వీర మంగై (సాహస నారీ) “రాణీ వేలు నాచ్చియార్”

-యామిజాల శర్వాణి

          1790 వరకు శివగంగ సంస్థానాన్ని పరిపాలించిన రాణి వేలు నాచ్చియార్. ఈవిడ
భారత దేశాన్ని ఏలుతున్న ఆ నాటి ఈస్ట్ ఇండియా కంపెనీ పై యుద్ధం చేసిన మొదటి
రాణిగా ప్రసిద్ధి కెక్కింది. తమిళులు ఈవిడను “వీర మంగై ( సాహసనారీ)” అంటారు. ఈవిడ హైదర్ అలీ సైన్యం, భూస్వాములు, మరుత్తు సోదరులు దళిత కమాండర్ల అండ తో మరియు తాండవరాయన్ తో కలిసి బ్రిటిష్ వారితో యుద్ధం చేసింది అంతే కాకుండా చరిత్రలో తొలి మానవ బాంబును ప్రయోగించిన ఘనత కూడ వేలు నాచ్చియార్ దే కానీ, మన చరిత్ర అంతా బ్రిటిష్ వాళ్ళకు అనుకూలంగా లిఖించబడింది కాబట్టి వాళ్ళను ఓడించిన వేలు నాచ్చియార్ పేరును చరిత్రలో పెద్దగా ప్రస్తావించలేదు. ప్రజలకు ఝాన్సీ లక్ష్మి బాయి తెలిసినట్లుగా రాణి వేలు నాచ్చియార్ తెలియదు. ఈ మధ్యే ఆమె జయంతి సందర్భంగా ప్రధాని నివాళులర్పించడంతో ఆవిడ గురించి ప్రజలకు తెలిసే అవకాశం ఏర్పడింది.

          ప్రధాని ఆమెను నారీ శక్తికి సంకేతం అని పొగిడారు ఈవిడ ఝాన్సీలక్ష్మిభాయికి కంటే 60 ఏళ్ళకు పూర్వం బ్రిటిష్ వారితో పోరాడి విజయం సాధించిన వీర వనిత అయినా బ్రిటిష్ వారు ఆవిడ పేరు పైకి రాకుండా చరిత్రను వక్రీకరించి రాసుకున్నారు.

          రామనాధ రాజ్యానికి రాజైన చెల్లముత్తు విజయ రాగుణత సేతుపతి రాణీ సకండి
ముత్తతాయిల ఏకైక కుమార్తె యువరాణి వేలు నాచ్చియార్ 1730 జనవరి 3 న జన్మించింది. ఒక్కగానొక్క కూతురు అవటంతో తల్లిదండ్రులు ఆవిడకు మగ పిల్లవాడి లాగ అన్ని విద్యలు నేర్పించారు. మాతృభాష తమిళంతో పాటు ఇంగ్లీష్ ప్రెంచ్ ఉర్దూ భాషలు కూడా నేర్చుకుంది. 16 ఏళ్ళ వయస్సులో అంటే 1746 లో శివగంగ రాజ్య  యువరాజు వడుగనాధ దేవర్ తో వివాహం అయి శివగంగ రాజ్యానికి కోడలుగా వెళ్ళింది. వారికి వెల్లచ్చి అనే కూతురు పుట్టింది.

          రామనాధ రాజ్యం, శివగంగ రాజ్యం హాయిగా తమ ప్రాభవాన్ని కొనసాగిస్తున్న
సమయంలో బ్రిటిష్ వారు దక్షిణాదిలో విస్తరణ కోసం అప్పటికే మధురై నాయక రాజ్యాన్ని ఆక్రమించుకున్న ఆర్కాట్ నవాబ్ తో చేతులు కలిపి ఈ రెండు రాజ్యాలను కప్పము కట్టమన్నారు. కానీ, ఈ రెండు రాజ్యాలు తిరస్కరించడంతో ఆర్కాట్ నవాబ్ ద్వారా ఈ రెండు రాజ్యాలను హస్తగతం చేసుకోవాలని బ్రిటిష్ వారు పన్నాగం పన్నారు

          1772 సంవత్సరంలో దైవ దర్శనానికి శివగంగ ఆలయానికి వచ్చిన నిరాయుధుడైన వడుగ నాద దేవర్ పైన బ్రిటిష్ వారు దాడి చేసి చంపేశారు. ఆ దాడిలో భాగంగా ఆలయాన్ని దోచుకొని 50,000 వేల బంగారు నాణేలు ఎత్తుకెళ్ళారు. ప్రమాదాన్ని గుర్తించిన నాచ్చియార్ తన నమ్మకస్తులతో, కూతురును తీసుకొని దిండిగల్ సమీపాన గల విరుపాక్షకి వెళ్ళిపోయింది. అక్కడ పాలయకార్ కొప్పల నాయకర్ ఆశ్రయము తీసుకుని గోపాల నాయకర్ సహాయముతో సైన్యాన్ని సమీకరించుకుంది. బ్రిటిష్ ఆమె ఆచూకీ కోసం నాచ్చియార్ నమ్మిన బంటు అయిన ఉదయాళ్ ను హింసించారు కానీ ఆచూకీ చెప్పక పోవడంతో అతన్ని చంపేశారు. ఈ వార్త విన్న వేలు నాచ్చియార్ఎలాగైనా బ్రిటిష్ వారిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి చేజిక్కించుకుంటానని శపథం చేసింది.

          అప్పటి నుండి 8 ఏళ్ళు అజ్ఞాతవాసము గడుపుతూ నమ్మిన బంట్లు చేరదీసి బ్రిటిష్
వారిని ఓడించటానికి ప్రత్యేకంగా ఒక మహిళా దళాన్ని ఏర్పాటు చేసి తన నమ్మినబంటు ఉదయాళ్ పేరు పెట్టింది. ఆ దళానికి కుయిలీ అనే మహిళను నాయకురాలిగా చేసింది. ఆమె తన సైన్యాన్ని నిర్మించుకోవటానికి మైసూరు నవాబ్ హైదర్ అలీ మొదట అంగీకరించక పోయిన తరువాత ఆర్థిక సహాయం చేశాడు 5000 మందితో పదాతిదళం, అశ్వదళం మహిళా దళము తయారు చేసింది.

          భూస్వాములు, వ్యాపారస్తులు, మరుదు సోదరులు సహకారం అందించారు. అయిన ప్పటికీ బ్రిటిష్ వారిని ఎదుర్కోవడానికి సరిపడా మందు గుండు లేదు ఆ సమయంలో వచ్చిన ఆలోచనే మానవ బాంబు. విజయదశమి రోజున శివగంగ రాజ్యములో కోట ద్వారాలు తెరిచి సామాన్య జనాన్ని కోటలోకి అనుమతిస్తారు. నాచ్చియార్ ఈ అవకాశాన్ని వాడుకుంది ఎలాగంటే నాచ్చియార్ మహిళా దళము సభ్యులు ఆయుధాలను చీర కొంగుల్లో దాచుకొని సాధారణ మహిళలు లాగ కోటలోకి ప్రవేశించి కుయిలీ ఆదేశము అందుకున్న వెంటనే బ్రిటిష్ సైనికుల పై దాడి చేసి వాళ్ళ ఆయుధాలు తీసుకొనే లోపు ఒక మానవ బాంబు వంటికి నెయ్యి పూసుకుని ఆయుధాగారంలోకి వెళ్ళి వంటికి నిప్పు
అంటించుకుంది ఇంకేముంది ఆ ఆయుధాగారంలోని మందు గుండు సామగ్రి అంతా
పేలిపోయింది. ఆ విధంగా యుద్ధం చేయడానికి ఏమి మందు గుండు సామాగ్రి మిగల
లేదు ఆ సమయంలో నాచ్చియార్ తన మిగిలిన దళాలతో బ్రిటిష్ వారి పై దాడి చేసి
వారిని చీల్చి చెండాడి బ్రిటిష్ వారిని వెళ్ళగొట్టి తన సామ్రాజ్యాన్ని తిరిగి దక్కించుకుంది.

          బ్రిటిష్ వాళ్ళు ఈ అవమానకరమైన ఓటమిని చరిత్ర పుటల్లోకి ఎక్కకుండాజాగ్రత్త పడ్డారు. ఆ తర్వాత 1790 లో తన కూతురు వెల్లచికి అధికారం అప్పగించి మరుదు సోదరుల సహకారంతో రాజ్యాన్ని పాలించి 66 ఏళ్ళ వయస్సులో అంటే 1796 లో కన్ను మూసింది, ఆ విధంగా ఝాన్సీ లక్ష్మి బాయ్ కన్నా ముందు బ్రిటిష్ వారిని ఎదుర్కొని మానవ బాంబు ప్రయోగం ద్వారా బ్రిటిష్ వారిని ఓడించి తన రాజ్యాన్ని తిరిగి దక్కించు కున్న వీరనారి రాణీ వేలు నాచ్చియర్ ప్రభుత్వం ఆవిడ జ్ఞాపకార్ధము పోస్టల్ స్టాంప్ విడుదల చేసి మరుగున పడ్డ ఆవిడ వీర గాధను వెలుగులోకి తెచ్చింది. వేలు నాచ్చియార్ భారత దేశపు జోన్ ఆఫ్ ఆర్క్ అని మరొక చరిత్రకారుడు వెంకటం  పేర్కొన్నా డు. బ్రిటిష్ మరియు ఆర్కాట్ నవాబుతో పోరాడటంలో ఆమె ధైర్యసాహసాలకు “వీరమంగై” లేదా “ధైర్యవంతురాలు” అనే బిరుదు పొందింది. ఆమె సైనిక విజయాలతో పాటు, రాణి వేలు నాచియార్ తన ప్రజల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి ఆమె చేసిన కృషికి కూడా గుర్తుండిపోయింది. ఆమె మరుదు బ్రదర్స్‌కు దేశాన్ని పరిపాలించే అధికారాలను మంజూరు చేసింది మరియు ప్రజల సంక్షేమానికి వారిని బాధ్యులను చేసింది. ఆమె సతి ఆచారాన్ని రద్దు చేసింది, వితంతువులు తమ భర్త యొక్క అంత్య క్రియల చితి పై తమను తాము కాల్చుకునే ఆచారం మరియు అనేక సామాజిక సంస్కర ణలను అమలు చేసింది. బ్రిటిష్ వలస వాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రజల సంక్షేమం కోసం పనిచేసిన యోధ రాణిగా రాణి వేలు నాచియార్ వారసత్వం  తరతరా లకు స్ఫూర్తినిస్తుంది

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.