మూగజీవుల సాయం

-కందేపి రాణి ప్రసాద్

          అదొక పర్వత ప్రాంతం అంతేకాదు పర్యాటకప్రాంతం కూడా! చుట్టూ మంచు కొండలు ఆవరించి ఉంటాయి. మధ్యలో చిన్న గ్రామం. మంచు కొండల పైన హిమానీ నదాలు అంటే గ్లేసియర్స్ ఉంటాయి. వాటిని చూడటానికి మనుష్యులు వస్తుంటారు కొండల మీద పేరుకున్న మంచులో ఆటలు కూడా ఆడుతుంటారు. పర్వతాల పై బాగానికి చేరి లోయల అందచందాల్ని చూస్తే అద్భుతంగా ఉంటుంది. ఆ ప్రకృతి అందాల్ని తిలకించేందుకే చాలా మంది పర్యాటకులు వస్తుంటారు. కానీ కొండల మీదకు ఎక్కలేరు.

          పర్యాటకుల్ని కోండల మీదకు మోసేందుకు గుర్రాలను వాడతారు. అక్కడున్న వ్యాపారులు వందల గుర్రాలను కొని తర్ఫీదు ఇచ్చి కొండల మీదికి పంపిస్తారు. ఆ గుర్రాలకు చిన్నతనం నుంచే తర్ఫీదు ఉంటుంది. పెద్ద గుర్రాలు మనుష్యులను మోసుకుంటూ కొండ మీదకు వెళుతుంటే వాటి వెనకాలే వాటి పిల్లలు వెళుతూ ఉంటాయి. పెద్ద గుర్రం మోకాళ్ళ ఎత్తు వరకు వచ్చే పిల్ల గుర్రం తల్లి తోక పట్టుకుని నడుస్తూ ఉంటుంది.

          ఈ మధ్యనే ‘సిగ్గీ’ అనే గుర్రానికి ఒక బుజ్జి గుర్రం పుట్టింది. అదేమో తల్లిని విడిచి ఉండలేదు. యజమాని ఓ నాలుగు రోజులు మాత్రం ‘సిగ్గీ’ కి పని చెప్పలేదు. ఆ తర్వాత రోజూ కొండ పైకి వెళ్ళడానికి పనిలోకి పిలిచాడు. ‘సిగ్గీ’ కి తను పని చేయగలుగుతానా, లేదా అనే భయం కన్నా బిడ్డను వదిలి ఎలా వెళ్ళడమా అనే భయమే ఎక్కువగా అనిపించింది.

          సిగ్గీ మెల్లగా యజమాని దగ్గరకు వెళ్ళి అడిగింది మరో నాలుగురోజులు విశ్రాంతి ఇవ్వమని కోరింది. కానీ యజమాని ఒప్పుకోలేదు. “అక్కడ యాత్రీకుడు వచ్చి ఉన్నాడు. మన దగ్గర ఉన్న గుర్రాలన్నీ కొండ పైకే పోయినాయి. ఇంక ఎవరూ లేరు నీవు పావాల్సిందే అన్నాడు యజమాని నచ్చజెప్పే ధోరణిలో” ‘సిగ్గీ’ కాదనలేక పోయింది.
మరి కొంత కాలం గడిచాక సిగ్గీ తనతో పాటు తన పిల్లను కూడా వెంట తీసుకెళ్ళడం మొదలు పెట్టింది. బుల్లి పోనీ తన తల్లి వెంట హషారుగా వెళుతున్నది. కానీ కొండల్లో ఉన్న రాళ్ళ మీద కాళ్ళ కొట్టుకొని రక్తం కారుతున్నది. దాన్ని చూసి తల్లి కళ్ళ వెంట నీరు ధారగా కారిపోతున్నది. తల్లితో పాటు వేగంగా నడవలేక అమ్మా అంటూ కూలబడి పోతున్నది. నేల మీద పచ్చిక తింటూ కూర్చుండి పోతున్నది. బిడ్డ రాలేదని తల్లి మెల్లగా నడిస్తే గుర్రపు కాపలాదారుడు తాడు లాగి అదిలిస్తాడు. తనేం చేయగలదు మళ్ళీ ముందుకు పరిగెడుతుంది.

          యజమాని పోనీకి కూడా శిక్షణ ఇవ్వటం మొదలుపెట్టాడు. అది చక్కగా నేర్చుకుంటేనే ఆ రోజు ఆహారమిస్తాడు. గుగ్గిళ్ళ కోసం పోనీ కూడా పడి పడి పని చేస్తున్నది. పాపం పోనీని చూసి సిగ్గీ తెగ బాధపడుతోంది. ఆ కొండల మీద ఎక్కటం ఇప్పుడిప్పుడే పోనీకి అలవాటవుతున్నది. తల్లికి ఎక్కడన్నా పడిపోతుందేమో అని భయంగా ఉన్నది.

          ఒక రోజు యజమాని పోనీ మీద కూడా ఒక మనిషిని కూర్చోబెట్టి ప్రయాణానికి బయల్దేరాడు. పోనీకి కష్టం తెలియక ఉత్సాహంగా ఉన్నది. అయితే, యజమాని చిన్న పిల్లవాడినే పోనీ మీద కూర్చోబెట్టాడు. తల్లి మాత్రం భయపడుతోంది. పిల్లవాడు దారిలో ఏదో తుంటరి పని చేస్తే పోనీ ఏం చేస్తుందో అని భయం. పోనీ మాత్రం తాను పెద్దయ్యాను కాబట్టి నన్ను కొండ మీద ప్రయాణానికి పంపుతున్నారు అని ఆనందంగా ఉన్నది.
తల్లి సిగ్గీ, పోనీని పిలిచి” కొండల అంచు వరకు వెళ్ళకు. పొరపాటున కాలు జారితే నీతో పాటు పిల్లవాడు కూడా పడిపోతాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందునా ఎక్కినవాడు తెలిసీ తెలియక ఏమైనా చేసినా సహనంగా ఉండు. మన యజమానికి చెడ్డ పేరు రాకుండా చూసుకో ” అని ఎన్నో జాగ్రత్తలు చెప్పింది. పోనీ సరేనని అన్నిటికీ తల ఊపింది. దానికి సవారికి వెళుతున్నానన్న ఆనందంలోనే ఉన్నది.

          పోనీ పిల్లవాడి నెక్కించుకుని ఉత్సాహంగా బయల్దేరింది కొద్దిసేపటికి ఆ బరువు మోయలేక పోయింది. ఇంకొంచెం సేపటికి ఆయాసం వచ్చింది. దాహం వేసింది . నీళ్ళ కోసం సకిలించింది. అక్కడికి దగ్గర్లోనే ఉన్న సిగ్గీకి వినిపించింది. కొద్దిగా విశ్రాంతి ఇవ్వమని గుర్రపు కాపలా వాడిని కోరింది. అతను అక్కడ నీళ్ళుపెట్టి కొద్దిసేపు దింపాడు.
పొనీ గటగటా నీళ్ళు తాగింది . అలసిపోయి నేలమీద వాలింది. కళ్ళు మూత బడు తున్నాయి. సిగ్గీ వచ్చి ప్రేమగా పోనీ వళ్ళంతా తడిమింది. పాపం బిడ్డ కూడా నాలాగా కష్టపడుతున్నది అని బాధేసింది. కానీ మనుష్యుల పిల్లలు కూడా ఇలాగే స్కూళ్ళలో కష్టాలు పడుతారని విన్నది. ఎన్నెన్నో పుస్తకాలు మోసుకుంటూ వెళతారట. ఒక్క నిమిషం ఖాళీ లేకుండా చదువుతూ రాస్తూ ఉంటారట. తను మోసే మనుష్యులు చెప్పుకుంటుంటే విన్నది. ఏమిటో ఈ కష్టాలు అనుకున్నది.

          కొద్ది సేపటి తర్వాత ప్రయాణం మొదలయింది. పోనీ పిల్లవాడిని ఎక్కించుకుని బయల్దేరింది కొంచెం దూరం వెళ్ళాక పిల్లవాడు పోనీని గిచ్చడం మొదలుపెట్టాడు. దానికి నొప్పి వచ్చింది. శరీరం కదిలించింది ఆ పిల్లవాడు గిచ్చడం మానలేదు. పోనీ భరిస్తూనే ఉన్నది. పోనీలే చిన్న పిల్లవాడు కదా ! తెలియక చేస్తున్నాడులే అనుకున్నది. ఆ పిల్లవాడికి సరదా ఇంకా ఎక్కువై తన చేతిలో ఉన్న లాలిపాప్ పుల్లతో పోనీ వీపు పై బలంగా గుచ్చాడు. పోనీ ఒక్కేసారిగా ఆ నొప్పికి ఎగిరి గంతెసింది అబ్బా అమ్మా అంటూ అరిచి ఎగిరి గెంతుతూనే ఉన్నది పిల్లవాడు కూడా కిందపడి ఏడవటం మొదలుపెట్టాడు.
పిల్లవాడి తల్లి దండ్రులు, గుర్రాల యజమాని, గుర్రపు కాపలాదారులు, చుట్టు పక్కల ప్రయాణీకులు అందరూ వచ్చారు. పిల్లవాడి తల్లిదండ్రులు “మా అబ్బాయిని కింద పడెసింది ఈ గుర్రానికేమీ రాదు” అంటూ పోనీని తిట్టడం మొదలు పెట్టారు. సిగ్గీ కూడా అప్పుడే అక్కడికి వచ్చింది. తన బిడ్డను తిట్టడం చూసి తట్టుకోలేక పోయింది . మెల్లగా పొనీ దగ్గరకు వెళ్ళి విషయం అడిగింది.

          అప్పుడే గంతులు ఆడి పోనీ ఏడుస్తూ, ఒక పక్కగా నిలబడింది . బయల్దేరేటపుడు ఉన్న ఉత్సాహం ఆవిరై భయపడి పోతున్నది. యజమాని ఏమంటాడో అనీ, తాను సరిగ్గా చెయ్యలేక పోయానే అనీ బాధతో ఉన్నది. పోనీ వీపుమీద పుల్లతో గుచ్చిన చోట రక్తం కారుతున్నది. తల్లి గాయాన్ని నాకి పోనీకి నెప్పిలేకుండా చేసింది. తల్లి మనసంతా దిగులు కమ్మేసింది.

          గుర్రం యజమాని పిల్లవాడి తల్లి దండ్రులతో ఇలా చెప్పాడు. “జంతువులు కూడా ప్రాణమున్న జీవులే. వాటిని కూడా దయతో చూడాలి చూడండి మీ అబ్బాయి గుర్రానికి చేసిన గాయం. ఆ నొప్పికి అది భయపడి పడేసింది గానీ చేతకాక కాదు, కావాలనీ కాదు. మీరు పిల్లలకు మంచి విషయాలు నేర్పాలి. మనకెంతో సహాయం చేసే జంతువులను ప్రేమతో చూడాలి. కనీసం వాటిని బాధించకూడదు. చాలా ప్రమాదాలు వాటిని విసిగించి నందువల్లో బాధించినందువల్లో జరుగుతాయి. మనుష్యులమైన మనమే సరిగా లేకపోతే జంతువులు ఎలా ఉంటాయి”. తల్లిదండ్రులకు అర్ధమై పోనీకి సారీ చెప్పారు . పిల్లవాడి చేత కూడా ‘సారీ’ చెప్పించారు పోనీ తల్లి సిగ్గీ దగ్గరకు చేరింది.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.