నా శరీరం నా సొంతం!

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-తిరుమలశ్రీ

         రాత్రి మొదలైన వర్షం ఇంకా కురుస్తూనేవుంది. బంగళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందట. దాని ప్రభావమే అయ్యుంటుంది. ఆ రోజు సెలవుదినం కావడంతో ఆలస్యంగా నిద్రలేచింది నీహారిక. బయటి వాతావరణం చూస్తూంటే చికాకుగా అనిపించింది. కాలకృత్యాలు తీర్చుకుని, ఇన్ స్టెంట్ కాఫీ కలుపుకుంది. సిప్ చేస్తూ కిటికీ దగ్గర నిలుచుని బైటకు చూడసాగింది. ఆ వాతావరణంలాగే ఆమె మనసులో కూడా ముసురు పట్టింది. అందుక్కారణం– గతదినం తల్లి దగ్గర నుండి వచ్చిన ఉత్తరం.

         కాఫీ త్రాగేసి, కప్పును సింకులో పడేసి వచ్చి టేబుల్ మీదున్న తల్లి ఉత్తరం తీసుకుని మళ్ళీ చదువుకుంది– ‘నీహా! ఫోన్ చేస్తే చెప్పేది పూర్తిగా వినకుండానే పెట్టేస్తున్నావు నువ్వు. అందుకే ఉత్తరం వ్రాయవలసివచ్చింది…నీ పెళ్ళి విషయాన్ని ఎప్పటికప్పుడు వాయిదావేస్తూ వస్తున్నావు. నా మాట పెడచెవిన పెడుతున్నావు. నువ్వింకా చిన్నపిల్లవు కాదు. ఇరవయ్ మూడేళ్ళు వచ్చేసాయి. బంగారు బొమ్మలా వుంటావు. చక్కటి ఉద్యోగం చేస్తున్నావు. పెళ్ళి గురించి ఆలోచించడానికి ఇంతకంటే ఏం కావాలి!?

         మావయ్య కూతురు సరిత నీ కంటే రెండేళ్ళే పెద్దది. డిగ్రీ పూర్తికాగానే బుద్ధిగా పెద్దల మాటవిని పెళ్ళి చేసేసుకుంది. ఇప్పుడు దానికో ముద్దులొలికే బాబు…నీహా! నా మాట వినవే…నేను ఎన్నాళ్ళుంటానో తెలియదు. నా చేతులతో ప్రేమగా నీ తల పైన నాలుగు అక్షితలు వేయాలన్న ప్రగాఢమైన కోరిక నాది. మీ నాన్నే బతికుంటే నాకు ఈ తిప్పలు ఉండేవి కాదు గదా! నువ్వు ఆయన మాట కాదనేదానివా?

         మావయ్య నీ కోసం చక్కటి సంబంధాలు తెస్తున్నాడు. నీ అందం, చదువు, ఉద్యోగం చూసి నిన్ను తమ కోడల్ని చేసుకోవాలని ఎందరో ఉవ్విళ్ళూరుతున్నారు…అన్నట్టు, నీకు ఈ ఉత్తరం రాయడానికి కారణం- మొన్న సరిత వచ్చింది. దాని అత్తింటి తరపు బంధువులలో ఓ అబ్బాయి ఉన్నాడట. ఎంబీయే చేసి ఓ ఫైనాన్స్ కంపెనీలో కన్సల్టెంట్ గా పనిచేస్తున్నాడట. నెలకు లక్షన్నర జీతమట. నీ ఫొటో చూసి నిన్ను ఇష్టపడు తున్నాడట. నువ్వు కూడా అబ్బాయిని చూసుకుని ‘వూఁ’ అన్నావంటే, ఈ శ్రావణంలోనే ముహూర్తాలు పెట్టేసుకోవచ్చునంది. తాను నీకు ఫోన్ చేస్తానంది.

         ‘నీహా! అందం, వయసు శాశ్వతం కాదు. వాటి కళ తప్పాక, మనం ఎంత కాళ్ళావెళ్ళా పడ్డా కోరుకున్న సంబంధాలు రావు. ఆలోచించుకో! నువ్వు సరేనంటే పెళ్ళి చూపులకు ఏర్పాటుచేసి నీకు తెలియపరుస్తాము…ఎప్పటిలాగే ఈ ఉత్తరాన్ని కూడా బుట్టదాఖలు చేయకుండా, కాస్త శాంతంగా ఆలోచించవే! నాకు మనశ్శాంతి చేకూర్చు…

ఇట్లు, మీ

అమ్మ’

         గాఢంగా నిట్టూర్చి ఉత్తరం టీపాయ్ మీద పడేసింది నీహారిక. ప్రతి అక్షరంలోనూ తల్లి మనసు పడే ఆరాటం, ఆవేదన ప్రస్ఫుటమవుతున్నాయి. కానీ…

***         

         ఇరవయ్ మూడేళ్ళ నీహారిక తెల్లగా, సన్నగా, పొడవుగా…ఒకప్పటి బార్బీ బొమ్మలా…అందంగా ఉంటుంది. కంప్యూటర్స్ లో పీజీ చేస్తూండగానే క్యాంపస్ సెలెక్షన్లో ఓ ఎమ్మెన్సీకి ఎంపిక అయింది. చదువు ముగియగానే ఆఫర్ లెటర్ అందడమూ, ఉద్యోగంలో చేరడమూ జరిగిపోయాయి. బెంగళూరులో పోస్టింగ్. నెలకు ఎనభై వేల రూపాయల జీతం. కంపెనీ ఇచ్చిన వర్కింగ్ విమెన్స్ ఎగ్జిక్యూటివ్ హాస్టల్లో మకాం.

         నీహారిక పదేళ్ళ వయసులో తండ్రి ఓ రోడ్ ప్రమాదంలో మరణించడంతో, పిల్లల బాధ్యత తల్లి వత్సల మీద పడింది. నీహారిక తమ్ముడు ఆమెకంటే అయిదేళ్ళు చిన్నవాడు.

         వత్సల అన్న ఈశ్వరరావు ముంబయ్ స్టాక్ ఎక్ స్ఛేంజిలో బ్రోకర్. ఆటుపోట్లకు తట్టుకుని బాగానే సంపాదించాడు. సరిత ఒక్కతే సంతానం. నీహారిక కంటే రెండేళ్ళు పెద్దదామె.

         అన్నగారి సాయంతో పిల్లల్ని పెంచి పెద్దచేసింది వత్సల. కొడుకు ప్రస్తుతం డిగ్రీ చదువుతున్నాడు. ఆ కారణంగా హైదరాబాద్ లోనే ఉండిపోయింది వత్సల, బెంగళూరు వచ్చేయమని కూతురు చెబుతున్నాసరే.

         నీహారిక ఉద్యోగంలో చేరి ఏడాది అయిపోయింది. వీలయినంత త్వరగా కూతురి పెళ్ళి జరిపించేయాలన్నది వత్సల తహతహ. కానీ, ఎప్పుడు పెళ్ళి మాట ఎత్తినా నీహారిక దాటవేసేస్తోంది. సరిత వివాహమయి, కొడుకు పుట్టడంతో వత్సలకు కూతురి గురించిన బెంగ, ఆరాటం అధికమయ్యాయి.

         కూతుర్ని తలచుకుంటే ఒక్కోసారి భయం వేస్తుంది ఆమెకు. స్కూల్లో చదువుతున్నంత వరకు ఎంతో చురుకుగా, హుషారుగా, నలుగురితో కలివిడిగా మెలిగేది నీహారిక. కానీ, ఆ తరువాత హఠాత్తుగా ఆ పిల్లలో అనూహ్యమైన మార్పు వచ్చింది. మునుపటిలా ఎవరితోనూ కలవదు. అవసరమైతే తప్ప నోరు మెదపదు. ఎప్పుడూ ఏదో లోకంలో ఉంటుంది. ఎటో చూస్తూ ఏదో ఆలోచిస్తూ వుంటుంది. ఇట్రావర్ట్ గా మారి పోయింది. వయసుతోపాటు ఆ మార్పు కొట్టవచ్చినట్టుగా కనిపించసాగింది. తన మనసులో ఏముందో చెప్పదు. అడగబోతే విసుక్కుంటుంది…

***

         కిటికీలోంచి బయటకు చూసింది నీహారిక. వర్షం తగ్గే సూచనలు కనిపించడం లేదు. వారాంతంలో ఆరంభమైన వర్షం ఓ పట్టాన ఆగదంటారు!…తనమీద తనకే విసుగ్గా, కోపంగా ఉంటోంది ఆమెకు. ఆఫీసులో ఉన్నంత వరకు పనిలో నిమగ్నమయిపోతుంది. కొలీగ్స్ తో సరదాగా కబుర్లు చెబుతుంది… కానీ, అంతలోనే హఠాత్తుగా మూడ్ మారి పోతుంది. ఎరను మ్రింగిన కొండచిలువలా మనసంతా స్థబ్ధుగా అయిపోతుంది. విసుగు, చిరాకు పెనవేసుకుంటాయి. ఏదో తెలియని కోపం. ఎవరి మీదో తెలియదు. తన మీద తనకే అసహ్యం…ఏవేవో జ్ఞాపకాలు– రేగిన పుండులా- మదిని కెలుకుతాయి. బాహ్యాన్ని మరచిపోతుంది. కనిపించని శత్రువుతో ప్రచ్ఛన్నయుద్ధం చేస్తుంది…తన పరిస్థితి తనకే తెలియని అయోమయం!

         పిన్న వయసులోనే తోడును కోల్పోయి…జీవితంతో ఒంటరి పోరాటం సలుపుతూ…పిల్లలిద్దరినీ ప్రయోజకుల్ని చేసింది అమ్మ. అటువంటి అమ్మకు మనస్తాపం కలిగిస్తు న్నందుకు నీహారిక బాధపడని రోజు లేదు. కానీ, ఎంత ప్రయత్నించినా మనసుకు సమాధానం చెప్పుకోలేక పోతోంది…

***

         నీహారిక కొలీగ్ రోహిత్ ఆమె కంటే రెండేళ్ళు సీనియర్. హ్యాండ్సమ్ గా ఉంటాడు. పీ.ఆర్. సెక్షన్ లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్నాడు. ఏడాది క్రితం నీహారిక జాయినింగ్ రిపోర్ట్ ఇవ్వడానికి వచ్చినప్పుడు చూసాడు ఆమెను. తొలిచూపులోనే ఆమె మీద మనసు పారేసుకున్నాడు. అప్పట్నుంచీ ఆమెతో స్నేహం కోసం ప్రాకులాడాడు. ఏదో ఒక మిషతో తరచు ఆమెను కలుస్తూనే వున్నాడు. తన మదిలోని మాటను ఆమెకు చెప్పాలని ప్రయత్నిస్తూనే వున్నాడు. కానీ, ధైర్యం చాలడంలేదు.

         ఆ రోజు లంచ్ అవర్ లో అంతా క్యాంటీన్ కి వెళ్ళిపోయారు. తయారుచేస్తూన్న స్టేట్మెంట్ పూర్తికానందున నీహారిక ఇంకా సిస్టమ్ ముందే కూర్చుంది.

         ఆమె ఒంటరిగా ఉండడం చూసి, ఆమె క్యూబికిల్ కి వచ్చాడు రోహిత్.

         “హాయ్!” అంటూ పలుకరించాడు. “లంచ్ కి వెళ్ళలేదా?”

         “మధ్యాహ్నం మీటింగ్ కి అవసరమైన బ్యాక్ గ్రౌండ్ మెటీరియల్ ఇంకా పూర్తికాలేదు” అంది నీహారిక.

         ఓ క్షణం తటపటాయించి అన్నాడతను- “నీహారికా! నిప్పును కప్పిన దుప్పటిలా అయిపోతోంది నా మనసు. ఇక నా వల్ల కాదు…”

         అతని ఉపమానానికి నవ్వు వచ్చింది ఆమెకు. లోపలే అణచేసుకుంది.

         “…తొలిచూపులోనే నా మనసును దోచుకున్నావు నువ్వు. మనం పెళ్ళి చేసుకుందాం. నువ్వు ‘వూఁ’ అంటే, వెళ్ళి మీ పెద్దల్ని కలుస్తాను”.

         నీలాల కనులను వెడల్పుచేసుకుని అతని వంక ఆశ్చర్యంగా చూసింది నీహారిక. కొన్నాళ్ళుగా అతని పోకడను గమనిస్తూనే వుంది. అటువంటిదేదో ఉండవచ్చునని అనుమానంగానే ఉంది.

         ఆమె మాట్లాడకపోవడంతో, “ఐ హోప్ యూ టూ లైక్ మీ” అన్నాడు మళ్ళీ.

         “సారీ! ఇప్పట్లో మేరేజ్ గురించి ఆలోచించడంలేదు నేను” అందామె మెల్లగా.

         అతని ముఖం కళ తప్పింది. “ఓకే. నీకు ఓ తోడు కావాలనిపించినప్పుడు… రోహిత్ అనేవాడొకడు నీ కోసం వేచివున్నాడన్న సంగతి మరచిపోవద్దు” అన్నాడు.

         నీహారిక హృదయ తటాకంలో రాయి పడింది. అది కల్లోలపు అలలను రేపింది.

         పెళ్ళి ఊసు అనీజీనెస్ కి గురిచేస్తుంది ఆమెను. రెస్ట్ లెస్ చేస్తుంది. ఇప్పుడూ అదే జరిగింది.

         మనసు పని మీద లగ్నం కావడం లేదు. లేచి, క్యాంటీన్ కి బయలుదేరింది.

***

         కోల్ కత్తా నుండి సరిత ఫోన్ చేసింది. ఆమె భర్త అక్కడ ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు.

         “వదినా! బాబు భలే ముద్దొస్తున్నాడు” అంది నీహారిక ఉత్సాహంగా. కొడుకు ఫొటోలను వాట్సాప్ లో పంపించింది సరిత. “మరి నీ బాబు సంగతో?” అడిగింది సరిత నవ్వుతూ.

         “నా బాబేమిటీ?” విస్తుపోయింది నీహారిక.

         “అదేనే, పెళ్ళి చేసుకుంటే నీకూ అలాంటి బుజ్జిగాడొకడు పుడతాడు కదా!” నవ్వింది సరిత. “అది కాదే, నీహా! అత్తయ్య నీకు చెప్పేవుంటుంది. మా అత్తింటి బంధువుల అబ్బాయి ఉన్నాడు. ఈడూ జోడూ బాగుంటుంది. నీ ఫొటో చూసినప్పట్నుంచీ నిన్ను చేసుకోవాలని వువ్విళ్ళూరుతున్నాడు. నువ్వు పచ్చజెండా ఊపావంటే ఫ్లైట్ లో ఎగిరొచ్చి నీ మ్రోల వాలతాడు…” చెప్పింది సరిత.

         “ఇప్పుడేగా జాబులో చేరాను. కాస్త నిలద్రొక్కుకున్నాక ఆలోచించవచ్చులే,” దాట వేయడానికి ప్రయత్నించింది నీహారిక.

         “ఉద్యోగంలో చేరి ఏడాది అయిపోయింది. నిన్నో మొన్నో చేరినట్టు మాట్లాడతా వేమిటే?” కించిత్తు విసుగ్గా అంది సరిత. ““ఏ ముచ్చట ఆ వయసులోనే జరగాలి. నీ గురించి అత్తయ్య బెంగపెట్టుకుంది. అసలు నీ ఆంతర్యమేమిటో నాకు బోధపడడం లేదు”.  నీహారిక మాట్లాడలేదు.

         “పోనీ, నీ మనసులో ఎవరైనా ఉన్నారా?” అడిగింది సరిత. అటువంటిదేమీ లేదంది నీహారిక.

         “ఏయ్, నీహా! ఓ విషయం చెప్పు. నీకు ఫ్రిజిడిటీ సమస్య ఉందా?” అనుమానంగా అడిగింది సరిత.

         “చఛఁ, అలాంటిదేమీ లేదు కానీ…బాబుకు నా ముద్దులు ఇవ్వు…” అనేసి ఫోన్ డిస్కనెక్ట్ చేసేసింది నీహారిక. ‘ఫ్రిజిడిటీ, మై ఫుట్!’ అనుకుంటూ పళ్ళు కొరుక్కుంది.

         ఎనిమిదేళ్ళ క్రిందటి సంఘటన హఠాత్తుగా ఆమె మనోపథంలో మెదిలింది…అప్పుడే జరిగినట్టు- తాజాగా…

***

         అప్పుడు తన వయసు పదిహేనేళ్ళు. టెన్త్ చదువుతోంది. వేసవిలో బంధువులమ్మాయి పెళ్ళికి గుంటూరు వెళ్ళారు అమ్మ, తను, తమ్ముడూను…ఎక్కడెక్కడి నుండో చుట్టాలందరూ రావడంతో తిరునాళ్ళలా ఉంది పెళ్ళివారి ఇల్లు. తన వయసు అమ్మాయిలు, అబ్బాయిలూ…చిన్నపిల్లలూ…చాలా మందే ఉండడంతో సందడే సందడి. ఆటలు, పాటలు, పందేలు, గిల్లికజ్జాలు- గంటలు నిముషాలలా గడచిపోయేవి.

         పెళ్ళయిపోయింది. పెళ్ళికూతురు భర్తతో వెళ్ళిపోయింది. మూడు రోజుల తరువాత తిరిగివస్తుందట. ఆ తరువాత ఇంకా వేడుకలు ఉంటాయట. అంత వరకు ఉండ మన్నారు. కానీ, ‘నీహా పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేసుకోవలసి వుంది. వీలుపడదు’ అని చెప్పింది అమ్మ.  

         అది ఆఖరు రాత్రి. మర్నాడే తమ తిరుగు ప్రయాణం. వెళ్ళిపోయిన వాళ్ళు వెళ్ళిపోగా, మిగిలిన పిల్లలంతా రాత్రి చాలాసేపటి వరకు ఆడుకుని, అలసిపోయి ఆదమరచి నిద్రపోయారు…’

         ఆ రాత్రి జరిగిన దుర్ఘటన మదిలో మెదలడంతో ఒళ్ళు జలదరించింది నీహారికకు. గుండె వేగం హెచ్చింది. ఒళ్ళంతా చెమటలు పోసాయి. ఫ్రిజ్ లోంచి వాటర్ బాటిల్ తీసుకుని చల్లటి నీళ్ళు గడగడా త్రాగేసింది. గుండె దడ కొంచెం తగ్గినట్టయింది.

         ‘…అర్థరాత్రి హఠాత్తుగా మెలకువ వచ్చింది తనకు. గదిలో చీకటిగా వుంది. మొదట తాను ఎక్కడుందో, ఏం జరుగుతోందో తెలియలేదు…ఎవరిదో చేయి తన వక్షాన్ని వొత్తడం తెలుస్తోంది. తన ఒళ్ళంతా తడుముతూండడం తెలుస్తోంది. చేయి తొడల మధ్య కదులుతోంది…తనకు ఏదేదో అయిపోతోంది…’

         అదిరిపడింది తాను. పూర్తి స్పృహలోకి వచ్చిన తనకు ఏం జరుగుతున్నదీ గ్రహింపుకు వచ్చింది. లంగా, ఓణీ చెదిరిపోయాయి. ఎవరో తన శరీరమంతా తడుము తున్నారు! తొడల నడుమ చేతివ్రేళ్ళు చొప్పిస్తున్నారు!!…ఒళ్ళంతా కంపరం పుట్టింది.

         విభ్రాంతికి గురైన తనకు నోటమ్మట మాట రాలేదు. ఆ చేతుల్ని వదిలించుకో వడానికి విఫల ప్రయత్నం చేసింది. రాత్రి పడుకునే ముందు గ్రుచ్చుకుంటోందని మెళ్ళోని పెండెంట్ ని తీసి పక్కన పెట్టింది. దాన్ని తీసి ఆ వ్యక్తి పైకి విసిరింది. కాలితో తన్నింది. ఎలాగో నోరు పెకల్చుకుని, ‘తమ్ముడూ!’ అని పిలిచింది. పక్కనే గాడనిద్రలో ఉన్న తమ్ముడు లేవలేదు కానీ, ఆ వ్యక్తి తనను వదిలేసి పారిపోయాడు.

         చివాలున లేచి దుస్తులు సరిచేసుకుంది. చీకట్లో తడుముకుంటూ వెళ్ళి స్విచ్ ఆన్ చేసి లైట్ వెలిగించింది. అందరూ గాఢనిద్రలో ఉన్నారు. గుమ్మం వద్దకు పరుగెత్తుకు వెళ్ళి బయట చూసింది. ఎవరూ కనిపించలేదు. తిరిగివచ్చి తాను విసిరిన పెండెంట్ కోసం వెదికింది. ఎక్కడా కనిపించలేదు. అది చిన్నది కూడా కాదు. ఆ వ్యక్తి దాన్ని తీసుకు పోయుంటాడనుకుంది…’

         అందరూ చుట్టాలే. అయినవాళ్ళే! వారిలో ఆ ‘చెత్తపని’ చేసిందెవరో ఎలా కనిపెట్టడం?…ఎవరితో చెప్పుకోవాలి? ఏమని చెప్పుకోవాలి??

         మర్నాడు తాను ఒంటరిగా కూర్చుని ఏడుస్తూంటే, సరిత వదిన చూసి కారణం అడిగింది. భోరుమంటూ జరిగింది చెప్పింది తాను. వదిన నిర్ఘాంతపోయింది. ఎక్కడో పొరపాటు జరిగివుంటుందనీ,  ఎవరికీ చెప్పొద్దనీ, అదో పీడకలగా భావించి అంతటితో మరచిపొమ్మనీ సలహా ఇచ్చింది…

         కానీ, ఎలా మరచిపోగలదు తాను!? ఆ రోజు నుంచీ…ప్రతిరోజూ…ఎనిమిదేళ్ళుగా…తనకు తాను క్షమాపణలు చెప్పుకుంటూనే వుంది- ఆడపిల్లగా పుట్టినందుకు! తన శరీరం పరపురుషుడికి ‘ఆటస్థలం’ అయినందుకు!! ఓ మృగాడు తన శరీరాన్ని తాకినందుకు!!!…

         ‘నా శరీరం నా స్వంతం. నా అనుమతి లేకుండా నా శరీరాన్ని తాకే హక్కు ఏ మగాడికీ లేదు!’- అనుకుంది బిట్టర్ గా.

***              

         తల్లి ఫోన్ చేసింది- “నీహా! రాత్రి మావయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిందట. హాస్పిటల్లో ఉన్నాడట. సరిత ఉదయం ఫ్లైట్ లో ముంబయ్ చేరుకుంది. నేనూ, తమ్ముడూ వెళుతున్నాము. నువ్వు కూడా వెంటనే బైలుదేరి రా” అంటూ.

         తమ కుటుంబానికి సాయం చేసిన మావయ్యకు హార్ట్ ఎటాక్ వచ్చిందంటే నీహారిక మనసు కలత చెందింది. ఏడాది క్రితం అత్తయ్య కాలం చేసింది. అప్పట్నుంచీ ఒంటరిగానే ఉంటున్నాడతను.

         వెంటనే బైలుదేరడానికి కుదరలేదు నీహారికకు. మర్నాటి ఉదయం ఫ్లైట్ లో బైలుదేరింది. సయాన్ లోని ఇంటికి చేరుకునేసరికి పది గంటలయింది. ఇంట్లో పనిమనిషి మాత్రం ఉంది. అందరూ హాస్పిటల్లో ఉన్నారట… సరితతో ఫోన్లో మాట్లాడింది నీహారిక.  తండ్రి అవుటాఫ్ డేంజరనీ, పరిస్థితి మెరుగవడంతో ఐసియు నుండి స్పెషల్ రూమ్ కి మార్చారనీ, సెడేషన్లో ఉన్నాడనీ, తాము తిరిగివస్తున్నామని చెప్పింది సరిత.

         నీహారిక వాష్ చేసుకుని తయారయింది. బ్రేక్ ఫాస్ట్ ఫ్లైట్ లోనే చేసేసింది. హాస్పిటల్ కి వెళ్ళిన వాళ్ళు వచ్చేంత వరకు కాలక్షేపానికి మావయ్య ఆఫీసు రూమ్ లోని పుస్తకాల షెల్ఫ్ మీద దాడిచేసింది. స్టాకులు, షేర్లు, ఇన్వెస్ట్ మెంట్లకు సంబంధించిన పుస్తకాలే అన్నీను. ఒక్కొక్కటే తీసి చూస్తూంటే, లోపలి వరుసలోని పుస్తకాల మధ్య కనిపించిన వస్తువును చూసి ఉలిక్కి పడిందామె.

         దాన్ని చేతుల్లోకి తీసుకుని పరిశీలిస్తూంటే, దాని మీదున్న ‘ఎన్’ అన్న అక్షరం పలుకరించింది. ఆమె గుండె ఓ బీట్ ని మిస్ చేసింది…అది- తన పెండెంట్! ఎనిమిదేళ్ళ క్రితం పోగొట్టుకున్నది!!…చేష్టలు ఉడిగి నిలుచుండి పోయిందామె.

         అలా ఎంతసేపు ఉండిపోయిందో తెలియదు, చప్పుడు కావడంతో తేరుకుంది. గుమ్మంలో సరిత నిలుచుని వుంది. కంగారుగా పెండెంటును యధాస్థానంలో పెట్టేసింది నీహారిక.

         సరిత వచ్చి ఆమెను ఆప్యాయంగా కౌగలించుకుంది. తల్లి, తమ్ముడూ పలుకరించారు. తల్లి చేతిలో వున్న బాబును తీసుకుని ముద్దులాడింది నీహారిక. “అన్నయ్య గారు రాలేదా?” అనడిగింది సరితను. భర్త టూర్ లో ఉన్నాడనీ, ఆ రోజు రాత్రికి వస్తాడనీ చెప్పిందామె…అందరితో మామూలుగా మాట్లాడుతున్నా, నీహారిక అన్యమనస్కంగా ఉండడం ఆమె దృష్టిని తప్పించుకో లేదు.

         ‘సయాన్ హాస్పిటల్’ గా పేరుగాంచిన ‘లోకమాన్య తిలక్ హాస్పిటల్’ సయాన్ లోనే ఉంది…సాయంత్రం నీహారికను హాస్పిటల్ కి  తీసుకువెళ్ళింది సరిత…

         మేనమామకు యాభయ్ మూడేళ్ళుంటాయి. ఇంకా సెడేషన్లోనే ఉన్నాడు. నోటికి, ముక్కుకు, చేతులకూ ట్యూబ్స్ ఉన్నాయి. ఆక్సిజన్ పెట్టారు.  

         అతనివంక నిస్తేజంగా, నిర్లిప్తంగా చూసింది నీహారిక. ‘ఎందుకు, మావయ్యా…ఎందుకు చేసావు ఆ పని? చిన్నప్పుడు నీ ఒళ్ళో ఆడుకున్నదాన్ని. నీ కూతురు లాంటి దాన్ని…నీకూ నా లాంటి ఓ కూతురు ఉందన్న సంగతి ఎలా మరచిపోయావు, మావయ్యా? ఆ పని చేసింది నువ్వేననుకుంటే…నాకు చచ్చిపోవాలనిపిస్తోంది…’ – ఆమె మనసు ఆక్రోశించింది.

         కాసేపటి తరువాత సరిత, “వెళదామా?” అనడంతో, తలూపింది. గదిలోంచి బైటకు నడచారిద్దరూ. నాలుగు అడుగులు వేసాక, “నీహా! నువ్వు నడుస్తూవుండు. ఇప్పుడే వస్తాను” అని చెప్పి, తిరిగి గదిలోకి వెళ్ళింది సరిత.

         ఓ క్షణం కోమాలో ఉన్న తండ్రివంక తదేకంగా చూసింది. “నాన్నా! ఇందాక నీహా నీ అలమరలోంచి తీసిన పెండెంట్ ని చూసేంత వరకు, దాని స్థితికి కారణం నువ్వేనన్న నిజం ఎరుగను నేను…ఎందుకు చేసావు నాన్నా, ఆ పని?” అంటూంటే ఆమె కన్నుల వెంట నీళ్ళు జలజల రాలాయి. “ఆడపిల్ల ఎవరైనా ఒకటే, నాన్నా! నీహా కూడా నీ కూతురి లాంటిదే కదా! ఇంకెందరు అమ్మాయిలు నీ నైచ్యానికి బలయివుంటారో తలచుకుంటేనే ఒళ్ళంతా గగుర్పొడుస్తోంది. ఆడపిల్లల పట్ల ఎవరు అనుచితంగా ప్రవర్తించినా క్షమార్హులు కారు. కన్నతండ్రైనా సరే!…”

         “నన్ను క్షమించు!” అంటూ చేతులు జోడించి, ఆక్సిజన్ ట్యూబ్ ని తొలగించి, బరువెక్కిన హృదయంతో బయటకు నడచింది.  

*****

Please follow and like us:

One thought on “నా శరీరం నా సొంతం (నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)”

Leave a Reply

Your email address will not be published.