దుబాయ్ విశేషాలు-3

-చెంగల్వల కామేశ్వరి

          దుబాయ్ లో ఉన్న అందమయిన పార్క్ లలో “మిరకిల్ గార్డెన్, “బర్డ్ పార్క్” బటర్ ఫ్లై పార్క్, లు చూసి తీరాలి.

          పేరు తెలియని ఆకుపచ్చని తీవెలు, మొక్కలు వివిధ రంగుల్లో విరబూసిన పూల పొదలు గ్రీన్ లాన్ తో రకరకాలుగా తీర్చిదిద్దిన ఈ పార్కులో రంగురంగు అంబరిల్లాలతో ఏర్పర్చిన పెద్ద ఆర్చీలు. వీక్షకులు రిలాక్స్ కావడానికి టేబుల్స్ కుర్చీలు వేసిన విశాల ప్రాంగణాలు చెక్కతో తయారు చేసిన స్టాండ్ ఊయలలు మనలని ఆకట్టుకుంటాయి.

          పార్క్ ప్రారంభంలో ఆకుపచ్చని లాన్ ని ఎత్తయిన రెండు గుర్రాల ఆకారాలు తీర్చి దిద్దారు వాటిని చూడగానే మనలకి నవ్వు తెప్పిస్తాయి. కారణం ఒక వైపు ఉన్న గుర్రం తలదించుకుని సణుగుతున్న స్త్రీలా, మరొక పక్క భార్య సణుగుడికి పళ్లు బయట పెట్టి నవ్వుతున్న మగవాడిలా అనిపించి మా పద్మని ఆట పట్టించాను.

          నువ్వు మీ ఆయనలా ఉన్నారే! అని

          అది ఉడుక్కుని అవును మమ్మల్ని ఏదోకటి అని నవ్వుతారు కదా! తలవొంచు కున్నది మా బావలాగా, నాలాగా! నువ్వూ మీ మరిది ఆ నవ్వే గుర్రంలా ! అంది. వాటిని చూసినప్పుడల్లా బాగా నవ్వుకున్నాము.

          ఇంక “నీ సిగపాయల మందారాలు అన్నట్లు స్త్రీ శిరోజాలు విరబోసుకున్నట్లు, ఆమె తల నుండి శిరోజాలులాగా ఆకుపచ్చని తీవెలు ఆపైన ఆమె తలలో అలంకరించుకున్న విరులు. పార్క్ నడుమలో నీటి తటాకాలు ఆ అందాలు ఎంత చూసినా తనివి తీరదు.

          ఇరువైపులా స్త్రీమూర్తుల కేశపాశాలులాగా పెంచిన ఆ పూల తీర నడుమ సమయ సూచిక ( గడియారం) వర్ణింప తరంకాదు మనకు రెండుకళ్లూ సరిపోవు.

          ఒక పుష్పక విమానం ఒక విమానం మొత్తం అలముకొన్న పూలతీవెలు ఆకులు కన్పడనీయకుండా రంగురంగుల పూలుతో నిండిపోయిన ఆ పుష్ప విమానాన్ని ఫొటో తీయడం కాస్త కష్టమే అయి వీడియో తీసాము.

          అన్నట్లు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. ఈ ట్రిప్ లో మా చెల్లి మరిది గారు వాళ్లు కూడా దుబాయ్ వచ్చారు. మా చెల్లి మరిది వాళ్ల కుటుంబం కూడా దుబాయ్ లోనే ఉంటారు. వీకెండ్ లో వాళ్లు మా అమ్మాయి వాళ్లింటికి వచ్చినపుడు కొన్నిటికి అందరం కలిసి చూసేలా మా అమ్మాయి అల్లుడూ ప్లాన్ చేసారు. అందువల్ల మాకు చాలా సరదాగా అనిపించింది. ఇవన్మీ చూపించడమే కాక శ్రధ్దగా మాకు ఫొటోలు తీసి మా ఈ ట్రిప్ ని ఎంతో ఆనందకరం చేసినందుకు మాకు చాలా ఆనందం కల్గింది. ధాంక్యూ వసంతా ! అండ్ రవీంద్రా!

          ఈ పార్క్ లో ఉన్న పెద్ద పెద్ద రంగురంగుల షూస్ అందులో నిల్చుని ఫొటోలు దిగాము. పెద్ద పూల పరికిణీ వేసుకుని పరికిణీ కుచ్చిళ్లు విప్పార్చి గుండ్రంగా తిరుగు తున్న డాన్సింగ్ డాల్ వంటి ఒక పూబాలతో కూడా వీడియో తీసుకున్నాము. ఆ అందాలు చూడటానికి రెండు కళ్లూ సరిపోవు, నడవటానికి చూడటానికి చాలా ఓపిక కావాలి.రాయటా నికి కూడా జ్ఞాపక శక్తి ఉండాలి. అన్నీ గుర్తు చేసుకుంటూ చూసినవన్నీ రాయటానికి ప్రయత్నిస్తున్నాను. ఈ పార్క్ సంవత్సరంలో ఆరు నెలలు వింటర్ లోనే చూడగలం! వేసవికాలం ఈ పార్క్ లు చూడటానికి అనుమతించరు. చూడలేము. సూర్యరశ్మి అత్యధికం!

          బటర్ ఫ్లై పార్కులో ఎన్ని రకాల సీతాకోకచిలుకలు ఉన్నాయో ! ఇక్కడి శీతోష్ణస్థితికి తగినట్లు సన్నని మెష్ తో పెద్ద పెద్ద పంజరాల వంటి వాటిలో వాటిని పెంచుతారు. వాటి లార్వాదశ నుండి ఎగిరే శీతాకోక చిలుక ఆకారం సంతరించుకునే వరకు మనకు అవగత మయ్యేలా దశల వారీగా గాజు పెట్టెలలో మనకు కనిపిస్తాయి. అవి మన మీద కూడా వాలుతాయి.

          చల్లని అటవీ స్థలంలా చిన్నమొక్కలు వృక్షాలు నడుల హాయిగా స్వేఛ్చగా ఎగురుతూ నడుమ మనమీద కూడా వాలే పక్షులు బర్డ్స్ పార్క్ ప్రత్యేకత! అక్కడ ఉన్న ఎన్నో వేల  వివిధ జాతుల పక్షులు రంగు రంగులలో మనని మురిపిస్తాయి.

*****

  (సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.