జ్ఞాపకాల సందడి-47

-డి.కామేశ్వరి 

కావమ్మ కబుర్లు – 24

          ఆ రోజుల్లో అందరు సుష్ఠుగా తినేవారు పూటపూటా. మధ్యాహ్నం అంత హెవీగ తింటే మళ్లీ  ఏమీ తినలేం ఇప్పుడయితే. సాయంత్రం ఫలహారాలు. మళ్ళీ రాత్రి భోజనాలు. అలా ఐదు రోజులు పెట్టింది పెట్టకుండా మెనూ రాసుకుని వండించేవారు.  ఆ తిండి చూస్తే ఆశ్చర్యం  వేస్తుంది. అప్పటి అరుగుదల శక్తి అలా ఉండేది. పై ఊరి నుంచి  వచ్చిన వారు బండి మీదో, బస్సుల్లోనో వచ్చిన అలసట బడలిక పోవడానికి ఐదు రోజుల పెళ్లిళ్లు పెట్టుకుని ఒకో రోజు ఒకో వేడుక చేస్తూ శుభ్రంగా తింటూ ఎంజాయ్ చేస్తూ ఊరేగింపు, బంతులాట, అలకపాన్పు ఒకరోజు, నాగవల్లి రోజున గులాల్ జల్లుకుని ఆటలు, అపుడు పెళ్ళికొడుకు, పెళ్లికూతురు. చిన్నవాళ్ళు సరదాగా చేసేవారు. 

          అక్కపెళ్ళికి ఊరేగింపు, బంతులాట, అలకపాన్పు అన్నీ జరిపించుకున్నారు పెళ్ళివారు. అక్క అసలే తిక్కలోవుంది. ఇవన్నీ నాన్న భయంతో చేసింది కోపంగానే. అలకపాన్పు నాడు పెళ్ళికొడుకు తను కోరింది ఇవ్వకపోతే మిగతా కార్యక్రమాలకు  రాకుండా, అలిగి బతిమాలించుకుని, మనసులో కోరిక ఓ రేడియో, సైకిల్, రిస్టువాచ్ లాటివి అడుగుతే, ఇంటి యజమాని మామూలు సంసారి అయితే ఇవ్వలేను అని మొర్రో మంటే. మగ పెళ్లివారు బిగదీసుకుని కూర్చోడం… ఇదీ తంతు. ఆఖరికి ఏడ్చుకుంటూ  పిల్ల తండ్రి ఒప్పుకుంటే లేచివచ్చేవారు. 

          ఎన్నో కథల్లో ఇస్తానని ఇంకా ఇవ్వలేదంటూ కోడలిని దెప్పుతూ సాధిస్తూ చెపితే. చూడలేక తలతాకట్టు పెట్టి అప్పోసప్పోచేసి ఆ తండ్రి ఇవ్వడం చదివాం. బావగారు పాపం నాకేం వద్దు అంటే కాదు ఏదో ఒకటి అడగాల్సిందే… అని పట్టుపట్టి రేడియో. అనుకుంటా అడిగించారు అంతా కలిసి. అప్పుడు ఆయన ఇంజనీరింగ్ కాలేజ్ కాకినాడ లో లెక్చరర్ గా పనిచేసే వారు. అక్క తరువాత దెప్పితే పాపం బావగారు నవ్వేసి ఊరుకునేవారు. ఓ పక్క వాళ్ళవాళ్ళు ఏమంటారు. అలా ఐదు రోజులు తిన్నది చాలక పెళ్ళివారికి సారె అంటూ నా తలకాయంత సైజు వంద లడ్డూలు, వంద మినపసున్ని  ఉండలు, వంద అరిసెలు, రెండుమూడు కుంచాల మిక్శ్చర్, వంద చక్కిలాలు. మగపెళ్ళి వారు వాళ్ళవాళ్ళందరికీ పంచిపెట్టుకోడానికి దానిమీద చీరపెట్టి మేళంతో వెళ్ళి వియ్యపురాలికి అప్పగించాలి. 

          ఆ ఆనవాయితీలు ఇప్పటికీ పాటించినా సైజులు కాస్త తగ్గాయి. ఇలా నలుగురి పెళ్ళీళ్ళు చేయడం అంటే ఆ రోజుల్లో ఎంత కష్టపడి వుంటారో మన తల్లులు. అంతేనా? మూడు నిద్రలు, రావడాలు పోవడాలు, వరలక్ష్మీ వ్రతం, మొదటి పండుగ అంటూ వియ్యాలవారంతా రావడం, తరువాత పిల్ల పెద్దమనిషి అవడమొక ఫంక్షన్. తరువాత శోభనం, ఆ తరువాత కడుపులు, సీమంతాలు, పురుళ్ళు, బారసాలలు…

          అందుకే ఆడపిల్ల పుడితే ఇప్పటికీ నార్త్ లో ఏడిచేవారున్నారు. రోజులు కాస్త ఒకో జెనరేషన్ కీ మార్పు వస్తున్నా, ఇప్పటికీ ఆడపిల్లలంటే ఖర్చు, చాకిరీ… అన్న అభిప్రాయం. ఇప్పుడంటే ఓకే. ఒక పిల్ల కనక ముద్దుముచ్చట్లు బాగానే చేస్తున్నారు. ఇది వరకు అన్నీ ఇంట్లో చేస్తూ నలుగురయిదుగురి పెళ్లిళ్ళు ఆ మహాతల్లులు ఎలాచేసేవారో! మేము మా కాలంలో, చేసిన ఇంత శ్రమలు ఎరుగం. పనివారు, వంటవారు, డబ్బిస్తే కొనే  వస్తువులు బజారులో దొరికేవి. ఒకరు ఇద్దరు కనక అంత కష్టం అనిపించేది కాదు. సరే ఇప్పటి జెనరేషన్ లో డబ్బు ఒకటుంటే చాలు మన కాలు, చెయ్యి కదలకుండాపనులయి పోతున్నాయి. అందరి దగ్గర మరి ఎంత డబ్బుందో గాని వెర్రిగా ఖర్చు. పెడుతున్నారు . కాంపిటీషన్, షో బిజినెస్ అయిపోయింది పెళ్లి. 

          మన అమ్మలెంతగా కష్ట పడేవారో చూసిన వాళ్ళం కనుక, ఏమిచ్చి వాళ్ళ ఋణం తీర్చుకోగలమనిపిస్తుంది, ఈనాటికీ…

*****

( సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.