“షార్ట్” ఫిల్మ్ వెనక “లాంగ్” స్టోరీ-1 (అమెరికా గుడి)

డా||కె.గీత

          అమెరికా వచ్చి అయిదేళ్లయినా ఉద్యోగం చెయ్యడానికి వీల్లేని డిపెండెంటు వీసాతో విసిగివేసారుతూ, భవిష్యత్తులో ఒబామా చెయ్యబోయే అద్భుతం కోసం ఎదురుచూస్తూ ఉన్న రోజుల్లో అమెరికా వ్యవస్థలోని అనేక ఎగుడుదిగుడు అంశాల గురించి ఆంధ్రప్రభ డైలీకి రెండేళ్ళ పాటు రాసిన హాస్య, వ్యంగ్య కాలమ్ “అనగనగా అమెరికా“. 

          “కట్” చేసి వర్తమానానికి వస్తే, ఏకంగా ఓ పక్క సాఫ్ట్ వేరు రంగంలోనే ప్రఖ్యాత కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నా రెండుచేతులా, పదివేళ్ళా లక్ష పనులు చేసే  దిన చర్యల్లో భాగంగా ఆన్ లైన్ రేడియో టోరీ (Telugu One Radio) లో “గీతామాధవీయం” టాక్ షో లో “అనగనగా అమెరికా” కాలమ్ లోని కొన్ని భాగాలు వినిపిస్తున్న తరుణంలో హఠాత్తు గా ఓ ఆలోచన వచ్చింది. 

          అందులో ఓ  కాలమ్ అచ్చుమచ్చు సినీమా స్క్రీన్ ప్లే లా ఉంది కాబట్టి అటూ ఇటూ సరిచేసి షార్ట్ ఫిల్మ్ తీస్తే ఎలా ఉంటుంది? అని.  

          ఎప్పుడో షార్ట్ ఫిల్మ్స్ తియ్యాలని “గీతామాధవి” ఫిలిమ్స్ “లోగో” తయారు చేసుకున్నా, ఛానెల్ తయారు చేసినా, ఏవో కొన్ని షార్ట్ డాక్యుమెంటరీలు తీసినా, ఈ షార్ట్ ఫిల్మ్ ఏవిటి, ఎలా.. అనే అర్థం కాని సంశయంలో ఈ విషయంగా ఆలోచిస్తూ ఉండగా-

          సరిగ్గా అదే సమయానికి మా కుటుంబ సన్నిహిత మిత్రులు శ్రీ సుబ్బరాయ శర్మ గారు అమెరికాలో ఉన్నానని తెలియజేశారు. అది సరిగ్గా మే 25వ తారీఖు. ఇప్పటికి రెణ్ణెల్ల కిందటన్నమాట! 

          మరింకేం? కాలమ్ ని ఆయనకి పరిశీలనకు పంపించడమూ, ఆయనకు నచ్చడ మూ, అందులో హాస్యాన్ని ఉంచి, వ్యంగ్యాన్ని తీసివేసి ఆయన స్క్రీన్ ప్లే రాసి పంపడ మూ వెంటవెంటనే జరిగిపోయాయి. 

          అయితే మేం పశ్చిమాన ఉంటే అప్పటికి ఆయన తూర్పు తీరంలో ఉన్నారు. అయినా నిరాశపడక్కరలేదని అంటూ, ఇందులో ఉన్న రెండు ప్రధాన క్యారెక్టర్లలో ఒకటి ఆయనే వేస్తూ షూటింగ్ పూర్తి చేసి రెండ్రోజుల్లో షాట్స్ కూడా పంపేశారు.  

          అప్పుడు మొదలైంది ఇక నా పని. ఇక చూసుకోండి. ఏ పని చేస్తున్నా ఈ షార్ట్ ఫిల్మ్ ఆలోచనే. 

          ఒక పక్క నెచ్చెలి  జూన్ నెల సంచిక, అదే సమయంలో జూలై నాలుగవ వార్షికోత్స వ సంచికల కోసం విపరీతమైన పని, నెచ్చెలి కోసం ఇంటర్వ్యూలు, ఎడిటింగులు, మధ్య లో రెండవ వారాంతాల్లో వీక్షణం సమావేశాల హడావిడి, వారం వారం రేడియో షో, ప్రతి రోజూ సమయానికి రాయాల్సిన రచనలు, ఇంటా, బయటా బోల్డు పనులు, ఒత్తిళ్ళు, ప్రయాణాలు… ఏదీ మానెయ్యడానికి లేదు. ఏ పని చేస్తున్నా … అన్నిటా ఒకటే ఆలోచన  “షార్ట్ ఫిల్మ్”. 

          ఈ రెణ్ణెల్ల నించి ప్రతి రోజూ “షార్ట్ ఫిల్మ్” పని లేకుండా నిద్రపోయింది లేదు! 

          కథ కుదరగానే, స్క్రీన్ ప్లే సిద్ధంగా ఎదురవగానే, మొదట ఆర్టిస్టుల్ని వెదకడం మొదలు పెట్టాను. 

          శర్మ గారు ప్రధాన పాత్ర వేస్తున్నారు. మరో ప్రధానపాత్రని నన్నే వేసెయ్యమనే వరకు నాకు నటించాలన్న ఆలోచనే రాలేదు. అమెరికాలో అన్నిటికంటే సమయం చాలా విలువైంది కాబట్టి ఇక మరెవరినైనా వెదికే పని విరమించుకుని వెంటనే “సరే”  అన్నాను.

          ఇక ఇందులోని ఓ చిన్న పాప కేరెక్టర్ కోసం నా మనసులో వెంటనే మెదిలిన హుషారైన పాప మా వీథిలోనే ఉండే “అవంతి”’. మాకు బాగా సన్నిహితులైన తమిళ కుటుంబం వారిది. “డైలాగులు  ఇంగ్లీషులో” అనగానే వెంటనే “సరే”నంది. ముఖ్యంగా ఎంతో బిజీగా ఉండే ఆ పాప తల్లి స్వప్న పాపని షూటింగుకి తీసుకురావడానికి సంతోషం గా ఒప్పుకుంది. 

          ఇక కెమెరా సహాయం కోసం మా “మోర్గాన్ హిల్ సఖీస్” వాట్సాపు గ్రూపులోని నా సన్నిహిత మిత్రురాలు మోహన, మరో మిత్రురాలు సుమిత్ర వాళ్ళ అబ్బాయి ఆదిత్య ముందుకు వచ్చారు.  

          రెండ్రోజుల్లో స్క్రిప్ట్ దగ్గర పెట్టుకుని నా సీన్లు, షాట్లు వరుసవారీగా, సరిగ్గా రాసి మోహనకి, ఆదిత్యకి పంపించాను. 

          నాకు ఏ పని చేసినా చాలా క్రమపద్ధతిలో చెయ్యడం అలవాటు. ఏదో ప్రాజెక్టు మేనేజ్ మెంటులాగా ఇవన్నీ గూగుల్ షీట్స్, డాక్స్, డ్రైవ్ , వాట్సాప్ లలో నమోదు చేస్తూ పని ప్రారంభించాను. 

          మేం చెయ్యాల్సిందల్లా అప్పటికే శర్మ గారు పంపించిన షాట్లకి మేచ్ చేస్తూ షాట్లు తీసి పంపడం. 

          లొకేషన్ల సమస్య పెద్దగా లేకుండా ఉండడం కోసం షూటింగంతా మా ఇంట్లోనూ, మా పక్క ఊర్లో మాకు బాగా తెలిసిన గుడిలోనూ చెయ్యాలని నిర్ణయించుకున్నాం.  

          షూటింగు ఆ వారాంతానికి పెట్టుకున్నాం. మా చిన్నమ్మాయి “సిరివెన్నెల” బుద్ధి మంతురాలు కాబట్టి అస్సలు డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా షూటింగు చెయ్యగలిగాం. 

          అయితే స్రిప్ట్ అంతా పక్కాగా ఉన్నా, తీరా షూటింగు ప్రారంభించేక కొన్ని షాట్లు బాగా వచ్చేవి కావు, కొన్ని మొత్తానికే మిస్సయ్యిపోయేవి. 

          ఇక సమయం విషయానికి వస్తే,  కెమెరా పట్టుకోవాల్సిన ఆదిత్యకి ఎక్కువ సమయం ఉండకపోవడంతో, మోహన సహాయం చేసారు. ఆవిడకి అదే సమయంలో ఫామిలీ ఎమర్జన్సీ రావడంతో ఇక చిన్న పాప అవంతిక షాట్లు నేనే తియ్యాల్సివచ్చింది.  

          ఇక శర్మ గారికి, నాకు కలిసి ఉన్న కొన్ని అవుట్ డోర్ షాట్లని మేచ్ చెయ్యడానికి మాకు ఎర్రకారు కావాల్సి వచ్చింది. మా దగ్గర మిత్రుల్లో ఎర్రకారు ఉన్న ఒకే ఒక్కరు మాకు కారు ఇవ్వడానికి కుదరలేదు. ఇక దైవాధీనంగా గుడి ప్రాంగణంలో మరెవరిదైనా ఎర్రకారు ఉంటే పక్కన నిలబడి షూటింగ్ పూర్తి చేద్దామని అనుకున్నాం. భలే ఆశ్చర్యంగా, “సంకల్ప బలం” అనిపించేటట్టుగా మేం గుడి పార్కింగ్ లో కారు ఆపి అడుగు బయటకు పెట్టగానే మా ముందుకి ఎర్రకారు వచ్చి ఆగింది. ఆ కారుగలాయన ఎవరో మాకు అంతకు ముందు తెలియకపోయినా ఎంతో సంతోషంగా కారు ఇచ్చి మా సీన్లు పూర్తి చేసుకోనిచ్చారు. 

          మొత్తానికి రెండ్రోజుల్లో ఎలాగో కష్టపడి షాట్లు తీసి శర్మ గారికి పంపించి “హమ్మయ్య” అయిపోయిందనిపించాను. 

          రెండ్రోజులకే  “అయ్యబాబోయ్, షూటింగ్ ఇక నా వల్ల కాదు” అనిపించేసింది. 

          ఇంతకీ అంత వరకూ షూటింగు చేసిన మా ముగ్గురికీ తెలియని విషయం ఏవిటంటే కెమేరా పొజిషన్. 

          మా సత్య ఐ ఫోను-14 లో ఉన్న సినిమాటిక్ మోడ్ లో తీసాం. అందువల్ల నిజానికి లెన్స్ సరిచేసుకోవాల్సిన ఇబ్బంది లేనప్పటికీ అసలు షాట్ కి సరిపడా కెమేరాని ఏ పొజిషన్ లో పట్టుకోవాలో మా ముగ్గురికీ తెలియలేదు. 

          అలా తెలియకుండా షూటింగు చెయ్యడం వల్ల అసలు శర్మ గారి షాట్లకి, మేం తీసిన షాట్లకి సరిగా మేచ్ కావడం లేదన్నది మాకు అర్థం కాలేదు. 

          డైలాగులు కెమెరా వైపు చూస్తూ చెప్పెయ్యడం, లేదా ఎక్కడో చూడడం, కెమెరా పొజిషన్ ని ఇష్టం వచ్చిన రీతిలో తిప్పెయ్యడం వల్ల గోడకి కొట్టిన బంతుల్లా మా షాట్లన్నీ  శర్మగారి నించి వెనక్కి వచ్చాయి. 

          అంతలో శర్మగారు పశ్చిమాన ఉన్న సియాటిల్ లో వాళ్ళ అబ్బాయి ఇంటికి వచ్చారు. ఇక ఆయన తీసిన షాట్ లలో గుళ్ళో తీసినవి కొన్ని మళ్ళీ తియ్యాల్సి వచ్చాయి. కానీ చేసే అవకాశం లేనందున ఇంట్లో షాట్స్ చేసి పంపించారు. 

          మళ్ళీ వాటికి అనుగుణంగా మేం ఇక్కడ కొన్ని షాట్స్ తీసాం. 

          అసలిలా లాభం లేదని ఉన్న షాట్లన్నీ నేను మూవీ ఎడిటర్ లో పెట్టుకుని చూసేసరికి మతిపోయింది. విషయం ఏవిటంటే వెనక ఉన్న గోడ రంగుతో సహా ఎక్కడా శర్మ గారి షాట్లకి, నా షాట్లకి మేచ్ కుదరడం లేదు. 

          ఇక డైలాగులు సరేసరి. నేను నాకు నచ్చిన స్పీడులో చెప్పేశాను. డబ్బింగులో కూడా సరి చెయ్యలేం. 

          అప్పటికి ఓ నాలుగైదు సార్లు శర్మ గారిని మా ఇంటికి రమ్మని అడిగి చూశాను. “ఇంతంత దూరాభారాలు వద్దులేమ్మా” అంటూ ఉండేవారు. 

          అయితే  ఆయన వచ్చి మళ్ళీ అన్నీ రీ షూటింగు చేస్తే గానీ ఈ షార్ట్ ఫిలిమ్ ఓ కొలిక్కి వచ్చేటట్టు లేదు. అప్పటికే మా షాట్లు చూసి “మనం బాగా తియ్యలేకపోతే బహుశా: విరమించుకోవడం మంచిది” అన్నారు శర్మ గారు. నాకు ఏ పనీ మధ్యలో ఆపడం సుతరామూ ఇష్టం ఉండదు. 

          ఇక ఆ రోజు  “నేను కూడా మీ అమ్మాయిలానే కదాండీ. మా ఇంట్లో మీకు నచ్చినట్టు ఉండొచ్చు. మొహమాట పడొద్దు. మీరు నాలుగు రోజులు ఉండేట్టు వస్తే, అనుకున్నట్టుగా  పూర్తి చేసేద్దాం”  అన్నాను. వెంటనే ఒప్పుకున్నారు శర్మ గారు. 

          టిక్కెట్లు సిద్ధమై, శర్మగారి ప్రయాణం ఖరారు కాగానే కొత్త ఉత్సాహం వచ్చింది. ఎలాగైనా ఈ  షార్ట్ ఫిల్మ్ పూర్తి చెయ్యగలనన్న పట్టుదల కలిగింది. 

          అయితే ఆయన మరో రెండు రోజుల్లో బయలుదేరుతారనగా “ఈ షార్ట్ ఫిల్మ్ షూటింగ్ చకచకా రెండు గంటల్లో చేసేయ్యొచ్చు. మరో కథేమైనా కూడా ఉంటే చూడండి చేసేద్దాం” అన్నారు శర్మ గారు.

          అప్పటికప్పుడు ఇక మళ్ళీ నా కాలమ్స్ అన్నీ తిరగేసినా ఏవీ కనబడలేదు. ముఖ్యంగా మేమిద్దరం కలిసి ఫిల్మ్ చెయ్యడానికి వీలైన కథ దొరకలేదు. 

          రాత్రి నిద్రకుపక్రమించే ముందు హఠాత్తుగా ఓ  ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఈ సారి ఏకంగా స్క్రీన్ ప్లే రాసి పంపించేశాను. 

          ఆ కథే  “దూరపు కొండలు నునుపు” అనే రెండో షార్ట్ ఫిల్మ్. మరి ఆ కథ వెనక ఉన్న కథేమిటో, ఈ రెంటికీ ఇంకా ఏమేం చెయ్యాల్సి వచ్చిందో వచ్చేసారి చెపుతాను. 

          అన్నట్టు అది కూడా జూలై 29 నే విడుదల అయ్యింది. తప్పక చూస్తారుగా! పనిలో పనిగా ఇక్కడ ఇస్తున్న  ఛానెల్ కి సబ్స్ క్రైబ్ చెయ్యడం మర్చిపోకండి.

https://www.youtube.com/@geetamadhavimovies7980/featured

రెండు షార్ట్ ఫిల్ముల లింకులు-

AMERICA GUDI
https://youtu.be/9JhUlqnf7I8

DURAPU KONDALU NUNUPU 

https://youtu.be/YPddiGynPiE

*****

(ఇంకా ఉంది)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.