మా కథ (దొమితిలా చుంగారా)- 44

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

అంతర్జాతీయ మహిళా సమావేశంలో

          1974లో ఐక్యరాజ్యసమితి తరఫున ఒక బ్రెజిలియన్ సినిమా దర్శకురాలు బొలీవియాకు వచ్చింది. మహిళా ఉద్యమ నాయకులను కలుసుకొని, మహిళల స్థితి గతుల మీద వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడానికి, స్త్రీల పరిస్థితిని మెరుగు పరచడంలో వాళ్ళు ఎంత వరకూ ఏ రకంగా సాయపడగలరో తెలుసుకోవడానికి ఆవిడ లాటిన్ అమెరికన్ దేశాలన్నీ తిరుగుతోంది.

          మా గృహిణుల సంఘం గురించి విదేశాలలో విన్నప్పుడే ఆవిడకు ఆసక్తి కలిగింది. తర్వాత ఆవిడ “ప్రజా సాహసం” సినిమాలో సైగ్లో-20 స్త్రీలను కూడ చూసింది. ప్రభుత్వం దగ్గర తగిన అనుమతి తీసుకొని ఆవిడ మా దగ్గరికొచ్చింది. నాతో మాట్లాడాక ఆవిడకు నా మాటలు నచ్చాయి. నేను చెప్పిన విషయాలు బయటి ప్రపంచానికి తెలియవలసిన అవసరముందని ఆవిడంది. నేను విదేశాలకు రాగలనా అని ఆవిడ నన్నడిగింది. నా దేశంలో తిరగడానికి డబ్బులేని దాన్ని, నేనెక్కడికీ కదలలేనని నేను చెప్పాను. తాను నా కోసం డబ్బు సంపాదించి పెట్టగలిగితే మెక్సికోలో జరగబోయే మహిళా సమావేశానికి హాజరు కావడం నాకు వీలవుతుందా అని ఆవిడ అడిగినప్పుడు గాని నాకు అంతర్జాతీయ మహిళా సంవత్సరం అనేదొకటుందని తెలిసిరాలేదు.

          నేను అప్పుడామాటను అంత నమ్మలేదు గనుక, పోవాల్సి వచ్చినప్పుడు చూసు కుందాంలే అని మామూలుగానే వస్తానన్నాను. ఆ తర్వాత ఆ మాటను నేను పట్టించుకోనే లేదు. ఐక్యరాజ్యసమితి నుంచి నన్ను ఆహ్వానిస్తూ టెలిగ్రాం వచ్చినప్పుడు నేను ఓ వైపు ఆశ్చర్యంతో, మరోవైపు బెరుకుతో తలమునకలయ్యాను. ఇక ఒక సమావేశం ఏర్పాటు చేసి సంఘ మిత్రులతో ఈ సంగతి చర్చించాను. అందరూ కూడ ఈ ప్రయాణం చేసి తీరవలసిందేనన్నారు. తోడుగా మరొక మహిళను కూడ తీసుకుపోవడం బాగుంటుందన్నారు. కాని అప్పుడు ఇద్దరం వెళ్ళే పరిస్థితి లేదు. నేను నా ప్రయాణం సంగతి యూనియన్ వాళ్ళతో చెప్పినప్పుడు వాళ్ళు కూడ ప్రోత్సహించి ఆర్థిక సాయం కూడ చేశారు. ఇక నేను ప్రయాణ ఏర్పాట్లు మొదలు పెట్టాను. మరికొందరు మిత్రుల సాయంతో ప్రయాణ వివరాలన్నీ తెలుసుకున్నాను. హామీలు సంపాదించాను. ప్రయాణ ఏర్పాట్లు పూర్తికావడానికే ఎన్నో రోజులు గడిచిపోయాయి. ఐనా ప్రభుత్వ అనుమతి దొరకక పోవడంతో నాకు ప్రయాణం గురించి అనుమానం పట్టుకుంది.

          ఆ పరిస్థితిలో సైగ్లో – 20 నుంచి కొందరు నాయకులు ఏదో పనిమీద లాపాజ్ వచ్చారు. నేనింకా మెక్సికో వెళ్ళలేదని విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. వాళ్ళు నాతో పాటు ఆంతరంగిక మంత్రిత్వ శాఖ కార్యాలయానికి వచ్చి “ఈవిడ విషయం ఏంచేశారు? నిజానికి ఈవిడ ఇప్పటికే మెక్సికోలో ఉండవలసింది. అంతర్జాతీయ మహిళా సమావేశం ఇవాళ ప్రారంభమవుతుంది. ఇది అంతర్జాతీయ మహిళా సంవత్సరం కదా? మీ భార్యలకు మాత్రమే ఆ సమావేశంలో పాల్గొనే హక్కు ఉందా? …” అని నిక్కచ్చిగా అడిగారు. “సరేనమ్మా … వీళ్ళు నిన్నక్కడికి వెళ్ళనివ్వడం లేదుగదా … పద సైగ్లో -20కి వెళ్ళి పోదాం. ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం వచ్చినా, నిన్ను వీళ్ళు వెళ్ళనివ్వడం లేదు. ఈ విషయం ఐక్యరాజ్యసమితికే ఫిర్యాదు చేద్దాం … అంతేకాదు, అందుకు నిరసనగా సమ్మెకు పిలుపిద్దాం …. వెల్దాం పద” అని నాతో అన్నారు.

          మేం బయటికి అడుగులు వేస్తుండగానే ఆంతరంగిక మంత్రిత్వ శాఖ వాళ్ళు “ఆహా….. అలాగా …. మీరు మొట్టమొదలే ఈ విషయం ఎందుకు చెప్పలేదు. ఒక్క క్షణం, ఒక్క క్షణం ఆగండి …. అంత కోపానికి రాకండి ….. ఆవిడకు ఐక్యరాజ్యసమితి నుంచి ఆహ్వానం ఉందన్న సంగతి మీరు మొదటే చెప్పాల్సింది … ఏదీ ఆ ఆహ్వానం? ….” అన్నారు.

          మళ్ళీ ఇప్పుడు ఆహ్వానం కావాలట! ప్రతిరోజూ, ప్రతి చోటా, నాకెదురైన ప్రతి వాడూ ఆహ్వానం చూస్తాననే ఆడిగాడు. అందుకే గని కార్మికులు, పాత అనుభవాలు దృష్టిలో ఉంచుకునే ఆ ఆహ్వానాన్ని ఎన్నో ప్రతులు చేయించి సిద్ధంగా పెట్టారు. కనుక అడిగినవాడి కల్లా ఇస్తూ వచ్చాం. ఇంతకూ అసలు ఆహ్వాన పత్రాన్ని నాయకులు తమ దగ్గర భద్రంగా దాచి పెట్టారు.

          సరే – నేనప్పుడు వాళ్ళకు మరో ప్రతి ఇచ్చాను. దాదాపు రెండు గంటల తర్వాత వాళ్ళు నా కాగితాలన్నీ నాకిచ్చారు. అంతా సరిపోయింది. అంతా సిద్ధంగా ఉంది. మరుసటి రోజు ఉదయం తొమ్మిదింటికి బయల్దేరే విమానంలో నేను వెళ్ళిపోవచ్చు.

          నేను సరిగ్గా విమానం ఎక్కబోయేటప్పుడు ఆంతరంగిక మంత్రిత్వ శాఖకు చెందిన ఒక యువతి నా దగ్గరికొచ్చి “ఏమమ్మా! మొత్తానికి అనుమతి దొరికిందన్నమాట! నువ్వు అందుకు తగినదానివే లే! నా తరఫున శుభాకాంక్షలందుకో. నేను నీ స్థానంలో ఉంటే ఎంత బాగుండును! మెక్సికో చూసే భాగ్యం కలిగేదిగా” అని అకస్మాత్తుగా గొంతుమార్చి “నువ్వు ఈ దేశానికి తిరిగివచ్చే విషయం అక్కడ నువ్వేం మాట్లాడతావనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక జాగ్రత్త. పాత సమస్యల గురించి మాట్లాడే ముందు నువ్వు నీ పిల్లల్నీ, భర్తనీ ఇక్కడ వదిలేసి వెళ్తున్నావని గుర్తుంచుకో. నేను నీ మేలు కోరి ఈ సలహా ఇస్తున్నాను. ఆలోచించి క్షేమంగా వెళ్ళి లాభంగా రా!” అంది.

          ఆ యువతి చెప్పిన దాన్ని బట్టి ఆలోచిస్తే తల్లిగా బాధ్యతలనీ, నాయకురాలిగా నా బాధ్యతలని దృష్టిలో పెట్టుకొని మెక్సికోలో ఒక పాత్ర నిర్వహించడం కష్టతరమైన పనిగా తోచింది. నా పరిస్థితి ఓ వైపు గొయ్యి, మరోవైపు నుయ్యిలా తయారయింది. ఐతే నా కార్మిక మిత్రులు నా పై ఉంచిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించడానికే నేను నిర్ణయించు కున్నాను.

          లాపాజ్ నుంచి లిమా, బొగోటాల మీదుగా మెక్సికో చేరాను. ప్రయాణంలో నాకు చాల ఆలోచనలు కలిగాయి. నేనెన్నడయినా విమానం ఎక్కుతాననుకున్నానా? అందులోనూ మెక్సికోలాంటి దూరదేశానికి ప్రయాణం చేస్తాననుకున్నానా? మాకు ఒక్కరోజు తిండే ఉండకపోయేది. మా దేశమంతా తిరగడమే నాకు వీలుకాలేదు. నా స్వదేశాన్ని ఈ మూల నుంచి ఆ మూలకు మొత్తమూ చూడాలనే కోర్కె నాలో ఎన్నెన్నోసార్లు తలెత్తింది! ఇప్పుడింత దూర ప్రయాణం చేయడం నాలో ఒకేసారి ఆనంద విచారాల్ని రేకెత్తించింది. ఇదే అవకాశం నా సహచరులందరికీ వస్తే ఎంత బాగుండేది!

          విమానంలో ప్రతి ఒక్కరూ నాకు తెలియని భాషలో మాట్లాడుతున్నారు, వాగు తున్నారు, నవ్వుతున్నారు, తుళ్ళుతున్నారు, తాగుతున్నారు, ఆడుతున్నారు. నేనెవరితోనూ మాట్లాడలేకపోయాను. నేనక్కడ ఉండీ లేనట్టే ఉన్నాను. నేను బొగోటాలో విమానం మారినప్పుడు నాకు ఒక ఉరుగ్వే స్త్రీ కలిసింది. ఆవిడ కూడా మెక్సికో సమావేశానికి వెళ్తూ ఉంది. నాకింక తోడు దొరికింది.

          మెక్సికోలో దిగగానే మమ్మల్ని ఆహ్వానించడానికొచ్చిన యువకులు అన్ని భాషలూ మాట్లాడుతుండడం చూసి నాకు ముచ్చటేసింది. మాకు అక్కడి నిఘా అధికారులతో పనులు త్వరగా పూర్తికావడానికి వాళ్ళు సాయపడ్డారు. ఆ తర్వాత వాళ్ళు నన్ను ఒక హోటల్ కు పంపించారు.

          ఈ అంతర్జాతీయ మహిళా సంవత్సరపు సమావేశం రెండు చోట్ల జరుగుతుందని నేను బొలీవియాలోనే పత్రికల్లో చదివాను. మొదటి సమావేశం వివిధ దేశాల ప్రభుత్వ ప్రతినిధుల కోసం, రెండోది ప్రభుత్వేతర సంస్థల ప్రతినిధుల కోసం ఏర్పాటు చేశారు.

          బొలీవియన్ ప్రభుత్వం కూడా ఈ సమావేశానికి తన ప్రతినిధుల్ని పంపింది. ఈ స్త్రీలు అప్పటికే ఎన్నో గొప్ప గొప్ప మాటల ప్రకటనలిచ్చారు. బొలీవియాలో స్త్రీలు మరే ఇతర దేశంలో కన్నా ఎక్కువ సమానత్వం అనుభవిస్తున్నారని వాళ్ళు ప్రకటించారు.

          రెండోచోట జరుగుతున్న మహిళా సమావేశానికి ఆహ్వానం పొందిన బొలీవియన్ ను నేనొక్కదాన్నే. అక్కడ నేను మెక్సికోలో నివసిస్తున్న కొందరు బొలీవియన్లను కూడా కలుసుకున్నాను.

          నాకేమనిపించిందో చెప్పనా? ఈ సమావేశంలో రెండు వర్గాలుంటాయి. ఒకటి ప్రభుత్వ స్థాయిలో పెద్దింటి ఆడపడుచుల సమావేశం. మరొకటి ప్రభుత్వేతర స్థాయిలో నా వంటి వాళ్ళు హాజరై మా సమస్యల లాంటి సమస్యలు చర్చించేది. నాకీ ఆలోచనే అద్భుతమని అనిపించింది. నాకిది గొప్ప స్వప్నంలా తోచింది. ప్రపంచం నలుమూలల నుంచి వచ్చే కష్టజీవుల స్త్రీలను, ఒక రైతాంగ స్త్రీనీ, ఒక కార్మిక వర్గ స్త్రీనీ నేను కలవ బోతున్నాను. వాళ్ళందరూ అచ్చు మాలాగే దోపిడీకి గురవుతూ వుంటారు. మాలాగే దూరం కొట్టబడు తుంటారు. పత్రికల్లో రాసింది చదివి నాకిలాంటి ఆలోచనలు కలిగాయి.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.