కె.రామలక్ష్మికి నివాళిగా

-శీలా సుభద్రా దేవి

(ప్రముఖ రచయిత్రి కె.రామలక్ష్మిగారికి నెచ్చెలి నివాళి తెలియజేస్తూంది. ఈ సందర్భంగా వారి ఆత్మీయులు శీలా సుభద్రా దేవి గారు సమర్పిస్తున్న వ్యాసం-)

***

         రామలక్ష్మి గారిని ఒకసారి ఆవిడ కథల మీద వ్యాసం రాయాలనుకున్నది చెప్తే చాలా సంతోషపడి రెండు కథల పుస్తకాలు ఇచ్చారు. నేను రచయిత్రుల కథల గురించి రాయాలనుకున్నది, రాసినదీ కూడా మొదటి రామలక్ష్మి కథల గురించే. వ్యాసం చూపించేసరికి, బాగారాసాఓయ్ అని ప్రశంసించారు. స్వతంత్రలో మా పెద్దక్కయ్య పి.సరళాదేవి కూడా ఎక్కువ రోజులు చేయటం వలన రామలక్ష్మి గారికి నన్ను సరళాదేవి చెల్లెలుగా తెలుసు.

         మేము మలకపేటలో ఉన్నప్పుడు మా యింటికి దగ్గరలోనే ఉండేవారు. నేను తరుచూ కలిసేదాన్ని. వాళ్ళింటి క్రింద ఇంట్లో అబాకస్ టీచర్ ఉండేవారు. మా మనవరాలిని అక్కడకి తీసుకు వెళ్ళినప్పుడు ఒక గంట ఆమె దగ్గరకి వెళ్ళే దాన్ని. ఎన్నెన్ని కబుర్లో చెప్పేవారు.
           
         ఆమెకు పత్రికా రంగంలోనూ, సినిమారంగంలోను, సామాజిక సేవారంగంలోను, సాహిత్య రంగంలోనూ ఇలా రాజకీయరంగంలోను అనేక అనుభవాలు ఉండటం వలన అనర్గళంగా అవన్నీ చెప్పేవారు. ఎదురుగా ఉన్నవారికి కొన్ని విషయాలు నచ్చినా నచ్చక పోయినా ఆమె తన మనసులో మాటను, తన అభిప్రాయాన్ని చెప్పటానికి జంకరు. నిర్భయంగా ఉన్నది ఉన్నట్లు నిష్కర్షగా చెప్పకమానరు. అందుచేత కొంతమంది దూరమయ్యారు.
 
         ఒకసారి జూన్ నాలుగు ఆరుద్ర జన్మదిన సందర్భంగా ఆయన పుస్తకం ఆవిష్కరణ అని ఒక పదిహేను మంది రచయిత్రులను ఇంటికి పిలిచారు. తర్వాత కూడా మరో రెండు సార్లు ఒకరిద్దరు ఆత్మీయులతో కొన్ని గంటలు గడిపేవారు.
***
కె.రామలక్ష్మి కథలు – సమాజ ప్రతిరూపాలు
 
         శ్రీమతి కె.రామలక్ష్మిగారి రచనా ప్రస్థానం దాదాపు ఏడు దశాబ్దాలది. 1950-60లలో సాహిత్య రంగంలో ఆధునిక భావజాలం గల అతి తక్కువ మంది రచయిత్రులలో కె.రామలక్ష్మి ఒకరు. అప్పట్లో వచ్చే తెలుగు స్వతంత్ర, భారతి, గృహలక్ష్మి, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర మహిళ వంటి పత్రికలలో వీరి కథలు, వ్యాసాలు వంటి రచనలు విరివిగా వస్తుండేవి. ఆనాటి ఆభ్యుదయ భావాలు గల సాహితీవేత్తల పై స్త్రీ స్వేచ్ఛ అంశంతో రచనలు చేసే చలం ప్రభావం ఉండేది. అయితే చలం ప్రభావం గానీ, జీవిత భాగస్వామి అయిన ఆరుద్ర ప్రభావంగానీ రామలక్ష్మి పై లేదు.
 
         తొలి రోజుల్లో చాలా మందిలా ప్రేమకథలే రాసేదాన్నని చెప్తూనే కొడవటిగంటి, మల్లాది, పాలగుమ్మి పద్మరాజు వంటివారు ‘ఇటువంటివి ఎందుకు రాస్తావు? కాస్త విలువలు ఉన్న కథల పై దృష్టి పెట్టు’ అన్నారని అంటారు రామలక్ష్మి. ‘కొన్నాళ్ళ తర్వాత నువ్వు రాసిన వాటిని చదివి నువ్వే సిగ్గుపడకుండా ఉండగలిగే రచనలు రాయమన్న’ బైరాగి సలహాతో ఏది బడితే అది రాయడం మానుకున్నానని చెబుతారు రామలక్ష్మి.
 
         కె.రామలక్ష్మి 1950లలో ‘తెలుగు స్వతంత్ర’కు ఉప సంపాదకురాలిగానూ, ‘ఆంధ్ర మహిళ’కు సంపాదకురాలిగాను కొంతకాలం పనిచేశారు. ఆంధ్ర పత్రికలో ‘ఇది నారీ దృక్పధం’ పేరున శీర్షిక నడిపేవారు. అందులో అభ్యుదయ దృక్పధంతో మహిళా సమస్యలే కాక, రాజకీయ, సామాజిక సమస్యల పట్ల అవగాహన కల్పిస్తూ, ఒక్కోసారి ఆవేశ పూరితంగానే ఉన్నా సమస్య పట్ల స్పష్టమైన వైఖరిని వ్యక్తీకరించేవారు.
 
         చీకటి దారిలో చిన్న వదిన, ఆశకు సంకెళ్ళు, దేవుడులేని చోటు, కస్తూరి, ఈ తరం పిల్ల, నన్ను వెళ్ళిపోనీరా వంటి అనేక నవలలు, ఈ జీవికి స్వేచ్ఛ, అద్దం వంటి కథానికా సంపుటాలే కాక, తాళ్ళపాక వారి పలుకుబళ్ళు, ఆరుద్ర సినీ మినీ కబుర్లు వంటి గ్రంథాలు వెలువరించారు. ఇందులో ఆరుద్ర సినీ మినీ కబుర్లు గ్రంథానికి 2008లో సినిమాల పై వచ్చిన ఉత్తమ గ్రంథంగా ఆంధ్రప్రదేశ్‌ నంది అవార్డును అందుకున్నారు రామలక్ష్మి. వీరి మరొక విశేష గ్రంధం 1968లో వచ్చిన ఆంధ్ర రచయిత్రుల సమాచార సూచిక పేరున అప్పటి వరకూ గల రచయిత్రుల పరిచయ గ్రంధం.
 
         కె.రామలక్ష్మి గారి ‘అద్దం’ కథానికా సంపుటి పరిచయం ప్రస్తుత వ్యాస ఉద్దేశ్యం. ఆ రోజుల్లో చాలామంది కథకులు పెద్ద కథలు రాస్తుండేవారు. కానీ రామలక్ష్మి కథకు ఎంత వరకు అవసరమో అంత వరకే క్లుప్తంగా చెప్పి, అనవసర వర్ణనల జోలికి పోకుండా విషయాన్ని సూటిగా, స్పష్టంగా, మనసుకు తాకేలా చిన్న కథలలోనే పొందికగా చెప్పడం వీరి ప్రత్యేకత.
 
         ఈమె కథలు కాలక్షేపానికి చదివినట్లుగా చదివేవి కాదు. మన చుట్టూ, మన సమాజం లోను జరుగుతున్న సాధారణంగా అనిపించే విషయాలనే అసాధారణ రూపంలో, చిన్న చిన్న సంభాషణలతో, సరళమైన శైలితో పాఠకుడితో కబుర్లు చెప్తున్నట్లుగానే చెప్తూ ఆలోచింపచేసేలా ఉంటాయి.
 
         రామలక్ష్మి రాసిన కథలలో పార్వతీ కృష్ణమూర్తి పాత్రలతో అల్లిన కథలకి ఒక ప్రత్యేకత ఉంది. సాహిత్యంలో ప్రఖ్యాతి పొందిన భార్యా భర్తల పాత్రలలో పార్వతీ కృష్ణ మూర్తులకి ఒక సముచిత స్థానం ఉందని ఖచ్చితంగా చెప్పొచ్చు. మునిమాణిక్యంగారి కాంతం, నండూరి ఎంకి చాలామందికి తెలిసిన పాత్రలు. రామలక్ష్మిగారి పార్వతి ఆధునిక యువతి. తన వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటూనే తన సంసారాన్ని తెలివిగా తీర్చిదిద్దు కుంటుంది. బాపూ బొమ్మలాంటి పార్వతితో కృష్ణమూర్తి స్నేహం ప్రేమగా పరిణమించి వివాహం చేసుకోవడంతో మొదలై ఇద్దరు పిల్లలు జన్మించడం, చదువులూ, కూతురు పెరిగి బాయ్‌ఫ్రెండ్‌ని ఇంటికి తేవడం వరకు సుమారు పాతికేళ్ళ వాళ్ళ దాంపత్య జీవన దృశ్యాల్ని ఇరవైకి పైగా కథలు ఈ రచయిత్రి రాసిన గుర్తు. అయితే ‘అద్దం’ సంపుటిలో మాత్రం రెండు కథలే ఉన్నాయి. మరికొన్ని కథలు ‘ఈ జీవికి స్వేచ్ఛ’ సంపుటిలో ఉన్నాయి.
 
         ‘అద్దం’ సంపుటిలోని ‘ఏకోన్ముఖులు’ కథ పార్వతీ కృష్ణమూర్తుల ప్రేమ, వివాహ నిర్ణయాలను తెలుపుతుంది. మరో కథ ‘అందమైన పొరుగు’లో పొరుగింటామె డ్రస్‌ సెన్సుని కృష్ణమూర్తి ప్రశంసించడం భరించలేని పార్వతి పొరుగింటి విందుకు వెళ్ళేందుకు డబ్బు వెచ్చించి చీర కొనుక్కుంటుంది. కృష్ణమూర్తి కూడా అందుకే డబ్బు ఖర్చుపెట్టి పార్వతికి నెక్లెస్‌ కొని తెస్తాడు. అందరు భార్యల్లాగే భర్త మరో స్త్రీని పొగుడు తుంటే అసూయపడినా పొరపాటు గ్రహించి ఆత్మవిశ్వాసం పెంచుకుంటుంది పార్వతి. మధ్యతరగతి జీవితాలలో కుహనా ఆడంబరాలకు వశమైతే వచ్చే సమస్యని సున్నితంగా పరిష్కరించడం ఇందులోని విశేషం. దాంపత్య జీవితాలలో ఆత్మీయ బంధం పటిష్టంగా ఉండాలంటే కావలసినదేమిటో స్పష్టీకరిస్తారు రచయిత్రి.
 
         ‘అబద్ధాల తేనెపట్టు’ కథలో అమాయకపు భార్యని అబద్ధాలతో మభ్యపెట్టి కాపురం చేస్తుంటాడు భర్త. కొన్నాళ్ళకి అతను చెప్పేవన్నీ అబద్ధాలని తెలుసుకున్న భార్య ‘ఈ అబద్ధాల తేనెపట్టు’ నాకు వద్దని దూరమవుతుంది. అదే విధంగా ‘అవిటి మనసు’ కథలో అవిటి భర్త తన లోపాన్ని భార్య గుర్తించిందని తెలుసుకుని ఆత్మన్యూనతతో బాధపడి చివరకు మానసిక వికలాంగుడు కావడం, ‘ఆడతనం’ కథలో కూరలు అమ్ముకునే ఆదెమ్మ భర్త దాష్టీకాన్ని భరించలేక ఆత్మహత్య చేసుకోవడం – ఇలా దాంపత్య సంబంధాలను విచ్ఛిన్నం చేసే సందర్భాన్ని కథలుగా మలిచారు రామలక్ష్మి.
 
         ఆడపిల్లలు ఎక్కువ చదువుకుంటే పెళ్ళిళ్ళకి అంగీకరించరనీ, అన్నింటికీ వంకలు పెడతారనీ, పెళ్ళిళ్ళు కావడం కష్టమనీ, వాళ్ళింక వృద్ధ కన్యలుగా మిగిలిపోవలసిందే అనే అభిప్రాయం అరవై ఏళ్ళ క్రితందే అయినా ఈనాటికీ అనేక మందిలో ఉంటూనే ఉంది. అంతేకాక అటువంటి స్త్రీల వ్యక్తిత్వాన్నీ, శీలాన్ని అవమానించడం, అనుమానించడం నేటికీ సమాజంలో చూస్తున్నదే. ఇటు వంటి జీవన వైచిత్రిని చూపిన కథ ‘జీవిత చిత్రం’.
 
         మానసికమైన, శారీరకమైన, ప్రవర్తనాపరమైన అనేకానేక అవకరాలు గల కొడుకుల వలన తల్లులు పడే యాతనలని భిన్న కథలలో కె.రామలక్ష్మి అక్షరీకరించడం ఈ సంపుటిలోని కథలలో గమనించవలసిన మరొక ముఖ్య విషయం. మానసిక ఎదుగుదల లేని కొడుకు సుకుమార్‌ని పెంచుతూ వయోభారంతో వాడికి సేవలు చేయలేక హాస్పిటల్‌ లో చేర్చుతుంది సీతమ్మ. ఇంతకాలం కొడుకు తనను తల్లిగా గుర్తుపడుతున్నాడని భావించిన ఆ తల్లి, సమయాను గుణంగా తెచ్చిన ఆహారం కోసమే తప్ప తనని తల్లిగా గుర్తించడం కాదన్న నిజాన్ని జీర్ణించుకోలేక గుండె పగిలిన తల్లి ఇతివృత్తంగా రాసిన కథ ‘పాశం’.
 
         పసివాడిని ఒంటరిగా పెంచలేని నిర్భాగ్యురాలైన తల్లి తనకి ఒక ఆసరా కోసం ఒక అవిటివాడి నీడకు చేరుతుంది. ఆ పసివాడే ఎదిగిన తర్వాత తన తల్లినే ‘తంతే అదృష్టం ఠపీమని తన్నాలి’ అని వెటకారం చేయడమేకాక ‘ఆడపిల్లల వ్యాపారం చేస్తే నాకు తగినట్లుగా ఉంటుంది కదూ’ అనే దుర్మార్గ మనస్తత్వాన్ని పెంచుకుంటాడు. అంతటితో ఆగక ఒక అమ్మాయిని అమ్మకానికి పెట్టి హత్యానేరంలో ఇరుక్కుంటాడు. కొడుకు దాష్టీకానికి కుములుతోన్న ఆ తల్లి వాడిని విడిపించడానికి పోలీసు ఠాణాకి వెళ్తుంది. అక్కడ కూడా తనని కొడుకు హేళన చేయడం భరించలేక వెనుతిరుగుతుంది. ఇదీ ‘మమకారం’ కథలోని ఇతివృత్తం.
 
         ఒకరినొకరు పట్టించుకోని హడావుడి నగర జీవితంలో ఎవరూ లేక రోడ్డుమీద వదిలేసిన అనాథ ప్రేతం తిరిగి మార్చురీకి తరలిపోవడంతో ముగిసిన కథ ‘హృదయం లేని పట్నం’ నగర జీవితానికొక ప్రతీక.
 
         భార్య తనకన్నా ఎక్కువ హోదాలో ఉంటే భరించలేని భర్త మానసిక చిత్రణ ‘వర్కింగ్‌ వైఫ్‌’. ఇది నేటికీ నిత్య నూతనమైనదే.
 
         నలభై ఏళ్ళ కిందటే కాదు నేటికి కూడా సమాజ సేవ ఒక ఫ్యాషన్‌గానే ఉంది. ఆ రకంగా అనేక సంస్థలు పుట్టగొడుగుల్లా మొలుచుకు వస్తూనే ఉన్నాయి. కొన్ని నిజంగా నిస్వార్థంగా సేవ చేసేవైతే, మరికొన్ని ప్రచార పటాటోపంతో, పేరు కోసం, తద్వారా వచ్చే పురస్కారాల కోసం, గుర్తింపు కోసం పేపర్ల మీద మాత్రమే పుట్టుకొచ్చే సంస్థలు కూడా నేడు ఉన్నాయి. అటువంటి వారిమీద సంధించిన విమర్శనాస్త్రమే ‘వృత్తి సంఘసేవ’ కథ.
 
         వృద్ధాప్య సమస్యల పై ‘అద్దం’ సంపుటిలో చాలా కథలు ఉన్నాయి. రామలక్ష్మి  కొంతకాలం పనిచేసిన సేవా సంస్థలలో వృద్ధాశ్రమం ఒకటి. అక్కడ వృద్ధుల అనుభవాల నుండి అనేక విషయాలు పరిశీలించిన రచయిత్రి సమాజంలో, కుటుంబాలలో వృద్ధుల పాత్ర ఏ విధంగా ఉంది అనే దృష్టి కోణంతో కొంత పరిశోధనాత్మకంగా, విషయ సేకరణ చేసి ఉండాలి. ఆ అనుభవంతోనే బహుశా ‘నన్ను వెళ్ళిపోనీరా’ అనే ఒక మంచి నవలను సాహితీ ప్రపంచానికి అందించారు. ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా ఒక కుగ్రామం అయిన సందర్భంలో, పిల్లలందరూ రెక్కలు కట్టుకొని వలస పక్షులు కావడం జరుగుతోంది. దాంతో భారతదేశం, అందులోనూ తెలుగు రాష్ట్రాలు వృద్ధాశ్రమాలుగా మారిపోతున్నాయి. అవసరార్ధం తల్లిదండ్రుల్ని విదేశాలకు రప్పించుకొని అవసరం తీరాక తోసిరాజన్న సంతానం ఇబ్బడి ముబ్బడిగా కావడం తెలుస్తూనే ఉంది.
 
         ఇక్కడ కూడా కొందరు వృద్ధుల పరిస్థితి అందుకు భిన్నంగా లేదు అనే నేపధ్యంలో రచయిత్రి రాసిన కథ ‘అద్దం’, కలిమి చెట్టు నీతి కథలు. వీటిలో వృద్ధురాలైన స్త్రీ పరంగా కథ నడుస్తుంది. కొత్త మూకుడు కథ వృద్ధుడి పరంగా నడుస్తుంది.
 
         అమెరికా వలస పోయిన పిల్లలు, ఇక్కడ ఉన్న వృద్ధుల నేపథ్యంగా రాసిన మరో కథ ‘సాక్ష్యంలేక’. కానీ ఇందులో అమెరికా నుండి వచ్చిన నాయకుడు వెతికినది తన తాత దగ్గర పనిచేసిన పనివాడు శివయ్య గురించి. శివయ్య అతని మామయ్య పొలానికి కాపలా దారుడు. మామయ్య హత్య కేసులో అరెస్టు కావడం, తిరిగి విడుదల కావడం జరిగినట్లు తెలుసుకుంటాడు. నాయకుడికి చావు బతుకుల్లో ఉన్న శివయ్య చెప్పిన కథే మూలం. ఇందులో తాను పెళ్ళాడాలనుకున్న గౌరిని యజమాని బలాత్కరించి దగ్గర చేర్చు కోవడంతో, శివయ్య కోపంతో సమయం చూసి కావలి కోసం ఇచ్చిన తుపాకితోనే గౌరిని చంపేస్తాడు. ఆ హత్యా నేరం యజమాని పై బడి సాక్ష్యం దొరకక వదిలేశారని శివయ్య చెప్తాడు. ‘ఇది నాకు నేను వేసుకున్న శిక్ష. ఇది చెప్పిన తర్వాత భారం తగ్గింద’ని చెప్పి శివయ్య ప్రాణం వదిలేస్తాడు. ఈ కథలో చాలా కోణాలను గమనించవచ్చు. మేథోవలస ఒక కారణమైతే, పేదవారికి తమదైన జీవితం ఉంటుందని గ్రహించని యజమాని, సేవకి అంకితమైన వెట్టి చాకిరీ మరొక కోణం. ఇవికాక ప్రేమించిన గౌరిని యజమాని లొంగదీసు కోవడాన్ని థిక్కరించిన చైతన్యం ఇంకో కోణం.
 
         ‘స్వార్థంలో కూడా అర్ధం ఉంది’ కథ కూడా వృద్ధాప్య సమస్యే. ఇందులో కథా నాయకుడు పురుషోత్తమరావు. కొడుకు తమ ఇంటి పై మరో పోర్షన్‌ కట్టించడం కానీ, బిల్డర్‌కి ఇవ్వడం కానీ చేయమని తండ్రి పై ఒత్తిడి చేస్తాడు. తండ్రి పిసినారిలా వ్యవహరిస్తున్నాడని విసుక్కుంటాడు.
 
         కానీ, పురుషోత్తమరావు ప్రవర్తనకు కారణం- ఆస్తినంతటినీ పిల్లల పరం చేసి చివరకు మందుల కోసం కూడా పరాయి వారి ముందు చేయి చాపే పరిస్థితిని తెచ్చుకున్న స్నేహితుడి జీవితం. దీన్ని కళ్ళారా చూసి, వృద్ధాప్యంలో ఆర్థిక స్వావలంబన ఎంత అవసరమో అర్థం చేసుకుంటాడు. అందుకే ఇంటిని బ్యాంకు వాళ్ళకి లీజుకిచ్చి ఆ డబ్బుతో తన స్నేహితుడితో కలిసి వృద్ధాశ్రమంలో చేరడానికి నిర్ణయించు కుంటాడు. కొడుకుని ఇల్లు ఖాళీ చేసి వేరేచోట అద్దెకు వెళ్ళమంటాడు పురుషోత్తమరావు. ‘నీ తదనంతరం ఆ ఇల్లు నాదే కదా’ అని థిక్కరించిన కొడుకుతో ‘ఏమో అప్పుడు ఇస్తే ఇస్తాను లేదా అమ్మేస్తాను’ అన్న తండ్రి మాటలకి ‘ఎంత స్వార్థపరుడివ’ని కొడుకు నిరసిస్తాడు. ‘నా ఈ స్వార్ధంలో అర్థం ఉంది. ఇంత చిన్న వయసులోనే నీకున్నస్వార్థంతో పోలిస్తే ఇది ఎంత. ఆలోచించుకో’ అనే సమాధానంతో కథ ముగుస్తుంది. కాల పరిణామ క్రమంలో రాను రాను ఈ సమస్య జటిలమవుతూనే ఉంది. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబా లలో ఈ సమస్య ఉన్నా దాని రూపురేఖలు వేరుగా ఉండేవి. అప్పుడు ఎక్కువ మంది సంతానం ఉండడంతో ఒకరు కాకపోతే మరొకరు ఇష్టం ఉన్నా, లేకపోయినా బాధ్యత వహించక తప్పని పరిస్థితి. ఆ నాడు కూడా రోడ్డున పడిన వృద్ధులు లేకపోలేదు. ఇది నిరంతరం ఉండేదే. ఉండాల్సింది మానవతా విలువలు అనే విషయం ఈ సంపుటిలోని విభిన్న వృద్ధాప్య సమస్యలని కథల రూపంలో రచయిత్రి వర్ణించారు.
 
         ఈ కథలలో చాలా వరకూ ప్రత్యేకం కాకపోయినా, సామాజిక, రాజకీయ నేపథ్యం కథలన్నిటిలోనూ ప్రస్తావించడం గుర్తించవలసిన విషయం. సంపుటిలో కథలన్నీ 1970-2000 మధ్యలో ప్రచురితమై ఉండొచ్చు. కథకి ప్రచురణ తేదీ ఇవ్వకపోవడం ఒక లోటే. కథల నేపథ్యాన్ని కాల పరిణామ క్రమంగా విశ్లేషించడానికి పరిశోధకులకు మరింతగా ఉపయోగపడతాయి. స్త్రీ చదువు, ఉద్యోగం, స్వేచ్ఛ, స్నేహం, దాంపత్య బంధాలు ఇలా ప్రతిచోటా కాల పరిణామాన్ని గుర్తించవచ్చు.
 
         మేనరికాలు కథలో ‘అందం, చందం, చదువు, ఉద్యోగం ఎప్పటి నుండి ఆడదానికి అవలక్షణాలుగా మారిపోయాయి’ అని ఒక సందర్భంలో పాత్రచేత చెప్పిస్తారు రచయిత్రి. ఇది నాటి నుండి నేటి వరకు స్త్రీ ఎదుగుదలకూ, వైవాహిక జీవితానికీ అవరోధాలుగానే పరిగణించారు అనేది కఠినమైన నిజం.
 
         అదే విధంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్వహించిన జన్మభూమి కార్యక్రమం ప్రస్తావన ఒక కథలో ఉంటుంది. మారిపోతున్న ప్రాధాన్యాలూ, మానవ విలువలు, జీవన విధానాలూ కాలానుగుణంగా ఏ విధంగా ఉన్నాయనేది ఈ కథల బట్టి తెలుసుకోవచ్చు.
 
         ముఖ్యమైన మరో రెండు కథలు ఉన్నాయి. అందులో ఒకటి ‘బిగినర్స్‌ లక్‌ మిథ్య’. ఉత్తమ పురుషలో కథ నడుస్తుంది. అమెరికాలోని కూతురు ఇంటికి వెళ్ళిన తల్లిని వారాంతంలో సరదాగా గడిపేందుకు కూతురు ఒక ‘కాసినో’కి తీసుకెళ్తుంది. అక్కడ సీనియర్‌ సిటిజన్స్‌ హోమ్‌ నుండి బస్సులు వస్తాయనీ, రోజంతా ఆ వృద్ధులు ఫ్రీగా కాలక్షేపం చేయొచ్చని విని తల్లి ఆశ్చర్యపోతుంది. ఊళ్ళల్లో యాభై ఏళ్ళు దాటగానే వాళ్ళు ఎందుకూ పనికిరారని, ‘ముసలి పీనుగు’లని పక్కకి నెట్టేస్తారు కదా అను కుంటుంది. ‘కాసినో’లో జరిగే జూదపు ఆటలతో మతిపోతుంది. చిన్నప్పుడు పెద్దలు ఆడే పేకముక్కల్ని తాకితే అమ్మ వేళ్ళమీద కొట్టడం తల్చుకుంటుంది. తాను కట్టుదిట్టంగా పెంచిన కూతురు, నేలమీద డబ్బుపడితే తీసి కళ్ళకద్దుకునే ముద్దుల కూతురు రిలాక్సు కోసం జూదానికి రావడమేకాక, ఇది పాడుపనులని నమ్మే తనచేత కూడా ఆడిస్తోంది అని విస్తుపోతుంది తల్లి. సరదా కోసం డబ్బు పోగొట్టుకోవడం, వస్తువులు తాకట్టు పెట్టడం చూసి ‘ఇది ఎలా సాధ్యం’ అనుకొని, ‘భవిష్యత్తు కోసం ఆధారం ఉండాలి కదే’ అంటే ‘వర్తమానం కోసం బతకాలి, లేకపోతే మనం కూడా యంత్రాలుగా మారిపోతాం’వేదాంతిలా అంటున్న కూతుర్ని వింతగా చూస్తుంది తల్లి. కాలంతో పాటు మారిపోతున్న ప్రాధాన్య తలు, జీవన విధానాన్ని చూపే కథ ఇది.
 
         మరో ముఖ్యమైన కథ ‘కోరిక చిన్నదే కానీ…’. జాతీయ, అంతర్జాతీయ పురస్కారాల పై రచయిత్రి రాసిన వ్యంగ్య రచన. అందరూ బాక్స్‌ కట్టి వేయించుకుంటున్నారు కదా, అలా తన పేరు కూడా రావాలని ఉంది అనుకొని వచ్చిన కవర్లని చూస్తుంది కథానాయిక. 20వ శతాబ్దపు ఎఛీవ్‌మెంట్‌ అవార్డు కోసం కేంబ్రిడ్జ్‌ యూనివర్శిటీ నుండి 145 డాలర్లు కట్టమనీ, అమెరికన్‌ బయోగ్రాఫికల్‌ ఇంక్‌ నుండి వచ్చే సంపుటాలలో ‘ప్రభావం చూపగల అయిదొందల నాయకులలో ఒకరు’గా నమోదు కావడానికై 875 డాలర్లు కట్టి ఫారాలు నింపి పంపమని వచ్చిన కవర్లు అవి. కథ అంతా ఈ ప్రహసనాల పై జరిగిన తర్జన భర్జనలతో వ్యంగ్యంగా నడుస్తుంది. ఈ కథలో కథానాయికకి సలహాదారుడు వి.ఎ.కె. చివరికి కీర్తి రావడం కాదు, కొనుక్కోవడమే అనే నిర్ణయానికి వచ్చి, ఇన్నాళ్ళూ, ఏ బహుమతీ కొనుక్కో కుండా పరువుగా బతుకుతున్నాననీ ప్రయత్నం విరమించుకోవడంతో కథ ముగుస్తుంది. ఇటీవల కాలంలో పిండి కొద్దీ రొట్టె అన్నట్లు ఎంత డబ్బు ఇస్తే అంత ఘనంగా సన్మానాలు చేసే సంస్థలు పుంఖానుపుంఖాలుగా పెరుగుతున్నాయి. అటు వంటి వాటికి చెంప పెట్టులా ఈ కథ మలిచారు రామలక్ష్మి.
 
         ప్రముఖ విమర్శకులు కడియాల రామమోహన రాయ్‌ గారు రామలక్ష్మి కథల సంపుటికి రాసిన ముందు మాటలో కథానికా లక్షణాలు చెప్తూ ఇలా అంటారు- ”విమర్శకులు కథానికా లక్షణాలను – క్లుప్తత, అనుభూతి, ఐక్యత, సంఘర్షణ, నిర్మాణ సౌష్టవంగా పేర్కొంటారు. రామలక్ష్మి కథలు క్లుప్తమైనవి, ఒక్కసారిగి చదివి ముగించడానికి వీలైనవి. తీరైన సౌష్టవం చాలా కథలలో కన్పిస్తుంది” అంటారు.
 
         రామమోహన రాయ్‌ గారు చెప్పిన లక్షణాలే కాక ఈమె కథలలో గుర్తించదగిన మరో అంశం భాషాడంబరం లేని సరళ సంభాషణలు. రామలక్ష్మి యాభై ఏళ్ళకు పైగా భిన్న సంస్కృతుల కూడలి అయిన మద్రాసులోనే ఉన్నారు. విద్యావంతురాలు. వివిధ రంగాలకు చెందిన అనేక మంది నిష్ణాతులైన వారితో స్నేహ సంబంధాలు ఉన్న మహిళ. అనేక సామాజిక, కళారంగ కార్యకలాపాలలో పాలుపంచుకున్నవారు. నగర జీవితంలోని ఆధునిక పోకడలు తెలిసిన వ్యక్తి. అయినా ఈమె కథలన్నీ ఎక్కువగా తమిళనాట ముఖ్యంగా చెన్నైలోని మధ్య తరగతి వారి జీవన నేపథ్యం నుండి వచ్చినవే.
 
         ఆరుద్రగారి ‘సమగ్రాంథ్ర సాహిత్యం’ రచనలో అండ దండలు సమకూర్చడం వలనా, ఆధునిక సాహితీవేత్తలతో సాహిత్య గోష్టుల వలనా కావచ్చు. రామలక్ష్మి రచనా శైలి, భాష ఆధునికంగా ఉండడమే కాక కథానికా నిర్మాణ శైలి సరళంగా ఉంటూనే పటిష్టంగా ఉంటుంది.
 
         రామలక్ష్మి కథలలో ఆమె ప్రియ స్నేహితురాళ్ళు ఉషారాణి భాటియా, కల్పకం (ఏచూరి సీతారాం గారి తల్లి), చిన్ననాటి నుండీ సహ విద్యార్థిని, న్యాయవాది అయిన శాంత గార్లు కూడా పాత్రధారులే. రామలక్ష్మి తన నవల ‘ఈ తరం పిల్ల’ని కల్పకంకి ప్రేమతో అంకితమిచ్చారు. ప్రస్తుత కథా సంపుటి ‘అద్దం’ని శాంతగారి జ్ఞాపకార్థం అంకితం చేశారు.
 
         స్త్రీ వాదం ఇంకా వేళ్ళూనని రోజుల్లోనే కుటుంబ విచ్ఛిత్తికి దోహదం చేయని, మానవ విలువల్ని ఛిద్రం చేయని, కౌటుంబిక విలువల్ని గుర్తించి భార్యగా తన గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకొనేలా ఆత్మ విశ్వాసాన్ని పెంపొందుంచుకొనే అభ్యుదయ దృక్పథాన్ని వెలిబుచ్చే పాత్రలతో రామలక్ష్మి కథలు రాశారు.
 
         ‘అద్దం’ సంపుటిలోని కథలన్నింటా స్వాభిమానం గల స్త్రీ పాత్రల్ని సృష్టించారు. దాంపత్య జీవితంలో నాణేనికి రెండు వైపులుగా ఉండాల్సిన భార్యాభర్తలిద్దరికీ సమాన విలువని ప్రతిపాదించారు. దాంపత్య జీవితంలోని లొసుగులు చెప్తూనే వాటిని విద్యా వంతురాలైన ఆధునిక మహిళ అయినా, అనుభవం నేర్పిన తెలివితో సామాన్య స్త్రీ అయినా సంసారాన్ని సరిగ్గా దిద్దుకునే విధానాన్ని అక్షరీకరించారు. అది కుదరని సందర్భాలలో ప్రతిఘటించి తన కాళ్ళ పై తాను నిలిచి బతకగలిగే ధీరత్వాన్ని చూపే స్త్రీలని చిత్రించారు.
 
         అలా అన్ని కథలలో రచయిత్రి ఎక్కడా గంభీరమైన, సమాన భూయిష్టమైన ఉపన్యాసాల్లాంటి సంభాషణలు ఉండవు. అత్యంత సరళంగా, సహజంగా ఉంటాయి. సీరియస్‌ సందర్భాలలోనూ సున్నితమైన జీవన దృశ్యాలు పాఠకులకు గాఢానుభూతి కలిగించేలా అక్షరీకరించడం రామలక్ష్మి కథా నిర్మాణ శిల్పంలోని విశిష్టత.
 
         సుమారుగా డెబ్భై ఏళ్ళ సాహిత్య జీవితం కలిగి, బహుముఖ ప్రజ్ఞావంతురాలైన కె.రామలక్ష్మి అనేక పురస్కారాలు పొందారు. కానీ ఆమె ప్రతిభకు రావలసినంత గుర్తింపు రాలేదేమోనని నా అభిప్రాయం. ఇంతటి ప్రతిభావంతురాలైన కె.రామలక్ష్మి గురించి విషయ సేకరణకై అంతర్జాలాన్ని గాలిస్తే, ”రచయిత్రి, సినిమా విమర్శకురాలు, నంది అవార్డు గ్రహీత, కవి, రచయిత అయిన ఆరుద్ర భార్య” అని మాత్రమే తెలిసింది. కొన్ని నవలల పేర్లు తెలిశాయి.
 
         తరచూ పత్రికలలోనూ, ఛానల్స్‌లోనూ, సభా వేదికల పైనా కనిపించడానికి వెంపర్లాడకుండా, ఆత్మవిశ్వాసంతో ఆ నాటి నుండి ఈ నాటి వరకు నిర్విరామంగా అభ్యుదయ భావాలతో రచనా వ్యాసంగం కొనసాగిస్తున్న అతి తక్కువమంది సాహితీ వేత్తలలో కె.రామలక్ష్మి ఒకరు.
 
(భూమిక, 2016 ప్రచురణ)
 

*****

Please follow and like us:

2 thoughts on “కె.రామలక్ష్మికి నివాళిగా”

  1. శీలా సుభద్రా దేవి గారు కె. రామలక్ష్మి గారికి అర్పించిన రచన కన్నా సమగ్రమైన నివాళి మరొకటి ఉండబోదు. కె. రామలక్ష్మి గారు నా అభిమాన రచయిత్రి. తెలిసీ తెలియని వయసులో ఆమె
    ఆంధ్ర సచిత్ర వార పత్రికలో నిర్వహించిన ప్రశ్న – జవాబు శీర్షిక ఆమె వ్యంగ్యోక్తులతో నిండిన సూటి సమాధానాలు చదివి అబ్బురపడేవాడ్ని. ఆమె రాసిన ” ప్రేమించు ప్రేమకై ” నవల నేనెంతో ఇష్టపడ్డ రచన.
    శీలా సుభద్రా దేవి గారికి హృదయపూర్వక అభినందనలు.

  2. U R RIGHT SUBADRADEVI GARU—-DARING PERSONALITY—GOOD SPOKESPERSON
    AND GOOD WRITER—TELUGU SAHATHI LOKAM —NOT RECOGNIZED HER
    SHE CRITICIZED SRI SRI GARU TOO—

Leave a Reply

Your email address will not be published.