సీతాకోక చిలుక‌లు

(నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక & అర్చన ఫైన్ ఆర్ట్స్ అకాడమీ & శ్రీ శారదా సత్యన్నారాయణ మెమోరియల్ ఛారిటబుల్ ట్రస్ట్ కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎన్నికైన కథ)

-అయ్యగారి శర్మ

         అగ్గిపుల్ల భ‌గ్గుమంది, ఆ అమ్మాయిల గుండెల్లో మంట‌లాగే!

         ఆ అగ్గిపుల్ల ఓ కొవ్వొత్తిని వెలిగించింది. ఆ కొవ్వొత్తి నుంచి ఒక‌దాని త‌ర్వాత
ఒక‌టిగా కొవ్వొత్తులు వెలిగాయి.

         ఆ కొవ్వొత్తుల జ్వాల‌ల్లో ఓ ఉద్వేగం రెప‌రెప‌లాడింది. ఓ ఆవేద‌న జ్వ‌లించింది.
అమ్మాయిలంద‌రూ అక్క‌డ పెట్టిన కొవ్వొత్తుల వెలుగులో అక్క‌డి చిత్ర‌ప‌టం వింత‌గా ప్ర‌కాశించింది. అంద‌రూ మౌనంగా క‌ళ్లు మూసుకున్నారు. ఆ రెండు నిమిషాల మౌనం ఓ అమానుష ఘ‌ట‌న ప‌ట్ల సంఘ‌టిత‌మైన సంక‌ల్ప‌మై ఆ చిత్ర‌ప‌టంలోని అమ్మాయి క‌ళ్ల‌లో ప్ర‌తిఫ‌లించింది.

         నిన్న మొన్న‌టి వ‌ర‌కు క‌ళ‌క‌ళ‌లాడుతూ త‌మ‌తో తిరిగిన ల‌లిత, ఇలా కొవ్వొత్తుల ముందు చిత్ర‌ప‌టంగా మార‌డాన్ని ఆ అమ్మాయిలు ఇంకా జీర్ణించుకోలేక‌పోతున్నారు.
మ‌న‌సులో సుడులు తిరుగుతున్న బాధ‌, వాళ్ల క‌ళ్ల‌లో స‌న్న‌టి నీటి పొర‌గా మారింది. ఆ
రోజు క‌ళాశాల‌కు సెల‌వు ప్ర‌క‌టించారు.

         ఆ మ‌ర్నాటి నుంచీ, ల‌లిత ఇంట్లో ఘ‌ణీభ‌వించిన విషాదం మిన‌హా అంతా మామూలుగా మారింది.

         “ల‌లిత క‌ళ్ల ముందు క‌దులుతోందే… రాత్రి నిద్ద‌రప‌ట్ట‌లేదు” అంది అప‌ర్ణ‌.

         “అవునే… నాకూ అంతే…” అంది శైల‌జ‌.

         ఇద్ద‌రూ మామూలుగానే బ‌స్టాపులో నుంచున్నారు. ఇంత‌లో బ‌ర్రుమంటూ ఓ బైక్ వ‌చ్చి అక్క‌డి బ‌డ్డీకొట్టు ముందు ఆగింది.

         “వాడే…” అంది శైల‌జ గుస‌గుస‌గా.

         అప‌ర్ణ జుట్టు స‌వ‌రించుకున్న‌ట్టుగా త‌ల‌తిప్పి ఓర‌గా చూసింది. వాడు బైక్ దిగి
నిర్ల‌క్ష్యంగా క్రాఫ్ స‌వ‌రించుకుంటూ బైక్ అద్దంలో చూసుకుని బ‌స్టాపులోకి రాసాగాడు.

         అప‌ర్ణ‌, శైల‌జ ఒక‌రికొక‌రు ద‌గ్గ‌ర‌గా జ‌రిగారు అప్ర‌య‌త్నంగా.

         ఈలోగా శాంతి, ల‌హ‌రి వ‌చ్చి క‌లిశారు. ప్ర‌కాష్ స్నేహితులు కూడా వచ్చారు.

         “ఎవ‌ర్రా… కొత్తా?” అన్నాడు ప్ర‌కాష్‌, అప‌ర్ణ‌ని ఉద్దేశించి.

         “అవును… వార‌మే అయింది చేరి…” అంటున్నాడు వ‌చ్చిన‌వాడు.

         దూరంగానే నుంచున్నా, వాళ్ల మాట‌లు వినిపిస్తూనే ఉన్నాయి అప‌ర్ణ‌కి, ఆమె
స్నేహితురాళ్ల‌కి. ఎవ‌రూ మాట్లాడ‌లేదు. బ‌స్సు రాగానే ముందు నుంచి అమ్మాయిలు, వెన‌క‌ నుంచి అబ్బాయిలు ఎక్కారు.

         “రైట్‌… రైట్‌…” అన్నాడు కండ‌క్ట‌ర్‌. కానీ అక్క‌డ జ‌రుగుతున్న‌దంతా రైట్ కాదు,
రాంగ్‌.

***

         ప‌ట్నంలోని కాలేజీకి వెళ్లాలంటే బ‌స్సు ఎక్క‌క త‌ప్ప‌ని అనేకానేక ఊళ్ల‌లో అదికూడా ఒక‌టి. బస్సు త‌ప్ప మ‌రో సౌక‌ర్యం కుద‌ర‌ని మ‌ధ్య‌త‌ర‌గ‌తి అమ్మాయిల్లో వాళ్లు కూడా ఒక‌ళ్లు. అమ్మాయిలు క‌నిపించ‌గానే వెకిలి వేషాలేసే అబ్బాయిలు అక్క‌డా ఉన్నారు. కానీ ఆ వెకిలిత‌నం ఆక‌తాయిత‌న‌మై, అది పోకిరిత‌నంతో జ‌ట్టుక‌ట్టి ఆపై అహంకారంతో క‌లిసి అకృత్యాల‌కు సైతం వెర‌వ‌ని తెంప‌రిత‌నమ‌వ‌డ‌మే ఆ అమ్మాయిల దౌర్భాగ్యం. వెన‌క‌ నుంచి ఎక్కినా ముందుకు వ‌చ్చి నుంచోడం, కుదుపుల్లో రాసుకున్న‌ట్టు మీద‌ప‌డ‌డం, కామెంట్లు చేయ‌డం లాంటి ద‌శ‌ల‌న్నింటినీ ఎప్పుడో దాటిపోయాయి ఆ బస్సులో ప‌రిస్థితులు. పైకి అంతా రైట్‌గానే క‌నిపిస్తుంది. కానీ జ‌రిగేదంతా రాంగే. అదే ల‌లిత మ‌న‌సును అల్ల‌క‌ల్లోలం చేసింది.

         “ఆ ప్రకాష్ ఫోన్‌లోకి నా ఫొటో ఎలా వ‌చ్చిందో తెలీదే. పైగా అది… అది…
బ‌ట్ట‌ల్లేకుండా ఉందే. దాన్ని చూపించి బెదిరిస్తున్నాడు. దాన్ని నెట్‌లో పోస్ట్ చేస్తా నంటున్నాడు…” అంటూ వెక్కివెక్కి ఏడ్చింది ల‌లిత‌.

         “ఏడిశాడు…ఏం కాదులే. భ‌య‌ప‌డ‌కు” అంటూ ఓదార్చింది భార్గ‌వి. ఆ త‌ర్వాత ల‌లిత రెండు రోజులు కాలేజీకి రాలేదు. మూడో రోజు ఇంట్లో గ‌దిలో ఫ్యాన్‌కు ఆమె నిస్స‌హాయ‌త వేలాడింది. ఆమె భ‌యం గుడ్లు తేలేసింది. పరువు పోతుంద‌నే ఆందోళ‌న‌, ఆమె బ‌తుకునే ఉరితీసింది.

         “ఎందుకింత ప‌ని చేసిందో నా చిట్టిత‌ల్లి…” అంటూ ఆమె త‌ల్లి గుండెలు బాదు కుంటూనే ఉంది. ఆమె సందేహం ఇప్ప‌టికీ తీర‌లేదు.

         భార్గ‌వి నుంచి అంతా విన్న అప‌ర్ణ చిగురుటాకులా వ‌ణికిపోయింది. ఆమె ఆ ఊళ్లోకి, ఆ కాలేజీలోకి వ‌చ్చి వార‌మైనా కాలేదు.

         “ఇంత జ‌రిగితే కొవ్వొత్తులు వెలిగించి మౌనం వ‌హిస్తే స‌రిపోతుందా?” అంది అప‌ర్ణ ఆవేశంగా.

         “అంత‌క‌న్నా ఏం చేస్తాం. నువ్వు జాగ్ర‌త్త‌. అస‌లే కొత్త‌గా వ‌చ్చావు” అంది భార్గ‌వి. శాంతి, ల‌హ‌రి, శైల‌జ కూడా మౌనంగానే త‌లూపారు. అప‌ర్ణ నిట్టూర్చింది.

         ఇంత‌లో బ‌స్సు వ‌చ్చింది. అంద‌రూ ఎక్కారు. “రైట్ రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         “హాయ్‌… నీ పేరు అప‌ర్ణ క‌దూ…” అనే మాట‌లు గుస‌గుస‌గా వినిపిస్తే చ‌టుక్కున
వెన‌క్కి తిరిగి చూసింది అప‌ర్ణ‌. ద‌గ్గ‌ర‌గా నుంచుని ఉన్నాడు ప్ర‌కాష్‌. అప‌ర్ణ పిడికిళ్లు బిగుసుకున్నాయి. ఏం మాట్లాడ‌లేదు. 

         “బాగున్నావ్‌… నీ ఫొటో ఇంకా బాగుంది తెలుసా?”

         అప‌ర్ణ గుండె ఝ‌ల్లుమంది.

         “లంచ్ బ్రేక్‌లో కాలేజీ వెన‌కాల మామిడి చెట్టు ద‌గ్గ‌ర‌కి వ‌స్తే చూపిస్తా…” అంటూ నెమ్మ‌దిగా అని ఆమె భుజాన్ని రాసుకుంటూ ముందుకు వెళ్లిపోయాడు ప్ర‌కాష్‌.

         కాలేజీ స్టాప్ వ‌చ్చేసింది. అప‌ర్ణ‌తో పాటు అంద‌రూ దిగారు. 

         “రైట్‌… రైట్‌… “అన్నాడు కండ‌క్ట‌ర్‌. బ‌స్సెళ్లిపోయింది.

***

         కాలేజీ వెన‌కాల మామిడి చెట్టు.

         “చెప్ప‌గానే వ‌చ్చావు… గుడ్‌… పైకొస్తావ్‌…” అన్నాడు ప్ర‌కాష్‌. అత‌డి మాట‌ల్లో వెకిలిత‌నం ప‌ళ్లికిలించింది. 

         అప‌ర్ణ నుదిటి మీద చిరు చెమ‌ట‌లు.

         “చూడు… నీ ఫొటో ఎంత బాగుందో” అంటూ ఫోన్ చూపించాడు. ఆ ఫొటో చూసి అప‌ర్ణ ముఖం జేవురించింది. బ‌స్సులోనో, కాలేజిలోనో, బ‌స్టాప్‌లోనో ఎక్క‌డ తీశాడో. మొహం త‌న‌దే. మిగ‌తా శ‌రీరం త‌న‌ది కాదు.

         “ఛీ” అనుకుంది అప‌ర్ణ‌. కంప్యూట‌ర్ మార్ఫింగ్.

         గొంతు పెగ‌ల్చుకుని చెప్పింది… “ప్లీజ్‌… దాన్ని డిలీట్ చెయ్యి” అంది భ‌యం భ‌యంగా.

         “త‌ప్ప‌కుండా చేస్తా, నేను చెప్పిన‌ట్టు చేస్తే… లేక‌పోతే ప్ర‌పంచమంతా చూస్తుంది మ‌రి…”

         “ఏం… ఏం… చేయాలి?”

         “రేపు ఆదివారం ఊళ్లో పాత‌బ‌డిన బంగ్లా వెన‌క్కిరా. స‌ర‌దాగా క‌బుర్లు చెప్పుకుందాం. ఇంట్లో సంత‌కి వెళ్తాన‌ని చెప్పులే. స‌రేనా?”

         “కానీ… నేనొక్క‌ర్తినీ రాలేను. భ‌యం…”

         “పోనీ… నీ ఫ్రెండ్స్‌ని కూడా తీసుకురా… మా వాళ్ల‌ని కూడా ర‌మ్మంటా… నీ ఫ్రెండ్స్‌ ఫొటోలు కూడా వాళ్ల ద‌గ్గ‌ర ఉన్నాయిలే. అవి కూడా చూపిస్తాం. సంత‌ అయిపోగానే వెళ్లిపోవ‌చ్చు… అన్న‌ట్టు సంచులు తెచ్చుకోండి. కూర‌లు మేం తెస్తాంలే…” అంటూ అదోలా న‌వ్వాడు ప్ర‌కాష్.

         కాలేజీ బెల్ మోగింది. ప‌రుగు ప‌రుగున వెళ్లిపోయింది అప‌ర్ణ‌. వెన‌కాల నుంచి ప్ర‌కాష్
త‌న ఫ్రెండ్స్‌తో హైఫైలు కొట్టుకోవ‌డం వినిపిస్తూనే ఉంది.

***

         బ‌స్టాప్ గుబులు గుబులుగా ఉంది. అప‌ర్ణ చెప్పిందంతా విని శాంతి, భార్గ‌వి, ల‌హ‌రి,
శైల‌జ‌ తెల్ల‌బోయారు.

         “ఇదంతా ఇంట్లో చెప్పేస్తోనో?”

         “మ‌న్నే తిడ‌తారు. పైగా కాలేజీ మానిపించేస్తారు…”

         “వాళ్లంత తెలివి త‌క్కువ వాళ్లేంటి? సిమ్ములు మార్చేస్తారు. ఫోన్లు చూసుకో మంటారు”

         “పోనీ వెళ్ల‌క‌పోతే?”

         “ఏమో… ఎవ‌రి ఫొటోలైనా ఫేస్బుక్‌లోనో, ట్విట‌ర్‌లోనో వ‌చ్చేస్తే?”

         “పైగా డేటింగ్ సైట్ల‌లో కూడా అప్‌లోడ్ చేస్తార‌ట‌…”

         “అప్పుడు మ‌న ఇంట్లో వాళ్లు కూడా త‌లెత్తుకోలేరు…”

         ఆ అమ్మాయిల భ‌యాలు, సందేహాలు ఆ బస్టాప్‌లో గుస‌గుస‌లాడాయి. ఏం చేయాలో
తోచ‌క గుబులుగా మాట్లాడుకున్నాయి. ఆఖ‌ర్న అప‌ర్ణ చెప్పింది. “అందుక‌నే అంద‌రం క‌లిసి వెళ్దాం. ఒక‌రికొక‌రం తోడు. ఇంట్లో కూడా అంద‌రం క‌లిసి అడిగితే పంపిస్తారు. వెళ్లి ఫొటోలు డిలీట్ చేయ‌మ‌ని అడుగుదాం”

         “మ‌రి వాళ్లు ఏమైనా చేస్తే?”

         “మ‌నం త‌క్కువ వాళ్ల‌మా? ఆ మాత్రం ఎదుర్కోలేమా?”

         చేసేదిలేక‌… వేరే దారి లేక‌… అమ్మాయిలు అంద‌రూ ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు.
స‌రేనంటే స‌రేన‌నుకున్నారు.

         బస్సొచ్చింది. అంద‌రూ బెదురుతున్న గుండెల్తో ఎక్కారు.

         “రైట్… రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         “రేపే సంత గుర్తుందా?” అన్నాడు ప్ర‌కాష్, అప‌ర్ణ కూర్చున్న సీటు వెన‌క రాడ్‌ పై
రెండు చేతులూ పెట్టి ముందుకు వంగి, ఆమె చెవిలో త‌న‌కు మాత్ర‌మే వినిపించేంత
మెల్ల‌గా. అప‌ర్ణ మెల్ల‌గా వెన‌క్కి తిరిగి న‌వ్వింది. బ‌స్సులో మిగ‌తా వాళ్ల‌కి స‌హ‌జంగా స్నేహితులు మాట్లాడుకున్న‌ట్టు క‌నిపించే ప్ర‌య‌త్నం అది. అలా న‌వ్వుతూనే, “కానీ మా అంద‌రి ఫొటోలు డిలీట్ చేసేయాలి మ‌రి…” అంది. ఆమె గొంతులో ఏదో క‌నిపించ‌ని భ‌యం.

         ప్ర‌కాష్‌కి ధైర్యం వ‌చ్చింది. ఏదో విజ‌యం సాధించిన‌ట్టు అత‌డి మొహం వెలిగింది.

         “త‌ప్ప‌కుండా… ప్రామిస్‌…”

         “కానీ ఒక్క ష‌ర‌తు. మేం వెంట‌నే వెళ్లిపోతాం”

         “ఓకే… జ‌స్ట్ టెన్ మినిట్స్ అంతే”

         “మ‌రేం భ‌యం లేదుగా?”

         “అస్స‌లు లేదు. మా ద‌గ్గ‌ర సేఫ్టీ మెజ‌ర్స్ అన్నీ ఉన్నాయి…” అప‌ర్ణ త‌లూపింది. ప్ర‌కాష్ త‌లెగ‌రేశాడు. ఇంత‌లో ఊరొచ్చేసింది. అంద‌రూ దిగిపోయారు.

         “రైట్‌…రైట్” అన్నాడు కండ‌క్ట‌ర్‌.

***

         అప‌ర్ణ‌, శాంతి, ల‌హ‌రి, శైల‌జ‌, భార్గ‌వి సంచుల‌తో న‌డుచుకుంటూ సంత‌కి బ‌య‌ల్దేరారు. సంత‌లోంచి అలా ముందుకు న‌డిచారు. కాస్త దూరంలో ఉన్న పాత‌ బంగ్లాలోకి ప్ర‌వేశించారు. ఆ ప‌క్క‌నే పొలంలో కొంత‌ మంది మ‌హిళ‌లు నాట్లు వేస్తున్నారు.

         “గుడ్ గాళ్స్‌…” అంటూ ప్ర‌కాష్ ఓ స్తంభం చాటు నుంచి ముందుకు వ‌చ్చాడు.
అమ్మాయిలు ద‌గ్గ‌ర ద‌గ్గ‌ర‌గా నుంచుని ఉన్నారు. మ‌రో ప‌క్క నుంచి ప్ర‌కాష్ ఫ్రెండ్స్ కూడా వ‌చ్చారు.

         “మ‌రి… ఫొటోలు డిలీట్ చేయండి…” అంది అప‌ర్ణ‌.

         ప్ర‌కాష్ గ‌ట్టిగా న‌వ్వాడు. “అప్పుడేనా… ఇప్పుడేగా వ‌చ్చారు. కూర‌లు కొనుక్కోవ‌ద్దూ…” అన్నాడు. 

         వాడి స్నేహితులు న‌వ్వారు.

         “ముందు ఫొటోలు చూపించండి” అంది అప‌ర్ణ‌.

         “ఇవిగో…” అంటూ స్నేహితులు ఫోన్లు తీశారు. అంద‌రి ఫోన్ల‌లోనూ వాళ్ల ఫొటోలు
ఉన్నాయి. జుగుప్సాక‌రంగా.

         త‌ర్వాత ఫోన్లు ఆఫ్ చేసి జేబుల్లో పెట్టుకున్నారు. అమ్మాయిల ద‌గ్గ‌ర‌గా వ‌చ్చారు. భుజాల మీద చేతులు వేశారు.

         అప్పుడు అప‌ర్ణ త‌న జాక‌ట్లోకి చెయ్యి పెట్టి తీసింది. అదొక విజిల్‌. వెంట‌నే నోట్లో పెట్టుకుని గ‌ట్టిగా ఊదింది. ఆ శ‌బ్దం ఆ బంగ్లా అంతా ప్ర‌తిధ్వ‌నించింది. పొలాల్లో నాట్లు వేస్తున్న మ‌హిళ‌లు ప‌రిగెత్తుకుని వ‌చ్చారు. బంగ్లా వెనుక ద్వారం నుంచి మ‌హిళా ఇన్‌స్పెక్ట‌ర్ వ‌చ్చింది. ఆమె చేతిలో రివాల్వ‌ర్‌. నాట్లు వేసే మ‌హిళ‌ల చేతుల్లో లాఠీలు. వాళ్లంతా షీటీమ్ స‌భ్యులు. ఈలోగా సంత‌లో మ‌ఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్‌తో పాటు, ఆ
అమ్మాయిల బంధువులు కూడా వ‌చ్చారు. 

         ప్ర‌కాష్ గ్యాంగ్ అంతా తెల్ల‌బోయారు. అంద‌రి ఫోన్లు క్ష‌ణాల్లో లాక్కున్నారు. ఫొటోలు చెక్ చేశారు. వెంట‌నే అరెస్ట్ చేశారు.

***

         అభినంద‌న స‌భ‌.

         షీటీమ్ ఇనస్పెక్ట‌ర్ మాట్లాడుతోంది.

         “ఈవ్‌టీజింగ్‌కి పాల్ప‌డే వాళ్ల‌ని ప‌ట్టుకోవ‌డం కోసం మేం బ‌స్సుల్లో అమ్మాయిల్లాగే తిరుగుతుంటాం. మ‌మ్మ‌ల్ని కూడా అల్ల‌రిపెట్టే ప్ర‌బుద్ధులు తార‌స‌ప‌డ‌తారు. అయితే అప‌ర్ణ‌లాంటి అమ్మాయిలు సాహ‌సంతో ముందుకు వచ్చిన‌ప్పుడే మేం పూర్తి స్థాయిలో ఇలాంటి వాళ్ల‌ని అరిక‌ట్ట‌గ‌లం. ఈ ఊర్లో ఆత్మ‌హ‌త్య చేసుకున్న ల‌లిత వెన‌కాల కూడా ఈ గ్యాంగ్ ఉన్నార‌ని అనుమానం వ‌చ్చినా ఎవ‌రూ ముందుకు వ‌చ్చి ఫిర్యాదు  చేయ‌క‌ పోవ‌డంతో ఏమీ చేయ‌లేక‌పోయాం. ముందు అప‌ర్ణ మ‌మ్మ‌ల్ని ఎప్రోచ్ అయిన‌ప్పుడు, చివ‌రి దాకా నిల‌బ‌డుతుందో లేదోన‌ని సందేహించాం. కానీ త‌ను నిల‌బ‌డ్డ‌మే కాదు, వాళ్ల స్నేహితురాళ్ల‌ని కూడా క‌లుపుకుని ఊళ్లో ఈవ్‌టీజ‌ర్లంద‌ర‌నీ ఒకేసారి ప‌ట్టించింది. ఐ ఎప్రీష‌యేట్ హెర్ బ్రేవిటీ”

         ఆ నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే మైక్ అందుకున్నాడు. “గూడును బ‌ద్ద‌లు కొట్టుకుని
బ‌య‌ట‌కి వ‌చ్చే సాహసం చేస్తేనే సీతాకోక చిలుక ఎగుర‌గ‌లుగుతుంది. ఈ అమ్మాయిలు
స‌హ‌జంగా భ‌య‌ప‌డే మ‌న‌స్త‌త్వాన్నుంచి బ‌య‌ట‌ప‌డి షీటీమ్‌ను క‌ల‌వ‌డం గొప్ప
విష‌యం. ఈ ఊళ్లో ఇంత జ‌రుగుతోంద‌ని నాకు తెలీదు. ఇక నుంచి ఇక్క‌డి అమ్మాయిల కోసం ప్ర‌త్యేక‌మైన బ‌స్ వేయిస్తాను. ఈ అమ్మాయిల సాహ‌సం నిజంగా అభినంద‌నీయం”

***

         ఊళ్లోకి బ‌స్సొచ్చి ఆగింది. అమ్మాయిలంతా సీతాకోక చిలుక‌ల్లాగా వ‌చ్చి బ‌స్సెక్కారు.

         కండ‌క్ట‌ర్ “రైట్‌…రైట్‌…” అన్నాడు ఇప్పుడు అది నిజంగా రైటే!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.