యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-5

సిడ్నీ (రోజు-1 తరువాయి భాగం)

ఓపెరాహౌస్ సమక్షంలో పుట్టినరోజు ప్రారంభం కావడం భలే ఆనందంగా అనిపించింది. 

          ఆ ఏరియాని సర్క్యులర్ కే (Circular Quay) అంటారు. అంటే సముద్రం లోపలికి అర్థ వృత్తాకారంలోకి చొచ్చుకుని వచ్చిన ప్రాంతమన్నమాట. చుట్టూ రెస్టారెంట్లు, గిఫ్ట్ షాపులతో నడవడానికి వీలుగా కట్టిన డెక్ లతో చూడ చక్కగా, ఆహ్లాదంగా ఉంది అక్కడ.  

          వాతావరణం కూడా చిరు చల్లగా, హాయిగా ఉంది. ముందు చెప్పుకున్నట్టు డిసెంబరు నెలలో ఆస్ట్రేలియాలో ఇది వేసవి కాలం. అయినా హాయిగా, ఆహ్లాదంగా ఉంది. ముఖ్యంగా సముద్ర తీరపు తేమ, జిడ్డు  లేదు. 

          మాకు కనిపించిన మొదటి రెస్టారెంటులో కెళ్ళి ఫిష్ & చిప్సు, బర్గర్ వంటివి వాటితో మధ్యాహ్న భోజనం చేసాం. అద్దాల్లో నుంచి ఓపెరాహౌస్ ని చూస్తూ తినొచ్చు ఇక్కడ. కాకపోతే ఆ సౌకర్యం తాలూకు అదనపు ధర కూడా మెన్యూలో స్పష్టంగా కనిపిస్తుంది.  ముచ్చటగా ఓపెరాహౌస్ ఎదురుగా కనిపిస్తుంటే ఎంత ఖరీదైన భోజనం తినడానికైనా ఆకలి వేస్తుందా అసలు? పైగా జెట్ లాగ్ కదా! అక్కడ మధ్యాహ్నం పన్నెండయినా కాలిఫోర్నియాలో సాయంత్రం దాదాపు 5 గం. కావడంతో ఏదో తిన్నామనిపించి లేచాం.  

          నిజానికి తీరం నుంచి పైకి కాసిన్ని మెట్లెక్కి వస్తే ఆ వీధంతా రెస్టారెంటులే. నచ్చిన వెరైటీలు తినొచ్చు. ఆ విషయం మాకు మరో గంట తరువాత తెలిసింది. కోవిడ్ కాలపు కొనసాగింపుగా అమెరికాలోలాగా ఇక్కడ కూడా వీధిలోనే సగభాగం దారికట్టి సీటింగ్ వేసేరు. వాహనాల రాకపోకలకు ఒక చిన్న దారి మాత్రమే ఉంది. అందువల్ల రద్దీగా ఉన్న సమయంలో ఒక్కసారి ఈ ప్రాంతానికి వస్తే తిరిగి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది.  

          భోజనం అయ్యేసరికి ఒంటి గంట కావచ్చింది. మేం ప్యాకేజీ టూరు కాకుండా విడిగా మధ్యాహ్నం 3 గంటలకు ఓపెరా హౌస్ టూరు ముందే బుక్ చేసుకున్నాం. టూరుకి మరో రెండు గంటలు ఉంది కదా! ఆ లోగా హోటలుకి వెళ్లి స్నానాదులు పూర్తి చేసుకుని మళ్ళీ రావాలనుకున్నాం. కానీ అక్కడంతా ఇరుకు రోడ్ల వల్ల ఊబర్ ఎంతకీ దొరకక పోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుని అక్కడక్కడే మరో గంటన్నర గడిపేసేం. 

          సత్య, వరు బ్రిడ్జి మీద కాస్సేపు నడిచి వస్తామని వెళ్లేరు. సిరి, నేను ఐస్క్రీములు కొనుక్కుని ఓ చెట్టు కింద బెంచీ మీద స్థిమితంగా కూచున్నాం. అక్కడంతా వచ్చీపోయే యాత్రీకులతో సందడిగా ఉన్నా ఎందుకో ఉండాల్సినంతగా జనం లేరని అనిపించింది. కోవిడ్ దెబ్బనించి ప్రపంచం ఇంకా తేరుకోలేదనే అనిపించింది. 

          సముద్ర తీరపు డెక్ మీదనే ఒక చిన్న బండి మీద కాఫీ దుకాణం కనిపించింది. అక్కడ పెద్ద పెద్ద మఫిన్లు ఒక్కొక్కటి అయిదు ఆస్ట్రేలియన్ డాలర్లుపెట్టి కొనుక్కున్నాం.  భలే రుచికరంగా ఉన్నాయి. కాఫీ కూడా చాలా బావుంది. ఇదొక్క చోటే కాకుండా ఆస్ట్రేలియాలో మేం తిరిగిన అన్ని ప్రదేశాల్లోనూ బేకరీ ఐటమ్స్, కాఫీ చాలా బావున్నాయి. కాలిఫోర్నియాలో గడ్డిలా ఉండే మఫిన్లు నచ్చక మొదట పిల్లలు మఫిన్ అనేసరికి పరుగెత్తారు. కానీ కాస్త తినగానే ఇక నాకంటే నాకని ఒక్కటే కొట్టుకోవడం!

          అమెరికాలో ప్రఖ్యాత స్టార్ బక్స్ కాఫీ అక్కడ కూడా ఉన్నా ఆ జోలికి మేం ఒక్కరోజు కూడా పోకుండా ఆస్ట్రేలియా కాఫీనే తాగేం. అంత బావుంది మరి! ఆస్ట్రేలియా వెళ్ళిన వారు తప్పనిసరిగా బనానా బ్రెడ్, మఫిన్లు, కాఫీ రుచి చూడవల్సిందే. 

          సర్క్యులర్ కే కి ఒక పక్కగా హార్బర్ బ్రిడ్జి ఉంటే, సరిగ్గా ఎదురుగా మరో వైపు ఓపెరా హౌస్ ఉంటుంది. 

          ఈ తీరం నించి ఆ తీరానికి నడక ఎలా లేదన్నా ఒక అరగంట పైనే పడుతుంది. 

          దార్లో ఆస్ట్రేలియన్ స్థానిక అబోరీజినల్ తెగల సంస్కృతిని ప్రతిబింబింప జేస్తూ వాయిద్యాలు వాయిస్తూ భిక్షాటన చేస్తూ, పూసలు, చెక్క వస్తువులు అమ్ముతూ ఉండే వాళ్ళు కనిపించారు. ఎందుకో మనసంతా ఒక్కసారిగా దిగులుగా అనిపించింది. పూసల చేతి బ్రేస్ లెట్టు కొని అక్కడే చేతికి వేసుకున్నాను. 

          మొత్తానికి మా ఓపెరా హౌస్ టూరు సమయానికి అరగంట ముందే అక్కడికి చేరుకున్నాం. 

          వెళ్తూనే అక్కడున్న చిన్న గిఫ్ట్ షాపులో ఓపెరా హౌసు మోడల్లో ముచ్చటగా ఉన్న పింగాణీ సాల్ట్ & పెప్పర్ టిన్ను, ఫ్రిజ్ మాగ్నెట్ వంటివి కొన్నాను. ఇంట్లో అద్దాల షోకేసు కట్టించుకున్నప్పటి నించీ ఎక్కడికెళ్లినా ఏదైనా చిన్నదో, చితకదో గుర్తుగా తెచ్చుకోవడం పరిపాటి అయ్యింది.  

          సిడ్నీ ఓపెరా హౌస్ (Sydney Opera House) ప్రపంచ ప్రఖ్యాత ప్రదర్శనా కళలకు కేంద్రం. ఇక్కడున్న గొప్ప వేదికల మీద ప్రదర్శననివ్వడం అంటే ఎంతో ప్రతిష్ఠాత్మక మైన విషయం. 20 వ శతాబ్దంలో నిర్మించబడ్డ అత్యంత ప్రసిద్ధమైన, ప్రత్యేకమైన భవనా లలో ఒకటి ఓపెరా హౌస్. దీనికి డానిష్ వాస్తుశిల్పి జోర్న్ ఉట్జన్ రూపకల్పన చేశాడు. ఈ డిజైన్ అత్యుత్తమ డిజైన్ గా అప్పట్లో అయిదువేల ఆస్ట్రేలియన్ పౌండ్లు గెలుచుకుంది.  డిజైన్ అయితే లభించింది గానీ చవకగా ఎలా నిర్మించాలో తెలియక ఎంతో మధన పడ్డారట. చివరికి గోళాకారం నించి త్రిపరిమాణ జ్యామితీయ పద్ధతిలో తీసిన త్రికోణా కారపు ముక్కలతో ఈ సమస్యని పరిష్కరించారు. ఈ భవన నిర్మాణ పనులు 1957లో  మొదలయ్యి దాదాపు పదిహేనేళ్ల పాటు కొనసాగేయి. అధికారికంగా 1973 అక్టోబరు 20 న ప్రారంభించబడింది. 

          ఒక్క గంట పాటు ఓపెరా హౌస్ టూర్ కి గాను పెద్దవాళ్ళకి 43 ఆస్ట్రేలియన్ డాలర్లు, పిల్లలకి 23 ఆస్ట్రేలియన్ డాలర్లు టిక్కెట్టు. ఉదయం 9 గం. నించి ప్రతి గంటా, గంటన్నరకొకటి చొప్పున మధ్యాహ్నం 3.30 వరకు టూర్లు ఉంటాయి. 

          మా ఓపెరా హౌస్ టూర్ కింది అంతస్తులో ప్రారంభమయ్యింది. ఓపెరా హౌస్ లో మొత్తం అయిదు థియేటర్లు ఉంటాయి. 2679 మంది పట్టే మెయిన్ కాన్సర్ట్ హాలు, 1547 సీట్లతో ఓపెరా హాలు, 544 సీట్లతో డ్రామా థియేటర్, 398  సీట్లున్న ప్లే హౌస్,  364 సీట్లతో స్టూడియో. గైడ్ చరిత్రని వివరిస్తూ స్టూడియోని, ఓపెరా హాలుని చూపించాడు. ఆ రోజు  అక్కడ పెద్ద మ్యూజిక్ కాన్సర్టు  జరుగుతూ ఉండడంతో ప్రధానమైన కాన్సర్ట్ థియేటర్ చూడడానికి కుదరదని, దాని బదులుగా మెయిన్ థియేటర్ లో జరిగిన షోల ఆధారంగా తయారు చేసిన వర్చ్యువల్ మినీ షో ఒకటి చూపించారు. అలాగే ఒక రికార్డింగు స్టూడియో ని, థియేటర్ ని కూడా చూపించారు. కాస్సేపు అక్కడే కూచోబెట్టి వివరాలు వివరించారు. అదంతా చూస్తూ ఉంటే ఆ వేదిక మీద కవిత్వాన్ని చదువుతున్న, పాటలు పాడుతున్న అనుభూతి కలిగింది.  

          అప్పటిదాకా నడవడానికి పేచీ పెట్టిన మా సిరి కూడా ఒక్కసారి గైడు మాట్లాడడం ప్రారంభించేక శ్రద్ధగా వింది. 

          అన్నిటికన్నా పై అంతస్తులో కట్టడపు బీమ్స్ ని చూపించి ఆ డిజైన్ కి స్ఫూర్తి దక్షిణ అమెరికాకు చెందిన అయిదువేల ఏళ్లనాటి మాయన్ సంస్కృతి అని గైడ్ చెబుతుంటే చాలా ఆశ్చర్యం వేసింది. జాలీ వంటి అల్లిక మీద 10,56,006  తెల్లని సిరామిక్ పళ్ళాలు పేర్చిన 213 అడుగుల ఎత్తున్న గొప్ప మహా కట్టడం అది. 

          చూసి తీరవల్సిన మానవ నిర్మిత అద్భుతమైన ఓపెరా హౌస్ ఆస్ట్రేలియన్ స్థానిక అబోరీజినల్ తెగల సంస్కృతిని ప్రతిబింబించే ప్రాచీన కళారూపాల్ని ప్రదర్శించే వేదిక మాత్రమే అయి ఉంటే బావుణ్ణని ఎందుకో అనిపించింది. 

          ఓపెరా హౌసు ముందున్న ప్రాంగణంనించి ఊబర్ రైడ్లు ఇట్టే దొరికింది. హోటలుకి తిరిగి అయిదు గంటల ప్రాంతంలో వచ్చేం. వచ్చేసరికి మా గది సిద్ధంగా ఉంది. తలారా స్నానాలు చేసి కాస్త విశ్రమిద్దామనుకునే సరికి ఆరున్నర కావొచ్చింది. 

          బర్త్ డే డిన్నర్ సెలబ్రేషన్ కి ప్రసిద్ధ స్కై డెక్ రివాల్వింగ్ రెస్టారెంటు బుక్ చేశారు మా వాళ్ళు నాకు చెప్పకుండా. 

          ఎనిమిది గంటలకు మా స్లాట్. అప్పటికే పిల్లలకి జెట్ లాగ్ వల్ల నిద్ర వచ్చెయ్యడం మొదలెట్టింది. 

          కానీ ముందే బుకింగ్ చెయ్యడం వల్ల మాట్లాడకుండా నడిచేరు పాపం. 

          స్కై డెక్ కి ఏడుగంటలకల్లా చేరుకున్నాం. అయితే అప్పటికే అబ్జర్వేషన్ డెక్ క్లోజ్  అయిపోయింది. 

          కానీ మేం బుక్ చేసుకున్న రెస్టారెంటులో నించి నగరాన్ని చూడొచ్చు. అయితే బుక్ చేసుకున్న సమయానికి అయిదు నిమిషాల ముందు కూడా పైన ఉన్న రెస్టారెంటులోకి పంపించకపోవడం వల్ల షాపింగు కాంప్లెక్సులో ఉన్న రెస్టారెంటు లాబీ దగ్గిర ఎక్కువ సేపు కూర్చోవలసి వచ్చింది. ఆస్ట్రేలియాలో సాయంత్రం 5 గం. తరువాత దుకాణాలు మూసి వేస్తారు. అందువల్ల అంత పెద్ద షాపింగ్ మాల్ లోను చేసేదేం లేక డీలా పడ్డారు పిల్లలు. 

          మొత్తానికి పైకి వెళ్లిన తర్వాత అదృష్టం కొద్దీ ఇంకా వెలుతురు ఉండడంతో కనీసం సిటీ వ్యూస్ కాసేపు చూడగలిగేం. చీకటి పడిన తరువాత ఆకాశంలో మెరిసే నక్షత్రాలు నేల రాలినట్టున్న మహానగరపు సొగసుని చూడడం కూడా గొప్ప అనుభూతే!

          ఇక దాదాపు 879 అడుగుల ఎత్తున 83 అంతస్తుల పైన కట్టిన క్రౌన్ టవర్స్ స్కై డెక్ లో రివాల్వింగ్ రెస్టారెంటులోకి అడుగు పెట్టగానే మూణ్ణాలుగు రింగుల్లా ఉన్నఫ్లోర్లు అన్నీ సాపేక్షంగా అతి మెల్లగా తిరుగుతూ ఉండడం, అద్దాల్లో నుంచి అత్యంత సుందరంగా కనిపించే సిడ్నీ మహానగరాన్ని చూడడం గొప్ప విశేషం. తలకు 125 ఆస్ట్రేలియన్ డాలర్లు చాలా ఖరీదైనా, ఫుడ్ క్రూయిజ్ స్టయిల్లో ఎన్నో ఐటంస్ తో అట్టహాసంగా ఉండీ రుచికరంగా లేకపోయినా అక్కణ్ణించి కనిపించే అద్భుత దృశ్యాల్ని చూడడానికి అంత ఖర్చు పెట్టొచ్చు అనిపించింది. చివరగా కేకులు వంటి డిజర్టులు మాత్రం చాలా బావుండడంతో పిల్లలు వాటితో కడుపు నింపుకున్నారు. ఒకసారి చూడదగ్గ మంచి అనుభూతి అది. ఇలా పుట్టినరోజో, పెళ్లి రోజో అయితే మరపురాని అనుభూతిగా గడప డానికి మరింత ప్రత్యేకమైనదీను. 

          మా స్లాటు రాత్రి ఎనిమిది నుంచి 9.30 వరకు మాత్రమే. అయితే తొమ్మిదికే భోజనాలు అయిపోవడమే కాకుండా, జెట్లాగ్ వల్ల అందరికీ నిద్ర వచ్చెయ్యడం ప్రారంభించడంతో మా సమయానికి ముందే కిందికి వచ్చేసాం.  

          అంతేకాకుండా తిరిగి వచ్చేటపుడు పొద్దుట్నించీ ఉన్న ఆహ్లాదం మాయమయ్యి రివ్వున చలి గాలి బాగా మొదలయ్యింది. అన్ని షాపులూ కట్టేసిన ఆ షాపింగు కాంప్లెక్సు ముందు రోడ్డు మీద ఊబర్  కోసం నిలబడడం చాలా కష్టం అయిపోయింది.

          ఎలా అయితేనేం హోటలుకి వచ్చి పడి ఒళ్లెరగకుండా నిద్రపోయేం.

          మరపురాని అనుభూతిని మిగిల్చిన సిడ్నీలో ఆ మొదటిరోజు పుట్టినరోజు నాడు  కేకులు కత్తిరించడం, బహుమతులు పుచ్చుకోవడం అంటూ మాములుగా కాకుండా అత్యద్భుతంగా గడిచింది నాకు.

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.