జెనెటిక్స్ వేదికగా జనవిశ్వతాండవం-8 

   -కల్లూరి భాస్కరం

          నేను మొదట యూరప్ కథ ముగించి, తీరుబడిగా మనదగ్గరకు రావచ్చని ప్రణాళిక వేసుకున్నాను. తీరా రాయడం మొదలు పెట్టాక విషయాన్ని నేను నడిపించే బదులు, అదే నన్ను నడిపించడం ప్రారంభించింది. నా ప్రణాళికను భగ్నం చేస్తూ మనదేశంతో ముడిపడిన సంగతులు మధ్యమధ్య చొరబడుతూనే ఉన్నాయి. దాంతో యూరప్ గతాన్నీ, మన గతాన్నీ వేరు చేయడం ఎంత కష్టమో మరోసారి అర్థమైంది.

వలసలకు ధ్రువీకరణ

          టోనీ జోసెఫ్, డేవిడ్ డబ్ల్యు. ఆంథోనీ, డేవిడ్ రైక్, మైకేల్ విజెల్ తదితరులను చదివేవరకూ భారత్ లోకి ఆర్యుల వలస గురించి సాధికారికంగా చెప్పడానికి నా వరకు నేను కొంత సంశయించేవాడిని. ఇప్పుడు నాలో ఎలాంటి సంశయమూ లేదు. ఈ విషయం మీద చదవాల్సిన పుస్తకాల జాబితా ఇంకా ఉంది. కాకపోతే, ఒక నిర్ధారణకు రావడానికి పై వ్యక్తులు రాసిన పుస్తకాలే చాలుననిపించింది. హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన మైకేల్ విజెల్(Michael Witzel)తన ‘Autochthonous Aryans? The Evidence from Old Indian and Iranian Texts అనే పత్రంలో భాషాసంబంధమైన ఆధారాలతో ఆర్యుల వలసను నొక్కిచెబుతూ, ‘భారత్ నుంచే ఆర్యులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళా’రన్న (Out of India) సిద్ధాంతాన్ని తోసిపుచ్చాడు. భారత్ లోకి ఆర్యుల వలసతో పాటు ఇంకా అనేక ఇతర జనాల వలసను ఇటీవలి జన్యుపరిశోధనల ఆధారంగా ధ్రువీకరిస్తూ టోనీ జోసెఫ్ ‘ది హిందూ’ పత్రికలో వ్యాసాలు రాశాడు. ఆ వివరాలు కొన్నింటిని పొందుపరుస్తూ, మరికొన్ని విషయాలు జోడిస్తూ కొన్నేళ్ళ క్రితమే నేను ‘ఆంధ్రజ్యోతి’లో వ్యాసం రాశాను.

భారత్ లో ఎవరూ స్థానికులు కారు

          టోనీ జోసెఫ్ ఆ తర్వాత ‘ఎర్లీ ఇండియన్స్’ అనే పుస్తకం వెలువరించాడు. ఆర్యుల వలస కేవలం ఇటీవలిది మాత్రమే ననీ, అంతకు ముందు, అంతకన్నా ప్రాధాన్యమూ, విస్తృతీ కలిగిన వలసలు సంభవించాయనీ; జనమనోభావాలతోపాటు రాజకీయాలు ముడిపడడం వల్ల ఆర్యుల వలస గురించి ఎక్కువ చర్చ జరిగి ఎక్కువ వివాదం తలెత్తిందని ఆయన అంటాడు. అంతేకాదు, భారత్ లో ఇప్పుడున్న జనాలలో ఎవరూ స్థానికులు కారు, అందరూ వివిధ కాలాల్లో వలస వచ్చిన జనాల వారసులే నన్న ఇంకొక ముఖ్యమైన సంగతిని కూడా వెల్లడించాడు.

పదివేల ఏళ్ల చరిత్రను చుట్టబెట్టిన డేవిడ్ ఆంథోనీ

          ఇక డేవిడ్ ఆంథోనీ పుస్తకం The Horse The Wheel And Language అయితే ఈ విషయాల మీద ఆసక్తి ఉన్నవారికి విందుభోజనం లాంటిది. డేవిడ్ రైక్, టోనీ జోసెఫ్ తదితరులు ఈ పుస్తకాన్ని అనుసరించారు. వివిధ పురాతత్వ సంస్కృతుల మీదుగా దాదాపు పదివేల సంవత్సరాల చరిత్రను చుట్టబెట్టిన ఈ పుస్తకం- అటు యూరప్ లోకి ఇండో-యూరోపియన్ జనాలూ, భాషల వ్యాప్తినీ; ఇటు వారితో సంబంధమున్న ఆర్యులూ, వారికి చెందిన ఇండో-యూరోపియన్ భాషల వ్యాప్తినీ అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్టు వివరించింది. సోవియట్ యూనియన్, తూర్పు యూరప్ దేశాలలో కమ్యూనిస్టు వ్యవస్థలున్న రోజుల్లో పురాతత్వ రంగంలో జరిగిన పరిశోధనలు ఇతర ప్రాంతాల పరిశోధకులకు చేరలేదు. ఆ దేశాల్లో కమ్యూనిస్టు వ్యవస్థలు తొలగిన తర్వాతే అవి ఇతర ప్రాంతాలవారికి అందుబాటులోకి వచ్చి ఈ పరిశోధనలకు మరింత సమగ్రతను తీసుకు రావడానికి సాయపడినట్టు డేవిడ్ ఆంథోనీ పుస్తకం ద్వారా అర్థమవుతుంది.

సంఘర్షణతోపాటు సయోధ్య, సామరస్యం

          స్టెప్పీల నుంచి వచ్చిన ఇండో-యూరోపియన్ జనాలు అటు యూరప్ ను, వారి దగ్గరి బంధువులైన ఆర్యులు ఇటు భారత్ ను పూర్తిగా బలప్రయోగంతో ఆక్రమించు కున్నారనీ; స్థానికులను, వారి సంస్కృతులను చాలా వరకూ తుడిచిపెట్టారనే ఒక అభిప్రాయం ప్రచారంలో ఉంది. కానీ డేవిడ్ ఆంథోనీ ప్రకారం ఇది కొంత వరకే నిజం. ఘర్షణ, అణచివేత, ఆక్రమణ ఖచ్చితంగా ఉన్నాయి; వాటితో పాటు సయోధ్య, సామరస్యమూ, పరస్పర సహకారమూ కూడా ఉన్నాయి. ఆ పైన ఈనాటి మతాలతో పోల్చదగిన ఒక విశ్వాస వ్యవస్థను, ఒక నిర్దిష్ట భావజాలాన్ని స్టెప్పీ సంస్కృతీ జనాలు  అభివృద్ధి చేసి తాము వలస వెళ్ళిన ప్రాంతాలలోని జనాలలోకి తీసుకు వెళ్లారని డేవిడ్ ఆంథోనీ అంటాడు.

మత లక్షణాలు కలిగిన బెల్ బీకర్ సంస్కృతి

          ఇంతకు ముందు చెప్పుకున్న కోడెడ్ వేర్ సంస్కృతి అలాంటిదే. అది మధ్య యూరప్ ను ముంచెత్తిన రెండు వందల ఏళ్ల తర్వాత, అంతే నాటకీయంగా, బహుశా నేటి ఐబేరియా నుంచి బెల్ బీకర్ సంస్కృతి విస్తరించింది. గంట ఆకారంలో ఉండే పాత్రలను బట్టి బెల్ బీకర్ అనే పేరు వచ్చింది. ఈ సంస్కృతి 4వేల 5వందల సంవత్సరాల క్రితం బ్రిటన్ లోకి వ్యాపించింది. కోడెడ్ వేర్ సంస్కృతి వలసల ద్వారా వ్యాపిస్తే; భావాల ద్వారానూ, ఆ తర్వాత వలసల ద్వారానూ వ్యాపించడం బెల్ బీకర్ సంస్కృతి ప్రత్యేకత. చరిత్ర పూర్వకాలంలో సంస్కృతులు ఎలా మారుతూ వచ్చాయో ప్రాచీన DNA మరింత పద్ధతిగా వెల్లడించిందని డేవిడ్ రైక్ అంటాడు. బెల్ బీకర్ సంస్కృతి ప్రాచీన కాలానికి చెందిన ఒక మతం లాంటిది కావచ్చని- DNA ఫలితాలను బట్టి కొందరు పురాతత్వ శాస్త్రజ్ఞులు అంచనా వేశారు. వేర్వేరు దేశాలకు, సంస్కృతులకు, భాషలకు చెందినవారు కూడా ఒక మతం కింద ఒకటవడం ఈ రోజున మనకు కొత్త కాదు. అలాగే బెల్ బీకర్ సంస్కృతి ఆనాడు వేర్వేరు నేపథ్యాలు కలిగిన జనాలను ఒక మతం కింద కూడగట్టి ప్రపంచాన్ని సరికొత్తగా దర్శింపజేసిందని పురాతత్వ శాస్త్రవేత్తలు భావించారు. మధ్య, పశ్చిమ యూరప్ లలో స్టెప్పీ ఆనువంశికత విస్తరించి అక్కడి జనాలతో కలిసి పోవడానికి బెల్ బీకర్ సంస్కృతి ఒక భావజాలవాహికగా పని చేసింది. హంగరీలో ఈ సంస్కృతి వ్యాపించిన ఒక ప్రాంతంలో బయటపడిన సమాధుల్లోని కొందరి అవశేషాలలో స్టెప్పీ జన్యు వారసత్వం అసలే లేకపోగా, కొందరిలో 75శాతం కనిపించడం ఇందుకు సాక్ష్యం.

          కోడెడ్ వేర్, యామ్నాయ, బెల్ బీకర్ సంస్కృతులు మూడూ ఒకదానికొకటి భిన్నమైనవైనా భావజాలపరమైన కొన్ని అంశాలను పంచుకున్నాయి. స్టెప్పీ అనువంశికత పెద్ద ఎత్తున వ్యాపించే ప్రక్రియలో మూడూ భాగస్వాములయ్యాయి. జన్యుపరమైన ఆధారాలు లభించక ముందైతే దీనిని వట్టి ఊహాగానంగా తోసిపుచ్చి ఉండేవారేమో కానీ, ఇప్పుడు ఆ అవకాశం లేదని డేవిడ్ రైక్ అంటాడు.

ఆనాడే మత ప్రపంచీకరణ, మత మార్పిడులు

          యామ్నాయ తదితర సంస్కృతుల వ్యాప్తి గురించి డేవిడ్ ఆంథోనీ చర్చిస్తూ, వాటిలోని అనేక అంశాలు అనుకరణ ద్వారా, నేడు మనకు తెలిసిన మత మార్పిడుల తరహాలో వ్యాపించినట్టు ప్రతిపాదించాడు. అనుకరణ, మతమార్పిడి అనేవి ఈరోజున మనకు బాగా అనుభవంలో ఉన్నవే. కొన్ని వందల సంవత్సరాలుగా మనం పాశ్చాత్యుల వేష, భాషలను, భావాలను అనుకరిస్తున్న సంగతి తెలిసినదే. అలాగే, మతమార్పిడులు కూడా మనదేశంలో వందల సంవత్సరాలుగా ఉండడమే కాక, ఇప్పుడు తరచు వివాదాస్పదమవుతుండడం చూస్తున్నాం. ఈ దృష్ట్యా చూసినప్పుడు ఆ నాడు స్టెప్పీ జనాలు అభివృద్ధి చేసిన మతవిశ్వాసాలవైపు, జీవన విధానాలవైపు ఇతర సుదూర ప్రాంతాలకు చెందిన జనం మొగ్గడం- అతి ప్రాచీనకాలంలో జరిగిన మత ప్రపంచీకరణ, మతమార్పిడి ప్రక్రియలో భాగంగానే కనిపిస్తుంది. అంతకు ముందు మాతృమూర్తుల ఆరాధన, దానికి సంబంధించిన తంతులు ఇలాగే ప్రపంచీకరణ చెందాయి.

ప్రతి లౌకిక కర్మా, మతకర్మే

          మతాన్ని, లౌకికాన్ని వేరు చేసి చూడడం నేటి మన అవగాహన. అనేక భాషామత సంస్కృతులు సహజీవనం చేస్తున్న మనదేశం లాంటి ఒక ప్రజాస్వామిక దేశంలో మతాన్నీ, లౌకికాన్నీ వేరు చేయడం ఎంతైనా న్యాయమని మనలో చాలా మందిమి భావిస్తాం. వీటి మధ్య తేడాను చెరిపేయడం ప్రత్యేకించి ఈ రోజున తీవ్ర వివాదాస్పదం అవడమూ చూస్తున్నాం. అయితే ప్రాచీన జనాల దృష్టిలో మతకర్మకు, లౌకికకర్మకు మధ్య తేడా లేదు. ప్రతి లౌకికకర్మా మతకర్మగా మారేది. నా ‘మంత్ర కవాటం తెరిస్తే మహాభారతం మన చరిత్రే’ పుస్తకంలో దీని గురించి చాలాచోట్ల ప్రస్తావించాను. వెనకటి 7000-6200 వేల సంవత్సరాల మధ్యకాలంలో పశ్చిమ స్టెప్పీలు అంతటా పశుపాలక ఆర్థికత వ్యాపించడం గురించి డేవిడ్ ఆంథోనీ చెబుతూ, లౌకికమైన ఆ వ్యవస్థ ఎలా మతస్వభావాన్ని తెచ్చుకుందో రెండు కథల ద్వారా ఇలా వివరిస్తాడు:

తొలి ఋత్విక్కు, తొలి యజ్ఞం

          సృష్టి ప్రారంభ కాలంలో ఇద్దరు సోదరులు ఉండేవారు, వారు కవలలు. ఒకరి పేరు ‘మ్యాన్(Man’: ప్రోటో-ఇండో-యూరోపియన్ భాషలో *Manu-మను). రెండో అతని పేరు ‘ట్విన్(Twin’: ప్రోటో-ఇండో-యూరోపియన్ భాషలో *Yemo-యెమో). వారిద్దరూ ఒక గొప్ప గోవును వెంటబెట్టుకుని విశ్వమంతా సంచరించారు. ఆ తర్వాత ఇప్పుడు మనం నివసించే ప్రపంచాన్ని సృష్టించాలనుకున్నారు. అందుకోసం మ్యాన్- ట్విన్ ను బలి ఇచ్చాడు (మన సంప్రదాయంలో చెబితే, యజ్ఞపశువును చేసి వధించాడన్నమాట). కొన్ని కథల్లో మాత్రం గోవును బలిచ్చినట్టు ఉంది. ఆ తర్వాత ఆకాశ దేవతలైన ద్యుపితరుడు, యుద్ధాలకు చెందిన వాయుదేవుడు, దివ్యులైన కవలల (Divine Twins: మన పురాణాలలోని అశ్వినీ దేవతలలాంటివారు) సాయం తీసుకుని మ్యాన్ తను బలిచ్చిన జీవి దేహభాగాల నుంచి వాయువును, సూర్యచంద్రులను, సముద్రాన్ని, భూమిని, అగ్నిని, చివరగా వివిధ రకాలకు చెందిన జనాన్ని సృష్టించాడు. ఆ విధంగా తనే తొలి ఋత్విక్కుగా మారి యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞమే ఋతాన్ని, అంటే రుజుమార్గం కలిగిన ప్రపంచాన్ని వ్యవస్థీకరించడానికి మూలమైంది.

తొలి యోధుడు –త్రైతో

          ఇక రెండవ కథ ఇలా ఉంటుంది: పై విధంగా ప్రపంచాన్ని సృష్టించాక ఆకాశదేవతలు ‘మూడవ మనిషి’కి పశువులను ఇచ్చారు. అతన్ని ప్రోటో-ఇండో-యూరోపియన్ భాషలో *Trito(త్రైతో’)అన్నారు. ఆ పశువులను మూడు తలలు, ఆరు కళ్ళు కలిగిన ఒక సర్పం మోసపూరితంగా అపహరించింది. తన పశువులను తిరిగి తెచ్చుకోడానికి సహకరించమని త్రైతో వాయుదేవుని ప్రార్థించాడు. ఇద్దరూ కలసి ఆ సర్పమున్న గుహలోకి (లేదా పర్వతంలోకి) వెళ్ళి దానిని చంపి పశువులను విడిపించారు. త్రైతో తొలి యోధుడయ్యాడు. ఈ విధంగా ప్రజలకు చెందిన పశుసంపదను తిరిగి చేజిక్కించుకున్న త్రైతో ఋత్విక్కులకు పశువులను దక్షిణగా ఇచ్చాడు. ఆకాశ దేవతలకు యజ్ఞహవిస్సులో భాగం కల్పించాడు. ఈ విధంగా దేవతలకు, మనుషులకు మధ్య ఇచ్చిపుచ్చుకునే సంబంధం మొదలైంది.

యెమో-యమ-యిమ-రెముస్

          ప్రోటో-ఇండో-యూరోపియన్ మతవిశ్వాసాలకు ఈ రెండు కథలూ పునాదులంటాడు డేవిడ్ ఆంథోనీ. ‘మను-యెమో’ అనే ఈ రెండు పేర్లూ అనేక ఇండో-యూరోపియన్ శాఖలకు చెందిన సృష్టి గాథల్లో వివిధ రూపాల్లో కనిపిస్తాయి. మానవులకు మూల పురుషుడుగా చెప్పే మనువు మనకు బాగా తెలిసిన వేద, పురాణ, ఇతిహాస ప్రసిద్ధుడే. మొట్టమొదట యజ్ఞం చేసినది మనువేనని ఋగ్వేదం చెబుతుంది. జర్మన్ లో ఈ పేరే మన్నుస్(Mannus) అయింది. ‘యెమో’ అనే పేరు సంస్కృతంలో యమ, అవెస్తాలో యిమ, నార్స్ లో యమిర్, బహుశా రోమన్ లో రెముస్(Remus) అయింది. అపహరణకు గురైన గోవులను తిరిగి తెచ్చిన త్రైతో అనే వీరుడి కథ భారత్, ఇరాన్, హిట్టైట్, నార్స్, రోమన్, గ్రీక్ పురాణ కథలన్నింటిలో కనిపిస్తుంది. అపహరించి గుహలో దాచిన గోవులను విడిపించి తెచ్చిన ఉదంతం ఋగ్వేదంలో మాటిమాటికీ ప్రస్తావనకు వస్తూ ఉంటుంది.

పశుపాలక జనాల ప్రాపంచిక దృక్పథం

          మనకు ఈ రోజున బాగా తెలిసిన ఋత్విక్కు (బ్రాహ్మణుడు), గోవు (పశుపాలకుడు-పశుసంపద), యోధుడు (క్షత్రియుడు) అనే మూడు స్టీరియో టైపుల మూలాలు పై కథల్లో స్పష్టంగా కనిపిస్తాయి. ప్రోటో-ఇండో-యూరోపియన్ భాషీయుల దృష్టిలో దేవుడి అనుగ్రహానికీ, భూమి ఉత్పాదకతకీ పశువు మౌలిక చిహ్నం అయిందని డేవిడ్ ఆంథోనీ అంటాడు.  సంస్కృతంలో గో శబ్దానికి భూమి అనే అర్థం కూడా ఉండడం గమనార్హం. గోవు నుంచే మనుషులను సృష్టించినట్టు కూడా ఇండో-యూరోపియన్ పురాణ కథలు చెబుతాయి. మొత్తం మీద కొడుకులకు, పశుసంపదకు అత్యున్నతస్థానమిచ్చే పురుషకేంద్రిత, పశుపాలక జనాల ప్రాపంచిక దృక్పథాన్నే ప్రోటో-ఇండో-యూరోపియన్ పురాణ కథలన్నీ పట్టిచూపుతాయని ఆయన అంటాడు.

సంగ్రామమే యజ్ఞం

          పశుపాలక ఆర్థికతకు సంబంధించిన ప్రతి అంశంతోనూ పైన చెప్పిన కథలలోని మత లక్షణాలు పెనవేసుకుని ఉండడం కనిపిస్తుంది. ఉదాహరణకు, గుర్రం మాలిమి కావడంతోనే పశువుల మందలను పెంచే సామర్థ్యం పెరిగి, మందలూ పెరిగాయి. దాంతో వాటికి విస్తారమైన పచ్చిక బీళ్ళు కావలసి వచ్చింది. అది ఘర్షణలకు దారితీసింది. అప్పుడే గుర్రపు స్వారీతో పాటే గదలు ధరించిన నాయకులు పుట్టారు. దొమ్మీలలో వీరత్వాన్ని చాటడం ఒక మతవిధిగా మారడమే కాదు; శత్రువులతో ఘర్షణకు దిగడం; శత్రువును చంపడం లేదా తను చావడం శాశ్వతమైన కీర్తిని, స్వర్గాన్ని తెచ్చిపెట్టే పవిత్ర ధర్మాలుగా పరిణమించాయి. ఈ ‘శాశ్వత యశస్సు, లేదా నశించని కీర్తి(imperishable fame) అనే భావన ఇండో-యూరోపియన్ జనాలందరిలో కనిపిస్తుందని డేవిడ్ ఆంథోనీ అంటాడు. ఇక మన మహాభారతంలో అయితే, సంగ్రామాన్ని ఏకంగా యజ్ఞంతో పోల్చుతూ, ‘సంగ్రామ యజ్ఞం’ అంటాడు భీష్ముడు.

రాగియుగంలోవి తెగల ఘర్షణలు మాత్రమే

          డేవిడ్ ఆంథోనీ మాటల్లో చెప్పాలంటే, రాగియుగంలో జరిగినవి తెగల మధ్య ఘర్షణలు మాత్రమే తప్ప పూర్తిస్థాయి యుద్ధాలు కావు. అప్పటికి సుశిక్షితమైన సైన్యాలు లేవు. గుర్రంమీద వచ్చి దాడులు జరపడమే కానీ, అప్పటికి ఆశ్వికదళం అంటూ ప్రత్యేకంగా ఏర్పడలేదు. క్రీ.పూ. 1000 తర్వాతే, అంటే ఇనపయుగంలోనే ఆశ్వికదళం ఏర్పడింది. మొదట్లో విల్లు అయిదడుగుల పొడవు ఉండేది కనుక గుర్రం మీద స్వారీ చేస్తూ వింటితో యుద్ధం చేయడం అంత ప్రభావం చూపేది కాదు. క్రీ.పూ. 1000లో చిన్నవిల్లు వాడకంలోకి వచ్చిన తర్వాతే గుర్రంమీంచి యుద్ధం చేయడం ప్రభావం చూపడం ప్రారంభించింది. ఆ తర్వాత రథం మీంచి వింటితో యుద్ధం చేయడం వచ్చింది.

దాడులూ, అపహరణలూ కూడా మతవిధులే

          యుద్ధాలలో విజయం కోసం పొత్తులు పెట్టుకోవడం, స్నేహధర్మాన్ని పాటించడం ఒక గొప్ప ఆదర్శంగా మారడమే కాక; అగ్నిసాక్షిరూపంలో స్నేహానికి ఒక పవిత్రతా స్పర్శను ఇవ్వడం కనిపిస్తుంది. విందులు, వితరణలు, కానుకలు, సంపద పునః పంపిణీ మొదలైనవి కూడా ఇంచు మించు మతవిధులుగా మారాయి. చివరికి శత్రుజనాల పై దాడులు జరిపి వారికి చెందిన పశువుల మందలను అపహరించడం కూడా మతపరమైన తంతుగా మారింది. ఇలాంటి గోగ్రహణాలూ, అందుకు ప్రతీకారంగా అవతలివైపు నుంచి జరిగిన దాడులూ-ఈ ఘర్షణల చక్రం –బహుశా యూరప్ లో డాన్యూబ్ నదీలోయలోని వ్యవసాయ జనావాసాల పతనానికి దారి తీసి ఉండవచ్చునంటాడు డేవిడ్ ఆంథోనీ.  వీటన్నింటి ఉదాహరణాలూ ఋగ్వేదంలోనూ, మహాభారతంలోనూ కూడా పుష్కలంగా కనిపిస్తాయి.

పోషక-ఆశ్రిత సంబంధం

          ఒక పక్క ఘర్షణలున్నా, ఇంకో పక్క కానుకలు, వివాహ సంబంధాల రూపంలో ఇచ్చిపుచ్చుకోవడాలూ;  పరస్పర లాభదాయకమైన వాణిజ్య సంబంధాలను కల్పించు కోవడమూ ఉండేది. పశుసంపదలో నష్టాలకు ఎక్కువ అవకాశం ఉంటుంది కనుక వాటిని పూడ్చుకోవడంలో భాగంగా భూమి కోసం సంపన్న పశుపాలకులు వ్యవసాయ జనంతో పొత్తు పెట్టుకునేవారు. స్టెప్పీ పశుపాలకులు లోహాలు, వస్త్రాలు, ధాన్యం మొదలైనవాటిని వ్యవసాయ జనాల నుంచి తీసుకుని, వాటికి ప్రతిగా వారి పశువులను తమ మందలో కలుపుకుని కాచేవారు. పశుసంపద కారణంగా నాయకులు పోషకులుగా మారారు. అది పోషక-ఆశ్రిత వ్యవస్థను ఏర్పరచింది. దీనిని Patron-Client సంబంధమన్నాడు డేవిడ్ ఆంథోనీ. అలాగే, అతిథి-ఆతిథ్యకర్త (Guest-Host) సంబంధం అభివృద్ధి చెందింది. ఇంకో పక్క, తనవారు-పరులు అన్న తేడా ముందుకొచ్చి ఒకే ప్రాంతంలోని జనాల మధ్య చీలిక తెచ్చింది. వీటి ప్రతిరూపాలన్నీ వేద, పురాణ, ఇతిహాసాలలో కనిపిస్తాయి. 5,300 నుంచి 5200 వందల సంవత్సరాల వెనకటి కాలానికి చెందిన ఉశతోవో (Usatovo) సంస్కృతిలో స్టెప్పీ జనం పోలండ్ లోని వ్యవసాయ జనాన్ని ఎలా లోబరచుకుని పోషక-ఆశ్రిత సంబంధాన్ని నెలకొల్పారో డేవిడ్ ఆంథోనీ చెబుతాడు. అందులో ఘర్షణ-సయోధ్య… రెండూ మిళితమై ఉంటాయి.

***

          మిత్రులారా! నేనిక్కడ కేవలం అత్యంతప్రాచీన గతానికి చెందిన ఏవో విషయాలను తవ్విపోశానని అనుకోవద్దు. పైన చెప్పిన వాటిలో ప్రతి ఒక్క వివరం వర్తమానంతో సంబంధం ఉన్నదేననీ, వేర్వేరురూపాలలో నడుస్తున్న కథేనని మీకు హామీ ఇస్తున్నాను!

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.