గంట గడిస్తే చాలు

(నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)

-భాగవతుల భారతి

          అవును నెలరోజులు క్రితమూ ఇలాగే అయింది. కానీ ఏం చేయటం? పనిమానలేని పరిస్థితి. అయ్యపోయినప్పుడు… వారం రోజులు సెలవడిగితే సేటు. “వారం రోజులా? మూడు రోజులుండి వచ్చేయ్ “అన్నాడు.

          మరి వెళ్ళినాక అమ్మఏడుపు చూడలేక, ఇంకోరోజు ఉండాల్సివచ్చే! మరి తిరిగి పనిలోకి వచ్చాక ….సేటుముఖం చూడాలీ! ముఖం మీద పేలాలు వేగటం అంటే ఏమిటో ప్రత్యక్షంగా చూసి, ఇరక్తి పుట్టింది.

          హ్హు… ఇరక్తి… ఎవరిమీద ఇరక్తి? దేనికి ఇరక్తి? ఉద్యోగం మీద ఇరక్తిపడితే ఎలా?

          ఈ మాట ఇక్కడ ఎవరితోనైనా అంటే “ఇరక్తికాదే విరక్తి” అని నవ్వుతారు. అచ్చరం ఏదైనా బావం ఓటేగా !

          “ఏమ్మా! ఈ చీర విప్పిచూపించు ” కష్టమర్ మాటలకు ఆలోచనల్లోంచి, బయటికి వచ్చి, చీరను చూపించి,

          “చూడండి!ఈ చీర మీకు ఎంత అందంగా ఉంటుందో! ఈ నీలం చీరకు నీలం
సెల్ఫ్ ప్రింట్ అంచు కొత్త పాషన్…. చక్కగా ఉన్నది ” అని తన మీద వేసుకుని చూపించి, అవతల ఆవిడ మీద వేసి, అద్దం దగ్గరకు తీసుకువెళ్ళి, “అబ్బ! సూపర్ గా ఉన్నారండీ 

          “ప్యాక్ చేయనా!” అంది.

          “వద్దు! ఇంకోటి చూపించమ్మా!”

          ఉస్సురంటూ మళ్ళీ ఇంకోచీర తీసి చూపించింది. కానీ ‘సుక్కి’ మనసు మనసులో లేదు. ఎడమవైపు ఉన్న టాయిలెట్ మీదేఉంది.

          ఆడవాళ్ళ కష్టాలుఎవరికి అర్ధంఅవుతాయి?

          బేరం సాగుతూనే ఉంది. చీరెలు గుట్టలు గుట్టలుగా తీయిస్తున్నారు. భుజం మీద పెట్టుకుని చూసి “ఇంకో మోడల్ చూపించు…అదిగో…

          ఆ పచ్చచీర…

          కాదు…

          దానిపక్కది…

          దానిపైది… ” ఇలా అడుగుతూనే ఉన్నారు.

          పక్క కౌంటర్ వైపుచూసి…

          “శైలక్కా! కొంచెం బేరం చూసుకుంటావా? నేను ఇప్పుడే వత్తా ప్లీజక్కా” అని దీనంగా అడిగింది.

          “నాకాడే నుంచునీ, నుంచునీ కాళ్ళు గుంజు కొత్తన్నాయి. నీదీ నేనేడసూసేదీ ” అని
కొత్త కష్టమర్స్ వస్తే డ్రస్సులు చూపించటంలో దూరిపోయింది.

          తలతిప్పి చూసింది.

          చెన్నై షాపింగ్ మాల్, పట్టపగలు కూడా షాప్ నిండా లైట్లతో రకరకాల … పూల గుత్తులతో చూపరులకు ఆకర్షణీయంగా అలంకరింపబడింది. మెట్లెక్కివచ్చే వాళ్ళకి, మెట్లమీద పొడవునా బంతిపూలదండలు పరిచారు. గోడకి చెన్నై అనే అక్షరాలు గులాబీ పూలతో డిజైన్ చేసి అమర్చి అందులో రంగురంగుల డియోడ్స్ బిగించారు.

          కానీ సుక్కి ముఖంలో మాత్రం, ఆ కాంతులేవీ కనిపించక కళావిహీనంగా ఉంది.
ప్రతి నిమిషానికీ వెనుదిరిగి చూసుకుంటోంది. కాళ్ళు గుంజేస్తున్నాయ్. షాప్ లో స్టూళ్ళు అస్సలు ఉండనివ్వరు.

          కష్టమర్స్ ని వదిలేసి, కూర్చుని ముచ్చట్లు పెడతారనో, ఏమో! రోజల్లా ఆడైనా, మగైనా నిలబడే ఉండాలి. మగవాళ్ళయితే, ఎలాగోలా నిలబడగలరేమో! ఆడవాళ్ళకి కొన్నిసమస్యలుంటాయి. 

          ఆలోచిస్తూ ఎదురుగా చూసింది సుక్కి.

          అవతల కౌంటర్ కి, ఎదురుగా, ఓబులేసు ఇటే చూస్తున్నాడు.

          ఓబులేసు, ఈమథ్యనే షాపింగ్ మాల్ లో చేరాడు సూపర్ వైజర్ గా…. సన్నగా, బక్కపలచగా, కొద్దిగా నెరిసిన గెడ్డం. అందరికీ ఉన్నట్లే అతనికీ ఏదో కష్టం ఉన్నదని చెప్పుకుంటున్నారు. ముగ్గురు ఆడపిల్లలు. మగపిల్లవాడి కోసమనీ, చివరి ఆడపిల్లను కని, ఇకవల్ల కాదని, ఆపాడట. కానీ బాధ్యతలు తప్పదుగా!

          సదువులు చెప్పించకపోయినా  బట్టా పొట్టా కోసమైనా కష్టపడాలిగా!

          అంతకు ముందు అతనికి ఉద్దోగమే లేదా?

          ఉంటే ఎందుకుమానేసాడో! ఈడకి ఎందుకు వచ్చాడో? తనకనవసరమే గానీ, వచ్చిన దగ్గర నుంచి, అందరి మీదా, నిఘా ఉంచాడు ఎవరు ఎటువెళ్ళినా, ఆరా తీస్తున్నాడు. సేఠుకు చాడీలు చెబుతాడేమోనని అందరూ భయపడుతున్నారు. ఆ మధ్య అంతే జరిగింది. అవతలి కౌంటర్ లో డబ్బులు లెక్కసూసే మిషన్ కాడి ఆడమనిషి
ఆ మడిసి పేరు తనకి సరిగా తెలీదు. మధ్యలో….తలనొప్పి, అలసట వల్ల టీ తాగటానికి వెళ్ళివచ్చిందిట.

          పోయేటప్పుడు, చెప్పాలిగా! అసలే డబ్బులతో పనాయే! వెంటనే సేఠుకాడికి, వార్త జేరవేసాడు ఓబులేసు.సేఠు రియాక్షన్ చూడాలీ ! ఛెడామడా తిట్టేసాడు ఆ మనిషిని
మరి తనమీదా ఫిర్యాదీ సేస్తే?

          అనారోగ్యపు అత్త, పనికి సరిగాపోని భర్త, ఇద్దరు పసిపిల్లలు కళ్ళ ముందు మెదిలారు. ఈ భర్తలతో మాసెడ్డచిరాకు. ఆడదాని సంపాదనకు అలవాటు పడిన మగాడు, ఇంట్లో ఖాళీగా కూచుని భార్యను యేపుకు తింటమే తప్ప ఏ పనికీ ఆసరాకు రాడు. పెళ్ళైన ఏడాది బాగుంటాయేమో ఏ జంటలైనా! మరు సంవత్సరం రణరంగంలో యుధ్దవీరులేనయం వీళ్ళకన్నా…. బాహాబాహీ…. ముష్టాముష్టీ అందరివీనా? అనుకుని… ఆ… ‘అందరివీ అంతే… డబ్బున్నోళ్ళకి డబ్బు తగాదాలు. అవిలేనోళ్ళకి…. సొమ్ము సంపాదించలేక పోయామే అని సిగపట్లు…. ప్చ్…. నిట్టూర్చి…. మెున్నటికి మెున్న పిల్లోడికి, జోరం వస్తే…చేతిలో పైకం లేకపోయే! అర్ధరాత్రి ఏంజేయాల? సేఠు ఆ సమయం లో ఉండడుగా! తెల్లవార్లు జాగారం చేసి, పక్కింటి లచ్చుమమ్మ పెద్దమ్మ తనింట్లో ఉన్న కొన్ని దినుసులతోనే కషాయం కాచిస్తే, తాపించి, ఎలాగోలా జోరం తగ్గిందనిపించింది. తగ్గకపోతే? అత్తకీ దగ్గు తగ్గకపాయె వారం వారం మందులు తేవాలనాయె.

          “ఏడనుండి తెత్తావే సుక్కీ…నన్ను ఇలావదిలేయి. నా కడుపున పుట్టినోడికి లేని, ఆదరణ నీకెందుకే? ” అంటది.

          పాక అదిరిపోయేటట్లు, పగులూ రాత్రీ దగ్గుతా ఉంటే సూత్తా సూత్తా ఎలా వదిలేసేదీ
ఇన్నిరోజులూ ఇలాగే జరగవు. డబ్బుతోనే పని. అందుకే ఇన్ని పాట్లు ….

          మళ్ళీ, ఆలోచనల్లోంచి బయటికి వచ్చి…. కాసేపు టాయిలెట్ లోకి పోయివస్తే ఏమవుద్దీ? ఈ కాస్తకే పనిలోంచి తీసేస్తారా? ఓ పదినిమిషాలేగా! ఎలా వెళ్ళేది? బేరం మీద బేరమాయె.

          మళ్ళీ ఇంకోబేరం…కాస్త వెసులుబాటు దొరికితే బాగుండు. పనిపూర్తి చేసుకు రావచ్చు. ప్రతీ ఆడదానికీ ప్రతీనెలా ఉండే సమస్యే ఇది. కానీ ఆడదాని బాధ ఆడదానికే అర్థంకాదే!? నాపీపాడ్ మార్చుకు రావాలి. చుట్టూ జనం. నెలసరి ఎక్కువెక్కువవుతోంది. పొద్దుననగా వచ్చింది. కిందకి కారిపోతే?

          అమ్మో!

          మళ్ళీ వెనుదిరిగి చూసుకుంది.

          గంట గంటకూ, అలా బాతురూంలోకి తిరగాలంటే,సేఠు ఏమంటాడో? ఈ ఉద్దోగంలో ఉన్న తనేనా? ఏ ఉద్దోగంలోని, ఆడవారైనా, ఇదే సమస్యలో ఉంటారుగా! మరి ఎలా ఈ సమస్యను ఎదుర్కుంటారో? పరిష్కరించుకుంటారో? అన్ని ఉద్దోగాలూ ఇలా ఉండవుగా!
సైన్స్ పెరిగింది, టెక్నాలజీపెరిగింది. కానీ… సమస్యను ఎదుర్కునేవే గానీ! సమస్యను తప్పించేవి కావుగా!

          బయటి నుండి చూస్తే ధగధగాయమానంగా మెరిసిపోయే… ఇలాంటి భవనాల వెనుక, వయ్యారంగా నిలబడి ఆకర్షించే షోకోసులో బొమ్మల వెనుకా…. నా లాంటి వెలిసి పోయిన…. బొమ్మలూ ఉంటాయ్. అవి పాణంలేని బొమ్మలు. గంటకో చీర మార్చుకుని నిలబడి, అందాలు విరబూస్తాయి. తన లాంటి, బాధలతో బంధాలతో, రంగు వెలుస్తున్న బొమ్మలు , ఇందులో…. రంగురంగు బట్టలు… ఎదురుగా ఉన్నా…అవన్నీ బయటివారి కోసమే అనేటట్లుగా…. నిర్వేదంగా నిలబడాలి…. స్థితప్రఙ్ఞులు అనే మాట ఇక్కడే కనబడుతుందేమో!

          మళ్ళీ ఆలోచనల్లోంచి బయటికి వచ్చింది.

          అయ్యో! బాతురూంలోకి వెళ్ళటం లేటయ్యేసరికి, కడుపులో నొప్పి మెుదలవు తోంది. ఏంచేయాలీ?

          కదలాలంటే కారిపోయి అందరి ముందూ అభాసుపాలైతే? ఎంత అవమానం?
క్రితం నెల సెలవురోజు కాబట్టి, ఇంట్లోనే చాపమీద పొర్లుతూ, గంట గంటకూ, మార్చు కుంటూ, పరమాత్మునికెరుక.

          ఈ ఉద్దోగంలో, పూలమ్మ తీసుకువచ్చి, చేర్పించింది. పూలమ్మ ఈ నగరానికి వచ్చి ఐదేండ్లయింది. అంతకు ముందు కుసుమంచి పక్కన పల్లెటూరిలో ఉండేది. చాలా  బీదోళ్ళు. పెళ్ళయి అత్తగారింటికి ఈ సిటీకి వచ్చాక , కొన్నాళ్ళు ఇళ్ళల్లో  పాచిపని చేసింది. గిట్టుబాటు కాక, ఇలాగే…. తనూ ఓ షాపింగ్ మాల్ లో నౌకరీకి కుదిరి, డబ్బులు సేతిలో గలగలలాడు తుంటే సోకులు నేర్చి, తనతో నేస్తం సేసినప్పుడు ఈ మాల్ లో తనను కుదిర్చి, తను ఏమైపోయిందో మళ్ళీ కనబడలా!

          అందరిబతుకులూ అంతే గాలివాటుకు కొట్టుకొచ్చి ,అలాంటి గాలివాలుకే ఎండాకుల్లా ఎగిరిపోయి, మళ్ళీ ఎక్కడో ఆగుతాయి.

          చీరలు మడతేసి రాక్ లో పెడుతూ, కొంచెం ఒళ్ళుతూలితే నిలదొక్కుకుని, మళ్ళీ స్ప్రహలోకి వచ్చి….ఆడపుట్టుక అంటేనే రోతకదూ! కానీ సృష్టికి మూలమూ ఇదేగా!
ఇరవై సంపత్సరాలు వచ్చినా, ఆ మల్లమ్మ పెద్దమడిసి కాకపోతే, దానికి ‘మాసకమ్మ’
అని ముద్రవేసి, పెళ్ళి పెటాకులు లేని, ‘మోడు’ అని ఇంట్లోవాళ్ళూ, బయటోళ్ళూ, రోజూ ఏడిపిస్తుండిరి.

          ఆమె ‘గోస’ తనతో చెప్పుకుని బాధపడతా ఉంటే, ఆ టైంలో మాత్రం తానే అదృష్ట మంతురాలినని అనిపిస్తది. కానీ, ఇలాటి టైం లో ఆడదానిగా పుట్టేకన్నా, రాయీ, రప్పగా పుడితే మేలౌనుగందా ! అనిపిస్తదాయె. ఏమోలే ఓ కట్టం. ఓ సుఖం. 

          కష్టం, సుఖం అన్నీ ఆడదానికే పెట్టాడాయె! ఆదేవుడు. ప్చ్…

          ఇలాంటి సమయంలో పూర్వకాలంలో రెస్ట్ పేరుతోనో, మడి కోసమో మూడురోజులు బయట కూర్చోబెట్టేవారు. ఎక్కడో దూరంగా పాకలో కూర్చోబెట్టేసేవారుట. కానీ అప్పుడు
కూడా…. గేదెలకాడ బాగుచేయటాలూ, పొలంకాడికి పోయి గడ్డికోసుకు రావటాలూ, చాలా పనులుండేవి ఆడోళ్ళకి.

          ఇక ఇంకెక్కడి రెస్ట్?.

          ఆలోచనలు కందిరీగలల్లే చుట్టుకునే స్టేజ్ దాటి, ఆలోచనా రాహిత్యం ఏర్పడి కళ్ళు తిరుగుతున్నాయి. నిలబడలేక స్ప్రహ కోల్పోతున్న సమయంలో, కేకలు వినబడు తున్నాయి.

          బయట విద్యుద్దీపాల స్టాండ్ కి కరెంట్ వైర్లు షార్ట్ సర్క్యూట్ అయి మంటలు రేగుతున్నాయని, బయటివారు లోపలికి పరుగెత్తుకు వచ్చి, చెప్పారు.

          పట్టపగలు ఎలాజరిగిందబ్బా అనే ప్రశ్నకి తావులేదు. షాపింగ్ మాల్లో బయటి షోకేసులో బొమ్మల పై  లైట్లు …అందంగా వెలుగుతూనే ఉంటాయి.

          అరుపులకు అందరూ అటుపరుగెత్తారు. ఓబులేసు కూడా, ఏమయిందోనని చూడ్డానికి పోయాడు.

          అంతే! గభాలున హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బాత్ రూమ్ కి పరుగెత్తింది. బయటి హడావిడి సర్ధుమణిగింది.

          సుక్కి ఆరాటం ఈ గంటకి సర్దుకుంది.

          ఎన్నాళ్ళిలా, ఈ గంటగడిస్తే చాలనుకుంటూ… ఎన్నాళ్ళయినా ఆడదానిగా ఉంటే ఇంతే !… నిట్టూరుస్తూ అనుకుంది సుక్కమ్మ.

*****

Please follow and like us:

4 thoughts on “గంట గడిస్తే చాలు (నెచ్చెలి-2023 పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ)”

  1. ఆడవాళ్ళ సమస్యలకు సంంధించిన కథ చాలా బాగా వ్రాసారు.

  2. చాలా బాగా చెప్పారు. ఎందరో స్త్రీల ఆవేదన. బైటకు చెప్పుకోలేని సమస్య. ప్రతి నెలా తప్పని, తప్పించుకోలేని బాధ.
    పెద్ద చదువులు లేక, ఫ్యాన్ కింద కూర్చుని చేసే ఉద్యోగాలు రాక, పొట్టకూటి కోసం సేల్స్ గర్ల్ లో ఉద్యోగాలు చేసే ఆడవాళ్ళ కష్టాల్ని కళ్ళ ముందుంచారు రచయిత్రి.
    గంటలు గంటలు నిలబడే పరిస్థితి, నెలనెలా పీరియడ్స్ సమయంలో పడే హింస, వాష్ రూమ్ కి వెళ్ళాలంటే సేట్ గారో ఆయన నియమించిన మరో అజమాయిషీ చేసే వ్యక్తో గమనిస్తారని, అదిలిస్తారని భయం బెరుకు. చాలా మంది స్త్రీల సమస్యని వెల్లడించిన రచయిత్రి కి అభినందనలు.

  3. ఈ సమస్య స్కూల్ కు వెళ్లే బాలికలలో చాలా దయనీయంగా, దుర్భరంగా వుంటుంది. రచయిత్రికి ధన్యవాదాలు.

Leave a Reply

Your email address will not be published.