పారిస్ వీథుల్లో… – 1

-ఎన్. వేణుగోపాల్

ఒక అద్భుతమైన పుస్తకాల దుకాణం గురించి…. 
 
రెండు సంవత్సరాల కింద ఇదే మే 9న, చుట్టూరా ఆవరించుకుని ఉన్న అద్భుత దృశ్యాల ఫ్రెంచి ఆల్ప్స్ హిమ పర్వత శ్రేణి మధ్య వలూయిజ అనే చిన్న పల్లెటూళ్ళో, ఇంకా కొద్ది గంటల్లో పారిస్ వెళ్లడానికి సిద్ధపడుతూ, ఫేస్ బుక్ మీద ఇది రాశాను:
 
“ఎన్నాళ్ళ కల పారిస్….!!
 
నా పదకొండో ఏట మా సృజన ముఖచిత్రంగా పారిస్ నగర వీథుల్లో నిషేధిత మావోయిస్టు పత్రిక అమ్ముతున్న జా పాల్ సార్త్ర్, సిమన్ ది బువా ల ఫోటో వేశాం. పారిస్ లోని సోర్బాన్ విశ్వవిద్యాలయంలో అప్పటికి మూడు సంవత్సరాల ముందు చెలరేగిన అపూర్వవిద్యార్థి ఉద్యమం గురించి ఏంజెలో కాట్రొచ్చీ రాసిన ‘ది బిగినింగ్ ఆఫ్ ది ఎండ్’ పుస్తకానికి శ్రీశ్రీ చేసిన అనువాదం ‘రెక్కవిప్పిన రెవల్యూషన్’ కరీంనగర్ ఉద్యమసాహితి అప్పుడే ప్రచురించింది. అప్పుడే పారిస్ కమ్యూన్ గురించి సృజనలో ఎన్నో రచనలు వేశాం. సివి గారి కావ్యం ‘పారిస్ కమ్యూన్’ అప్పుడే చదివాను. ‘బారిస్టర్ పార్వతీశం’లో పారిస్ ప్రస్తావన లు సరేసరి. అలా పదిహేనో ఏటికల్లా పారిస్ నా అనుభవంలోకి ఎంతగానో వచ్చింది. ఆ తర్వాత గడిచిన నాలుగు దశాబ్దాలలో ఫ్రెంచి విప్లవం గురించీ, పారిస్ కమ్యూన్ గురించీ, 1968 ఫ్రెంచి విద్యార్థుల తిరుగుబాటు గురించీ, సార్త్ర్ గురించీ చదివాను. మార్క్స్ ఆలోచ నల్లో గుణాత్మకమైన మార్పులు తెచ్చిన, ఎకనామిక్ అండ్ ఫిలసాఫికల్ మాన్యుస్క్రిప్ట్స్ 1844 గా ప్రసిద్ధమైన రచనలు పారిస్ లో ప్రవాసంలో ఉన్నప్పుడు చేసినవే అని చదివా ను. విక్టర్ హ్యూగో రాసిన బీదలపాట్లు, హంచ్ బాక్ ఆఫ్ నాటర్ డామ్, రోమా రోలా రాసిన జీన్ క్రిస్టోఫ్ వంటి ఎన్నో పుస్తకాలు నన్ను పారిస్ వీథుల్లో తిప్పాయి. మొన్నటికి మొన్న ఏడాది కింద పారిస్ కమ్యూన్ మీద నాలుగు గంటల ఉపన్యాసం ఇవ్వడం కోసం చదివిన అనేక పుస్తకాల పంక్తుల మీద 1871 నాటి పారిస్ వీథుల్లో అడుగడుగూ తిరిగాను, మనిషి మనిషితో మాట్లాడాను.
 
          ఆ కలల నగరం పారిస్ లో రేపు మధ్యాహ్నం దిగి, ఓ అరవై గంటలు గడపబోతు న్నాను. ఫ్రెంచి విప్లవం (1789) కూల్చిన బాస్టిల్ చెరసాల దుర్గ స్థలాన్ని, పారిస్ కమ్యూన్ (1871) కమ్యూనార్డులను వందలాది మందిని నిలబెట్టి కాల్చిచంపిన గోడను, విక్టర్ హ్యూగో బీదలపాట్లు రాసిన ఇంటిని, సోర్బాన్ విశ్వవిద్యాలయాన్ని, వాటితో పాటు పారిస్ సందర్శకులకు సుప్రసిద్ధమైన ఐఫెల్ టవర్ ను, కెథెడ్రల్ ఆఫ్ నాటర్ డామ్ ను చూడాలని కోరిక. ఎన్ని వీలవుతాయో తెలియదు… 
 
          తప్పకుండా ప్రతి అనుభవమూ పంచుకుంటాను…”
 
          అలా పారిస్ లో ప్రతి అనుభవమూ మీతో పంచుకుంటానని రెండు సంవత్సరాల కింద వాగ్దానం చేశాను గాని, అనుకున్న చాల పనుల్లాగే ఇప్పటికీ అది నెరవేరనే లేదు. పారిస్ నుంచి రోమ్ కూ, బెర్లిన్ కూ వెళ్లి, ఆ తర్వాత మూడు నాలుగు రోజులు మరి కొన్ని వీలైన స్థలాలు కూడ చూసి రావలసిన వాళ్ళం, విభాత ఆరోగ్యం వల్ల పారిస్ నుంచి ప్రయాణాలన్నీ రద్దు చేసుకుని వెనక్కి రావలసి వచ్చింది. ఈ మార్పు వల్ల పారిస్ లో అరవై గంటలు అనుకున్నదల్లా డెబ్బై గంటలు ఉన్నాం గాని చివరి పది, పన్నెండు గంటలు ఆందోళనతో, టికెట్ల మార్పులతో సరిపోయింది. మిగిలిన సమయంలో పారిస్ లో చూడదలచుకున్నవి కొన్నే చూడగలిగాను. నిజానికి పారిస్ లో చూడవలసినవి ఎన్నో ఉన్నాయి. పర్యాటక ఆశక్తులూ ఉన్నాయి. సాహిత్య, కళా ఆశక్తులూ ఉన్నాయి. చారిత్రక, రాజకీయ ఆశక్తులూ ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి చూడాలన్నా వారం పదిరోజులైనా సరిపోవు. 
 
          సుప్రసిద్ధ కళాఖండాలెన్నో ఉన్న లూవ్ర్ మ్యూజియం వంటివి ఎంత చూడాలని పించినా దాని టికెట్ ఖరీదు చూసి ముందే ఆశ కొట్టేసుకున్నాను. అనుకున్న వాటిలో బాస్టిల్ (వాళ్లు బస్తీ అంటారు) దుర్గ స్థలం, పారిస్ కమ్యూన్ కమ్యూనార్డులను కాల్చి చంపిన గోడ, విక్టర్ హ్యూగో ఇల్లు, సోర్బాన్ విశ్వవిద్యాలయం చూడగలిగాం. ఐఫెల్ టవర్, కెథెడ్రల్ ఆఫ్ నాటర్ డాం, సీన్ నదీ తీరం, లిటిల్ ఇండియా సరేసరి. తిరిగి వచ్చాక ఏవేవో కారణాల వల్ల పారిస్ అనుభవాలు రాయడం కుదరలేదు. ఇప్పుడు సమయం అనుకూలిస్తే కొన్నయినా రాయాలనుకుంటున్నాను.  
  
షేక్స్పియర్ అండ్ కంపెనీ – ఒక రచయిత పేరు మీద అద్భుత పుస్తకాల దుకాణం
 
ఒకరోజు ఉదయమే సీన్ నదీ తీరంలో కట్టిన రాతి అరుగుల మీద, పక్కన పచ్చిక తివాచీ ల మీద రెండు మూడు కిలోమీటర్ల దూరం నడుస్తూ, అక్కడ సాగుతున్న ఔత్సాహిక సంగీత ప్రదర్శనలనూ అనేకానేక విచిత్ర ప్రవర్తనలనూ చూస్తూ కెథెడ్రల్ ఆఫ్ నాటర్ డాం చేరాం. వెయ్యి సంవత్సరాల కింద నిర్మాణమై, మధ్య యుగాలలో అనేక మార్పుల కూ చేర్పులకూ గురవుతూ పరిమాణంలోనూ, ప్రఖ్యాతిలోనూ పెరుగుతూ వచ్చిన మహా నిర్మాణం అది. ఆ కెథెడ్రల్ శిల్ప, చిత్ర, నిర్మాణ తదితర కళలెన్నిటికో తప్పనిసరిగా చూడవలసినది. క్రైస్తవ చరిత్రతో, జీసస్ చరిత్రతో లోతైన పరిచయం ఉంటే ఒక రోజంతా చూసినా తరగని గొప్ప అనుభవం అది. 
 
          కెథెడ్రల్ చూడడం అయిపోయాక, పక్కన సీన్ నది పాయ మీద వంతెన దాటి అవతలి రోడ్డు మీదికి వెళ్తే ఎదురుగా మూల మీద కనబడింది ‘షేక్స్పియర్ అండ్ కంపెనీ’ అనే భవనం. 
 
          ఆ పేరుతో పారిస్ లో ఒక సుప్రసిద్ధమైన, చరిత్రాత్మకమైన పుస్తకాల దుకాణం ఉందని ఎప్పుడో ఎక్కడో చదివానని హఠాత్తుగా గుర్తుకొచ్చింది. ఆహా, చూడాలనుకున్న జాబితాలో లేకపోయినా, వెతకబోయిన తీగ కాకపోయినా, హృదయాన్ని బంధించే తీగ ఒకటి కంటికి తగిలిందనుకున్నాను.  
 
          షేక్స్పియర్ అండ్ కంపెనీ గురించి చెప్పుకోవలసిన విశేషాలు చాల ఉన్నాయి. అన్ని పుస్తకాల దుకాణాలలోనూ అవే పుస్తకాలూ, అదే పాత కాగితాల వాసనా, అవే పాతబడిన బీరువాలూ, అవే వెతుకులాట చూపుల ఒకే రకమైన పుస్తకాభిమానులూ ఉన్నప్పటికీ, ప్రతి పుస్తకాల దుకాణానికీ దానిదైన ప్రత్యేకత ఉంటుంది. కొంత చరిత్రా, విశిష్టతా ఉంటాయి. 
 
          ఈ సుప్రసిద్ధ పుస్తకాల దుకాణపు మార్గదర్శక సూత్రమే విశిష్టత: అది “ఓపెన్ డోర్, ఓపెన్ బుక్స్, ఓపెన్ మైండ్, ఓపెన్ హార్ట్” (తెరిచిన తలుపు, తెరిచిన పుస్తకాలు, తెరిచిన మేధ, తెరిచిన హృదయం). ఈ వాక్యంలో ఇంగ్లిష్ భాషా వ్యవహారానికి సంబంధించిన ఇంకొక ప్రత్యేకత కూడ ఉంది, ఇక్కడ ఓపెన్ అనే మాట విశేషణమూ కావచ్చు, క్రియగా, ఆదేశపూర్వక క్రియగా కూడ ఉండవచ్చు. అంటే, తలుపు తెరువు, పుస్తకాలు తెరువు, మేధ తెరువు, హృదయం తెరువు అని.   
 
          సిల్వియా బీచ్ (1887-1962) అనే అమెరికన్ మహిళ ఈ పేరుతో పారిస్ లో మరొక చోట ఒక పుస్తకాల దుకాణాన్ని 1919లో తెరిచారు. అది పుస్తకాల దుకాణంగానూ, పుస్తకాలు అద్దెకిచ్చే గ్రంథాలయం గానూ 1941 దాకా నడిచింది. ఆ కాలంలో ఎర్నెస్ట్ హెమింగ్వే, గెర్ట్రూడ్ స్టీన్, జేన్ ఫ్లానర్, ఎజ్రా పౌండ్,  జార్జ్ ఆంథెయిల్, స్కాట్ ఫిట్జెరాల్డ్, జూనా బార్నెస్, టి ఎస్ ఇలియట్, జేమ్స్ జాయిస్, పాల్ వాలెరీ, ఆండ్రీ గైడ్, స్టీఫెన్ స్పెండర్ వంటి అప్పటికే సుప్రసిద్ధులైన రచయితలూ, అప్పడే రచన ప్రారంభిస్తున్నవాళ్ళూ ఈ దుకాణానికి వస్తుండేవారు. ఆమె పుస్తకాల దుకాణం యజమానిగా మాత్రమే కాక ఈ రచయితలకు రుణదాతగా, పోస్టాఫీసుగా, స్నేహితురాలిగా, పాఠకురాలిగా కూడ ఉండే వారు. క్రమంగా ప్రచురణకర్తగా కూడ మారి, జేమ్స్ జాయిస్ నవల యులీసిస్ ను ప్రచురించడానికి ఎవరూ ముందుకు రాకపోతే, 1922 లో మొదటిసారి ఆమె ప్రచురిం చారు. 
 
          ఇంగ్లండ్, అమెరికా, ఐర్లాండ్, ఫ్రాన్స్ ల మధ్య సంబంధాలు మెరుగుపరచడానికి ఆ నాలుగు దేశాల రాయబారులు చేసిన దానికన్న ఎక్కువ పని సిల్వియా బీచ్ ఒంటి చేత్తో చేశారని ఫ్రెంచి రచయిత ఆండ్రీ చామ్సన్ అన్నాడు. ఈ క్రమంలో ఆమె సొంత గ్రంథాల యం, ఆమె ఉత్తర ప్రత్యుత్తరాలు అన్నీ కూడ షేక్స్పియర్ అండ్ కంపెనీ ఆస్తిగా మారాయి. నాజీ సైన్యాలు ఫ్రాన్స్ నూ పారిస్ నూ ఆక్రమించడంతో 1941 డిసెంబర్ లో ఈ దుకాణం మూతబడింది. జేమ్స్ జాయిస్ నవల ఫిన్నెగాన్స్ వేక్ కావాలని ఒక జర్మన్ అధికారి అడిగాడని, అది చివరి కాపీ గనుక ఇవ్వడానికి ఆమె నిరాకరించిందని, అప్పుడు నాజీ సైనికులు దుకాణాన్ని మూసివేయించారని కూడ ఒక కథనం ఉంది. 
 
          అమెరికన్ సైన్యంలో పనిచేసి పదవీ విరమణ తీసుకున్న జార్జ్ విట్మన్ (1913 – 2011) యుద్ధం తర్వాత సోర్బాన్ లో చదువుకోవడానికి వచ్చి, పారిస్ లోనే స్థిరపడి 1951లో ప్రస్తుత షేక్స్పియర్ అండ్ కంపెనీ ఉన్నచోట ఇంగ్లీష్ పుస్తకాల దుకాణం తెరిచాడు. ఆ భవనం పదహారో శతాబ్ది క్రైస్తవ మోనాస్టరీది గనుక ఆ పేరుతోనే లె మిస్ట్రాల్ అనే పేరుతో పుస్తకాల దుకాణం మొదలయింది. త్వరలోనే ఈ పుస్తకాల దుకాణం కూడ, పాతసిల్వియా బీచ్ దుకాణం లాగ పారిస్ కళా సాహిత్య మేధో సాంస్కృతిక కేంద్రంగా మారింది. అలెన్ గిన్స్ బర్గ్, గ్రెగరీ కోర్సో, జేమ్స్ బాల్డ్విన్, అనైస్ నిన్, జూలియో కోర్టజార్, రిచర్డ్ రైట్, లారెన్స్ డురెల్, బెర్టోల్ట్ బ్రెహ్ట్, విలియం సారాయన్, విలియం స్టైరన్, లారెన్స్ ఫెర్లిం ఘెట్టి వంటి కవులూ రచయితలూ, సుప్రసిద్ధ పారిస్ రివ్యూ సంపాదకులూ ఈ దుకాణంలో చేరడం మొదలుపెట్టారు. 
 
          ఈ బృందంలో చేరిన సిల్వియా బీచ్ తన దుకాణం పేరు విట్మన్ కు ఇస్తున్నానని 1958లో ప్రకటించింది. ఆమె చనిపోయాక, షేక్స్పియర్ నాలుగు వందల జయంతి సందర్భంగా 1964 లో విట్మన్ తన పుస్తకాల దుకాణం పేరును షేక్స్పియర్ అండ్ కంపెనీ గా మార్చాడు. 
 
          తన పుస్తకాల దుకాణం మూడు మాటల నవల అని, “పుస్తకాల దుకాణం ముసుగులో ఉన్న సోషలిస్టు ఊహాస్వర్గం” అని విట్మన్ అన్నాడు. “ఒక మనిషి నవల రాసినట్టుగా, ఒక అధ్యాయం మీద మరొక అధ్యాయం నిర్మించినట్టుగా నేనీ పుస్తకాల దుకాణాన్ని సృష్టించా ను. ఈ దుకాణానికి వచ్చే జనం తాము పుస్తకాలు ఎట్లా తెరుస్తారో ఇక్కడి తలుపులూ అట్లాగే తెరవాలని, ఆ పుస్తకాలు తెరిచినప్పుడు అవి వారిని తమ ఊహల్లోని ఒక సమ్మోహక ప్రపంచంలోకి ఎలా తీసుకుపోతాయో అలాగే ఈ దుకాణం తీసుకుపోవాలని నా కోరిక” అని విట్మన్ అన్న మాట ఇప్పటికీ అక్కడ రాసి పెట్టి ఉంటుంది.
 
          మూడు అంతస్తుల ఈ భవనంలో దాదాపు పది పన్నెండు గదులుంటాయి. ప్రక్రియ లను బట్టి గాని, విషయాన్ని బట్టిగాని, పాఠకుల వయసును బట్టిగాని ఆయా గదుల్లో ఆయా ప్రత్యేక పుస్తకాలు ఉంటాయి. అయితే పుస్తకాల బీరువాల మధ్య ఒక టైప్ రైటర్, ఒక పియానో, ప్రతి అంతస్తులోనూ రెండో మూడో పడకలు, చాల కుర్చీలు ఉండడం ఒక ప్రత్యేకత. ఒక గదిలో పుస్తకాల మధ్య ఒక పిల్లి కూడ తిరుగుతుంటుంది. అక్కడ పుస్తకాలు కొనుక్కోవడానికి బీరువాలు వెతుకుతున్న వాళ్ళు మాత్రమే కాక కూచుని పుస్తకాలు చదువుకుంటున్నవాళ్ళు కూడ ఎందరో కనబడతారు. అమ్మకానికి కొత్త పుస్తకాలతో పాటు పాత పుస్తకాలు కూడ ఉంటాయి. చదువుకోవడానికి, సంప్రదించడానికి మాత్రమే ఇచ్చే పుస్తకాలు, పత్రాలు, పాత పత్రికలు ఉంటాయి.   
 
          ఇక పడకలెందుకంటే, పాఠకులూ రచయితలూ ఎవరైనా సరే వచ్చి తన దుకాణం లో పడుకోవచ్చునని, వారికి మూడు షరతుల మీద ఆశ్రయం దొరుకుతుందని విట్మన్ 1951లోనే ప్రకటించాడు. ఒకటి, ఈ ఆశ్రయానికి బదులుగా వారు కొన్ని గంటల పాటు దుకాణపు పనులు చేయాలి. రెండు, రోజుకొక పుస్తకం చదవాలి. మూడు, కనీసం ఒక పేజీ ఆత్మకథ రాసి, షేక్స్పియర్ అండ్ కంపెనీ ఆర్కైవ్స్ కు ఇవ్వాలి. వీళ్ళను ఆయన టంబుల్ వీడ్స్ అని పిలిచాడు. అమెరికాలో వేర్లు లేకుండా గాలిలో ఎటుపడితే అటు ఊగిపోయే గాలి మొక్క పేరు అది. ఈ డెబ్బై ఏళ్లలో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్న వాళ్ళు అలాన్ సిలిటో, జీత్ థాయిల్, సెబాస్టియన్ బారీ వంటి వారితో సహా దాదాపు ముప్పై వేల మంది ఉంటారని అంచనా. ఈ దుకాణం మూడు నాలుగు సాహిత్య పత్రిక లకు ప్రచురణ స్థలంగా, కార్యాలయంగా కూడ ఆశ్రయం ఇచ్చింది. 
 
          జార్జ్ విట్మన్ 2011 లో చనిపోగా, ఆయన కూతురు సిల్వియా విట్మన్ ఆ దుకాణాన్ని తండ్రి పద్ధతిలోనే, మరిన్ని అదనపు సౌకర్యాలు, పనులు కూడ చేర్చి నడుపుతున్నది. ఈ పుస్తకాల దుకాణం చరిత్ర, సందర్శించిన ప్రముఖ రచయితల వ్యాసాలు, ఎంపిక చేసిన టంబుల్ వీడ్స్ ఆత్మకథలు, ఫొటోలు కలిపి 2016లో వెలువడిన 400 పేజీల పెద్ద పుస్తకం ఒకటి కూడ అక్కడ అమ్మకానికి ఉంది. దాని ఖరీదు చాల ఉండడంతో కొనలేక పోయాను. అసలు ఆ దుకాణంలో ఏమీ కొనకుండానే, ఓ వంద పుస్తకాల దాకా కళ్ళనిండు గా చూసీ, ముట్టుకునీ, నిమిరీ, వాసన చూసీ, తిరగేసీ, అక్కడక్కడ చదివీ సంతృప్తి పడ్డాను. అసలు ఆ దుకాణంలో రెండు మూడు గంటలు ఉండడమే దానికదిగా అంచితా నంద శాంత సామ్రాజ్యం అంచులకు చేరడమనుకున్నాను. 
 
          చివరిగా, ఈ దుకాణంలో చెప్పుకోవలసిన గొప్ప సంగతి, ఎక్కడ పడితే అక్కడ పుస్తకాలతో పాటు, కవితా పంక్తులు, గుర్తుంచుకోదగ్గ సాహిత్య వాక్యాలు ఎన్నోచోట్ల రాసిపెట్టి కనబడతాయి:
 
          “అపరిచితులతో దురుసుగా ఉండకు, వాళ్ళు మారువేషంలో ఉన్న దేవతలు కావచ్చు” అనే వాక్యం మొదటి గదిలోంచి లోపలికి వెళ్ళే ద్వారబంధం పైన రాసి ఉంటుంది. ఈ మాట వెనుక కూడ ఒక కథ ఉంది. జార్జి విట్మన్ తన ఇరవైల్లో మహా ఆర్థిక మాంద్యం రోజుల్లో జేబులో కేవలం నలబై డాలర్లతో అమెరికా ఒక చివరి నుంచి మరొక చివరికి, మెక్సికో మీదుగా మధ్య అమెరికా దాకా ప్రయాణం చేశాడట. బహుశా కొన్ని వేల కిలోమీటర్ల ఈ ప్రయాణం కాలినడకనా, ఎక్కడైనా వాహనం కనబడి వాళ్ళు దయతలచి ఎంత దూరం తీసుకువెళ్తే అంతదూరం ఆ వాహనంలో, రైళ్ళలో సాగిందట. ఈ ప్రయాణ మే తనకు మనిషి మంచితనం మీద విశ్వాసం ఇచ్చిందని విట్మన్ రాశాడు. ఈ మార్గ మధ్యంలో మెక్సికోలోని యుకటన్ ప్రాంతంలో తీవ్రంగా జబ్బుపడితే, అక్కడి మయన్ తెగ మనుషులు విట్మన్ కు చికిత్స చేసి, సకలోపచారాలు చేసి బతికించారట. ఆ స్వానుభవంతో తాను రాసుకున్న మాట అది.  
 
          దుకాణంలో కవిత్వం పుస్తకాల కోసం ఒక అంతస్తు ఎక్కాలి. ఆ చెక్క మెట్ల మీద ఒక్కొక్క మెట్టుకూ ఒక పాదం లాగ హాఫిజ్ కవిత రాసి పెట్టి ఉంది:
 
“నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు
లేదా చీకటిలో ఉన్నప్పుడు
నీకొకటి చూపాలని 
నా కోరిక 
అది 
నీ సొంత అస్తిత్వమే వెదజల్లే
అపార సంభ్రమాశ్చర్య కాంతి.”  
 
          అలాగే, “కావాలంటే మీ గ్రంథాలయాలన్నిటికీ తాళాలు వేసుకోండి. కాని మానసిక స్వేచ్ఛను అడ్డుకునేందుకు మీకు ద్వారమేదీ లేదు, తాళమేదీ లేదు, గొళ్లెమేదీ లేదు” అనే వర్జీనియా ఉల్ఫ్ వాక్యాలు ఒక చోట ఉంటాయి. 
 
          “నువ్వు పూలన్నిటినీ తెంపి పారెయ్యొచ్చు, కాని వసంతం రాకుండా ఆపలేవు” అనే పాబ్లో నెరూడా వాక్యాలు ఒకచోట ఉంటాయి.  
 
          తెలుగు సీమలో ఇటువంటి కళాత్మకమైన, ఆలోచనాత్మకమైన, ఆహ్లాదకరమైన పుస్తకాల దుకాణం కలగనగలమా?
*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.