మా కథ (దొమితిలా చుంగారా)- 48

రచన: దొమితిలా చుంగారా 

అనువాదం: ఎన్. వేణుగోపాల్ 

1976

నా ప్రజలు కోరేదేమిటి?

సమావేశం తర్వాత ఆరోగ్య కారణాల వల్ల నేను రెండు నెలలపాటు మెక్సికోలోనే ఉన్నాను. నేను నా కుటుంబానికి ఎన్నో ఉత్తరాలు రాశానుగాని అవేవీ అందినట్టు లేదు. ఇక దానితో నా తిరుగు ప్రయాణం గురించి కొన్ని వదంతులు ప్రచారమయ్యాయి. ఆంతరంగిక మంత్రిత్వ శాఖ నాకేవో ఇబ్బందులు కలిగిస్తున్నదనుకొని కొందరు నిరసన తెలపడానికి లాపాజ్ వెళ్ళారు కూడా.

          తిరిగి వచ్చాక నేను మెక్సికోలో పొందిన అనుభవాలన్నీ నా వాళ్ళకు చెప్పాను. నేనీ విషయాల గురించి రేడియోలో కూడా మాట్లాడాను.

          నేను మెక్సికోలో ఉన్న రోజుల్లో దేశంలో కొన్ని మార్పులు జరిగాయి. దాదాపు ఇరవై తొమ్మిది మంది సి.ఓ.బి. నాయకులు నిర్బంధించబడ్డారు. ఒరురోలో జరుగుతున్న ఒక రహస్య సమావేశం మీద దాడిచేసి వాళ్ళందరినీ పట్టుకుపోయారు. వాళ్ళను బయటి నుంచి సంబంధాలు లేకుండా నిర్బంధించారు. కొచబాంబాలో లా మనాకో కార్మికులు ఇందుకు నిరసనగా సమ్మెకు పిలుపిచ్చారు. లా మనాకో అనేది బాటా కంపెనీ అనే కెనడా కు చెందిన చెప్పుల కంపెనీకి ఒక శాఖ. దాంట్లో ఎనభై మంది కార్మికులు పనిచేస్తారు. బొలీవియాలో దీర్ఘకాలిక విప్లవ పోరాట సంప్రదాయం ఉన్న కార్మికులు వాళ్ళు.

          సైగ్లో-20 నాయకులు లా మనాకో కార్మికులకు మద్దతు ప్రకటించారు. ఒకరోజు జీతం వాళ్ళకివ్వడం ద్వారా కార్మికులు సంఘీభావం ప్రదర్శించారు. వాళ్ళకు ఆహారం ఇవ్వడానికి ఒక ప్రతినిధి బృందం వెళ్ళింది. అది చాల పెద్ద సమ్మె. దాంట్లో క్రమంగా యూనివర్సిటీ విద్యార్థులు, ఎన్నో రైతు బృందాలు కూడా చేరాయి. మొత్తానికి లా మనాకో కార్మికులు తమ డిమాండ్లలో ఎన్నింటినో సాధించుకోగలిగారు.

          సైగ్లో-20లో కూడా ఎన్నో మార్పులు జరిగాయి. ఉదాహరణకు గృహిణుల సంఘానికి ఎంతగానో సహకరిస్తుండిన యూనియన్ నాయకుడు బెర్నాల్ యూనియన్‌కు రాజీనామా చేశాడు. మళ్ళీ కొత్తగా ఎన్నికలు జరగాల్సి వచ్చింది.

          ఆ సంవత్సరం జనవరిలో గృహిణుల సంఘం కంపెనీ దుకాణం ముందర ఒక నిరసన ప్రదర్శనకు పిలుపిచ్చింది. కొన్ని సరుకుల ధరల పెరుగుదలకూ, పిల్లల పాల నాణ్యత తగ్గిపోవడానికి నిరసనగా ఈ ప్రదర్శనకు పిలుపిచ్చాం . ఆ సమావేశంలో నేను మళ్ళీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. కొరొకొరొలో జరిగే గని పనివాళ్ళ మహాసభకు గృహిణుల సంఘం ప్రతినిధిగా వెళ్ళడానికి కూడ అనుమతి దొరికింది. ఈ గని కార్మికులు పరిష్కరించవలసిన, చర్చించవలసిన సమస్యలెన్నో ఉండేవి. కంపెనీ తెలివిగా ఏం చేసిందంటే తాను మొత్తం శ్రేణులకు ప్రాతినిధ్యం వహించే బృందాలతో చర్చంచననీ వివిధ శాఖల ప్రతినిధులతో చర్చిస్తానని ప్రకటించింది. అంటే వర్క్ షాప్ విభాగం ప్రతినిధులతో, ఖనిజ శుద్ధి విభాగం ప్రతినిధులతో, ఫ్యాక్టరీ విభాగం ప్రతినిధులతో విడి విడిగా ఆయా సమస్యలు చర్చిస్తారన్న మాట. ఈ చర్చల్లో కంపెనీ కొందరిని దువ్వింది. కొందరిని బెదిరించింది. మొత్తానికి చీల్చి అందరినీ లొంగదీసింది. అందుకనే. మేం కొరొకొరొలో మహాసభ ఏర్పాటు చేసుకొని అందరి సమస్యలూ ఒకేసారి చర్చించి, ఒకే రూపంలో పెట్టాలనుకున్నాం.

          మొదట ప్రభుత్వం ఈ మహాసభను ఒప్పుకోలేదు. మేం ఈ మహాసభ ద్వారా ప్రభుత్వాన్ని కూలదోసే ప్రయత్నం చేయదలచుకున్నామని వాళ్ళు ఆరోపించారు.

          ఆ సంవత్సరం మే 1న కొరొకొరొలో మహాసభ ప్రారంభమైంది. అన్ని గని కార్మిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. గృహిణుల సంఘం నుంచి నలుగురు ప్రతినిధు లం. సైగ్లో-20 నుంచి ఇద్దరం, కటావి నుంచి ఇద్దరు – హాజరయ్యారు.

          ఆ మహాసభలో మేం ఎన్నో విషయాలు చర్చించాం. యూనియన్లు ఉపయోగకరమా కాదా, 1974 నవంబర్ లో ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని తిరస్కరించాలి. రాజకీయ ఖైదీలకూ, ప్రవాసులకూ మద్దతు ప్రకటించాలి……. మొదలైన విషయాలెన్నో మేమక్కడ చర్చించాం.

          మా మొదటి లక్ష్యం పెరిగిన జీవన వ్యయానికి సరిపోయే జీతం పెంపుదలను సాధించుకోవడం. ఇంకొక సమస్య పెన్షన్. ప్రస్తుతం ఇస్తున్న పెన్షన్ చాల తక్కువ. కార్మికులు రోగంతో బాధపడుతూ ఉండగా ఈ పెన్షన్ డబ్బులు వాళ్ళకు ఏ మూలకూ సరిపోవడం లేదు. అలాగే వితంతువులకు భర్త చనిపోయిన ఐదు సంవత్సరాల వరకూ మాత్రమే పెన్షన్ యిస్తారు. ఈ లోగానే ఆవిడ మారు మనువాడితే ఆ పెన్షనూ ఆపేస్తారు. ఇలాంటి సమస్యలెన్నో ప్రస్తావించుకొని పరిష్కారాల గురించి ఆలోచించాం.

          “దేశంలో ఆర్థిక వ్యవస్థ స్థితి నానాటికీ క్షీణిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన ఆర్థిక చర్యల తో జీవన వ్యయం విపరీతంగా పెరిగింది. రోజురోజుకూ మా పిల్లలు పెరుగుతోంటే వాళ్ళ దుస్తుల ఖర్చులూ, ఆహార ఖర్చులు కూడా పెరుగుతున్నాయి. మా భర్తల శక్తి రోజు రోజూ పీల్చివేయబడుతున్నది. వాళ్ళకున్న జీతాలతో వాళ్ళు తాము పోగొట్టుకున్న శక్తి పొందే అవకాశం లేదు. ఈ పరిస్థితిలో మా భర్తలు ఏ క్షణానైనా చనిపోవచ్చు. ఐతే గని రోగంతో గాని, కాకపోతే ఘోరమైన భద్రతా సౌకర్యాల వల్ల గనిలో ఏదైనా ప్రమాదంలో గానీ వాళ్ళు చనిపోవచ్చు. మా భర్తల బతుకులకూ, భద్రతకూ హామీ లేనే లేదు. అంతకంటే ఘోరం మాకు తలదాచుకోవడానికి ఒక గూడు లేదు. మా భర్తల జీతాలతో ఒక చిన్న ఇంటినైనా మేం సంపాదించుకోలేం. ఇప్పుడు బైట సహకార సంఘాలలో ఇంటి ధర లక్ష పిసోలు పలుకుతోంది. మాకు లక్ష పిసోల ధనం ఎప్పుడు కూడుతుంది? ప్రతివాడూ కార్మికుల్ని దోచి బొర్ర పెంచేవాడే.

          కొన్ని రకాలుగా రైతుల స్థితి కూడ కార్మికుల స్థితికన్నా బాగా ఉందనవచ్చు. “దున్నే వాడిదే భూమి” అంటారు గదూ? ఒక రైతు ఒక హెక్టారు భూమి దున్నితే, అతను చనిపోయాక ఆ భూమి అతని కొడుక్కి చెందుతుంది. మరి కార్మికులు తమ రక్తమాంసాలు ధారపోసి టన్నుల మట్టి తవ్విపోసి దేశానికింత సంపద సమకూరిస్తే, తమ త్యాగాలతో ప్రతివాన్నీ లాభాలలో ఓలలాడిస్తే, వాళ్ళు చనిపోయాక వాళ్ళ కుటుంబాలు మూడు నెలల్లో రోడ్డుమీద పడాలి. వితంతువుకు ఎక్కడా పని దొరకక, ఇంటి అద్దెకు కూడా సరిపోని పెన్షన్ తో ఆవిడేం చేయాలి? కొన్ని సందర్భాలలో ఆవిడకా పెన్షన్ కూడా చేతి కందదు. ఎందుకంటే, ఆ కార్మికుడు సాంఘిక సంక్షేమ నిధికో, మరొకదానికో. ఏవో బకాయి లుండి ఉంటాడు. నిరుద్యోగ సమస్యల వల్ల మా ఎదిగిన కొడుకులు కూడ, మిలిటరీలో పనిచేసి వచ్చినప్పటికీ గోళ్ళు గిల్లుకుంటూ కూచోవలసి వస్తుంది. కార్మికుల పిల్లల చదువు సంగతేమిటి? వాళ్ళు దేశంలో ఎక్కడో ఓ చోటికి చదువు కోసం పోవలసి వస్తుంది. వాళ్ళకు కార్మికులు, రకరకాల ఫీజుల కింద, అవసరాల కోసం డబ్బు పంపాల్సి వస్తుంది. ఇంట్లో ఉన్న మిగతా పిల్లలకి తీర్చవలసిన మరెన్నో అవసరాలుంటాయి. గనుల్లో ఉచిత విద్య అమలు చేస్తున్నామని వాళ్ళెంత బాకాలూదుకున్నా వాస్తవానికి చదువుకు కావాల్సి న ఎన్నో వస్తువులకి ఎంతో డబ్బు అవసరమవుతుంది. ఇక ఇన్ని చేసినా అప్పుడప్పుడూ బళ్ళను అర్థాంతరంగా మూసేసి పిల్లల్ని కాలం కాటుకు వదిలి పెడతారు.”

          పరిస్థితి గురించి మా విశ్లేషణ ఇది. ఇదంతా చెప్పి ఇందు వల్ల కార్మికుల జీతాలు పెరగాలని మేం కోరుతున్నామని వివరించాం. కొరొకొరొలో మేం పాల్గొనడం ఎంతో పని కొచ్చింది. మేం మొట్టమొదట నిషేధానికీ, నిర్బంధానికి గురవుతూ కూడ. మహాసభ జరుపుతున్నందుకు కార్మికులను అభినందించాం. తమ పోరాటంతో తాము ఒంటరిగా లేమనే విషయం గుర్తించమని కోరాం. ప్రతి ఇంట్లోనూ, మేం, స్త్రీలం కూడా కొమిబొల్ అనే యజమానితో దోపిడీ చేయబడుతున్నామనీ, మేం ఇంట్లో చేసే పనిని పనిగా గుర్తించ డమే లేదంటే మమ్మల్ని కూడ దోపిడీ చేస్తున్నట్టేననీ, ఒక్క కార్మికుడు మాత్రమే కాక అతని కుటుంబం కూడ పీడించబడుతోందని మేం విశదీకరించాం. ఈ మహాసభలో కార్మికవర్గ ఉద్యమానికి పనికొచ్చే రీతిలో ఈ విషయమై ఒక పత్రం కూడ ప్రకటించాలని మేం కోరాం.

          మా ఉపన్యాసం రేడియోలో వినిపించారు. ఆ తర్వాత కొరొకొరొలో ఒక పాఠశాలలో ఉపన్యసించడానికి మమ్మల్ని ఆహ్వానించారు. ఆ ఉపన్యాసం తర్వాత ఆ విద్యార్థులు తమ తల్లులతో నేను మాట్లాడితే బాగుంటుందని సూచించారు. నేను సరేనన్నాను. ఆ సభకు చాలా మంది హాజరయ్యారు. కొరొకొరొలోని గృహిణుల సంఘం ఆ సభను ఏర్పాటు చేసింది. అక్కడి గృహిణుల సంఘం అధ్యక్షురాలు ఒక యువతి. మెసిజా తెగకు చెందిం దో, చొలితా తెగకు చెందిందో నాకు తెలియదు. కార్మికులతో భుజం కలిపి పనిచేయడం లో ఏఏ స్త్రీల ప్రయోజనాల పరిష్కారం ఇమిడి ఉన్నదో ఆమె చాల చక్కగా వివరించింది. వాళ్ళు చాల బాగా పనిచేస్తున్నారని నేను పత్రికల్లో చదివాను. కాని ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు. ఎందుకంటే కొరొకొరొలో ఇప్పుడు దారుణ నిర్బం ధం అమలవుతోంది. సైన్యం గనిలోకి దిగింది. అక్కడ స్త్రీ, పురుషులెంతో మందిని అరెస్టు చేశారు. మాకా ఊరితో సంబంధాలు దెబ్బతిన్నాయి.

          మహాసభలో మేం మరొక విషయం కూడ ప్రస్తావించాం. అన్ని గనుల్లోనూ గృహిణుల సంఘాలను రూపొందించాలి. ఒక మహిళా మహాసభ జరపడానికి ఏర్పాట్లు చేయాలి. వీలైనంత త్వరలో సి.ఓ.బి కి అనుబంధంగా ఒక జాతీయ గృహిణుల సమాఖ్యను ఏర్పరచాలి. ఇప్పటికే సైగ్లో-20 గృహిణుల సంఘం సి.వో.బి. కి అనుబంధితమైంది. ఈ విషయం వెంటనే ఒప్పుకోబడింది. కాని ఆ తర్వాతి పరిణామాల వల్ల మేం మా ప్రణాళిక ను అమల్లో పెట్టలేకపోయాం. ఆ తర్వాత ప్రభుత్వాన్ని సమర్థించే “జాతీయ మహిళలు” గనుల్లో ఒక జాతీయ మహిళా మహాసభ ఏర్పాటు చేయడానికి ప్రయత్నించారు.

          మహాసభలో పందికొక్కుల్లా చేరిన ప్రభుత్వ ఏజెంట్లు ఉన్నప్పటికీ, ప్రభుత్వ దుష్ట పన్నాగాలన్నిటినీ ఎదిరించి మహాసభ విజయం సాధించింది. జీతాల పెరుగుదలను కోరుతూ ఒక పత్రం తయారైంది. ఈ పత్రం చర్చించి ఆమోదించడానికి ముందు మేం ఒక పట్టిక చూశాం. దాంట్లో మిలిటరీ అధికారుల జీతాలు, కార్మికుల జీతాలు పోల్చబడ్డాయి. మిలిటరీ అధికారులు మరెన్నో సౌకర్యాలతో పాటు నెలకు ఇరవై నుంచి ఇరవై ఐదువేల పిసోలు సంపాదిస్తుండగా కార్మికుల నెలజీతం రెండువేల పిసోలు మాత్రమే! అలాగే ఒక కార్మికుడు జీవించడానికి రోజుకి ఎన్ని కాలరీల ఆహారం కావాలి, ఇందు కోసం అతనెంత సంపాదించాలి మొదలైన లెక్కలన్నీ కూడా ఆ పట్టికలో ఉన్నాయి. వాళ్ళా పట్టికలో కొన్ని ప్రాథమిక మానవ అవసరాలను కూడా గుర్తించారు. బట్టలు, చెప్పులు, వినోదం – వినోదం అంటే మరేమో అనుకునేరు – విషయాలు తెలుసుకోడానికి ఓ పత్రిక అంతే! – ఇవన్నీ కలిపి చూస్తే కార్మికుడు మామూలు జీవితం గడపాలంటే రోజుకు 170 పిసోల డబ్బు సంపాదించవలసి ఉంటుంది. సరే – కొన్ని సరుకులు మాకు చౌక ధరలకే ఇస్తారు గనుక వాటి క్రింద ఓ 40 పిసోలు తీసేశామనుకోండి – అంటే ఒక్కో కార్మికుడు రోజుకి కనీసం 130 పిసోలు సంపాదించాలి. అప్పుడు గని కార్మిక సమాఖ్య వాళ్ళేమన్నారంటే తాము రోజుకి 80 పిసోల వేతనం అడిగి ఉన్నామని, కనీసం అదైనా ఇమ్మని డిమాండ్ చేద్దామని అన్నారు. అప్పుడు మేం గనిలోపల పనిచేసే కార్మికుల పనిగంటలు ఆరుకు తగ్గించాలని డిమాండ్ చేయాలని సూచించాం. లోపలి పరిస్థితుల వల్ల వాళ్ళకు ఎక్కువ విశ్రాంతి అవసరమవుతుందని మేమన్నాం.

          మేమీ డిమాండ్లన్నీ ప్రభుత్వానికి తెలియజేసి ముప్పై రోజుల గడువు పెట్టాం.. అప్పటికి మా డిమాండ్ల పరిష్కారానికి పూనుకోకపోతే నిరవధిక సమ్మెకు పిలుపివ్వవలసి వస్తుందని హెచ్చరించాం.

          ప్రభుత్వ జవాబు మా గడువుకన్న ముందే వచ్చింది. మొదట వాళ్ళు గని కార్మిక సమాఖ్య సభ్యులందరినీ అరెస్టు చేశారు. అప్పుడు గనుల్లోకి సైన్యం జొరబడింది. వాళ్ళు మా ట్రాన్స్ మిటర్ల మీద దాడి చేశారు. పయస్-12 రేడియో మీద కూడ దాడిచేశారు.వాళ్ళు మా ప్రాంతాన్నంతా మిలిటరీపాలిత – ప్రాంతాలుగా ప్రకటించి, ఎంతో మంది నాయకుల్నీ, కార్మికుల్నీ అరెస్టు చేశారు. దూరం కొట్టారు.

*****

(సశేషం)

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.