విజ్ఞానశాస్త్రంలో వనితలు-9

తారా పథంలోకి దూసుకెళ్ళిన ఖగోళ శాస్త్రవేత్త- బియెట్రిస్హిల్ టిన్స్‌లే (1941-1981)

– బ్రిస్బేన్ శారద

          నేను ఈ శీర్షికన మహిళా శాస్త్రవేత్తల గురించి వ్రాయడం మొదలు పెట్టినప్పుడు ప్రపంచంలోని అన్ని ఖండాల నుంచి కనీసం ఒక్కొక్కరినైనా పరిచయం చేయాలని అనుకున్నాను. ఎందుకంటే ప్రపంచంలోని ఏ మూలనైనా, వివక్ష స్వరూపాలు ఎటువంటివైనా, దానికి ఎదురుతిరిగి అనుకున్నది సాధించేవారి వ్యక్తిత్వాలూ, తీరు తెన్నులూ ఒకేలాగుంటవి.

          ఆ క్రమంలో ఐరోపా, అమెరికా, భారత్, ఆస్ట్రేలియా ముగించి న్యూజీలాండ్ వైపు దృష్టి సారించాను. ఆస్ట్రేలియా పక్కనే వుండి, చిన్న తమ్ముడిలాగనిపించే న్యూజీలాండ్ చాలా చిన్న దేశం. ఎక్కువగా “మా-ఒరీ” తెగలూ, యూరోపు నించి వలస వచ్చిన శ్వేత జాతీయులతో వుండే దేశం. 1907లో డొమీనియన్ స్థితి రాగా పూర్తి స్వాతంత్య్రం 1947లో సంపాదించుకుంది. అంత చిన్న న్యూజీలాండ్ చాలా మంది గొప్ప శాస్త్రజ్ఞులకీ మేధావు లకీ పుట్టిల్లు. జె.జె.థాంసన్ ప్రతిపాదించిన అణువు యొక్క స్వరూపాన్ని సవరించిన ఎర్నెస్ట్ రూథర్‌ఫర్డ్ న్యూజీలాండ్ దేశస్థుడే! అక్కడ కొన్నేళ్ళ క్రితం వరకూ పరిశోధన అంటే ఎక్కువగా వృక్షశాస్త్రమూ, జంతు శాస్త్రమూ మాత్రమే అధ్యయనం చేసేవారు.

          మనమంతా ఎప్పుడో ఒకప్పుడు రాత్రి పూట ఆకాశంలోకి నక్షత్రాల వంక చూస్తూ నిద్రలోకి జారుకొనేవుంటాం. కొన్నిసార్లు నిద్ర కూడా పట్టనివ్వని ఆ నక్షత్రాల అందానికి ముగ్ధులమైపోయి, ఆ ఆకాశానికవతల ఏముందో, నక్షత్రాలు ఎన్నేళ్ళనించి వున్నాయో ననీ, నక్షత్రాల మధ్య ఏముంటుందోననీ ఆలోచనల్లో మునిగిపోయిన అనుభవం లేని వాళ్ళెవరైనా వున్నారంటే ఆశ్చర్యమే! అలా ఆకాశం వంక కళ్ళార్పకుండా చూసే వారిలో చాలా మంది పెద్దయ్యాక ఖగోళ శాస్త్రం చదవాలని ప్రతిజ్ఞలనీ చేసుకునే వారూ వున్నారు. ఐతే చాలా కొద్ది మంది మాత్రం అలా ఖగోళ శాస్త్రం చదివి అంతరిక్ష రహస్యాలని కనిపెట్టే వారవుతారు.

          అలాటి అరుదైన శాస్త్రజ్ఞురాలు న్యూజీలండ్‌కి చెందిన బియేట్రిస్హిల్టిన్స్‌లే. ఖగోళ శాస్త్రంలో బియెట్రిస్ సాధించిన విజయాలూ, ప్రతిపాదించిన సిద్ధాంతాలూ తిరుగు లేనివి. న్యూజీలాండ్ పాత్రికేయులు క్రిస్టీన్కాట్లీ బియెట్రిస్ గురించి వ్రాస్తూ,”నక్షత్రాల లో, గేలక్సీలలో, ఆఖరికి విశ్వాంతరాలలో దాక్కున్న రహస్యాల  తలుపులు తెరిచిన శాస్త్రవేత్త.” అని వర్ణించారు.

          కానీ, బియెట్రిస్ బ్రతుకంతా వైజ్ఞానిక శాస్త్రం మీద ఆమెకున్న తపనకూ, వ్యక్తిగత జీవితం ఆమె ముందుంచిన సవాళ్ళకూ మధ్య యుద్ధంగానే గడిచిపోయింది. జేన్, ఎడ్వర్డ్ హిల్ దంపతులకు ఇంగ్లండులోని చెస్టర్ నగరంలో మూడో సంతానంగా 27 జనవరి 1941 న బియెట్రిస్ జన్మించారు. రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఆ కుటుంబం ఇంగ్లండు వదిలి న్యూజీలాండ్ వలస వెళ్ళింది. న్యూజీలాండ్‌లో వాళ్ళు క్రైస్ట్‌చర్చ్ నగరంలో, ఆ తరవాత న్యూ ప్లైమత్ నగరంలో నివసించారు. బియెట్రిస్ విద్యాభ్యాసం క్రైస్ట్‌చర్చ్ లో జరిగింది.

          క్రైస్ట్‌ చర్చిలో చదువుకునే రోజుల్లో, ఇరవై యేళ్ళ వయసులో బియెట్రిస్ తన సహాధ్యాయి బ్రయన్టిన్స్‌లేని వివాహమాడారు. 1963 లో బియెట్రిస్, బ్రయన్ ఇద్దరూ భౌతిక శాస్త్రంలో మాస్టర్స్ ముగించి ఉద్యోగం కోసం అమెరికా చేరుకున్నారు. అక్కడ టెక్సస్ నగరంలో యూనివర్సిటీలో బ్రయన్‌కి అధ్యాపకుడిగా ఉద్యోగం దొరికింది. కానీ, యూనివర్సిటీ యాజమాన్యం బియెట్రిస్కి ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. అక్కడ బియెట్రిస్ కొంచెం కూడా ఇమడలేక పోయింది. పైగా, అక్కడ ఉద్యోగస్తుల భార్యలు ఏర్పాటు చేయాల్సిన టీ-పార్టీని తాను ఏర్పాటు చేయనని తెగేసి చెప్పారు బియెట్రిస్. దాంతో ఆమెకి అక్కడ ఉద్యోగావకాశాలు మొత్తానికే పోయాయి.

          విధిలేక బియెట్రిస్ 1964 లో అదే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్‌లో ఖగోళ శాస్త్రంలో పీహెచ్‌డీ కై నమోదు చేసుకున్నారు. 1966 కల్లా ఆమె థీసిస్ ముగించారు. తన పరిశోధన లో భాగంగా ఆమె కనిపెట్టిన ఖగోళ రహస్యాలూ, కట్టిన లెక్కలూ అప్పటి వరకూ వున్న ఖగోళ శాస్త్రాన్ని ధిక్కరించాయి. ఆమె పేరు ప్రపంచంలోని అత్యుత్తమమైన శాస్త్రజ్ఞుల సరసన చేరింది. అయితే, యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ అధికారులు మాత్రం ఆమెకి ఉద్యోగం ఇవ్వ నిరాకరించారు. ఆ రోజుల్లో తననీ, తన పరిశోధననీ ఏ మాత్రం పట్టించు కోని యూనివర్సిటీ అధికారుల ధోరణికి నిరాశ చెందిన బియెట్రిస్ తండ్రికి ఉత్తరంలో వ్రాసుకున్నారు,
“…ఈ డాలస్ నగరంలోని యూనివర్సిటీ అధికారులు నన్ను వీలైనంతగా అథఃపాతాళా నికి తొక్కేస్తున్నారు…” అని.

          వాళ్ళ వివక్షాపూరిత ధోరణితో విసిగిపోయి బియెట్రిస్ 1974 లో భర్తనూ, ఇద్దరు పెంచుకున్న పిల్లల్నీ వదిలి, యేల్ యూనివర్సిటీకి వెళ్ళిపోయారు. కాలక్రమేణా దంపతులు విడాకులు తీసుకున్నారు. యేల్ యూనివర్సిటీ ఖగోళ శాస్త్ర విభాగంలో ఆమెకి దాదాపుగా బ్రహ్మ రథం పట్టారు. 1978 కల్లా ఆమె యేల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ పదవిలో నియమితులయ్యారు. ఆ పదవిలో నియమితురాలైన మొదటి మహిళ ఆమే నంటారు.

          ఆ తరవాత మూడేళ్ళకే, నలభై యేళ్ళ వయసులో, 1981 మార్చి 23న బియెట్రిస్  కేన్సర్‌తో కన్నుమూసారు.

          పద్నాలుగేళ్ళు మాత్రమే సాగిన వృత్తిలో దాదాపు వందకి పైగా పేపర్లు వ్రాసారు బియెట్రిస్. ఆమె పరిశోధనల వల్ల గేలక్సీలవీ, నక్షత్ర మండలాలవీ పరిణామ క్రమాలను లెక్కెకట్టటం వీలైంది.

          1986లో అమెరికన్ ఆస్ట్రనామికల్ సొసైటీ ఖగోళ శాస్త్రంలో అత్యుత్తమ పరిశోధనకై బియెట్రిస్టిన్స్‌లే అవార్డును ప్రకటించారు. ఆమెని బ్రతికుండగా నిర్లక్ష్యం చేసిన యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఇప్పుడు ఆమె పేరిట ఒక ప్రొఫెసర్ పదవిని ప్రకటించారు. న్యూజీలాండ్ ప్రభుత్వం కెల్పర్ పర్వత శ్రేణుల్లోని ఒక పర్వతానికి మౌంట్ టిన్స్‌లే అని పేరు పెట్టారు.

          అప్పటి వరకూ వున్న ఖగోళ శాస్త్రం విశ్వం వ్యాపించడం ఆగిపోయి కుంచించడం ప్రారంభమైందని ప్రతిపాదించేవి. కానీ, మొదటిసారి బియెట్రిస్ విశ్వం కుంచించడం అసలు ప్రారంభమే కాలేదనీ, విశ్వం ఇంకా వ్యాపిస్తూనే వుందనీ, అసలు సమీప భవిష్య త్తులో కుంచించక పోవచ్చనీ ప్రతిపాదించింది. ఆ తరవాత జరిగిన పరిశోధనల్లో బియెట్రిస్ ప్రతిపాదనలే సరైనవని నిరూపించబడ్డాయి.

          విశ్వం ఇంకా చాలా చాలా కాలానికి వ్యాపిస్తూనే వుంటుందని, అసలీ విశ్వానికి సరిహద్దులు వుండకపోనేవచ్చనీ నమ్మిన బియెట్రిస్ తన మరణానికి ముందు వ్రాసుకున్న కవితకి నా తెలుగు అనువాదం…

***

నేనొక సంగీతకారుణ్ణి కావాలి-
సంగీత సృష్టిలో నిమగ్నమై
నా కలం ఆగిపోయేదాకా
నా గళం మూగపోయేదాకా
పాడుతూ, పాటలల్లుతూ
అన్ని సంగతులూ, స్వరాలూ, రాగాలూ
నాలో పెనవేసుకొని పోతూ
హద్దుల్లేని విశ్వాంతరాళంలా
ఆగని స్వరధార
చివరిదాకా
అనంతమైన నిశ్శబ్దం నన్ను పూర్తిగా ఆవరించే వరకూ…..

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.