తేజో, తుంగభద్ర

పుస్తకాలమ్’ – 24

(ప్రపంచవ్యాప్త సాహిత్యాన్ని పరిచయం చేసే ఎన్.వేణుగోపాల్ పుస్త’కాలమ్’ )

  -ఎన్.వేణుగోపాల్

తేజో, తుంగభద్ర రెండూ రక్తాశ్రుధారలే…

‘గతమంతా తడిసె రక్తమున,

కాకుంటే కన్నీళ్ళతో…’

          గతం మాత్రమే కాదు, వర్తమానం కూడా అదే రక్తంలో, కన్నీళ్ళలోతడుస్తున్నప్పుడు, మునిగిపోతున్నప్పుడు గత వర్తమానాల మధ్య ఎడతెగని సంభాషణ అయిన చరిత్రకు అర్థం ఏమిటి? చారిత్రక నవల రూపంతో వచ్చిన కళారూపపు వాస్తవ సారం రక్తాశ్రు రసాయనం కాదా?

          వసుధేంద్ర కొత్త నవల తేజో తుంగభద్ర రక్తాశ్రు రసాయనం రంగరించిన అద్భుతమైన కళారూపం. ఈ నవలకు చరిత్ర ఒక సాకు మాత్రమే. రచయిత కాలూన డానికి, పాత్రలకు స్థలకాలాల నేపథ్యం ఇవ్వడానికి ఒకానొక ఆధారం మాత్రమే. చెప్పదల చిందీ, చెప్పిందీ, చెప్పీ చెప్పక వదిలిన దానిలోంచి తొంగి చూస్తున్నదీ విష విద్వేష బీభత్స వర్తమానం మీద పదునైన వ్యాఖ్యానమే.

          నవలకు తప్పనిసరిగా స్థలకాలాలు ఉండాలి గనుక పదిహేనో శతాబ్ది చివరి దశాబ్దం, పదహారో శతాబ్ది మొదటి రెండు దశాబ్దాల నాటి పోర్చుగల్, లిస్బన్, విజయనగరం, బీజాపూర్, గోవా రాజ్యాలు కనబడతాయి. ఆ నాటి మనుషులూ వారి కట్టు బాట్లూ నమ్మకాలూ కనబడతాయి. కాని వాటన్నిటినీ యథార్థ జీవన దృశ్యాలుగా కాక, కాల్పనిక ప్రతీకలుగా చూస్తే అవి మొన్నటివీ కావచ్చు, నిన్నటివీ కావచ్చు, మన సమాజం గుణాత్మకంగా మారకపోతే రేపటివి కూడా కావచ్చు. గతమూ వర్తమానమూ భవిష్యత్తూ మనం కల్పించిన కాలపు కొలమానాలు మాత్రమే కాని వేరు వేరు కాదు, సామాజిక జీవితం ఒక నిరంతర ధార. నవలలో రెండు నదుల రూపంలో ప్రవహించినది అదే.

          నవల అంటే మనుషులూ మానవ సంబంధాలూ గనుక, ఇందులో అవి ఉన్నాయి గనుక ఇది మానవ సంబంధాల నవల అనిపించవచ్చు. అది మానవ జీవితంలోని సుఖ దుఃఖాలను, ఆనంద విషాదాలను చిత్రించి ఉండవచ్చు. రెండు మూడు ప్రేమ ఇతి వృత్తాలు ఉండవచ్చు, అంతకన్న ఎక్కువ విరహగాథలూ ఉండవచ్చు.

          యుద్ధాలూ మత మారణకాండలూ రాజ్య హింసలూ సతీ సహగమనాలూ వందలాది వేలాది మనుషుల అకాల అసహజ మరణాలూ ఉండవచ్చు. పైకి చూడడానికి అవి చదువరికి తెలియని ఎప్పుడో పూర్వకాలపు, ఎక్కడో దూరదేశపు అభూత కాల్పనిక గాథలు అనిపించవచ్చు. ఆ కల్పనను విశ్వసనీయం చేయడానికే దానికి ఒక అట్లాంటిక్ సముద్రతీరపు నదినీ, నగరాన్నీ, ఒక దక్షిణ భారతదేశపు నదినీ, ఒక అరేబియన్ సముద్ర తీరపు నగరాన్నీ స్థలాలుగా చూపించి ఉండవచ్చు.

          ఆ కాలం గడిచి వచ్చి ఐదు శతాబ్దాలు దాటినప్పటికీ, ఆయా స్థలాలలో ఎంత భిన్నత్వం ఉన్నప్పటికీ, ఎక్కడో పోర్చుగల్ లోని తేజో నదీ, విజయనగర రాజ్యంలోని తుంగభద్రా నదీ వేరు వేరు కావు, కన్నీటి ప్రవాహాలు ఒకటే. ఎక్కడో లిస్బన్ నగరమూ మరెక్కడో గోవా నగరమూ వేరు వేరు కావు, నెత్తుటి ప్రవాహాలు ఒకటే.

***

          నాలుగేళ్ళ కింద మొదటిసారి కలిసి, మాటలు విన్నప్పటి నుంచీ, అద్భుతమైన కథ ‘ఎర్ర చిలుకలు’ చదివినప్పటి నుంచీ కన్నడ రచయిత వసుధేంద్ర అభిమాని నయ్యాను. వైవిధ్యభరితమైన, సాధారణత్వానికి భిన్నమైన, ధిక్కారయుతమైన వ్యక్తిగత జీవితమూ ఆ అభిమానాన్ని మరింత పెంచింది. అందువల్ల ఆయన కొత్త నవల వెలువడిన కొద్దిరోజుల్లోనే చదవకుండా ఉండడం అసాధ్యం. 2019లో కన్నడంలో వెలువడి, 2022 అక్టోబర్ లో ఇంగ్లిష్ అనువాదం వెలువడేనాటికి కన్నడంలో పది పదకొండు ముద్రణలు పొందిన ఆయన కొత్త నవల ‘తేజో తుంగభద్ర’ ను రంగనాథ రామచంద్ర రావు నేరుగా కన్నడం నుంచి తెలుగు చేశారు. ఛాయ ప్రచురణగా డిసెంబర్ లో వెలువడింది.

          నవలకు ఉపశీర్షికగా ‘1492-1518 లిస్బన్ – విజయనగరం – గోవా’ అని ఉండడం వల్ల, నవలలోని కథ ఆ కాలానిది కావడం వల్ల దీన్ని చారిత్రక నవల అంటున్నాం గాని, ఎన్నో వర్తమాన సమకాలీన ప్రాసంగిక అంశాలూ ఛాయలూ ఉన్న ఈ నవల ఒక అర్థంలో రాజకీయ నవల. మానవానుభవాన్ని ఉన్నతీకరించే నవల.

          ఆ ఇరవై మూడు సంవత్సరాల నేపథ్యంలో అటు పోర్చుగల్ లోని లిస్బన్ నగరం నుంచి ఇటు విజయనగర రాజ్యానికీ, పోర్చుగీసులు ఆక్రమించుకుని పాలన నెలకొల్పిన గోవాకూ సముద్రం మీదా, భూమి మీద అటూ ఇటూ తిరుగుతుందీ నవల. శీర్షికకు తగి నట్టుగా తేజో నదికీ, తుంగభద్ర నదికీ, మాండొవి నదికీ సంబంధించిన గాథలూ ఇందులో మిళితమయ్యాయి. ఒక పోర్చుగీసు క్రైస్తవ యువకుడికీ, మత వివక్షతో పోర్చుగల్ కు తరలి వచ్చిన యూదు యువతికీ ప్రేమ కథగా మొదలై, విజయనగరం పొరుగున ఉన్న తెంబకపురంలో మరొక ప్రేమ కథను కలుపుకుని, అనేక మలుపులు తిరిగి కాసేపు తేజో కన్నీళ్ళూ, కాసేపు తుంగభద్ర కన్నీళ్ళూ ప్రవహించి, మధ్యలో లిస్బన్ లో, తెంబక పురంలో, విజయనగరంలో, గోవాలో, ఇరుగుపొరుగు రాజ్యాలలో నెత్తురుటేర్లనూ చూపి, చివరికి తేజో-తుంగభద్ర కన్నీళ్ళ దగ్గర నవల ఆగిపోతుంది. మొదట పరిచయమైన యూరపియన్ యువ ప్రేమికులు విడిపోయి, ఆ యువకుడు భారతదేశం చేరి, చావు అంచులదాకా చేరి, అహ్మద్ ఖాన్ అయి, అమ్మదకణ్ణ అయి, ఈలోగా తుంగభద్రా తీరం లోని మరొక జంటలోని యువకుడు ఆ నాటి రాచరికపు ఆచారాలలో చిత్రహింసల హత్యకు గురై, అనూహ్యమైన, నాటకీయమైన పరిణామాలలో పోర్చుగీసు యువకుడూ కన్నడ యువతీ స్నేహితులైన దగ్గర నవల ముగుస్తుంది.

          అలా చూస్తే ప్రధాన పాత్రల సంఖ్య పదికి మించదు, వేలాది మంది తిరుగాడు తున్న ధ్వనులూ దృశ్యాలూ, ఆ మనుషుల మానవీయ, హింసామయ స్పర్శలూ చదువరికి అనుభూతమవుతూనే ఉంటాయి గాని అవి చాలా వరకు అనామక, అజ్ఞాత పాత్రలే. ఎక్కువలో ఎక్కువ తెలియని ఏ తీవ్రశక్తులో నడిపిస్తే నడిచిన యుగస్వభావపు పావులు కావచ్చు. కాని నవల ఘనత ఏమంటే, ‘మనిషికి సంబంధించినదేదీ నాకు అస్పృశ్యం కాదు’ అని ఒక తత్వవేత్త అన్నట్టు నాలుగువందల నలభై పేజీల ఈ నవల స్పృశించని మానవజీవిత శకలం, మానవ సంబంధాల ఛాయ ఏదీ లేదు.

          ప్రేమ, విరహం, కోపం, సంతోషం, ఆదరణ, దయ, కరుణ, ప్రవాసం, విభిన్న మతాచారాలు, మతోన్మాదం, మత దుర్మార్గం, స్త్రీ పురుష సంబంధాలు, వ్యభిచారం, వేశ్యావృత్తి, రాచరికం, వీరత్వం పేరుతో సాగే హింసా ప్రవృత్తి, సతీ సహగమనం,శిల్పాలు చెక్కే విద్య, లిస్బన్ లో ప్లేగు, నౌకాయానం, సముద్రం దాటడం మీద ఆంక్షలు, నౌకా వ్యాపారం, వలసలు, మిరియాల కోసం అన్వేషణ, మధ్యయుగాల అన్వేషకుల ప్రయోగా లు, రాజుల అత్యాశలు, పర్షియన్ గుర్రాల లావాదేవీలు, యుద్ధాలు, ఊచకోతలు, ముద్రణా యంత్రం ప్రవేశం, బైబిల్ ముద్రణ, ఆఫ్రికన్ బానిసలు, యూదుల, ముస్లింల సున్తీ ఆచారం, ప్లేగు, స్కర్వీ, సుఖవ్యాధులు, ఒక మతం పట్ల మరొక మతం వారి అసహనం, యూదు, క్రైస్తవ, శైవ, వైష్ణవ, ముస్లిం మతస్తుల ఘర్షణలు, రాజ్య నిరంకు శత్వం, అంతఃపుర బీభత్సాలు, భారత సమాజంలోకి కాగితం, మిరపకాయల ప్రవేశం, భిన్న ప్రదేశాల వంటలు, ఆహారపుటలవాట్లు, కుల సమస్య, కుల వివక్ష, అస్పృశ్యత, వర్ణ ధర్మాలు, దైవ భావనలు… ఆ జీవన వైశాల్యానికీ, ఆ పరిశోధనా విస్తృతికీ, ఆ చిత్రణా నైపుణ్యానికీ అబ్బురపడకుండా ఉండలేం.    

          ఆ సువిశాల జీవితంలో ఒకటి రెండు అంశాలు మారాయేమో, లేదా రూపాలు మార్చుకుని కొనసాగుతున్నాయేమో. కాని మొత్తంగా అదే సారభూతమైన జీవితం అనుభ విస్తున్న మనకు ఇది చారిత్రక నవలా, సమకాలీన వ్యాఖ్యానమా అని అనుమానం కలుగు తుంది. ఒక రకంగా చెప్పాలంటే, ఇది పదహారో శతాబ్ది కథ కాదు. ఫక్తు అత్యాధునిక,ఇరవై ఒకటో శతాబ్ది నిత్య జీవితానుభవం. పోర్చుగల్ రాజు మాన్యుయెల్, విజయనగర రాజు శ్రీ కృష్ణదేవరాయలు, బీజాపూర్ రాజు ఆదిల్ షా, పోర్చుగీసు వ్యాపారులు, అన్వేషకులు వాస్కోడిగామా, అల్బకుర్క్, వారితో కలిసి పనిచేసిన తిమోజీ వంటి చారిత్రక వ్యక్తులు నవలలో పాత్రలు కావడం వల్ల, లిస్బన్ లో 1506లో నాలుగు వేల మంది యూదుల మారణహోమం, 1510లో గోవాలో ఆరు వేల మంది ముస్లింలను బలిగొన్న మారణ హోమం వంటి ఘటనల వల్ల ఇది ఒకానొక నిర్దిష్ట కాలపు నవల అనవలసిందే గాని, ఆ పాత్రలూ ఇతర పాత్రలూ అనుభవించిన, వ్యక్తీకరించిన ఉద్వేగాలన్నీ అట్టడుగున అంతమందిమీ మానవులమే అని చూపుతాయి. ఆ నాటి వ్యాపార, యుద్ధ కాంక్షలు ఇవాళ్టి వ్యాపార, యుద్ధ కాంక్షలను గుర్తు తెస్తాయి. లిస్బన్ లో, గోవాలో మతం పేరు మీద జరిగిన ఊచకోతలు చదువుతున్నప్పుడు నా వరకు నాకు గుజరాత్ మారణకాండ నివేదికలు చదువుతున్నప్పుడు కలిగిన దుఃఖమే, ఆగ్రహమే కలిగాయి.

          నవలలో ఎన్నెన్నో ఎత్తిచూపవలసిన అద్భుతమైన, కవితాత్మకమైన, ఆలోచనాత్మ కమైన వాక్యాలు, పరిచ్ఛేదాలు ఉన్నాయి గాని మచ్చుకు కొన్ని ఉటంకించి ముగిస్తాను.

          “ఇద్దరు మల్లులు తుంగమ్మ ఒడిలో అంత అందంగా ఈత కొడతారు. మనం ఫలానా జాతి, ఫలానా ధర్మమని పెట్టుకునే పొడుగు నామం, అడ్డనామం, కుంకుమ, ముద్రలు, గంధం, అక్షతలు అన్నిటినీ తుంగమ్మ తన వందలాది చేతులతో తుడిచి వేస్తుంది. వేసుకున్న జంధ్యాన్ని, శివదారాన్ని అన్నిటినీ కొట్టుకుపోయేలా చేస్తుంది. ప్రతిరోజూ నదిలో స్నానం చేసిన వెంటనే మనమంతా ఒకటే అని బుద్ధి చెబుతుంది. అయితే మనిషి గుణం కుక్క తోక లాంటిది. నది నుంచి బయటికి వచ్చిన వెంటనే కొత్తగా నామం, ముద్రలు, విభూతి, కుంకుమ, అక్షతలు పెట్టుకుని, జంధ్యం, శివదారం వేసుకు ని అల్పగుణాన్ని ప్రదర్శిస్తాడు. నేను ఎక్కువ, నీవు తక్కువ అంటూ కొట్లాట ప్రారంభి స్తాడు. అయితే ఎవరికీ తుంగమ్మ కలవరం అర్థం కాదు.”

          “కవి అయినవాడు పరంపరను బద్దలు కొట్టాలి. పరంపరతో పాటు కొట్టుకుని పోకూడదు. పరంపరతో సర్దుకుని పోవటం రాజకీయమే తప్ప కవి ధర్మం కాదు.”

          “రేపటి బతుకు కోసం ఆశ పడేవాడు నావికుడు కాలేడు…రేపటి రోజున ఏదో దొరుకు తుందనే కల ఉండాలి. అయితే అవన్నీ క్షణమాత్రంలో సాగరం మధ్యన కోల్పోవచ్చనే వర్తమానంలో బతకాలి.”

          “ద్వేషానికి ఏ సరిహద్దులు ఉండవు. ఈ రోజు యూదులను ద్వేషించినవారు రేపు మరో మతం వారిని ద్వేషించటం ప్రారంభిస్తారు. ద్వేషించటానికి మనస్సు ఏవో సాకులు వెతుకుతూ పోతుంది. అందరినీ చంపిన తర్వాత ద్వేషించటానికి బయటివారు దొరకక పోతే తమవారిలోనే ద్వేషపు నిప్పు వ్యాపిస్తుంది. మతద్వేషం అనే దావానలం అందరినీ, అన్నిటినీ మింగి నిశ్శేషం చేయకుండా సంతృప్తి చెందదు.”

          “మహారాజు గారు తమ ఆముక్తమాల్యదలోనే చెప్పారు కదా, తీవ్రమైన శిక్షలు లేకుండా సమాజంలో శాంతి నెలకొనదని…’ అని ఒక పండితుడు వ్యాఖ్యానించాడు. ‘సమస్య తీవ్రమైన శిక్షది కాదు స్వామి, తీవ్రమైన న్యాయానిది… శిక్ష ఉన్నంత తీవ్రంగా మనుషులైనవారు న్యాయాన్ని ఇవ్వగలరా’ అని మరొకరు సవాలు చేశారు.”

          “తాము బయటివారు, ఈ ముసల్మానులు బయటివారు. అయితే మాతో చేతులు కలిపి, ఈ ముసల్మానులను అణచివేసే వారి రాజు ఉత్సాహం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటి?…శ్రీకృష్ణదేవరాయలు…ఈ విధంగా పోర్చుగీసుల సహాయం కోసం ఎందుకు ఆరాటపడుతున్నాడు?”

          “మా మహారాజు ఇంకేం చేస్తాడు? ఆ పర్షియా గుర్రాలు దక్కకపోతే యుద్ధాలు గెలవటం మాకు అసాధ్యమని ఆయనకు తెలుసు. మా మహారాజుకు ప్రతి యుద్ధాన్ని గెలవాల్సిందేననే ఆలోచన. కొత్త రాజులకు కొత్త ఉత్సాహాలు ఉండటం సహజమే కదా? మా దేశపు గుర్రాలు యుద్ధానికి యోగ్యమైనవి కావు…అందువల్ల మాకు ఈ పర్షియా గుర్రా లు అత్యధికంగా కావాలి. ప్రస్తుతం అవన్నీ ఈ ముస్లిం వ్యాపారుల పట్టులో ఉన్నాయి. తమ మతానికి చెందిన బీజాపూరు సుల్తానుకు అమ్ముతున్నారే తప్ప మాకు అమ్మడానికి సంకోచిస్తున్నారు. అమ్మినా ఒకటికి పదిరెట్లు సొమ్ము అడుగుతున్నారు. మా కోశాగారం లోని సొమ్మంతా విదేశాల నుంచి గుర్రాలను తెప్పించటానికి ఖర్చవుతోంది. ఆ ముస్లిము లమీద నియంత్రణ సాధిస్తే, పర్షియా గుర్రాలు మాకు దక్కుతాయనే ఆశ మా మహారాజు గారిది.”

          “ఏదో పర్షియా దేశాలలో పెరిగే గుర్రాలు ఈ భారతదేశ రాజకీయాలను నిర్ణయిస్తు న్నాయని అర్థమై నవ్వొచ్చింది. మనుషులకన్నా గుర్రాలు ముఖ్యమయ్యాయి కదా అని ఆశ్చర్యం వేసింది. విచిత్రమనిపించింది. గుర్రాలు పెరగటం ఏదో దేశంలో, వాటిని అమ్మటానికి మరొక దేశానికి చెందిన మేము, రెట్టింపు ధర చెల్లించి కొనటానికి ఈ దేశం చక్రవర్తి!”

          “ధర్మాన్ని లేదా మతాన్ని నియంత్రించడం అన్ని నియంత్రణలకన్నా గొప్పది.”

          “ప్రస్తుతం మా సామ్రాజ్యంలో ఉన్నటు వంటి ధర్మపు స్వరం వెనుకటికన్నా ఎక్కువ అధికారాన్ని కలిగి ఉంది. అది మహారాజులకే ఉత్తర్వులు ఇస్తుంది. ప్రజలను మతానికి వ్యతిరేకంగా ఒప్పించటం మా రాజుకు కష్టం. అందువల్లనే గుర్రాల కోసం మేము పరదేశీయులను ఆశ్రయించక వేరే దారి లేదు.”

          “ఈ పర్షియా గుర్రాల సహవాసంతో మనం మనుషులమంతా గాడిదలు అయిపో యాం కదన్నా.”

          “సనాతన ధర్మంలో  బహిష్కరించటానికి ఉన్నంత ఉత్సాహం మళ్ళీ లోపలి ప్రవేశానికి లేదు.”

          “మాండోవి నదిలో చిక్కుకునిపోయి, ఆకలితో ప్రాణాలు కోల్పోయే పరిస్థితిలో ఉన్నప్పుడు మతమన్నది ఎంత అల్పమైన విషయమో నాకు అర్థం కాసాగింది. పొట్ట నిండినప్పుడు మతాన్ని గురించి మనం మాట్లాడే మాటలకూ, ప్రాణాలు పోయేటప్పుడు మనం మాట్లాడే మాటలకూ చాలా వ్యత్యాసం ఉంటుంది.”

          ఇటు వంటి ఎన్నెన్నో ఆలోచనాస్ఫోరకమైన సన్నివేశాలూ సంభాషణలూ నన్ను ఈ నవలను మనకాలపు అద్భుత నవలగా గుర్తించేలా చేశాయి.

          వసుధేంద్రకూ, మంచి తెలుగులో అద్భుతంగా అనువదించిన (పంటికింది రాయిలా ‘మరియు’లు మినహాయిస్తే!) రంగనాథ రామచంద్రరావు గారికీ, ప్రచురించిన చాయా రిసోర్సెస్ సెంటర్ మోహన్ బాబు గారికీ హృదయపూర్వక ధన్యవాదాలు.

*****
Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.