చిట్టెమ్మ బొట్టు పెట్టుకుంది

(నెచ్చెలి-2023 పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపికైన కథ)

-జానకి కొత్తపల్లి

          చాలా కాలానికి గుమ్మం ముందు వేసిన పెళ్ళిపందిరి, ఆ పందిరికి కట్టిన పచ్చటి మామిడి తోరణాలు, అలికిన పచ్చని నేల మీద అందంగా పెట్టిన తెల్లటి ముగ్గులు కనువిందు చేస్తున్నాయి. విరిసిన తొగరు పూల సన్నని గుబాళింపుతో గాలి వీస్తోంది. చిట్టెమ్మ మనసు ఆనందంతో నిండిపోయింది. ఇన్నాళ్ళకు తన తమ్ముడికి పెళ్ళి జరుగుతోందని, అందునా తన పెళ్ళి కూడా ఇక్కడే జరిగింది గనుక తన పెళ్ళి రోజును గుర్తు చేసుకుని ఆనందపడుతోంది.

          “చిట్టెమ్మా! పొద్దుటే లేవాలి కదా, పడుకో! ఇప్పటికే బాగా పొద్దు పోయింది”అన్నాడు వీరన్న.

          అలాగే చిన్నాన్నా అని లోపలికి వెళ్ళింది. కూర్చుని పెళ్ళిపందిరి కేసే చూస్తోంది చిట్టెమ్మ. తన మనసు వెనక్కి, వెనక్కి వెళ్ళి గతం తలచుకుంటోంది.

          తన పెళ్ళికి ఇంకా పెద్ద పందిరి వేయించారు. తన తల్లిది ఎంత హడావుడో, ఎంత ఆనందమో! ఆడపిల్ల పెళ్ళి అని తన వైపు బంధువులను ముందుగా రప్పించుకుంది.
తన భర్త ‘అచ్యుతం’ , అమ్మ వైపు బంధువు. ప్రక్క ఊరు వాళ్ళే! “నాకు ఒక్కగానొక్క పిల్ల. దాన్ని నేను అత్తారింటికి పంపను. దానికి ఒక ఇల్లు, కొంత పొలం ఇస్తాము. ఇక్కడే ఉండాలని మా కోరిక. అల్లుడు కూడా ఇక్కడే ఉంటే మా బిడ్డలా చూసుకుంటాము” అని అన్నారు తల్లిదండ్రులు.

          “అలాగే! నీ కూతురు నీ దగ్గరే ఉంటుంది. అచ్యుతం ఇక్కడా ఉంటాడు, అక్కడా ఉంటాడు. ప్రక్క ఊరే కదా!” అని వాళ్ళూ ఒప్పుకున్నారు. ఆ మాటకే అమ్మ ఆనందపడి పోయింది.

          పెట్రోమాక్స్ లైట్ల వెలుగులో, బ్యాండ్ గట్టి మేళం చేస్తుంటే తన మెడలో అచ్యుతం తాళి కట్టాడు. ఒకరినొకరు చూసుకోండని పురోహితులు గారంటే అప్పుడు ఒకరినొకరు చూసుకున్నారు. ఆ చూపుల కలయిక తన మనసు మరువలేదు. అతని చేయి పట్టుకుని ఏడడుగులు వేసింది.

          “చిట్టెమ్మా! ఇంకా నిద్రపోలేదా?” అన్న వీరన్న మాటకు మరల ఈ లోకంలోకి వచ్చింది.

          “నిద్ర రావడంలేదు చిన్నాన్నా! ఈ పెళ్ళి ఎలా జరుగుతుందా అని ఆలోచిస్తు న్నాను” అని అంది చిట్టెమ్మ.

          “ఎవరున్నా, ఎవరు లేకపోయినా ఏదీ ఆగదు. తలుపు వేసుకుని పడుకో” అని నిట్టూరిస్తూ వెళ్ళిపోయాడు వీరన్న.

          చిట్టెమ్మ తలుపేసుకుని కళ్ళు మూసుకుంది. కానీ మనసు వాకిలి తెరచి గతం తలచుకుంటోంది.

* * *

          రెండు సంవత్సరాలు తన భర్తా, తనూ అన్యోన్యంగా కాలం గడిపారు. వారి అన్యోన్య తకు సాక్షిగా ఆడపిల్ల పుట్టింది. తన తల్లిపేరు గంగ అని పెట్టుకున్నాడు, అచ్యుతం.
ఆ తర్వాత అన్యోన్యంగా ఉన్న తన కాపురం మలుపు తిరిగింది. పెళ్ళినాటి ప్రమాణాలు మారిపోయాయి. పిల్ల మీద, తన మీద ప్రేమ తగ్గిపోయి ఏదో ధ్యాసలో ఉంటున్నాడు. తనూ ఏమీ అడగలేదు.

          గట్టుక్రింద తుమ్మల బీడులో గేదెలు మేపుతున్న వీరన్నకు ఒక దృశ్యం కనబడి ఆశ్చర్యమేసింది. అచ్యుతం, వేరొక అమ్మాయి కలిసి గట్టు దిగడం చూసి గొడుగు అడ్డం పెట్టుకున్నాడు వీరన్న. వాళ్ళిద్దరూ నావ దాటి లంకలోకి వెళ్ళడం ఆ తాటాకు గొడుగు చాటు నుండి గమనిస్తూనే ఉన్నాడు. వాళ్ళు మాత్రం తనని గమనించేలా లేరు. కోపాన్ని దిగమ్రింగుకుని ఊరుకున్నాడు. తర్వాత జరిగిన విషయం చిట్టెమ్మకు చెప్పి బాధ పడ్డాడు.

          “చిన్నాన్నా! ఈ విషయం మన మధ్యే ఉండాలి. ఆయన్ని ఏమీ అడగొద్దు. ఏం చేస్తాం. అంతా నా ఖర్మ. చూద్దాం. మనం మాత్రం మామూలుగానే ఉందాం” అని అంది చిట్టెమ్మ.

          అతని ప్రవర్తనలో ఎన్నో మార్పులు. అసలు తనని, కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు. ఇంట్లోకి ఏమీ తేవడం లేదు. ఇంట్లో ఉన్న తన కొద్దిపాటి బంగారాన్ని తనని అడగ కుండానే తీసుకెళ్ళిపోయాడు. ఇక మనసు చంపుకుని అచ్యుతాన్ని నిలదీసిందిచిట్టెమ్మ. పెద్ద గొడవ చేసాడు. ఆఖరికి తననీ, కన్నబిడ్డనీ వదిలి వెళ్ళిపోయాడు. ఈ విషయం ప్రక్కనున్న పినతండ్రికి తెలిసినా కన్న తల్లిదండ్రులకు తెలియకుండా జాగ్రత్త పడింది. కానీ, నిజం ఎన్నాళ్ళో దాగదుగా! అది తెలిసి తల్లీ తండ్రీ క్రుంగిపోయారు. పినతండ్రి చెప్పులు అరిగేలా చుట్టుపక్కల ఊళ్ళన్నీ తిరిగి చూసాడు. ఎక్కడా జాడలేదు.

          “చిన్నాన్నా! నువ్వు ఇంక ఎవరి కోసమూ వెతకొద్దు. వస్తాడా, వస్తాడు. లేకపోతే ఏం చేస్తాం. నీ ఆరోగ్యమూ బాగోలేదు. తల్లీ తండ్రి కన్నా ఎక్కువుగా నా ప్రక్కనుండి నా బాగోగు లు చూస్తున్నావు. నీ ఆరోగ్యం పాడయితే నాకు ఎవరు దిక్కు. వేళకు తినకుండా తిరుగు తున్నావు. దా, అన్నం తిను ” అని కంచమందించింది చిట్టెమ్మ.

          “చిట్టెమ్మా!” అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు.

          “చిన్నాన్నా! నువ్వు ఏడిస్తే గంగ కూడా ఏడుస్తోంది చూడు” అని అంది చిట్టెమ్మ.
వీరన్న ముఖం కడుక్కుని గంగనెత్తుకుని అన్నం తినిపించి తనూ తిన్నాడు.

          “నా కళ్ళెదురుగా ఉంటావని ఈ సంబంధం ఏరికోరి చేస్తే నీ జీవితం ఇలా అయి పోయిందేంటి చిట్టెమ్మా?” అని బాధపడుతూ మంచం పట్టింది రమణమ్మ.

          “చిట్టెమ్మా! తమ్ముణ్ణి జాగ్రత్తగా చూసుకో. నీ కూతుర్నిచ్చి పెళ్ళి చేయి. చేస్తానని మాట ఇవ్వు” అంది రమణమ్మ, చేయిచాచి.

          “అమ్మా, ఎందుకు అలా అంటావు? నీకేమీ కాదు. నువ్వు మళ్ళీ లేచి ఆరోగ్యంగా తిరుగుతావు. బెంగపడకు ” అని తల్లిని ఓదార్చింది.

          “నీ కూతురి కన్నా పదేళ్ళు పెద్దవాడని ఆలోచిస్తున్నావా? ఏమీ ఫర్వాలేదు. ఆడపిల్ల ఇట్టే ఎదుగుతుంది” అని అంది రమణమ్మ.

          “అమ్మా, నా కలాంటి ఆలోచనే లేదమ్మా! గంగని తమ్ముడికిచ్చే పెళ్ళిచేస్తాను. సరేనా!” అంది తల్లి చేతిలో చేయి వేస్తూ చిట్టెమ్మ.

          “నీకు వాడు తోడుగానూ, నువ్వు వాడికి అండగానూ ఉంటారన్న ఆశతో ఇలా మాట తీసుకున్నాను. నాకిప్పుడు మనసు కుదుటపడింది. ఇంక నేనేమైనా ఫర్వాలేదు” అని అంది రమణమ్మ.

          “అమ్మా, నువ్వు అలా అంటే భరించలేనమ్మా! నువ్వు బ్రతకాలి, నాకు అండగా ఉండాలి” అని బోరున ఏడ్చింది, తల్లి గుండెల మీద వాలి.

          కొద్ది రోజులకే తల్లి కన్నుమూసింది. మరికొన్ని రోజులకి తండ్రి కూడా కాలంచేసాడు. తమ్ముడు కృష్ణయ్యను తన దగ్గరే పెట్టుకుంది. కుటుంబం గడపడం కష్టమౌతోంది. అప్పులు చేస్తే ఎలా తీర్చాలి అని సతమతమయ్యేది. ఇంత ఇబ్బంది పడుతున్నా, తను పిల్లా ఎలా తిన్నా కృష్ణయ్యకు లోటు రాకుండా చూసుకునేది. ఇదంతా చూస్తున్నా, అక్కా ఎలా గడుపుతున్నావు, ఇబ్బందిగా ఉందా అని ఏనాడూ అడగలేదు.

          ఇల్లు గడపడానికి వేరే మార్గం లేక తన ఇంట్లోనే టీ కొట్టు పెట్టుకుంది. మెల్లగా టిఫిను కూడా పెట్టింది. కృష్ణయ్యకి ఇది నచ్చక తన ఇంటికి వెళ్ళిపోయాడు. అన్నం తినడానికి కూడా తన దగ్గరకి రావడం లేదు. తనే క్యారేజీ పంపుతోంది. తమ్ముడికి ఇష్టం లేదని టీ కొట్టు మానలేదు. రోజులు గడిచిపోతున్నాయి. అచ్యుతం జాడ లేదు. మనసులో అనేక సందేహాలు. కుంకుమ బొట్టు పెట్టుకోవడం లేదు. పిల్ల బాధ్యత చూసుకోవడం, టీ కొట్టు నడుపుకోవడంతోనే తనకు సరిపోతోంది. శ్రమ అనిపించినా, వీరన్న సహాయంతో ఇబ్బంది లేకుండా గడిచిపోతోంది.

          కొంత కాలం తర్వాత “చిట్టెమ్మా! గంగకు, కృష్ణయ్యకు పెళ్ళి చేసేసి నీ బాధ్యత తీర్చేసుకుంటే మంచిది కదా!” అని అన్నాడు వీరన్న.

          “అదే చిన్నాన్నా, నేనూ ఆలోచిస్తున్నాను” అని అంది చిట్టెమ్మ.

          ఒకరోజు, తెలుసున్న బంధువులను తీసుకెళ్ళి కృష్ణయ్య దగ్గర కూర్చున్నాడు వీరన్న. చిట్టెమ్మ తన స్నేహితురాలైన సీతను తోడుగా తీసుకెళ్ళింది. చిట్టెమ్మ వంక చూసి, నువ్వేమి చెప్పాలనుకుంటున్నావో చెప్పు అన్నారు బంధువులందరూ. చిట్టెమ్మ మాట్లాడలేక సీతకేసి చూసింది.

          “కృష్ణయ్యా! నీ అక్క తన కూతురు గంగనిచ్చి నీకు పెళ్ళి చెయ్యాలనుకుంటోంది. నీ అభిప్రాయం చెప్పు” అని అడిగింది సీత.

          “నీ అభిప్రాయం చెప్పు కృష్ణయ్యా!” అని అందరూ ఏక కంఠంతో అడిగారు బంధువు లందరూ.

          “అక్కకిచ్చిన ఆ ఇల్లు, పొలం ఇప్పుడే నాకు రాసేసి, కట్నంగా 25 వేల రూపాయ లిస్తే గంగను పెళ్ళి చేసుకుంటాను” అని మొహమాటం లేకుండా చెప్పాడు కృష్ణయ్య.
“ఇప్పుడా?తర్వాత అంతా పిల్లదే కదా! అయినా సొంత అక్క దగ్గర ఇలా అడుగుతావా?” అని అడిగాడు ఒక బంధువు.

          “ఇప్పుడే ఇవ్వాలి” అని ఖరాఖండిగా చెప్పాడు కృష్ణయ్య.

          ఆ మాటకి ఏమీ మాట్లాడకుండా చిట్టెమ్మ, సీత లేచారు. వీరన్న చూస్తున్నాడు. బంధువులు కూడా లేచారు.

          “నీ తల్లీ, తండ్రీ పోయినప్పటి నుండీ నిన్ను తల్లిలా చూసింది. ఇప్పుడు నువ్వు ఇలా అడగడం ఏమీ బాగాలేదు” అన్నాడు ఒక పెద్దాయన, వెళ్ళిపోతూ.

          కృష్ణయ్య ఏమీ మాట్లాడలేదు. ఇంకేమీ అనకుండా అందరూ వెళ్ళిపోయారు. అలా ఆగిపోయింది, ఆ విషయం.

          “ఈ ఇల్లు, పొలం నువ్వు ఉన్నన్నాళ్ళూ నీకే ఉండాలి. నీ పిల్లకి కూడా ఇవ్వవద్దు ” అని గట్టిగా చెప్పాడు వీరన్న.

          “మరి ఈ పిల్ల పెళ్ళి ఎలా చెయ్యగలను చిన్నాన్నా?” అని కన్నీరు పెట్టింది చిట్టెమ్మ.

          “బాధపడకు. గంగకి రాజాలాంటి మొగుడు వస్తాడు” అని నమ్మకంగా అన్నాడు వీరన్న.

          ఆ రోజు గంగ పుట్టినరోజు. గులాబీ రంగు అంచు పరికిణీ, అదే రంగు జాకెట్టు, నీలి రంగు ఓణీ వేసుకుని, కనకాంబరాలు పెట్టుకుని, చేతులకు నిండుగా మట్టి గాజులు వేసుకుని అందంగా ముస్తాబయ్యింది.

          “గంగా! తాతకు దణ్ణం పెట్టు” , “ఈ రోజు గంగ పుట్టినరోజు చిన్నాన్నా!” అని అంది చిట్టెమ్మ, అక్షతలిస్తూ.

          “ఈ రోజు నీ పుట్టిన రోజా తల్లీ!” అని ఆనందంతో అక్షతులు వేసి దీవించాడు వీరన్న.

          “హ్యాపీ బర్త్ డే! హ్యాపీ బర్త్ డే!” అంటూ చప్పట్లు కొడుతూ గంగ దగ్గరకు వెళ్ళి, ప్రేమతో చూస్తూ చెయ్యి ఇవ్వబోయాడు శివరాజ్. గంగ సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది.
“గంగా, నీ పుట్టిన రోజు కదా! పూలు కొనుక్కో” అని వంద రూపాయలు ఇచ్చాడు శివరాజ్. లోపలి నుండే వద్దండీ అంది.

          “వద్దనకు. బాబుగారు ఇచ్చినప్పుడు కాదనకూడదు. తీసుకో!” అని అన్నాడు వీరన్న.

          సిగ్గుపడుతూ వచ్చి తీసుకుంది.

          “థాంక్స్ గంగా!” అన్నాడు. “వీరన్న గారు, ఆంటీ గారు, మీకు అభ్యంతరం లేకపోతే మీ గంగను నేను పెళ్ళి చేసుకుంటాను” అని అన్నాడు.

          శివరాజ్ అన్న మాటకు చిట్టెమ్మ, వీరన్న అలా చూస్తూ ఉండిపోయారు. వీరన్న తేరుకుని, “బాబూ, మీరు నిజంగానే అంటున్నారా?” అని అడిగాడు.

          “అవును. నేను నిజంగానే అంటున్నాను. నేను గంగను ఇష్టపడుతున్నాను. ఈ రోజు బయట పెట్టాను” అన్నాడు.

          “మరి మీ పెద్దవాళ్ళు ఏమంటారో” అని అడిగాడు వీరన్న.

          “నా ఇష్టమే వాళ్ళ ఇష్టం. గంగ గురించి వాళ్ళకి ముందే చెప్పాను. మీకు అభ్యంత రం లేకపోతే చెప్పండి” అని అన్నాడు శివరాజ్.

          ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బై పోతూ “ఆలస్యం, అమృతం, విషం చిట్టెమ్మా! నీ కూతుర్ని కూడా ఒక మాట అడుగు” అని అన్నాడు వీరన్న.

          “గంగ మన మాట కాదనదు. నీ ఇష్టమే నా ఇష్టం చిన్నాన్నా!” అని అంది చిట్టెమ్మ.

          “గంగా! ఇలా రామ్మా! బాబుగార్ని పెళ్ళి చేసుకోవడం నీకు ఇష్టమేనా?” అని అడిగాడు వీరన్న.

          “నీకు, అమ్మకు ఇష్టమైతే…..” అని నసుగుతోంది గంగ.

          ఆమె మాట పూర్తి కాకుండానే “వాళ్ళకు ఇష్టమే గానీ, నీకు నేనంటే ఇష్టమా, కాదా?” అని గంగ కళ్ళలోనికి సూటిగా చూస్తూ అడిగాడు శివరాజ్. అక్కడ ఉన్నవాళ్ళు కూడా “చెప్పమ్మా” అని రెట్టించారు.

          “నాకు ఇష్టమే ” అని సిగ్గుపడుతూ లోపలికి పరిగెట్టింది గంగ. తల్లి ఇచ్చిన కాఫీ గ్లాసు అతనికి అందించింది. కాఫీ తీసుకుని ఉరకలు వేస్తున్న ఆనందంతో “నేను మళ్ళీ  వస్తాను” అని వెళ్ళిపోయాడు శివరాజ్.

          ఇరువైపులా పెద్దవాళ్ళు మాట్లాడుకోవడం, మంచి ముహూర్తాలు కూడా ఉండడంతో పదిరోజుల్లోనే గంగ పెళ్ళి అంగరంగ వైభవంగా జరిగింది. తనలాంటి ఆడదాని కడుపున పుట్టిన గంగ ఒక జమీందారు ఇంటికి కోడలిగా వెళ్ళడంతో చాలా ఆనందించిందిచిట్టెమ్మ.

          తనను కాదని గంగను ఇంకెవ్వరికీ ఇచ్చి పెళ్ళి చేయలేదని, ఎవరూ చేసుకోరని గర్వంతో ఉన్న కృష్ణయ్య ఆశ్చర్యపోయాడు. పట్నంలో చాలా ఆస్తి ఉన్న జమీందారు, ఈ పల్లెటూళ్ళో ఉన్న తన పొలాలు చూసుకోవడానికి వచ్చి, అక్క టీ కొట్టులో ఒక టీ త్రాగి, గంగను చూసి ఇష్టపడి, పెళ్ళి చేసుకుని గంగను పట్నం తీసుకుని పోయాడే, అసలు ఇలా జరుగుతుందని అనుకోలేదే అని ఆలోచిస్తూ కూర్చున్నాడు.

          “ఒరేయ్ కృష్ణయ్యా! గంగ పెళ్ళి అయ్యిపోయిందా? శివరాజ్ చేసుకున్నాడు? మరి నువ్వేం చేసావురా?” అని అడిగాడు దుబాయ్ నుంచి వచ్చిన శ్రీను.

          “ఒరేయ్ శ్రీను! అంతా ఒక మాయలా జరిగిపోయిందిరా” అని అన్నాడు కృష్ణయ్య.

          “ఏం జరిగిందో చెప్పు” అని మరల అడిగాడు శ్రీను.

          “నా దురాశే అందుకు కారణం” అని జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పాడు కృష్ణయ్య.

          “నా ప్రాణ స్నేహితుడవని ఇన్నాళ్ళూ నేను బయట పెట్టలేదు. నువ్వు గంగ మావయ్యవని, గంగను పెళ్ళి చేసుకుంటావని అనుకున్నాను. లేకపోతే చిట్టక్కని అడిగి నేనే గంగను చేసుకొందును” అని అన్నాడు శ్రీను.

          కృష్ణయ్య ఆశ్చర్యంగా శ్రీనుకేసి చూసాడు.

          “ఒరేయ్ శ్రీను! ఎదురుగా ఉన్న అదృష్టాన్ని గుర్తించలేక పోయానురా! నా తప్పు నేను తెలుసుకున్నాను. అక్కని, చిన్నాన్నని చాలా బాధ పెట్టాను. వాళ్ళని మన్నించ మని చెప్పు. నేను కూడా శివరాజ్ లాగా దేనికీ ఆశించక ఒక అనాథను పెళ్ళి చేసుకుంటా ను. అక్కనీ, చిన్నాన్ననీ ప్రేమగా చూసుకుంటాను. ఈ మాటలు నువ్వే వాళ్ళకి చేరవేయ రా!” అని శ్రీనుని పంపాడు కృష్ణయ్య.

          ఆ మాటలు విన్న వీరన్న “వాడిలో మార్పు వచ్చింది” అని ఆనందపడ్డాడు. “మంచి పిల్ల దొరికి వాడికి కూడా పెళ్ళి అయితే అంతే చాలు” అని అనుకుంది చిట్టెమ్మ ఆనాడు. గతం తలచుకుంటూ నిద్రాదేవత కళ్ళు మూసేస్తుంటే నిద్రకు ఉపక్రమించింది చిట్టెమ్మ.

* * *

          తెల్లారింది. తలుపు కొట్టిన చప్పుడికి మెలుకువ వచ్చింది. తలుపు తీసింది. “చిట్టక్కా! పెళ్ళి కూతురుని ఒకామె తీసుకొస్తున్నారట. వీరన్న బాబాయ్ కూడా ఇంకా లేవలేదా?” అని అడిగాడు శ్రీను.

          “మెలుకువ రాలేదు శ్రీను! నువ్వే బాబాయ్ ని లేపు” అని అంది కంగారుపడుతూ.
వీరన్నకు ఒక్కగానొక్క చెల్లెలు హైదరాబాద్ నుండి వచ్చింది. ఆమె రాకతో పెళ్ళి కళ వచ్చింది. దగ్గర బంధువులు కూడా వస్తున్నారు. కృష్ణయ్యని పెళ్ళికొడుకుని చేసే కార్యక్రమంలో అందరూ ఉన్నారు.

          ఒక పెద్దామె పెళ్ళికూతురుని తీసుకుని వచ్చింది. అందరూ ఆమెను చూసి వెళు తున్నారు. పెళ్ళికూతురు బాగానే ఉంది. జంట బాగానే ఉటుందంటున్నారు పేరంటాళ్ళు.

          “పెళ్ళికూతురుని తీసుకుని రండమ్మా!” అని అరుస్తున్నారు పంతులుగారు.
చిట్టెమ్మ వెళ్ళి “తొందరగా రావాలమ్మా!” అని అంది.

          “ఆంటీ! నాకొక దండ కావాలి” అని అడిగింది శ్రీదేవి. చిట్టెమ్మ తెప్పించి ఇచ్చింది.

          “ఆంటీ! మా అమ్మకు మాత్రమే వేయాలి. కానీ మా నాన్నకు వేయకూడదు. ఎలాగో నాకు తెలియడం లేదు” అని అంది శ్రీదేవి.

          “అంటే మీ అమ్మ చనిపోయిందా?” అని అడిగింది చిట్టెమ్మ.

          “అవును. కానీ మా నాన్న బతికే ఉన్నాడు. మొత్తం ఫోటోకి దండ వెయ్యకూడదు కదా!” అని సందేహాన్ని వెలిబుచ్చింది శ్రీదేవి.

          “అవును. వెయ్యకూడదు ” అని ఆ ఫోటోకేసి చూసింది చిట్టెమ్మ. ఆ రూపం గుర్తుకొస్తోంది. ” మీ నాన్న బ్రతికే ఉన్నాడా?” అని అడిగింది.

          “అవును, వృద్ధాశ్రమంలో. కానీ ఎవరడిగినా లేడని చెప్పమన్నాడు” అని సంశయి స్తూ చెప్పింది శ్రీదేవి.

          “మీ అమ్మా నాన్న పేర్లేంటి?” అని ఆతృతగా అడిగింది చిట్టెమ్మ.

          “అచ్యుతం, వరహాలు” అని చెప్పింది శ్రీదేవి. చిట్టెమ్మ గుండెల్లో ఆనందం వెల్లువ లా వచ్చింది. ఆ దండ పట్టుకుని ఆమె వైపుకే వచ్చేలా వేయించింది. అచ్యుతాన్ని, అతని రెండో భార్యని ఒకసారి చూసి కుంకుమ పెట్టుకుంది చిట్టెమ్మ. పిల్ల చెయ్యి పట్టుకుని పీటల మీద కూర్చోబెట్టింది.

          “తల్లి ఉండి, తండ్రి దగ్గర లేక గంగకి వేరే వాళ్ళతో కన్యాదానం చేయించింది. తను, ఈ పిల్ల తండ్రి వున్నా కాళ్ళు కడిగి కన్యాదానం చేసే అదృష్టం లేదు. ఏమిటో విధి ఆడుతున్న ఆట” అని అనుకుంటోంది చిట్టెమ్మ. తన మనసులోని ఆనందం ఎవరికన్నా చెప్పాలని ఉంది.

          గంగ, శివరాజ్ చంటిబాబుని తీసుకుని వీరన్న ప్రక్కన కూర్చున్నారు. మేళాలు గట్టిగా మ్రోగాయి. వధూవరుల చేత జీలకర్ర, బెల్లం పెట్టించారు. తనే కన్నతల్లిలా ప్రక్క నుండి పెళ్ళికూతురి జడ ఎత్తి పట్టుకుని మంగళసూత్రం కట్టించింది. ఆమె కళ్ళు  పందిరిలో ఎవరినో వెతుకుతున్నాయి.

          మెల్లిగా పినతండ్రి ప్రక్కకు వెళ్ళి  “చిన్నాన్నా! ఈ పిల్ల నా భర్తకి పుట్టిన కూతురు. తల్లి లేదుట గానీ ఆయన బాగానే ఉన్నాట్ట” అని అంది చిట్టెమ్మ, ఆనందంతో.

          “అలాగా! ఎంత మంచి మాట చెప్పావు” అని అన్నాడు వీరన్న.

          మరల ఆమె వచ్చి పెళ్ళికూతురి ప్రక్కన నిలబడింది. అందరూ వచ్చి అక్షతులు వేస్తున్నారు. కానీ తను మాత్రం తన కళ్ళతో పందిరి అంతా గాలిస్తోంది. ఒక ముసుగు మనిషి మెల్లగా వెళ్ళిపోతున్నాడు. చిట్టెమ్మ కళ్ళు ఆశతో చూస్తున్నాయి. ముసుగేసుకుని వెళుతున్న మనిషి తన భర్తేమోనని అనుకుంటోంది. ఏనాటికైనా ఈ బిడ్డ కోసం రాకపోడా అని అనుకుంటోంది. అలా జరగాలని ఆశిద్దాం.

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.