమేమిటో ఎంక్వయిరీ చేయించాను. నిజం తెలిసింది. నాకు నిజం మీరు తెలియచేసిన ఏమి ప్రయోజనం?

         విడాకులు అడుగుతాడు… ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు నేను పుట్టింట్లో ఉండిపోతాను…గెలిచిన ఫీల్ తో ఉంటాడు కాలర్ ఎగరేసుకుని తిరుగుతూ ఉంటాడు
ఎట్టి పరిస్థితిలోను అతనికి ఆ అవకాశం ఇవ్వొద్దు అనుకున్నాను , అతనికి విడాకులివ్వను అతని దగ్గరుండను …

         నేను పుట్టింటికి వెళ్ళిపోతున్నాను నాకు మా నాన్నగారు కార్ పంపారు వొస్తుంది
పాపని తీసుకుని మరి వెళ్తున్నానక్క గుండె పగిలిపోయి ఒక్కణ్ణే ఉండనిద్దాము. ఆ అమ్మాయికి మా వారి తరుఫున సారీ చెప్పానని చెప్పండి. నేనలా చేయ్యటం వల్ల మధు మీద ఆసహ్యంతో వేరే పెళ్లి చేసుకోగలుగుతుంది. మంచి అబ్బాయిని చూసి పెళ్ళి చెయ్యండి నేనొస్తాను ఆ పెళ్ళికి …

         ఆలోచిస్తే నాకు తట్టింది ఇది … అతన్ని జన్మలో క్షమించను. కలిసి సంసారం చెయ్యను కన్నెపిల్ల ఉసురు పోసుకున్న ఎవరు సుఖ పడలేదు.. పడరు కూడా… మీకు నా థాంక్స్ ఇలా భ్రమలోంచి బయటకి తెచ్చినందుకు …..సెలవ్ “ ఫోన్ పెట్టేసింది ….
సుశీల”, ఎంత బాధ పడి ఉంటుందో అర్ధం అయింది …ఒక రకంగా మంచి పనే చేసింది …ఇదొక పరిష్కారం …సుశీల చూపించింది .

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.