క ‘వన’ కోకిలలు – 19 : 

మహాకవి జయంత మహాపాత్ర

   – నాగరాజు రామస్వామి

ఒడిసా గడ్డ మీద నడయాడుతున్న మహాకవి జయంత మహాపాత్ర.

సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత. సాహిత్య అకాడమీ ఫెల్లోషిప్, పద్మశ్రీ లాంటిపలు ప్రతిష్ఠాత్మక అవార్డులు పొందిన సాహిత్యకారుడు.

          ఇంగ్లీష్ కవిత్వాన్ని భారతదేశంలో పాదు కొల్పిన ముగ్గురు వైతాళికులు A.K. రామానుజన్, R. పార్థసారధి, జయంత మహాపాత్ర. ఈ సమకాలీన కవిత్రయంలో మొదటి ఇద్దరు ముంబాయ్ వాళ్ళు కాగా, మహాపాత్ర ఒరిస్సాకు చెందిన కవి. కటక్ (ఒరిస్సా) లోని సంపన్న క్రిస్టియన్ కుటుంబంలో జన్మించాడు. పాట్నా యూనివర్సిటీ లో M.Sc. చేసి, పలు కాలేజీలలో భౌతికశాస్త్రం బోధించాడు. రీడర్ గా రిటైర్ అయ్యాడు.

          కవిత్వంలోకి 60వ ఏట గాని ప్రవేశించలేదు. తొలుత, అతని రచనలను తిరస్కరించబడ్డాయి. అయోవా(Iowa) Inernational Writing Program లో పాల్గొన్నాకే అతనికి అంతర్జాతీయ ఖ్యాతి లభించింది. అతనికి చాలా కాలం వరకు కవిత్వం మీద ఆసక్తి లేక పోయింది. రవీంద్రనాథ్ ఠాగోర్, విట్మన్ లాంటి కవులను కూడా చదువలేదు. ఆలస్యంగా రంగప్రవేశం చేశాడు. కాని, చిత్రంగా అతనికి గొప్ప కవిత్వం అబ్బింది.

          ఎవరినీ అనుకరించలేదు. కాల క్రమేణ, తనదైన స్వతంత్ర శైలిలో 27 విశిష్ట గ్రంథాలు రచించాడు ( ఒరియా భాషలో 7, ఆంగ్లంలో 20). ఇవీ కొన్ని అతని ఆంగ్ల సంపుటాలు:

  • Close the Sky Ten by Ten
  • Svayamvara and Other Poems
  • A Father’s Hours
  • A Rain of Rites
  • Relationship
  • Collected Poems
  • Mumbai
  • The Green Gardener
  • short stories

          SAARC లాంటి పలు అంతర్జాతీయ సాహిత్య సంస్థలు అతన్ని గౌరవించాయి. రావెన్ షా విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో సత్కరించింది.

          జయంత మహాపాత్ర కవి, రచయిత, కథకుడే కాక పత్రికా సంపాదకుడు కూడా. కొన్నాళ్ళు సాహిత్య పత్రికను (Chandrbha) నడిపించాడు. అతని కవితలు విశ్వ విఖ్యాత కవితా సంపుటి The Dance of the Peacock లో ప్రచురితమయ్యాయి.

          జయంత మహాపాత్ర అధునిక సాహిత్య ప్రపంచంలో పేరు మోసిన భారతీయ ఆంగ్ల కవి. సుకుమారమైన సకల మానవ సంవేదనలు – బాధ, ప్రేమ, విషాదం, మృత్యువు, భక్తి, బాల్యం – అన్నీఅతని రచనలలో ప్రతిబింబించాయి. అతని చాలా రచనలలో స్త్రీ పురుష సంబంధాలు కేంద్రబిందువులు. అతని రచనలలో ఒరిస్సా వైవిధ్య జీవన శోభ, భారతీయ పరిమళం ఉట్టిపడుతుంది. క్లిష్టమైనవి అతని కవితలు; వస్తువు లోనూ, శైలీ పరమైన అభివ్యక్తిలోనూ. అనువాదానికి కొరుకుడు పడని కవిత్వం. బహుళవ్యాఖ్యానాలకు తలుపులు తెరచి ఉంచిన open-ended నవీన సాహిత్య ప్రక్రియ అతనిది.

          అతని భావనలు విశ్వజనీనం. అతని కవన మూలాలు దేశవాళి నేలలో పాతుకొని వుంటవి. స్వదేశభ్రాంతి (Nostalgia) మెండు. కలకత్తా, పూరి, కోణార్క్ లపై ఎనలేని ప్రీతి. ప్రకృతి ప్రియుడు. నదులంటే వల్లమాలిన ప్రేమ. అందుకే అంటాడు:

“మనిషి అంటే ఒక ప్రదేశమే. నది ఒడ్డున కూర్చొని, ప్రవాహంలోకి గులకరాళ్ళు విసురుతుంటే, మనిషి స్థలమై పోతాడు.”

ఇవి కొన్ని జయంత మహాపాత్ర ఆంగ్ల కవితలకు నా తెలుగు సేతలు:

1.తప్పిపోయిన వ్యక్తి : (A Missing Person )

చీకటి గది
ఆమె
అద్దంలో తన ప్రతిబింబాన్ని వెతుక్కుంటున్నది

చీకటి చివరంచు మీద
ఎప్పటిలాగే నిరీక్షణ

దాగిన ఆమె ఒంటరి దేహపు ఆచూకి
తాగి తూగుతున్న
ఆమె చేతిలోని నూనె దీపానికి తెలుసు

2.వేసవి : (A Summer)

మ్లాన ధ్వనుల హోరుగాలి మీదుగా
పూజారుల మంత్ర పఠనాలు జోరందుకుంటున్నవి;
హిందూదేశం నోరెల్ల పెట్టింది.
మొసల్లు జల అగధాలలోకి జారుకుంటున్నవి.
ఎండకు వేడెక్కిన పెంట కుప్పలు పొగలుగక్కుతున్నవి.

చిటపటల చితిమంటల ఘోషలు విని
అలిసిపోని నా ముద్దుల సతి
పగటి కలలు కంటూ పగలంతా
నా పడక మీద పడుకునే వున్నది.

3.వెలిబూది : (Ash)

నా అరచేతిలో నలుగుతున్న పదార్థం
ఒక మృతుడు కూడా అవ్వచ్చు;
ఆటకోలు గాలి తలతిరుగుడు చేష్టలకు
అబ్బుర పడాల్సిందేమీ లేదు.

అల్లంత దూరాన వున్న నా ముసలి తండ్రి
ఆకాశాన్ని ఆనుకొని వున్న మందకొడి మేఘం;
ఇక్కడ,
నిశ్శబ్దంగా కుంకుతున్న ఈ చరమ సంధ్యలో
నేను ఇంకా గుండె ఆగిపోని శేషజీవిని.

నా విముక్తి సూచక మార్గాలు:
ఆనాటి
మెరుసే పూల, కురిసే కుండపోతల
స్వీయవంచిత సంశయ వాగ్దానాలు,
ఆకుఆకులో గాలి ఆవిష్కరించిన
అసత్య ముక్త ప్రకటనలు.
అవి
సాధువు నొసటి తడి విభూతి రేఖలై,
సాదుసంగమ సాధారణ జలదృశ్యాలై
నన్ను కలచి వేస్తున్నవి.
ఆ నీడ చాటు ధర్మానికి నేనేదో జడుసుకున్నట్టు
నన్నేదో పక్కకు తోసేస్తున్నది.

ఇప్పుడు
ప్రపంచం నా కళ్ళలోకి ప్రాకుతున్నది:
సందె పక్షులు గూళ్ళకు చేరుతున్నవి,
గడియారం
నది ఒడ్డున తేలుతున్న చితాభస్మమంటి
ఒక్కొక్క జ్ఞాపకాన్ని
గతంగా మారుతున్న వర్తమానంలోకి నెట్టుతున్నది.

గాలిని కలతపెడుతున్న కలచివేతలు
నాలోనూ …
బంగారు భవితవ్యాన్ని పంచే
నా తండ్రి సానుభూతికై తపిస్తూ నేను.

ఆ మరణించిన మనిషి
నా అరచేతులను నాకడం
నాలోని అంధ అసహనాన్ని ప్రోత్సహించేందుకే –
నన్ను మరో చిత్ర గంభీర సమస్య కేసి
తిప్పేందుకు కాదనుకుంటాను.

జీవన క్షేత్రంలో వరుస కట్టినవి
తెలివి మాలిన పుక్కిటి పురాణాలు –
ఇవేవీ పట్టించుకోని వాయువే నయం
దేహహీన ఖాళీ కణాలలో
కలస్వనాలను నింపుతుంటుంది.

4. పూరిలో ఉదయం : (Dawn At Puri)

ఎడతెగని కాకుల గోల
పవిత్ర పులినాలలో
సగం వరకు కూరుకు పోయిన కంకాళం
డొల్లై పోయిన దేశంలోకి ఆకలిని వంపుతున్నది.

దేవాలయంలోకి వెళ్ళేందుకు వేచియున్న
తెల్ల చీరలు కట్టుకున్న నడివయసు స్త్రీలు;
వాళ్ళ నిష్ట నిండిన కన్నులు
వలలో చిక్కుకొని వేలాడుతున్న
ప్రభాత ప్రతీర ఆస్తిక్య ప్రకాశంలా వున్నవి.

ఇసుకలో
ఒకదాని పై ఒకటి ఒరిగిన బొల్లి మచ్చల
శిథిల కంకాళాల మీద
వేకువ క్షీణకాంతి పడుతున్నది;
పేర్లు లేని వక్రదేహాల ప్రోగు.

ఉన్నట్టుండి భగ్గుమన్న
నా ఏకాంత రహఃస్థావర వ్యాకుల జ్వాలలు
నా వృద్ధ మాతను చుట్టు ముట్టాయి:
కదలుతున్న సైకతాల మీద జారుతున్న
అనిశ్చిత కాంతి రేఖలా
ఇక్కడే,
తన అంతిమ క్రియలు జరగాలని
ఆమె ఆఖరు కోరిక.

5. ఆమె చేయి : (Her Hand)

ఎలా ముట్టుకోను
ఈ పిల్ల నల్ల చేతిని?

వీధి దీపాలు తలతెగిన దేహాల్లా వున్నవి,
రక్తం మన నడిమి భయంకర ద్వారాలను తెరుస్తున్నది,
గాయపడిన ఖాయం
అంపశయ్య మీద గిలగిలలాడుతుంటే
బాధామయ దేశం నోటికి తాళం పడుతున్నది.
నా కైతే ఆ పిల్ల
రేప్ కు గురైన ఒక అస్పృశ్య శరీరం.

నా ఈ భారీ అపరాధం భావం
ఆమెను హత్తు కోలేని నా అశక్తతను
అధిగమించలేక పోతున్నది.

6.ఆకలి : ( Hunger)

నమ్మలేకుండా వున్నాను
నా వీపు మీది మాంసం ఇంతగా బరువెక్కిందని.

వలలను ఈడ్చుకుంటూ,
నరాలను బిగబట్టుకుంటూ,
తాను చేయక తప్పని పాపాన్ని
తన మాటలతో కడిగేసుకుంటున్నట్టు,
తనకేమీ పట్టనట్టు
చూచీచూడని వంకర చూపులతో
‘ఆమె నీకు కావాలా’ అని
వాడు నాతో అంటున్నప్పుడు
వాని కళ్ళలో
వాడి బొమికలు గుచ్చు కోవడం చూచాను.

వాని వెంటే వెళ్ళాను
తెరచుకున్న ఇసుక తిన్నెల గుండా.
నా నరనరాలలో తీరని తీవ్ర కాంక్షా ప్రఘాతం;
నా మంటల ఇంటిలో విచ్చుకుంటున్న లాలస ఆశ.

ఏదో నిశ్శబ్దం నన్ను ఆవరించింది,
వాని వలలే వాన్ని సముద్రం నుండి
ముందుకు లాగుతున్నవి,
మసక చీకటిలో పచ్చిపుండై విచ్చుకుంటున్న
వాడి బక్కచిక్కిన దేహాగ్నిని రగిల్చేది
నేనూ, వాడి గడచిన రాత్రులూ పగళ్ళూ.

నా చర్మాన్ని రక్కినవి
పుష్పించడం ఎరుగని గుడిసె తాటి కమ్మలు,
గుడ్డి దీపపు వెలుగులో
గత దైన్యం గోడలకు వేలాడుతున్నది;
నా మనసులో జిగట జిగట దీపపు మసి.

వాడంటున్నాడు:
‘ఇదిగో మా అమ్మాయి, పొందు,
ఇప్పుడిప్పుడే పదిహేనేళ్ళు దాటింది,
వస్తా. నీ బస్సు తొమ్మిదింటికి.’
విరిగి పడింది నింగి
నా నెత్తిన,
నటనలతో నలుగుతున్న ఆ తండ్రి నెత్తిన.

దీర్ఘమైనవి ఆమె రోజులు:
పొడగాటి ఆమె సన్నని తొడల సందున
నా ఆకలి తీరింది.

          తొంబది ఐదేళ్ళ వయసులో, నేటికీ సాహిత్య సభలలో, కవిసమ్మేళనాలలో కవన విన్యాసంచేస్తున్న అచ్చమైన కవి జయంత మహాపాత్ర.

మన కాలపు మహాకవి జయంత మహాపాత్ర.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.