పౌరాణిక గాథలు -11

-భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి

ఆదర్శము – భామతి కథ

          భర్తకోసం తనకు తానుగా ఎంతో గొప్ప త్యాగం చేసింది. మౌనంగా అంకితభావంతో సేవ చేసి భర్త సాధించాలనుకున్నదాన్ని సాధించడానికి తన వంతు సహకారం అందించింది.

          చాలా ప్రాచీన కాలంలోనే కాదు ప్రస్తుతపు రోజుల్లో కూడా అటువంటి మహిళలు ఉన్నారు అని చాటి చెప్పిన మహిళ కథ.

***

          అడవంతా ప్రశాంతంగా ఉంది. అతడి విషయంలో అది ఒక గొప్ప రోజు ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుంచుకోతగ్గ రోజు. అతడు తృప్తితో చిరునవ్వు నవ్వుకున్నాడు.

          చాలా సంవత్సరాలు కష్టపడి దీక్ష, చదువు, కష్టం అన్నిటినీ కలిపి పూర్తి చేసిన ఒక గొప్ప పని. బ్రహ్మసూత్రాల మీద ఆదిశంకరాచార్యుడు రాసిన వ్యాఖ్యానానికి వివరణ రాయడం అతడు సాధించిన అతి పెద్ద విజయం. 

          వివరణ రాస్తానని తన ఆధ్యాత్మిక గురువు శ్రీ ఆదిశంకరాచార్యుల వారికి ఒకనాడు వాగ్దానం చేశాడు. దాన్నిపూర్తి చేసి తను ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకున్నాడు. అందుకే ఆ రోజు అతడి జీవితంలో గుర్తు పెట్టుకో తగిన రోజు. అతడి పేరు ‘వాచస్పతి మిశ్రా’.

          వాచస్పతి మిశ్రా గొప్ప పండితుడు, సంస్కృతంలో అనేక గ్రంథాలు రాసిన రచయిత. వివాద చింతామణి, ఆచార చింతామణి మొదలయినవి ఆయన రచించిన వాటిలో కొన్ని.

          బ్రహ్మసూత్రాల మీద ఆదిశంకరాచార్యుడు రాసిన వ్యాఖ్యానానికి వివరణ రాయమని ఆయన తనని అడిగినప్పుడు ఆ పని చెయ్యడానికి ఆనందంగా అంగీకరించాడు.

          ఎదో వివరణ రాయడం కాదు…వ్యాఖ్యానాన్ని చదివి, అనుభవించి అప్పుడు రాయాలి. యోగులు వ్యాఖ్యానాలు రాసినప్పుడు నిజానిజాలు పూర్తిగా తెలుసుకోకుండా రాయరు. ఆ నిజంలోనే వాచస్పతి తన ఏకాగ్రత పెట్టాడు.

          రాయడంలో వాచస్పతి అంకితభావం చాలా గొప్పది. మొదలుపెడితే రాస్తునే ఉంటాడు. తన చుట్టూ ఒక ప్రపంచం ఉందన్న సంగతి మర్చిపోతాడు.

          వివరణ రాసేటప్పుడు అతడు తినడం, నిద్ర పోవడం, విశ్రాంతి తీసుకోవడం, ఇల్లు పరిసరాలు అన్నీ మర్చిపోయాడు. అది రాత్రో పగలో కూడ తెలియని స్థితిలో గడిపాడు.

          తన శరీరాన్ని, ఆశ్రమాన్ని, అవసరాల్నే కాదు పూర్తిగా తన జీవితాన్నే మర్చిపోయా డు. తనతోనే నివసిస్తున్న మరొక  ముఖ్యమైన వ్యక్తిని కూడా అతడు మర్చిపోయాడు. ఆ వ్యక్తి ఎవరో కాదు అతడి సహధర్మచారిణి.

          ఆ రోజు అతడు ఒక గొప్ప పని పూర్తిచేశానన్న సంతోషం వల్ల కలిగిన తన్మయత్వం లో ఉన్నాడు. చాలా సంవత్సరాల తరువాత పుస్తకాల్లోంచి బయటి ప్రపంచంలోకి వచ్చాడు.

          నాలుగు గోడల మధ్య కూర్చుని ఒకే పనిలో కొన్ని సంవత్సరాలు గడిపిన వాచస్పతి మిశ్రా బయట ప్రపంచాన్ని చూడాలని అనుకున్నాడు.

          కొన్ని సంవత్సరాల నుంచి సూర్యుడు ఎప్పుడు ఉదయించాడో, ఎప్పుడు అస్తమిం చాడో చూడలేదు. తలుపు దగ్గర కనబడుతున్న ఒక నీడ చూసి అతడు ఆశ్చర్యపోయాడు.

          “అక్కడెవరు?”  అడిగాడు నెమ్మదిగా. బహుశా మాట్లాడి కూడా చాలా సంవత్సరాలే అయి ఉంటుంది.

          అది నీడ కాదని, అక్కడ గౌరవనీయురాలైన ఒక స్త్రీ తల వంచుకుని నిలబడి ఉందని గుర్తించాడు.  “నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా?” మళ్ళీ అడిగాడు వాచస్పతి.

          ఆమె అక్కడి నుంచి కదల లేదు. అతడి ప్రశ్నకి జవాబు కూడా ఇవ్వలేదు. కానీ, ఆమె తన తలని ఇంకా కిందకి వంచుకుని నిలబడింది.

          వాచస్పతికి అప్పుడప్పుడే కొంచెంగా విషయాలు అర్ధమవుతున్నాయి. చాలా సంవత్సరాల క్రితం నాటి  జ్ఞాపకాలు ఆయనకి గుర్తుకొస్తున్నాయి.

          ఇప్పుడు అతడికి అర్ధమవుతోంది!  ప్రతిరోజు తనకు భోజనం ఎవరు పెట్టారో.. బట్టలు ఎవరు ఉతికారో.. తను రాసేటప్పుడు తనకు పవిత్రమయిన తాళపత్రాలు ఎవరు అందించారో…” అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు.

          ఒక్క క్షణం అతడి మనస్సు మామూలు స్థితికి వచ్చింది. తన చుట్టూ ఏం జరిగిందో అర్థమవుతోంది. ఆమెని పెళ్ళి చేసుకున్నట్టు అతడు పూర్తిగా మర్చిపోయాడు. నిజాన్ని అన్వేషిస్తూ, ధ్యానంలో మునిగిపోయి, వాచస్పతి ప్రపంచాన్నే మర్చిపోయాడు.

          ఇది నిజంగానే జరిగింది. సంవత్సరాలుగా అతడి భార్య మౌనంగా భర్తకి సేవ చేస్తోంది. అతడికి అన్ని ఏర్పాట్లు చూడడానికి చాలా కష్ట పడింది.

          ఒక్క క్షణం కూడా ప్రపంచం గురించి ఆలోచించకుండా భగంతుణ్ని తెలుసు కోడంలో లీనమయిపోయి యోగిగా మారిన భర్తని గౌరవంగా చూసుకుంది.

          అతడు ఆమె సేవని గుర్తించినా గుర్తించక పోయినా సంవత్సరాల తరబడి అతడికి సేవ చేసింది. భారతదేశం సేవకి, త్యాగానికి, ఆధ్యాత్మికతకి పేరు పొందింది. భార్యాభర్తలు ఇద్దరు పరస్పరం గౌరవం కలిగి ఉంటారు అనడానికి వీళ్ళే నిదర్శనం.

          ఆమె చేసిన సేవకి కృతజ్ఞతతో సిగ్గుపడడం ఇప్పుడు వాచస్పతి వంతయింది.

          అతడు తల వంచుకుని ఆమెని “దయచేసి నీ పేరు చెప్పు!” అని అడిగాడు.

          పూర్వపు రోజుల్లో భారత దేశపు స్త్రీలు తమ పేరు భర్తకి చెప్పుకునేవాళ్ళు కాదు. కాని, అతడు మళ్ళీ మళ్ళీ అడిగాడు. ఆమె తల వంచుకునే చెప్పింది ‘భామతి’ అని.

          వాచస్పతి మిశ్రా ఒక కొత్త తాళపత్రాన్ని చేతిలోకి తీసుకున్నాడు. దానిమీద ‘భామతి’  అని రాశాడు. దాన్ని అప్పుడే పూర్తి చేసిన గ్రంథం పైన పెట్టాడు.

          తను అడగకుండాను, తనకి సమకూర్చమని వేటినీ అడిగే అవసరం లేకుండానూ చేసిన సేవని అతడు గుర్తించాడు. అందుకే పవిత్రురాలైన ఆ స్త్రీని గౌరవిస్తూ తను రాసిన వివరణకి ఆమె పేరు పెట్టి తన కృతజ్ఞతని చాటుకున్నాడు.

          త్యాగము, తిరిగి ఉద్ధరించడము వల్లే జ్ఞానం పెరుగుతుందని వేదాంతం తెలియ చేస్తోంది. ఆనందించడం ద్వారా ఆధ్యాత్మికతకి సంబంధించిన జ్ఞానం కలుగుతుందని అనుకోవడం అజ్ఞానం అనిపించుకుంటుంది.

          నిజాన్ని తెలుసుకుని అనుభవించి రాసిన పుస్తకాలు చదవడం ద్వారానే జ్ఞానాన్ని పొందగలం. అందుకే గ్రంథ పఠనం అలవాటుగా మారాలి.

          ప్రపంచపరంగా ఆలోచిస్తే తనకి ఒక భార్య ఉందని… ఆమెకు తనే సర్వస్వమనీ… ఆమె అవసరాలు తనే తీర్చాలనీ… అన్నిటినీ మర్చిపోయి తన పనిలోనే నిమగ్నమై పోయాడు వాచస్పతి. అందువల్ల భామతికి అన్యాయమే జరిగింది.

          కాని, ఎన్నో సంవత్సరాలు కష్టపడి తను రాసిన గ్రంథానికి ఆమె పేరు పెట్టాడు. ఆ విధంగా వాచస్పతి చివరికి కొంత  న్యాయం చేసి తన ఋణం తీర్చుకున్నాడు.

          వాచస్పతి ఎన్నో సంవత్సరాలు తపస్సులో లీనమయి, గ్రంథాలు చదివి, నిజాన్ని అన్వేషించి శ్రీ ఆదిశంకరాచార్యులు రాసిన బ్రహ్మసూత్రాల వ్యాఖ్యానానికి వివరణ రాశాడు.

          వేందాంత గ్రంథాన్ని ‘వాచస్పతి మిశ్రా’  రాశాడు… ‘భామతి’ అందులో నిక్షిప్తమై ఉన్న ఆ వేదంతాన్ని అందరికీ నేర్పిస్తోంది. ఆ విధంగా ఇద్దరూ చరిత్రలో మిగిలి పోయారు.

          భర్తను అతడి ఆశయాలను గౌరవించడం కోసం తను పడిన కష్టాల్ని లెక్క చెయ్యలేదు భామతి. అతడి నుంచి తనకు ఎటు వంటి సహాయమూ అందక పోయినా శ్రమ అనుకోకుండా ఆ పరిస్థితిని అర్థం చేసుకుంది. భర్త యందు ఉన్న గౌరవంతో ఆ కష్టాన్నే ఆనందంగా భావించి మార్చుకుంది.

          తన భర్త  చేస్తున్న పవిత్ర కార్యాన్ని అర్థం  చేసుకుంది. అందువల్ల  కష్టానికి తగిన ప్రతిఫలం వచ్చేలా తను కూడా  తన వంతు సహాయాన్ని భర్తకి అందించింది.

ఆదర్శవంతమైన జీవితం సమాజంలో గుర్తింపు తెస్తుంది!

*****

Please follow and like us:

Leave a Reply

Your email address will not be published.