యాత్రాగీతం

అమెరికా నించి ఆస్ట్రేలియా

(ఇటీవల మేం చేసిన ఆస్ట్రేలియా యాత్రని గురించి నా ట్రావెలాగ్ సిరీస్ “యాత్రాగీతం” లో భాగంగా ఈ నెల నుంచి మీకు అందజేస్తున్నాను. చదివి మీ అభిప్రాయం పెట్టడం మర్చిపోకండి.)

-డా||కె.గీత

భాగం-6

సిడ్నీ (రోజు-2) సిటీ టూర్

మేం సిడ్నీ చేరుకున్న రెండో రోజు ప్యాకేజీ టూరులో భాగమైన “సిడ్నీ లగ్జరీ సిటీ టూర్”  చేసేం. 

          అప్పటికే సిడ్నీలో మేం చూసేసిన సర్క్యులర్ కే ప్రాంతంలోని ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి, స్కై డెక్ మళ్ళీ చూపిస్తారేమో, పెద్దగా మరేం చూసేదేమీ ఉండదనుకున్న మాకు ఈ టూరులో సిడ్నీలోని మరెన్నో విశేషాలు చూడడం, తెలుసుకోవడం చాలా సంతృప్తిగా అనిపించింది.

          ఉదయం ఏడున్నరకల్లా మా హోటలు దగ్గరే పికప్ చేసుకున్నారు. 15 మంది కూర్చోగలిగే మాములు చిన్న సైజు వ్యాను అది. మరి ఇది లగ్జరీ సిటీ టూర్ ఎందుక య్యిందో పెరుమాళ్ళకెరుక! 

          ఇక అందులో మేం, మాతో బాటూ మరి నలుగురైదుగురం ఉన్నాం. మొదటగా డార్లింగ్ హార్బర్ మీదుగా ప్రయాణం చేసి రాక్స్ దగ్గిర నుంచి తీసుకు వెళ్తూ విశేషాలు చెప్పసాగేడు. ఈ రాక్స్ ముందు రోజు మేం చూసిన సర్క్యులర్ కే సమీప ప్రాంతమన్న మాట. ఇక్కడంతా ఒకప్పుడు కొండలు, రాతి ప్రాంతం కాబట్టి రాక్స్ అన్న పేరు వచ్చింద ట.  

          ఇక 1788 లో బ్రిటిషు వారు సిడ్నీలో అడుగుపెట్టిన కాలంలో లార్డ్ సిడ్నీ బ్రిటిషు సెక్రటరీ కాబట్టి ఆయన పేరు మీద ఈ తీరానికి “ సిడ్నీ” అని పేరు పెట్టారట. 1830 నాటికి సిడ్నీ యూరపు దేశం నించి ఎగుమతులు, దిగుమతులకి  గొప్ప ఓడరేవు అయ్యింది.  1850 ప్రాంతంలో ఇక్కడ బంగారం తవ్వకాలు ఇబ్బడి ముబ్బడిగా మొదలవ్వడంతో కార్మికుల కోసం బ్రిటను నించి నేరస్తుల్ని ఇక్కడికి తీసుకొచ్చేవారట. ఆ తర్వాత్తర్వాత బొగ్గు గనుల్లో పనిచేయడానికి, తరువాత సిడ్నీని అభివృద్ధి చేయడానికి ఇదే బాట పట్టారు. అలా సిడ్నీ ఒకప్పుడు నేరస్తుల నగరంగా పేరు గాంచిందట. 

          సిడ్నీలో ఈవేళ వారి వారసులు ఎందరో ఉన్నారట. వారి వారసులలో మా గైడు కమ్ వ్యాను డ్రైవరు కూడా ఒకడినని చెప్పుకొచ్చాడు. తమ పూర్వీకులలో అటూ, ఇటూ ముందు మూణ్ణాలుగు తరాలకు చెందిన వారు ఇలా వచ్చిన నేరస్తులేనని, ఇంతకీ వాళ్ళు చేసిన నేరాలు ఏవిటంటే ఒకరు చర్చిలో బైబిలు దొంగతనం చెయ్యడం, మరొకరు గుర్రాన్ని దొంగతనం చెయ్యడం అని వాపోయాడు. అసలు బైబిలు ఎందుకు దొంగతనం చెయ్యవలసి వచ్చిందో ఆరాతీస్తే ఆ రోజుల్లో ప్రింటు పుస్తకాలు వస్తున్న కొత్త కాబట్టి ఎంతో విలువ ఉండి ఉంటుందని, అదీగాక చర్చిలో వాడే బైబిలు కాబట్టి అంత  ప్రాముఖ్యత కూడా ఉండి ఉంటుందని చెప్పేడు. కేవలం ఒక పుస్తకం దొంగతనం చెయ్యడం వల్ల జీవితం తారుమారైన ఆ సంఘటన ఇప్పటికీ తనని కలిచి వేస్తూ ఉంటుందని, తాను తన జీవితకాలంలో ఎలాగైనా ఇంగ్లాండులోని అదే చర్చికి  వెళ్లి ఒక బైబిలుని బహుమతిగా ఇచ్చి రావాలనుకుంటున్నట్టు చెప్పేడు. 

          ఆ తరవాత చారిత్రాత్మకమైన సిడ్నీ అబ్జర్వేటరీ (Observatory Hill) దగ్గిర ఒక్క నిమిషం వ్యానుని ఆపి, బాటచుట్టూ ఒక రౌండు తిప్పి అక్కణ్ణించి కనిపిస్తున్న సిడ్నీ మహానగరపు ముఖ్య భవంతులన్నీ వివరించాడు. ఒకప్పుడు సిడ్నీ అబ్జర్వేటరీ వాతావరణ పరోశోధనా కేంద్రంగా, చిన్నపాటి నక్షత్రశాలగా విలసిల్లిందట. ఇప్పటికీ ఈ అబ్జర్వేటరీ ప్రజల సందర్శనార్థం అందుబాటులో ఉంది. అంతే కాకుండా దీనిని ఆర్ట్ మ్యూజియంగా తయారు చేసారు. ఇది తప్పనిసరిగా చూడవలసిన ప్రదేశమని,సమయం ఉంటే చూసి వెళ్ళమని చెప్పాడు మా గైడు. 

          అక్కణ్ణించి డ్రైవులోనే తిన్నగా పాత సిడ్నీ నగరంగా పిలిచే ఆవలి తీరంలో కనిపి స్తున్న పాత ఎమ్యూజ్ మెంటు పార్కుని చూపించేడు. అలాగే సర్క్యులర్ కే ప్రాంతానికి వచ్చి పోతున్న పసుపు, ఆకుపచ్చ మర పడవల్ని చూపిస్తూ అవన్నీ చుట్టు పక్కల తీరాలకు వస్తూ పోతూ ఉండడానికి మంచి ట్రాన్సుపోర్టులని చెప్పేడు. ఆ విషయం మేం ఆ మర్నాడు స్వయంగా తెలుసుకున్నాం. ప్రతి నాలుగైదు మైళ్ళకి ఒక చిన్న పోర్టు ఉండి, సిడ్నీ నగరంలో ప్రధాన ప్రాంతానికి వచ్చి, వెళ్ళడానికి అనువుగా ఉన్నాయి ఈ వాటర్ టాక్సీ సర్వీసులు. 

          అలాగే నగరంలో మరో ఆకర్షణీయమైన విషయం ఏవిటంటే నగరంలోని రోడ్లు పై నుంచి చిన్నగా కనిపిస్తూ, ట్రాములు, బస్సులు వంటి పబ్లిక్ ట్రాన్స్పోర్టు తో బిజీగా ఉన్నా, టాక్సీలు వంటివి జోరుగా వెళ్ళడానికి, నగరాల్ని దాటి వెళ్లే పరిసర ప్రాంతాలకి వెళ్ళడా నికి హైవేలు అండర్ గ్రౌండ్ లో టన్నెల్స్ లో నిర్మించబడ్డాయి. నగరాల మీద హైవే బ్రిడ్జిలు నిర్మించి నగర రూపురేఖలు మార్చకుండా పర్వత ప్రాంతం కాబట్టి ఇలా ట్రాఫిక్ కోసం టన్నెల్స్ నిర్మించడం అద్భుతమైన ఆలోచన అనిపించింది. 

          ఇక టూరులో మరో ఆకర్షణీయమైన విషయం ఏవిటంటే ఓపెరా హౌస్, హార్బర్ బ్రిడ్జి లని కలిపి ఒకే ఫ్రేములో ఆవలి తీరం నించి చూడగలగడం. ఆ దృశ్యాన్ని చూడడం ఒక  గొప్ప అందమైన అనుభూతి. ఆ ప్రాంతం పేరు మిసెస్ మెక్ క్వేరీస్ పాయింటు. అక్కడ రాతి గుట్ట మీద చెక్కి ఉన్న మిసెస్ మెక్ క్వేరీ తరచుగా వచ్చి కూచునే రాతి కుర్చీ  (Mrs Macquarie’s Chair)ని, ఆ  ప్రాంతాన్ని అలాగే ఉంచారు. ఆ చుట్టుపక్కల 3 మైళ్ళని  పార్కుగా మార్చారు. మిసెస్ ఎలిజబెత్ మెక్ క్వేరీ 1810 ప్రాంతంలో సిడ్నీని పరిపాలిం చిన గవర్నర్  మెక్ క్వేరీ గారి భార్య అట. మిసెస్ మెక్ క్వేరీ కి ఆస్ట్రేలియాలో ఉండడం ఇష్టం ఉండేది కాదట. అందుకే ఈ  తీరానికి వచ్చి కూచుని అక్కడి ఓడల్ని, పడవల్ని చూస్తూ తానెప్పుడు తిరిగి వెళ్తానా అని ఎదురుచూసేదట. ఆ గాథ వింటుంటే ఆవిడ ఎదురు చూపు ఇప్పటికీ ఆ రాతి మీద అతుక్కుని ఉన్నట్లు అనిపించింది. అప్పట్లో ఆవిడ చూస్తూ ఉన్న గతపు తీర ఛాయా చిత్రాన్ని కూడా అక్కడ పదిలపరిచారు. మొత్తానికి అప్పట్లో ఓపెరా హౌస్ , హార్బర్ బ్రిడ్జి లు లేకపోయినా అది అత్యంత సుందర మైన, ఆహ్లాదకరమైన తీరమన్నమాట. 

          దగ్గర్లో రాయల్ బొటానికల్ గార్డెన్స్ చూడదగ్గ మరో విశేషం. చూడవలసిన చారిత్రా త్మక విశేషాలైన సెయింట్ మేరీస్ కెథెడ్రల్, ఒకప్పుడు నాణాలు ముద్రణ చేసిన టంక శాల, ప్రభుత్వాసుపత్రి, నగర గ్రంథాలయం పక్కపక్కనే ఉండడం కూడా విశేషమే. 

          అక్కణ్ణించి ఊలూమూలూ (Woolloomooloo) అని పిలవబడే హార్బర్ ప్రాంతం మీదుగా పోనిచ్చాడు.   

          ఊలూమూలూ అనేది వాలాబముల్లా (Wallabahmullah) అనే స్థానిక పదంనించి వచ్చిందట, అంటే స్థానిక అబోరిజినల్ భాషలో “ముదురు రంగులో ఉన్న చిన్న కంగారూ” అట. 

          సిడ్నీ సహజ సిద్ధమైన ఓడరేవు. ఇక్కడ పెద్ద పెద్ద ఓడల దగ్గరి నుంచి చిన్న కయాక్ లు నడవగలిగే విలక్షమైన అనేక  హార్బర్లు, జెట్టీలు ఉన్నాయి. అవన్నీ తిరిగి చూడడానికే ఎన్నో రోజులు పడుతుంది. 

          ఇక కింగ్స్ క్రాస్ అని పిలవబడే ఏరియా రెడ్ లైట్ ఏరియాని కూడా వ్యానులో నించే  చూపించాడు. ఒకప్పుడు నాటక శాలలతో, సంగీత సామ్రాజ్యంగా విలసిల్లిన ఆ ప్రాంతం రెండో ప్రపంచ యుద్ధం తరవాత నైట్ క్లబ్ ఏరియాగాను, తర్వాత్తర్వాత  రెడ్ లైట్ ఏరియాగాను మారిపోయిందని వివరించాడు. వార్  మెమోరియల్  గా ప్రతిష్టించబడిన ఎల్ అమీన్ ఫౌంటెన్ (El Alamein Fountain) వేల నీటి బాణాలు ఒక్క కేంద్రం నించి ఎక్కు పెట్టిన బంతిలా విలక్షణంగా, చూడదగినదిగా  ఉంది. 

          వ్యానులో అమెరికాలో కొబ్బరి బొండం నీళ్లు అమ్మే చిన్న నీలం రంగు అట్టడబ్బాల వంటివి తలా ఒకటి ఇస్తే ఇంకేమో అనుకున్నాం. అవి మంచినీళ్ల డబ్బాలు. ఇక్కడ మంచినీళ్లు వగైరాల కోసం ప్లాస్టిక్ వినియోగాన్ని ఆపేసేరట. స్పూనులు, స్ట్రాలు కూడా పలుచని చెక్క, కాగితంతో తయారు చేసినవే ఉన్నాయిక్కడంతా.

*****

(సశేషం)

 

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.